close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

మూడు రోజుల్లో నలభై ఆలయాలు..!

మిళనాడులో పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని. వాటిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఈసారి కుంభకోణం చూడాలనుకుని బయలుదేరాం. అందుకే మూడురోజుల్లో వీలయినన్ని ఎక్కువ దేవాలయాలు సందర్శించాలనుకున్నాం. తమిళనాడు దేవాలయాలకు సంబంధించిన ఓ బ్లాగులోని మిత్రుడి సలహాసూచనల సాయంతో తిరుచ్చి నుంచి రైల్లో కుంభకోణం చేరుకున్నాం.

ఆజ్ఞా గణపతి!
ప్రతిరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు టాక్సీలో బయలుదేరి, తిరిగి ఆలయాలు మూసివేసే వరకూ పర్యటిస్తూ మూడురోజుల్లో దాదాపు 40 ఆలయాలు దర్శించాం. మొదటిరోజు కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలంగుడిలోని గురుగ్రహక్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఇక్కడి ఆలయంలో ఆపత్సహాయేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. అనంతరం తిరుభువనంలో కంబహరేశ్వర, శరభేశ్వర స్వాములను దర్శించుకుని సమీపంలోని గోవిందపురం చేరుకున్నాం. విఠల్‌దాస్‌జీ మహారాజ్‌ మహారాష్ట్ర శైలిలో నిర్మింపజేసిన ఇక్కడి మందిరంలో పాండురంగడిని దర్శనం చేసుకున్నాం. కృష్ణాష్టమి వేడుకలకు అలంకారాలతో ఉన్న ఆ దివ్యమూర్తులను తిలకించి మైమరిచిపోయాం. అక్కడికి దగ్గరలోనే ఉన్న తిరువిడైమరుదూర్‌ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో 20 అడుగుల నందీశ్వరుడి విగ్రహాన్ని చూశాం. ఈ ఆలయంలో కొలువైన మహాలింగేశ్వర స్వామిని మధ్యార్జునేశ్వరుడుగా కూడా పేర్కొంటారు. ఇదే ప్రాంగణంలోని విఘ్నేశ్వరుని ఆజ్ఞాగణపతిగా అర్చిస్తారు.

ఉప్పులేని ప్రసాదం!
అక్కడి నుంచి అయ్యావాడి వెళ్లి ప్రత్యంగిరాదేవిని పూజించాం. సమీపంలోనే ఉప్పిలిఅప్పన్‌ ఆలయం ఉంది. ఇక్కడ కొలువుతీరిన నారాయణుడికి ఉప్పులేని ప్రసాదాన్ని నివేదించడం విశేషం. తరవాత రాహు గ్రహ క్షేత్రమైన తిరు నాగేశ్వరం చేరుకుని, నాగేశనాథుడిని దర్శించుకున్నాం. దారి పొడవునా పచ్చటి అరటితోటలు కనువిందు చేస్తుండగా తింగలూరు చేరుకున్నాం. అక్కడ ఉన్న చంద్రగ్రహ క్షేత్రంలో పెరియనాయకి అమ్మవారిని అర్చించి, కావేరీతీరానగల తిరువయ్యారుకి చేరుకున్నాం. వాగ్గేయకారుడు సద్గురు త్యాగరాజస్వామి సమాధిని దర్శించి, ఆయన అర్చించిన శ్రీరామ పంచాయతనాన్ని చూశాం. ఆ సాయంకాలం అక్కడి ప్రశాంత వాతావరణంలో మైకులో ఏసుదాసు ఆలపించిన త్యాగరాజ కీర్తన వింటుంటే మనసంతా ఆధ్యాత్మిక చింతనతో నిండిపోయింది.తరవాత అక్కడ నుంచి ఆ వూరిలోనే ఉన్న సుప్రసిద్ధ పంచనదీశ్వర ఆలయానికి వెళ్లాం. ఇక్కడి కుడ్యచిత్రాలు చూసి తీరాల్సిందే. స్వామి ప్రదోష హారతిని కనులారా దర్శించుకొని, కపిస్థలం చేరుకున్నాం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి మాత్రమే కాదు. పంచ కృష్ణ క్షేత్రాల్లో ఒకటని అక్కడి అర్చకుడు తెలిపాడు. ఇక్కడ గజేంద్ర వరదరాజ స్వామిని ఆదిమూలం అని కూడా వ్యవహరిస్తారట. ఇక్కడికి సమీపంలోనే పాపనాశ క్షేత్రం ఉంది. రావణ సంహార పాపప్రక్షాళనార్థం ఇక్కడి రామలింగేశ్వరుడిని శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ప్రదోష హారతిని చూసే భాగ్యం కలిగింది. ఇక్కడినుంచి తిరుకరవూరులోని గర్భరక్షాంబికాదేవి ఆలయానికి వెళ్లాం. గర్భిణులు ఈ అమ్మవారిని సేవిస్తే సుఖప్రసవమై చక్కటి బిడ్డకు జన్మనిస్తారని భక్తుల విశ్వాసం. ప్రసవానంతరం బిడ్డలతో వచ్చి అమ్మవారిని సేవించుకుంటున్న జంటలు చాలానే కనిపిస్తాయక్కడ. సంతానంలేని వాళ్లు కూడా ఇక్కడి అమ్మవారికి మొక్కుకుంటుంటారట.

