close
అందం.. ఆభరణం..

అందం.. ఆభరణం..

ఆభరణం... అలంకారప్రాయం మాత్రమే కాదు. తరాలు మారినా వన్నె తరగని తియ్యని జ్ఞాపకం కూడా. అందుకే అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అంతేనా... ఆ నగల డిజైన్లు సైతం కొద్దిపాటి మార్పుచేర్పులతో మళ్లీ మళ్లీ వస్తుంటాయి, మగువల మనసు దోచుకుంటాయి అనడానికి నిదర్శనమే ఈ అందాల ఆభరణాలు... మరి చూసేద్దామా..!


చాంద్‌బాలీ బుట్టలు

మొఘలుల కాలంనాటి ఆభరణాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినదే చాంద్‌బాలీ డిజైన్‌. అర్ధచంద్రాకృతిలోని ఈ డిజైన్‌తో వచ్చిన జుంకీలు ఆమధ్య బాలీవుడ్‌ రామ్‌లీలా సినిమాతో మళ్లీ వెలుగులోకి రావడమేకాదు, విదేశీ మహిళల్నీ ఆకట్టుకున్నాయి. అక్కడితో ఆగితే విశేషమేముంది... ఇప్పుడు ఆ చాంద్‌బాలీ డిజైన్‌కు మధ్యలోనూ కిందా భిన్న సైజుల్లో విభిన్న రకాల బుట్టలోలాకుల్ని జోడించి కొత్తగా రూపొందిస్తున్నారు. అచ్చంగా రత్నాలూ వజ్రాలూ పొదిగినవాటితోబాటు; కుందన్‌, పోల్కీ, మీనాకారీ, టెంపుల్‌ జ్యువెలరీ డిజైన్లలోనూ వీటిని తయారుచేస్తున్నారు. అంతేకాదు, సిల్కుదారాలు, పూసలు, బ్లాక్‌ మెటల్‌, ఆక్సిడైజ్‌డ్‌ సిల్వర్‌... వంటి ఇతరత్రా ఫంకీ నగల్లో కూడా ఈ డిజైన్‌ తెగ సందడి చేస్తోంది. దాంతో చాంద్‌బాలీ బుట్ట జుంకీలు నేటితరం అమ్మాయిలకు తెగ నచ్చేస్తున్నాయి.


పులిగోరు జోరు!

పులిగోరు... అబ్బాయిలు ధరించే గొలుసులకు వేలాడే పతకంగానే పరిచయం. అయితే ఇటీవల అమ్మాయిల నగల్లోనూ ఈ పులిగోరు డిజైన్‌ అందంగా మెరుస్తోంది. పూర్వం వీరులు వేటకు వెళ్లినప్పుడు తాము వేటాడిన జంతుచిహ్నాలను వెంట తెచ్చుకుని, తమ ధైర్యసాహసాలకు గుర్తుగా వాటిని నగల రూపంలో ధరించేవారు. వాటిని వారసత్వపు ఆస్తిగా తరవాతి తరాలకు అందించేవారు. ఈ పులిగోరు పతకాలు కూడా అలా వాడుకలోకి వచ్చినవే. ఆ మధ్యకాలంలో ఇవి దాదాపుగా కనుమరుగైనప్పటికీ ఆధునిక ఆభరణాల డిజైనర్లు వీటిమీద మళ్లీ మనసు పారేసుకున్నారు. దాంతో ఆడామగా తేడా లేకుండా అందరూ ఈ పులిగోరు పతకాల్ని ఇష్టంగా ధరిస్తున్నారు. కోరలు చాచినట్లుగా ఉండే పులిగోరు డిజైన్‌ను రత్నాలూ ముత్యాలతో కలిసిపోయేలానూ నెక్లెసులూ హారాల్లో చక్కగా ఇమిడిపోయేలానూ డిజైన్‌ చేస్తోన్న నగల రూపకర్తల సృజనను మెచ్చుకుని తీరాల్సిందే.


