close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఓ ఫ్రేమ్‌ కథ!

ఓ ఫ్రేమ్‌ కథ!

సంవత్సరానికో ఫొటో తీయించుకునే రోజులు పోయి, సెకనుకో సెల్ఫీ తీసుకునే రోజులకొచ్చాం. ఇక, మామూలు ఫొటోల విషయానికొస్తే వందలు దాటిపోయి వేలల్లోకి చేరుతున్నాయి. ఫొటోలు తీసే టెక్నాలజీ ఇంత పెరిగిపోయినప్పుడు వాటిని ప్రదర్శించే ఫ్రేములు హైటెక్‌గానూ వినూత్నంగానూ మారిపోవడంలో ఆశ్చర్యం ఏముందీ..!

చెక్కదో గాజుదో ఓ ఫొటోఫ్రేమూ ఆ మధ్యలో నలుపూ తెలుపుదో రంగులదో ఓ ఛాయా చిత్రమూ... అంతకుమించి ఫ్రేముల గురించి చెప్పుకోవడానికి నిన్నమొన్నటి వరకూ పెద్ద విషయమేమీ లేదు. కానీ ఇప్పుడు అవి గాజు బంతులూ కళ్లజోళ్ళూహ్యాండ్‌బ్యాగులూ సోఫాలూ... ఇలా ఎన్నెన్నో రూపాల్లో వస్తున్నాయి. ఇక, డిజిటల్‌ ఫ్రేముల్లో వచ్చే కొత్త ఫీచర్లైతే చెప్పలేనన్ని. వీటిలో వేల ఫొటోలనూ ఎన్నో వీడియోలనూ భద్రంగా దాచేవి కొన్నైతే, సంగీతాన్ని వినిపించేవీ వీడియోలను చూపించేవీ మరికొన్ని. సోషల్‌ మీడియాలో ఫొటోలను షేర్‌ చేసేవి ఇంకొన్ని. ఆ ప్రత్యేకతలేంటో చూద్దామా మరి!

 

కప్పు ‘చిత్రం’

ప్పుల మీద ఇష్టమైన వారి ఫొటోలను ప్రింట్‌ చేయించుకోవడం తెలిసిందే. ఇప్పుడు కొత్త విషయం ఏంటో తెలుసా... కప్పులూ డిజిటల్‌ ఫ్రేములైపోతున్నాయి. అలాంటిదే ‘క్యుఫొటో’. యూఎస్‌బీ ద్వారా దీన్లోకి ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకుని, రోజుకో ఫొటో కనిపించేలా పెట్టుకోవచ్చట. ఇలాంటివే, మగ్‌ మొత్తం కాకుండా కొంత భాగంలో ఫొటోలు కనిపించేవీ వస్తున్నాయి.

 

అద్దంలా...

ఫీసు టేబుల్‌మీద ఉన్న ఈ డిజిటల్‌ ఫొటోఫ్రేము ఆఫ్‌ చేసినపుడు అద్దమైపోతుంది. అంటే, ఎప్పుడు చూసుకోవాలంటే అప్పుడు అద్దం సిద్ధంగా ఉంటుందన్నమాట. అన్నట్లూ దీన్లో స్పీకర్‌ ఎంపీత్రీ ప్లేయర్‌ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి, నచ్చిన సంగీతమూ వినొచ్చు. పాకెట్‌ డిజిటల్‌ ఫొటో ఫ్రేమ్‌ మిర్రర్‌ కూడా ఈ తరహాదే. అచ్చం మడతపెట్టి జేబులో పెట్టుకునే అద్దంలా ఉండే ఈ ఫ్రేములో పై వైపున అద్దమూ కింది వైపున ఫొటోలు కనిపించేలా స్మార్ట్‌ తెరా ఉంటాయి.

 

గాల్లో తేలినట్లుందే...

ఆధారం లేకుండా ఫొటోఫ్రేమ్‌ గాల్లో తేలుతుందంటే చూసేవారికి అంతకుమించిన ఆశ్చర్యం ఏముంటుందీ... అలాంటిదే ఈ ‘మ్యాగ్నటిక్‌ లెవిటేటింగ్‌ ఫొటో ఫ్రేమ్‌’. దీని స్టాండ్‌కు పైనా కిందా విద్యుత్తుతో పనిచేసే అయస్కాంతాలు అమర్చి ఉంటాయి. దాంతో ఇనుముతో చేసిన ఫ్రేమును ఆ మధ్యలోకి తీసుకెళ్లగానే అది కిందపడకుండా అక్కడే నిలిచిపోతుంది. అంతేకాదు, అయస్కాంత శక్తి కారణంగా ఆ ఫ్రేము అక్కడే నెమ్మదిగా గుండ్రంగా తిరుగుతుంది. దీనివల్ల వినూత్నంగా ఉండడమే కాదు, ఫ్రేముకి రెండువైపులా ఉన్న ఫొటోలూ కనిపిస్తాయి. చీకట్లోనూ చూడచక్కగా ఉండేలా వీటిచుట్టూ ఎల్‌ఈడీ లైట్లు అమర్చి ఉంటాయి.

 

ప్రింట్‌ భద్రం

డిజిటల్‌ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్లూ వచ్చాక ఫొటోల ప్రింట్లు తీసుకోవడం తగ్గింది కానీ అంతకుముందు ఫొటో అంటే ప్రింటు తీసిన కాపీనే. కానీ వాటిని అలానే ఉంచితే ఎక్కువకాలం భద్రపరచడం కష్టం. ఆ ఫొటోలను డిజిటల్‌ ఫ్రేముల్లోనూ పెట్టలేం. ఆ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ‘ఫ్రికిన్‌ స్కానర్‌ ఫొటోఫ్రేమ్‌’. దీని ముందుభాగంలో మామూలు ఫొటో ప్రింట్‌ను ఉంచితే దాన్ని స్కాన్‌ చేసి లోపలున్న మెమరీ కార్డులో భద్రపరుస్తుంది.

 

స్మార్ట్‌ ఫ్రేమ్‌

నిక్స్‌ప్లే సీడ్‌... వైఫైతో కనెక్ట్‌ అయ్యే ఈ ఫొటోఫ్రేమ్‌లోకి ఫోన్‌, కంప్యూటర్‌ల నుంచీ సులభంగా ఫొటోల్ని పంపుకోవచ్చు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు దీన్లోంచే ఫొటోల్ని షేర్‌ చెయ్యొచ్చు కూడా. అంతేకాదు, మామూలు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ తెరలకు భిన్నంగా ఏ కోణంలోనుంచి చూసినా ఫ్రేములోని ఫొటో కనిపించేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మోషన్‌ సెన్సర్లద్వారా పనిచేసే నిక్స్‌ప్లే సీడ్‌ ఫ్రేమ్‌ గదిలో ఎవరూ లేనపుడు ఆఫ్‌ అయిపోయి కరెంటును ఆదా చేస్తుంది. ఇక, రిమోట్‌, లేదా ఆప్‌ ద్వారా పనిచేసే దీన్లో 25వేల ఫొటోలను నిక్షిప్తం చేసుకోవచ్చు.

 

దిమ్మతిరిగిపోయే బొమ్మ

ల్‌ఈడీ అంటేనే బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక, ఓఎల్‌ఈడీ అంటే ఆ స్పష్టత ఎంత బాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ టెక్నాలజీతో వచ్చిందే ‘కొడక్‌ ఓఎల్‌ఈడీ డిజిటల్‌ ఫ్రేమ్‌’. దీన్లోని ఫొటోల్ని ఎవరైనా తలతిప్పకుండా చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇక, పదివేల ఫొటోలను నిక్షిప్తం చెయ్యగల ఈ ఫ్రేమును వైఫై సహాయంతో ఫ్లికర్‌, కొడాక్‌ గ్యాలరీ అకౌంట్లకు అనుసంధానించొచ్చు. వార్తలూ వాతావరణ సమాచారాన్ని కూడా అందించే దీంతో సంగీతాన్ని వినొచ్చు, వీడియోల్నీ చూడొచ్చు.

 

యూట్యూబ్‌నీ చూడొచ్చు

ప్‌తో పనిచేసే ఈ లూప్‌ ఫ్రేము ఫొటోల ప్రదర్శనకే కాదు, వీడియోలూ సినిమాలూ చూడ్డానిక్కూడా పనికొస్తుంది. నేరుగా యూట్యూబ్‌లోని వీడియోల్ని కూడా దీన్లో చూడొచ్చు. అంతేకాదు, బ్లూటూత్‌, వైఫైతో పనిచేసే దీన్ని ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌లకు సులభంగా కనెక్ట్‌చేసి, స్నేహితులతో వీడియో చాటింగ్‌ కూడా చెయ్యొచ్చు. చూశారుగా... కళ్లముందే ఫొటో ఫ్రేముల చరిత్ర ఎంతగా మారిపోయిందో!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.