close
ఈ కానుక నీకోసం...

 ఈ కానుక నీకోసం...

తెలుసా తెలుసా ప్రేమించాననీ...
తెలుసా తెలుసా ప్రాణం నువ్వనీ...
ప్రేమలో పడినవారు ఇలా పాటలు పాడుకోవడం ఎంత సహజమో మనసులోని ప్రేమను వ్యక్తం చెయ్యడానికీ మనసైనవారిని సంతోషపెట్టడానికీ కానుకలు ఇవ్వడం కూడా అంత సహజం. అయితే, ఆ బహుమతులు ప్రేయసి/ప్రియుడి మనసు దోచేలా ఉండాలంటే మాత్రం అచ్చంగా మన ముద్ర కనిపించాల్సిందే. అలాంటివే పర్సనలైజ్‌డ్‌ కానుకలు.

సంతోషాన్నిచ్చే ప్రతి అనుభూతీ ఓ అందమైన జ్ఞాపకమే. దాన్ని జీవితాంతం కళ్లముందుంచేదే ఛాయాచిత్రం. అలాంటి ఫొటో ఎప్పుడూ విలువైన కానుకే. అందుకే, ఎవరో రాసిన సందేశం ఉన్న గ్రీటింగ్‌ కార్డును ఇచ్చి, మన ప్రేమను చెప్పేకన్నా, మన మనసులో ఉన్న భావాలను రాసి, జ్ఞాపకాల తాలూకు ఫొటోతో సహా గ్రీటింగ్‌ మీద ప్రింట్‌ చేయించి ఇస్తే... అందుకున్నవారి మనసు మన వెనుక నడిచిరాదూ... ఇప్పటికే ఇద్దరూ ప్రేమలో ఉంటే ఓ చిన్న ప్రేమ కవితను తామిద్దరూ కలిసున్న ఫొటోతో ప్రింట్‌ చేయించి గ్రీటింగ్‌ కార్డులా ఇచ్చినా చాలు. గ్రీటింగులనే కాదు, చాక్లెట్‌ దగ్గర్నుంచి చేతికి పెట్టుకునే వాచ్‌ వరకూ కానుకేదైనా దానిమీద మనం ఎంచుకున్న ఫొటోనూ చెప్పిన మెసేజ్‌నూ ముద్రించి ఇచ్చే సంస్థలు ఇప్పుడు పట్టణాల్లో బోలెడన్ని. ఆన్‌లైన్‌లో అయితే అదీ ఇదీ అని తేడాలేకుండా దేనిమీదైనా మన ముద్రను వేసిచ్చే సంస్థలు కోకొల్లలు. పర్సనలైజ్‌డ్‌ లేదా కస్టమైజ్‌డ్‌ బహుమతుల పేరుతో ఆయా సైట్లలో కొన్ని నమూనా బహుమతుల్ని చూపిస్తారు. మనం ఇవ్వాలనుకున్న బహుమతినీ దాన్లో నచ్చిన డిజైన్‌నూ ఎంపిక చేసుకుని అక్కడ పెట్టాల్సిన ఫొటోనూ మన సందేశాన్నీ అప్‌లోడ్‌ చెయ్యడమే ఆలస్యం. ఉదాహరణకు రోజుకెన్నోసార్లు చూసే వాచ్‌ మీద మనం బహుమతి ఇవ్వాలనుకున్నవారి ఫొటోను ముద్రించి ఇస్తే చూసిన ప్రతిసారీ సంతోషపడతారు. ఆలుమగలైతే తమ ప్రేమకు గుర్తుగా చిత్రాన్ని గోడ గడియారం మీద ముద్రించి ఇవ్వొచ్చు. ఇక, సోఫాలో కూర్చున్నప్పుడూ మంచం మీద పడుకున్నప్పుడూ ప్రియమైనవారు మదిలో మెదలగానే చూసుకునేలా కుషన్లమీద ఇద్దరూ కలిసున్న ఫొటోలూ మనసును కదిలించే సందేశమూ కనిపిస్తే ఎంత బాగుంటుందో చెప్పనక్కర్లేదు. కొత్తసంవత్సరం వచ్చి నెలరోజులే కాబట్టి క్యాలెండర్లను కూడా కస్టమైజ్‌ చేయించి ఇచ్చినా బాగుంటుంది. తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయే ఒక్కో ఫొటో ఒక్కో నెలకు వచ్చేలా క్యాలెండర్‌ని ప్రింట్‌ చేయిస్తే అంతకుమించిన కానుక ఏముంటుందీ.

నచ్చితీరుతుంది
ఎంత సాన్నిహిత్యం ఉన్నా ప్రేయసి/ప్రియుడికి ఎలాంటి బహుమతి నచ్చుతుందో అన్నిసార్లూ వూహించలేం. అదే దానిపైన అబ్బాయి/అమ్మాయికి ఎంతగానో నచ్చే తమ ఫొటోనో ఇద్దరికీ సంతోషాన్నిచ్చే జ్ఞాపకం తాలూకు ఛాయాచిత్రాలనో ముద్రించి ఇస్తే బహుమతి ఏదైనా కచ్చితంగా సంతోషపడతారు. అంతేకాదు, ఇంకేదైనా కానుకను ఇస్తే ఇంతకుముందే చూసుంటే వారికంత సర్‌ప్రైజ్‌ ఉండకపోవచ్చు. అదే ఇలా మనం ఆర్డరిచ్చి తయారుచేయించినవైతే ప్రేయసి/ప్రియుడిని ఆశ్చర్యంలోనూ ముంచెత్తొచ్చు, బహుమతి చాలా ప్రత్యేకంగానూ ఉంటుంది.

అందుకే, ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ల వెనుక భాగంలో అంటించే స్టిక్కర్లూ హ్యాండ్‌ బ్యాగులూ కప్పులూ లైట్లూ కొవ్వొత్తులూ కీచెయిన్లూ పెన్‌స్టాండ్లూ లాకెట్లూ తలకు పెట్టుకునే క్లిప్పులూ ఉంగరాలూ... ఇలా ఇప్పుడు ప్రతిదీ ఓ ప్రత్యేకమైన కానుక అయిపోతోంది. ఎఫ్‌ఎన్‌పీ.కామ్‌, ఎగ్జైటింగ్‌లైవ్స్‌.కామ్‌, ఈబే.కామ్‌ లాంటి సైట్లు ఇలాంటి ఎన్నో రకాల బహుమతి ఉత్పత్తుల మీద మనకు నచ్చిన ఫొటోలూ సందేశాన్ని ముద్రించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పిక్‌స్క్వేర్‌.కామ్‌, చాకొలేట్‌మంత్రా.కామ్‌ లాంటి సైట్లు ఆఖరికి చాకొలెట్లూ వాటి పైనుండే ప్యాకింగ్‌ల మీద కూడా ఫొటోలూ శుభాకాంక్షల సందేశాల్ని ముద్రించి ఇస్తున్నాయి. ఎట్సీ.కామ్‌ ‘ఫ్యామిలీఫొటోఫన్‌’ పేరుతో సహజమైన చెట్టు దుంగమీద ఛాయాచిత్రాల్ని ప్రింట్‌ చేసి ఇస్తోంది. ఫొటో ఫ్రేముని మరింత ప్రత్యేకంగా ఎంపికచేసి ఇచ్చే ఈ బహుమతి ఆత్మీయులను ఆకట్టుకోకుండా ఎలా ఉంటుందీ..?

నిజానికి ప్రేమికులు కానుకలు ఇచ్చేందుకు ఫిబ్రవరి 14తో పాటు, పుట్టిన రోజులూ నూతన సంవత్సరం... ఇలాంటివన్నీ వాలంటైన్స్‌ డేతో సమానమే. అందుకే, సందర్భం ఏదైనా మనసైనవారి మదిని దోచుకోవాలంటే కానుక ఇలా ప్రత్యేకంగా ఉండాల్సిందే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.