close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మహీ బీకామ్‌... విరాట్‌ డ్రాపవుట్‌!

మహీ బీకామ్‌... విరాట్‌ డ్రాపవుట్‌!

భారత క్రికెట్‌ జట్టుకి ఎంపిక కాకపోయుంటే అశ్విన్‌ ఈ పాటికి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. పది కూడా పాసవ్వని పాండ్యా ఏ చిరుద్యోగిగానో మిగిలిపోయేవాడేమో! ఆటతో భారతీయుల మనసులు గెలుచుకున్న మన క్రికెటర్లు, చదువులో ఎక్కడిదాకా వచ్చారో చూద్దామా.

ధోని బీకామ్‌

ఎం.ఎస్‌.ధోని సినిమా చూసిన వాళ్లెవరికైనా మహీ ఓ పక్క క్రికెట్‌, మరో పక్క పుస్తకాలతో కుస్తీ పడుతూ డిగ్రీ దాకా వచ్చాడనీ, అక్కడితో చదువు ఆపేశాడనీ అర్థమవుతుంది. సినిమాలో అతడి జీవితాన్ని కొంత వరకే చూపించారు కాబట్టి ధోనీ డిగ్రీ మధ్యలో ఆపేశాడనే అంతా అనుకుంటారు. కానీ క్రికెటర్‌గా ఓ స్థాయికి వచ్చాక, కనీసం డిగ్రీ అయినా పూర్తి చేస్తే బావుంటుందన్న ఉద్దేశంతో కెప్టెన్‌గా కొనసాగుతూనే, బీకామ్‌ పరీక్షల్ని రాసి పాసయ్యాడు ధోనీ.

విరాట్‌ ఇంటర్‌

మైదానంలో ఆటగాడిగా అన్ని విషయాల్లో ధోనీ నుంచి స్ఫూర్తి తీసుకున్నానని చెప్పే విరాట్‌ కోహ్లి, చదువులో మాత్రం ఆ పని చేయలేకపోయాడు. పదో తరగతి వరకూ దిల్లీలోని విశాల్‌ భారతీ స్కూల్లో చదివిన కోహ్లి, ఆ తరవాత క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తుందన్న కారణంతో జేవియర్స్‌ స్కూల్‌కి మారాడు. అక్కడ పూర్తిగా ఆట మీదే దృష్టిపెట్టడంతో అతి కష్టమ్మీద పన్నెండో తరగతి పూర్తి చేసి అక్కడితో ఆపేశాడు. కాబట్టి మన కెప్టెన్‌ చదువులో డ్రాపవుట్‌ కిందే లెక్క.

బీటెక్‌ బాబు

టీమిండియాలో టాప్‌ స్పిన్నర్‌గా కొనసాగుతున్న రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రికెటర్‌గా మారకముందు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ కాగ్నిజెంట్‌లో ఇంజినీర్‌గా పనిచేసిన విషయం చాలామందికి తెలీదు. చెన్నైలోని ప్రఖ్యాత పద్మ శేషాద్రి స్కూల్‌లో చదువుకున్న అశ్విన్‌, ఆ రాష్ట్రంలో ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఒకటైన ‘ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల’ నుంచి బీటెక్‌ పూర్తిచేశాడు. ఆపైన కొన్నాళ్లు కాగ్నిజెంట్‌లో పనిచేసిన అశ్విన్‌ క్రమంగా టీమిండియా తలుపుతట్టి, జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.

ఇంజినీరింగ్‌ మధ్యలో...

రోహిత్‌ శర్మ భారత జట్టుకి ఎంపికవ్వకపోయుంటే అతడి పేరు పక్కన ‘బీటెక్‌’ డిగ్రీ చేరుండేది. ముంబైలోని రిజ్వీ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో అతడికి భారత క్రికెట్‌ జట్టులోకి పిలుపందింది. ఆపైన చదువు కొనసాగించాలనుకున్నా, వరస సిరీస్‌లలో జట్టుకి ఆడే అవకాశం రావడంతో కాలేజీకి వెళ్లడం కుదర్లేదు.అటెండెన్స్‌ సరిపోక పరీక్షలు రాయడానికి కాలేజీవాళ్లు ఒప్పుకోలేదు. దాంతో తప్పనిసరై రోహిత్‌ బీటెక్‌ని మధ్యలో ఆపేశాడు.

