close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కుంకుమ బొట్టు... ఇదీ గుట్టు!

కుంకుమ బొట్టు... ఇదీ గుట్టు!

స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటే, గుడికి వెళ్లినప్పుడూ పూజలు చేసినప్పుడూ ఆడామగా తేడా లేకుండా అందరూ కుంకుమబొట్టు పెట్టుకోవడం ఓ సంప్రదాయం. సంక్రాంతి ముగ్గులోనూ గొబ్బెమ్మలపైనా కుంకుమ చల్లడం కూడా ఆచారంలో భాగమే. ఇక, అమ్మవారి గుడుల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి. మన సంస్కృతీసంప్రదాయాలతో ఇంతగా పెనవేసుకుపోయిన కుంకుమ గురించి కొన్ని సంగతులు...

షోడశ సింగారాల్లో నుదుట కుంకుమను దిద్దుకోవడం ప్రధానమైనది. ఇటీవల దాని స్థానంలో బిందీలూ తిలకాలూ వచ్చినప్పటికీ పాపిట్లో సిందూరం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కుంకుమ ధారణ హైందవ సంప్రదాయం. పెళ్లికో పేరంటానికో కుంకుమబొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఇంకా చెప్పాలంటే పసుపూకుంకుమలు లేకుండా ఏ పూజా ముగియదంటే అతిశయోక్తికాదు. కుంకుమను అనేక పద్ధతుల్లో తయారుచేస్తుంటారు. సంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడువాసనల్ని హరిస్తుంది. దీనివల్ల ఎలాంటి చర్మసమస్యలూ ఉండవు. కానీ కృత్రిమరంగులూ రాతిపొడులూ కలిపిచేసే వాటివల్ల అలర్జీలు వస్తుంటాయి.

పసుపు-కుంకుమ!
గడపకు పసుపురాసి కుంకుమబొట్లు పెడితే శుభప్రదమనీ లక్ష్మీదేవి వస్తుందనీ విశ్వసిస్తారు. పెళ్లికి ముందు తీసుకునే నిశ్చయతాంబూలాల్ని కూడా పసుపూకుంకుమా పెట్టుకోవడంగా చెబుతారు. పెళ్లయిన స్త్రీలు పసుపుని తాళిబొట్టుకి అద్దుకుని, కుంకుమను ముఖాన దిద్దుతారు. జంటకవుల్లా ఈ రెండూ ఎప్పుడూ ఎందుకు కలిసే ఉంటాయి అని ఆలోచిస్తే అందులోనే సమాధానం దొరుకుతుంది. అంతెందుకు... మెహందీ కోనుల్లేని రోజుల్లో పెళ్లిలో వధూవరులకు పసుపుపారాణినే పెట్టేవారు. పసుపులో కాస్త సున్నం కలిపితే ఎరుపురంగులోని పారాణి తయారవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ, కుంకుమ కూడా పసుపు నుంచే తయారవుతుందన్నది మాత్రం చాలామందికి తెలియదు. సూటిగా చెప్పాలంటే, కుంకుమ అనేది ఎరుపురంగులోని పసుపు మాత్రమే. పసుపుకొమ్ముల్ని దంచి పొడిచేసి అందులో నిమ్మరసం, సున్నపునీరు(కాల్షియం హైడ్రాక్సైడ్‌)లేదా కర్పూరం విభిన్న పాళ్లలో చేర్చి మనకు కావలసిన కుంకుమవర్ణం వచ్చేలా కలుపుతారు. దాన్ని ఆరబెట్టి ప్యాక్‌ చేస్తారు. అందుకే కుంకుమ పసుపుతో చేసిందో కాదో తెలుసుకోవడానికి దాన్ని నలిపినప్పుడు అందులో పసుపురేణువులు కనిపిస్తూనే ఉంటాయి. లేదా కుంకుమని ఏదైనా తడి బట్టమీద అద్ది తుడిచినప్పుడు అడుగున పసుపురంగు కనిపిస్తుంటుంది. అదే కృత్రిమ రంగులతో తయారైనది అయితే అదే రంగులో ఉంటుంది.

