close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గుర్తుకొస్తున్నాయి...

గుర్తుకొస్తున్నాయి...

బోల్డంత సంతోషం. కాస్తంత విషాదం.చాలా గతం.కించిత్‌ వర్తమానం.
కొత్త చింతపండులో రవ్వంత కారం, చిటికెడు బెల్లం కలుపుకుని... గోళీకాయల్లా గుండ్రంగా చేసుకుని... ఏ ఐస్‌క్రీమ్‌ పుల్లకో గుచ్చుకుని... కొంచెంకొంచెంగా చప్పరించినట్టుండే, ఆ తీయతీయనీ పుల్లపుల్లనీ అనుభూతి పేరు ‘నోస్టాల్జియా!’. ఆ మానసిక స్థితి అటూ ఇటుగా ప్రేమలో పడినంత గాఢంగా ఉంటుంది. అదే మోతాదులో మోహమూ ఉంటుంది. పదేపదే అవే తలపులు, మళ్లీ మళ్లీ అవే దృశ్యాలు. సమూహంలో ఉన్నా ఒంటరిగా ఉన్నట్టుంటుంది. ఒంటరిగా వెళ్తున్నా సమూహంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్దనగారి ‘మనుచరిత్ర’లో ప్రవరుడిలాగా, కాళ్లకు లేపనం పూసుకుని...హఠాత్తుగా సొంతూళ్లొనో, బాల్య స్నేహితుల మధ్యో, ఆత్మీయుల సమక్షంలోనో వాలిపోవాలనిపిస్తుంది. అక్షరాలు దిద్దుకున్న బడి, ప్రసాదం కళ్లకద్దుకున్న గుడి, ఏ జామకాయలో దొంగతనంగా తెంచుకున్న మడి... రోజూ కల్లోకొచ్చి కల్లోలపరుస్తాయి. చిన్నప్పటి నేస్తాలంతా కట్టకట్టుకుని కళ్లముందు నిలబడి ‘పెద్దచెరువులో ఈతకెళ్దాం... వస్తావా?’ అంటూ రెచ్చగొడుతున్న భ్రాంతి. జ్వరమొచ్చినట్టు ఒళ్లు వెచ్చబడి పోవడమూ, తెగ ఆందోళన పడుతున్నట్టు గుండె దడదడా కొట్టేసుకోవడమూ, చిరు చెమటలూ, పరధ్యానం... వగైరా వగైరా లక్షణాలు కనిపించినా కనిపించవచ్చంటారు మానసికవేత్తలు.

పదిహేడో శతాబ్దం నాటి మాట. స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్‌ జోహాన్స్‌ హోఫర్‌ అనే మిలిటరీ డాక్టరుగారి దగ్గరికి కొంతమంది సైనికుల్ని తీసుకెళ్లారు. ‘ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టుంటారు. ఈలోకంతో పనిలేనట్టు వ్యవహరిస్తుంటారు. సందు దొరికితే చాలు, చిన్నప్పటి సంగతులే!’ అంటూ రోగలక్షణాలు ఏకరువుపెట్టారు. ‘ఇదేదో నరాల వ్యాధిలా ఉంది’ అని తేల్చేశారు డాక్టరుగారు. ఇంకో అడుగు ముందుకేసి, కుంగుబాటు తరహా తీవ్ర రుగ్మతని రూఢిచేసిన వైద్య శిఖామణులూ ఉన్నారు.

కాదుకాదు... ఇవేవీ కాదు. ‘నోస్టాల్జియా’ సహజాతిసహజమైన మానసిక స్థితి, గుండెల్లో చెమ్మ ఉన్న ఎవరైనా...ఏదో ఓ సమయంలో, ఏదో ఓ రూపంలో కమ్మని ‘నోస్టాల్జియా’ అనుభూతికి లోనుకావాల్సిందే. ఆ అదృష్టం దక్కకపోతేనే అనుమానించాలి! ఎందుకంటే - జ్ఞాపకాల్లేని బతుకులూ అనుభవాల్లేని జీవితాలూ... రాళ్లూరప్పలే ముళ్లూపొదలే!

గ్రీకు భాషలో...
నోస్టోస్‌ - ఇంటికి తిరిగెళ్లాలన్న.
అల్గోస్‌ - బాధ.
మొత్తంగా, ఇదో ప్రవాస వ్యధ.