తరవాత వేదనారాయణస్వామి కొలువైన వూత్తుకాడు వైష్ణవ క్షేత్రానికి వెళ్లాం. అక్కడ రాహుకేతు దోష నివారణ పూజలు చేస్తారని అర్చకులు తెలిపారు. వాగ్గేయకారుడైన వూత్తుకాడు వేంకటకవి గానానికి పరవశించిన బాలకృష్ణుడు ఈ ఆలయ ప్రాంగణంలో నర్తించేవాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించుకుని పట్టీశ్వరంలోని దుర్గాదేవి ఆలయానికి చేరుకున్నాం. అమ్మవారు శాంతమూర్తిగా చేతిపై చిలుకతో దర్శనమిస్తుంది. రాహు, నవగ్రహ పరిహార పూజలకు ఈ ఆలయం ప్రసిద్ధి.

ఉప్పు ప్రసాదం!
రెండోరోజున కుంభకోణం సమీపంలోనే ఉన్న సూర్య భగవానుడి ఆలయాన్నీ, కంజనూరులోని శుక్రుడి ఆలయాన్నీ దర్శించి వైదీశ్వరన్‌ చేరుకున్నాం. ఇక్కడి స్వామి వైద్యనాథుడు. కుజగ్రహ క్షేత్రమైన ఈ ఆలయంలో కుజ దోష పరిహార పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి భక్తులు ఉప్పు, బెల్లం, మిరియాలు నైవేద్యంగా సమర్పిస్తారు. నాడీ జ్యోతిషానికి కూడా ఈ వూరు ప్రసిద్ధి చెందింది. అక్కడి నుంచి బుధ గ్రహ క్షేత్రం తిరువేంగడుకు చేరుకున్నాం. ఆ ఆలయ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ శ్వేతారణ్యేశ్వర స్వామి, బ్రహ్మ విద్యాంబిక, నటరాజస్వామి, అఘోరమూర్తి, శ్వేతకాళి కొలువై ఉన్నారు. వీటిలో ఓ ఆలయ నిర్మాణం కేరళను గుర్తుతెస్తుంది. ఇక్కడి రెండు తటాకాలకు సూర్యచంద్రుల పేర్లు ఉండటం విశేషం.

షష్టిపూర్తి ఉత్సవ వేదిక!
అనంతరం కేతు గ్రహ క్షేత్రమైన కీలపెరుంబళంలో నాగనాథ స్వామినీ సౌందర్యనాయకి అమ్మవారినీ అర్చించి, తిరుక్కడయూర్‌ చేరుకున్నాం. భక్త మార్కండేయునికి పరమశివుడు వరం అనుగ్రహించిన క్షేత్రంగా తిరుక్కడయూర్‌ పేరొందింది. ఇక్కడ స్వామి సుందరేశ్వరుడు. అభిరామి అమ్మవారి సమేతంగా దర్శనమిస్తాడు. వీరి సన్నిధిలో షష్టిపూర్తి ఉత్సవాలు చేసుకోవడం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తారు. వయసుతో నిమిత్తం లేకుండా పలువురు వృద్ధ దంపతులకు వారి బంధువులు ఇక్కడ షష్టి పూర్తి వేడుక నిర్వహించడం చూశాం.

పట్టుదారాల దారాసురం!
ఇక శనీశ్వర క్షేత్రమైన తిరునల్లారు శనిదోష నివారణ పూజలకు పేరు. ఇక్కడ దర్భారణ్యేశ్వర స్వామిని సేవించుకొని దారాసురం చేరుకున్నాం. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన దారాసుర ఆలయం పురావస్తుశాఖ నిర్వహణలో ఉంది. శిల్పకళాశోభితమైన ఈ ఆలయాన్ని తంజావూరు బృహదీశ్వరాలయం నమూనాలో రెండో రాజరాజచోళుడు నిర్మించాడు. ఇక్కడి ఐరావతేశ్వరుని దర్శించి, ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భద్రపరిచిన అపురూప శిల్పాలనూ కుడ్య చిత్రాలనూ ఆసాంతం తిలకించాం. అమ్మవారి ప్రతిమలో ముక్కుపుడక రంధ్రం నుంచి ఓ పుల్ల దూరేటంత సందు ఉండే విధంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోయాం. అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూశాం.

దారాసురం పట్టుచీరలకూ ప్రసిద్ధి. సౌరాష్ట్ర నుంచి వలస వచ్చిన పలు చేనేత కుటుంబాలు ఇక్కడి మగ్గాలపై చీరలు నేయడం చూసి కొనకుండా ఉండలేకపోయాం. అక్కడి నుంచి నాచ్చియార్‌ కోయిల్‌ వెళ్లి శ్రీనివాసుడు, తాయారులతోపాటు గర్భాలయంలో కొలువైన అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, పురుషోత్తముడు, బలరాముడు, బ్రహ్మమూర్తులను దర్శించాం.

శ్వేత గణపతి!
మూడోరోజు కుంభకోణంలోని ప్రసిద్ధ ఆలయాలతోపాటు చుట్టుపక్కల మరికొన్ని పురాతన దేవాలయాలను దర్శించాం. ముందుగా కుంభకోణం క్షేత్రానికి ఆ పేరు తెచ్చిన ఆది కుంభేశ్వర స్వామినీ మంగళాంబికనూ దర్శించుకున్నాం. తెలుగులో కుంభకోణం అనే పదానికి మరో అర్థముంది. కానీ స్థల పురాణం ప్రకారం కుంభకోణం అనేది ఎంతో ప్రాశస్త్యమైనది. ప్రళయానంతరం సృష్టి పునరుజ్జీవనానికై సర్వేశ్వరుడు జీవాన్ని ఓ కుంభంలో దాచిన క్షేత్రం ఇదేననీ, సృష్టి తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభమైందనీ చెబుతారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటైన సుప్రసిద్ధ సారంగపాణి ఆలయానికి వెళ్లాం. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 170 అడుగులు. మహాలక్ష్మిని వివాహమాడేందుకు శ్రీమహావిష్ణువు ఏనుగులు, అశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి సారంగపాణిగా ఇక్కడ అవతరించాడట. గర్భాలయం కూడా రథాకృతిలోనే ఉండటం విశేషం. స్వామి ఇక్కడ శయన భంగిమలో దర్శనమిచ్చాడు. ఇక్కడి అమ్మవారి పేరు కోమలవల్లి. ఈ ఆలయానికి ఉత్తరాయణ ద్వారం, దక్షిణాయన ద్వారం ఉన్నాయి. అర్ధ సంవత్సరం పాటు ఒక్కో ద్వారం తెరచి ఉంచుతారు. ఆలయం గోడలపై భరతనాట్య భంగిమలను కూడా చెక్కారు. అక్కడి నుంచి చక్రపాణి ఆలయానికి వెళ్లి త్రినేత్రుడైన స్వామిని చూశాం. వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించాక, తిరువళంచుళి వెళ్లి శ్వేత గణపతిని సేవించుకున్నాం. ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైన స్వామిమలై ఇక్కడికి దగ్గరలోనే ఉంది. దీనికి 60 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లెక్కి కుమారస్వామిని పూజించుకున్నాం. ఈ ప్రాంతంలో అనేక శిల్పశాలలు ఉన్నాయి. వీటిల్లో వందలాది శిల్పులు రాతితోనూ వివిధ లోహాలతోనూ అనేక దేవతామూర్తుల ప్రతిమలను అద్భుతంగా రూపొందిస్తున్నారు. తరవాత 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఏడోదైన తిరుపుళ్లంపుదంగుడి వెళ్లి, వల్‌విల్‌ రాముని ఆలయంలో శయన భంగిమలో ఉన్న శ్రీ రామచంద్రుని అర్చించుకున్నాం. ఈ గర్భాలయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతోబాటు బ్రహ్మ, జటాయువులతో కూడా కొలువుదీరడం విశేషం.

మహామహం పుష్కరిణి!
అక్కడి నుంచి వైష్ణవ దివ్యదేశాల్లో మరొకటైన ఆదనూరు చేరుకుని రంగనాథుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడి గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి, బ్రహ్మ, భృగు మహర్షి, అగ్నిదేవుడు, కామధేనువు కొలువై కనిపిస్తారు. కుంభకోణం తిరిగివచ్చి, ఆది వరాహస్వామి, నాగేశ్వరస్వామి ఆలయాలను మహామహం పుష్కరిణిని చూశాం. కుంభకోణం అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చేది ఈ పుష్కరిణే. ఆరు ఎకరాలకు పైగా విస్తీర్ణంతో అలరారే ఈ తటాకం చుట్టూ 16 మండపాలు, తటాకం లోపల 21 బావులు ఉన్నాయి. ఇక్కడ ఏటా మాఘమాసంలో జరిగే ఉత్సవం కాకుండా 12 సంవత్సరాలకొకసారి జరిగే ఉత్సవాలకు లక్షలాది భక్తులు వస్తారు. అనంతరం పట్టాభిరామస్వామి ఆలయంలో సీతాలక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత శ్రీరామచంద్రమూర్తిని సేవించాం. ఇక్కడ ఆంజనేయస్వామి వీణాపాణియై దర్శనమివ్వడం విశేషం. ఇక్కడి వైష్ణవాలయాల్లో మూలవిరాట్‌ విగ్రహాలు పది అడుగులకు పైగా ఎత్తులో నేత్రపర్వంగా ఉన్నాయి.ఓ బ్లాగు ద్వారా పరిచయమై, ఈ ఆలయాలనూ చూసేందుకు మాకు మార్గనిర్దేశం చేసిన మిత్రుడు విజయకుమార్‌గారికి ఫోనులోనే కృతజ్ఞతలు తెలియజేసి, తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు