close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హార్వర్డ్‌లో మనోళ్ల సందడే సందడి!

హార్వర్డ్‌లో మనోళ్ల సందడే సందడి!

కార్పొరేట్‌ పండితులూ వ్యాపార దిగ్గజాలూ రాజకీయ నేతలూ సినీ నటులూ... ఒకరో ఇద్దరో కాదు, దేశంలో లక్షల మందిని ప్రభావితం చేయగల ప్రముఖులు పదుల సంఖ్యలో పాల్గొంటోన్న కార్యక్రమం... ఇండియా కాన్ఫరెన్స్‌ 2017. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు నిర్వహించే అతి పెద్ద సమావేశాల్లో ఒకటైన ఈ మేధోమథన వేడుకకు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ వేదిక. అక్కడ ప్రసంగించే వ్యక్తుల సరసన ఈసారి పవన్‌ కల్యాణ్‌ కూడా చేరారు.

మెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టి విదేశీ విద్యార్థుల జాబితాను జల్లెడపడితే సగం భారతీయుల పేర్లే కనిపిస్తాయి. శంకర్‌దయాళ్‌ శర్మ, రతన్‌ టాటా, పి.చిదంబరం, కపిల్‌ సిబల్‌ లాంటి ఎందరో భారతీయ దిగ్గజాలూ, బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, జుకర్‌ బర్గ్‌ లాంటి అంతర్జాతీయ ప్రముఖులూ ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. అంత పేరున్న ఆ విశ్వవిద్యాలయం పదమూడేళ్లుగా ‘ఇండియా కాన్ఫరెన్స్‌’ పేరుతో ఓ భారీ కార్యక్రమానికి ఆతిథ్యమిస్తోంది. హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిధిలో చదువుకునే భారతీయ విద్యార్థులు నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కి దేశంలో తమ తమ విభాగాల్లో పేరున్న వ్యక్తుల్ని విశిష్ట అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ విద్యార్థులకు అందులో ప్రవేశం కల్పిస్తూ అతిథుల ప్రసంగాలను వినడంతో పాటు, వాళ్లతో చర్చించే అవకాశాన్నీ కల్పిస్తున్నారు. అలా ఈ ఏడాది బోస్టన్‌లోని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌, హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌ ప్రాంగణాల్లో జరిగే కాన్ఫరెన్స్‌కు పిలుపందుకున్న ప్రముఖుల్లో నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ఆదివారం (ఫిబ్రవరి 12) సాయంత్రం గంటపాటు విద్యార్థులూ, ప్రముఖుల సమక్షంలో ఆయన ప్రసంగించనున్నారు.

చర్చలే చర్చలు...
ప్రతిభ ఉన్న విద్యార్థులకే హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం దక్కుతుంది. ఆ పైన ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన నాయకులుగా యూనివర్సిటీ వాళ్లని తీర్చిదిద్దుతుంది. ఈ మధ్యలో రకరకాల భయాలూ, అపోహలూ, ఆత్మన్యూనతలూ విద్యార్థుల్ని వెంటాడుతుంటాయి. వాటినుంచి బయట పడేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సమర్థులైన నాయకులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులంతా ఏకమై నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్‌ ఇది. దీని కోసం దేశంలో పేరున్న రాజకీయ నేతలూ, వ్యాపారులూ, సినీ ప్రముఖులూ, సామాజిక వేత్తలూ లాంటి వాళ్లని ఎంచుకొని అమెరికాకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని తీసుకొని, దానిపైన చర్చలూ, ప్రసంగాలూ నిర్వహిస్తూ వక్తల్నీ విద్యార్థుల్నీ వాటిలో భాగం చేస్తున్నారు. చివరికి ఎంపిక చేసుకున్న లక్ష్యాల్ని చేరుకునేందుకు తమ వంతుగా నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలన్న ప్రతిజ్ఞతో వేడుకల్ని ముగిస్తున్నారు. అలా ఈ ఏడాది కాన్ఫరెన్స్‌కి ఎంచుకున్న థీమ్‌ - ‘ఇండియా ది గ్లోబల్‌ గ్రోత్‌ ఇంజిన్‌’. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి దేశం వైపు చూస్తున్నాయి. ప్రపంచ దేశాలూ మనతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేయడానికి నేతలూ, వ్యాపారులూ, మీడియా, పౌరులూ తమ వంతుగా ఎలాంటి పాత్ర పోషించాలన్నది చర్చించడమే ఈ కాన్ఫరెన్స్‌ ముఖ్య ఉద్దేశం.