ఉపాధి వెతుక్కోడానికో, ఉనికి చాటుకోడానికో వూరి పొలిమేరా దేశ సరిహద్దూ దాటెళ్లినవారిలో ఏదో ఓ సమయంలో మొదలయ్యే మూలాల బెంగ ఇది. ఓ వ్యక్తితోనో, ఓ బృందంతోనో, ఓ వస్తువుతోనో, ఓ సంఘటనతోనో... అందులో ఏ కొన్నింటితోనో, అన్నింటితోనో గత జ్ఞాపకాలు ముడిపడి ఉండవచ్చు. కొందరి విషయంలో - సంపాదనలూ, పదోన్నతులూ, సొంతిళ్లూ, పేరుప్రఖ్యాతులూ... ఆ పరుగంతా ఓ కొలిక్కివచ్చిన తర్వాత ఓమోస్తరు శూన్యం ఆవరించేస్తుంది. మరికొందరి విషయంలో - ఆబగా ఆకాశానికి నిచ్చెనలేస్తున్న వాడిని కాస్తా తీవ్ర వైఫల్యాలో, ఘోర ప్రమాదాలో చొక్కాపట్టుకుని నేలమీదికి లాక్కొస్తాయి. అప్పుడే, బంధాల్లోని డొల్లతనాలూ బయటపడతాయి. నిన్నటిదాకా గొప్పగా అనిపించినవీ, మహాద్భుతంగా తోచినవీ కృతకమేనన్న సత్యం బోధపడుతుంది. ఆ దెబ్బకు, మందలోంచి వేరుపడిన మేకపిల్లలా బెంబేలెత్తిపోతారు. ‘నోస్టాల్జియా’ ఆ శూన్యాన్ని భర్తీ చేస్తుంది. అదెలా అంటే, నిన్నటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు అనుభవాల్ని మరిపిస్తాయి. గతంలోని అనుబంధాలు వర్తమానంలోని ఒంటరితనాన్ని ఓడగొడతాయి. ఫలితంగా, ఆత్మన్యూనతలూ ప్రేమరాహిత్యాలూ పటాపంచలైపోతాయి. సమస్యల్నీ సవాళ్లనీ ఎదుర్కొనే కొత్తసత్తువ సొంతమవుతుంది. నోస్టాల్జియా - ఓ జ్ఞాపకాల చికిత్స, గతానుభూతుల వైద్యం. అమ్మకొంగు లాంటి, నాన్న కండువా లాంటి, ఫ్రెండుగాడి భుజం లాంటి... ఆ ‘ఫ్లాష్‌బ్యాక్‌’ వ్యవస్థను సృష్టికర్త మనిషి బుర్రలో ఓ మూలన సృష్టించిపెట్టాడు. ‘కుంగుబాటునూ, ఒంటరితనాన్నీ అధిగమించడానికి మెదడు ఏర్పాటు చేసుకున్న రోగ నిరోధక వ్యవస్థ ఇది’ అంటారు పరిశోధకులు. ఇదో మానసికమైన విటమిన్‌ బిళ్ల. వర్తమానం ఘోరంగా ఉన్నప్పుడు, గతంలోని బంగారు ఘడియల్ని నెమరేసుకోవడం ద్వారా మనసు బలాన్ని కూడగట్టుకుంటుంది. వెనక్కి వెళ్లడం అంటే, గతమనే గోడచాటున నిలబడి వర్తమానాన్ని తప్పించుకునే ప్రయత్నం కానేకాదు. ఆమాటకొస్తే, లక్ష్యం మీద దాడికి ముందు అంతటి సింహం కూడా ఓ అడుగు వెనకేస్తుంది. ఒక చూపు వెనక్కి మళ్లిస్తుంది.

వీడని నీడ...
ప్రభుత్వ పాఠశాల.
పాతకాలం నాటి ఇల్లు.
ఇరుకిరుకు వీధి.
పొలానికెళ్తున్న రైతులు.
రచ్చబండ సమావేశాలు.