* ఉత్తరాదిన కొన్నిచోట్ల అచ్చంగా కాశ్మీర్‌లో పండే కుంకుమపువ్వుతో కూడా కుంకుమ తయారుచేస్తారు. కానీ అది బాగా ఖరీదు కావడంతో ఆ పద్ధతిలో తయారయ్యే కుంకుమ శాతం చాలా తక్కువే. పైగా అది కాస్త నారింజపసుపు రంగులో ఉంటుంది.

* విభిన్న రంగుల్లో కుంకుమని తయారుచేసే మరో పద్ధతీ వాడుకలో ఉంది. ముడిబుడమ బియ్యాన్నీ, పొట్టు తీసిన మినుములూ పెసల్లాంటి పప్పుల్నీ నానబెట్టి రుబ్బుతారు. ఆ పిండిని సహజ రంగుల్లో ఉడికించి, ఆరబెట్టి మళ్లీ పొడిలా దంచి, జల్లించి కుంకుమ తయారుచేస్తుంటారు. ఇది కూడా మంచిదే. లిప్‌స్టిక్‌ మొక్కగా పిలిచే అఖియోటె అనే మొక్క గింజల నుంచి తీసిన రంగుని కూడా కుంకుమ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇటీవల కొందరు సహజరంగులు కాకుండా కృత్రిమ రంగుల్నీ చొప్పిస్తున్నారు.

* ఓ ప్రత్యేకమైన లేత ఎరుపురంగు పాలరాయిని పొడిచేసి దానిమీద పసుపు చల్లి కొద్దిగా నూనె చిలకరించి కదపకుండా కొన్నిరోజులు ఉంచేవారట. అప్పుడది ఎర్రగా మారేదనీ అదే పూర్వకాలపు కుంకుమనీ జాతీయ వృక్ష శాస్త్ర సంస్థ పరిశోధనలో తేలింది.

అయితే ప్రస్తుతం ఈ సంప్రదాయ పద్ధతులన్నీ మాని, అచ్చంగా సిన్నాబార్‌(మెర్క్యురీ సల్ఫైడ్‌) అనే రాతి పొడితో కుంకుమ చేస్తున్నారు. ఈ రసాయనం చాలా హానికరం. దీన్ని గనుల్లోంచి తవ్వి తీసే కూలీలు మూడు సంవత్సరాలకు మించి జీవించేవారు కాదట. అలాగే విషపూరితమైన లెడ్‌ టెట్రాక్సైడ్‌, జింక్‌లతో కూడా కుంకుమ తయారుచేస్తున్నారు. వీటివల్ల చర్మ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అందుకే కుంకుమ కొనేటప్పుడు లేబుల్‌మీద అందులో కలిపిన పదార్థాల వివరాలు లేకపోతే దాన్ని తప్పక అనుమానించాల్సిందే. వీలైతే ఎవరికి వాళ్లు కుంకుమను తయారుచేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. నకిలీ కుంకుమలతో మాత్రం తస్మాత్‌ జాగ్రత్త!

ద్రవరూపంలోనూ...

సిందూరంగా పిలిచే నారింజవర్ణంలోని కుంకుమను మాత్రమే పూర్వకాలంలో ధరించేవారు. కానీ ఇప్పుడు ఎరుపూ మెరూన్‌... ఇలా రకరకాల ఛాయల్లో కుంకుమను ధరిస్తున్నారు. పైగా కుంకుమ ద్రవరూపంలోనూ వస్తోంది. దాంతో కుంకుమను ఇటీవల స్థానికంగానే కాకుండా కొన్ని ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలూ తయారుచేస్తున్నాయి. లాక్మె జ్యూయెల్‌ సిందూర్‌ పేరుతో వచ్చే ఈ రకంలో ఎరుపూ మెరూన్‌ రంగులు దొరుకుతుంటే; లవ్‌ డ్రాప్‌, రోజీ బ్లష్‌ అనే రెండు రంగుల్ని సహజమూలికలతో తీసుకొచ్చింది లోటస్‌ హెర్బల్‌ డివైన్‌ డ్యూ సిందూర్‌ కంపెనీ. అలాగే కలరెస్సెన్స్‌ ఆక్వా సిందూర్‌, జోవీస్‌ హెర్బల్‌, షెహనాజ్‌ హుస్సేన్‌ హెర్బల్‌ సిందూర్‌లూ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

కుంకుమ ప్రాశస్త్యం!

మానవశరీరంలో ఏడు చక్రాలు ఉంటాయట. అందులో ఆరో చక్రమే మూడోకన్ను... అంటే కనుబొమల మధ్య ఉన్న నుదురుభాగం. శరీరంలోకెల్లా ప్రధాన నాడీకేంద్రమైన ఈ బిందువు శక్తినీ ఏకాగ్రతనీ పెంచడంతోబాటు దుష్టశక్తుల్ని దూరంగా ఉంచుతుందట. అందుకే అక్కడ కుంకుమ దిద్దితే అది నాడుల్ని ప్రేరేపిస్తుందని చెబుతారు. పాపిట సిందూరం ధరించడం కూడా అలాంటిదే. దాన్ని బ్రహ్మరంధ్రంగానూ ఆధ్యాత్మిక కేంద్రంగానూ చెబుతారు.

* సౌందర్యలహరిలో సిందూరం ప్రాశస్త్యం గురించి ఆదిశంకరాచార్య ఎంతో గొప్పగా వర్ణించారు. 19వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌లోని షరాఫుద్దీన్‌ మనేరి అనే సూఫీ గురువు ముస్లిం స్త్రీలను కుంకుమ పెట్టుకోమని బోధించాడట. కానీ అది అనేక వివాదాలకు దారితీసింది.

* ఉత్తరాదిన జరిగే దుర్గాపూజ ఉత్సవాల్లో చివరిరోజున చెడుని తరిమేసిన శక్తికి సంకేతంగా స్త్రీలు కుంకుమను నుదుటే కాకుండా బుగ్గలమీదా పులుముకుంటారు.

* పూర్వకాలం నుంచీ కుంకుమార్చన చేసే గుడుల్లో ప్రధానమైనవి తిరుచానూరు పద్మావతీదేవి, కాంచీపురంలోని శ్రీకామాక్షి, కోల్‌కతాలోని శ్రీమహాకాళీ, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయాలు. అత్యంత ఖరీదైన కుంకుమపువ్వుతో శ్రీమాత వైష్ణోదేవి ఆలయంలో అర్చన చేస్తుంటారు. మదురైలోని మీనాక్షి అమ్మన్‌ దేవతకు అలంకరించిన మొగలిపూలనూ కుంకుమనీ ప్రసాదంగా అందిస్తారు.

* హనుమాన్‌ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజవర్ణంలోని సిందూరంలో కనిపిస్తాయి. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సిందూరం దిద్దుకుంటుంటే అది ఎందుకని అడిగిన హనుమతో ‘రాముడి ఆయుష్షుకోసం’ అని చెప్పిందట సీతమ్మ. వెంటనే రామభక్తుడైన హనుమ జానకిరాముడి దీర్ఘాయుష్షుకోసం ఒళ్లంతా సిందూరాన్ని పులుముకున్నాడట. ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం.

* నేపాలీయుల కొత్త సంవత్సరం రోజున కుంకుమ జాతర నిర్వహిస్తారు. అందులో హోలీ పండగలో మాదిరిగా కుంకుమనే ఒళ్లంతా పూసుకుంటూ చల్లుకుంటుంటారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.