close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతి అవసరానికీ ఓ ఆప్‌!

ప్రతి అవసరానికీ ఓ ఆప్‌!

స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ మొబైల్‌ అప్లికేషన్లకూ డిమాండ్‌ పెరుగుతోంది. మన దైనందిన అవసరాలను తీర్చుతూ, జీవనశైలిని సులభం చేసే ఆప్‌లు చాలా వస్తున్నాయి. అలాంటి ఆప్స్‌లో ఇవి కొన్ని!

 

ప్రకటనే రింగ్‌టోన్‌

 

మీ రింగ్‌టోన్‌ని మార్చుకోగలిగితే మీకు రోజూ కొంత డబ్బు వస్తుంది తెలుసా! అందుకు సిద్ధమనుకుంటే paytunesఆండ్రాయిడ్‌ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ ఆప్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ని వాణిజ్య ప్రకటనగా మార్చేస్తుంది. ఫోన్‌ వచ్చినపుడు రింగ్‌టోన్‌ బదులుగా ప్రకటనలు వస్తాయన్నమాట. ఆ ప్రకటనలు విన్న ప్రతిసారీ మనకి కొన్ని పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లతో మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వస్తువుని కొనుక్కోవచ్చు. వినడానికి చాలా వింతగా ఉంది కదా! ఇలా రింగ్‌టోన్లో ప్రకటనలు వినిపించే తొలి ఆప్‌ ఇదే. దీన్ని అభివృద్ధి చేసింది భారతీయులే!

లెక్కల మాస్టారు

న్నిసార్లు చేసినా కొన్ని లెక్కల చిక్కులు అంత సులభంగా వీడవు. అలాంటపుడు లెక్కల మాస్టారులా సాయపడే ఆప్‌photomath. దీన్లో ప్రధానంగా పోటీ పరీక్షల్లో వచ్చే గణిత విభాగాలు ఉంటాయి. అలాంటి ప్రతి లెక్కకూ దీన్లో సమాధానం తెలుసుకోవచ్చు. ఈ ఆప్‌ద్వారా పుస్తకంలోని లెక్కని ఫొటోతీసి అప్‌లోడ్‌ చేస్తే దాని జవాబు మనకు కనిపిస్తుంది. జవాబు మాత్రమే కాదు, ఆ సమస్యని సాధించే విధానాన్నీ చూపుతుంది. ఆప్‌ద్వారా అప్పటివరకూ మనం చేసిన పాత లెక్కల సమాచారమూ అందులో ఉంటుంది.

ఫోన్‌చేసి నిద్రలేపుతారు

మామూలుగా ఫోన్లో అలార్మ్‌ పెట్టుకున్నపుడు ఆ సమయానికి ఏదో ఒక ట్యూన్‌ వినిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి మనకు ఫోన్‌చేసి నిద్రలేపేలా ఏర్పాటుచేసే ఆప్‌ ఒకటుంది... అదేwakie. దీన్ని ‘సోషల్‌ అలార్మ్‌ క్లాక్‌’గా చెబుతున్నారు ఈ ఆప్‌ డెవలపర్స్‌. వేకీ ఆప్‌లో అలార్మ్‌ పెట్టుకుంటే ఆ సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఆ ఆప్‌ వినియోగిస్తున్న వారిలో ఒకరికి వెళ్తుంది. వారు ఆ సమయానికి మీకు ఫోన్‌చేసి నిద్రలేపుతారు. ఆ కాల్‌ ఒక నిమిషంపాటు మాట్లాడేలా ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరన్నది మాత్రం చెప్పరు. కాకపోతే ఏ దేశం నుంచి వారు ఫోన్‌చేస్తారో ఆ దేశం జెండా కనిపిస్తుంది. సాధారణ అలార్మ్‌ గొంతు నొక్కేసి మంచం దిగనివారికి ఇది మంచి పరిష్కారం కదా!

వాడుకని చెప్పేస్తుంది!

ఫోన్‌తో ఎక్కువ సమయం గడపొద్దనుకుంటాం. కానీ ఫోన్లో తలదూర్చామంటే తెలియకుండానే నిమిషాలూ, గంటలూ గడిచిపోతాయి. అసలు ఫోన్‌ని ఏ పనికోసం ఎంత సమయం వాడుతున్నామన్న విషయాన్ని గమనిస్తే ఎక్కడ సమయం వృథా చేస్తున్నామో అర్థమైపోతుందిగా! అందుకోసం వచ్చిందే sapience buddy ఆప్‌. ఫోన్‌తో మనం ఎంత సమయం గడుపుతున్నదీ, ఏ ఆప్‌కి ఎంత సమయం కేటాయిస్తున్నదీ ఇది చెప్పేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌... మూడింటిపైనా ఈ ఆప్‌ పనిచేస్తుంది. ఈ ఆప్‌ని ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లకూ వినియోగించుకోవచ్చు.