- ఇవన్నీ ఓ వ్యాపారవేత్త బాల్య జ్ఞాపకాలు, పుట్టిపెరిగిన పల్లె దృశ్యాలు. ఇటీవలే కోట్లకు కోట్లు కుమ్మరించి కూతురి వివాహాన్ని ఘనంగా జరిపించాడాయన. సినిమా పరిశ్రమ నుంచి మేటి కళా దర్శకుడిని పిలిపించి మరీ, కల్యాణమండపంలో తన బాల్యస్మృతుల్ని పునర్నిర్మించాడు. ఇదంతా చూసి ‘రాజకీయాలూ, వ్యాపారాలూ, చట్టపరమైన చికాకులూ...ఇలా అనేకానేక అనుభవాలతో కరుడుగట్టిపోయిన ఆ పక్కా కరెన్సీ మనిషిలో ఇంత సున్నిత కోణం ఉందా?’ - అని ఆయన్ని బాగా ఎరిగినవాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ‘నోస్టాల్జియా’ ఎవర్నీ వదిలిపెట్టదు. ప్రతి మనిషిలోనూ ఓ పసివాడు ఉంటాడు. పరిగెడుతున్న రైలుబండిలోంచి ప్రపంచాన్ని చూస్తున్నట్టు...వర్తమానమనే గవాక్షంలోంచి గతంలోకి తొంగిచూడాలని ఉబలాటపడుతుంటాడు. ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోడు. మనలోని ఆ మానసిక స్థితి కారణంగానే... వీధిలో కనిపించే పీచుమిఠాయి కుర్రాడు బాగా పరిచయమున్నట్టు అనిపిస్తాడు. బాల్యస్మృతుల్లో వాడో పాత్ర! సైకిలు టైరు దొర్లించుకెళ్తున్న పిల్లాడు మన కార్బన్‌కాపీలా కనిపిస్తాడు. అయినా ఒక రోజుతోనో, ఒక అనుభవంతోనో ఎండిపోయే జ్ఞాపకాల చెలమా ఇది! వూరుతూనే ఉంటుంది, వూరిస్తూనే ఉంటుంది. వద్దని అడ్డుకట్ట వేయకపోతే చాలు.

రమణారావు పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి. హెచ్‌ఎంటీ తయారీ ‘జనతావాచీ’ అంటే ఆయనకు ప్రాణం. అందుకో కారణం ఉంది. జనతా వాచీనే తొలిసారిగా మణికట్టుకు పెట్టుకుని, మహాగర్వంగా వీధుల్లో వూరేగాడు. ఒక్కరైనా ‘టైమెంత?’ అని అడక్కపోతారా అన్న ఆశతో మళ్లీ మళ్లీ అవే వీధుల్లో చక్కర్లుకొట్టాడు. పదోతరగతి ఫస్టున పాసైనందుకు నాన్నిచ్చిన కానుక అది. మళ్లీ ఇప్పుడు, ఇన్నేళ్ల తర్వాత అచ్చంగా అలాంటి నీలంరంగు గడియారాన్ని ధరించాలన్న కోరిక పుట్టింది. కనిపించిన ప్రతి షోరూమ్‌లోనూ వాకబు చేశాడు. నేరుగా కంపెనీ వాళ్లకూ ఉత్తరం రాశాడు. ఎలాంటి స్పందనా కనిపించలేదు. ‘అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఈ బ్రాండు వాచీనే పెట్టుకునేవారు. ఎలాగైనా సరే, అలాంటిదే మరొక్కటి కొనాలని నా కోరిక. ఇదంతా ఈతరానికి నవ్వులాటగా అనిపించవచ్చు. అయినా నేను పట్టించుకోను. నా బాల్యంతో, నా జ్ఞాపకాలతో ముడిపడిన విషయమిది’ అంటాడాయన ఉద్వేగంగా. అంతలోనే, ఆ గడియారాల ఉత్పత్తిని ఆపేస్తున్నట్టు హెచ్‌ఎంటీ ప్రకటించింది. ముంబయిలో మాత్రమే దొరుకుతున్నాయని ఎవరో చెబితే, ఆదరాబాదరాగా బయల్దేరాడు. ‘అరే! ఇంతకుముందే ఎవరో వచ్చి, ఏకంగా డెబ్బై వాచీలు కొనుక్కుని వెళ్లిపోయారు...’ అని తాపీగా జవాబిచ్చారు సిబ్బంది. ఆ కొన్న పెద్దమనిషి చిరునామా కోసమూ ప్రయత్నించాడు. దొరకలేదు. అయినా రమణారావు ఆగిపోలేదు. ఆ ప్రయత్నంలో అలసట లేదు, ఆనందం ఉంది. పాత అనుభవాల వేట లేకపోతే, ఆ ఆరుపదుల పెద్దమనిషి మనసునూ వృద్ధాప్యం కమ్మేసేది. ఆ అన్వేషణ వయోధికుల మెదడుకు వ్యాయామంలా పనిచేస్తుంది. గతాన్ని తవ్వుకుంటూ, నవ్వుకుంటూ హాయిగా రోజంతా గడిపేస్తారు. ఆ శక్తినే ఇంకాస్త సమర్థంగా ఉపయోగించుకుంటూ... ఎంఏ పట్టా సాధించాలన్న చిన్నప్పటి కలనూ, గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాలన్న పసితనపు ఆశనూ నిజం చేసుకుంటున్నవారూ ఉన్నారు.

