close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేనున్నాను

నేనున్నాను
-పూర్ణిమ

‘‘వదినా, వదినా... తలుపు తెరు’’ శశి గొంతు విని ఆలోచనల్లోంచి తేరుకుంది వైదేహి.
‘ఏమైంది, పొద్దున్నే వచ్చింది’ అనుకుంటూ తలుపు తీసింది. ‘‘ఏమైంది శశీ, పొద్దున్నే వచ్చావు?’’
‘‘ఇది పొద్దున్నా, టైమ్‌ ఎంతయిందో చూశావా... పన్నెండు అవుతోంది.
పొద్దుట్నుంచీ గదిలో తలుపేసుకుని ఉన్నావట. పిల్లలు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయటంలేదట. వాళ్ళు కంగారుపడుతూ నాకు కాల్‌ చేశారు. ఏమైంది వదినా, ఒంట్లో బాగానే ఉందా?’’
‘‘అయ్యో, పన్నెండు అవుతోందా, ఫోన్‌ సైలెంట్‌లో ఉంది. ల్యాండ్‌లైన్‌ కూడా రిపేర్‌లో ఉంది కదా... నేను మర్చిపోయాను. పిల్లలు టెన్షన్‌ పడుతున్నారేమో. అనవసరంగా మీ అందర్నీ కంగారుపెట్టేశా. సారీ శశీ’’ నొచ్చుకుంటూ అంది.

‘‘ఇంత చిన్న విషయానికి సారీ లెందుకు వదినా. ఎలాగూ నీ దగ్గరకే వద్దామనుకున్నా. కౌశిక్‌ కాల్‌ చేసేసరికి- ఆఫ్టర్‌ లంచ్‌ బయలుదేరేదాన్ని కొంచెం ముందు బయలుదేరా. మా టెన్షన్‌ పక్కనపెట్టు... నీ కళ్ళు అలా ఉన్నాయేం? ఏం చేస్తున్నావు పొద్దుట్నుంచీ’’ అంటూ గదిలోకి అడుగుపెట్టిన శశికి వైదేహి పెళ్ళి ఫొటోల ఆల్బమ్‌ కనిపించింది.

‘ఓ... పెళ్ళిరోజున పెళ్ళి ఫొటోలు చూస్తున్నావా’ నవ్వుతూ అందామనుకుంది కానీ, కళతప్పిఉన్న వైదేహి ముఖం చూసి ఆగిపోయింది.

‘‘వదినా, ఏమైంది అన్నయ్య ఆరోగ్యం ఏమన్నా...’’

‘‘లేదు లేదు శశీ, అలాంటిదేం లేదు.’’

‘‘మరేమైంది వదినా, ఈరోజు మీ నలభయ్యో పెళ్ళిరోజు. పోయిన ఏడాది కూడా నువ్వు ఈరోజు నవ్వుతూనే జరుపుకున్నావు. నీ ధైర్యం, నిబ్బరం చూసి నేనెప్పుడూ ఆశ్చర్యపోతూనే ఉంటాను. మరి ఈసారేమైంది... అన్నయ్య ఆరోగ్యంలో కొత్త మార్పులు ఏమీ లేవు కదా.’’

‘‘పోయిన ఏడాది నేను గుర్తుచేయగా చేయగా, ఆరోజు పెళ్ళిరోజనీ, నేను ఆయన భార్యననీ గుర్తుపట్టారు శశీ. కానీ, ఈమధ్యన నన్ను తన భార్యగా ఒప్పుకోనే ఒప్పుకోవటం లేదు. ఇక ఎలా గుర్తుచేయను. రోజురోజుకీ దిగజారుతున్న ఆయన పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయారు. ఒంటిచేత్తో ఇంత పెద్ద సంసారాన్ని అవలీలగా ఈదుకొచ్చారు. అలాంటి మనిషి ఈరోజు... ఇలా చంటిపిల్లాడికన్నా నిస్సహాయంగా, తనకేం కావాలో తెలీక, ఆత్మీయులందరం ఎదురుగానే ఉన్నా ఎవరినీ గుర్తుపట్టక ఒంటరిగా తన ప్రపంచంలో తను బతుకుతున్నారు. నావల్ల కావటంలేదు శశీ. తట్టుకోలేకపోతున్నాను. ఈ నలభయ్యేళ్ళల్లో ఎన్నో ఒడుదొడుకులూ కష్టనష్టాలూ ఎదుర్కొన్నాం - ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా. ఎప్పుడన్నా తట్టుకోలేక మీ అన్నయ్య దగ్గర బాధపడితే ‘ఏం టెన్షన్‌ పడకు, నేనున్నానుగా’ అనేవారు. ఆ ఒక్క మాటతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చేది. ఇప్పుడు అలా చెప్పే స్థితిలో తను లేరు. అసలు తనకేమయిందో, మనం తనకి ఏమవుతామో గుర్తుపట్టే స్థితిలో లేరు. ఇన్నాళ్ళనుంచీ కూడగట్టుకుంటున్న ధైర్యం పటాపంచలైపోతోంది’’ ఎన్నాళ్ళనుంచో గుండెల్లో గూడుకట్టుకున్న బాధ కట్టలు తెంచుకుని కన్నీళ్ళ రూపంలో ముంచెత్తింది వైదేహిని.

‘‘వదినా, ప్లీజ్‌ బాధపడకు. నువ్వలా డిప్రెషన్‌కి లోనైతే నీ ఆరోగ్యం పాడవుతుంది.’’

‘‘ఏం చేయను, ఆరోగ్యంగా ఉండి? నేను ఉన్నా లేకున్నా ఆయనకి తెలీదు. ఆయన పరిస్థితి ఇంకా ఇంకా దారుణం అయ్యేలోపు నేనే పోతే బాగుండును. ఈ రంపపు కోత తప్పుతుంది’’ ఆమె కన్నీటి వరదకు ఏం చెప్పి ఆనకట్ట వేయాలో తెలీక నిస్సహాయంగా చూస్తూండిపోయింది శశి.

* * *

వైదేహి, రామ్మూర్తిలది నిజంగా సీతారాములంతటి ఆదర్శవంతమైన దాంపత్యమే. పద్దెనిమిదేళ్ళకే రామ్మూర్తి చేయి పట్టుకుని అతని జీవితంలో అడుగుపెట్టిన వైదేహి- అతి త్వరలో అతనిలో సగమైపోయింది. ‘మన పేర్లయితే సీతారాములవి కానీ, మనం శివపార్వతులం’ అంటుండేవాడు రామ్మూర్తి. ‘అర్ధాంగి అంటే ఏమిటో నాకిప్పుడు అర్థమైంది వైదేహీ’ అని మురిసిపోయేవాడు. అలాగని వాళ్ళకేం సమస్యలు లేవనికాదు. అత్తగారి గయ్యాళితనం, మామగారి చాదస్తం, ముగ్గురు ఆడపడుచుల పెళ్ళిళ్ళు... అన్నీ కలగలిపితేనే వాళ్ళ కొత్త కాపురం. ఒక్క రామ్మూర్తి జీతంతోనే బాధ్యతలన్నీ నెరవేర్చారు. ఆడపడుచుల పెళ్ళిళ్ళు పూర్తయ్యేసరికి ముగ్గురు పిల్లలు పుట్టుకొచ్చారు. ఇద్దరు అబ్బాయిలు కౌశిక్‌, కార్తీక్‌- అమ్మాయి కీర్తన. వాళ్ళ చదువులూ ఉద్యోగాలూ పెళ్ళిళ్ళూ, మధ్యలో అత్తమామలు కాలం చేయటం... ఇలా తెలీకుండానే సంవత్సరాలు తిరిగిపోయాయి. అబ్బాయిలు ఇద్దరూ మంచి ఉద్యోగాలతో అమెరికా వెళ్ళిపోయారు. అమ్మాయి ఢిల్లీలో ఉంటోంది. రామ్మూర్తి రిటైర్‌ అయ్యేసరికి అందరి పెళ్ళిళ్ళూ అయ్యి, బాధ్యతలు తీరి ప్రశాంతంగా ఉన్నారు. ఇక జీవిత చరమాంకం ఒకరి సాహచర్యంలో ఒకరు ఆనందంగా గడుపుతూ ఉండగా ఒక పిడుగుపాటు వారి జీవితం మీద పడింది. ఆనాటి నుంచీ వైదేహి జీవితమే మారిపోయింది.

* * *

రిటైర్‌ అయినప్పటి నుంచీ రామ్మూర్తిలో మతిమరుపు పెరగటం మొదలయింది. చదివిన న్యూస్‌పేపర్‌నే మర్చిపోయి మళ్ళీ చదవటం, కాఫీ తాగినా తాగలేదనడం, మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఏం చెప్తున్నాడో మర్చిపోవడం జరుగుతూ ఉండేవి. పరధ్యానపు ప్రొఫెసర్‌ అని వైదేహి వెక్కిరించేది. రోజురోజుకీ పెరుగుతున్న మతిమరుపు ఆమెను ఆందోళనకు గురిచేసినా పెద్ద వయసులో ఇది సహజమే కదా అని తనకుతనే సర్ది చెప్పుకునేది. కానీ, అమెరికా నుండి వచ్చిన పెద్దకొడుకు కౌశిక్‌ను రామ్మూర్తి గుర్తుపట్టకపోయేసరికి అంతా ఒకసారి షాక్‌ అయ్యారు. కౌశిక్‌ వెంటనే డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అన్ని టెస్ట్‌లూ పూర్తయ్యాక డాక్టర్లు తేల్చినది ఏమిటంటే రామ్మూర్తికి ‘అల్జీమర్స్‌’.

‘అల్జీమర్స్‌ అనేది చికిత్సలేని నరాలకు సంబంధించిన అరుదైన వ్యాధి. ఈ వ్యాధికి లోనైనవారు నెమ్మది నెమ్మదిగా అన్నీ మర్చిపోతారు. మొదట్లో అది మామూలు మతిమరుపులానే ఉంటుంది. కానీ రానురానూ అన్నీ మర్చిపోతుంటారు- చివరకు భోజనం ఎలా తినాలో, స్నానం ఎలా చేయాలో కూడా తెలీకపోవచ్చు. మధ్యమధ్యలో అన్నీ గుర్తొచ్చి నార్మల్‌గా అనిపించొచ్చు కూడా. కానీ అది తాత్కాలికం. ఎక్కువసేపు అలా ఉండకపోవచ్చు.’ ఈ వ్యాధి గురించి తెలుసుకున్న వైదేహి కుప్పకూలిపోయింది.

మిగిలిన ఇద్దరు పిల్లలూ వచ్చారు. వైదేహిని సముదాయించడం కష్టమైపోయింది. తనకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఏర్పాటుచేశారు.

‘‘అలవాటైన మనుషులూ అలవాటైన ప్లేస్‌లో తప్ప అల్జీమర్‌ పేషెంట్స్‌ ఉండలేరు. చికిత్సలేని ఈ వ్యాధిని ముదరకుండా మందులతో కొంత కంట్రోల్‌ చేయొచ్చు. కానీ మందులకన్నా ముఖ్యం- పేషెంట్‌ని చూసుకునే వాళ్ళ సహనం, ప్రేమ. అందుకే మీకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. వీలైనంతవరకూ ఆయనను ఒంటరిగా ఉంచకండి. బయటకు ఒక్కళ్ళనీ పంపొద్దు. ఇంట్లో చిన్నచిన్న ఎక్సర్‌సైజ్‌లు చేయించండి. అలాగే పజిల్స్‌, సుడొకు లాంటి మైండ్‌గేమ్స్‌ చేయించండి. ముందు మీరు ధైర్యంగా ఉండాలి. మీరు నవ్వుతూ ఆరోగ్యంగా ఉంటేనే ఆయన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు’’- ఇలా ఎంతో కౌన్సెలింగ్‌ చేసి ఎన్నో జాగ్రత్తలు చెప్పిన తర్వాత సడలిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకుని మళ్ళీ జీవన పోరాటానికి సిద్ధమైంది వైదేహి.