ఫిలాసఫీలో పీజీ

టెస్టుల్లో భారత ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందున్న మురళీ విజయ్‌, విద్యార్హతల్లోనూ తోటి సభ్యులకంటే ముందే ఉన్నాడు. చిన్నప్పట్నుంచీ క్రికెట్‌తో పాటు చదువుకీ ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన విజయ్‌ ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశాడు. అక్కడితో సరిపెట్టకుండా క్రికెటర్‌గా రాణిస్తూనే చెన్నై ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పీజీ కూడా పూర్తి చేశాడు.

తొమ్మిది ఫెయిల్‌

పీఎల్‌లో రాణించి అనూహ్యంగా భారత జట్టులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్యా... ఆటలో పైపైకి వెళ్తున్నా చదువులో మాత్రం పాండ్యా అందరికంటే వెనకే ఉన్నాడు. చిన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఆటలో శిక్షణ కొనసాగించడమే కష్టంగా మారిన దశలో పాండ్యా చదువుపైన దృష్టిపెట్టలేకపోయాడు. దాంతో తొమ్మిదో తరగతిలో ఫెయిలవ్వడంతో ఆపైన చదవడం తన వల్ల కాదనిపించి అక్కడితో ఆపేసి స్కూల్‌ డ్రాపవుట్‌లా మిగిలిపోయాడు.


 

సేంద్రియమే అతడి సాగుబాట

వాలుమూరుగొంది... దండకారణ్యంలో, భద్రాచలానికి 100 కి.మీ. దూరంలో, తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండల పరిధిలో ఉందీ గ్రామం. ఇక్కడుండే సోడె రామిశెట్టి సేంద్రియ పద్ధతుల్లో కాయగూరలు పండిస్తూ వాటిని అక్కడే అమ్ముతూ గిరిజనుల ఆరోగాన్ని పెంచుతున్నాడు.

దో తరగతి వరకూ చదువుకున్న 35ఏళ్ల రామిశెట్టి పైచదువులకు వెళ్లలేక గ్రామంలోనే వ్యవసాయం చేసేవాడు. వరి సాగులో ఆధునిక పద్ధతుల్ని తెలుసుకుంటూ మంచి దిగుబడిని సాధించేవాడు. సాగుపైన ఇష్టంతో 2011 ప్రాంతంలో ‘ఇందిరా క్రాంతి పథం’లో భాగంగా పురుగు మందులూ, ఎరువులూ వాడకుండా వ్యవసాయం చేసే పద్ధతుల్ని రైతులకు నేర్పేందుకు శిక్షణ తీసుకున్నాడు. అప్పుడే ప్రకృతి సేద్య ఉద్యమకారుడు సుభాష్‌ పాలేకర్‌ విధానాల్నీ తెలుసుకున్నాడు. ఆపైన సేంద్రియ సాగుపై మండలంలోని రైతులకు అవగాహన కల్పించే కార్యకర్తగా నెలకు మూడు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసేవాడు. ఆ సమయంలో సేంద్రియ సాగు గురించి ఎంత చెప్పినా రైతుల నుంచి స్పందన అంతగా వచ్చేది కాదు. ‘మాటల్లో చెబితే కాదు, చేతలద్వారా సేంద్రియ వ్యవసాయం చేసి నలుగురికీ చూపుతా’ననుకున్నాడు రామిశెట్టి. ఆ క్షణమే ఉద్యోగం వదులుకుని తనకున్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిలో కొద్ది భాగంలో సేంద్రియ విధానంలో సాగు మొదలుపెట్టాడు.