అనుభూతుల యాత్రాస్థలి
చుట్టుపక్కలన్నీ... పాప్‌ మ్యూజిక్‌తో కుర్రకారుకు గాలమేసే పబ్బులూ, ప్రపంచంలోని రుచులన్నీ వండి వడ్డించే ఖరీదైన రెస్టరెంట్లూ. అయితేనేం, దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఇండియన్‌ కాఫీ హౌస్‌కు మాత్రం గిరాకీ తగ్గలేదు. నిత్యం సందడిగా ఉంటుంది. కాకపోతే, బట్టతలలూ బోసినవ్వుల ‘సీనియర్‌’ కస్టమర్లే ఎక్కువ. కాసేపు కబుర్లు చెప్పుకుని ఘుమఘుమలాడే కాఫీ తాగెళ్లడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒంటరిగా కొందరూ, బృందాలుగా కొందరూ, ఒంటరిగా వచ్చి బృందాల్లో చేరిపోతూ మరికొందరూ. కొన్నిసార్లు ఆ పెద్దల వెంట కుర్రాళ్లూ వస్తారు. అలాంటప్పుడు కబుర్లన్నీ ఏకపక్షమే. ‘ఇదిగో ఈ మూలనే కూర్చునేవాళ్లం. షేక్స్‌పియర్‌ సాహిత్యం గురించీ, ఠాగోర్‌ గీతాంజలి గురించీ, రాజ్‌కపూర్‌ హావభావాల గురించీ ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్లమో. అప్పట్లో నాయర్‌ అనీ, రామస్వామి నాయర్‌ అనుకుంటా ఓ వెయిటర్‌ ఉండేవాడు. వాడికి మహా చెముడు...’ - అదో మాటల ప్రవాహం! మసాలా దోసె చల్లారిపోతుంది, కాఫీ మీగడకట్టిపోతుంది. అయినా, కబుర్లు మాత్రం ఆగవు. నిజానికి, కాఫీ ఓ సాకు మాత్రమే. వాళ్లంతా జ్ఞాపకాల్ని నెమరేసుకోడానికే వస్తారు. హోటలు యాజమాన్యానికి కూడా విషయం తెలుసు. కాబట్టే, సిబ్బందికి ఒకప్పటి యూనిఫామ్‌నే కొనసాగిస్తున్నారు. కప్పులూ సాసర్లూ కాఫీ యంత్రాలూ తరాలనాటివే. అక్కడ కూర్చుంటే, కాలయంత్రమెక్కి మూడునాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోవచ్చు. ఆ మేరకు మానసికంగా, ఓ పాతికేళ్ల వయసూ తగ్గించుకోవచ్చు. అయినా...పేరు మారవచ్చు కానీ, ప్రతి వూళ్లొనూ ఇలాంటి అడ్డా ఒకటి ఉండే ఉంటుంది. అక్కడ నోస్టాల్జియాలు అగరొత్తుల ధూపంలా గుబాళిస్తూనే ఉంటాయి.

ఎక్కిదిగిన చెట్లూ, పరుగులుపెట్టిన చెరువుగట్లూ, కబుర్లు చెప్పుకున్న గుడిమెట్లూ... ప్రతీదీ ఓ పర్యటక కేంద్రమే. జ్ఞాపకాల్ని ఏతమేసితోడే ఆ యాత్రాస్థలాల్ని చూసిరావాలని నోస్టాల్జియా ప్రేమికుల మనసు తహతహలాడుతూ ఉంటుంది. కాబట్టే, పండగ పబ్బాలకూ జాతర్లూ ప్రభలకూ ప్రవాసులంతా పల్లెలవైపు ప్రయాణం కడతారు. సంక్రాంతి అచ్చమైన నోస్టాల్జియోత్సవం! భారత రాష్ట్రపతి ప్రణబ్‌బాబు కూడా ‘ఎస్‌...ఐయామ్‌ సఫరింగ్‌ ఫ్రమ్‌ నోస్టాల్జియా’ అని ఒప్పేసుకున్నారోసారి. ఏటా దసరా నవరాత్రులకు ముందు ఆయన ఒళ్లు నోస్టాల్జియాతో వెచ్చబడిపోతుంది. దానికి మందు సొంతూరి ప్రయాణమే.