పవన్‌ కల్యాణ్‌తోనే పూర్తి!
ఒమర్‌ అబ్దుల్లా, శశి థరూర్‌ లాంటి నేతలూ, గురురాజ్‌ దేశ్‌పాండే, ఆనంద్‌ షా, మురుగవేల్‌ జానకీరామన్‌ లాంటి వ్యాపారులూ, పవన్‌ కల్యాణ్‌, మాధవన్‌, వివేక్‌ ఒబెరాయ్‌ లాంటి సినీప్రముఖులూ, క్రీడలూ, సామాజిక సేవ తదితరరంగాలకు చెందిన దాదాపు వంద మంది భారతీయులు వక్తలుగా హార్వర్డ్‌ వేదిక ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నేతగా మారిన పవన్‌ కల్యాణ్‌ మొదట ‘ఇన్‌స్పైర్‌ సిరీస్‌’ పేరుతో జరిగే కార్యక్రమంలో చిన్నప్పట్నుంచీ తనపై ప్రభావం చూపిన వ్యక్తులూ, పరిస్థితులూ, నటుడిగా రాజకీయ నేతగా ఎదుగుతున్న క్రమంలో తగిలిన ఎదురుదెబ్బలూ, వాటిని దాటుకొని సాధించిన విజయాలూ... ఇలాంటి అనుభవాలన్నీ సభ్యులతో పంచుకుంటారు. మరో విభాగంలో సమావేశానికి ఎంచుకున్న థీమ్‌కి సంబంధించి దాదాపు యాభై నిమిషాలు ప్రసంగిస్తారు. ఈ ఏడాది ‘ఇండియా కాన్ఫరెన్స్‌’ పవన్‌ కల్యాణ్‌ ఇచ్చే తుది ప్రసంగంతోనే పూర్తవనుండటం విశేషం. పెద్ద నోట్ల రద్దు, కశ్మీర్‌ సమస్య, భారత్‌-ఆఫ్రికా సంబంధాలూ, దేశంలో స్టార్టప్‌ల అభివృద్ధీ, లింగ వివక్ష, గృహ హింస, పెట్టుబడులూ... ఇలా దేశాన్ని ప్రభావితం చేస్తున్న అనేక అంశాలకు సంబంధించి నిపుణులు తమ అభిప్రాయాలూ, ఆలోచనలూ పంచుకుంటారు. విద్యార్థుల నుంచి సమస్యల పరిష్కారానికి సూచనలను ఆహ్వానిస్తారు. వాటి అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను చర్చిస్తారు. మొత్తంగా దేశ అభివృద్ధి కోసం తెలివైన విద్యార్థులూ, ప్రభావశీలురైన వ్యక్తుల మధ్య జరిగే మేధోమథనమే ఈ ఇండియా కాన్ఫరెన్స్‌.ఈ చర్చల ప్రభావంతో భవిష్యత్తులో ఆ విద్యార్థులు దేశాభివృద్ధికి సాయపడే సంస్థల్ని పెట్టొచ్చు. రాజకీయ నేతలూ, సామాజిక వేత్తలుగా మారొచ్చు. లేదా విద్యార్థుల ఆలోచనలనే ఇక్కడి పాలకులు అమలు చేసే ప్రయత్నమూ చేయొచ్చు. మొత్తమ్మీద రెండ్రోజుల పాటు హార్వర్డ్‌ యూనివర్సిటీ ఓ మినీ భారతీయ విశ్వవిద్యాలయంలా మారనుంది. వేల మంది పాల్గొనే ఈ వేదిక నుంచి ఒక్క సరైన ఆలోచన అమల్లోకి వచ్చినా సమావేశ లక్ష్యం నెరవేరినట్లే.


 

ఆ తీర్పు వెనుక ఉన్నది ఇతడే..

జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను మూసేయాల్సిందిగా ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తీర్పు వెనుక హర్మన్‌సింగ్‌ సిద్ధూ చేసిన న్యాయ పోరాటం ఉంది.రోడ్డు ప్రమాదంలో దివ్యాంగుడిగా మారినా హర్మన్‌ కుంగిపోలేదు. ఆ ప్రమాదాలకు అసలు కారణాన్ని అన్వేషించాడు. అదెలాగంటే...

