close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనుబంధం

అనుబంధం
- గోగినేని మణి

మ్మా...’’ పెద్దగా వినిపించిన ఆ కేకకి వంటగదిలో ఉన్న వసంత ఉలిక్కిపడి కంగారుగా ఇవతలకు వచ్చింది. కొడుకు చేతిమీద దెబ్బను గమనించి ‘‘ఎక్కడ పడ్డావ్‌... ఎలా తగిలిందీ?’’ ఆదుర్దాగా అడిగింది.

‘‘మన వీధి మొదట్లోనే... బైకుకి కుక్కపిల్ల అడ్డంవస్తే తప్పుకోబోయి పడ్డాలే. బండికేం కాలేదుగానీ... షాపు అక్కడేగా, ఒకసారి చూడమని మెకానిక్‌కి ఇచ్చి నడిచి వచ్చేశా’’ అన్నాడు.

‘‘గ్రౌండ్‌లో పడ్డావేమో అనుకున్నాను’’ అంటూ అతని చేతిమీద గాయాన్ని శుభ్రంగా కడిగి మందు రాస్తూనే, ‘‘పడితే దెబ్బలు తగలటమే కాదు, పోలీసుల కంటబడితే కేసు పెడతార్రా, బండి నడపొద్దూ అంటే వినవ్‌ కదా’’ అని చిరాకుపడింది. అప్పుడే గుర్తొచ్చినట్లుగా ‘‘అవునూ, నువ్వొక్కడివే వచ్చావ్‌, బాబీ ఏడీ?’’ అనడిగింది.

‘‘అన్నయ్యకి హైస్కూల్‌ ఫ్రెండొకడు కనిపించాళ్ళే. అతనితో కబుర్లు చెప్పుకుని తీరిగ్గా రమ్మని నేను బండిమీద వచ్చేశాను’’ కోపంగా చెప్పాడు.

అతని తీరుచూసి రన్నింగ్‌రేస్‌లో ప్రైజ్‌ రాలేదని వసంత వూహించింది. కొడుకు తలమీద చేయివేసి నిమురుతూ ‘‘బాగా అప్‌సెట్‌ అయినట్లున్నావ్‌, పోటీలో ఎంతోమంది పాల్గొన్నా గెలిచే అవకాశం ఏ ఒకరిద్దరికో ఉంటుంది, అంతేగా! ప్రైజు రాలేదని బాధపడకూడదమ్మా... పాల్గొనటమే ముఖ్యం అనుకోవాలిగానీ’’ అనునయంగా అంది.

‘‘నాకు ప్రైజు రాలేదని నీకెప్పుడు చెప్పానమ్మా... నేనే ఫస్టొచ్చాను’’ అంటూ జేబులో నుండి పతకం తీసి తల్లి చేతిలో పెట్టాడు.

వసంత ఆశ్చర్యంగా చూసింది.

‘ఫస్టొచ్చినా ఎందుకలా ఉన్నాడూ?’ ఆమెకేం అర్థంకాలేదు.

‘‘ఏమిట్రా బుజ్జీ, ఈ మాట ఇంత ఆలస్యంగానా చెప్పటం...’’ ఆనందంగా అంటూ కొడుకును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ ‘‘బండి మీద నుండి పడినందుకు బాగా కంగారుపడ్డావ్‌... అవునా?’’ అనడిగింది.

బుజ్జి కాదన్నట్టుగా తలూపుతూ ‘‘అన్నయ్యయితే నేను గెలవననే అనుకున్నట్లున్నాడు. పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ ఓటమి నెదుర్కోగలిగే గుండె దిటవూ ఉండాలట! ఈరోజు పొద్దుటినుంచీ ఈ మాట ఎన్నిసార్లు చెప్పాడో..! నన్ను నిరుత్సాహపరచడానికే అలా చెప్పి ఉంటాడని నాకిప్పుడు అనిపిస్తోంది’’ అన్నాడు.

