close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమా కష్టాలేవీ లేవు...!

సినిమా కష్టాలేవీ లేవు...!

‘నేను శైలజ’లో కీర్తి సురేష్‌ను చూశాక కుర్రాళ్లంతా ఏదో క్రేజీ ఫీలింగ్‌లో ఉండిపోయారు. అమ్మాయిలైతే ఆమెని తమ స్టైల్‌ ఐకాన్‌గా పెట్టేసుకున్నారు. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రజలనుంచి ఘనమైన గుర్తింపు సంపాదించిన కీర్తి... ఏడాది తర్వాత ‘నేను లోకల్‌’లో తన అందం, అభినయాలతో అలరించింది. తెలుగు వారికి తనూ లోకలే అన్నంత దగ్గరైపోయిన ఈ మలయాళీ తన గురించి ఏం చెబుతోందంటే...

నేను సినిమాల్లోకి రావడానికి కారణం అమ్మానాన్నలే. అమ్మ వెనకటి తరం నటి మేనక. దక్షిణాదిలో అన్ని భాషా చిత్రాల్లోనూ నటించింది. నాన్న సురేష్‌... సినీ నిర్మాత. సినిమాల్లోకి రావడానికి అమ్మే నాకు స్ఫూర్తి. అక్కా, నేనూ 10, 12 ఏళ్ల వయసులో ఉన్నపుడే సినిమాల్లోకి రావాలనుకున్నాం. సాధారణంగా తల్లిదండ్రులు ఏ వృత్తిలో ఉంటే పిల్లలూ అదే వృత్తిలోకి వెళ్లాలనుకుంటారు. అందుకేనేమో సినిమాల్లోకి రావాలనుకున్నాం. నేను నటిగా తెరపైన కనిపించాలనీ, అక్క తెరవెనక ఏదైనా విభాగాన్ని ఎంచుకోవాలనీ ఒట్టేసుకున్నాం. అమ్మకు మా లక్ష్యాల గురించి చెబితే చాలా హ్యాపీగా ఫీలయింది. ‘కానీ, ముందయితే చదవండి’ అని చెప్పింది. ఇంటర్మీడియెట్‌ తర్వాత మరోసారి అమ్మకు నా లక్ష్యం గురించి గుర్తుచేశాను. ‘చదువు పూర్తవగానే చేరిపోవడానికి నటన ఉద్యోగం లాంటిది కాదు. దేనికైనా సమయం రావాలి. అవకాశం వచ్చిన రోజు తప్పకుండా చేద్దువుకానీ, అప్పటివరకూ ఓపిక పట్టు’ అంది. ఆ తర్వాత నేను డిగ్రీలో చేరాను. డిగ్రీ మూడో సంవత్సరంలో ఉండగా నాకు మలయాళంలో ‘గీతాంజలి’లో చేసే అవకాశం వచ్చింది. 2013లో వచ్చిన ఆ సినిమాకి దర్శకుడు ప్రియదర్శన్‌, హీరో మోహన్‌లాల్‌. వాళ్లని ‘ప్రియన్‌ అంకుల్‌’, ‘లాల్‌ అంకుల్‌’ అని పిలిచేంత చనువుంది నాకు. వారిద్దరి కాంబినేషన్లోని మొదటి సినిమాని నాన్న నిర్మించారు. నేను సినిమాల్లోకి వస్తే ఆ సినిమాలో వాళ్లిద్దరూ భాగంగా ఉండాలనుకున్నారట. తన స్నేహితుల సినిమా కాబట్టి నాన్న కూడా నిస్సందేహంగా ఓకే చెప్పారు. గీతాంజలి మంచి హిట్‌ అయింది. నా రెండో సినిమా ‘రింగ్‌ మాస్టర్‌’ కూడా విజయం సాధించింది.