సేంద్రియ విధానం అంటే...
సేంద్రియ విధానంలో కాపు పూర్తయిన తర్వాత పొలంలో మిగిలే ఆహార పంటల్నీ కూరగాయల మొక్కల్నీ కోసి ఆ వ్యర్థాల్ని వర్మీ కంపోస్టు తొట్టెల్లో మురగపెట్టడం ద్వారా ఎరువును తయారు చేస్తాడు రామిశెట్టి. దీన్లో భాగంగా పంట వ్యర్థాలను తొట్లలో వేసి వాటిపై పేడ నీళ్ళు చల్లి మూడు వరసలు మట్టితో కప్పితే 60-90 రోజుల్లో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీనికి తోడు చీడపీడల్ని పారద్రోలడానికి జీవామృతమూ తయారుచేసుకుంటాడు. 200 లీటర్ల నీటిలో 10 లీటర్ల పశు మూత్రం, 10 కేజీల పేడ, రెండు కేజీల బెల్లం కలిపి వారం రోజులు పులియ బెట్టి 10 రోజుల తరువాత ఆ ద్రవాన్ని మొక్కలపైన పిచికారీ చేసుకోవచ్చు. రామిశెట్టి ప్రస్తుతం మూడెకరాల్లో వంగ, బీర, సొర, దోసకాయలతో పాటు ఆకుకూరలు, మొక్కజొన్న పండిస్తున్నాడు. కాయగూరలూ, ఆకుకూరలు అమ్మడంద్వారా నెలకు రూ.30వేలు ఆదాయం వస్తోంది రామిశెట్టికి. అయితే ఇదేమంత సులభంగా జరగలేదు. విద్యుత్తు కోతలవల్ల పంటలకు సకాలంలో నీరందక ఇబ్బందయ్యేది. ఆ సమస్యకు పరిష్కారంగా 40 అడుగుల పొడవూ, 26 అడుగుల వెడల్పూ, నాలుగు అడుగుల లోతు ఉండే నీటి కుంట కట్టించాడు. విద్యుత్తు ఉన్నపుడే అందులోకి నీటిని తోడించి నిల్వచేసుకొని తోటకు అవసరమైనప్పుడల్లా ఆ నీటిని వాడుకునేలా గొట్టాలు వేశాడు. బిందు సేద్యంతో నీటిని పొదుపుగా వాడుతుండటంతో ఏడాది పొడుగునా నీటికి ఇబ్బంది లేకుండా సాగు చేస్తున్నాడు. అంతేకాదు రామిశెట్టి కుటుంబం పొలంలో పనిచేసే సమయమూ తగ్గింది. రామిశెట్టి స్ఫూర్తితో అతడి గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు సేంద్రియ సాగు చేస్తున్నారు. వారికి సకాలంలో నీరు అందకపోతే తన కుంట నుంచి నీరు అందిస్తాడు. ఎరువులూ, పురుగు మందులు వాడకుండా పండించిన కూరగాయలకు గిరాకీ బాగా ఉండటంతో వీరంతా మంచి లాభాలు పొందుతున్నారు. చింతూరు మార్కెట్‌తోపాటు కుంట, మోతుగూడెంలలో జరిగే వారాంతపు సంతలలో కాయగూరలు అమ్ముతారు వీరు. ఇప్పటివరకూ కూరగాయల పెంపకానికే పరిమితమైన రామిశెట్టి ఇప్పుడు పండ్ల తోటలపైనా దృష్టి సారించాడు. జామ, సీతాఫలం, అరటి, నిమ్మ, కొబ్బరి మొక్కల్ని సేంద్రియ పద్ధతిలోనే పెంచుతున్నాడు.