‘‘ఛ.. ఛ... ఏం మాటల్రా అవి! కిందటిసారి కొద్దిలో తప్పిపోయిందని నువ్వెంత బాధపడ్డావో వాడికి తెలుసుగా, అందుకే ఏం జరిగినా కుంగిపోకుండా ఉంటావని ధైర్యం చెప్పటానికి అలా అని ఉంటాడు. తనకి ఎగ్జామ్స్‌ దగ్గరకొస్తున్నా ఇన్ని రోజులుగా నిన్ను ప్రాక్టీసు కోసం గ్రౌండ్‌కి తీసుకెళ్తూ నీ వెంటే ఉంటున్నాడు కదరా’’ కోప్పడుతున్నట్లుగా అంది వసంత.

‘‘నువ్వెప్పుడూ ఇంతేనమ్మా, నేనేం చెప్పినా అన్నయ్యనే సమర్థిస్తావు. పైగా పెద్దవాడని వాడినేమీ అనకూడదంటూ నాకు నీతులు చెబుతావే తప్ప తననేమీ అనవ్‌. అసలీరోజు ఏం చేశాడో తెలుసా అమ్మా’’ బుజ్జి గొంతు బొంగురుపోయింది. కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి.

వసంత ఆశ్చర్యంగా బుజ్జి చేయి పట్టుకుని ‘‘ఏం జరిగిందిరా?’’ లాలనగా అడిగింది.

బుజ్జి కళ్ళు తుడుచుకుంటూ చెప్పుకొచ్చాడు ‘‘మేమిద్దరం బండిమీద వెళ్ళామా... పార్కు ఇంకా పదడుగుల దూరం ఉండగానే, మా ఫ్రెండ్స్‌ నలుగురు కనిపిస్తే ‘వాళ్ళతో నువ్వెళ్ళరా... ఇప్పుడే... చాన్నాళ్ళకు నా హైస్కూలు ఫ్రెండొకడు కనిపించాడు, పలకరించి వచ్చేస్తా’నంటూ నన్ను అక్కడే దింపేసి వెళ్ళినవాడు ఎప్పుడు తిరిగొచ్చాడో తెలుసా అమ్మా?’’ బుజ్జి గొంతు మళ్ళీ బొంగురుపోయింది.

ఒక క్షణం ఆగి సర్దుకుని మళ్ళీ చెప్పాడు ‘‘సెకండ్‌ వచ్చిన నా ఫ్రెండ్‌ నిఖిల్‌ లేడూ... వాళ్ళన్నయ్యే వాడికి షూస్‌ తొడగటం దగ్గర్నుండీ అన్నీ చూసుకుంటూ సపోర్టివ్‌గా ఉండటమే కాదు, వాడు పరిగెడుతున్నపుడు పేరుపెట్టి పిలుస్తూ ‘కమాన్‌... కమాన్‌’ అంటూ ఎంత హుషారు చేశాడో! అలా అందరికీ ఇంట్లోవాళ్ళున్నారు. అన్నయ్యేమో దగ్గర లేకుండా వెళ్ళిపోవడమే కాదు, అన్ని రౌండ్సూ పూర్తయి, బహుమతులివ్వటం కూడా పూర్తయ్యాక అపుడు నిదానంగా వచ్చి ‘సారీ రా’ అన్నాడు. నాకెంత బాధగా ఉంటుందో నువ్వే చెప్పమ్మా.’’

‘‘బాబీ అలా ఎందుకు చేశాడో!’’ ఆలోచిస్తున్నట్లుగా అంది వసంత.

‘‘ఎందుకేమిటి, వాడికి నాకంటే తన ఫ్రెండే ముఖ్యం. తిరిగొచ్చాక అన్నయ్యకి నా ఫ్రెండ్స్‌ నేను ఫస్టొచ్చిన సంగతి చెప్పి కూల్‌డ్రింక్స్‌ తెప్పించమని అడిగితే ‘డబ్బంతా ఖర్చయిపోయింది, రేపు మీ అందరికీ పార్టీ ఇస్తా’ అని సింపుల్‌గా చెప్పేశాడు. నువ్విచ్చిందంతా ఆ ఫ్రెండ్‌తో ఏ రెస్టారెంట్‌కో వెళ్ళి ఖర్చు చేసేశాడన్నమాట. నాకు చాలా అవమానంగా అనిపించింది. అందుకే ‘ఆ ఫ్రెండ్‌తో మరికాసేపు మళ్ళీ కాలక్షేపం చేసిరా’ అని చెప్పి బండిమీద నేనొచ్చేశాను’’ ఉక్రోషం, రోషం బుజ్జి మాటల్లో కలగలిశాయి.