రాజేశ్‌పల్టాది మరో ‘టైపు’ నోస్టాల్జియా జ్వరం. రాజేశ్‌ కుటుంబానికి దిల్లీలో టైపురైటర్ల వ్యాపారం ఉండేది. బాల్యం నుంచీ వాటిమధ్యే పెరిగాడు. ఆ టకటకల్ని వింటే చాలు, ఏ కంపెనీ తయారీ అన్నది చెప్పేయగలడు. లోటుపాట్లన్నీ విప్పేయగలడు. టైపురైటర్ల తరం అంతరించాక...మనసు చంపుకుని, చాలా సరుకును తూకానికి అమ్మేశాడు. విదేశాల్లో టైపురైటర్ల మ్యూజియాలు ఉన్నాయని ఎవరో చెప్పాక కానీ...భారతదేశంలోనూ అలాంటిది ప్రారంభించాలన్న ఆలోచన రాలేదు. తన దగ్గర ఉన్నవాటి దుమ్ముదులిపి ముస్తాబు చేశాడు. ఎవరిదగ్గర పాత టైపురైటర్లు ఉన్నాయని తెలిసినా, వెళ్లి కొనడం మొదలుపెట్టాడు. అలా, బోలెడన్ని అరుదైన రకాలు సేకరించాడు. ఆశ్చర్యం ఏమిటంటే, దాచుకోడానికే కాదు వాడుకోడానికి కూడా తమకో టైపురైటరు కావాలంటూ వచ్చేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు కీలకమైన డాక్యుమెంట్ల తయారీ కోసం టైపురైటర్లనే ఉపయోగించాలని నిర్ణయించాయి. కంప్యూటర్లో అయితే, ఆ సమాచారం తస్కరణకు గురైపోయే ప్రమాదం ఎక్కువ. ఇక్కడా ఇబ్బంది ఉండదు. అదంతా చూశాకే ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ - అని ‘పాత’ బల్లగుద్ది చెబుతున్నాడు రాజేశ్‌.

‘నోస్టాల్జియా’ ఉత్పత్తుల విషయంలో బేరాలకు ఆస్కారం తక్కువనీ ఖాతాదారులు ఓ రూపాయి ఎక్కువ చెల్లించి అయినా కొనేస్తారనీ ఆర్థిక-మానసిక నిపుణులు తేల్చి చెబుతున్నారు. ‘వెస్పా’ సరిగ్గా ఈ సూత్రాన్నే మార్కెట్‌ వ్యూహంగా మార్చుకుంది. కొన్ని దశాబ్దాల తర్వాత, దాదాపుగా అదే డిజైన్‌తో మళ్లీ మార్కెట్‌లోకి వచ్చిన ఆ బండిని... నడివయసువాళ్లంతా ఎగబడి కొన్నారు. మిగతా వాహనాలతో పోలిస్తే ధర కాస్త ఎక్కువైనా కూడా! పాత రోజుల్లో ‘వెస్పా’ స్కూటరు ఓ స్టేటస్‌ సింబల్‌. అనేకానేక కారణాలతో ఆ దర్జాను అనుభవించలేకపోయినవారూ, అనుభవించినా మళ్లీ మళ్లీ అనుభవించాలని తహతహలాడేవారూ పాత డిజైన్‌లోని కొత్త బండి కోసం వరుసలు కట్టారు. తూగుటుయ్యాలలూ, భోషాణాలూ, భారీ సింహద్వారాలూ, కళాత్మకమైన పడక్కుర్చీలూ వగైరా వగైరా తాతలనాటి గృహోపకరణాల నమూనాల్నీ ‘నోస్టాల్జియా ఫర్నిచర్‌’ పేరుతో విక్రయిస్తున్నాయి అనేక సంస్థలు. శీతలపానీయ సంస్థ కోకకోలా ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం ఆపేసిన ఓ ఉత్పత్తిని ఆ‘పాత’ కస్టమర్ల కోరిక మేరకు మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చింది. నలుపు-తెలుపు ఫొటోల్లోని నానమ్మ నగల్ని ఇష్టపడటం కూడా ఓ నోస్టాల్జియానే. ‘పరంపర’ కలెక్షన్‌ పేరుతో ఓ ఆభరణాల తయారీ సంస్థ ఆ పాతమోజును తీరుస్తోంది. ఆ వ్యూహం ప్రకటనల దగ్గరే మొదలైంది.