రవై ఏళ్ల కిందట పాతికేళ్ల హర్మన్‌సింగ్‌ సిద్ధూ తన స్నేహితులతో కలిసి చండీగఢ్‌ బయలుదేరాడు. మధ్యలో హిమాచల్‌ సరస్సునూ, చిరుత పులుల శాంక్చ్యురీనీ చూసుకుంటూ వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నారు. మెయిన్‌ రోడ్‌ మీద నుంచి వెళితే జంతువులను చూసే అవకాశం ఉండదని కారును అడ్డదారిలో పోనిచ్చారు. గతుకుల దారిలో కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ లోయలో పడిపోయింది. అందులో ఉన్నవాళ్లందరూ ఎలాగోలా కారు నుంచి బయటపడ్డారు కానీ హర్మన్‌ మాత్రం బయటకు రాలేకపోయాడు. వెన్నెముకకు తగిలిన బలమైన గాయాలతో స్పృహ కోల్పోయిన హర్మన్‌ తిరిగి వైద్యశాలలోనే కళ్లు తెరిచాడు. ఆ గాయాల వల్ల రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. కదలలేని స్థితిలో కొన్ని నెలలపాటు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. అప్పుడే రోడ్డు ప్రమాద బాధితుల వివరాలను తెప్పించుకుని పరిశీలించాడు. అధిక శాతం ప్రమాదాలు మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే జరిగాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కాస్త కోలుకున్నాక ‘రహదారి భద్రత’ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాడు. అయితే ట్రాఫిక్‌ పోలీసులు ఉంటే తప్ప ఆ కార్యక్రమాలకు మంచి స్పందన లభించేది కాదు. అందుకే వాళ్లనూ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనుకున్నాడు.

వెబ్‌సైట్‌ మొదలైందిలా...
ఆ సమయంలోనే ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌సింగ్‌ ధిల్లాన్‌ ఇచ్చిన సలహా, ప్రోత్సాహంతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. దాంట్లో రహదారి భద్రత, వాహనాలను నడిపేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరిచాడు. ఆ ప్రయత్నం ఫలించి ప్రజలూ, అధికారుల నుంచి మంచి స్పందన వచ్చింది. మూడునెలల్లో లక్షమంది ఆ వెబ్‌సైట్‌ను వీక్షించారు. అదే స్ఫూర్తితో ‘అరైవ్‌ సేఫ్‌’ అనే స్వచ్ఛంద సంస్థనూ ప్రారంభించాడు. ఆ సంస్థ ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించేవాడు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థా, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే జాతీయ రహదారుల వెంబడి ఉండే మద్యం దుకాణాలను తొలగిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చనే ఒక ఆలోచనా స్ఫురించింది.

ట్రాఫిక్‌ నియమాలను ప్రజలు పాటించేట్టు చేయడానికి పోలీసులతో కలిసి పనిచేసేవాడు హర్మన్‌. ఆ సందర్భంగా తెలుసుకున్న కొన్ని వాస్తవాలు అతడిని ఆశ్చర్యపరిచాయి. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో సగటున ప్రతి నాలుగు నిమిషాలకూ ఒక రోడ్డు ప్రమాదం జరిగితే, అందులో ఒకరు చనిపోతున్నారు. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇలా జరగడం లేదు. గత ఏడాది మన దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో లక్షానలభైమూడు వేల నూటముప్ఫైమూడు మంది మృత్యువాత పడ్డారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం - ముప్ఫైఅయిదు శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే జరిగాయి.

ఎంతోమంది బెదిరించారు...
నాలుగేళ్ల కిందట హర్మన్‌సింగ్‌ చేసిన సర్వే ప్రకారం జాతీయ రహదారి వెంబడి రెండు వందల తొంభైకిలో మీటర్ల దూరంలో నూట ఎనభైఅయిదు మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ప్రతి ఒకటిన్నర కిలోమీటరుకూ ఒక మద్యం దుకాణముంటుంది. అదెంత ప్రమాదకరమో గ్రహించిన హర్మన్‌, జాతీయ రహదారి వెంబడి ఉండే మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ పంజాబ్‌, హరియాణా హైకోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఆ తర్వాత నుంచీ హర్మన్‌కు మద్యం దుకాణదారుల నుంచి ఎన్నో బెదిరింపు ఫోన్లు వచ్చాయి. కొంతమంది భారీ మొత్తంలో లంచాలూ ఆశ చూపారు. కానీ ఇవేమీ హర్మన్‌ న్యాయ పోరాటాన్ని అడ్డుకోలేకపోయాయి.