వసంత నిట్టూర్చింది. ‘‘వూరుకో, బాబీని నేనడుగుతాగా. వాడలా చేయటం నిజంగా తప్పే’’ అంటూ భుజం తట్టి అనునయించింది. ‘‘అదిగో, తలుపు చప్పుడైంది. బాబీ వచ్చినట్లున్నాడు. గట్టిగా అడుగుతాలే’’ అంటూ వసంత బెడ్‌రూమ్‌ కర్టెను సవరిస్తూ బయటకు వచ్చింది.

బాబీ తన చేతిలోని ప్యాకెట్‌ను డైనింగ్‌ టేబుల్‌ మీద పెడుతూంటే వసంత ‘‘ఏంటది?’’ అంది అభావంగా.

‘‘బుజ్జీకి ఇష్టమని హల్వా తెచ్చాను. అమ్మా, మొత్తానికి తమ్ముడు సాధించాడు. ఫస్ట్‌ప్రైజ్‌ కొట్టేశాడు. బాగా ప్రాక్టీసు చేసినందుకు ఫలితం దక్కింది. బండిలేదూ... మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాడా?’’

అవునన్నట్లుగా తలూపిన వసంత, బాబీని నిశితంగా చూస్తూ ‘‘స్వీట్‌ తేవటానికి నీకు డబ్బెక్కడిదీ..?’’ అడిగింది.

తల్లివైపు కొంచెం ఆశ్చర్యంగా చూసి, సర్దుకుని ‘‘రహీమ్‌ మనకి తెలిసినవాడేగా, అతని షాపులోనే... పర్సు మర్చిపోయాననీ, రేపు ఇస్తాననీ చెప్పి తీసుకువచ్చాను’’ అని, ‘‘ఎందుకమ్మా అదోలా ఉన్నావ్‌... బుజ్జి ఫస్టొచ్చినందుకు ఆనందంగా ఉండాలిగానీ...’’ అంటూ తల్లిని డైనింగ్‌టేబుల్‌ దగ్గర కుర్చీలో చేయి పట్టుకుని కూర్చోబెట్టి తనూ పక్కనే కూర్చున్నాడు.

‘‘ఫస్టొచ్చిన ఆనందం బుజ్జి మొహంలోనూ కనిపించక... నేను ఇలా ఉన్నాను’’ అంటూ వసంత నిట్టూర్చింది. ‘‘నాకు రెండు రోజులుగా ఒంట్లో బావుండకే కదా నిన్నొక్కడినీ బుజ్జి వెంట పంపించాను. నువ్వూ సమయానికి వాడి దగ్గర ఉండకుండా ఫ్రెండ్‌ కనిపించాడని వెళ్ళిపోతావా? ఈ జిల్లాస్థాయి హైస్కూలు పిల్లల పోటీకి వచ్చే సంవత్సరంనాటికి వాడికీ అవకాశం ఉండదు కదా! ఎలాగైనా సాధించాలని ఇన్నాళ్ళుగా ప్రాక్టీసు చేస్తూ కష్టపడ్డాడా... అనుకున్నది సాధించగలిగినా వాడి మొహంలో ఆనందమే లేదు. నువ్వు చేసిన పనికే ఎక్కువ బాధపడ్డాడు తెలుసా!?’’