ఉన్న సమయమే, అరవై సెకెన్లు. ఆ కాసేపట్లోనే, చెప్పాల్సిందంతా చెప్పేయాలి. టీవీ కట్టేశాక కూడా ఆ ఆలోచనలు వెంటాడేలా కనికట్టేదో చేసెయ్యాలి. ఆలోచనల దగ్గరే ఆగిపోకుండా... దుకాణానికెళ్లి ఆ ఉత్పత్తిని సొంతం చేసుకునేలా ఉసిగొల్పాలి. ఇన్ని అద్భుతాలు చేయించగలశక్తి ‘నోస్టాల్జియా’కే ఉంది. కాగితం పడవ కమ్మని బాల్య జ్ఞాపకం. ఆ మాట వినిపించినా, మనసు బాల్యం వైపు పరుగులు తీస్తుంది. కాకెంగిలిలా, ఇసుకగూడులా ఇట్టే మరువలేని పదమది. కాబట్టే జల్‌జీరా, పానకం తదితర సంప్రదాయ పానీయాల వ్యాపారంలో అడుగుపెట్టిన ఓ అంకుర సంస్థ తమ ఉత్పత్తికి ‘పేపర్‌బోట్‌’ అని పేరు పెట్టింది. ఆ నోస్టాల్జియా వ్యూహం విజయవంతమైందని చెప్పడానికి వాటి అమ్మకాలే సాక్ష్యం. తాతయ్య గుండెల మీద కూర్చుని కథలు వినే మనవడూ, అత్తరుపూసిన రబ్బరుతో పెన్సిలు గీతల్ని శుభ్రంగా తుడిచేసి తన్మయంగా పుస్తకాన్ని వాసనచూసే పసిపిల్లా, వర్షంలో చిందులేసే చిన్నారులూ... పేపర్‌బోట్‌ ప్రకటనల్లో కనిపిస్తారు, అచ్చంగా మనందరి బాల్యానికి ప్రతినిధుల్లానే అనిపిస్తారు. ‘డ్రింక్స్‌ అండ్‌ మెమొరీస్‌’ ఆ ఉత్పత్తుల నినాదం.

ముసుగుల్ని తొలగిస్తుంది...
బోర్డు మీటింగుకైనా డుమ్మా కొడతారు, దగ్గరి బంధువుల పెళ్లికి సైతం గైరుహాజరు అవుతారు, రాకరాక వచ్చిన విదేశీ అవకాశాన్నీ గడ్డిపోచలా చూస్తారు. కానీ, పూర్వవిద్యార్థుల సమావేశం అంటే మాత్రం - ఎన్ని పన్లున్నా పక్కనపెట్టి, హుషారుగా బయల్దేరతారు. ఆ ఆరాటం వెనకున్న బలమైన కారణం - నోస్టాల్జియా! బాల్యమంటే, కల్లాకపటంలేని తనం. వయసు పెరిగేకొద్దీ బాధ్యతలు అధికమయ్యేకొద్దీ మనసు మీద ముసుగుపొరలు పేరుకుపోతాయి. రానురానూ అవి, మందపాటిగా మారిపోతాయి. దీంతో స్పందన ఆగిపోతుంది. చిన్నప్పుడు, ఆకాశంలోంచి చినుకుపడినా మురిసిపోయినవాళ్లం కాస్తా, కొమ్మ మీద సీతాకోకచిలుక వాలినా అబ్బురపడినవాళ్లం కాస్తా, ‘క్వైట్‌ నేచురల్‌...’ అనుకునేంత స్పందన రాహిత్యస్థితికి చేరుకుంటాం. కాబట్టే, జేబులో రూపాయి బిళ్ల పెట్టుకున్నప్పుడున్న భరోసా, కోటి రూపాయలు సంపాదించినప్పుడూ ఉండదు. ఏదో భయం, తెలియని అభద్రత. ముసుగు తెచ్చిన ముప్పులే ఇవన్నీ. ఎండకు లోటాలోని ఐస్‌క్రీము కరిగిపోయినట్టు - బాల్యజ్ఞాపకాల్లోకి వెళ్లగానే ఆ అహమంతా ఆవిరైపోతుంది. ఐస్‌క్రీమ్‌ పుల్లలా... మనలోని మనం మాత్రమే మిగిలిపోతాం. కాబట్టే, పూర్వ విద్యార్థుల సమావేశంలో - ‘బడి కూలిపోడానికి సిద్ధంగా ఉంది. పది లక్షలు పెట్టి కొత్త భవనం కట్టిద్దాం...’ అన్న ప్రతిపాదన రాగానే ‘నావంతుగా ఓ లక్ష’ అంటూ నిస్సంకోచంగా మద్దతు ఇచ్చేస్తారు. పంద్రాగస్టు కోసమని బడికి సున్నాలేసిన రోజులూ, రాత్రంతా మేల్కొని గోడలకి రంగు కాగితాలు అతికించిన అనుభవాలూ బాధ్యతను గుర్తుచేస్తాయి. ¶‘నోస్టాల్జియా’ సామాజిక సంబంధాల్నీ బలోపేతం చేస్తుంది. డబ్బు మీద మితిమీరిన మమకారానికి కారణం మనిషిలోని అభద్రతే, కష్టకాలంలో ఎవరూ సాయపడరన్న భయమే. చుట్టూ అంతమంది ఆత్మీయులు కనిపిస్తున్నప్పుడు, అంతా తనవాళ్లే అనిపిస్తునప్పుడు... ఆ అపోహలన్నీ దూదిపింజలై ఎగిరిపోతాయి. చిన్నప్పుడు రెండు గిన్నెల జర్మన్‌ సిల్వర్‌ క్యారేజీలోని అరిసెల్నీ, అటుకుల్నీ నేస్తాలతో పంచుకున్నట్టు, సంపాదనలోనూ బడికో, గుడికో వాటా ఇవ్వాలనిపిస్తుంది. ‘నోస్టాల్జియా’ ప్రేరణతో సొంతూళ్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నవారూ ఆసుపత్రులు నిర్మిస్తున్నవారూ, ఏకంగా పల్లెనే దత్తత తీసుకుని సర్వతోముఖంగా తీర్చిదిద్దుతున్నవారూ ఎంతోమంది.

