close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇద్దరూ... ఒక్కటై...

ఇద్దరూ... ఒక్కటై...
- సునీతమూర్తి

య్యాలలో ఆదమరచి నిద్రపోతున్న చంటివాడిని చూసి మురిసిపోయింది శ్రావణి. ఆ చిన్నవాడి లేతగులాబీ పెదవులపై తళుక్కున విరబూసిన చిరునవ్వుల హరివిల్లును చూసి ముగ్ధురాలైపోయింది. ఇప్పటిదాకా తాను పడిన మానసిక సంఘర్షణంతా మాయమైపోయి ఆమె మనసు దూదిపింజలా మారి గాలిలో తేలిపోయింది. ఎంత ఆలోచించినా దొరకని పరిష్కారం పసివాడి అమాయకమైన ముఖం చూడగానే దొరికింది. ఇక తాను ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసింది.

నిద్రపోయి ఉంటే పిల్లాడు ఎక్కడ లేచిపోతాడో అన్న జాగ్రత్తతో మెల్లగా తలుపుతట్టిన శబ్దం వినిపించింది శ్రావణికి.

ఇంకెవరు, వచ్చింది అమరే! వెళ్ళి తలుపు తెరిచింది. చిరునవ్వుతో లోనికి వచ్చిన అమర్‌ పలకరింపుగా శ్రావణి భుజాన్ని తట్టి, ఉయ్యాల్లో నిద్రపోతున్న బాబు దగ్గరకి వెళ్ళాడు. ఒక్క నిమిషంపాటు వాడిని తృప్తిగా చూసి, స్నానానికి వెళ్ళాడు. భోజనాలూ, పనులూ పూర్తయ్యాక భార్యాభర్తలిద్దరూ సావకాశంగా కూర్చున్నారు.

‘‘నేనొక నిర్ణయానికి వచ్చాను అమర్‌’’ అంది శ్రావణి.

శ్రావణి ఏం చెప్పబోతోందో ముందే వూహించిన అమర్‌, అది ఆమె నోటివెంట విందామని ఆగాడు.

‘‘నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను’’ అంది.

సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు అమర్‌. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె ముఖంలో కానీ కళ్ళల్లో కానీ ఎక్కడా బాధ కనిపించలేదు. నిర్మలంగా, మనస్ఫూర్తిగా పలికిన మాటలు అవి.

‘‘ఇదేనా నీ నిర్ణయం’’ అని అడిగాడు అమర్‌.

అవునన్నట్లు తలూపింది శ్రావణి.

* * *

శ్రావణి, అమర్‌ల వివాహమై సరిగ్గా నాలుగేళ్ళు కావస్తోంది. అమర్‌ కేంద్ర ప్రభుత్వోద్యోగి. పెళ్ళినాటికే వివిధ పోటీ పరీక్షలకి సిద్ధమవుతోంది శ్రావణి. వారి మొదటి పెళ్ళిరోజునాటికి శ్రావణి- రాష్ట్ర ప్రభుత్వోద్యోగిగా మంచి ఉద్యోగం సంపాదించింది. ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ సంతోషమే వాళ్ళకి ఎడబాటును కూడా కలిగించింది. ఇద్దరికీ వేర్వేరు వూళ్ళల్లో కొలువులు. సెలవురోజులూ ఆదివారాలూ ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళిరావటం... ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవటం... బదిలీ ప్రయత్నాలూ... వీటితో రెండేళ్ళు భారంగా గడిచాయి ఇద్దరికీ. ఇంతలో శ్రావణి-అమర్‌ తల్లిదండ్రులై పండంటి బాబుని తమ జీవితాల్లోకి ఆహ్వానించి ఆనందడోలికల్లో విహరించారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉంది శ్రావణి.