తల్లి కళ్ళల్లోని తడిని గమనించిన బాబీ కలవరపడుతూ ‘‘అమ్మా, తమ్ముడు... నేను...’’ అంటూ ఏదో చెప్పబోతుండగా-

‘‘చాల్లే... నువ్వేం చెబుతావో తెలుసు’’ అంటూ వసంత అడ్డొచ్చి విసురుగా అంది. ‘‘మీ ఇద్దరికీ ‘తప్పు వాడిదే’నంటూ ఫిర్యాదులు చేసుకోవటం మామూలేగా! వాడికంటే నాలుగేళ్ళు పెద్దవాడివి, అయినా నీకు బాధ్యత తెలియటం లేదు. ఎప్పుడూ ఇద్దరిమధ్యా గొడవలే. సర్దిచెప్పటం నావల్ల కావటంలేదు. ఎవరో ఒకరు హాస్టల్లో ఉంటే సరిపోతుంది. మీ నాన్న క్యాంపు నుండి రాగానే నేనిదే చెప్పాలనుకుంటున్నాను. చెప్పు... నువ్వా, తమ్ముడా... ఎవరు హాస్టల్లో చేరతారు?’’

బాబీ చిన్నబుచ్చుకున్నట్లుగా తలొంచుకుని మెల్లగా అన్నాడు ‘‘బుజ్జీ వాళ్ళ స్కూలు హాస్టల్లో భోజనం అసలు బావుండదనేగా, సుధాకర్‌ అంకుల్‌ వాళ్ళబ్బాయి చేర్పించిన వారానికే తిరిగి వచ్చేశాడూ, నేనే మా కాలేజీ హాస్టల్లో ఉంటాలే.’’

‘‘ఏం, మీ కాలేజీ హాస్టల్లో తిండి బ్రహ్మాండంగా ఉంటుందనుకుంటున్నావా?’’

‘‘కాదమ్మా, మనింట్లోనే అన్నీ బావున్నా తమ్ముడు తినేది అంతంతమాత్రమా! ఇక హాస్టలు తిండికి మరీ పాడైపోతాడనీ... నేనైతే సర్దుకోగలననీ...’’ నసుగుతూ అన్నాడు.

‘‘అహాఁ, తమ్ముడంటే అంత అభిమానం ఉందా. మరి కొంచెం సఖ్యంగా ఉండండిరా అంటే ఎందుకు వినిపించుకోరూ? ఇద్దరూ అంతే... నువ్వు ఎప్పుడూ వాడిని ఏడిపిస్తూ పైగా సరదాకి అంటావ్‌’’ అసహనంగా అంది.

‘‘తమ్ముడంటే చిన్నవాడు... నేను ఏదైనా సరదాగా అన్నా అర్థంచేసుకోకుండా గొడవ పెట్టుకుంటాడు. నువ్వు... నువ్వు కూడా... నన్నలా అంటున్నావేమిటమ్మా’’ బాబీ గొంతు దుఃఖాన్ని అదిమిపెడుతున్నట్లుగా గద్గదమైపోయింది. ‘‘నేను, ఈమధ్య తమ్ముడితో... వాడేం అన్నా కూడా గొడవ పడటంలేదు. నువ్వు గమనించలేదేమోగానీ, నాన్నతో పెదనాన్నగారింటికి వెళ్ళొచ్చిన దగ్గర్నుండీ నేను చాలా మారానమ్మా.’’

వసంత బాబీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఏం, మీ పెదనాన్న దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా... దాంతో నిన్ను మార్చేశారా?’’ కొంచెం వ్యంగ్యంగా అంది.

‘‘కాదమ్మా, ఆరోజు... పెదనాన్నగారింటి నుంచి తిరిగివచ్చేటపుడు నాన్నా, నేనూ కాసేపు పార్కులో కూర్చున్నాంలే. అపుడు నాన్న చెప్పిన మాటలు... మంత్రాల్లా నా మనసును మార్చేశాయన్నమాట! నిజం అమ్మా... నాన్న ఆరోజు ఏం చెప్పారో తెలుసా...’’ అంటూ హుషారుగా మొదలుపెట్టాడు.

‘‘పెదనాన్న, నాన్నల మధ్య ఒక స్థలం గురించి గొడవ జరుగుతూండేదిగా...’’ బాబీ మాటలకు వసంత మొదట్లోనే అడ్డంవచ్చింది.