రెండేళ్ల తర్వాత హర్మన్‌ వ్యాజ్యానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. దాంతో రెండు రాష్ట్రాల్లోని వెయ్యి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే, ఇరవైవేలూ అంతకుమించి జనాభా ఉన్న జాతీయ రహదారి వెంబడి మద్యం అమ్మకాలను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంది పంజాబ్‌ ప్రభుత్వం. దాన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాడు హర్మన్‌. రెండేళ్ల న్యాయ పోరాటం తర్వాత ప్రజాప్రయోజన వ్యాజ్యానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. సంకల్పబలంతో విజయం సాధించిన హర్మన్‌...‘జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలు పూర్తిగా మాయంకావడానికి కనీసం మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ నా పోరాటం ఆగదు. ఎంతో విలువైన మనిషి ప్రాణాలను కాపాడటానికి వేరే మార్గాల్లోనూ ప్రయత్నిస్తూనే ఉంటా. అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లనూ, డివైడర్లనూ బాగుచేయడానికి మా సంస్థ తరపున కృషిచేస్తూనే ఉంటా’ అంటాడు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే, అతడి మీదే ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ లెక్కన ఎన్ని వందల, వేల కుటుంబాలను హర్మన్‌ కాపాడుతున్నాడో కదా...


 

ఇంటింటా ఓ కోవెల..!

‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!’ అంటూ గణేశుణ్ణి కొలిచినా, ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అంటూ బుద్ధుణ్ణి ధ్యానించినా, ‘ప్రభూ, నన్ను రక్షించు’ అంటూ ఏసుని ప్రార్థించినా... ఎవరు ఎలా చేసినా అన్నీ ఆయన అనుగ్రహం పొందడంతోబాటు ఆ భగవన్నామ స్మరణతో కాసేపు ప్రశాంతంగా గడిపేందుకే. అందుకే ప్రతి ఇంటా పూజగదికో ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయిస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని పూజ చేసుకునేలా దేవుడికి ఓ గదిని కట్టించే ఆచారం వెనకటి నుంచీ ఉంది. పూజాగృహం, దేవుడి గదిగా దీన్ని పిలిచేవారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఇది ఈశాన్యంలో ఉంటే మంచి శక్తి ప్రకంపనలు వస్తాయన్న కారణంతో ఆ మూలనే ఎక్కువగా కట్టించుకునేవారు. క్రమంగా ఇంటిస్థలాలు కుంచించుకుపోయి అవి కాస్తా ఆకాశంలోకి ఎగబాకడంతో గదికి బదులు హాల్లో ఓ మూలనో, వంటింట్లోని ఓ గూడులోనో లేదా గోడకు తగిలించిన పూజామండపంలోనో దేవుణ్ణి కొలవడం ప్రారంభించారు. కానీ ఇటీవల ప్రజల్లో భక్తిభావం పెరగడంవల్లో సంపాదన పెరగడంతోనో ప్రసార మాధ్యమాల కారణంగానో మొత్తమ్మీద మళ్లీ పూజగదుల నిర్మాణం పెరిగింది. ఇంట్లోని ఇతర గదుల మాదిరిగానే పూజగదుల గోడల్ని శివలింగాలూ లేదా వెంకటేశ్వరుడి బొమ్మలూ; ముగ్గులూ; చిత్రలేఖనాలూ... ఇలా ఓ థీమ్‌ ప్రకారం అలంకరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంట్లోనే ఓ చిన్న గుడి ఉందేమో అనిపించేలా కట్టించుకునేవాళ్లూ లేకపోలేదు. పిండికొద్దీ రొట్టెలా... సంపన్నులు ఆ పూజగదులకు మరిన్ని హంగులు చేరుస్తున్నారు. గది ప్రవేశద్వారం నుంచి లోపల అమర్చే దేవుడి పీఠం వరకూ అన్నింటా తమదైన ముద్ర కనిపించేలా డిజైన్‌ చేయించుకుంటున్నారు. అలంకరణలో భాగంగా గ్రానైట్‌, పాలరాళ్లూ, రత్నాల రాళ్లను కొందరు వాడితే, చెక్కతోనే డిజైన్‌ చేయించేవాళ్లు ఇంకొందరు. ఆలయాల్లో మాదిరిగా తలుపులకి ఖరీదైన చెక్క నగిషీని చొప్పించేవాళ్లు ఇంకొందరు. గుడిలో మాదిరిగా గంటలూ హారతి దీపాలను వేలాడదీసేవాళ్లూ ఉన్నారు. లోపల కూడా నిత్యం దీపం వెలుగుతున్నట్లు ఉండేలా కృత్రిమ దీపకాంతుల్నీ, రంగుల ముగ్గుల్నీ అలంకరిస్తున్నారు. వాస్తుశాస్త్రప్రకారం పూజగదికి ఒకటే తలుపు కాకుండా రెండు తలుపులున్న ద్వారం అదీ చెక్కదే ఉండాలి అంటారు. దాంతో ఎక్కువమంది అలాంటి దానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు గది మొత్తం బయటకు కనిపించేలా పిట్టగోడలూ లేదా అద్దాలను కూడా అమరుస్తున్నారు. ఇంటి అలంకరణంతా ఒక ఎత్తుగాను, పూజగది ఒక్కటీ మరో ఎత్తుగానూ భావించి దీన్ని డిజైన్‌ చేయించుకునేవాళ్ల సంఖ్య పెరగడంతో అచ్చంగా వీటిని డిజైన్‌ చేసేందుకే ప్రత్యేకించిన స్టూడియోలూ దుకాణాలూ వస్తున్నాయి. వ్యక్తుల అభిరుచులతోబాటు వాళ్ల ఇంటి నిర్మాణాన్ని అనుసరించి వాళ్లు ఈ పూజ గదుల్ని డిజైన్‌ చేస్తున్నారు. అంతేకాదు, సదరు డిజైనర్లు పూజారులూ సిద్ధాంతుల సాయంతో దేవుడి బొమ్మలను అమర్చే విధానంలోనూ ఓ క్రమపద్ధతిని సూచిస్తున్నారు. మొత్తమ్మీద ఈనాటి గృహాలంకరణ ప్రియులంతా ఇల్లే ఓ కోవెలన్నంత భక్తిగా ఆసక్తిగా తలచి పూజాగృహాన్ని అలంకరిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు!