పొరుగు రాష్ట్రంలో శిక్షణ...
‘మిలాప్‌’ వెబ్‌సైట్‌ ద్వారా రామిశెట్టికి విరాళాలు సేకరించి సాయపడ్డారు భద్రాచలం ఐటీడీఏ అధికారిణి ప్రతిమ. ‘కాయగూరలూ, ఆకుకూరలూ పండించి వాటిని స్థానిక గిరిజనులకు చౌక ధరలకే అందిస్తూ వారిలో పోషకాహారలోపాన్నీ, రక్తహీనతనూ దూరం చేస్తున్నాడ’ంటూ రామిశెట్టి గురించి ఆమె ఆ వెబ్‌సైట్లో వివరించారు. దాంతో రూ.30వేల వరకూ విరాళాలు అందాయి. ఆ మొత్తంతోనే నీరు తోడే మోటారు కొన్నాడు రామిశెట్టి. ‘గిరిజన ప్రాంతాల్లో పూర్వకాలం పండించిన పంటలూ, ఆ విధానాలూ ఇప్పుడు కనిపించడం లేదు. అప్పట్లో పంట వ్యర్థాలూ, ఆవుపేడల్ని ఎరువులుగా ఉపయోగించి వ్యవసాయం చేసే సంప్రదాయం ఉండేది. ఆ పద్ధతిలో పండించిన ఆహారం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాలమాదిరిగానే ఇక్కడా రసాయన ఎరువుల వాడకం పెరిగింది. ఇక్కడివారూ అనారోగ్యాలకు గురవుతున్నారు. అందుకే, సేంద్రియ విధానంలో సాగుపైన అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి’ అని చెబుతాడు రామిశెట్టి. ఐటీడీఏ అధికారుల నుంచి ఇతడి గురించి తెలుసుకున్న ఛత్తీస్‌గఢ్‌ అధికారులు ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలోని గిరిజన రైతులకు అతడిచేత సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇప్పించారు. ఆ జిల్లాలోని వింజరం, పందిగూడా, దోండ్ర, ముర్తుగూడా గ్రామాల్లో రెండు నెలలపాటు ఉండి రైతులకు శిక్షణ ఇచ్చాడతడు.
రామిశెట్టి విజయం మరెందరికో కావాలి స్ఫూర్తిదాయకం!

- సీహెచ్‌.విజయ్‌కుమార్‌, న్యూస్‌టుడే చింతూరు


అక్కడ ప్రభుత్వంతో పనిలేదు!

‘మా వూరికి రోడ్లు వేయలేదు, నీటి సౌకర్యం కల్పించలేదు, విద్యుత్‌ సరఫరా చేయలేదు’... ఇలా వేల పల్లెలు ప్రభుత్వాన్ని నిందిస్తూ, తమ దుస్థితికి బాధపడుతూ నిరాశతో రోజులు గడిపేస్తున్నాయి. కానీ మహారాష్ట్రలోని పేవిహిర్‌ అనే పల్లె మాత్రం వూళ్లొ అందర్నీ ఒక్కటి చేసి తన తలరాతను తానే మార్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ
ఇతర గ్రామాలకు స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తోంది.

ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. అలాగే ఎవరి పని వాళ్లు చేసుకోవడం కనీస బాధ్యత. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మేల్గాట్‌ ప్రాంతంలోని పేవిహిర్‌ అనే గిరిజన గ్రామస్థులు, ప్రభుత్వంతో హక్కుల కోసం పోరాడకుండా తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తున్నారు. దాని ఫలితం... ఒకప్పుడు గ్రామ పరిధిలో ఒక చెట్టు కూడా కనిపించని 182 హెక్టార్ల బంజర భూమి ఇప్పుడో చిట్టడవిలా మారింది. ఉపాధి లేక వలసలు పెరగడంతో వృద్ధాశ్రమాన్ని తలపించిన గ్రామంలో యువోత్సాహం ఉప్పొంగుతోంది. కట్టెల పొయ్యిల కాలుష్య కోరల నుంచి ఆడవాళ్లు బయట పడ్డారు. గ్రామస్థులు సొంతంగా బ్రాండ్‌ని ఏర్పాటు చేసుకొని పంటలను విక్రయిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా సౌరశక్తితో పనిచేసే బిందు సేద్య వ్యవస్థకు పునాది వేశారు. ఐక్య రాజ్య సమితి నుంచి ‘జీవవైవిధ్య’ అవార్డునీ అందుకున్నారు. ఇలా ఐదేళ్లలో పేవిహిర్‌ సాధించిన ఎన్నో విజయాలు, అందరూ చేయి కలిపితే సాధించలేనిదేదీ లేదని నిరూపిస్తాయి.

మొక్కలతో మొదలు
తరతరాలుగా చెట్లను నరికి అమ్మేయడం, వంట అవసరాలకు వాడుకోవడం, పశువుల్ని మేపడం లాంటి చర్యల వల్ల కొన్నాళ్లకు గ్రామ పరిధిలో ఒక్క చెట్టు కూడా మిగల్లేదు. దాంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి కరవు అలుముకుంది. ఆదాయ మార్గం లేక కుటుంబాలు వలస బాట పట్టాయి. పరిస్థితి అలానే కొనసాగితే కొన్నాళ్లకు వూళ్లొ ఎవరూ మిగలరన్న ఆవేదన గ్రామ యువకుల్లో మొదలైంది. ఒకప్పుడు గ్రామానికి రక్షణ కవచంలా నిలిచిన చెట్లు కనుమరుగవడంతోనే తమకీ పరిస్థితీ వచ్చిందనీ, ముందు అందరూ కలిసి పచ్చదనాన్ని పునరుద్ధరించే పని మొదలుపెట్టాలనీ నిర్ణయించుకున్నారు. ఖోజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ, గిరిజనుల అటవీ హక్కు చట్టం కింద వాళ్లకు 182 హెక్టార్ల స్థలం మంజూరు చేయించింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఆ స్థలంలో మొక్కలు నాటి బావిలో నుంచి నీళ్లు తెచ్చి పోసి వాటిని పెంచడం మొదలుపెట్టారు. చెట్లను నరక్కుండా, పశువులు చొరబడకుండా రక్షక బృందాలుగా ఏర్పడి కాపలా ఉంటూ వచ్చారు. చెట్ల పెంపకంలో పాలుపంచుకునే వాళ్లకి ఉపాధి హామీ పథకం కింద భత్యాలు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దాంతో గ్రామంలో వలసలు తగ్గి నాలుగేళ్లు తిరిగే సరికి మొక్కలూ ఏపుగా పెరిగాయి.

ఉత్పత్తులకో బ్రాండ్‌
పేవిహిర్‌ పరిసరాలు చిట్టడవిలా మారడంతో జింకలూ, దుప్పిలూ, అడవి పందులూ, హైనా లాంటి జీవులు నివాసాల్ని ఏర్పరచుకున్నాయి. గ్రామస్థులు తీసుకొచ్చిన మార్పు వార్త ఐక్యరాజ్య సమితి వరకూ వ్యాపించింది. అందుకే ఆ సంస్థ రెండేళ్ల క్రితం పేవిహిర్‌కి ‘జీవవైవిధ్య’ పురస్కారాన్ని అందించింది. అందులో భాగంగా వచ్చిన డబ్బుతో వూళ్లొ బడిని బాగు చేసుకొని పిల్లల్ని తిరిగి చదివించడం మొదలుపెట్టారు. సామూహిక శ్రమ ఫలితం రుచి చూసిన గ్రామస్థులు బృందాలుగానే వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఖోజ్‌’ ఎన్జీవో సాయంతో సేంద్రియ పద్ధతుల్లో సీతాఫలాల సాగు మొదలుపెట్టారు. గిరిజనులు సాధిస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర అటవీశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ పర్‌దేశీ, ఆ గ్రామ ఉత్పత్తులకి ఓ బ్రాండ్‌ని ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు. సచివాలయం ప్రాంగణంలో ఉత్పత్తుల్ని అమ్ముకునే ఏర్పాట్లూ చేశారు. అలా పేవిహిర్‌ వాసులు తొలిసారి ‘మేల్గాట్‌ న్యాచురల్స్‌’ పేరుతో పది టన్నుల సీతాఫలాల్ని ముంబై, నాగ్‌పూర్‌ లాంటి ప్రాంతాల్లో అమ్మారు. అన్నీ అమ్ముడైన ఉత్సాహంతో మరిన్ని పంటలు వేయాలని సౌరశక్తితో పనిచేసే బిందు సేద్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తమ బ్రాండ్‌ పేరుతో గోధుమలు, సజ్జలు, ఉసిరి, నిమ్మ, జామ, మామిడి లాంటి ఉత్పత్తులను తీసుకొస్తున్నారు.

గ్రామస్థుల ఆదాయం పెరగడంతో బడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు బయోగ్యాస్‌ ప్లాంట్‌నీ నిర్మించుకున్నారు. ఆ ఉత్పత్తి కేంద్రం నుంచే వూళ్లొని ప్రతి కుటుంబం గ్యాస్‌ని కొనుగోలు చేస్తూ కట్టెల పొయ్యిల వల్ల కలిగే అనర్థాలను దూరం చేసుకుంది. ఒకప్పుడు జీవితాల్ని కుదిపేసిన గుట్కా, మద్యం లాంటి వ్యసనాల నుంచి రెండేళ్ల క్రితం గ్రామం బయట పడింది. భూగర్భ జలాల్ని రీఛార్జ్‌ చేసుకోవడంతో పాటు భూసారాన్ని పెంచుకునే చర్యలనూ గ్రామస్థులు చేపట్టారు. ఏటా గ్రామ పరిసరాల్లో యాభై వేల మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలన్న నిబంధనను పెట్టుకొని నాలుగేళ్లుగా దాన్ని అమలు చేస్తున్నారు. గ్రామపరిధిలోనే యువకులంతా ఉపాధి పొందేలా ఏర్పాట్లు చేసి వలసల్ని నిరోధించారు. మొత్తంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా పేవిహిర్‌ దూసుకెళ్తొంది. ప్రకృతిని మనం కాపాడితే, ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుందనడానికి అచ్చమైన సాక్ష్యం ఈ అరుదైన విజయం.చింత... తింటే నిశ్చింత..!

చింతచెట్టు లేని వూరు... చింతపండు వాడని ఇల్లూ మనదేశంలో ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతగా మన జీవనంలో భాగంగా మారిన ఆ చింతకాయలో ఆరోగ్య సూత్రాలెన్నో దాగున్నాయి అంటున్నారు ఆధునిక పరిశోధకులు సైతం.అవేమిటో తెలుసుకుందామా...

రోడ్డుపక్కనా ఇంటి వెనకా ఎక్కడంటే అక్కడ పెరిగే చింతచెట్టుని చూస్తే చాలామందికి బాల్యం ఓసారి కళ్లముందుకొస్తుంది. కొమ్మలకు వేలాడే ఆ చింతకాయల్ని కర్రలతో కొట్టి కోసి ఉప్పూ కారాలు అద్దుకుని తినడం; చింతపండు, బెల్లం, ఉప్పు నూరి ముద్దలా చేసుకుని పుల్లకు పెట్టుకుని క్యాండీలా చప్పరించడం... వంటివెన్నో గుర్తుకొస్తాయి. ఈతరం పిల్లలకి ఆ కష్టం కూడా లేకుండా చింతపండు చాక్లెట్లు నేరుగా మార్కెట్లోనే దొరుకుతున్నాయి. ఇటీవల తియ్యని థాయ్‌లాండ్‌ చింతకాయలూ వస్తున్నాయి. అవి సహజంగానే తియ్యగా ఉంటాయి. అంతేకాదు, వాటితో రకరకాల క్యాండీలనూ మిఠాయిలనూ కూడా చేస్తుంటారక్కడ.