* * *

గుర్తుకొస్తున్నాయా, గుర్తుకొస్తున్నాయా! ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలూ నిద్రలేస్తున్నాయా! మొదట చూసిన టూరింగ్‌ సినిమా, మొదట మొక్కిన దేవుడి ప్రతిమా...రేగు పళ్లకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ...కోతికొమ్మలో బెణికిన కాలూ, మేక పొదుగులో తాగిన పాలూ.... దొంగచాటుగా కాల్చిన బీడీ, సుబ్బుగాడిపై చెప్పిన చాడీ, మోటబావిలో మిత్రుడి మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం... ప్రతీ జ్ఞాపకాన్నీ పుస్తకంలోని నెమలీకంత జాగ్రత్తగా పదిలపరుచుకోండి. వీలైతే ఆ మూలాలతో పాత అనుబంధాన్ని పునరుద్ధరించుకోండి. మెదడు హార్డ్‌డిస్క్‌ నిండిపోతుందేమో అని కక్కుర్తిపడి డిలీట్‌ చేసేస్తే మాత్రం... జీవితానుభూతి నిండుకుపోతుంది!

నోస్టాల్జియా మైనస్‌ జీవితం = ఫొటోల్లేని ఆల్బమ్‌, సిరాచుక్క తాకని డైరీ.

 

ఎంతో రుచిరా... 

మ్మదనానికి నోస్టాల్జియా తోడైతే మరింత మజా వస్తుంది. పుల్లారెడ్డి మిఠాయిలూ, అంబాజీపేట పొట్టిక్కలూ, ఒంగోలు మస్తాన్‌ ఇడ్లీ... మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తిన్నా, అంత కమ్మగా అనిపించడానిక్కారణమూ అదే. రోటిపచ్చడి రుచి కూడా ఓరకమైన నోస్టాల్జియానే. ఓ పెద్దమనిషి ఈమధ్య ‘సేవ్‌ రోటిపచ్చడి’ అంటూ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. సువాసనలూ మనిషిని నోస్టాల్జియా వైపు లాక్కెళ్లగలవని పరిశోధనలు కూడా నిర్ధరించాయి.

ఇట్లు ప్రేమతో.... 