ఉద్యోగి నేస్తం

ద్యోగులకు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సమావేశాలూ, అపాయింట్‌మెంట్లూ, ఫైళ్లు పంపడం, తీసుకోవడం... ఆ జాబితా చాలా పెద్దదే. ఇలాంటి వృత్తిపరమైన అవసరాల్ని తీర్చడంలో ముందుంటుంది Evernote. దీన్లో రోజూ పూర్తి చేయాల్సిన పనుల జాబితా రాసుకోవచ్చు, భవిష్యత్తు సమావేశాల్ని నోట్‌చేసి పెట్టొచ్చు. వాటిని గుర్తుచేసే విధంగా అలార్మ్‌ పెట్టుకోవచ్చు. వాయిస్‌ని రికార్డు చేసుకోవచ్చు. ఫొటోలు తీసి దాచుకోవచ్చు. బిజినెస్‌ కార్డు, పాంప్లెట్‌లను ఫొటో తీసి దీన్లో పెట్టుకున్నాక వాటిపైన పదాలను సెర్చ్‌ చేసినా అవి కనిపించే ‘ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌’ సాంకేతికత ఉంటుంది. పనికి సంబంధించిన అంశాల్ని చాట్‌ చేసుకునే ఏర్పాటూ ఉంది.

నిద్ర పుచ్చుతుంది సంగీతంతో

నసుకు హాయిగొలిపే సంగీతం వినిపిస్తూ నిద్రపుచ్చే ఏర్పాటు ఉంటే ఎంత బావుంటుందో... అన్న ఆలోచనల్లోంచి పుట్టిందే prizz ఆప్‌. సుతారమైన సంగీత వాద్యాలకు ప్రకృతిలోని కొన్ని సహజమైన శబ్దాలను జోడించి జోలపాటగా వినిపిస్తుందీ ఆప్‌. ఎంతసేపు ఆ సంగీతం రావాలనేది ఆప్‌లో సెట్‌చేసుకోవచ్చు. విన్న ట్యూన్లనే మళ్లీ వినకుండా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన శబ్దాలతో కొత్త ట్యూన్లను ఎంపికచేసుకోవచ్చు. వాన కురుస్తున్న శబ్దం వింటూ నిద్రపోదామనుకేవారికి ‘స్లీప్‌మేకర్‌ రెయిన్‌’ ఆప్‌ ఉపయోగపడుతుంది.


 

ఎనిమిదేళ్లలో రూ.25వేల కోట్లు!

21 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అందరిలానే భవిష్యత్తు పైన బోలెడన్ని ఆశలతో జ్యోతి బన్సల్‌ అమెరికాలో అడుగుపెట్టాడు. కానీ కొందరికే సాధ్యమయ్యేలా అక్కడే ఓ కంపెనీని స్థాపించి ఎనిమిదేళ్లలో దాన్ని ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయలకు ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘సిస్కో’కి అమ్మేశాడు. అలా... మనలో టాలెంట్‌ ఉంటే ఏ చోటైనా ఒకటేనని మరోసారి నిరూపించాడు.

మెరికాలో చదువుకోవాలీ, అక్కడికెళ్లి ఉద్యోగం చేయాలీ... సాధారణంగా మన దేశంలో విద్యార్థుల డాలర్‌ కలలు ఇలానే ఉంటాయి. కానీ పదహారేళ్లక్రితం ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో స్నేహితులంతా ఐదంకెల జీతమిచ్చే సంస్థల్లో ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడుతుంటే, జ్యోతి బన్సల్‌ మాత్రం అలాంటి కంపెనీని పెడతానని చెప్పేవాడు.

* బన్సల్‌ స్వస్థలం రాజస్థాన్‌లోని అజ్మీర్‌ నగరం. తండ్రి వ్యవసాయ పనిముట్లను అమ్మే వ్యాపారం చేసేవాడు. చదువులో చురుగ్గా ఉండే బన్సల్‌ వారాంతాల్లో తండ్రి దుకాణంలో గడుపుతూ వ్యాపార మెలకువల్ని ఒంటబట్టించుకున్నాడు. ఇంటర్‌ పూర్తయ్యే నాటికి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ రంగం రాకెట్‌ వేగంతో దూసుకెళ్తూ ఉద్యోగులకూ, యజమానులకూ కోట్లు కురిపిస్తోందని గ్రహించాడు. ఆ దేశానికి వెళ్లడమే లక్ష్యంగా దిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సంపాదించి, కంప్యూటర్‌ నైపుణ్యం పెంచుకునే పనిలో పడ్డాడు.

* ఐఐటీలో చదువు పూర్తయ్యే నాటికి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లూ, కోడ్‌లూ రాయడంలో పట్టు తెచ్చుకొని, తన నైపుణ్యంతో ఇన్వెస్టర్లను ఆకర్షించి సాఫ్ట్‌వేర్‌ సంస్థను నెలకొల్పే ఉద్దేశంతో బన్సల్‌ అమెరికా బయల్దేరాడు. కానీ అక్కడ నిబంధనల రూపంలో తగిలిన ఎదురుదెబ్బను వూహించలేకపోయాడు. అప్పటి నిబంధనల ప్రకారం అమెరికాలో స్టార్టప్‌ని పెట్టాలంటే కనీసం ఏడేళ్లు అక్కడి సంస్థల్లో పనిచేయాలి. దాంతో చేసేదేమీ లేక మొదట ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగిగా చేరాడు.

* కెరీర్లో ఒక్కో మెట్టూ ఎదుగుతున్నా, తన నైపుణ్యాలని వేరెవరి కోసమో ధారపోస్తున్నాననే బాధ బన్సల్‌ను వేధిస్తుండేది. అయినా నిరుత్సాహపడకుండా ఉద్యోగం చేస్తూనే రాత్రుళ్లు తాను పెట్టబోయే కంపెనీ కోసం సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లు రాసుకునేవాడు. ఏడేళ్ల తరవాత గ్రీన్‌ కార్డు చేతిలో పడ్డ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి కంపెనీ కలను నిజం చేసుకునే పనిలో పడ్డాడు.

* బుర్ర నిండా ప్రణాళికలున్నా వాటిని ఆచరణలో పెట్టడానికి బన్సల్‌ దగ్గర డబ్బులేదు. దాంతో పెట్టుబడుల కోసం సిలికాన్‌ వ్యాలీలో దాదాపు పాతిక వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థల చుట్టూ తిరిగాడు. చివరికి ఒకే ఒక్క సంస్థ స్పందించి, స్టార్టప్‌కి నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చింది. అలా ఎనిమిదేళ్ల క్రితం అమెరికాలో ‘ఆప్‌ డైనమిక్స్‌’ సంస్థకు బన్సల్‌ ప్రాణం పోశాడు. తొలి ఉద్యోగిగా సాఫ్ట్‌వేర్‌ నిపుణుడైన తన స్నేహితుడు సుంకర భాస్కర్‌ని సంస్థలోకి ఆహ్వానించాడు.

* ప్రపంచంలో దాదాపు ఓ మోస్తరు సంస్థలన్నింటికీ మొబైల్‌ అప్లికేషన్లుంటాయి. వ్యాపార మనుగడకూ, వినియోగదారులకి చేరువయ్యేందుకూ ఆప్‌లే కీలకం. కానీ అన్ని సంస్థలకూ పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగా వాటిని నిర్వహించేంత సామర్థ్యం ఉండదు. ఆ డిమాండ్‌ని తట్టుకొని నిలబడలేకపోతే చాలా వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వ్యాపారులకు ఆ కష్టం రాకుండా, తమ క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆప్‌లు సవ్యంగా, వేగంగా పనిచేసేలా చూసే సంస్థే ‘ఆప్‌ డైనమిక్స్‌’. ప్రారంభమైన ఏడాది తరవాత తొలి క్లయింట్‌ని సంపాదించిన ‘ఆప్‌ డైనమిక్స్‌’, రెండు వేలకు పైగా ప్రముఖ కంపెనీలకు సేవలందిస్తోంది. నైకీ, నెట్‌ఫ్లిక్స్‌, హెచ్‌బీవో లాంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి.

* మెరుగైన సేవలతో క్లయింట్ల సంఖ్యతో పాటు మార్కెట్లో తమ స్థాయినీ పెంచుకుంటూ వెళ్లిన బన్సల్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా సేవలందిస్తున్న స్నేహితుడు భాస్కర్‌ సాయంతో దాని మార్కెట్‌ విలువను గతేడాది పదివేల కోట్ల రూపాయల మార్కు దాటించాడు. సంస్థ గాడిలో పడ్డాక డేవిడ్‌ వాద్వాని అనే అనుభవజ్ఞుడికి సీయీవో బాధ్యతలు అప్పగించి తాను ఛైర్మన్‌గా కొనసాగుతున్నాడు. తనలా స్టార్టప్‌లు పెట్టాలనుకున్న కుర్రాళ్లను ప్రోత్సహించేందుకు మెంటార్‌గా మారి మొదట ‘మైండ్‌ టికిల్‌’ అనే భారతీయ స్టార్టప్‌కి దాదాపు 85కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చిపెట్టాడు.

* ‘ఆప్‌ డైనమిక్స్‌’ దూసుకెళ్తున్న సమయంలో సంస్థ షేర్లను అమ్మకానికి పెట్టాలని బన్సల్‌ నిర్ణయించుకున్నాడు. కానీ క్లయింట్లలో ఒకటైన ‘సిస్కో’ ఏకంగా 3.7బిలియన్‌ డాలర్ల(రూ.25వేల కోట్లు)కు దాన్ని చేజిక్కించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఎనిమిదేళ్ల క్రితం చేతిలో రూపాయి లేకుండా బన్సల్‌ మొదలుపెట్టిన ‘ఆప్‌ డైనమిక్స్‌’ ఈ మధ్యకాలంలో అత్యధిక మొత్తానికి అమ్ముడైన భారతీయుడి సంస్థగా గుర్తింపు పొందింది.

* అంత భారీ సంస్థను నడిపిస్తున్నా, వ్యక్తిగత సంతోషాల్ని ఏరోజూ పక్కనపెట్టలేదంటాడు బన్సల్‌. గతేడాది భార్యతో కలిసి భూటాన్‌ ట్రెక్కింగ్‌కి వెళ్లి, ఆపైన ఆఫ్రికాలో సఫారీ పర్యటన చేశాడు. కేవలం రకరకాల వంటకాల రుచి చూడటానికే కోపెన్‌హగన్‌, ఓస్లో, మెక్సికో లాంటి ప్రాంతాల్లో తిరిగాడు. ఇప్పటిదాకా 30 సాఫ్ట్‌వేర్ల పేటెంట్లనూ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.

మరి కొన్ని కంపెనీల్ని మొదలుపెట్టడానికే సంస్థను అమ్మేశానని చెప్పే బన్సల్‌, తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ని త్వరలో భారత్‌లోనే మొదలుపెట్టనున్నాడు. సంస్థను అక్కడ అమ్మేసినా ఆ డబ్బుని మన దేశంలో పెట్టుబడిగా పెట్టడం మనకూ మంచిదే..!


 

అడవి బిడ్డల అక్షర విజయం

తెలుగు భాషలో మాట్లాడ్డం కూడా రాని గిరిజనులు వాళ్లు. కొన్నేళ్ల కిందటి వరకూ వారి పిల్లలకూ చదువనే మాట తెలియదు. అలాంటి వందలమంది పిల్లలు ఇప్పుడు వేదాలూ శ్లోకాలను వల్లె వేస్తున్నారు. ఆంగ్లంలో చదువుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్నది ఒకే ఒక్కరు. ఆయనే త్రిదండి రామానుజ చిన జీయరు స్వామి. ఆయన స్థాపించిన గురుకులం గిరిజన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టి, వసతి కల్పిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతోంది.

నిర్మల్‌జిల్లా అడవుల ఖిల్లాగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఆ అడవుల్లో నివసించే గిరిజనులు మాత్రం సమాజంతో పాటు, అభివృద్ధికీ ఆమడదూరంలో బతుకుతున్నారు. వారిలో గోండ్లు, కొలాం, నాయక్‌పోడ్‌, పర్దాన్‌... ఇలా ఎన్నో తెగలవారు ఉన్నారు. వీళ్లకు తెలుగురాదు. వారు మాట్లాడే భాషకు లిపి ఉండదు. దానికితోడు ఆ కొండ కోనల మధ్య ప్రభుత్వ పాఠశాలలూ సరిగా నడవక అక్కడి పిల్లలు ఇన్నేళ్లుగా చదువుకు దూరంగా ఉండిపోయారు. 2001లో త్రిదండి రామానుజ చినజీయరు స్వామి ఉట్నూరు ప్రాంతంలో పర్యటించినపుడు ఈ గిరిజనుల దీనస్థితి గురించి తెలుసుకున్నారు. అక్కడి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఏదో ఒకటి చెయ్యాలని ఆయన ఆ క్షణంలోనే సంకల్పించారు. అలా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో ప్రారంభమైందే జీయరు గురుకులం. మండల కేంద్రానికి 50కి.మీ దూరంలో పచ్చని కొండలతో అడవిలో ఉంటుందీ గ్రామ పంచాయతీ. దీని పరిధిలో పది గిరిజన గూడేలున్నాయి. రహదారి కూడా లేని అల్లంపల్లికి వెళ్లాలంటే వాగులూ వంకలూ దాటాల్సిందే. అదే అక్కడి పిల్లల చదువుకి ప్రధాన ఆటంకం. అందుకే, అలాంటిచోటే గురుకులాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నారు చిన జీయరు స్వామి. ఆ విషయం తెలిసి కొందరు గ్రామస్థులు అయిదెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అలా 2004లో జీయర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకులం ప్రారంభమైంది.

ఆంగ్లంలో అభ్యాసం
అరవైమందితో ప్రారంభమైన ఈ గురుకులంలో ప్రస్తుతం 530 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో అక్షరాలు దిద్దే వయసు నుంచి పదోతరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అందులో 350 మంది వరకూ ఆశ్రమంలోనే ఉంటారు. వారికి భోజన వసతి సదుపాయాలన్నీ ఉచితమే. బడికి దగ్గరగా ఉండేవాళ్లు గురుకులం వాహనంలో వచ్చి వెళ్తుంటారు. పాఠశాలలో నీతి సూక్తులు గోడలపై చక్కగా కనిపిస్తాయి. ఏడాదికి 20మంది చొప్పున గత మూడేళ్లలో విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా అంతా మొదటి శ్రేణిలోనే ఉత్తీర్ణులవడం విశేషం. ‘ఆంగ్ల మాధ్యమం, కంప్యూటర్‌ పరిజ్ఞానానికి బయట పెరుగుతున్న ఆదరణ కారణంగా నాలుగేళ్ల కిందట ఇక్కడ ఆంగ్ల మాధ్యమాన్నీ కంప్యూటర్‌ తరగతులను కూడా ప్రారంభించాం. కార్పొరేట్‌ విద్యాలయాలకు దీటుగా ఇక్కడి విద్యార్థులకూ ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలూ, నీతి కథలూ నేర్పుతున్నారు మా ఉపాధ్యాయులు. సుమారు 30 మంది వరకూ ప్రతిభావంతులైన ఉపాధ్యాయులున్నారు. పాఠశాలలో రకరకాల సైన్స్‌ పరికరాలతో ల్యాబ్‌, కరెంటు కోత సమస్య లేకుండా ఇన్వర్టర్‌, జనరేటర్లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో పిల్లలకు విద్యాబోధన చేస్తున్నాం. అందుకే వాళ్లూ చక్కగా చదువుతున్నారు’ అంటారు ప్రధానోపాధ్యాయుడు కృష్ణ.

వసతి సదుపాయాలు
గురుకులంలో చదివే పిల్లలు ఉండేందుకు అన్ని సౌకర్యాలతో గదులుంటాయి. ఉదయం, సాయంత్రం, అల్పాహారంతో పాటు భోజనాన్ని ప్రతిరోజూ మెనూ ప్రకారం పెడతారు. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు రూ.మూడు లక్షలతో శుద్ధజల యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో ఈ అటవీ ప్రాంతానికి వచ్చి విద్యను బోధిస్తున్న వారికీ ఇక్కడ వసతి సదుపాయాలను కల్పిస్తోంది ఆశ్రమం. వీరందరికీ స్వామి వారి శిష్యుడు ఒక్కరే వంట చేసి పెడతారు. కొంతమంది గ్రామస్థులు రోజూ వచ్చి కూరగాయలు తరగడంతో పాటు, ఇతర పనుల్లో ఆయనకు సహాయం చేస్తుంటారు. మరికొంతమంది రోజూ పాఠశాల ఆవరణను శుభ్రం చెయ్యడంతో పాటు, గురుకులం నిర్వహించే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఇలా... గురుకులానికి ఏ అవసరమొచ్చినా చేసేందుకు ఎంతోమంది గ్రామస్థులు ముందుకొస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నవారికి తమవంతు సాయం చెయ్యాలన్న తపన అది.

‘పదేళ్లకిందట మా గ్రామాల్లో పిల్లలెవరైనా చదువుకోవాలంటే అడవి దాటి బయటికెళ్లాల్సిందే. దాంతో మా పల్లెల్లో అక్షరం నేర్చిన పిల్లలు చాలా తక్కువ ఉండేవారు. కానీ ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఇప్పుడు మా పిల్లలు పట్టణాల్లో పిల్లలకు పోటీగా చదువుకోవడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ఇదంతా చినజీయరు స్వామి వల్లే. అందుకే, ఆయన వూళ్లొకి వస్తున్నారంటే పల్లెలన్నీ పండుగ వాతావరణంతో వెలిగిపోతాయి’ అంటాడు అల్లంపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌.

నామమాత్రపు సదుపాయాలు కూడా కరవైన అటవీ ప్రాంతంలో ఇన్ని సౌకర్యాలతో విద్యాబోధన అంటే ఎంతో దీక్షతో అంకితభావంతో చేస్తే గానీ సాధ్యం కాదు. అందుకే, జీయరు గురుకులం సేవలు ఇప్పుడు అందరి మనసుల్నీ తాకుతున్నాయి.

- ఇ. సుదర్శనగౌడు, ఈనాడు, ఆదిలాబాద్‌
ఫొటోలు: శ్రీనివాస్‌


ఎంత చెత్తకి అంత డబ్బు!

భారత్‌లోని ప్రధాన సమస్యల్లో ‘చెత్త’ స్థానం ఎప్పుడూ ముందే. ఏదైనా రోడ్డు తళతళలాడుతుంటే, ‘విదేశీ నగరంలా ఉందే’ అనుకుంటాం తప్ప, తలచుకుంటే మన వీధుల్ని కూడా అద్దాల్లా ఉంచుకోవచ్చనే ఆలోచనే రాదు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పర మున్సిపాలిటీ అలాంటి ఉద్దేశంతోనే వీధుల్ని చెత్త రహితంగా ఉంచాలని కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నమే అంతర్జాతీయ మేయర్ల సమావేశంలో ఆక్లాండ్‌, మిలాన్‌ లాంటి నగరాలను దాటి ‘వ్యర్థాల నిర్వహణ’లో ఉత్తర్‌పరను తొలిస్థానంలో నిలబెట్టింది.

కోల్‌కతా పరిసరాల్లోని ఓ చిన్న పట్టణం ఉత్తర్‌పర. ఆసియాలోనే అత్యంత పురాతన గ్రంథాలయం అక్కడే ఉంది. ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరో అరుదైన ఘనతనూ అది సాధించింది. ఇటీవల మెక్సికోలో జరిగిన అంతర్జాతీయ ‘సీ40 మేయర్స్‌ సమ్మిట్‌’లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న నగరాలతో పోటీ పడి చెత్తను పూర్తిగా పునర్వినియోగంలోకి తెస్తున్న అత్యుత్తమ పట్టణంగా ఎంపికైంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యర్థాలను వాటి స్వరూపాన్ని బట్టి వేర్వేరు కుండీల్లో వేయడం, అందరూ స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనడం... ఈ పనులన్నీ అక్కడి వాళ్ల జీవన విధానంలో భాగమైపోయాయి. ఉత్తర్‌పర మున్సిపాలిటీ మొదలుపెట్టిన ‘వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు’ ప్రజల ఆలోచనలూ, జీవన శైలిలో మార్పులకు శ్రీకారం చుట్టి, ఆకర్షణీయ పట్టణంగా దాన్ని తీర్చిదిద్దింది.