 

ప్రపంచంలోనే అతి పెద్ద పాఠశాల!

అరలక్ష... ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య. వూరికి వెయ్యిమంది జనాభా వేసుకున్నా యాభై గ్రామాలకు సమానమన్నమాట. అందుకే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ఆ బడి ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్‌గా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. యునెస్కో సంస్థ అందించే ‘పీస్‌ ఎడ్యుకేషన్‌’ పురస్కారాన్నీ అందుకుంది.

మయం... ఉదయం 7.15 నిమిషాలు. ప్రదేశం...ఉత్తర్‌ప్రదేశ్‌, లఖ్‌నవూలోని కాన్పూర్‌ రోడ్‌లో ఉన్న సిటీ మాంటిస్సోరీ పాఠశాల. ఓ పదిహేనుమంది సిబ్బంది గేటు దగ్గర నిలబడి ఆటోలూ వ్యానుల్లోంచి దిగుతున్న పిల్లల్ని ‘ఛలో బేటా ఛలో...’ అంటూ వరుసగా లోపలికి పంపిస్తున్నారు. గంట గడిచిపోయింది. అయినా పిల్లల రద్దీ తగ్గలేదు. మాంటిస్సోరీ పాఠశాలకు చెందిన ఆ ఒక్క శాఖలోనే ఎనిమిదివేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు మరి. అలాంటి శాఖలు లఖ్‌నవూ మొత్తమ్మీదా 20 ఉన్నాయి. అన్నింటిలో కలిపి ప్లేగ్రూప్‌ నుంచి ప్లస్‌ టూ వరకూ చదివే విద్యార్థులు ప్రస్తుతం 52వేలమందికి పైగా ఉన్నారు. అందుకే, దిమ్మతిరిగిపోయే ఈ సంఖ్యను చూసి గిన్నిస్‌ నిర్వాహకులు సైతం సిటీ మాంటిస్సోరీని ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాలగా ప్రకటించారు. ఇందులో పనిచేసేవారి సంఖ్య కూడా తక్కువేం కాదు. మొత్తం నాలుగువేల మంది ఉండగా అందులో 2,700 మంది ఉపాధ్యాయులు, మిగిలినవారు సహాయకులూ ఇతర సిబ్బంది. ఇక, ఎక్కువమంది పిల్లలుంటే టీచర్లు అందరిమీదా ప్రత్యేకశ్రద్ధ చూపలేరు... అన్నది ఈ బడికి అస్సలు వర్తించదు. ఎందుకంటే సీఐఎస్‌సీఈ సిలబస్‌తో నడిచే ఈ పాఠశాలలో ఎప్పుడూ సగానికి పైగా విద్యార్థులు 90శాతం మార్కులు తెచ్చుకోవడం విశేషం. మొత్తం పాఠశాల సగటు మార్కుల శాతం కూడా 80కి పైనే ఉంటుంది. ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ప్రకారం మాంటిస్సోరీ గోమతీనగర్‌ శాఖ 2015 విద్యాసంవత్సర ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకులో నిలిచింది.