గృహప్రవేశానికో, షష్ఠిపూర్తికో బంధుమిత్రులకు బహుమతి తీసుకెళ్లేముందు...ధర గురించో, ఉపయోగం గురించో మాత్రమే ఆలోచిస్తాం. మహా అయితే ఆ వస్తువు ఆ వ్యక్తికో కుటుంబానికో ఏ మేరకు ఉపయోగపడుతుందన్నదీ దృష్టిలో ఉంచుకుంటాం. ఇది కాదు, బహుమతిని ఎంచుకునే పద్ధతి. ఆ కానుకని అందుకోగానే ఆ కళ్లలో మెరుపు మెరవాలి. ఆ మొహంలో ఆశ్చర్యమూ ఆనందమూ కవలలై కేరింతలేయాలి. ఇదంతా ఖరీదుతో సాధ్యమయ్యేది కాదు. నోస్టాల్జియాతోనే వీలవుతుంది. చిన్నప్పుడు ‘చందమామ’ పత్రికని మహా ఇష్టంగా చదివిన నేస్తానికి పాత చందమామ పత్రికల బైండును (పాత పుస్తకాల దుకాణాల్లో దొరుకుతున్నాయి) బహుమతిగా ఇవ్వవచ్చు. చిన్నప్పటి ఫొటోల్ని సేకరించి ఓ ఆల్బమ్‌లా తయారు చేసి ఇవ్వవచ్చు. తనకి చెప్పకుండా, ఇష్టమైన మేస్టారిని కార్యక్రమానికి తీసుకెళ్లి అబ్బురానికి గురిచేయవచ్చు. మనసుంటే, బోలెడు మార్గాలు!

పాత పాటలు...

కొందరికి పాత పాటలంటే ప్రాణం. అందుకు, సాహిత్యమూ సంగీతమే కాదు...ఆ సినిమాతో ముడిపడిన నోస్టాల్జియా కూడా కారణం కావచ్చు. ‘మాయాబజార్‌’ పాట వినిపించగానే...కరపత్రాల్ని పంచుతూ ఇంటిముందు నుంచి వెళ్తున్న సినిమా బండి గుర్తుకు రావచ్చు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలోని పాట అనగానే...కళ్లింతలు చేసుకుని తొలిసారిగా సినిమాస్కోప్‌ చిత్రాన్ని చూసిన జ్ఞాపకం తలపునకు రావచ్చు. బడి ఎగ్గొట్టి వెళ్లిన అనుభవాలూ, టూరింగ్‌ టాకీసులో నేల మీద కూర్చున్న గుర్తులూ... ఇలా నచ్చిన ప్రతి పాట వెనుకా ఏదో ఓ కథ ఉండి తీరుతుంది. పాశ్చాత్య సంగీతమంటే చెవికోసుకునే వారి కోసం ‘నోస్టాల్జియా మెషీన్‌’ అనే వెబ్‌సైట్‌ ఉంది. అందులోకెళ్లి...1950 నుంచి నిన్నమొన్నటి దాకా ఏ సంవత్సరాన్ని ఎంచుకున్నా - ఆ ఏటి మేటి సంగీతం సాక్షాత్కరిస్తుంది. ఎవరైనా తెలుగులోనూ ఆ ప్రయత్నం చేస్తే బావుండు.

‘నిన్నటి...’ సాహిత్యం!

ర్కే నారాయణ్‌ ‘మాల్గుడి డేస్‌’ పుస్తకాన్ని ఇప్పటికీ చదువుతున్నవారూ, సీరియల్‌ను యూట్యూబ్‌లో చూస్తున్నవారూ అనేకం. అదో నోస్టాల్జియా ఖజానా. ఆ పాత్రలూ ఆ వాతావరణం వెనక్కి తీసుకెళ్తాయి. కొన్ని వేలమందిని ప్రభావితం చేసిన మహాత్ముడి ‘సత్యశోధన’ గతానుభవాల సమాహారమే. ఇక తెలుగు సాహిత్యంలో...అపార ప్రజాదరణ పొందిన రచనలన్నీ దాదాపుగా ‘నోస్టాల్జియా’తో ముడిపడినవే. శ్రీపాదవారి ‘అనుభవాలూ జ్ఞాపకాలూ’; తిరుమల రామచంద్ర ‘హంపీ నుంచి హరప్పాదాకా’; బాపు-రమణల ‘కోతికొమ్మచ్చి’, ‘ఇంకోతికొమ్మచ్చి’, ‘ముక్కోతి కొమ్మచ్చీ’; ఆచంట జానకీరామ్‌ ‘నా స్మృతిపథంలో’; బుచ్చిబాబు ‘నా అంతరంగ కథనం’ .. ఆ జాబితా చాలా పెద్దదే. అప్పట్లోనే ఆదిభట్ల నారాయణదాసు ‘నా ఎరుక’ అంటూ తన జ్ఞాపకాలకు చిక్కని గ్రాంథిµకంలో చక్కని రూపమిచ్చారు. చలం మ్యూజింగ్స్‌లోనూ, ప్రేమలేఖల్లోనూ నోస్టాల్జియా దోబూచులాడుతుంది. సంజీవదేవ్‌ జ్ఞాపకాలూ మహాసుకుమారంగా ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.