close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇక్కడ రైతు చెప్పిందే ధర!

ఇక్కడ రైతు చెప్పిందే ధర!

23 ఏళ్ల కుర్రాడు... దేశంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాడు. అన్నదాతల కష్టాన్ని సొమ్ము చేసుకునే దళారీ వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆ కృషిని గుర్తిస్తూ ఫోర్బ్స్‌ సంస్థ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 మంది యువ సామాజిక వ్యాపారుల జాబితాలో అతడినీ చేర్చింది. ఆ కుర్రాడి పేరు ఆదిత్య. అతడు చూపిస్తోన్న పరిష్కారం పేరు ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’.

త్తరాంధ్ర పల్లెల నుంచి ఉత్తర భారతం అంచుల దాకా ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలు పండించే రైతులను వేధించే ప్రధాన సమస్య, ఆ పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడమే. అప్పులు తెచ్చుకొని, నీళ్ల తిప్పలు దాటుకొని, కాయకష్టం చేసి పంట పండించడం ఒకెత్తయితే, దాన్ని కోసి మార్కెట్‌కి తీసుకెళ్లి వేలం వేయడం, మధ్య వర్తులకు అమ్మడం మరో పెద్ద పని. ఆ క్రమంలో గిట్టుబాటు ధర రాక, కనీసం పెట్టుబడి కూడా మిగలక నష్టాలకే అమ్ముకుంటున్న వాళ్లూ, ఆ పని చేయలేక పంటనంతా చెరువుల్లోనో, మురికి గుంటల్లోనో పడేసి వెళ్లిపోయే రైతులూ లక్షల మంది కనిపిస్తారు. దళారులు రైతుల దగ్గర తక్కువ మొత్తానికి పంటను కొని, వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్మడం వల్లే ఇలాంటి పరిస్థితులొస్తున్నాయి. దానికి శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో మొదలైందే ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’. ఇక్కడ రైతుకీ, వ్యాపారికీ మధ్య ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ మాత్రమే మధ్యవర్తి. తన పంటకు ఎంత ధర ఆశిస్తున్నాడో రైతు చెబుతాడు. ఆ మొత్తం చెల్లించి పంటను కొనుగోలు చేసే వ్యాపారుల ఆచూకీని సంస్థ చూపిస్తుంది. బేరం కుదిరాక రైతు పంటని కోస్తే చాలు, ఉత్పత్తుల్ని గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ చేసి వ్యాపారికి అందించే వరకూ సంస్థే చూసుకుంటుంది. ఇక్కడ రైతులకు రవాణా ఖర్చులుండవు. గిట్టుబాటు ధర కోసం, కొనుగోలుదార్ల కోసం వెంపర్లాడే అవసరం ఉండదు. వ్యాపారులకు కూడా మధ్యవర్తులతో బేరసారాల్లో నష్టపోకుండా నేరుగా రైతు చెప్పిన ధరకే తనకు కావల్సిన నాణ్యతతో పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలా అమ్మే రైతుతో పాటు కొనే వ్యాపారికీ ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’తో భాగస్వామ్యం లాభసాటిగా మారుతోంది.

పరిశ్రమలతో ఒప్పందం
పట్టణాలూ, పల్లెలన్న తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ల వినియోగం విస్తరించింది. చదువుతో సంబంధం లేకుండా దాదాపు అందరూ వాటిని ఉపయోగించడం నేర్చుకుంటున్నారు. ఆ స్మార్ట్‌ఫోనే వారధిగా ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ పనిచేస్తుంది. ఫోన్లో ఆ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని రైతు తాను పండిస్తున్న పంట వివరాలూ, రానున్న దిగుబడి, ఆశిస్తున్న ధరకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్లో తెలియజేస్తే చాలు, ఆ ధర చెల్లించడానికి సిద్ధపడే వ్యాపారుల్ని సంస్థే అన్వేషిస్తుంది. ఆపైన పంటను ఎప్పుడు కోయాలన్న సమాచారాన్ని రైతుకి అందిస్తుంది. తరవాత సంస్థ ప్రతినిధులే వచ్చి పంటను నాణ్యతను బట్టి వేరుచేసి, ప్యాకింగ్‌ పనులు పూర్తిచేసి వ్యాపారి దగ్గరికి తరలిస్తారు. ఆ మొత్తం లావాదేవీలో నామమాత్రంగా సంస్థ కొంత ఫీజు తీసుకుంటుంది. వ్యాపారికి రైతు అందించే పంట నాణ్యత నచ్చితే ముందస్తుగానే ఆర్డర్లు తీసుకొని పంటను పండించొచ్చు. దానికోసం రిటైల్‌ చెయిన్లూ, రెస్టారెంట్లూ, స్నాక్స్‌ తయారీ పరిశ్రమలూ లాంటి అనేక సంస్థలతో ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ భాగస్వామ్యం ఏర్పరచుకుంది.

పదిలక్షల కిలోలు...
ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాల్సిన ఆదిత్య అనే 23ఏళ్ల కుర్రాడు రైతుల కోసం ఇంత పెద్ద వ్యవస్థను అభివృద్ధి చేశాడు. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదవడానికి వెళ్లిన ఆదిత్య రెండేళ్ల క్రితం ఓసారి సెలవుల్లో ఇంటికొచ్చాడు. దేశంలోని రకరకాల సమస్యల గురించి తండ్రితో చర్చించే సమయంలో రైతుల ఇక్కట్లు ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యక్షంగా వాటి గురించి తెలుసుకునే ఉద్దేశంతో తండ్రీ కొడుకులిద్దరూ ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పల్లెటూళ్లకు తిరిగారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా రైతులందరిలో వాళ్లకు కనిపించిన ప్రధాన సమస్య, పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడమే. చుట్టూ ఉన్న పల్లెల్లో సమస్యల్ని పెట్టుకొని తాను అమెరికా వెళ్లి చేసే ఇంజినీరింగ్‌తో ఉపయోగం లేదనుకున్న ఆదిత్య, అక్కడితో చదువుకి స్వస్తి పలికి తండ్రితో కలిసి ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ (kisannetwork.in) కి పునాది వేశాడు. మొదట దేశవ్యాప్తంగా అనేక గ్రామాలకు తిరిగి, పొలం నుంచి పరిశ్రమలూ వినియోగదారుల వరకూ పంట చేరే క్రమంలో వారెంత నష్టపోతోందీ తెలియజేయడంతో పాటు ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ గురించి అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఆపైన గ్రామాల్లో కొందరు యువకులను వలంటీర్లుగా నియమించి రైతులను తమ సంస్థలో భాగమయ్యేలా చూశాడు. క్రమంగా ‘కిసాన్‌ నెట్‌వర్క్‌’ని విస్తరిస్తూ ఈ రెండేళ్లలో తన వేదిక ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల కిలోల వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదార్లూ, పరిశ్రమలకు అమ్మగలిగాడు.

ఆదిత్య ఆలోచనను అభినందిస్తూ ‘థీల్‌’ సంస్థ రూ.68లక్షల ఫెలోషిప్‌ను అందించింది. ‘వై కాంబినేటర్‌’ అనే సంస్థ కూడా కొంత పెట్టుబడితో ప్రోత్సహించింది. ఇప్పుడు ‘ఫోర్బ్స్‌’ సంస్థ ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా జల్లెడ పట్టి ఎంపిక చేసిన సామాజిక వ్యాపారుల జాబితాలో అతడిని చేర్చింది. బేసిక్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లోనూ పనిచేసే విధంగా అప్లికేషన్‌ను రూపొందించిన ఆదిత్య, అదీ కష్టమనుకునేవాళ్ల కోసం ‘1800-3000-2422’ టోల్‌ ఫ్రీ నంబర్‌నీ, మిస్డ్‌ కాల్‌ ఇస్తే తిరిగి కాల్‌ చేసే సదుపాయాన్నీ అందుబాటులోకి తెచ్చాడు. దళారీ వ్యవస్థే లేకుండా మొత్తం దేశాన్ని ఒకే మార్కెట్‌గా మార్చే ప్రయత్నంతో ముందుకెళ్తున్నాడు.


లారీలకు భలే మంచి బేరం!