ఈ ఉరుకుల పరుగుల జీవితం చాలా దుర్భరంగా అనిపిస్తోంది ఇద్దరికీ. బదిలీ కోసం చేసిన ప్రయత్నాలూ ఫలితం చూపలేకపోయాయి. పై వూళ్ళల్లో ఉంటున్న తమ ఇద్దరి తల్లిదండ్రుల్లో ఎవరివద్దనైనా పిల్లాడిని ఉంచి, ఈ మలివయసులో వాళ్ళని హాయిగా ఉండనివ్వకుండా మళ్ళీ బాధ్యతల సుడిగుండాల్లోకి లాగటం ఇద్దరికీ ఇష్టంలేదు. అలాగని ఏ డేకేర్‌ సెంటర్లోనో, లేక ఇంటిదగ్గర ఆయాని నియమించుకునో బాబుని చూసుకోవచ్చని అనుకున్నా... భార్యాభర్తలిద్దరూ ఒకే వూళ్ళొ ఉంటే ఈ ఏర్పాటు ఫర్వాలేదు కానీ, తానో వూళ్ళొ, భర్త మరో వూళ్ళొ, తమ బాబు వేరేవాళ్ళ సంరక్షణలో... ఇదంతా శ్రావణి మనసుకి రుచించటం లేదు. తమకి నెరవేర్చాల్సిన అదనపు బాధ్యతలేవీ లేవు. ఒక్కరి సంపాదనతోనూ తమ జీవితం చాలా హాయిగా గడవగలదు. రోజంతా ఎంత కష్టపడినా, రాత్రికి ఇంటికి చేరేసరికి భార్య, భర్త, పిల్లలు అంటూ తమ చిన్న ప్రపంచం తమని స్వాగతిస్తే ఆరోజు పడిన అలసటంతా తీరిపోతుంది. లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా ఏం ప్రయోజనం అనిపించింది శ్రావణికి. నెల చివర్లో తన బ్యాంకు అకౌంటులో పడే డబ్బు కోసం నెలంతా దుఃఖపడటం తనకి నచ్చడంలేదు. తన భర్తతో గడిపే సమయం, కలిసి భోజనం చేయటం, బయటికి వెళ్ళిరావటం, కులాసాగా కబుర్లు చెప్పుకోవటం లాంటి చిన్నచిన్న ఆనందాలని కోల్పోవటం అసలు ఇష్టంలేదు. ఇటువంటి చిన్నిచిన్ని ఆనందాలతోటే జీవితం పరిపూర్ణమవుతుందని ఆమె నమ్మకం- ఇవీ శ్రావణి ఆలోచనలు.

అయితే అమర్‌ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. శ్రావణి చాలా తెలివైన అమ్మాయి. ఎంతో కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించుకుంది. ‘ఉద్యోగం చేయటం చిన్నప్పట్నుంచీ తన కల’ అని ఎన్నోసార్లు తనతో చెప్పింది శ్రావణి. అంతేకాక, తనున్న ఉద్యోగంలో తను ఎంతో పైకి ఎదగగలదు. ఉన్నత శిఖరాలను చేరుకోగలదు. అవన్నీ తను ఇప్పుడు వద్దనుకుంటోంది. ఎందుకు... కుటుంబం కోసం. ఇంకా చెప్పాలంటే- తనకోసం, తనతో కలిసి జీవించటం కోసం. తనకోసం ఆమె అంత త్యాగం చేయటం అతని మనసుకి బాధగా అన్పిస్తోంది. ‘ఇది త్యాగం కానేకాదు... నాకోసం, నా ఆనందం కోసం తీసుకున్న నిర్ణయం. నీతో కలిసి జీవించటమే నా ఆనందం’ అని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది శ్రావణి. పైకి చాలా సాధారణమైన సమస్యగా కనిపించినా, లోతుగా ఆలోచిస్తే మనసుల్ని మెలిపెట్టేసే సమస్య తమది. ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే, తను చేస్తున్న ఉద్యోగంలో బదిలీలు తప్పనిసరి. దేశంలోని ఏ ప్రాంతానికైనా తనని బదిలీ చేయవచ్చు. కానీ శ్రావణి ఉద్యోగం ఈ రాష్ట్రానికే పరిమితం. తామిద్దరూ కలిసి బతకాలంటే తెగించి కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదు అనిపించింది అతనికి.

* * *

స్కూల్‌ యూనిఫారమ్‌లో భలే ముద్దొస్తున్నాడు రెండో తరగతి చదువుతున్న తమ బాబు అనుదీప్‌. బైక్‌ మీద బాబుని కూర్చోబెట్టుకుని గేటు దగ్గర నిల్చున్న శ్రావణి పక్కన బైక్‌కి బ్రేక్‌ వేశాడు అమర్‌.

‘‘బై, అమ్మా!’’ అని చెప్తున్న బాబుకి చేయి వూపి టాటా చెప్పింది శ్రావణి.

‘‘బై, శ్రావణీ’’ అని చెప్పి, బైక్‌ పోనిచ్చాడు అమర్‌.

ఇంతలో ఇంటిముందు ఓ కారు ఆగింది. కారులోంచి బంట్రోతు హడావుడిగా దిగి ‘‘సారీ మేడమ్‌, ట్రాఫిక్‌ వల్ల లేటయింది’’ అని, కొంచెం లేటుగా కారు వచ్చినందుకు క్షమాపణ చెప్పి, కారు వెనుక డోర్‌ తెరిచి పట్టుకున్నాడు.

‘సరే’ అన్నట్లు తలూపి కారు ఎక్కింది శ్రావణి.

ఆరోజు పేపరులో ఆమె ఇంటర్వ్యూ ప్రచురించారు. నిబద్ధతా, నిజాయతీగల అధికారిణిగా గుర్తింపు తెచ్చుకుంది శ్రావణి. ఆమెనీ ఆమె పనితీరునీ వ్యాసంలో ప్రశంసించారు. కారులో ఉన్న పేపరుని తీసి తన ఇంటర్వ్యూ పేజీని మరోమారు చూసింది శ్రావణి. కారు వేగంగా ముందుకు పరిగెడుతోంది. అంతకంటే వేగంగా ఆమె మనసు గతంవైపుకి పరుగులు తీసింది.

* * *

ఆరోజు అమర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పగానే ఉలిక్కిపడింది శ్రావణి. ఆమెకి చెప్తే అందుకు ససేమిరా ఒప్పుకోదని ఆమెకి చెప్పకుండానే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు అమర్‌. తమ సమస్య తీరిపోయిందని నవ్వుతూ చెప్పాడు. ‘ఎందుకీ త్యాగం’ అని ఆమె అడిగితే ‘ఇది త్యాగం కానేకాదు... నాకోసం, నా ఆనందం కోసం తీసుకున్న నిర్ణయమిది. నీతో కలిసి జీవించటమే నా ఆనందం’ అని తన మాటలనే తనకి అప్పజెప్తున్న అమర్‌ కళ్ళల్లోకి అశ్రునయనాలతో చూసింది శ్రావణి. ఎంతో నిజాయతీతో, ప్రేమతో అంటున్న అతని మృదువైన మాటలు ఆమె హృదయాంతరాల్ని తాకాయి. అయినాసరే, ఆమె అమర్‌ నిర్ణయాన్ని సమర్థించలేకపోతోంది. ప్రపంచం తలకిందులైనట్లుగా తోచింది ఆమెకి. చివరికి తనెందుకీ నిర్ణయం తీసుకున్నాడో విడమరచి చెప్పి శ్రావణి మనసును సమాధానపరిచే ప్రయత్నం చేశాడు అమర్‌.

‘‘అందరం స్త్రీ అభ్యున్నతీ, సాధికారతా అని ఉపన్యాసాలు ఇస్తాం. ఫేస్‌బుక్‌లో ఈ అంశం మీద వచ్చే కొటేషన్లకీ వ్యాసాలకీ లైకులు పెడతాం. మిత్రులకి షేర్‌ చేస్తాం. కానీ నిజజీవితానికి వచ్చేసరికి అందుకు భిన్నంగా చేస్తాం. ఇలాంటి ద్వంద్వవైఖరి ప్రదర్శించే మనుషులు కాదు సమాజానికి కావాల్సింది, వాటిని ఆచరణలోపెట్టి చూపించే ధైర్యవంతులు కావాలి. నేను ధైర్యవంతుణ్ణి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

