close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పౌరులందు... ‘వీఐపీ’ పౌరులువేరయా!

పౌరులందు... ‘వీఐపీ’ పౌరులువేరయా!

భారత ప్రజలమైన మేం...
మాకు మేముగా సమర్పించుకుంటున్నాం -
అని సంకల్పం చెప్పుకుంటూ, మనకు మనం రాజ్యాంగాన్ని అంకితం చేసుకుని అరవైయేడేళ్లు గడిచిపోయాయి. ఆ స్ఫూర్తి, పూర్తిగా కాకపోయినా ఎంతోకొంత మంటగలిసిపోయింది. అందులోనూ, సమానత్వపు హక్కు...సకల హక్కులకూ అంతరాత్మ! దాన్నీ తుక్కుతుక్కుగా మార్చేసి తూకానికేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-14 ప్రకారం భారత ప్రజలంతా సమానమే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి కొందరేమో ఎక్కువ సమానం, మిగిలినవాళ్లు తక్కువ సమానం. ఎక్కువ సమానమైనవాళ్లు వీధుల్లో వూరేగుతున్నప్పుడు, తక్కువ సమానమైనవాళ్లు బైకులూ కార్లూ ఆపేసుకుని చోద్యం చూడాల్సిందే. ఎక్కువ సమానమైన వాళ్లు మహాద్వారంలోంచి నేరుగా దైవ దర్శనానికి వెళ్తుంటే, తక్కువ సమానమైనవాళ్లు గంటలకు గంటలు వంతు కోసం వేచి చూడాల్సిందే. ఆ వెరీ ఇంపార్టెంట్‌ పర్సన్‌ (వీఐపీ)...హోదా కోసం ఎవరికివారు అర్రులు చాస్తున్నారు.

వీఐపీ సీట్లూ, వీఐపీ గేట్లూ, వీఐపీ ఘాట్లూ, వీఐపీ టికెట్లూ, వీఐపీ కోటాలూ, వీఐపీ వాటాలూ, వీఐపీ రోగులూ, వీఐపీ ఖాతాదారులూ, వీఐపీ భక్తులూ...ఆ జాబితాకు అంతే లేదు. ఏదో ఓరోజు, శవాలకూ ‘వీఐపీ ట్యాగ్‌’ తగిలించినా తగిలిస్తారు. ఇదంతా చూసి కడుపుమండే, ‘ఈ వైభోగాలన్నీ సరిపోకపోతే...నెత్తిన బుగ్గలైటు పెట్టుకుని కుట్లు వేయించుకోండి. పదవులకూ హోదాలకూ సంబంధం లేకుండా శాశ్వత ప్రముఖులు అయిపోవచ్చు. మేం పీల్చే గాలే మీరూ పీలిస్తే వీఐపీ మర్యాదలకు భంగమేమో. ఓ ఆక్సిజన్‌ సిలిండరు కొనుక్కుని (అదీ వీఐపీ బ్రాండుదే) మాస్కు లాంటిదేదో మొహానికి బిగించుకోండి. సామాన్యులు భోంచేసే లవణమన్నం మీకెందుకు కానీ, హాయిగా బంగారు మెతుకుల్ని గతుకుతూ బతికేయండి’ అంటూ ఆన్‌లైన్‌ వేదిక మీద ఆగ్రహాన్ని ప్రదర్శించాడో ఇ-పౌరుడు. అచ్చమైన ధర్మాగ్రహమిది. ఇంటర్నెట్‌ వేదికగా ‘స్టాప్‌ వీవీఐపీ రేసిజమ్‌’ పేరుతో ఓ ఉద్యమమే నడుస్తోందిప్పుడు.

ఓ అంచనా ప్రకారం...
బ్రిటన్‌లో మొత్తం వీఐపీల సంఖ్య - ఎనభై నాలుగు!
ఫ్రాన్స్‌లోని ప్రముఖులు - నూట తొమ్మిది!
జపాన్‌లో...నూట ఇరవై అయిదు!
జర్మనీలో...నూట నలభైరెండు!
ఆస్ట్రేలియాలో...రెండొందలా అయిదు!
అమెరికాలో...రెండొందలా యాభైరెండు!
దక్షిణ కొరియాలో..రెండొందలా ఎనభై!
రష్యా విషయానికొస్తే...ఆ సంఖ్య మూడొందలా పన్నెండు!