మనదగ్గరయితే రోటిపచ్చడి; సాంబారు, రసం; పులుసు కూర; పండుమిర్చి, అల్లం తదితర నిల్వ పచ్చళ్లు... ఇలా ఏది చేయాలన్నా చింతపండు ఉండాల్సిందే. ఒక్క చింతపండు అనేముంది, చింతచిగురు, చింతకాయలతో చేసే రుచులకీ లెక్కేలేదు. ఈ సీజన్‌లో దొరికే చింతకాయల్ని తొక్కులా రుబ్బి నిల్వచేసుకుని ఏడాది బారునా వాడుకుంటారు. జ్వరం నోటికి పత్యంలో భాగంగా చింతకాయ పచ్చడితో అన్నం పెట్టమంటారు ఆయుర్వేద వైద్యులు.

సైనస్‌ బాధితుల్నీ గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడేవాళ్లనూ చింతపండుకి దూరంగా ఉండమనీ పులుపుకి ప్రత్యామ్నాయంగా టొమాటో, నిమ్మ వాడమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ; సంప్రదాయ వంటల్లో చింతపండుని పూర్తిగా పక్కకు పెట్టేయడం కష్టమైన పనే. అంత అవసరం లేదు కూడా అంటున్నాయి తాజా పరిశోధనలు. ఎందుకంటే నిమ్మలోని సిట్రిక్‌ ఆమ్లం మాదిరిగానే చింతకాయ, చింతపండులోని టార్టారిక్‌ ఆమ్లం శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంటుగా పనిచేస్తుందట. ఇది శరీరంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది. చింతపండులోని లిమోనిన్‌, జెరానియోల్‌, శాఫ్రోల్‌, సినామిక్‌ ఆమ్లం, మిథైల్‌ శాలిసిలైట్‌... వంటి ఫైటో కెమికల్స్‌ ఔషధాల్లా పనిచేస్తాయి. ఇందులో కాపర్‌, పొటాషియం, కాల్షియం, ఐరన్‌, విటమిన్‌-ఎ, రిబోఫ్లేవిన్‌, విటమిన్‌-సి... వంటి పోషకాలకూ లోటు లేదు. కొన్ని మందుల్లోనూ చింతపండు నుంచి తీసిన పదార్థాలను వాడుతుంటారు.

* చింతపండు క్యాన్సర్‌కూ మంచిదేనట. ఇందులోని పీచు- తినే ఆహారంలోని టాక్సిన్లను బంధించి బయటకు పంపడంతోపాటు పేగులోని క్యాన్సర్‌ కారక రసాయనాలు మ్యూకస్‌ పొరను దెబ్బతినకుండా చేస్తుంది.
* గర్భిణులకి చింతకాయల్లోని పీచూ ఆమ్లాలూ ఉదయాన్నే వచ్చే వికారం, వాంతులు, అలసట, మలబద్ధకాన్నీ తగ్గిస్తాయి. చింతకాయలకి ఉప్పు, మిరియాలపొడి అద్దుకుని తింటే వికారం తగ్గుతుంది.

* చింతపండు కాలేయ పనితీరునీ జీర్ణక్రియనీ పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడానికీ దోహదపడుతుంది.
* చింతపండురసం, పటికబెల్లం కలిపి మరిగించి తాగితే గుండెల్లో మంట తగ్గుతుందట.

* అరటీస్పూను చింతగింజల పొడిని కాస్త వేయించి నీళ్లలో కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడతాయట. వేయించి పొడిచేసిన చింతగింజల్ని తేనెతో కలిపి రోజుకి మూడునాలుగుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుతుందట.
* ఓ టేబుల్‌స్పూను చింతపండు గుజ్జుని నీళ్లలో కలిపి తాగితే మొటిమలు తగ్గుతాయి.

* ఈ చెట్టుపూలను మరిగించిన కషాయంలో దానిమ్మరసం, దనియాలపొడి, శొంఠిపొడి, పెరుగు కలిపి తాగితే పైల్స్‌కు మందులా పనిచేస్తుందట.
* చింతపండులోని యాంటీఆక్సిడెంట్లు రక్తశుద్ధికీ తోడ్పడతాయి. ఇందులోని థైమీన్‌ నరాల పనితీరునీ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తుంది. చింతలోని పులుపు గుణం ఇన్సులిన్‌ శాతాన్ని పెంచి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది.