close
తేనె పలుకులు

తేనె పలుకులు
- అప్పరాజు నాగజ్యోతి

త్తగారి కోసం కాఫీ కలిపి పక్కన పెట్టింది మానస. అంతలో స్టవ్‌ మీద సాంబారు కోసం పెట్టిన పోపు మాడిపోతుంటే, గభాల్న గరిట పట్టుకోవడంతో చేయి చురుక్కుమంది. కుళాయి కింద పెట్టి, చల్లని నీటితో చేతిని కడిగిన తరవాత మంట కాస్త తగ్గింది.

‘అయ్యో, అత్తయ్యగారు కాఫీ కోసం కాచుకుని ఉంటారు’ అనుకుంటూ పక్కకి తిరిగిచూస్తే అంతకుముందే కలిపి ఉంచిన కాఫీ అక్కడ లేదు. ‘ఇంతలోనే ఎలా మాయమయిందబ్బా’ అని అనుకుంటుండగా, హాల్లో నుంచి మానస తోడికోడలు కవిత గొంతు వినిపించింది.

‘‘అత్తయ్యగారూ, ఇదిగోండి కాఫీ... మీకోసం షుగర్‌ తగ్గించి వేశాను. మీరు పెద్దవారు, పైగా డయాబెటిస్‌ కూడా ఉంది. నిద్ర లేచిన తరవాత కడుపులో ఏమీ పడకుండా ఎక్కువసేపు ఉంటే కష్టం, షుగర్‌ డౌన్‌ అయ్యే ప్రమాదముంటుంది.’’

‘‘పెద్దదాన్ని, లేచి ఇంతసేపయిందా... నా మొహాన ఇంతవరకూ కాఫీ పోసే దిక్కులేదు ఈ ఇంట్లో. ఎవరి హడావుడి వాళ్ళదే. నా గురించి ఆలోచించే తీరికా ఓపికా ఎవరికీ ఉండదు’’ అని నిష్ఠూరాలాడుతూ కాఫీ కప్పు అందుకుంది లలితమ్మ.

‘‘మీరలా బాధపడితే నామీద ఒట్టే అత్తయ్యా. నాకు మా అమ్మ ఎంతో, మీరూ అంతే. మీకేం కావాలన్నా నాకు చెప్పండి... చిటికెలో చేసేస్తాను’’ అంటూ ఆవిడ పక్కనే సోఫాలో సెటిల్‌ అయిపోయి కబుర్లు మొదలుపెట్టింది కవిత.

కవిత చెప్పే తీపిమాటలకి ఐస్‌ అయిపోతుంది లలితమ్మ. ఉదయం నుంచీ వంటింట్లో పనితో పెద్దకోడలు హైరానా పడుతోందనే విషయమే గుర్తురాదిక ఆవిడకి.

గబగబా వంటింట్లో పనంతా తెముల్చుకుని, అందరికీ బాక్సులు సర్దేసి, తానింత తినేసి ఏడు గంటలకల్లా ఇంటినుంచి బయటపడింది మానస. ఫ్యాక్టరీ బస్‌ మిస్‌ అయిందంటే ఒకరోజు జీతం కట్‌ చేస్తారు. సరిగ్గా ఏడూ ఐదు నిమిషాలకల్లా ఇంటికి నాలుగడుగుల దూరంలో ఆగిన ఫ్యాక్టరీ బస్సుని అందుకున్నారు మానస, ఆమె భర్త ప్రవీణ్‌.

* * *

లలితమ్మ, రాఘవయ్యలకు ఇద్దరే కొడుకులు. రాఘవయ్యది చిన్న ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అతనికి వచ్చే జీతం రాళ్ళతో అతి కష్టంమీద కుటుంబాన్ని పోషించుకొచ్చి ఈమధ్యే రిటైర్‌ అయ్యాడు.

తండ్రి కష్టాన్ని గమనించిన పెద్దకొడుకు ప్రవీణ్‌, పై చదువుల కోసం ఆరాటపడకుండా టెన్త్‌ పూర్తి అవుతూనే సబ్బుల ఫ్యాక్టరీలో ట్రేడ్‌ అప్రెంటిస్‌గా చేరి తండ్రికి చేదోడువాదోడుగా ఉండిపోయాడు. మూడేళ్ళ తరవాత ఫ్యాక్టరీలో పర్మినెంట్‌ అయ్యాడు. అదే ఫ్యాక్టరీలో సేల్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న మానసని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.

తమ్ముడు రాజేష్‌ అంటే ప్రవీణ్‌కి ప్రాణం. వాడు తనలాగా చిన్న ఉద్యోగం చేయకూడదని, ఎలాగో కిందా మీదాపడి తమ్ముడి చేత డిగ్రీ చదివించాడు.

డిగ్రీ పూర్తిచేసిన రాజేష్‌, ఒక పెద్ద ప్రైవేటు కంపెనీలో మంచి జీతానికి అకౌంటెంట్‌గా చేరాడు. రాజేష్‌ పనిచేసే కంపెనీలోనే పదేళ్ళుగా పనిచేస్తున్న శేఖర్‌, రాజేష్‌ చురుకుతనాన్ని గమనించాడు. తన చెల్లెలు కవితకీ రాజేష్‌కీ ఈడూ జోడూ బావుంటుందని అనుకుని, రాజేష్‌ తల్లిదండ్రులని ఒప్పించి పెళ్ళిచేసి, ఘనంగా సారె పెట్టి చెల్లిని కాపురానికి పంపించి తన బాధ్యత తీర్చుకున్నాడు.

* * *

కవిత పుట్టింట్లో ఒక్క పనిచేసి ఎరగదు. అందరితో తియ్యగా మాట్లాడుతూ తన పబ్బం గడిపేసుకునే మనస్తత్వం. మెట్టినింట్లో కాలు పెడుతూనే, అత్తగారిని తన తేనె పలుకులతో సులభంగా ఆకట్టేసుకుంది. ఆరోజు ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగివస్తూనే, అత్తగారికి ఆయాసం ఎక్కువవడం గమనించిన మానస వెంటనే మెడికల్‌ షాపుకి వెళ్ళి మందులు తీసుకువచ్చి టేబుల్‌మీద పెట్టి, మంచినీళ్ళు తేవడానికని వంటింట్లోకెళ్ళింది.

మంచినీళ్ళ గ్లాసుతో మానస వచ్చేసరికి, అత్తగారికి కవిత తన చేత్తో మందు ఇవ్వడం జరిగిపోయింది.

‘‘ఉన్నట్టుండి మధ్యాహ్నం నుంచి ఆయాసం ఎక్కువైపోయింది. సమయానికి మందు తెచ్చి నాచేత మింగించావు, చచ్చి నీ కడుపున పుడతానే తల్లీ’’ అంటూ చిన్నకోడలికి కృతజ్ఞతలు చెప్పుకుంటోంది లలితమ్మ.

* * *

‘‘అత్తయ్యగారి పుట్టినరోజు కదా రేపు, అందరం కలిసి సరదాగా హోటల్‌కి వెళ్దాం డిన్నర్‌కి’’ అంటూ కవిత ప్రోగ్రాం వేసేసరికి, అది నెలాఖరైనా అందరూ కలిసి ఇంటికి దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళారు.

కవిత ‘‘అత్తయ్యగారూ, ఇది బావుంటుంది, అది బావుంటుంది’’ అంటూ చాలా ఐటమ్స్‌ ఆర్డర్‌ చేయడంతో బిల్లు అనుకున్నదానికంటే ఎక్కువ అయింది. బిల్లు కట్టడానికి తన దగ్గరున్న డబ్బులు సరిపోకపోవడంతో, మానస వద్ద ప్రస్తుతం డబ్బులేమీ లేవని ముందే తెలిసిన ప్రవీణ్‌, తమ్ముడు రాజేష్‌ని పక్కకు పిలిచి అడిగాడు.

‘‘ఒరే రాజేష్‌, నీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయిరా?’’

‘‘అయ్యో, నా పర్సు ఇంట్లోనే పెట్టేసి వచ్చాను అన్నయ్యా.’’

ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తున్న భర్త దగ్గరకు వచ్చింది మానస.

‘‘ఈ హోటల్‌ మేనేజర్‌ మా సెక్షన్‌కి రెగ్యులర్‌గా వస్తుంటాడు. నాకు బాగా పరిచయమే. నేను మాట్లాడతాను’’ అని చెప్పి బిల్‌ కౌంటర్‌కి వెళ్ళి తమ వద్ద ఉన్న డబ్బు ఇచ్చి, మిగతా అమౌంట్‌ తరవాత ఇస్తామని మేనేజర్‌తో మాట్లాడి వచ్చింది.

* * *

మరోరోజు ‘‘అత్తయ్యగారు ఎప్పటినుండో తిరుపతి వెళ్ళాలని అనుకున్నారట. ఈ వీకెండ్‌ వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి కదా... అందరమూ వెళ్ళి అత్తయ్యగారి మొక్కు చెల్లిద్దాం’’ అని కవిత అనేటప్పటికి, కుటుంబమంతా కలిసి ట్రైన్‌లో తిరుపతికి బయలుదేరారు.

తిరుపతి ప్రయాణం రానూపోనూ టిక్కెట్లూ, అక్కడ విడిది ఏర్పాట్లూ, దర్శనం, హోటల్‌ ఖర్చులూ అన్నీ కలిపి తడిసి మోపెడు అయ్యాయి ప్రవీణ్‌, మానసలకి.

‘‘అమ్మా కవితా, నీ పుణ్యమా అని, ఎన్నాళ్ళనుండో ఉన్న మొక్కు తీర్చుకోగలిగాను’’ అన్న అత్తగారి ప్రశంస మాత్రం చిన్నకోడలు కవితకే దక్కింది.

రోజూ పాలప్యాకెట్లు సప్లైచేసే రమేష్‌ ఆరోజు రాత్రి డబ్బుల కోసం ఇంటికి వచ్చాడు. తిరుపతి ప్రయాణం వలన ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోవడంతో, పాలవాడికి ఇవ్వవలసిన పైకం తక్కువయింది.

‘‘ఈ నెల కొంచెం ఖర్చులు ఎక్కువయ్యాయి రమేష్‌. వచ్చేనెల మొత్తం కలిపి ఇస్తాను’’ అని చెప్పి పంపించాడు ప్రవీణ్‌.

ఇవే కాకుండా సినిమాలకంటూ, పండగలకి పిండివంటలంటూ, వచ్చిన చుట్టాలకి బట్టలంటూ అయ్యే ప్రతీ చిన్నా పెద్దా ఖర్చులన్నీ ప్రవీణ్‌మీదే పడటం గమనించాడు తండ్రి రాఘవయ్య.

‘‘ఏరా ప్రవీణ్‌, చిన్నోడికీ పెళ్ళయింది, సంసారం పెద్దదయింది. ఇంటి ఖర్చులు ఎక్కువ అవుతున్నట్లున్నాయి. నువ్వొక్కడివే ఎంతకాలమని ఈ బరువు మోయగలవు? రాజేష్‌ని ఇంటి ఖర్చులకి డబ్బులిమ్మని నేనడుగుతానుండు’’ అన్నాడు రాఘవయ్య.

‘‘అప్పుడే తమ్ముడినెందుకు కష్టపెట్టడం నాన్నా. కొత్తగా పెళ్ళయింది కదా... వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి’’ అనేశాడు ప్రవీణ్‌.

ఈ సంభాషణ అంతా పక్క రూములో అద్దంముందు కూర్చుని భార్యతో తల దువ్వించుకుంటున్న రాజేష్‌ చెవులపడుతూనే ఉన్నా, అతనేమీ జోక్యం చేసుకోలేదు.

* * *

ఈ విషయాలేవీ తెలియని లలితమ్మ మాత్రం, తన చిన్నకోడలి తేనె పూసిన మాటలకీ చేష్టలకీ కరిగిపోతుంటుంది. ఇంటికి వచ్చిన చుట్టాలకీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ‘‘నా చిన్నకోడలు బంగారమమ్మా, నన్ను ప్రాణంలా చూసుకుంటోంది’’ అని చెప్పుకుంటూ ఉంటుంది.

ఒకమారు లలితమ్మ ఇలా చెబుతుండటం విన్న రాఘవయ్య- భార్యని మందలించాడు.

‘‘లలితా, తెలిసీ తెలియక నువ్విలా మాట్లాడే మాటలు పెద్దకోడలి చెవినపడితే ఆ అమ్మాయి నొచ్చుకుంటుంది.’’

‘‘ఇప్పుడు నేనంత కాని మాటలు ఏమన్నానని. పెద్దకోడలు గురించి చెడుగా ఏమీ మాట్లాడలేదే.’’

‘‘చెడుగా మాట్లాడలేదు, నిజమే. కానీ, మంచిగా కూడా చెప్పలేదు నువ్వు. పైగా చిన్నకోడలు బంగారం అంటే ఏమిటీ దానర్థం, పెద్దకోడలు కాదనేగా.’’

‘‘పోనిద్దురూ, నేను మాట్లాడే ప్రతీ మాటకీ విపరీతార్థాలు తీయడం మీకేమీ కొత్త కాదుగా’’ అంటూ సంభాషణని సగంలోనే తుంచేసి వెళ్ళింది లలితమ్మ.

* * *

ఆరోజు సడెన్‌గా రాఘవయ్యకి గుండెలో నొప్పి రావడంతో, హాస్పిటల్లో జాయిన్‌ చేశారు.

‘‘వెంటనే ఆపరేషన్‌ చేయాలి, కనీసం మూడు లక్షలు సిద్ధం చేసుకోండి’’ అని డాక్టర్‌ చెప్పగానే కంగారుపడ్డారందరూ.

‘‘రాజేష్‌, నేనెలాగో కష్టపడి రెండు లక్షలదాకా రెడీ చేయగలుగుతాను. అయినా, ఇంకా లక్ష తక్కువవుతుంది కదా, నువ్వు నీ ఆఫీసులో లోన్‌ తీసుకుని ఆ లక్ష అరేంజ్‌ చేయగలవా?’’

‘‘అన్నయ్యా, నేను ఆల్రెడీ మా ఆఫీసునుండి లోన్‌ తీసుకున్నాను. మా ఫ్రెండ్‌ ఫ్లాట్‌ కొనుక్కోవడానికి కాస్త డబ్బు తక్కువపడిందంటే, ఆఫీసు నుండి లోన్‌ తీసుకుని తనకి హెల్ప్‌ చేశాను. ఇప్పుడు మళ్ళీ లోన్‌ అడిగినా ఇవ్వరు.’’

అన్నదమ్ముల సంభాషణ వింటున్న మానస కలగచేసుకుని ‘‘పోనీ నావీ, కవితవీ నగలు తాకట్టుపెడదామండీ’’ అంది.

అది వింటూనే ‘‘నా నగలు తాకట్టులోనే ఉన్నాయి బావగారూ, మా అన్నయ్యకి ప్రాణంమీదకొచ్చినప్పుడు నగలు తాకట్టుపెట్టి సాయం చేశాం’’ అంది కవిత.

‘‘మా వదినకి ఒంట్లో బాగోలేదని ఫోన్‌ వచ్చింది. తనని చూసి వస్తా’’ అని చెప్పేసి కవిత వెళ్ళిపోయింది. భార్యని డ్రాప్‌ చేయడానికంటూ రాజేష్‌ కూడా వెళ్ళాడు.

ఇక అక్కడ మానస, ప్రవీణ్‌ మిగిలారు.

‘‘అమ్మ బెంబేలుపడుతోంది. నువ్వు అమ్మని చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళి డబ్బుల కోసం ఆఫీసులో ప్రయత్నం చేసొస్తాను’’ అని చెప్పి ప్రవీణ్‌ ఆఫీసుకి వెళ్ళాడు.

అసలే భర్త ప్రాణాపాయంలో ఉన్నాడని బాధపడుతున్న లలితమ్మ, పిల్లల మాటలతో మరింత దిగాలుపడిపోయింది. ఆవిడని పలకరించి, ఓదార్చాలని మానస ప్రయత్నం చేసినా కూడా ముభావంగానే ఉండిపోయింది.

దాంతో లలితమ్మ స్నేహితురాలైన రాజేశ్వరికి కబురుపెట్టింది మానస - స్నేహితురాలు పక్కనుంటే ఆవిడకి కాస్త ధైర్యంగా ఉంటుందని.

* * *

రాజేశ్వరి వస్తూనే ‘‘ఏమిటిది లలితా, పెద్దదానివి నువ్వే ఇలా దిగులుపడిపోతే పిల్లలు ఇంకెలా ఉంటారు చెప్పు’’ అంటూ ఆమెచేత కాఫీ తాగించింది.

కాఫీ తాగిన కొంతసేపటికి లలితమ్మ తేరుకుంది.

‘‘నువ్వేమీ బెంగపడకు లలితా. డాక్టర్లు ఏమీ ఫర్వాలేదని చెప్పారుగా. మీ గృహప్రవేశం టైంకల్లా అన్నయ్యగారు కోలుకుని, హాయిగా తిరుగుతారు చూస్తుండు.’’

రాజేశ్వరి మాటలకి తెల్లబోతూ ‘‘గృహప్రవేశం ఎవరిది రాజీ?’’ అంది లలితమ్మ.

‘‘నా దగ్గరకూడా నీకు మరీ అంత దాపరికమేమిటి లలితా. మీ చిన్నకొడుకు రాజేష్‌, అతని బావమరిది శేఖర్‌ ఒకే అపార్టుమెంటులో ఫ్లాట్స్‌ కొనుక్కుని మొన్ననే రిజిస్టర్‌ చేయించుకున్నారుగా. ‘రేపో మాపో గృహప్రవేశం పెట్టుకుంటాం పిన్నీ, మీరు తప్పకుండా రావాలి’ అంటూ నిన్ననే శేఖర్‌ భార్య పద్మ చెప్పింది నాతో.’’

లలితమ్మకి అంతా అయోమయంగా అనిపించింది.

కొద్దిసేపటికిందట, ఆపరేషన్‌కి డబ్బులు సర్దుబాటు చేయమని పెద్దకొడుకు అన్నప్పుడు... చిన్నకొడుకూ కోడలూ చెప్పిన కారణాలకీ, రాజేశ్వరి చెప్పిన విషయానికీ ముడేస్తే అసలు జరిగినదేమిటో తేటతెల్లంగా అర్థమయింది ఆమెకి.

భర్త అప్పుడప్పుడూ తననెందుకు మందలించేవాడో ఇప్పుడు తెలిసొచ్చింది. ‘ఈ వయసులో కూడా పైపై మాటలకి మురిసిపోయానేగానీ, బంగారానికీ ఇత్తడికీ తేడా తెలుసుకోలేకపోయానే’ అని మనసులోనే బాధపడింది.

ఈలోగా ప్రవీణ్‌ వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసే అకౌంటెంట్‌ శ్రీహరి వచ్చాడు.

‘‘మేడం, ఈ డెబ్భైఐదు వేలు మీకివ్వమని ప్రవీణ్‌ సార్‌ చెప్పారు. మిగతా పాతికవేలు ఒక గంటలోగా తెస్తానని చెప్పమన్నారు’’ అంటూ బ్యాగు నుండి డబ్బులు తీశాడు.

‘‘ఇంత డబ్బు ఆఫీసు ఎలా ఇచ్చింది హరీ. మేమిద్దరం అన్నిరకాల లోన్లూ వాడేశాం కదా’’ అంది మానస.

‘‘మీరూ, ప్రవీణ్‌ సారూ పదేళ్ళుగా మన కోఆపరేటివ్‌ సొసైటీలో స్థలం కోసం ఇన్‌స్టాల్‌మెంట్స్‌ కట్టారు కదా... ఆ డబ్బు మేడం ఇది. ఆ స్థలాన్ని క్యాన్సిల్‌ చేశారు ప్రవీణ్‌ సార్‌. వాళ్ళ నాన్నకి ప్రాణంమీదకొచ్చిందట కదా.’’

‘‘పోనీలే, మంచి పనే చేశారు. మనిషి ప్రాణంకన్నా విలువైంది కాదుగా ఏదైనా’’ అంటూ ఆ డబ్బులు అందుకుంది మానస.

మరో గంటలో హాస్పిటల్‌ ఫీజు మొత్తం జమ చేయగానే, రాఘవయ్యని ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకుని వెళ్ళారు. అంతవరకూ దుఃఖాన్ని బిగపట్టి ఆపుకున్నదల్లా, లలితమ్మ ఒక్కసారిగా భోరుమనడంతో కంగారుపడ్డారు ప్రవీణ్‌, మానసా.

‘‘అమ్మా, నాన్నగారికి ఏమీకాదమ్మా, క్షేమంగా తిరిగొచ్చేస్తారు’’ అంటూ ఓదార్చబోయిన కొడుకుని వాటేసుకుని వెక్కిళ్ళు పెట్టింది లలితమ్మ.

‘‘మణిమాణిక్యాల్లాంటి నిన్నూ, కోడలినీ ఇంతకాలం గుర్తించలేకపోయానురా. మట్టి బెడ్డలనే రత్నాలనుకుని తలమీద పెట్టుకున్నాను. నన్ను క్షమించరా బాబూ. పుత్తడికీ ఇత్తడికీ తేడా తెలుసుకోలేకపోయిన ఈ అత్తని క్షమించమ్మా మానసా’’ అంటూ రోదిస్తున్న లలితమ్మని పొదివి పట్టుకుంది మానస.

‘‘అయ్యో, అవేం మాటలు అత్తయ్యా. పెద్దవారు, మమ్మల్ని క్షమాపణలు అడగడమేమిటి? క్షమించేటంత తప్పు మీరేమీ చేయలేదు. మాటల గారడికి ఎప్పుడో ఒకప్పుడు పడిపోనివారు ఈ లోకంలో ఎవరూ ఉండరు అత్తయ్యా.’’

‘‘నీదెంత మంచి మనసమ్మా. పెద్దదాన్నయివుండీ ఏం లాభం... పైపై మెరుగులకే మోసపోయాను. ఇప్పటికైనా ఆ దేవుడు నా కళ్ళు తెరిపించబట్టి నీ విలువ తెలుసుకోగలిగాను’’ అంటూ మానసని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది లలితమ్మ.

* * *

ఇలా నాలుకపై తేనె రాసుకునీ, మధురమైన మాటలతో మిమ్మల్ని ఆకుట్టుకునీ, మీ డబ్బుతో తమ పబ్బం గడుపుకుంటూ, మీ వెనకే గోతులు తీసే ప్రబుద్ధులు మీ ఇంట్లో, పక్కింట్లో, ఆఫీసులో... ఒకచోటని లేదు, ఎక్కడపడితే అక్కడే ఉంటారు. తస్మాత్‌ జాగ్రత్త!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.