జనాభాలో పెద్దన్నలాంటి చైనా కూడా నాలుగువందలా ముప్పై అయిదు మందిని మాత్రమే ప్రముఖులుగా గుర్తించింది. అదే, మన దేశంలో...5,79,092. అక్షరాలా ఐదు లక్షల డెబ్భై తొమ్మిదివేలా తొంభైరెండు మంది! దేశాధ్యక్షుడూ, ఉపాధ్యక్షుడూ, ప్రధానీ, కేంద్రమంత్రులూ, సభాపతీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, గవర్నర్లూ...తదితర రాజ్యాంగ హోదాల్లో ఉన్నవారినంతా కలుపుకోగా ఇంత లెక్క తేలింది. అనధికారిక వీఐపీల్నీ, స్వయం ప్రకటిత వీఐపీల్నీ, వారసత్వ వీఐపీల్నీ...ఇలా ఏ ఒక్కర్నీ వదలకుండా ఓడ ఎక్కించి ఏ అనామక దీవికో పంపేస్తే - ఆ జనాభాతో ఓ చిన్న దేశమే తయారైపోతుంది. ‘వీఐపీస్థాన్‌’ అని పేరుపెట్టుకోవచ్చు.

ఆగిపోవాల్సిందే...
పెత్తందారీ వ్యవస్థ పల్లెల నెత్తినెక్కి నాట్యం చేస్తున్నప్పటి కథ ఇది. వూరి జనమంతా తలో రూపాయీ వేసుకుని ఏ రచ్చబండ దగ్గరో నాటకాల్ని ప్రదర్శించేవారు. తప్పక రావాలంటూ...గ్రామ పెద్దల్నీ ఆహ్వానించేవారు. సకాలంలో వేంచేస్తే పెద్దలెందుకు అవుతారూ! ఎంత ఆలస్యం చేస్తే అంత గొప్ప. నడిరేయి ఏ జామునో జామ్మంటూ కారు దిగేస్తారు. అయినా సరే, అప్పటిదాకా తెర లేవకూడదు. తెలిసో తెలియకో ప్రారంభించినా, ఆలస్యంగా వచ్చిన ఆ పెద్దమనిషి కోసం మళ్లీ మొదలుపెట్టాలి. మరి కాసేపటికి, ఇంకో పెద్దాయన వస్తాడు. చేసేదేముందీ, ఇంకోసారి ఆడాల్సిందే. ఆ ‘మొదలాడే...’ పద్ధతే, ఆధునిక సమాజంలో ‘వీఐపీ సంస్కృతి’గా దర్శనమిస్తోందంతే!

‘మీ కాన్వాయ్‌ కారణంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు’
‘అయితే...
’‘గంటల తరబడి రోడ్డు మీదే ఉండాల్సి వస్తోంది’
‘ఉండనివ్వండి’
‘జనానికి కష్టం అవుతోంది’
‘భరించనివ్వండి. ఇంట్లోనే కూర్చుంటే పాలన సాగించలేను కదా!’

సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వీఐపీ వాహనాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు స్పందించిన తీరిది. ‘షోలే’లో గబ్బర్‌సింగ్‌ నవ్వితే, అనుచరులంతా పళ్లికిలించినట్టు...ఏలినవారి చతురోక్తులకు చుట్టూ ఉన్న భజనబృందం భలేభలే అంటూ చంకలుగుద్దుకుంది. సామాన్యుడు మాత్రం, ‘వీళ్లనా నేను ఓటేసి గెలిపించింది!’ అని మొహం వేలాడేసుకున్నాడు.

ఆమధ్య, ఉత్తరాదిలోని ఓ పార్టీ అగ్రనేత ...కార్యకర్తల ర్యాలీ ముగించుకుని వచ్చి రైలు ఎక్కాలనుకున్నాడు. బండైతే పట్టాల మీదికి వచ్చింది కానీ, లీడరుగారు మాత్రం స్టేషనుకు చేరుకోలేదు. కాలానికి వీఐపీల వ్యవహారాలు తెలియవుగా! గంట మోగింది. బండి కదిలింది. తమ నాయకుడిని ఎక్కించుకోకుండా రైలు కదలడం ఏమిటంటూ...వీరవిధేయులు చైను లాగారు. అధినేత బండెక్కేదాకా స్టేషను మొత్తాన్నీ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ తతంగమంతా కండువా పెద్దమనిషి కనుసన్నల్లో నడిచిందన్న వాదనా ఉంది. ఇంత జరిగినా ఆ నేత నోరు మెదపలేదు. ప్రయాణికులకు క్షమాపణ చెప్పే ప్రయత్నమూ చేయలేదు. అంతటి ‘వీఐపీ’ అభిజాత్యం!

ఓసారి, ముంబయిలోని ఓ క్రీడాసంఘం ఆవరణలో ఫ్యాషన్‌షో జరిగింది. ముఖ్యనేతను ముఖ్య అతిథిగా పిలిచారు. భద్రత పేరుతో అటు కాకిని ఇటు వాలనివ్వలేదు పోలీసు యంత్రాంగం. చివరికి, యాభై ఏళ్లుగా ఆ క్రీడా సంఘంలో సభ్యులుగా ఉన్నవారిని కూడా లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వయోధికుడిని లాగి అవతలపడేశారు. కూడలినంతా దిగ్బంధం చేశారు. వందల వాహనాలు నిలిచిపోయాయి. అందులో అంబులెన్సులున్నాయి. స్కూలు బస్సులున్నాయి. పసిపిల్లల్ని భుజాలకు ఎత్తుకున్న తల్లులున్నారు. వృద్ధులున్నారు. మండుటెండ, పొగభూతం, రణగొణధ్వనులు! అరగంటకుపైగా నరకం అనుభవించారు. ముంబయి అనే ఏముంది, ప్రతి రాజధాని నగరంలోనూ కనిపించే దురదృష్టకర దృశ్యమిది. గత ఏడాది, మధ్యప్రదేశ్‌లో వికాస్‌ అనే ఇరవై రెండేళ్ల విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలు అయ్యాడు. అలాంటి సమయాల్లో ప్రతిక్షణమూ విలువైందే. అటుగా ఓ ప్రముఖుడు వెళ్లాల్సి ఉండటంతో, ట్రాఫిక్‌ను ఆపేశారు. రోడ్డు మీద ఇరుక్కుపోయిన వందలకొద్దీ వాహనాల్లో...వికాస్‌ను తీసుకెళ్లాల్సిన అంబులెన్సు కూడా ఉంది. గండాలన్నీ గట్టెక్కి, నలభై అయిదు నిమిషాలు ఆలస్యంగా ఆసుపత్రికి చేరుకుందా వాహనం. అప్పటికే వికాస్‌ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెద్దగా వెలుగులోకి రావడం లేదు కానీ, రివ్వున దూసుకెళ్లే కాన్వాయ్‌లు రోడ్డు ప్రమాదాలకూ కారణం అవుతున్నాయి. విధి నిర్వహణలోని పోలీసు సిబ్బంది కూడా ఆ చక్రాల కింద నలిగిపోతున్నారు.

ఏ స్థాయి ప్రముఖుల కోసం ట్రాఫిక్‌ను ఆపాలన్న విషయంలో కచ్చితమైన మార్గదర్శకాలున్నాయి. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) పరిధిలో ఉన్నంత మాత్రాన రవాణా వ్యవస్థకు అవరోధాలు సృష్టించాల్సిన అవసరం లేదని కూడా అందులో స్పష్టంగా రాసుంది. అకారణంగా ట్రాఫిక్‌ను కదలనివ్వకపోతే పదివేల రూపాయల వరకూ జరిమానా విధించేలా కొన్ని రాష్ట్రాలు చట్టాల్నీ చేసుకున్నాయి. అయినా, అవేవీ అమలుకు నోచుకోలేదు. వీఐపీ సంస్కృతిలోని రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది హరీశ్‌సాల్వే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచక్షణ లేకుండా ట్రాఫిక్‌ను నిలిపేయడం, వీఐపీ పాసుల పేరుతో కొందరి విషయంలో ప్రత్యేకశ్రద్ధ కనబరచడం..ఎంతవరకూ న్యాయమని ప్రశ్నించారు. అందుకు స్పందనగా, ఏటా వీఐపీ మర్యాదలకు ఎంత ఖర్చవుతోందో చెప్పమంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఓ తాకీదు పంపింది.

గాల్లోనూ గొప్పలే....
ప్రభుభక్తిని చాటుకోడానికే పుట్టినట్టు వ్యవహరించే సర్కారీ విమానయాన సంస్థలు...ఏలినవారి కోసం గంటల తరబడి విమానాల్ని ఆపేసిన సందర్భాలున్నాయి. పాలకుల రాచకార్యాలకు ఆలస్యం అవుతుందేమో అన్న అనుమానం వస్తే...ఓ అరగంట ముందే గాల్లో ఎగిరిన దాఖలాలూ అనేకం. సామాన్యులదేముందీ, చచ్చినట్టు భరిస్తారన్న బాధ్యతారాహిత్యం! ఆ ప్రత్యేక సేవలు చాలవన్నట్టు...ఓసారి, అపారమైన పలుకుబడి ఉన్న ఒకానొక నాయకుడి అనుచరగణానికి సీట్లు సరిపోకపోతే...ముగ్గురు సాధారణ ప్రయాణికుల్ని నిర్దయగా కిందికి దించేశారు. సాక్షాత్తూ ఓ మంత్రివర్యులు...పట్నా ఎయిర్‌పోర్టులో బయటికెళ్లే దార్లోంచి, దర్జాగా లోపలికి అడుగుపెడుతూ సీసీ కెమెరాలకు చిక్కారు. ఎంత మినిస్టరు అయినా, కర్ణుడి కవచ కుండలాల్లా, నెత్తినేం నిత్యం బుగ్గలైటు వెలుగుతూ కనిపించదు కదా! అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో, మంత్రిగారికి మండిపోయింది.‘నీ ఉద్యోగం వూడుతుంది జాగ్రత్త!’ అంటూ కళ్లెర్రజేశారు. షాపింగ్‌ అంటే పడిచచ్చే ఓ మహిళామంత్రి ఎయిర్‌పోర్టు ఆవరణలో చీరలూ అత్తర్లూ కొనుక్కోవాలని ముచ్చటపడ్డారో ప్రయాణంలో. అమ్మగారి షాపింగ్‌ పూర్తయ్యేదాకా విమానం కదిలితే ఒట్టు. ఆ వీరభక్తి ఇంకాస్త ముదిరిందోసారి. దిల్లీ నుంచి భోపాల్‌ బయల్దేరాల్సిన విమానాన్ని (సాంకేతిక కారణాలతో...) ఉన్నపళంగా రద్దు చేసి...ఒడిషాకు మళ్లించారు. ఏం చేస్తారు పాపం, భువనేశ్వర్‌ వైపు ముగ్గురు వీవీఐపీలు వెళ్లాల్సి ఉంది మరి! ఆ భక్తిశ్రద్ధల్ని విధి నిర్వహణ మీద చూపించి ఉంటే...ఆయా విమానయాన సంస్థలకు ఇన్నిన్ని నష్టాలు వచ్చేవే కాదు.

ఆమధ్య, ‘పద్మ’ అవార్డుల కోసం వీవీఐపీల నుంచి వచ్చిన సిఫార్సులను బహిర్గతం చేయాలంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త కేంద్రానికి దరఖాస్తు చేశాడు. ఆ పేర్లు చూస్తే దిమ్మదిరిగిపోతుంది. ఎవరికివారు ఉదారంగా చాలా జాబితాలే పంపారు. అవన్నీ...అన్నదమ్ములూ, ఆత్మీయుల పేర్లే!
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వ నిధులతో నడిచే ఆసుపత్రుల్లో...వీఐపీ విభాగాల్ని తొలగించగలిగితే...సామాన్య రోగులకు ఎంతో ఉపయోగం! ఆ విశాలమైన గదిలో ఒక పడక స్థానంలో కనీసం ఇరవై పడకలు వేయవచ్చు. అథమపక్షం ఐదు గదుల్ని సామాన్యుల వార్డులుగా మార్చినా, వందమంది రోగుల ప్రాణాలు నిలబడతాయి. వీఐపీలదేముందీ, ఖర్చుపెట్టి కార్పొరేట్‌ వైద్యం చేయించుకోగలరు!
‘ఎమ్మెల్యే’ స్టిక్కర్ల కోసం చట్టసభల ప్రాంగణాల్లో భారీ స్థాయిలో పైరవీలు జరుగుతూ ఉంటాయి. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించడానికి దాన్నో రాచముద్రగా భావిస్తారు. పార్కింగ్‌ ఫీజుల నుంచీ మినహాయింపు పొందవచ్చన్న ఆశ. నకిలీ నోట్లలాగా, నకిలీ స్టిక్కర్ల కుంభకోణాలూ బయటపడ్డాయి.
భారతదేశంలో ప్రతి ఎనిమిది వందల మంది సామాన్య పౌరులకూ ఓ పోలీసు ఉన్నాడు. కానీ, ప్రతి వీఐపీకీ కనీసం ముగ్గురు భద్రత సిబ్బంది అవసరం. అంటే, రెండున్నరవేలమందికి సేవ అందించాల్సిన పోలీసు ఉద్యోగులు... ఏ ఒకరికో పరిమితం అవుతున్నారు.
అక్కడక్కడా నకిలీ వీఐపీలూ దర్శనమిస్తారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో...దర్శనం వేళకి ప్రత్యక్షమైపోయి ఏ అసోం కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్నో అంటాడొకడు. స్థానిక అధికారులు వీఐపీ మర్యాదలు చేసి, వీడ్కోలు చెప్పే సమయానికి ‘ఓ టెన్‌ థౌజండ్‌ రుపీస్‌ ఉంటే ఇవ్వండి. హెడ్‌ క్వార్టర్స్‌కు వెళ్లగానే పంపేస్తా’ అని నసుగుతాడు. ఎదుటి మనిషికి ఏమాత్రం తెలివితేటలున్నా, ఇదేదో నకిలీ కేసని అప్పటికైనా అర్థం కావాలి. నమ్మి నట్టేటమునిగిన అధికారులూ, ఖాకీబాసులూ చాలామందే ఉన్నారు.
ఎవరైనా, ‘వీఐపీ అనిపించుకోవడం ఎలా?’ అనే పుస్తకం రాస్తే, ‘గన్‌మెన్‌లను మంజూరు చేయించుకోవడం ఇలా....’ అన్నదే, అందులో మొదటి అధ్యాయం. మన మీద ఎవరో కక్షగట్టినట్టో, ఒకట్రెండుసార్లు దాడికి తెగబడినట్టో కథలు అల్లేస్తే చాలు. సచివాలయ స్థాయిలో పైరవీలు చేసుకుని...మనకంటూ గన్‌మెన్లను ఏర్పాటు చేసుకోవచ్చు, తుపాకుల నీడలో షికార్లు కొట్టవచ్చు.