ఆ సినిమా నచ్చిందన్నారు
నా మొదటి రెండు తమిళ సినిమాల (ఇదు ఎన్న మాయమ్‌, రజని మురుగన్‌) ఎంపిక, చిత్రీకరణ సమయంలో అమ్మ సాయపడింది. నాన్న నా సినిమా విషయాల్లో తలదూర్చరు. సినిమా పూర్తయిన తర్వాత నన్ను తెరపైన చూడాలనుకుంటారంతే. సినిమా చూశాక ‘ఆ ఫర్వాలేదు’ అనేవారంతే! కానీ నాన్నతో ఏరోజైనా శభాష్‌ అనిపించుకోవాలని ఉండేది. ధనుష్‌తో చేసిన ‘తొడరి’తో నాకా అవకాశం వచ్చింది. అందులో నా నటనను చూసి నాన్న మెచ్చుకున్నారు. ఆయనతో కలిసి థియేటర్లో చూసిన మొదటి సినిమా కూడా అదే. నా ‘రెమో’ సినిమా కూడా ఆయనకి నచ్చింది. తర్వాత తమిళంలో చేసిన ‘రజని మురుగన్‌’, ‘భైరవ’ సినిమాల్నీ చూశారు. బిజీగా ఉండటంవల్ల ‘నేను శైలజ’ సినిమా థియేటర్లో చూడలేదు. ‘నేను లోకల్‌’ని మాత్రం కుటుంబ సభ్యులంతా చెన్నై వచ్చి చూశారు. నలుగురికీ సాయపడటం నాన్నకు ఇష్టం. సినిమాల పరంగా అమ్మ నాకు స్ఫూర్తి అయితే వ్యక్తిగత జీవితంలో నాన్న నాకు ఆదర్శం. నా వ్యక్తిత్వంలో చాలా లక్షణాలు ఆయన్నుంచి వచ్చాయని చెప్పాలి.

బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌ని!
చదువుల పరంగా నన్ను స్ఫూర్తిగా తీసుకోవద్దు ప్లీజ్‌. ఎందుకంటే నేను యావరేజ్‌ స్టూడెంట్‌ని. విద్యార్థిగా ఎప్పుడూ 80 శాతం మార్కులు దాటలేదు. నాలుగో తరగతి వరకూ చెన్నైలోనే చదువుకున్నాను. 5-12 తరగతులు త్రివేండ్రంలో కేంద్రీయ విద్యాలయలో చదివాను. డిగ్రీకి మళ్లీ చెన్నై వచ్చాను. డిగ్రీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశాను. క్లాసులో ఎప్పుడూ వెనక బెంచీలోనే కూర్చొనేదాన్ని. డిగ్రీలో మాకు థియరీకంటే ప్రాక్టికల్‌ వర్క్‌ ఎక్కువగా ఉండేది. క్యాంపస్‌లోనే రోజంతా ఏదో ఒక పనిచేస్తూ ఉండేవాళ్లం. మా కాలేజీలో అబ్బాయిలు తక్కువ. మా గ్యాంగ్‌లో అంతా అమ్మాయిలే. చెన్నైలో ప్యారిస్‌ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ సమోసాలూ శాండ్‌విచ్‌లూ బావుంటాయి. మేమంతా అక్కడికి తరచూ వెళ్లేవాళ్లం. అక్కడ చెరకు రసం ఇష్టంగా తాగేదాన్ని. నా స్నేహితులు ఎక్కువగా చదువుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తిండి కూడా మానేసి చదువుకునేవారు. నాకు మాత్రం తిండి ఫస్ట్‌. వేళకు తినేయాలి, తర్వాత పని చేసుకోవాలి. లేకపోతే, శక్తి ఎలా వస్తుంది. కాలేజీకి ఆటోలోనే వెళ్లేదాన్ని. అయిదు, పది రూపాయలకీ బేరం ఆడేదాన్ని. కొందరు ఆటో డ్రైవర్లయితే ఆటో ఆపిన తర్వాత ‘ఈ అమ్మాయా... పీనాసి బేరం’ అనుకుంటూ పారిపోయేవారు. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటే భలే నవ్వొస్తుంది.

వర్ణవివక్షని ఎదుర్కొన్నా!
డిగ్రీలో కాలేజీ విద్యార్థుల ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా స్కాట్లాండ్‌లో అయిదు నెలలు చదువుకున్నాను. నేవెళ్లిన కాలేజీ గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉండేదా వాతావరణం. మైదానాల్లో గొర్రెల మందలు ఎక్కువగా కనిపించేవి. నేను, నా ఫ్రెండ్‌ ఒక ఇంట్లో ఉండేవాళ్లం. వారంలో రెండ్రోజులే కాలేజీ. దాంతో మాకు షికార్లకి బాగా టైమ్‌ ఉండేది. అక్కడ మార్కెట్‌కూ, చర్చికీ వెళ్లేదాన్ని. నేను అక్కడున్న సమయంలో మంచు కురిసేది. మనకది కొత్త కదా, ఆ మంచులో ఆడుకునేవాళ్లం. తర్వాత లండన్‌లో నెలన్నర ఇంటర్న్‌షిప్‌ చేశాను. నేను పనిచేసిన కంపెనీలో వర్ణ వివక్షని ఎదుర్కొన్నాను. కొత్తగా డిజైన్‌ చేసిన బట్టల్ని పెద్ద పెద్ద బ్యాగుల్లో పెట్టి నాకిచ్చి వాటిని ఫ్యాక్టరీలకు అందించి రమ్మనేవారు. స్థానికులకు అలాంటి పనులు చెప్పేవారు కాదు. మమ్మల్ని ఉద్యోగుల్లా కాకుండా పనివాళ్లలా చూసేవారు. ఆ సమయంలో అవన్నీ తట్టుకోవడం నావల్ల కాకపోయేది. ఇప్పుడు మాత్రం అదో గొప్ప అనుభవమనిపిస్తుంది. స్కాట్లాండ్‌లో ఉన్నపుడు పాకిస్థాన్‌ అమ్మాయి, లండన్‌లో శ్రీలంక అమ్మాయి ఫ్రెండ్స్‌ అయ్యారు. యూకేలో ఉన్న ఆ కొద్దిరోజులూ నా జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. అక్కడ ఉరుకుల పరుగుల జీవితం ఉండదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాకే దాని విలువ అర్థమైంది. కొన్ని కారణాలవల్ల కాస్త ముందుగానే ఇండియా తిరిగి వచ్చాను. కానీ తర్వాత ఏదో మిస్సయ్యానన్న ఫీలింగ్‌ ఉండేది. ఈ మధ్యనే లండన్‌ వెళ్లి మళ్లీ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసొచ్చాను.

లక్ష్యాలు చేరుకున్నాం!
అక్క రేవతి... విజువల్‌ కమ్యునికేషన్స్‌లో డిగ్రీ చేసింది. తర్వాత షారుక్‌ఖాన్‌కు చెందిన సంస్థ ‘రెడ్‌ చిల్లీస్‌’లో ఏడాదిన్నరపాటు పనిచేసింది. భరతనాట్యం డ్యాన్సర్‌ కూడా. తనకు సెప్టెంబరులో పెళ్లయింది. ‘రేవతి కళా మందిర్‌’ అనే సినీ నిర్మాణ సంస్థని నాన్న ప్రారంభించారు. ఆ సంస్థ పనుల్నీ, త్రివేండ్రంలో నాన్న ప్రారంభించిన ఫిల్మ్‌ అకాడమీ పనుల్నీ అక్క చూసుకుంటోంది. అలా ఒకరు తెరమీద, మరొకరు తెర వెనుక ఉండాలన్న మా లక్ష్యాలు నెరవేరాయి. అమ్మానాన్నా, అక్కా త్రివేండ్రంలో ఉంటారు. నేను అమ్మమ్మతో కలిసి చెన్నైలో ఉంటాను. నాకు ఖాళీ దొరికినా చెన్నైలోనే ఉండటానికి ఇష్టపడతాను. ‘మీకు చూడాలనిపిస్తే ఇక్కడికే రండి’ అని అమ్మానాన్నలకు చెబుతా. వాళ్లూ నెలకోసారైనా ఏదో ఒక పనిమీద చెన్నై వస్తుంటారు. ఏ పనీ లేకుంటే నన్ను చూడ్డానికైనా వస్తారు.

అక్క ముందే చెప్పింది!
ఎప్పుడైనా బయట కనిపిస్తే కొందరు తెలుగువాళ్లు ‘హాయ్‌, శైలజా’ అని పలకరిస్తుంటారు. నాకంటే కూడా ‘నేను శైలజ’లో నా పాత్రకి అంతగా కనెక్ట్‌ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇతర భాషల్లో సినిమా చేసినపుడు భాషా పరమైన సమస్యలే ప్రధానంగా ఉంటాయి. కానీ తెలుగులో నా మొదటి సినిమాకి ఆ ఇబ్బంది రాలేదు. రామ్‌తోపాటు దర్శకుడు కిషోర్‌, నిర్మాత రవికిషోర్‌లకు తమిళం వచ్చు. వాళ్లు తమిళంలోనే సీన్లను వివరించడంతో నాకెంతో సౌకర్యంగా ఉండేది. హీరో రామ్‌ స్క్రీన్‌మీద ఎలా కనిపిస్తాడో, బయట కూడా అలానే చాలా చురుగ్గా ఉంటాడు. నా సినిమాలే కాదు సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదలైన ప్రతిసారీ తన స్పందనను మెసేజ్‌ రూపంలో పంపుతాడు. ‘నేను లోకల్‌’కు కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా పనిచేశాను. అందుకు హీరో నానీనే ముఖ్య కారణం. నానీకి ఓపిక ఎక్కువ. అతణ్ని వందలకొద్దీ ప్రశ్నలూ, సందేహాలూ అడిగేదాన్ని. అయినా విసుక్కోకుండా చెప్పేవాడు. సీన్‌ను మెరుగుపర్చడానికి తన ఆలోచనల్ని చెప్పేవాడు. నేనేదైనా చెప్పినపుడు తనూ వినేవాడు. అలాంటి స్వభావం అందరికీ ఉండదు. సెట్లో తమిళం వచ్చినవాళ్లు నాకు సీన్లు వివరించేవారు. అయినా నానీని మళ్లీ చెప్పమని అడిగేదాన్ని. సీన్లో ఉండేది మేమే కాబట్టి అతడితో ఆ విషయాల్ని చర్చించేదాన్ని. దానివల్ల మరింత సులభంగా పని చేసుకోగలిగాం. అక్క తెలుగు సినిమాలు చూస్తుంటుంది. ‘నానీ చాలా సహజంగా నటిస్తాడు. అతడితో చేసేటపుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా’ అని హెచ్చరించింది. నానీని చూశాక అక్క చెప్పిన మాటలు నిజమేననిపించాయి.

సోషల్‌ మీడియా ముఖ్యమే!
సోషల్‌ నెట్‌వర్క్‌... అభిమానులకు నన్ను మరింత దగ్గర చేస్తోంది. నా గురించి ఫేస్‌బుక్‌లో అన్ని విషయాలూ పోస్ట్‌ చేస్తుంటాను. వాటిద్వారా నా వ్యక్తిత్వం గురించి అందరికీ అర్థమవుతుంది. నాదీ అందరిలాంటి సామాన్య జీవితమేననీ కాకపోతే దారులు వేరనీ వారికి తెలుస్తుంది. నేను ట్విట్టర్‌లోనూ ఉన్నాను. సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవే కాదు అన్ని రకాల సోషల్‌ మీడియా వేదికల్లో ఉండటం ఈ రోజుల్లో నాలాంటి వారికి చాలా ముఖ్యం.

నా జీవితంలో సినిమాలు తప్ప సినిమా కష్టాలేమీ లేవు. సినిమాల్లోకి రావడానికీ, అవకాశాల కోసమూ నేనెప్పుడూ కష్టపడలేదు. ఇదంతా దేవుడి దీవెన అని చెప్పాలి. మొదట్లో అమ్మానాన్నల సాయం తీసుకున్నా, ఆ తర్వాత నుంచి నా కెరీర్‌ను నేనే నిర్మించుకుంటున్నాను. నేనిక్కడ ఏదో సాధించాలి, డబ్బు సంపాదించాలి అని రాలేదు. సినిమాపైన ఇష్టంతో వచ్చాను. కాబట్టి నేనెప్పుడూ అవకాశాలకోసం పరుగెత్తలేదు. నిదానంగానే పనిచేసుకుంటున్నాను. ఈరోజు వరకూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. భవిష్యత్తులోనూ అలానే ఉంటానన్న నమ్మకం ఉంది.

- సుంకరి చంద్రశేఖర్‌

అభిమానులు... 50 లక్షలు!

స్కూల్‌ రోజుల్లో స్విమ్మింగ్‌ ఛాంపియన్‌. స్లిమ్‌గా ఉండటానికి ఇప్పటికీ రోజూ కొద్దిసేపు స్విమ్మింగ్‌ చేస్తుంది.
* తండ్రి సురేష్‌ బ్యానర్‌లో వచ్చిన కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించింది.
* ఫేస్‌బుక్‌లో ఫాలోవర్ల సంఖ్య 50లక్షలు.
* ‘క్వీన్‌’ సినిమాలో కంగనా రనౌత్‌ లాంటి పాత్ర చేయాలనేది కీర్తి కోరిక.
* చీరకట్టు, చుడీదార్లలో సంప్రదాయంగా కనిపిస్తూనే జీన్స్‌, టాప్‌ వేసుకొని ఆధునికంగా ఉండటమూ ఇష్టమేనంటుంది.
* పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కనిపించనుంది. తమిళంలో సూర్యాతో ఓ సినిమా చేస్తోంది.
* నటి సిమ్రాన్‌ అందం, నటన తనకు నచ్చుతాయంటుంది.
* తనలోని ఫ్యాషన్‌ డిజైనర్‌ని బయటకు తీస్తూ, దుస్తుల ఎంపిక, వాటి డిజైన్లలో తన ముద్ర ఉండేలా చూసుకుంటుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.