శ్రావణీ! హోదాలో, వేతనంలో కూడా నా ఉద్యోగంకన్నా నీ ఉద్యోగం పెద్దది. మరెంతో పురోగతికీ ఆస్కారం ఉంది. అది సాధించగలిగే సత్తా కూడా నీలో ఉంది. భర్తనీ, మగవాడినీ అయినందుకు ఉద్యోగం చేయటం నా హక్కనీ... భార్యవీ, స్త్రీవీ కాబట్టి కుటుంబం కోసం త్యాగం చేయటం నీ బాధ్యతనీ ఆలోచించటం చాలా పొరపాటు. ‘ఉద్యోగం కేవలం పురుష లక్షణం’ అన్నది నా అభిప్రాయంలో బూజుపట్టిన పాత సామెత! నిజమైన పురుష లక్షణం అంటే... స్త్రీ-పురుష భేదం ఎంచకుండా నిజమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించటం. అదే నేనిప్పుడు చేస్తున్నది. దీనికి త్యాగం అన్న పేరు అస్సలు నప్పదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా తీసుకున్న ఏ నిర్ణయమైనా త్యాగం అన్న పదానికి చోటివ్వదు.

ఇక సమాజం అంటావా... ఒకప్పటి సమాజ దృష్టికీ, నేటి సమాజానికీ చాలా తేడా ఉంది. స్త్రీని ఒక వ్యక్తిగా గౌరవించే సమాజం ఉద్భవిస్తోంది. ఆమెలోని ప్రతిభకి పెద్దపీట వేస్తోంది. పాత ఆలోచనలు పూర్తిగా రూపుమాసిపోవటానికి కొంత సమయం పట్టొచ్చు. అయితే, సమాజానికి భయపడో, లేక ఎవరో ఏదో అంటారనో ఆలోచించి, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటం మూర్ఖత్వం.

ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుదన్నది తరతరాలుగా వస్తున్న సామెత. అయితే, ప్రతి స్త్రీ విజయం వెనుకా సమాజం నిలబడాలన్నది కొత్త నినాదంగా మారాలి. ఇంకెన్నాళ్ళు కేవలం స్త్రీలే కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు? మేము కూడా ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. పాత భావాలతో మమ్మల్ని వెనక్కి లాగాలని చూసే సమాజంతో మాకు పనిలేదు. వాళ్ళని మేం పట్టించుకోం. మా నవయుగంలో స్త్రీని అబలగా కాదు, సబలగా చూస్తున్నాం. స్త్రీలు మాకు ఏ విధంగానూ తీసిపోరు. ఇంకా చెప్పాలంటే, కొన్నింట మాకన్నా ముందున్నారన్న సత్యాన్ని నిర్భయంగా ఒప్పుకోగలం. మా చదువుల కోసం మా అక్కాచెల్లెళ్ళ చదువులని పణంగా పెట్టనివ్వం. జీవిత భాగస్వామే అన్ని విషయాల్లో రాజీపడాలని కోరుకోం. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకున్నప్పుడు స్త్రీ-పురుష కోణంలోంచి కాకుండా సమానత్వకోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల సత్తా మాకుంది. అదే నేనిప్పుడు చేసింది’’ అన్నాడు స్థిరంగా.

* * *

బాబుని చక్కగా తనే పెంచాడు. ఇద్దరి తల్లిదండ్రులకీ తను తీసుకున్న నిర్ణయం ఎలా సరైనదో అర్థమయ్యేలాగా తెలియజెప్పాడు. కొందరన్న నిష్ఠూరపు మాటల్ని బావురుకప్పల అరుపుల కింద జమకట్టాడు. ఏనాడూ తన నిర్ణయానికి బాధపడలేదు, పొరపాటు చేశానని కుంగిపోలేదు. శ్రావణికెంతో సహకరిస్తూ, ఆమెకి వెన్నుదన్నుగా నిలిచి ఆమెనెంతగానో ప్రోత్సహిస్తున్నాడు. బాబుని స్కూల్లో చేర్పించాక, తనకి టీచింగ్‌ అంటే ఇష్టమని వాళ్ళుంటున్న వూళ్ళొనే మంచి ఇంజినీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్‌ అయ్యాడు. వాళ్ళసంసారనౌక సంతోషాల సాగరంలో హాయిగా సాగిపోతోంది. భార్యాభర్తలుగా పేరుకి ఇద్దరైనా, ప్రేమతో ఒక్కటై తమ ఆనందాలని పెనవేసుకుని నవసమాజానికి ప్రతీకలుగా నిలిచారు శ్రావణి-అమర్‌లు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.