‘‘నిజానికి అది సమస్యే కాదు. మీ పెదనాన్నా, పెద్దమ్మావాళ్ళే మొండిపట్టు పట్టారు. తాతగారిచ్చిన స్థలాన్ని అన్నదమ్ములిద్దరూ సరిసమానంగా పంచుకోవాల్సిన మాట నిజమే అయినా రోడ్డువైపుకి వచ్చిన భాగానికి విలువెక్కువ కాబట్టి ఇవతలి భాగానికి కొలతల్లో కొంచెం ఎక్కువుంటే సరిపోతుందని మధ్యవర్తులన్నారు. అయినా, ఆ మాట వినకుండా పెదనాన్నవాళ్ళు రోడ్డువైపు భాగమే... అదీ సరిసమానంగానే కావాలని పట్టుబట్టడంతో సమస్య వచ్చింది. ‘అదెలా కుదురుతుందీ’ అని మీ నాన్న కొన్నాళ్ళు పంతం మీదున్నారుగానీ చివరకు వాళ్ళిష్టప్రకారమే కానీయమని మీ పెదనాన్నకు చెప్పేశారు. మీ నాన్న మెతకదనం వల్ల మనకి నష్టం, వాళ్ళకి లాభం!’’ అంటూ నిట్టూర్చి, ‘‘అవునూ, జరిగిపోయిన ఆ సంగతి ఇప్పుడెందుకూ?’’ అనడిగింది వసంత.

‘‘ఆరోజు పెదనాన్న వాళ్ళింటికి నాన్నతో నేనూ వెళ్ళాకదమ్మా. తిరిగి వచ్చేటపుడు కాసేపు పార్కులో కూర్చున్నామని చెప్పాగా... అప్పుడు నాన్నని ‘చేతగానివాళ్ళలా మనమే ఎందుకు రాజీపడటం?’ అనడిగాను.

దానికి నాన్న ‘అదేమాట అందరూ అనుకుంటే సమస్యలు అలాగే ఉండిపోయి, కోర్టుల చుట్టూ తిరగటమే జరుగుతుంది. సామరస్యంగా సర్దుబాటు చేసుకోవటానికి చొరవ చూపటమంటే... అది చేతగానితనం, చిన్నతనం కానేకాదు, అయితేగియితే ఒక మెట్టు పైకెక్కిన ఆధిక్యతే అవుతుంది’ అన్నారు.

కాసేపాగి... మళ్ళీ ఇలా చెప్పారు... ‘హైస్కూలు చదువు రోజుల్లో పేచీపెట్టి ఖరీదైన పెన్ను కొనుక్కున్నాను. కానీ, ఆరోజే అదెక్కడో పోయింది. ఇంట్లో చెప్పటానికి నేను భయపడుతుంటే, నాన్న తనకి టెక్స్ట్‌బుక్‌ కొనుక్కోవటానికి ఇచ్చిన డబ్బుతో నాకు అలాంటి పెన్నే కొనిపెట్టాడు అన్నయ్య. ఆ బుక్‌ ఫ్రెండ్స్‌ దగ్గర్నుండి తెచ్చుకుని చదువుకుంటూ ‘తర్వాతెపుడో కొనుక్కుంటాలే’ అన్నాడు. అలాంటి ఎన్నో తప్పులకి అన్నయ్య కాపుకాసేవాడు. ఇంట్లోవాళ్ళకి చెప్పుకోలేనివెన్నో అన్నయ్యతో ధైర్యంగా చెప్పుకునేవాడిని. అన్నయ్యంటే నాకో గొప్ప భరోసా మరి!