ముక్కుకో బులాకీ

‘ముక్కు బుల్లాకు మెరిసెను... మెరిసెను...’ అంటూ సినీకవులే కాదు, ఈతరం అమ్మాయిలూ దానిమీద మనసు పారేసుకుంటున్నారు. పెళ్లికూతురి అలంకరణలోనే కాదు, నృత్యరీతుల్లోనూ వేడుకల్లో ముస్తాబు చేసుకునే వేళల్లోనూ కూడా ఎంచక్కగా మిగిలిన నగలతోబాటు ముక్కుబులాకినీ పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు రాళ్లతో మెరిసే ముక్కుపుడకతోనే సరిపెట్టేవారు. తరవాత ముక్కుకి గుండ్రని రింగులాంటి ముక్కుపుడకలతోబాటు బులాకీని పెట్టుకోవడం కూడా ఫ్యాషన్‌గా మారింది. నిజానికి పూర్వకాలంనాటి స్త్రీలంతా దీన్ని పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతం గిరిజనులు మాత్రమే ఈ అడ్డబేసర లేదా బులాకీని ధరిస్తున్నారు. అలాంటిది ఉన్నట్లుండి ఇది మళ్లీ ఈతరం అమ్మాయిల సంప్రదాయ నగల జాబితాలోకి చేరింది.


బుట్ట నెక్లెస్‌లు!

బుట్టలు... చెవులకు వేలాడే జుంకీలుగానే ఇప్పటివరకూ అందరికీ తెలుసు. అదీగాక చెవిలోలాకుల్లో ఎన్ని రకాల డిజైన్లు ఉన్నా బుట్టకో ప్రత్యేకత ఉంది. బోర్లించిన గుండ్రని బుట్టకి బంగారు లేదా ముత్యాల పూసల్ని వేలాడుతున్నట్లుగా డిజైన్‌ చేసిన బుట్ట లోలాకులు ఎలాంటివారికైనా చూడచక్కని అందాన్నీ సంప్రదాయ శోభనీ తీసుకొస్తాయి. అందుకేనేమో ఆ బుట్టల డిజైన్లను ఇప్పుడు కేవలం చెవులకే సరిపెట్టకుండా నెక్లెసుల్లోనూ చొప్పిస్తున్నారు. అలా రూపుదిద్దుకున్నవే ఈ అందాల బుట్ట నెక్లెస్‌లు. కెంపులూ పచ్చలూ ముత్యాలూ పొదిగిన బుట్టల్ని విభిన్న నెక్లెస్‌ డిజైన్లతో మేళవించి రూపొందిస్తోన్న ఈ సరికొత్త నెక్లెస్‌లు సంప్రదాయ వస్త్రధారణలోని అమ్మాయిల అందాన్ని రెండింతలు చేస్తాయనడంలో సందేహమా?!


రాజ్‌పుత్‌ కడా... బాగుందే

సాధారణంగా గాజులయినా కడాలయినా గుండ్రంగా ఉంటాయి. కాకపోతే వాటిల్లో కొన్ని సన్నగానూ మరికొన్ని వెడల్పుగానూ ఉంటాయంతే. ఇక డిజైన్లయితే కోకొల్లలు. కానీ రాజ్‌పుత్‌ స్త్రీలు ధరించే కొన్ని రకాల గాజులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గాజు చూస్తే పెద్దదిగా అనిపిస్తుంది. కానీ వేసుకుందామని చూస్తే అది ఎంత చిన్నదో అర్థమవుతుంది. ఎందుకంటే గాజు తొడుక్కునే గుండ్రని బేస్‌ భాగం నుంచి మిగిలిన వాటికి భిన్నంగా దాని డిజైన్‌ పైకి నిట్టనిలువుగా ఉంటుంది. కుందన్‌కారి, మీనాకారి పనితనంతో బంగారమూ రత్నాలతో రూపొందించే ఈ రకం నగల్లో చాలానే రకాలున్నాయి. గాజుపైన ఉండే గుండ్రని చెక్కుడు చిన్నగా ఉంటే బంగాడి అనీ; వెడల్పుగానూ ఇతరత్రా ఆకారాల్లో ఉంటే గోఖ్రూ అనీ; గోఖ్రూ డిజైన్‌లోనే ముత్యాలు పొదిగితే గాజ్రా అనీ అంటారు. ఒకప్పుడు రాజస్థాన్‌కే పరిమితమైన ఆ డిజైన్లకు ఆధునిక సొబగులద్ది అంతటా వాడుకలోకి తీసుకొస్తున్నారు నేటి డిజైనర్లు. యాంటిక్‌ డిజైన్‌తో వినూత్నంగా కనిపిస్తోన్న ఈ కడాల అందాన్ని చూశాక తొడుక్కోకుండా ఉండగలమా?


ముత్యాల గుత్తహారం

ముత్యాల ఆభరణాలు అనగానే తెల్లని గుండ్రని ఆకారంలో ఉండే ముత్యాలే స్ఫురిస్తాయి. అక్కడక్కడా నొక్కులు నొక్కులుగా ఉండే ముత్యాలు కనిపించినా వాటి వాడకం నిన్నమొన్నటి వరకూ అంతంత మాత్రమే. ఒకవేళ వాడినా గుచ్చిన ముత్యాల సరాల రూపంలోనే ఎక్కువగా వాడేవారు. అయితే గుత్తపూసల(పూలగుత్తిలోని పువ్వుల్లా గుచ్చడం వల్ల కాబోలు... వీటిని గుత్తపూసలుగా పిలుస్తున్నారు.) ముత్యాల హారాలూ నెక్లెస్‌ల రూపంలో నొక్కుకుపోయినట్లుగా ఉండే ముత్యాల పరంపర మళ్లీ మొదలైంది. రత్నాలతో పొదిగిన బంగారు నెక్లెసులూ హారాలకు ఈ ముత్యాలను గుదిగుచ్చినట్లుగా చుట్టి చేస్తోన్న ఈ నగలు చూడ్డానికి ఎంతో అట్టహాసంగానూ కనిపిస్తున్నాయి. కేవలం ముత్యాలే కాదు, పచ్చలూ కెంపుల్నీ కూడా ఇలా నొక్కుకున్నట్లుగా చిన్నసైజులో రూపొందించి గుచ్చేస్తున్నారు. అందులోనూ యాంటిక్‌, టెంపుల్‌ డిజైన్లకీ ఈ గుత్తపూసల ముత్యాలను జోడించేస్తున్నారు. దాంతో పెళ్లి వేడుకల్లో ఈ రకమైన నెక్లెస్‌లూ హారాలతో ఈతరం అతివలు హల్‌చల్‌ చేసేస్తున్నారు.

 


వడ్డాణం సన్నబడింది  

 

‘నడుమెక్కడే నీకు నవలామణీ...’ అంటూ ఓ శృంగార పురుషుడు అంటే, ‘దానికో వడ్డాణం చేయిస్తే తెలుస్తుంది’ అంటూ బదులిచ్చిందట ఆ కొంటె కోణంగి. ‘ఓస్‌... అంతేకదా... మీకోసం మేమున్నాం...’ అంటూ ఆ మగమహారాజులకు తోడుగా నిలుస్తున్నారు ఈతరం నగల రూపకర్తలు. అందుకే వడ్డాణం సైజును బాగా తగ్గించేసి ఈ సరికొత్త ఫ్యాషన్‌ వడ్డాణాలకు తెరతీశారు. చూడ్డానికి సింపుల్‌గానూ తక్కువ ఖర్చుతోనూ తయారయ్యే ఈ గొలుసు వడ్డాణాలు భారీ వేడుకల్లోనే కాదు, చిన్నాచితక ఫంక్షన్లలో కూడా పెట్టుకుని హడావుడి చేయొచ్చు అంటూ తెగ ముచ్చటపడిపోతున్నారు అమ్మాయిలు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.