close
ఆ పాట నా జీవితాన్ని మార్చేసింది!

ఆ పాట నా జీవితాన్ని మార్చేసింది!

‘బంతిపూల జానకీ... నీకంత సిగ్గు దేనికీ...’, ‘సుర్రు సూపరో సూపరో...’, ‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ...’ ఈ హిట్‌ పాటలన్నింటిలోనూ వినిపించే అమ్మాయి గొంతు ఒకరిదే. ఆ అమ్మడు పేరు రనీనారెడ్డి. తెలుగులోనే కాదు తమిళం ఎన్నో హిట్‌ పాటలు పాడిందీమె. తన పాటల ప్రస్థానం గురించి రనీనా మాటల్లోనే తెలుసుకుందాం!

‘అమ్మడూ లెట్స్‌ డూ కుమ్ముడూ...’ పాటకు వచ్చిన స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో దేవీశ్రీప్రసాద్‌ గారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను చిరంజీవి అభిమానిని. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో పాడే ఛాన్స్‌ వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఈ పాటని దేవీతో కలిసి పాడాను, దీన్లో చిరంజీవిగారి వాయిస్‌ కూడా ఉంది... ఇలా చెబుతూ పోతే ఇది చాలా విధాలుగా ప్రత్యేకమైన పాట. నేను సాధారణంగా సోషల్‌ మీడియాలో చాలా తక్కువగా ఉంటాను. అలాంటిది ఈ పాటను మొదట ఆన్‌లైన్లో రిలీజ్‌ చేయడంతో స్పందన తెలుసుకుంటూ, ప్రశంసల్ని ఆస్వాదిస్తూ ఓ పది రోజులపాటు ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలోనే ఉన్నాను. ఈ పాటకే కాదు, గాయనిగానూ దేవీకి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన నాకు చాలా అవకాశాలిచ్చారు. 2008లో దేవీ చేసిన ‘కరెంట్‌’ సినిమాలో ‘రెక్కలు తొడిగిన పక్షల్లే...’ పాట పాడాను. తెలుగులో నా మొదటి పాట మాత్రం ‘యూఅండ్‌ఐ’ సినిమాకి పాడాను. నా ఫ్రెండ్‌ కార్తీక్‌ ఆ సినిమాకి సంగీత దర్శకుడు. దేవీ తమ్ముడు సాగర్‌, నేనూ అందులో ‘డి ఫర్‌ డ్యాన్స్‌...’ అనే డ్యూయెట్‌ పాడాం. తొమ్మిదేళ్లుగా నా కాలర్‌ ట్యూన్‌ అదే. దేవీ సంగీతంలో ‘ఎవడు’లో ‘పింపుల్‌ డింపుల్‌’, ‘జులాయి’లో ‘మీ ఇంటికి ముందో గేటు’, ‘సారొచ్చారు’లో ‘జగ జగ జగదేకవీర...’, ‘కుమారి21ఎఫ్‌’లో ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌ బ్యాంకాక్‌...’ ఇలా చాలా పాటలు పాడాను. అంతేకాదు శ్రీమంతుడు, ఇద్దరమ్మాయిలతో, దడ తదితర సినిమాల్లోని పాటల్లో చిన్న చిన్న పదాలతో నా గొంతు వినిపించాను. తెలుగులో సాయి(తమన్‌) కూడా నాకు పేరుతెచ్చిన పాటలే ఇచ్చారు. ‘బాద్‌షా’లో ‘బంతిపూల జానకి’, ‘బలుపు’లో ‘పాతికేళ్ల సుందరి...’లాంటి పాటలు ఆయనిచ్చినవే. అనూప్‌ రూబెన్స్‌కి ‘లౌక్యం’లో ‘సుర్రు సూపరో...’ పాడాను. ఇవన్నీ నాకెంతో పేరుతెచ్చిన పాటలు. తెలుగులో నాకంటూ గుర్తింపు తెచ్చింది మాత్రం ఆరెంజ్‌లోని ‘సిడ్నీ నగరం...’ పాట. ఆ పాటకి సంబంధించిన సందర్భం అడిగినపుడు సిడ్నీలో ఒక స్థానిక అమ్మాయిలా పాడాలనీ, బ్యాక్‌గ్రౌండ్‌లో నా మాటలు వినిపిస్తాయనీ చెప్పారు. నాకు ఇంగ్లిష్‌లో పాటలు రాసే అలవాటుంది. దాంతో ఇంగ్లిష్‌, జిబ్బరిష్‌లలో కొన్ని పదాలను నేనే రాసి పాడాను. ఆ పాట ప్రారంభంలో, మధ్యలో వచ్చేవి నా పదాలే. ఆ గొంతు నాదే. ఇంకా మాన్‌, సంతోష్‌ నారాయణ్‌, రెహమాన్‌ (కడలి) లాంటి సంగీత దర్శకులకూ తెలుగులో పాడాను.

చెన్నైకే ఓటేశా!
సినిమాల్లో పాడాలన్న లక్ష్యంతో ఇంటర్మీడియెట్‌తోనే చదువుకి ఫుల్‌స్టాప్‌ పెట్టేశా. మా కుటుంబం బెంగళూరులో ఉంటుంది. ఇప్పుడంటే హైదరాబాద్‌ నుంచీ మంచి సంగీత దర్శకులు వస్తున్నారు, ఇక్కడివారికీ అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ పదేళ్ల కిందట సినిమాల్లో అవకాశం దొరకాలంటే చెన్నై, ముంబయిలలో ఏదో ఒక నగరానికి వెళ్లాలి. నాకైతే బాలీవుడ్‌కి వెళ్లాలని ఉండేది. కానీ ముంబయి మహానగరంలో ఎవరు ఎలా ఉంటారో తెలీదు. చెన్నైలో ప్రజల జీవనశైలి బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అన్నీ ఆలోచించి చివరకు చెన్నైకే ఓటేశాను. 2005లో అమ్మని తోడుగా తీసుకొని అక్కడ అడుగుపెట్టాను. చెన్నై వెళ్లాక సంగీత దర్శకుడు ధరణి, గాయకుడు ప్రవీణ్‌ మణి పరిచయం అయ్యారు. తర్వాత కొన్నాళ్లకు గాయని సువీ సురేష్‌, ఇంకొందరు గాయనీగాయకులు పరిచయమయ్యారు. ధరణి చేసిన సినిమాలో మొదట కోరస్‌ పాడే అవకాశం ఇచ్చారు. మరోవైపు అక్కడే అగస్టన్‌ గారి దగ్గర పాశ్చాత్య సంగీతంలో పాఠాలు నేర్చుకున్నాను. కొత్తవారికి అంత సులభంగా అవకాశాలు దొరకవని నాకు తొందరగానే అర్థమైంది. మన గొంతు హీరోయిన్‌కు కుదరాలి, దర్శకుడికి నచ్చాలి, ఇంకా చాలా ఉంటాయి. నా సినిమాల ప్రస్థానం మొదలైంది 2008లో. ఆ ఏడాది వచ్చిన తమిళ సినిమా ‘సరోజా’లోని ‘కొడానా కోడి...’ నా కెరీర్లో మొదటి పాట. దాంతోనే నాకు బ్రేక్‌ వచ్చింది కూడా. ఆ పాటలో సువీ కూడా పాడింది. సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా కొత్త గొంతు కోసం వెతుకుతున్నారని తనే నాతో చెబితే ఆయన స్టూడియోకి వెళ్లాను. ‘డెమో ఏమైనా ఉందా’ అనడిగితే లేదన్నాను. ‘ఏదైనా పాడండి’ అన్నారు. ఓ పాత తమిళ పాట పాడాను. తర్వాత షకీరా పాట ‘వెనెవర్‌...’, ఆపైన ఇళయరాజాగారి పాటొకటి పాడాను. ‘థాంక్యూ ఇక వెళ్లొచ్చు’ అని చెప్పి పంపేశారు. యువన్‌ ముఖంలో ఎలాంటి భావాలూ లేకపోవడంతో ఇక అంతేనేమో అనుకున్నాను. మర్నాడు ఆయన మేనేజర్‌ ఫోన్‌చేసి వెంటనే రమ్మని పిలిచారు. ఆ సినిమా హిట్‌, పాట సూపర్‌ హిట్‌. ఆ పాటతో జీవితం మారిపోయిందనే చెప్పాలి. ఆపైన జీవీప్రకాష్‌, ఎస్‌.ఏ.రాజ్‌కుమార్‌, పీసీ శివన్‌, ప్రకాష్‌ నిక్కీ, రెహమాన్‌ లాంటి సంగీత దర్శకుల దగ్గర పనిచేశాను. ఏ పాట పాడేటపుడైనా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటాను. పాట సంగీత దర్శకుల ఆలోచనల్లోంచి పుట్టిన పాప లాంటిది. దాన్ని వారు కోరినట్టే పాడాలి. నేను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాడతాను. ఎప్పుడైనా అర్థంకాని పదాలుంటే అడిగి తెలుసుకుంటాను. అందాన్ని వర్ణించే పదాల్ని అందంగానే పాడాలి. మామూలుగా పాడేస్తే పాటలోని మాధుర్యం పోతుంది. ప్రతి సంగీత దర్శకుడికీ తనదైన శైలి ఉంటుంది. వారికి తగ్గట్టు మారిపోయి పాడాలి.

పాట ఎలా మొదలైందంటే...
అమ్మ గిరిజా రెడ్డి. నాన్న సి.ఎమ్‌.స్వామి. అమ్మానాన్నలకు నేను ఏకైక సంతానం. అమ్మవాళ్లది చిత్తూరు జిల్లా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దులో ఉంటుందా వూరు. అందుకే నాకు తెలుగు, కన్నడం, తమిళం వచ్చాయి. నాన్నది బెంగళూరు. నేను పుట్టి పెరిగింది బెంగళూరులోనే. అమ్మానాన్నలిద్దరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. అమ్మ కీర్తనలూ, భజన పాటలూ బాగా పాడుతుంది. నాన్న నాటక రంగంలో ఉండేవారు. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటకే అంకితమైపోయారు. బెంగళూరులో మా కుటుంబానికి ఒక గుడి ఉంది. అది చూసుకుంటున్నారు. అమ్మతోపాటు భజన పాటలు పాడటంతో మూడేళ్ల వయసునుంచీ సంగీతం నా జీవితంలో భాగమైపోయింది. ఆరేళ్లపుడు ‘వీణ’ నేర్చుకోవడం మొదలుపెట్టినా కొన్ని నెలలకే మానేశాను. కొన్నాళ్లకు షామ్లాజీ భావే గారి దగ్గర హిందూస్థానీ సంగీతం నేర్చుకున్నాను. ఆమె పాతకాలం గురువుల మాదిరి. ఏరోజు చెప్పింది ఆరోజే నేర్చుకోవాలి. సకాలంలో చెప్పలేకపోయినా, పొరపాటుగా పాడినా రెండు గంటలు నిలబెట్టేవారు. లేదంటే వాద్యపరికరాల్ని శుభ్రం చేయమనేవారు. ఆరోజుల్లో భయభక్తులతో నేర్చుకోవడంవల్లనే ఈరోజు ఎలాంటి పాటనైనా సులభంగా పాడగలుగుతున్నానేమో! స్కూల్‌ రోజుల్లో ‘ఎంటీవీ’, ‘ఛానెల్‌ వి’ ఎక్కువగా చూసేదాన్ని. ఇంగ్లిష్‌ పాటలు వినేదాన్ని. ఏదో ఒకరోజు నేనూ అలా పాడాలని కలలు కనేదాన్ని. పన్నెండేళ్లపుడు ఆష్లీ అనే గురువుగారి దగ్గర పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. బెంగళూరులో ప్రదీప్‌కుమార్‌ అని మా కుటుంబానికి స్నేహితులొకరు ఫ్యాషన్‌ షోలు నిర్వహించే సంస్థ నడిపేవారు. నేను బాగా పాడతానని చెప్పి ఆ షోల మధ్యలో నా చేత పాటలు పాడించేవారు. రికార్డింగ్‌ చేసిన సౌండ్‌ ట్రాక్స్‌కి పాటలు పాడేదాన్ని. ఇంటర్మీడియెట్‌ చదివేటపుడూ, ఆ తర్వాతా ఈ షోలు ఇచ్చేదాన్ని. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనిపించింది.

బెస్ట్‌ఫ్రెండ్‌... సాగర్‌!
చెన్నై నాకు సినిమా అవకాశాలతోపాటు మంచి స్నేహితుల్నీ ఇచ్చింది. ఇక్కడి స్నేహితులందరూ గాయనీగాయకులే. నరేష్‌ అయ్యర్‌, పవిత్ర, హరిచరణ్‌, సాగర్‌... మేమంతా ఒక గ్యాంగ్‌. సినిమాలకు వెళ్తుంటాం, పెళ్లిళ్లూ, పుట్టిన రోజుల వేడుకలకు కలుస్తుంటాం. దీపావళికి అందరం కుటుంబాలతో కలిసి ఏదైనా రిసార్ట్‌కి వెళ్లి అక్కడ సందడి చేస్తాం. సంతోషాలకే కాదు కష్ట సమయాల్లోనూ అందరం ఒకరికి ఒకరై ఉంటాం. ‘బంతిపూల జానకీ...’ పాట రికార్డింగ్‌ రోజున అమ్మ ఐసీయూలో ఉంది. ఆ విషయం తమన్‌కి కూడా చెప్పలేదు. ఎందుకంటే నావల్ల పని ఆగకూడదనుకున్నాను. హాస్పిటల్‌లో ఉన్నా నన్ను లోపలికి పంపరు కదాని రికార్డింగ్‌కు వచ్చేశాను. ఆ సమయంలో అమ్మని ఫ్రెండ్స్‌ చూసుకున్నారు. 2015 వరదల సమయంలో అమ్మా నేనూ ఇంట్లో చిక్కుకుపోయాం. ఫోన్లు కూడా పనిచేయలేదు. అప్పుడు పవిత్ర, హరిచరణ్‌(భార్యాభర్తలు) మా దగ్గరికి వచ్చేశారు. మా బాగోగులు చూసుకున్నారు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటే సాగర్‌. అన్నీ తనతో షేర్‌ చేసుకుంటాను. నేను ఇంటి దగ్గరలేనపుడు అమ్మకి ఏదైనా ఇబ్బంది ఉంటే సాగర్‌కి చెబితే చాలు, తను చూసుకుంటాడు.

ఆల్బమ్‌ తీసుకొస్తా...
‘ఎంటీవీ’, ‘ఛానెల్‌ వి’ చూస్తూ పెరిగానని చెప్పానుగా. వాటి ప్రభావం నామీద బాగా ఉంటుంది. అందుకే లైవ్‌షోలలో హుషారుగా ఉంటాను. మనం స్టేజిమీద పాడుతుంటే వేలమంది చూస్తుంటారు. ఆ సమయంలో వారిని ఉత్సాహపరచాలనేది నా ఉద్దేశం. సినిమాలు కాకుండా ఆల్బమ్స్‌కి కూడా పాడాను. అలాంటివాటిలో ‘బేబీ గర్ల్‌’ అనే పాట నాకు మంచి పేరు తెచ్చింది. ‘సురేష్‌ డా వన్‌’ అనే కంపోజర్‌తో కలిసి ఆ పాట పాడాను. నాకు కంపోజింగ్‌ అంటే కూడా ఆసక్తి. వీడియో/ఆడియో ఆల్బమ్‌ చేయాలనేది నా కల. ఎనిమిది పాటలతో హిందీ ఆల్బమ్‌ చేస్తున్నాను. బడ్జెట్‌ సరిపోక దాన్ని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఆ ఆల్బమ్‌ బయటకు రావాలని దేవుణ్ని కోరుకోని రోజుండదు. ఏదో ఒక రోజున దేవుడు కరుణిస్తాడనే అనుకుంటున్నా!

నా పేరు సాయి...
నా అసలు పేరు సాయి. సినిమాల్లోకి వస్తున్నపుడు దేవుడి పేరు వద్దనుకుని సంఖ్యాశాస్త్ర నిపుణుల్ని సంప్రదిస్తే ‘రనీనా’ అని పెట్టమన్నారు. ఫిలిప్పైన్‌ భాషలో రనీనా అంటే రాణి అని అర్థం. దీనికి ‘మెలొడి’ అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు అన్ని రికార్డుల్లో ఇదే పేరుంది.

* సూఫీ సంగీతాన్ని ఎక్కువగా వింటాను. అజీజా ముస్తఫా జాడే... పాటలంటే నాకు చాలా ఇష్టం. తను పియానో ప్లే చేస్తూనే అద్భుతంగా పాడుతుంది. తన టెక్నిక్స్‌ని హారిస్‌ జైరాజ్‌ సినిమాలో ఒక పాటకు ఉపయోగించాను. అది విని ‘ఎవరిదా గొంతు, ఫ్రాన్స్‌ నుంచి గాయనిని పిలిపించారా’ అని హారిస్‌ని ప్రభుదేవా అడిగారట.

* తమిళంలో ‘మాలై మంగుం నేరం...(రౌద్రం-మాటే రాని మౌనం)’ నాకు అవార్డుతోపాటు మంచిపేరు తెచ్చిన పాట. విడాకుల వరకూ వెళ్లిన పరిస్థితుల్లో ఆ పాటవల్ల తమ గొడవ సద్దుమణిగిందంటూ ఒకాయన ఫేస్‌బుక్‌లో థాంక్స్‌ లెటర్‌ పెట్టాడు.

* చెన్నైలో నా శ్రేయాభిలాషుల బృందం ఉంది. నా పుట్టినరోజున వారందరినీ కలుస్తాను. ఆరోజు వారు కొన్ని సేవాకార్యక్రమాలు చేస్తారు కూడా.
* మంచి గురువు దొరికితే వీణ నేర్చుకోవడం మళ్లీ మొదలుపెట్టాలని ఉంది.

* డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. ఆమధ్య చిన్న ప్రమాదం జరిగింది. అప్పట్నుంచి వేగం తగ్గించాను. ఓసారి చెన్నై నుంచి బెంగళూరు మూడున్నర గంటల్లో వెళ్లిపోయాను. వెళ్లాక అమ్మ బాగా తిట్టిందిలెండి.
* హైదరాబాద్‌లో షాపింగ్‌ చేయడమన్నా, షికారు చేయడమన్నా చాలా ఇష్టం. ఏదైనా పనిమీద వచ్చినపుడు ఒకరోజు అదనంగా ఉండి షాపింగ్‌ చేస్తాను. ఇక్కడ గాయని అర్చనా మంచాల నాకు మంచి స్నేహితురాలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.