నాకిష్టమైనవి చేయటంలోనూ అంతే. అన్నయ్య యూనివర్సిటీలో చదువుతున్నపుడు ఒకసారి అక్కడికి నేను వెళ్ళాను. ఉదయం వూరంతా చూపించి సాయంకాలం సర్కస్‌కి తీసుకెళ్ళాడు. వూరికి చాలా దూరంగా ఉంది. పైగా టికెట్స్‌ కోసం పెద్ద ప్రయత్నమే చేయాల్సి వచ్చింది. అందుకే నేను ‘అనవసరంగా ఎందుకింత శ్రమపడి రావటం?’ అన్నాను అన్నయ్యతో. ‘ఒకసారి మనూరికి వచ్చిన సర్కస్‌కి నాన్న తీసుకెళ్తానని అంటూనే తీరికలేక అలాఅలా జరిపేసరికి అది వెళ్ళిపోయినరోజు నువ్వెంత ఏడ్చావో నాకు బాగా గుర్తుందిరా’ అన్నాడు. అప్పటికి నాకు సర్కస్‌ సరదా పోయింది. అయినా అన్నయ్య మాటలు, నా ఇష్టాన్ని గుర్తుపెట్టుకోవటం... చాలా గొప్పగా, ఆనందంగా అనిపించింది.

అన్నయ్య ఉద్యోగంలో చేరాక మొదటి సంవత్సరం సేవింగ్స్‌తో నాకు బండి కొన్నాడు. తర్వాత ఆఫీసులో లోను తీసుకుని తను కొనుక్కున్నాడు. నిన్న, చిన్నప్పటి ఈ విషయాలన్నీ నెమరేసుకుంటుంటే మనసంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడనిపించింది... ‘ఆస్తి పంపకంలో అన్నయ్యతో పేచీ ఏమిటీ’ అని. నన్ను నేను ప్రశ్నించుకున్నాను... ఆర్థిక లాభమా, అనుబంధమా అని! నా మనసు అనుబంధానికే మొగ్గు చూపింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పారు నాన్న.

‘‘అందరూ మీలా నిస్వార్థంగా ఆలోచిస్తే పరిష్కారం కాని సమస్యలే ఉండవు నాన్నా’’ అన్నాను.

దానికి నాన్న ‘‘ఇలా చేయటంలో నాకో కోరికా, స్వార్థమూ కూడా ఉన్నాయిలే’’ అనడంతో, అదేమిటన్నట్లు ఆశ్చర్యంగా చూశాను.

‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఒకరికొకరుగా, ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటార్రా... నాదీ అదే కోరిక. నేను అన్నయ్యతో ప్రేమగా ఉంటే, సర్దుకుపోతే- రేపు నువ్వూ తమ్ముడూ కూడా అలా ఉంటారని నమ్మకం. ఉండాలని స్వార్థం...’’ అంటూ నవ్వారు నాన్న.

అప్పుడు నాకు అర్థమైంది... ఆర్థిక లావాదేవీల లాభంకంటే ఆప్యాయతానురాగాల బంధమే విలువైనదని నాన్న చెప్పదలుచుకున్నారని!

నాలో నేనే ఒక తీర్మానం చేసుకున్నాను. ముందుముందు మాకూ ఇలాంటి సమస్యలేమైనా ఎదురైతే... మనసు అనుబంధానికే మొగ్గు చూపాలంటే... అందుకు పునాదిగా నేనే తగ్గి, నా ప్రవర్తన కొంచెం మార్చుకోగలగాలని! మీరు తమ్ముడిని చిన్నవాడంటూ వెనకేసుకొచ్చి గారాబం చేస్తూండటంతో ఇంతకాలం వాడిపట్ల నాక్కొంచెం అసహనంగానే ఉండేదమ్మా. అది తగ్గించుకుంటూ గొడవలు పెంచుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నా.’’

చెప్పటం ఆపి, నిశ్శబ్దంగా కూర్చున్న కొడుకు వైపు ‘వీడి ఆలోచనల్లో ఇంత పరిణతి వచ్చిందా’ అన్నట్లు విభ్రాంతిగా, ప్రశంసగా చూసింది.

కొడుకు చేయి ప్రేమగా నిమురుతూ ‘‘మరి... మరి... ఇదేంటిరా, ఈరోజు ఇలా చేశావ్‌?’’ అంది.

బాబీ నిట్టూర్చాడు. ఒక క్షణం తటపటాయిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయి ‘‘అమ్మా, అసలేం జరిగిందంటే...’’ అంటూ మొదలుపెట్టాడు.

‘‘ఆమధ్య తమ్ముడు మన పెరట్లోని చెట్టుకి గురిచూసి చిన్న రాయి విసిరితే సరిగ్గా ముచ్చిక దగ్గర తగిలి మామిడికాయ కింద పడింది కదూ... అప్పటినుండీ వీడికి జేబులో రెండు రాళ్ళు వేసుకుని దేనికో దానికి గురిచూసి విసరటం అలవాటైంది. ఈవేళా అంతే, ఇందాక మేం బండిమీద వెళ్తున్నపుడు... వెనుక కూర్చున్నాడుగా... ‘ఆ చెట్టు కొమ్మకి తగిలి అక్కడున్న పిట్ట ఎగిరిపోతే, నేనే రన్నింగ్‌ రేస్‌లో ఫస్టొస్తా’నంటూ రాయి విసిరాడు. వద్దంటున్నా వినలేదు. ఆ పిట్ట ఎగిరిపోగానే సంబరంగా చప్పట్లు కొడుతూ ‘చూశావా, నేనే ఫస్టు’ అన్నాడు. నేనా పక్కకు చూసేసరికి ఆ రాయి తగిలిందేమో, ఒక పెద్దాయన తలని చేత్తో పట్టుకోవటం కనిపించింది. ఆ మాట చెబితే తమ్ముడి మనసు పాడవుతుందేమోననిపించింది. అందుకే బుజ్జీని వాడి ఫ్రెండ్స్‌తో పంపించేసి నేను వెనక్కి వెళ్ళాను. ఆ పెద్దాయనకి బట్టతల ఉండటం, రాయి కాస్త కోసుగా ఉండటంవల్లనేమో దెబ్బ గట్టిగానే తగిలింది. ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి కట్టు కట్టించి, వాళ్ళింటి దగ్గర వదిలి, మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి బాగా ఆలస్యమైపోయింది. డబ్బూ ఖర్చయిపోయింది. తమ్ముడు ఫస్టొచ్చిన ఆనందంలో ఉన్నపుడు ఇదంతా ఎందుకులే, ఇంటికి వచ్చాక చెబుదామనుకుంటే, వాడికి కోపం వచ్చి ఒక్కడూ వచ్చేశాడు.’’

వసంత కళ్ళు తడి అయ్యాయి. ‘‘అసలు సంగతి తెలుసుకోకుండా నీమీద చిరాకుపడ్డాను, సారీరా...’’ అంటూ కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ‘‘బాబీ, నువ్వుగానీ ఆ పెద్దాయన సంగతి పట్టించుకోకుండా తమ్ముడితోపాటే వెళ్ళి ఉంటే, నిజంగా మనవల్ల చాలా పెద్ద తప్పు జరిగేది. నువ్వు చాలా మంచిపని చేశావు. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా!’’ అంటూ కొడుకు నుదురు చుంబించింది.

అన్నయ్యని అమ్మ గట్టిగా మందలిస్తే వినాలని బెడ్‌రూమ్‌ గుమ్మం దగ్గరే కర్టెన్‌ వెనుక నిలుచున్న బుజ్జీ రివ్వున ఇవతలకు వచ్చాడు. కళ్ళనిండా నీళ్ళు. ‘‘అన్నయ్యా, నేను చాలా తప్పు చేశాను. సారీ. నువ్వేకాదు, నేనూ నాన్న మాటల్ని గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడూ... ఇంకెప్పుడూ నీకు ఎదురుచెప్పను. నిజం’’ అంటూ రెండు చేతులతో బాబీని చుట్టేశాడు.

‘‘పోరా, ఈ వయసులో అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న తగాదాలుండకపోతే మజా ఏం ఉంటుందీ’’ అంటూ తమ్ముడి తలమీద చిన్న దెబ్బ వేస్తూ నవ్వాడు బాబీ.

మనసు నిండిన ఆనందానుభూతితో కొడుకులిద్దరివైపూ చూస్తుండిపోయింది వసంత.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.