పప్పులుడకవ్‌...
మన నేతలకు విదేశాలకెళ్తే అస్సలు తోచదు. ఎందుకంటే, పరాయి గడ్డ మీద ప్రత్యేక గుర్తింపు ఉండదూ, క్యూలైన్ల నుంచి మినహాయింపూ లభించదు. ఆ అసహనాన్ని ఏదో ఓ రూపంలో వెళ్లగక్కుతూ ఉంటారు. అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో మంత్రిపదవి వెలగబెట్టిన ఓ నేత వ్యక్తిగత వ్యవహారాల్ని చక్కబెట్టుకోడానికి అమెరికా వెళ్లాడు. పాస్‌పోర్టుకు సంబంధించి ఏవో అనుమానాలు రావడంతో, భద్రత సిబ్బంది పక్కకి తీసుకెళ్లి ఓ పది నిమిషాలు విచారించి పంపేశారు. ఆ మాత్రం దానికే, ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తనంతటివాడిని నిలబెట్టి మాట్లాడటం ఏమిటంటూ మీడియా ముందు ఏకపాత్రాభినయం చేశాడు! రియో ఒలింపిక్స్‌లో అయితే, ఓ వీఐపీ వ్యవహారశైలి కారణంగా దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పెద్దమనిషి అనుమతిలేని ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతూ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడు. ఇలా వ్యవహరించడం సరికాదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. దీంతో, ‘మీ ప్రతినిధి గుర్తింపు కార్డును వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే, క్రీడా ప్రాంగణంలోకి కూడా రానివ్వం జాగ్రత్త’ అంటూ నిర్వాహకులు ఘాటుగా వర్తమానం పంపారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు, ఓ జాతి జెండాను మోస్తున్న పవిత్రభావన ఉండాలి. అహాన్ని నెత్తినెక్కించుకుని అచ్చోసిన ఆంబోతులా ప్రవర్తించడం సరికాదు.

అక్కడక్కడా అఖిలభారత సర్వీసుల అధికారులూ సినీతారలూ వ్యాపారవేత్తలూ తమ వీవీఐపీ పైత్యాన్ని వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు. భాగ్యనగరంలో...తన కారు అద్దాలకున్న నల్ల ఫిల్ములను తొలగించబోయిన పాపానికి ఓ ‘ప్రముఖుడు’ ట్రాఫిక్‌ ఉద్యోగి మీద దాడి చేసినంత పనిచేశాడు. ‘నేనెవర్నో తెలుసా?’ అంటూ దెయ్యంపట్టినట్టు వూగిపోయాడు. ‘నేను నంబరు కలిపానంటే’ అంటూ చిందులేశాడు. నిజమే, మిగతా సమయాల్లో ఎవరైనా మహానుభావుల్లానే పోజుకొడతారు. నేలబారు స్వభావాలు బయటపడేది ఇలాంటి బలహీన క్షణాల్లోనే.

కొన్నిసార్లు, వీఐపీల దొడ్లో గడ్డి మేసిన పుణ్యానికే పశువులకూ వీఐపీ హోదా వచ్చేస్తుంది. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు ఓటేసి గెలిపించిన ప్రజలకంటే, పాకలోని పశువులంటేనే ఎక్కువ మక్కువ. ఆయన ప్రాణానికి ప్రాణమైన దున్నపోతులు కనిపించకుండా పోయాయోసారి. ఖాన్‌సాబ్‌ ఫిర్యాదు చేయడమే ఆలస్యం...పోలీసు యంత్రాంగమంతా రంగంలోకి దిగింది. జాతి జాగిలాల్ని కూడా పిలిపించారు. దొంగల్ని పట్టుకునే దాకా...జిల్లా యంత్రాంగం నిద్రపోలేదు. ఆచూకీ తెలిశాక, పోలీసు స్టేషన్‌లోనూ ఆ పశువులకు రాచ మర్యాదలే! సగటు మనిషి...బడికెళ్లిన పిల్లలు ఇంటికి రాలేదనో, మతిస్థిమితంలేని అమ్మో నాన్నో కనిపించకుండా పోయారనో, మెడలోని మంగళ సూత్రాలనెవరో లాక్కుపోయారనో కన్నీళ్ల పర్యంతమవుతూ ఫిర్యాదు చేసినా...మొక్కుబడిగా కేసు నమోదు చేసుకుని మరుక్షణమే మరచిపోయే ఖాకీలు, ఇలాంటి సందర్భాల్లో మాత్రం మహా చురుగ్గా స్పందిస్తారు. ప్రపంచంలో అంతకు మించిన సమస్య లేదన్నట్టు వ్యవహరిస్తారు. సామాన్యుల కేసుల్ని పరిష్కరిస్తే ఏం వస్తుందీ! అదే వీఐపీలైతే...ఇంక్రిమెంట్లూ, పదోన్నతులూ, కోరిన చోటికి, కోరిన సీటుకు బదిలీలూ!

ద్యేవుడా...
షిర్డీ సంస్థానంలో హఠాత్తుగా దర్శనాలు ఆగిపోయాయి. పావుగంట, అరగంట, గంట ...భక్తుల వరుస ఆవగింజంత అయినా కదల్లేదు. పసిపిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. వృద్ధులు అక్కడే కూలబడిపోయారు. అంతలోనే హడావిడి మొదలైపోయింది. పోలీసు వాహనాలు వచ్చేశాయి. ఎర్రకార్పెట్‌ దుమ్ము దులిపారు. ఓ ప్రముఖుడు కారు దిగాడు. ‘సర్‌! ఒక్కరి కోసం ఇంతమందిని బలిచేయడం అన్యాయం. మేం ఆ పెద్ద మనిషితో మాట్లాడతాం. ఆయన చేస్తున్న తప్పేమిటో ఆయనకే వివరిస్తాం...’ అంటూ ముకేశ్‌, స్వప్నిల్‌ అనే యువకులు అక్కడున్న ఉన్నతాధికారి ముందు ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అంతే! క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టారు. లాక్కెళ్లి ఓ వాహనంలో పడేశారు. ఏదో ఘోరం చేసినట్టు బూతులు అందుకున్నారు. సాయంత్రం దాకా కదలనివ్వలేదు. ‘నిరాడంబరత్వాన్ని ప్రబోధించిన సాయి ఇలాంటి ఆర్భాటపు చర్యల్ని ఎలా మెచ్చుతాడు?’ అని ప్రశ్నిస్తారా యువకులు.

ఫలానా సమయానికి వీఐపీలు వస్తున్నారహో...అంటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రకటించగానే ఎంతపెద్ద దేవుడైనా - ఆదరాబాదరాగా పంచె సర్దుకోవాల్సిందే. భుజకీర్తులు ధరించాల్సిందే. కిరీటాన్ని సరిచేసుకోవాల్సిందే. కాన్వాయ్‌ వచ్చీరాగానే, చిరునవ్వుతో దర్శనమివ్వాల్సిందే. ఏలినవారి ఏకాంతసేవకు భంగం కలగకుండా...ఎక్కడి వరుసలు అక్కడ నిలిపేయాల్సిందే. సుప్రభాతాలూ, నివేదనలూ, వూంజల సేవలూ అటూ ఇటూ అయినా ఫర్వాలేదు. వీఐపీగారికి మాత్రం సకాలంలో సకల మర్యాదలూ అందాల్సిందే. కనిపించని దేవుడి కంటే, కనిపించే ప్రముఖుడే ముఖ్యం మరి!

భక్తికి శరణాగతే ప్రధానమంటారు. పరమాత్మ సమక్షంలో అహాన్ని పక్కనపెట్టాలంటారు. కానీ, ఆధ్యాత్మిక కేంద్రాలు అధికార దర్పానికి ‘వైఫై హాట్‌స్పాట్స్‌’ అవుతున్నాయి. వీఐపీల కోసం ప్రత్యేక క్యూలూ, ప్రత్యేక దర్శనాలూ, ప్రత్యేక ప్రసాదాలూ, ప్రత్యేక శేషవస్త్రాలూ, ప్రత్యేక ఆశీర్వచనాలూ! సామాన్యులకు మాత్రం...తోపులాటలూ శాపనార్థాలూ! తిరుమల లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అయితే, వీఐపీల సేవలో తరించడానికే ప్రత్యేక విభాగాలున్నాయి. సగటున రోజుకు యాభై అరవైవేలమంది శ్రీవారిని దర్శించుకుంటే, అందులో ఐదారు వందలమందిదాకా ...వివిధ హోదాల్లోని వీఐపీలో, వీఐపీల నుంచి సిఫార్సు లేఖలు తెచ్చుకున్న పరోక్ష వీఐపీలో ఉండితీరతారు! ఆ మధ్య తెలంగాణలోని ఓ సుప్రసిద్ధ క్షేత్రంలోనూ...చిన్నాచితకా నాయకుల కోసం ఏకంగా దేవుడి కల్యాణాన్నే వాయిదా వేశారు. ఏ అర్ధరాత్రో కానీ, దేవదేవుడి నెత్తిన తలంబ్రాలు పడలేదు. మోదీ సర్కారు నోట్ల రద్దు నిర్ణయం తర్వాత, ఘనతవహించిన జాతీయ బ్యాంకులు కూడా సాధారణ ఖాతాదారుడూ, వీఐపీ ఖాతాదారుడూ అన్న తేడాను చూపించాయి. అయినవారికి కట్టలకు కట్టలు ‘డోర్‌ డెలివరీ’ చేసి...కానివారికి కనాకష్టంగా రెండువేల నోటు చేతిలో పెట్టాయి.

వీఐపీ పుత్రోత్సాహం...

వు పొలంలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? తండ్రి ‘నేను వీఐపీని’ అనుకుంటే, తనయుడు ‘నేను వీఐపీ కొడుకుని’ అనుకోకుండా ఉంటాడా? అనుకునితీరతాడు. అలానే ప్రవర్తిస్తాడు. పితృదేవుడికి, ఓ స్థాయికి వెళ్లాక కానీ నెత్తికెక్కని అహంకారం...బిడ్డకు చిన్నారి పొన్నారి చిరుతకూకటి ప్రాయంలోనే పాదుకుని పోతుంది. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలూ, మద్యం మత్తులో వాహనం నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొన్న సంఘటనలూ, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలూ, తుపాకులతో బెదిరింపులూ, మాదకద్రవ్యాల వినియోగాలూ...తదితర కేసుల్లో వీఐపీల పిల్లలు చిక్కుకుంటున్న ఉదంతాలు అనేకం. కొన్ని వ్యవహారాలు తండ్రుల రాజీనామాల దాకా వెళ్లాయి. వీఐపీల తాలూకంటూ సచివాలయ పేషీల్లో టెంట్లు వేసేవారి పరిస్థితీ అంతే! ఇలాంటి వాళ్లంతా...తెప్పలుగ చెరువు నిండినప్పుడు చేరే కప్పలే! అధికారాంతం తర్వాత ఆచూకీ ఉండదు.

తాజ్‌ చంచల్‌గూడా...
ఆకలేస్తే బిర్యానీలూ, మనసుపడితే మద్యం సీసాలూ, మాట్లాడుకోవాలనిపిస్తే సిమ్‌ కార్డులూ, మత్తు కావాలనిపిస్తే మాదకద్రవ్యాలూ...క్షణాల్లో సిద్ధమైపోతాయి. అలా అని, అవేం ఏ ఫైవ్‌స్టార్‌ హోటళ్లొ కాదు. కరడుగట్టిన నేరస్థులకు చుక్కలు చూపించాల్సిన కఠిన కారాగారాలు. వాళ్లంతా...అనధికారిక వీఐపీ ఖైదీలు. సూటిగా చెప్పాలంటే...పక్కా రౌడీలూ, గూండాలూ, సంఘ విద్రోహశక్తులూ! కొన్నిసార్లు జైళ్లు వ్యభిచార కొంపలుగానూ మారుతున్నాయి. ఆ రాచమర్యాదలకు కారణం...ఖైదీలిచ్చే మామూళ్లు కావచ్చూ, ఖైదీల వెనకున్న పెద్దల ఆదేశాలూ కావచ్చు. వివిధ నేరాల్లో అపరాధులుగా జైలు ఆవరణలో కాలుపెట్టే ప్రముఖులైతే...వీఐపీ హోదా ప్రసాదించమంటూ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తారు. తమ ఆర్థిక స్థితినీ, రాజకీయ చరిత్రనీ సాక్ష్యంగా చూపుతారు. కోర్టు సంతృప్తి చెందితే ప్రత్యేకించి ఓ గదిని కేటాయిస్తారు. టీవీ, దినపత్రికలూ, వీలునుబట్టి ఎయిర్‌ కండిషనర్‌...అందుబాటులో ఉంటాయి. ఎన్నికలనాటికి ‘ఏక్‌దమ్‌ ఫిట్‌’ అనిపించుకోవాలి కాబట్టి జిమ్‌, టెన్నిస్‌కోర్టూ చేరువలో ఉంటాయి. పాక నైపుణ్యమున్న సహ ఖైదీల్ని వంటమనుషులుగా నియమించుకునే వెసులుబాటూ ఉంది. అధికారికంగా కొంతమందితో, అనధికారికంగా ఎంతోమందితో ములాఖత్‌లూ జరుపుకోవచ్చు. ‘మొహమాట పడకండి. మీ ఇల్లే అనుకోండి...’ అంటూ ఆదరాభిమానాలు కురిపించే జైలు సిబ్బంది ఉన్నంతకాలం ఇబ్బందే ఉండదు. వూచలచాటు వీఐపీ గ్యాలరీల్లో సకలభోగాలు అనుభవించవచ్చు.

కొన్నిసార్లు వీఐపీలకూ వీఐపీ కష్టాలు ఎదురవుతుంటాయి. కాంగ్రెస్‌ హయాంలో...కేంద్ర మంత్రిగా ఉన్న జైరామ్‌ రమేష్‌ దిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ చోట ట్రాఫిక్‌ను అడ్డంగా ఆపేశారు (ఆ సమయానికి ఆయన సాధారణ వాహనంలోనే ప్రయాణిస్తున్నారు). కారణం...సైనిక దళాల ప్రధాన అధికారి ఆ దార్లోంచి వెళ్లబోతున్నారట. ఎంత సేపటికీ ఆయన రాలేదు. దీంతో జైరామ్‌ కారు దిగేసి, కాలినడకనే కార్యాలయానికి చేరుకున్నారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ, ప్రధాన మంత్రి సహా ప్రముఖుల వాహన సముదాయాన్ని సగానికి సగం కుదించాలని ఆవేశంగా ప్రకటన చేశారు. ఆతర్వాత ఎప్పుడూ ఈ విషయం మీద మాట్లాడిన దాఖలాల్లేవు. తమదాకా వచ్చినప్పుడే, బ్రహ్మాండం బద్దలైనట్టు ప్రవర్తించడం కరడుగట్టిన వీఐపీ తత్వం!

న్యాయస్థానాలు కళ్లెర్రజేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అప్పుడప్పుడూ, ఆఫ్‌లైన్‌లో అక్కడక్కడా సామాన్యులూ ప్రశ్నిస్తున్నారు. కొద్దిమందే అయినా, రాజకీయ నాయకులూ పునరాలోచిస్తున్నారు. అందులోనూ దిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ పాలన ఎలా ఉన్నా...వీఐపీ సంస్కృతిని దూరంపెట్టడంలో మాత్రం, ఆ ఆమ్‌ఆద్మీ సీఎం ఎంతోకొంత విజయం సాధించారనే చెప్పాలి. ఇవన్నీ మంచి పరిణామాలే. ‘కొన్ని యూరోపియన్‌ దేశాల్లో ప్రధానమంత్రులు కూడా సామాన్యుల్లా బస్‌స్టాప్‌లో నిలబడతారు. అలాంటి దృశ్యాలు...ఏదో ఒకరోజు భారత్‌లోనూ సాధ్యమే!’ అంటారు కేజ్రీవాల్‌..

ఆ రోజు ఏరోజన్నదే ప్రశ్న.
ఎన్ని గణతంత్ర దినోత్సవాల తర్వాతన్నదే తేలాల్సి ఉంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.