పిల్లలకి ఎంత ప్రేమాభిమానాలున్నా ఉద్యోగరీత్యా దగ్గర ఉండలేని పరిస్థితి. తల్లికి తోడుగా- ఎప్పటినుంచో ఇంట్లో పనిచేస్తున్న పార్వతినీ, ఆమె భర్తనీ ఇంట్లోనే ఉండిపోయే ఏర్పాటుచేసి, తండ్రిని చూసుకోవడానికి ఒక ట్రైన్డ్‌ నర్స్‌ను కూడా ఏర్పాటుచేసి, భారమైన హృదయాలతో వెళ్ళిపోయారు పిల్లలు. దగ్గర్లోనే ఉండే మేనత్త శశి తను తోడుగా ఉంటానని ధైర్యం చెప్పి పంపింది.

* * *

‘‘అమ్మా, సార్‌ లేచారు’’ పార్వతి పిలుపునకు కళ్ళు తుడుచుకుంటూ లేచింది వైదేహి.

‘‘శశీ, మీ అన్నయ్యకు భోజనం తినిపించి వస్తా. నువ్వొకసారి పిల్లలకు ఫోన్‌ చేసి కంగారుపడొద్దని చెప్పు. నేను తర్వాత మాట్లాడతానని చెప్పు’’ నీరసంగా నడుచుకు వెళ్తున్న వైదేహిని చూస్తూ కౌశిక్‌కి ఫోన్‌ చేసింది శశి.

‘‘అత్తా, వెళ్ళావా అమ్మ దగ్గరికి. ఎందుకు కాల్‌ అటెండ్‌ అవట్లేదు’’ ఆదుర్దాగా అడిగాడు కౌశిక్‌.

‘‘అమ్మ దగ్గర్నుంచే మాట్లాడుతున్నా నాన్నా, తను బాగానే ఉంది. డోంట్‌వర్రీ, తర్వాత మాట్లాడతానంది.’’

‘‘మరి, మార్నింగ్‌ నుంచీ ఎందుకు ఎవరికీ ఫోన్‌కి దొరకట్లేదు?’’

‘‘ఏంలేదు కౌశిక్‌, తను మెంటల్లీ బాగా డిస్ట్రబ్డ్‌గా ఉంది. మనందరి ముందూ ధైర్యంగా కనిపిస్తున్నా, నాన్న పరిస్థితి తనని లోపల నుంచి కుంగదీస్తోంది. ఈరోజు వాళ్ళ పెళ్ళిరోజు కూడా కదా... కొంచెం ఎమోషనల్‌గా ఉంది. తనకి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. మనం కూడా అర్థంచేసుకోవాలి.’’

‘‘నాకు అర్థం అవుతోంది అత్తా, అందుకే ఈ టెన్షన్‌. అమ్మ తన బాధ ఎవరితో షేర్‌ చేసుకోదు. వెబ్‌కామ్‌లో చూస్తున్నాంగా... రోజురోజుకీ వీక్‌ అయిపోతోంది. తన హెల్త్‌గురించి కూడా కేర్‌ తీసుకుంటున్నట్టు లేదు. ఒక్కర్తీ నాన్నని మేనేజ్‌ చేయటం కష్టమవుతోంది తనకి. అందుకే, ముగ్గురం ఆలోచించి ఒక డెసిషన్‌ తీసుకున్నాం.’’

‘‘ఏంటా డెసిషన్‌?’’

‘‘అమ్మానాన్నల్ని ఇక్కడకు తీసుకొచ్చేద్దామనుకుంటున్నాం. అమ్మ మా దగ్గర ఉంటుంది. ఇక్కడ అల్జీమర్‌ పేషెంట్స్‌కు స్పెషల్‌ హోమ్స్‌ ఉన్నాయి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ట్రైన్డ్‌ నర్సులు, క్వాలిఫైడ్‌ స్టాఫ్‌, పీస్‌ఫుల్‌ అట్మాస్‌ఫియర్‌ ఉంటుంది. మాకు దగ్గర్లోనే ఉంది ఒక హోమ్‌. నాన్నని అందులో జాయిన్‌ చేద్దాం. అమ్మ వారంవారం వెళ్ళి చూసిరావచ్చు. తనకి ఈ వయసులో కొంత రెస్ట్‌ దొరుకుతుంది. మాతో కలిసి ఉంటుంది కాబట్టి లోన్లీనెస్‌ ఉండదు.’’

‘‘కానీ, మీ నాన్న హోమ్‌లో ఉండగలడా?’’

‘‘అత్తా, ప్రాక్టికల్‌గా ఆలోచించు. నాన్నకి ఎక్కడ ఉన్నా తేడా తెలీదు. ఒక వారంరోజులు కొత్తపడినా అలవాటుపడతారు. అదే మా దగ్గర ఇంట్లోనే ఉంచామనుకో... మేమెవరం రోజంతా ఇంట్లో ఉండం. మళ్ళీ నాన్న డ్యూటీ అంతా అమ్మకే పడుతుంది. నాన్న ఎలాగూ మనలో ఉన్నా మనతో లేనట్టే. ఉన్న అమ్మనయినా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇదొక్కటే మార్గం’’ గొంతు గద్గగమయింది.

‘‘బాధపడకు కౌశిక్‌. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ, మీ అమ్మ ఒప్పుకుంటుందా అని.’’

‘‘ఒప్పించాలి అత్తా, తప్పదు. నేనూ, కార్తీక్‌ వచ్చేనెల ఎలాగూ ఇండియా వస్తున్నాం. కీర్తనా వాళ్ళ గృహప్రవేశం కూడా ఉంది కదా ఢిల్లీలో. ముందు ఢిల్లీ వెళ్ళి ఫంక్షన్‌ అయ్యాక అందరం కలిసి అక్కడికి వస్తాం. ఈలోపు నువ్వో సహాయం చేయాలి. అమ్మని ఎలాగన్నా కీర్తనావాళ్ళ ఫంక్షన్‌కి ఢిల్లీ పంపు. మేము నెమ్మదిగా తనని ప్రిపేర్‌ చేస్తాం. నాన్నకి కూడా అమ్మ లేకుండా నాలుగయిదురోజులు అలవాటయిందంటే అమ్మ కూడా మేము చెప్పింది ఒప్పుకోవచ్చు.’’

‘‘వూ సరే, నేను ట్రై చేస్తా.’’

‘‘వినడానికి హార్ష్‌గా, మేము సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తోంది కదా అత్తా. నిజానికి ఇది మాకూ నచ్చడంలేదు. కానీ...’’

‘‘లేదు లేదు కౌశిక్‌, ఇందులో మీ అమ్మమీద మీ ప్రేమే కనిపిస్తోంది’’ మనస్ఫూర్తిగా చెప్పింది శశి.

‘‘ఓకే కౌశిక్‌. మీ అమ్మ వస్తోంది, బై’’ చెప్పి పెట్టేసింది.

‘‘శశీ, మనం కూడా భోజనం చేద్దాం రా’’ వైదేహి పిలిచింది.

‘‘చేద్దాం కానీ వదినా, వచ్చేనెల కీర్తన గృహప్రవేశం కదా... వెళ్తున్నావా?’’

‘‘నేనా, నేనెలా వెళతాను. మీ అన్నయ్యని తీసుకువెళ్ళలేను. వదిలి అసలు వెళ్ళలేను’’ నిస్సహాయంగా అంది వైదేహి.

‘‘మేమంతా ఉన్నాంగా వదినా. మేము జాగ్రత్తగా చూసుకుంటాంలే. నువ్వు ఒక్క నాలుగురోజులకయినా వెళ్ళు. కీర్తన మొన్న నాకు కాల్‌ చేసి చాలా ఏడ్చింది. ‘నాన్న ఎలాగూ రాలేరు, అమ్మ కూడా రాదు. నాకు ఈ ఫంక్షన్‌ జరుపుకోవాలని లేదు’ అని ఒకటే ఏడుపు. తన గురించి ఆలోచించు. పీటల మీద కూర్చున్నప్పుడు కన్నవారు లేకపోతే ఆడపిల్ల మనసెంత బాధపడుతుందో మనం వూహించగలం కదా వదినా.’’

‘‘నిజమే శశీ, కానీ మీ అన్నయ్య...’’

‘‘వదినా, అన్నయ్య బాధ్యత నాది. ఒక్క నాలుగురోజులు వెళ్ళిరా. వచ్చేటప్పుడు పిల్లలందరూ నీతో వస్తారు. అప్పటికి అన్నయ్యని భద్రంగా నీకప్పజెప్తాను. నామీద నమ్మకం ఉందికదా నీకు. నువ్వెళ్ళకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వు నమ్మట్లేదనుకోవాలి.’’ రకరకాలుగా చెప్పిన మీదట అయిష్టంగానే ఒప్పుకుంది వైదేహి.

* * *

శశికీ, పార్వతికీ, నర్సుకీ వంద జాగ్రత్తలు చెప్పి, రామ్మూర్తికి కావలసినవన్నీ నాలుగు రోజులకి అమర్చిపెట్టి ఢిల్లీకి బయలుదేరింది వైదేహి. గృహప్రవేశం లక్షణంగా జరిగింది. మనసు భర్తమీదనే ఉన్నా కళకళలాడుతున్న ముగ్గురు పిల్లల్నీ వారి కుటుంబాల్నీ చూసి కొంత కుదుటపడింది వైదేహి. ఫంక్షన్‌ అవగానే వైదేహి జ్వరపడింది. వైరల్‌ ఫీవర్‌, నాలుగురోజులు రెస్ట్‌ తీసుకోవాలని డాక్టర్‌ చెప్పేసరికి ప్రయాణం ఇంకో నాలుగు రోజులు వాయిదాపడింది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఎదురుచూస్తున్న వైదేహికి ఇదో ఆశాభంగం. కౌశిక్‌వాళ్ళు మాత్రం ఇదీ ఒక రకంగా మంచికే అనుకున్నారు. తల్లితో నెమ్మదిగా చెప్పి ఒప్పించడానికి ఇదో అవకాశం అనిపించింది. అమెరికా వెళ్ళిపోవటం గురించి వాళ్ళు చెప్పగానే నోటమాట రాలేదు వైదేహికి. వాళ్ళు రకరకాలుగా నచ్చచెప్తూనే ఉన్నారు. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయింది. ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు అందరూ.

* * *

ఫ్లైట్‌ దిగి ఇల్లు చేరేసరికి రాత్రి పదిగంటలయింది. కారు దిగగానే పరుగులాంటి నడకతో ఇంట్లోకెళ్ళింది వైదేహి.

‘‘అయ్యగారేం చేస్తున్నారు’’ తలుపు తీసిన పార్వతిని అడిగిన మొదటి ప్రశ్న.

‘‘గదిలో...’’ పార్వతి మాట పూర్తికాకుండానే రామ్మూర్తి గదివైపు వెళ్ళిపోయింది.

‘‘వదినా, ఒక్క నిమిషం’’ శశి వెనుకనుండి పిలుస్తున్నా వినిపించుకోలేదు.

‘‘ఏమయిందత్తా, ఎందుకలా టెన్షన్‌గా ఉన్నావ్‌?’’ లోపలికొస్తున్న కీర్తన అడిగింది.

‘‘రెండురోజుల నుంచీ మీ నాన్న ఎవరినీ తన దగ్గరికి రానివ్వటం లేదు కీర్తనా. ఎవరిని చూసినా భయపడి వణికిపోతున్నాడు. బలవంతంగా ఫుడ్‌పైప్‌తో నిన్న ఫుడ్‌ ఎక్కించాల్సి వచ్చింది. ఇవాళ అది కూడా చేయనివ్వలేదు. వదిన వెళ్ళాక మొదట బాగానే ఉన్నాడు. కాస్త పార్వతినీ, నన్నూ గుర్తుపట్టినట్టే ఉన్నాడు. ఈ రెండురోజుల నుంచీ మరీ దారుణంగా ఉన్నాడు. నిద్ర కూడా పోవడంలేదు. ఎవరినీ దగ్గరికి రానివ్వడం లేదు. ఇప్పుడు వదినని దగ్గరకు రానివ్వకపోతే తను తట్టుకోలేదు’’ శశి మాటలు వింటూ అందరూ రామ్మూర్తి గదివైపు పరిగెట్టారు.

ఈ పదిరోజుల్లో సగం చిక్కిపోయి చిన్నపిల్లాడిలా ముడుచుకు పడుకున్న భర్తని చూసిన వైదేహి గుండె నీరైపోయింది.

‘‘ఏమయింది, అయ్యగారు అలా అయిపోయారు?’’

‘‘ఏం చెప్పేదమ్మా, అసలు అన్నం తినటంలేదు, నిద్రపోవటం లేదు’’ చెప్తున్న పార్వతి మాటలు మధ్యలో ఆపి-‘‘వెళ్ళి భోజనం తీసుకురా’’ అంది వైదేహి.

తల్లినుండి వేరయి వణుకుతున్న పసిపిల్లాడిలా ఉన్న రామ్మూర్తి భుజంమీద చేయి వేసింది. కళ్ళు తెరిచిన రామ్మూర్తి కళ్ళల్లో ఒక్కసారిగా వెలుగొచ్చింది. ఒక్క ఉదుటున లేచి వైదేహిని కౌగిలించుకున్నాడు. ఆ ఒక్క కౌగిలింత వైదేహికి ఎన్నో విషయాలు తెలిపింది. తనెవరో గుర్తుపట్టకపోయినా, నోటితో చెప్పకపోయినా తను కనపడకపోతే భర్త ఎంత అల్లాడిపోయాడో అర్థమయింది. తనని చూడగానే కనిపించిన వెలుగు తను అతనికి ఎంత ముఖ్యమో తెలియజేసింది. తనని భార్యే అనుకున్నాడో, తల్లే అనుకున్నాడో తెలీదుకానీ తను అతనికి ఎంత అవసరమో తెలిసింది.

‘‘రండి, భోజనం పెడతాను’’ కూర్చోబెట్టి భోజనం తినిపించింది. ఏం మాట్లాడకుండా చకచకా భోజనం చేస్తున్న రామ్మూర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

‘‘పడుకోండి, చాలా రాత్రయింది’’ మంత్రముగ్ధుడిలా పడుకున్నాడు. జోకొడుతూ నిద్రపుచ్చుతోంది. అయిదు నిమిషాల్లో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు రామ్మూర్తి.

అక్కడే నిలబడి చూస్తున్న శశి, పిల్లలకేసి చూసి నవ్వింది వైదేహి.

‘‘ఈ నాలుగురోజుల నుంచీ మీకేం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థంకాక మాట్లాడలేదు. మీ నాన్నకి ఇంకా మంచి వైద్యం, మంచి పర్యవేక్షణ దొరుకుతుందేమో అక్కడ- అనే ఆలోచన కూడా ఒక కారణం. మీరంతా అన్నట్టు నేనున్నా, లేకపోయినా ఆయనకి తేడా ఏమీ ఉండదా... ఈ ఆలోచనలన్నీ తలలో తిరుగుతున్నాయి. కానీ ఇప్పుడు నేను కనిపించగానే ఆయన కళ్ళల్లో కనిపించిన ఆ మెరుపు చాలు. నా ప్రశ్నలన్నింటికీ అదే సమాధానం. ఆయన మెదడు నన్ను మర్చిపోయిందేమో కానీ, మనసు మర్చిపోలేదు. అది జరగదు కూడా. నేను తనలో సగం అని ఎప్పుడూ అనేవారు. ఆ సగం లేకపోతే మనసు గుర్తించదా.’’

‘‘మరి అమ్మా... నీ సంగతి కూడా’’ కార్తీక్‌ మాటలు మధ్యలోనే ఆపింది వైదేహి.

‘‘ఇక నాకేం ఫర్లేదు కార్తీక్‌. మీ నాన్నకి నేను ఎంత అవసరమో తెలిశాక, నా ఆరోగ్యం నేను జాగ్రత్తగా కాపాడుకుంటా. ఇన్నాళ్ళూ ఆయన ఉన్నారనే ధైర్యంతో నేను ముందుకు నడిచా. ఇకనుండీ నేనున్నాననే ధైర్యం ఆయనకి ఇస్తాను’’ వైదేహి కళ్ళల్లో మళ్ళీ ధైర్యం కనిపించింది అందరికీ.

ఇంతలో నిద్రలో ఉలిక్కిపడి లేచాడు రామ్మూర్తి. కంగారుగా అటూ ఇటూ చూస్తున్న భర్తకి ‘‘పడుకోండి, నేను పక్కనే ఉన్నాను... భయంలేదు’’ చెప్పింది వైదేహి.

ఆ మాటలకి తలూపి ఆమె చెయ్యి పట్టుకుని చిన్నపిల్లాడిలా నిశ్చింతగా నిద్రపోయాడు రామ్మూర్తి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.