50వేల ఇళ్లకు తిరిగి...
ఏటా దేశంలోని దాదాపు ఎనిమిదివేల నగరాలూ, పట్టణాల నుంచి 62 మిలియన్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే, 43 మిలియన్‌ టన్నుల్ని మాత్రమే మున్సిపాలిటీలు సేకరిస్తున్నాయి. అందులో 75శాతం చెత్త డంపింగ్‌ యార్డుల్లో నిరుపయోగంగా పోగవుతుంది. కానీ ఉత్తర్‌పరలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ వంద శాతం వ్యర్థాలు ఇంటి బయట ఏర్పాటు చేసిన వేర్వేరు చెత్త డబ్బాల్లోకి చేరతాయి. అక్కడి నుంచి చెత్తంతా మున్సిపాలిటీ నిర్వహించే ప్రత్యేక కేంద్రానికి వెళ్తుంది. ఆపైన దాదాపు తొంబై ఐదు శాతం వ్యర్థాల్ని మున్సిపాలిటీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికోసం ఉత్తర్‌పరలో వ్యర్థాల్ని శుద్ధి చేసే భారీ కేంద్రాన్ని నిర్మించారు. ప్రతి ఇంటికీ మూడు చెత్త డబ్బాల్ని పంపిణీ చేసి తడి, పొడి, ప్లాస్టిక్‌ చెత్తను వేరు చేసి ఒక్కో డబ్బాలో వేయిస్తున్నారు. జనాల్లో చెత్త నిర్వహణపైన అవగాహన పెంచడానికీ, పరిశుభ్రత ప్రాధాన్యం తెలియజేయడానికీ స్వయంగా ఆ మున్సిపాలిటీ ఛైర్మన్‌ దిలీప్‌ యాదవ్‌ యాభై వేల ఇళ్లకు తిరిగి, వాళ్లతో మాట్లాడారు. వంద శాతం ఇళ్లకు చెత్త బుట్టలందేలా చూసి, ప్రతి రోజూ తూచ తప్పకుండా వాటిని సేకరించే ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ వాహనాల్లో కూడా మూడు వేర్వేరు కుండీలను పెట్టి వ్యర్థాల స్వరూపాన్ని బట్టి వేరు చేస్తున్నారు. అలా సేకరించిన వ్యర్థాల్ని శుద్ధి కేంద్రాలకు తరలించి పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు.

చెత్త నుంచి ఎరువులు
చెత్త నిర్వహణను పూర్తిగా మున్సిపాలిటీ చూసుకుంటుండటంతో చెత్త ఏరుకునే వాళ్ల ఉపాధిపైన దెబ్బ పడింది. ఆ సమస్యకూ అధికారులే పరిష్కారం చూపారు. పట్టణంలో చెత్త ఏరుకునే వాళ్లందరికీ తమ శుద్ధి కేంద్రాల్లో ఉపాధి కల్పించారు. వాళ్లకు బూట్లూ, గ్లవ్‌జులూ, యూనిఫామ్‌లూ, మాస్క్‌ల లాంటి వాటిని అందించి చెత్తను వేరు చేసే పనిని అప్పగించారు. తడి చెత్తను వినియోగంలోకి తేవడానికి భారీ కంపోస్ట్‌ ప్లాంట్‌ని నిర్మించారు. రోజుకి పన్నెండు టన్నుల చెత్తని సేకరిస్తే, అందులోంచి నాలుగు టన్నుల జీవ ఎరువుల్ని తయారు చేస్తున్నారు. పది టన్నుల ఎరువుల్ని తయారు చేసే సామర్థ్యం ఉండటంతో పరిసర పట్టణాల నుంచి కూడా చెత్తను ఈ కేంద్రాలకు తరలిస్తూ, వాళ్ల సమస్యనూ కొంత తగ్గిస్తున్నారు. ఆఖరికి కాలువలూ, మ్యాన్‌హోళ్ల నుంచి కూడా పంపులను ఏర్పాటు చేసి, సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసి ఎరువులుగా మారుస్తుండటం విశేషం. శుద్ధి కేంద్రాల్లో తడి చెత్త పోగా, మిగతా వాటిలో ప్లాస్టిక్‌, ఇనుము, ఇతర వస్తువుల్ని వేరు చేసి తుక్కుగా మార్చి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి ముందు పట్టణ డంపింగ్‌ యార్డులో దాదాపు యాభై అడుగుల ఎత్తులో పేరుకున్న చెత్త ప్రస్తుతం పది అడుగుల మట్టానికి చేరింది. ఇళ్ల నుంచే నేరుగా చెత్తను సేకరిస్తుండటంతో వీధుల్లో కుండీలనూ తొలగించారు. దాని వల్ల దోమలూ, పందుల లాంటి వాటి బెడదా తగ్గింది. మున్సిపాలిటీ ఖజానాకు ఒకప్పుడు గండిగా ఉన్న చెత్త, ఇప్పుడు సిరులు కురిపించే ప్రధాన వనరుగా మారింది.