close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశాఖ సంబరం...

విశాఖ సంబరం...

సముద్ర తీరమంటేనే కవితల్లో వర్ణించేంత అందంగా ఉంటుంది. అలాంటి ప్రశాంత వాతావరణాన్ని అలల హోరులాంటి జోరులో చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా విశాఖ ఉత్సవ్‌కు తరలివెళ్లాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ మరోసారి ముస్తాబవనుంది.

పండగలేవైనా ఆ ప్రాంతపు సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేసేలానే ఉంటాయి. విశాఖ ఉత్సవ్‌ కూడా అలాంటి వేదికే. రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న నగరంగా వెలసిన విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతిని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సముద్రతీరమవడంతో నేవీతోపాటు బీహెచ్‌ఇఎల్‌, విశాఖ ఉక్కులాంటి పెద్దపెద్ద సంస్థలు ఇక్కడ ఉండటం వల్ల వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులతో విభిన్న సంస్కృతి ఈ నగరంలో కనిపిస్తుంది. మరో పక్క, సముద్రం అంచున ఉండే బీచ్‌లూ, అరకులోయా, షిప్‌యార్డూ, కైలాసగిరి, సింహాద్రిలాంటి ప్రముఖ పర్యటక ప్రదేశాలు దీనికి అదనపు ప్రత్యేకతలు. ఇక ఇక్కడ నివసించే ఆదివాసీలూ వాళ్ల కళలూ ఈ ప్రాంతానికి మరో ఆకర్షణ. వీటన్నింటినీ ప్రతిబింబించే వేదికగా విశాఖ ఉత్సవ్‌ను మలచాలనుకుంది. విశాఖపట్టణానికి గొప్ప పర్యటక ప్రదేశంగా గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించింది. గత రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ ఏడాది జనవరి 28, 29, 30 తేదీల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

జనజాతర విశాఖ ఉత్సవ్‌లో ప్రధానంగా చెప్పుకోవలసింది జానపద నృత్యరీతులు. దానికోసం ఈసారి ‘జాతర’ పేరిట ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది గ్రామీణ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. థింసా, గరగలు, కొమ్ములాంటి విభిన్న నృత్యరీతుల్ని ఇక్కడ చూడొచ్చు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కళాకారులనూ ఆహ్వానించారు. గ్రామీణ కళారూపాలన్నీ జాతర వేదిక దగ్గరే ప్రదర్శిస్తారు. శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలూ అలరించనున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌ను ఈసారి ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఇక, వందల రకాల పూలను ఒకచోట కూర్చి నిర్వహించే పుష్పప్రదర్శన ఉత్సవానికి మరో ప్రత్యేక ఆకర్షణ. భారత నౌకాదళానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేక పరేడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే పర్యటకులకు ఆధ్యాత్మికానుభూతిని పంచేలా సముద్రం తీరం వెంట ఆర్కేబీచ్‌లో ఉత్తరాంధ్రలోని ప్రముఖ ఆలయాల నమూనాల్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం సహా సింహాచలం, పైడితల్లి గుడి, శ్రీ కూర్మం, అరసవల్లి తదితర దేవాలయాలు దర్శనమిస్తాయి.

తిండీ దండి...
దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హస్తకళలను ఇక్కడ మనం చూడొచ్చూ కొనుక్కోవచ్చూ. ఇక భోజన ప్రియులకూ ఇది మంచిచోటే. మన దగ్గరివే కాదు ఉత్తర భారత దేశానికి చెందిన అనేక వంటకాలు ఇక్కడ నోరూరిస్తాయి. బెంగుళూరు, చెన్నై, ముంబయి నుంచి వచ్చిన ఎంతో మంది పాక నిపుణులు వందకు పైగా స్టాళ్ల ద్వారా వివిధ రుచులను అందించనున్నారు. విశాఖ గొప్పదనాన్ని చెబుతూ సాగే లేజర్‌షో ఇక్కడి మరో ప్రత్యేక ఆకర్షణ. విశాఖలోని నొవోటెల్‌ హోటల్‌ నుంచి వైఎంసీఏ వరకు 2.5 కిలో మీటర్ల విస్తీర్ణంలోగల బీచ్‌లో ఉత్సవాలు జరుగుతాయి. రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగరతీరం ఈ పండక్కి వేదికవుతుంది. రెండుకోట్ల డెబ్బై అయిదు లక్షల వ్యయంతో సంబరాన్ని నిర్వహించనున్నారు. విశాఖ నగరంలోని ప్రాంతాలనూ, చుట్టుపక్కల ప్రాంతాలనూ చూసేందుకూ ఇక్కడ ప్రత్యేక టూరింగ్‌ ప్యాకేజీలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకు మూడు రోజులూ కలిపి 5 లక్షలకుపైగానే జనం వస్తారని అంచనా వేస్తున్నారు. వేరే వూళ్లనుంచి వచ్చేవాళ్లకోసం హోటళ్లూ చాలానే ఉన్నాయి. ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వేడుకకు సంబంధించి పూర్తి వివరాలు కావాలనుకునేవారు www.visakhautsav.com లోకి వెళ్లొచ్చు. వైజాగ్‌ వెళ్లడమే బోలెడు ఆనందం, మరి అంగరంగ వైభవంగా వేడుక జరిగేప్పుడు వెళ్లడం ఇంకెంత సంబరం. దాన్ని పంచుకునేందుకే మనల్నీ ఆహ్వానిస్తోంది విశాఖ ఉత్సవ్‌... వెళదామా మరి!

- శిరికి సూర్యనారాయణ, ఈనాడు, విశాఖపట్నం
చిత్రాలు: గోపి

 

పుస్తకమేదైనా ఇరవై నిమిషాల్లోనే...

పుస్తకం కంటే మంచి స్నేహితుడు ప్రపంచంలో ఎవరూ ఉండరట. అలాంటి పుస్తకాల్ని కొందరు చదవాలన్న ఆసక్తి ఉన్నా సమయంలేక చదవలేరు. ఇంకొందరు ఏది మంచి పుస్తకమో తేల్చుకోలేక, సమయం వృథా చేసుకోవడమెందుకని దూరంగా ఉంటారు. అసలు చదివే అలవాటే లేనివాళ్లూ ఎక్కువే. అలాంటి వాళ్లందరితో కేవలం 20నిమిషాల్లో పుస్తకాల్ని చదివించి, మరిన్ని చదవాలన్న ఇష్టాన్ని పెంచుతోంది ‘బుక్‌లెట్‌’ అనే మొబైల్‌ అప్లికేషన్‌.

మంచి పుస్తకం ఎన్ని పేజీలున్నా కథనం వేగంగా, భాష సులభంగా ఉంటే అది ఇట్టే పూర్తయిందని అనిపిస్తుంది. అదే ఆ లక్షణాలు లేని పుస్తకాన్ని ఓ రెండు పేజీలు చదివినా బోరు కొట్టేస్తుంది. అందుకే ప్రపంచం ఇప్పుడున్న వేగంలో చాలామంది విషయంలేని పుస్తకాలపైన సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేక ఆ అలవాటుకే దూరమవుతున్నారు. ఆ క్రమంలో ఎన్నో మంచి పుస్తకాలనూ వదిలేస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ప్రజల్లో పుస్తకాలు చదివే అలవాటుని పెంచే ప్రయత్నం చేస్తోంది ‘బుక్‌లెట్‌.’ సాధారణంగా పుస్తక సమీక్ష చదివి అది బావుందో లేదో తేల్చుకోవడం ఎప్పట్నుంచో ఉన్న పద్ధతే. దానికి భిన్నంగా ఇందులో మంచి పుస్తకాల్లోని సారాంశం అంతా కనిపిస్తుంది. ఉదాహరణకు అబ్దుల్‌ కలాం ‘ఒక విజేత ఆత్మకథ’నే తీసుకుంటే, అందులో కలాం బాల్యంలోని ఆసక్తికర సంఘటనలూ, చదువుకునే రోజుల్లో ఎదురైన సమస్యలూ, శాస్త్రవేత్తగా ఎదిగే క్రమంలోని ముఖ్య పరిణామాలూ... ఇలా మొత్తంగా పుస్తకంలో ప్రస్తావించిన విషయాల్లోని సారమంతా కేవలం ఇరవై నిమిషాల్లోనే చదవడం పూర్తిచేసేంత నిడివిలో ఉంటుంది. వాటితో పాటు రచయితకు సంబంధించిన ముఖ్యమైన విషయాలూ, అతడి ఇతర రచనలూ, పుస్తకంలో ఎక్కువ ఆసక్తి కలిగించే అంశాలూ, శైలీ లాంటి వాటి ప్రస్తావనా కనిపిస్తుంది. మొత్తంగా ఓ మంచి పుస్తకం, దాని ఆత్మని కోల్పోకుండా తక్కువ సమయంలో చదివే అవకాశాన్ని కల్పించే అప్లికేషనే బుక్‌లెట్‌.

ఎక్కడున్నా చదవొచ్చు!
నిజంగా చదవాలని ఉన్నా ఆ ఇరవై నిమిషాలు కూడా కేటాయించలేక అప్లికేషన్‌ను పక్కన పెట్టేవాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్ల సమస్యకూ ‘బుక్‌లెట్‌’ పరిష్కారం చూపిస్తోంది. ప్రతి పుస్తక సారాంశం అక్షరాలతో పాటు ఆడియో రూపంలోనూ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అది కూడా ఏదో పుస్తకాన్ని టకటకా ఏ సాఫ్ట్‌వేరో చదివినట్లు కాకుండా పిల్లలకు చందమామ కథలు చెప్పినంత అందంగా ఆ సారాంశాన్ని వివరిస్తారు. దాంతో వంట చేస్తున్నా, ట్రెడ్‌ మిల్‌పైన నడుస్తున్నా, ప్రయాణంలో ఉన్నా కూడా హాయిగా ఓ పుస్తకాన్ని పూర్తిచేసేయొచ్చన్న మాట. ఈ రోజుల్లో కూడా జనాలతో పుస్తకాల్ని చదివించడానికి ఇంత తాపత్రయ పడుతున్నారంటే, ఉద్యోగం నుంచి విరమణ పొందిన ఏ పెద్దాయనో ఈ అప్లికేషన్‌ను మొదలుపెట్టుంటాడని అనిపించొచ్చు. కానీ అక్షరాలా లక్ష రూపాయలకుపైగా జీతం అందుకుంటున్న అమృత్‌ అనే ఓ యువ ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ ‘బుక్‌లెట్‌’ను ప్రారంభించడం విశేషం. ‘బాహుబలి’ సినిమా విడుదలైన కొత్తలో అమృత్‌ స్నేహితుడితో కలిసి దాన్ని చూడ్డానికి ఓ అరగంట ముందే థియేటర్‌కు వెళ్లాడు. కాస్త ఖాళీ దొరకడంతో అంతకుముందే అతడు చదవడం పూర్తిచేసిన ‘ది సెవన్‌ హ్యాబిట్స్‌ ఆఫ్‌ హైలీ ఎఫెక్టివ్‌ పీపుల్‌’ అనే పుస్తకం సారాంశాన్ని అతడికి వివరించడం మొదలుపెట్టాడు. సినిమా కథను తలపిస్తూ పుస్తకంలోని విషయాన్ని చెప్పిన తీరు స్నేహితుణ్ణి కట్టిపడేసింది. ఆ విషయాన్ని రాసి ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్‌లోనో పెడితే ఇంకొందరికి ఉపయోగపడుతుందని అతడు యథాలాపంగా ఇచ్చిన సలహా అమృత్‌ని ఆలోచనలో పడేసింది.

వాట్సాప్‌లో మొదలు
చిన్నప్పట్నుంచీ పుట్టినరోజులప్పుడు ఎక్కువగా పుస్తకాలే బహుమతులుగా రావడంతో అమృత్‌కి క్రమంగా వాటిని చదవడం అలవాటైంది. కొన్నాళ్లకు పుస్తక పఠనం అతడి దినచర్యలో భాగమైపోయింది. సీఏ వృత్తిలో నిత్యం బిజీగా ఉండే తానే పుస్తకాలు చదువుతున్నప్పుడు, మిగతావాళ్లు మాత్రం ఆ పని ఎందుకు చేయలేరనుకున్నాడు. దాంతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించి తాను చదివిన పుస్తకాల సారాంశాన్ని ఇరవై నిమిషాలలోపే చదవడం పూర్తి చేసేలా రాసి అందులో పెడుతూ వచ్చాడు. క్రమంగా స్నేహితుల ద్వారా ఆ విషయం పాకిపోయి వారం రోజుల్లోనే దాదాపు వెయ్యి మంది పుస్తక ప్రియులు గ్రూపులో చేరారు. ఆ తాకిడిని తట్టుకోలేక అతడి వాట్సాప్‌ క్రాష్‌ అయిపోయింది. ఆ ఆదరణ చూశాకే ఆప్‌ని మొదలుపెట్టి తాను చదివే పుస్తకాల సారాంశాన్ని అందులో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దాని ఫలితమే ఏడాదిన్నర క్రితం మొదలైన ‘బుక్‌లెట్‌’ ఆప్‌.

‘బుక్‌లెట్‌’లో ప్రతి వారం కొత్త పుస్తకాల సారాంశాలతో పాటు వాటిని చదివి ఆ రికార్డింగులనూ అమృత్‌ అందుబాటులో ఉంచుతున్నాడు. పుస్తకం నిడివి ఎక్కువగా ఉంటే రెండు మూడు భాగాలుగా విడదీసి వివరిస్తున్నాడు. పుస్తకం నచ్చి కొనుక్కోవాలనుకునే వారి కోసం చివర్లో అది దొరికే ఆన్‌లైన్‌ లింక్‌నీ అందిస్తున్నాడు. ‘పుస్తకపఠనం వల్ల ఉపయోగాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ ఆసక్తి మళ్లీ అందరిలో పెంచాలన్నదే నా ప్రయత్నం. ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడైన పుస్తకాల్నే ఎంచుకుంటున్నాను. మా బృందాన్ని విస్తరించి స్థానిక భాషల పుస్తకాల్నీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా’ అంటాడు అమృత్‌. అరచేతిలో ఓ మినీ లైబ్రరీని అందిస్తున్న అమృత్‌ని అభినందించాలంటే అతడికి ఫోనో, ఎస్సెమ్మెసో చేయనక్కర్లేదు, వీలైనంత త్వరగా ఓ మంచి పుస్తకాన్ని చదవడం మొదలుపెడితే చాలు..!


 

మేరా భారత్‌ మహాన్‌

భారత్‌ అంటే... అతిపెద్ద గణతంత్ర రాజ్యం అని తెలుసు. భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరని తెలుసు. కానీ, మనలో చాలామందికి తెలియని ఇంకా ఎన్నో ఎన్నో ప్రత్యేకతల కలయికే భారత్‌. మన గొప్పతనాన్ని మనమూ ఓసారి మననం చేసుకుందామా మరి.

చంద్రుడి మీద నీరుందని మొదట గుర్తించింది మనదేశమే. ఇస్రో చంద్రయాన్‌-1 ఈ విషయాన్ని కనుగొంది.
* 2500 సంవత్సరాల కిందటే మనదేశంలో ఆయుర్వేద పాఠశాలలున్నాయి. భూమ్మీద మొదటి వైద్య పాఠశాలలు ఇవే.
* ఎంతో ప్రాచుర్యంపొందిన కాటరాక్ట్‌, ప్లాస్టిక్‌ సర్జరీలను ప్రపంచానికి పరిచయం చేసింది మనదేశమే. క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలోనే మన దేశానికి చెందిన శుశ్రుతుడూ చరకుడూ ఈరకం చికిత్సలు చేశారట.
* మన దేశంలో జరిగే కుంభమేళా అంతరిక్షం నుంచి చూసినా కనిపిస్తుంది. దాదాపు పది కోట్ల మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే వేడుక.
* 2006లో రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్‌ కలాం స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లారు. భారత రాష్ట్రపతి ముప్పయ్యేళ్ల తర్వాత ఆ దేశానికి వెళ్లడంతో భారత మిస్సైల్‌ ప్రోగామ్‌ పితామహుడైన కలాంను గౌరవించేందుకుగానూ స్విస్‌ ప్రభుత్వం ఆయన వెళ్లిన మే 26ను సైన్స్‌డేగా ప్రకటించింది.
* తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం ప్రపంచంలోనే మొదటి గ్రానైట్‌ గుడి.
* తలస్నానానికి షాంపూని వాడడం మన నుంచే ఇతర దేశాలవారికి తెలిసింది. 16వ శతాబ్దంలోనే కుంకుడుకాయలు, ఉసిరి పొడి, మందారాలను ఉడికించి మనదేశంలో షాంపూల్ని తయారు చేసేవారు. తర్వాతి కాలంలో ఆంగ్లేయుల ద్వారా అది విదేశాలకు పాకింది. షాంపూ అన్నపదం కూడా సంస్కృత పదం చాంపూ నుంచి వచ్చిందే.

* 1948లో నోబెల్‌ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వలేదు. అందుక్కారణం ఆ ఏడాది ఆ పురస్కారాన్ని మహాత్మాగాంధీకి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన చనిపోవడంతో బాపూజీకి గౌరవసూచకంగా ఆ సంవత్సరం దాన్ని ఎవరికీ ఇవ్వలేదు.

* బాంద్రా-వర్లీ సముద్ర వంతెనకోసం ఏర్పాటుచేసిన స్టీలు వైర్ల పొడవు భూమి చుట్టుకొలత మొత్తానికీ సమానమట. ఈ వంతెన నిర్మాణానికి 2,57,00,000ల పని గంటల్ని వెచ్చించారట.
* భారత పురుషుల కబడ్డీ జట్టు ఇప్పటివరకూ అన్ని ప్రపంచకప్‌లనూ గెలిచింది.
* పంచదారను కనిపెట్టి, ఉపయోగించిన మొదటిదేశం భారతదేశమే. మిగిలిన ప్రపంచం దాన్ని తెలుసుకుందీ నేర్చుకుందీ మన నుంచే. వైకుంఠపాళి, యుద్ధకళలు పుట్టింది భారత్‌లోనే. షర్టు గుండీలూ స్కేలూ సున్నానీ కనిపెట్టింది కూడా మనమే.

*1936లో బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో జర్మనీని 8-1 తేడాతో ఓడించింది భారత హాకీజట్టు. ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మేజర్‌ ధ్యాన్‌చంద్‌కి అడాల్ఫ్‌ హిట్లర్‌ కూడా అభిమాని అయిపోయాడు. అతడికి జర్మన్‌ పౌరసత్వమూ మిలటరీలో ఉన్నత స్థాయి ఉద్యోగంతో పాటు తమదేశం తరఫున హాకీ ఆడే అవకాశం ఇస్తానంటూ ఆహ్వానించాడట హిట్లర్‌. ధ్యాన్‌చంద్‌ అందుకు ఒప్పుకోకపోవడం అతడి దేశభక్తికి నిదర్శనం.

* ప్రపంచానికి వజ్రాల గురించి తెలిసింది కూడా భారత్‌ ద్వారానే. వజ్రాలు మొదట కృష్ణా, గోదావరి, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రమే దొరికేవి మరి. 18వ శతాబ్దంలో బ్రెజిల్‌లో వజ్రాల గనులు బయటపడేవరకూ ప్రపంచం మొత్తానికీ వజ్రాలను అందించింది భారత్‌ మాత్రమే.
* ఆంగ్లం ఎక్కువ మంది మాట్లాడే దేశాల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్‌దే.
* తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై అంత్యక్రియలకు 1.5 కోట్లమంది హాజరయ్యారు. అంత్యక్రియలకు అంతమంది రావడం ప్రపంచ చరిత్రలో అదే తొలిసారి.

*ప్రపంచవ్యాప్తంగా వాడే సుంగంధద్రవ్యాల్లో అత్యధిక శాతం వాటిని ఉత్పత్తి చేసేదీ ఎగుమతి చేసేదీ మన దేశమే. పాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం కూడా భారతదేశమే.

* యూఎస్‌బీ... ప్రపంచ సాంకేతిక రంగం గతిని మార్చిన అద్భుత పరికరం. భారతీయ కంప్యూటర్‌ ఆర్కిటెక్ట్‌ అయిన అజయ్‌ వి.భట్‌ దీన్ని కనుగొనడంలో కీలకపాత్ర పోషించారు.
* ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ది రెండోస్థానం.
* మహారాష్ట్రకు చెందిన శ్రీకాంత్‌ జిచ్‌కర్‌ ‘మోస్ట్‌ క్వాలిఫైడ్‌ పర్సన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుపొందాడు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఎంపికకావడంతోబాటు, లా, వైద్యశాస్త్రం, ఫొటోగ్రఫీ, ఎంబీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ జర్నలిజం... ఇలా 20 రకాల డిగ్రీలను అందుకున్నాడు. చదవడమే కాదు, చాలా డిగ్రీల్లో గోల్డ్‌మెడల్స్‌నూ పొందాడు. సంస్కృతంలో డాక్టరేట్‌ కూడా సాధించాడు. అంతేకాదు, 25ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. మంత్రిగానూ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఈయన 49 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు.
* మానవ కంప్యూటర్‌గా బెంగళూరుకి చెందిన శకుంతలాదేవి 1982లో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. 7,686,369,774,870, 2,465,099,745,779 సంఖ్యలను గుణించి 28సెకన్లలో సరైన సమాధానం చెప్పిందామె.
* ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్‌ నెట్‌వర్క్‌ భారత్‌లోనే ఉంది. ఎన్నో ప్రతిభల కలబోత భారత్‌ కాబట్టే, ప్రతి సంవత్సరం గిన్నిస్‌ రికార్డులకోసం దరఖాస్తు చేసే దేశాల్లో మనదేశం మూడో స్థానంలో ఉంటోందట.
* ఎన్నో ప్రతిభల కలబోత భారత్‌ కాబట్టే, ప్రతి సంవత్సరం గిన్నిస్‌ రికార్డులకోసం దరఖాస్తు చేసే దేశాల్లో మనదేశం మూడో స్థానంలో ఉంటోందట. మేరా భారత్‌ మహాన్‌..!


 

క్రికెట్‌ అభిమానులకు మాత్రమే !

కొందరికి క్రికెట్‌ ఆట మాత్రమే కాదు, అదో పిచ్చి, అదే ప్రపంచం. అలాంటి వారికి సాధారణంగా వినిపించే, కనిపించే క్రికెట్‌ సమాచారం సరిపోదు. అందుకే క్రికెట్‌కే ప్రత్యేకమైన వెబ్‌సైట్లూ, యూట్యూబ్‌ ఛానెళ్లూ, ఆప్‌లూ పుట్టుకొచ్చాయి. అవేంటో చూద్దామా మరి!

ప్రపంచంలోనే మొదటి క్రికెట్‌ వెబ్‌పోర్టల్‌ espncricinfo.com. అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌ల స్కోరు వివరాల్ని తాజాగా, కచ్చితత్వంతో అందిస్తుందీ వెబ్‌సైట్‌. మ్యాచ్‌ల రిపోర్టుల్నీ, సమీక్షల్నీ రాతపూర్వకంగా, వీడియోలుగా ఎప్పటికప్పుడు అందిస్తుంది. ప్రస్తుత మ్యాచ్‌లవే కాదు, దశాబ్దాల కిందట జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ల స్కోరు వివరాల్నీ దీన్లో చూడొచ్చు. ఆటగాళ్ల ప్రదర్శన, జట్ల బలాలూబలహీనతలూ, ఆటలో తాజా పరిణామాల గురించీ అనుభవజ్ఞులైన వ్యాఖ్యాతల విశ్లేషణల వీడియోలు ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో జరిగే ప్రతి కదలిక గురించీ ఇక్కడ సమాచారం ఉంటుంది. ఇంకా ఆకర్షణీయమైన గ్రాఫిక్‌ల ద్వారా విశ్లేషణల్నీ అందిస్తుంది. ఐఓఎస్‌/ఆండ్రాయిడ్‌లలో దీని ఆప్‌ కూడా ఉంది. ఈ సంస్థకే చెందిన ‘దక్రికెట్‌మంత్లీడాట్‌కామ్‌’ క్రికెట్‌ అభిమానులకు ఆట గురించి మరింత విలువైన సమాచారాన్నీ, చరిత్రనూ అందిస్తుంది.

హర్ష... కనిపిస్తాడు
ప్రజాదరణ ఎక్కువగా ఉన్న క్రికెట్‌ వెబ్‌సైట్లలో cricbuzz.com ఒకటి. దీన్లో ప్రపంచ క్రికెట్‌కు సంబంధించి చాలా కోణాల్లో సమాచారం దొరుకుతుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లతోపాటు భారతీయ దేశవాళీ మ్యాచ్‌ల సమాచారమూ తెలుసుకోవచ్చు. క్రికెట్‌ వ్యాఖ్యాతగా హర్షాభోగ్లేకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ టీవీలో కొంత కాలంగా అభిమానులు హర్ష వ్యాఖ్యానాన్నీ, విశ్లేషణల్నీ వినలేకపోతున్నారు. ఇక్కడ హర్ష విశ్లేషణల వీడియోల్ని చూడొచ్చు, ఆడియో వ్యాఖ్యానాన్ని వినొచ్చు. క్రిక్‌బజ్‌ ఆండ్రాయిడ్‌/ఐఓఎస్‌ ఆప్‌ కూడా ఉంది.

ప్రత్యక్ష ప్రసారం...
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులకు కంప్యూటర్లూ, స్మార్ట్‌ఫోన్లలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తున్న వెబ్‌సైట్‌/ఆప్‌ hotstar. స్టార్‌ మీడియా సంస్థకు చెందిన ఈ వెబ్‌సైట్‌లో ఆ సంస్థ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసే మ్యాచ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. కొంత మొత్తం చెల్లించి మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల్ని చూడొచ్చు. లేదంటే ఒక ఓవర్‌ ఆలస్యంగా ఉచితంగానే చూడొచ్చు. యూట్యూబ్‌ వీడియోల మాదిరిగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను మనకు కావాల్సిన దగ్గర నుంచి చూసుకునే వెసులుబాటు ఉండటం మరో ప్రత్యేకత.

విజ్డెన్‌... వెబ్‌సైట్‌
క్రికెట్‌కూ, విజ్డెన్‌కూ 150 ఏళ్ల అనుబంధం ఉంది. 1884 నుంచీ ఈ సంస్థ క్రికెట్‌కు సంబంధించిన పుస్తకాల్ని ప్రచురిస్తోంది. ఈ సంస్థ ప్రకటించే ‘విజ్డెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ ఎవరో తెలుసుకోవడానికి క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. విజ్డెన్‌ సంస్థ భారతీయ క్రికెట్‌ అభిమానల కోసం ప్రత్యేకంగా wisdenindia.com ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్లో భారతీయ క్రికెట్‌ గురించి వార్తల్ని అందిస్తూనే అంతర్జాతీయ క్రికెట్‌ సమాచారమూ పెడుతున్నారు.

రెండు భాషల్లో
cricketcountry.com కేవలం క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లిష్‌తోపాటు హిందీలోనూ అందిస్తోన్న వెబ్‌పోర్టల్‌ ఇదొక్కటే. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌ల గురించి ఎక్కువ సమాచారం అందిస్తూ వర్థమాన క్రికెటర్ల గురించి కథనాలు ఇస్తుంది. క్రికెట్‌ అభిమానులకోసం బ్లాగులూ, ప్రపంచకప్‌ చరిత్ర, ఫొటోలూ, క్రికెట్‌ చరిత్రలో ఈరోజు, క్రికెట్‌ క్రాస్‌వర్డ్స్‌... తదితర విభాగాలూ దీన్లో ఉన్నాయి.

రికార్డులు కావాలంటే...
క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా చర్చించే అంశాల్లో రికార్డులూ ఉంటాయి. టెస్టులూ, వన్డేలూ, టీ20ల్లో ఎన్నో రికార్డులున్నాయి. వాటన్నింటినీ ఒకచోట చేర్చి అందిస్తోంది cricwaves.com. వీటితోపాటు లైవ్‌స్కోర్లూ, మ్యాచ్‌ల తేదీలూ, ఐసీసీ ర్యాంకింగ్స్‌... లాంటివీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ వివరాల్ని సోషల్‌ మీడియాలో షేర్‌చేసుకునే సౌకర్యమూ ఉంది.

రేడియోలో క్రికెట్‌
క్రికెట్‌లో 1990లకు పూర్వంనాటి అనుభవాన్ని పొందాలనుకుంటున్నారా... అదేనండీ రేడియోలో వ్యాఖ్యానం వినడం... అయితే cricketworld.com వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ‘రేడియో వ్యాఖ్యాన విభాగం’ ఉంది.

జట్టుకో వెబ్‌సైట్‌
ఇవి మాత్రమే కాకుండా, వివిధ దేశాల క్రికెట్‌ బోర్డులు సొంత వెబ్‌సైట్‌లను ప్రారంభించాయి. వాటిలో భారత్‌ (bcci.tv), ఆస్ట్రేలియా (cricket.com.au), పాకిస్థాన్‌ (pcb.com.pk), న్యూజిలాండ్‌ (blackcaps.co.nz), దక్షిణాఫ్రికా (cricket.co.za), ఇంగ్లాండ్‌ (ecb.co.uk) ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లలో ఆయా దేశాల క్రికెట్‌ జట్టుకి సంబంధించిన సమాచారంతోపాటు ఆటగాళ్ల ఇంటర్వ్యూలూ, మ్యాచ్‌ల విశ్లేషణలూ కనిపిస్తాయి.

యూట్యూబ్‌లో క్రికెట్‌
క్రికెట్‌కే ప్రత్యేకమైన యూట్యూబ్‌ ఛానెల్స్‌ చాలా ఉన్నాయి. వాటిలో lord's cricket ground ఒకటి. క్రికెట్‌ మక్కాగా పిలిచే లార్డ్స్‌ మైదానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ రికార్డుల్ని ఆటగాళ్లూ, అభిమానులూ ఎంతో గొప్పగా భావిస్తారు. అందుకే లార్డ్స్‌లో ఆటగాళ్ల రికార్డు ప్రదర్శనల్ని వీడియోలుగా ఈ ఛానెల్లో పెడుతుంటారు. దీన్లో అన్నిదేశాల క్రీడాకారుల వీడియోలూ ఉంటాయి. ఏబీడివిలియర్స్‌ క్రికెట్‌ పాఠాల్ని చూడాలనుకునేవారు ‘క్రికెట్‌ యార్డ్‌’ ఛానెల్‌ను చూడొచ్చు. వీటితోపాటు ఐసీసీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఈసీబీ, ఐలవ్‌క్రికెట్‌, లైవ్‌ క్రికెట్‌ ఛానెళ్లలో ఆటను రకరకాల కోణాల్లో చూపిస్తూ వీడియోల్ని అందిస్తున్నారు.


 

రాష్ట్రపతులంతా ఒకేచోట..!

‘భారతదేశ చారిత్రక వైభవానికీ సంస్కృతికీ స్వాతంత్య్రోద్యమానికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రపతి భవన్‌ మ్యూజియం సముదాయం’ అంటూ ఆ విశేషాలను మనకందిస్తున్నారు కడప జిల్లాకు చెందిన డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌.

నదేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి దేశవిదేశాలను సందర్శించినప్పుడు బహుమతులను అందుకోవడం సహజం. ఉదాహరణకు తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ ప్రపంచదేశాల నుంచి 11 వేల కానుకలను అందుకున్నారట. వాటిల్లో పురాతనమైనవీ చారిత్రకమైనవీ సంస్కృతిని ప్రతిబింబించేవీ... ఇలా చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ రాష్ట్రపతిభవన్‌లోని తోష్‌ఖానాలోనే భద్రపరిచేవారు. అలా అందరు రాష్ట్రపతులూ అందుకున్నవాటితో ఓ సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణబ్‌ముఖర్జీ ఆలోచనకు ప్రతిరూపమే ఈ మ్యూజియం సముదాయం.

ముందుగా క్లాక్‌టవర్‌లోని రిసెప్షన్‌కి వెళ్లి ఐడెంటిటీ కార్డు, ధృవీకరణ పత్రాలు చూపించి, మ్యూజియం కాంప్లెక్సులోకి వెళ్లాం. మూడంతస్తుల ఈ భవనంలో రెండు అంతస్తులు భూగర్భంలో ఉన్నాయి. అందుకే ఇది దేశంలోనే తొలి భూగర్భ మ్యూజియం.స్వతంత్రం రాకముందు బ్రిటిష్‌ వైస్రాయ్‌లుగా పనిచేసిన లార్డ్‌ ఇర్విన్‌, మౌంట్‌బాటన్‌... తదితరులు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వస్తుసామగ్రినీ ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. దాదాపు 1911నుంచి నేటి వరకూ దేశచరిత్రలోని కీలక సంఘటనలకు చెందిన వస్తుకళాకృతులన్నీ ఇక్కడ కొలువుదీరాయి.

భూగర్భంలో...
ఓ ప్రత్యేక చదరం ఆకారంలో ఏర్పాటు చేసిన ఓ బాక్సులో రాష్ట్రపతులందరి త్రీడీ హోలోగ్రాఫిక్‌ చిత్రాలు మారుతూ కనిపిస్తాయి. అదేసమయంలో వాళ్ల ప్రసంగాలనూ వినవచ్చు. అలాగే రాష్ట్రపతులందరి జీవనశైలీ చూడగానే తెలిసేలా వాళ్లకు చెందిన వస్తువులన్నీ వేర్వేరుగా ప్రదర్శనకు ఉంచారు. మరోచోట సజీవంగా అనిపించేలా మలిచిన మాజీ రాష్ట్రపతుల శిల్పాలు సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. వాళ్ల జీవిత విశేషాలను ఆడియో ద్వారా తెలుసుకునే ఏర్పాటూ ఉంది. అలాగే హ్యాండ్‌ షాడో షో ద్వారా రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన విషయాలనూ తెలుసుకున్నాం. ఇంటరాక్టివ్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా ఉద్యమ కాలంనాటి అరుదైన ఫొటోలను చూస్తూ గత కాలంలోకి వెళ్లిపోయాం.

ఉద్యమస్ఫూర్తి..!
స్వదేశీ ఉద్యమంలో భాగమైన విదేశీ వస్తువుల బహిష్కరణ, జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం, దండి మార్చ్‌, ఉప్పు తయారీ... వంటి అనేకానేక స్వాతంత్య్రోద్యమ ఘట్టాలకు సంబంధించిన శిల్పాలు మనల్ని ఒక్కసారిగా ఆ రోజుల్లోకి తీసుకెళతాయి. నాటి వైస్రాయ్‌ నివాసంలో కుదిరిన చారిత్రక గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక, దేశ విభజన నిర్ణయం తీసుకోవడానికి ముందు దర్బారు హాల్లో జరిగిన నాటి నేతల సమావేశం, తొలి ప్రధాని నెహ్రూ 1947 ఆగస్టు 15 నాటి ప్రసంగం... వంటి వాటిని డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా మన కళ్లముందే జరుగుతున్నట్లుగా ఏర్పాటుచేశారు.

ఇవే కాదు, రాష్ట్రపతి భవన్‌ కోసం సర్‌ ఎడ్విన్‌ లుటెయిన్స్‌ తయారుచేయించిన ప్రత్యేక కొయ్య ఫర్నిచరూ, బంగారు రేకులతో తాపడం చేసిన వెండి సింహాసనాలూ, ఐదో కింగ్‌ జార్జ్‌, క్వీన్‌ మేరీల విగ్రహాలూ, విక్టోరియన్‌ శైలిలో నిర్మించిన గుర్రపు బగ్గీలూ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి జోర్దాన్‌ రాజు బహూకరించిన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారూ, రాష్ట్రపతి బాడీగార్డు వస్త్రాలూ... వంటివన్నీ కూడా ఈ ప్రదర్శనశాలలో కొలువుదీరాయి. నాటి యుద్ధాల్లో ఉపయోగించిన ఆయుధాలూ వస్తు సామగ్రిని కూడా ఇక్కడ చూడవచ్చు. అలాగే గౌతమబుద్ధుడి విగ్రహాలతోబాటు స్వర్ణదేవాలయం, తిరుమల దేవాలయ నమూనాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆర్‌.వెంకట్రామన్‌ సేకరించిన జెమినీరాయ్‌, ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ వంటి వాళ్ల చిత్రలేఖనాలతోబాటు వివిధ దేశాల ప్రతినిధుల ఆటోగ్రాఫ్‌లతో కూడిన జ్ఞాపికలన్నింటినీ ఏకకాలంలో చూడగలగడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.