close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
స్థితప్రజ్ఞత

స్థితప్రజ్ఞత
- ఇంద్రగంటి నరసింహమూర్తి

పూజ పూర్తిచేసి ఎడంచేత్తో గంట వాయిస్తూ కుడిచేత్తో హారతిపళ్ళెం పట్టుకుని పరమశివునికి హారతి ఇస్తోంది సుభద్ర.

ఆ శబ్దానికి మేల్కొన్నాడు శశికాంత్‌. పక్కనే పడుకున్న అర్ధాంగి కాళింది కళ్ళు తెరిచింది.

‘‘అబ్బ, తెల్లారకముందే ఏమిటీ గోల. మీ అమ్మగారిని కాస్త పొద్దెక్కాక పూజలు చేసుకోమను’’ విసుక్కున్నాడు శశికాంత్‌ దుప్పటి ముసుగు పెడుతూ.

‘‘తెల్లవారుజామునే పూజ చేసుకోవడం అమ్మ అలవాటు. మనకోసం తన అలవాట్లను మార్చుకోమంటారా ఏమిటి? దైవాన్ని పూజిస్తుంటే గోల అంటే కళ్ళు పోతాయ్‌’’ అంటూ మంగళసూత్రాలు తీసి కళ్ళకద్దుకుంది కాళింది.

‘అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటాడు. పెళ్ళాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. అత్తమామలంటే మాత్రం చిరాకుపడతాడు. ఏం మనిషో’ అనుకుంటూ మెల్లగా మంచం దిగింది... నెలలు నిండిన గర్భవతి కాళింది.

* * *

శశికాంత్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ఓ ఆదివారం స్నేహితుడు రమేష్‌ ఇంటికి వెళ్ళాడు శశికాంత్‌. అక్కడ పరిచయమైంది కాళింది. ‘నా కజిన్‌’ అంటూ పరిచయం చేశాడు రమేష్‌.

కళకళలాడే ముఖం... బంగారు వన్నె... అందాలభామను చూస్తూ చూపు తిప్పుకోలేకపోయాడు శశికాంత్‌. ఒక్కక్షణం మనసు చలించింది. మరుక్షణం ప్రేమ పుట్టింది.

ఇంటికి వచ్చినా కాళిందిని మరచిపోలేకపోయాడు. రమేష్‌కు ఫోన్‌ చేసి కాళిందితో ప్రేమలో పడినట్లు తెలియజేశాడు. ‘మా ఇద్దరినీ నువ్వే కలపాలి’ అనడిగాడు.

‘నీలాంటి బుద్ధిమంతుడు మా చెల్లిని ఇష్టపడుతుంటే కాదంటానా’ అంటూ, నాలుగు రోజుల తరవాత శశికాంత్‌, కాళింది కలుసుకోవడానికీ మనసు విప్పి మాట్లాడుకోవడానికీ అవకాశం కల్పించాడు రమేష్‌.

శశికాంత్‌ తండ్రి సుందరరావు బిజినెస్‌ చేస్తాడనీ నిజాంపేటలో నివాసమనీ శశికాంత్‌ తమ్ముడు బీటెక్‌ చదువుతున్నాడనీ కాళింది తెలుసుకుంది.

కాళింది సొంత వూరు అమలాపురం దగ్గర అల్లవరమనీ, ఆమె తండ్రి జోగారావు వ్యవసాయదారుడనీ, కాళింది అన్నయ్యకు వివాహమై ఇద్దరు పిల్లలనీ, అతనూ తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటాడనీ శశికాంత్‌ తెలుసుకున్నాడు.

ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులు అంగీకరిస్తే పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

కాళింది ద్వారా పెళ్ళికొడుకు వివరాలు తెలుసుకున్న ఆమె తండ్రి జోగారావు, తల్లి సుభద్రలు హైదరాబాదు వచ్చి శశికాంత్‌ తల్లిదండ్రులతో మాట్లాడారు. హైదరాబాదులోనో, రాజమండ్రిలోనో హోటల్లో ఘనంగా పెళ్ళి చేయమన్నాడు సుందరరావు. జోగారావు అందుకు ఒప్పుకోలేదు. తమ వూళ్ళొనే పెళ్ళి చేయడం తన అభిమతమని తెలియజేశాడు. పల్లెటూరులో పెళ్ళి శశికాంత్‌కూ ఇష్టం లేకపోయినా, ఆ కారణంగా కాళిందిని వదులుకోలేక జోగారావు అభిమతానికి అంగీకరించక తప్పలేదు.

ఇరుపక్షాలూ మాట్లాడుకుని ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు.

హంగూ ఆర్భాటం లేకుండా ఇంటిముందు వేసిన తాటాకు పందిరిలో శాస్త్రోక్తంగా శశికాంత్‌, కాళిందిల వివాహం జరిగింది. ఎదురింటి

సుబ్బరాజుగారింట్లో మగ పెళ్ళివారికి విడిది ఏర్పాటు చేశారు. ఏసీ లేదని మగపెళ్ళివారు కాస్త అసంతృప్తి ప్రకటించారు. ఏసీ ఫంక్షన్‌ హాల్లో తన పెళ్ళి ఘనంగా జరగలేదనీ అందుకు అత్తమామలే కారణమనీ శశికాంత్‌కు అత్తమామలంటే అయిష్టం ఏర్పడింది.

అత్తమామలు పల్లెటూరు మనుషులన్న చులకన భావం శశికాంత్‌కి. రిసెప్షన్‌ టైములో అది మరింత బలపడింది.

వివాహ వేడుకలయిన రెండు రోజుల తరవాత హైదరాబాదులోని ఏసీ ఫంక్షన్‌ హాల్లో ఆర్భాటంగా మగపెళ్ళివారి రిసెప్షన్‌ ఏర్పాటు

చేయబడింది.వరుడి తరఫు మగవారు ఖరీదైన సూట్లలో కళకళలాడుతున్న వేళా, స్త్రీలు తళతళ మెరిసే పట్టుచీరల రెపరెపలలో, మిలమిల మెరిసే బంగారు నగలతో శోభిస్తున్న సమయాన... పంచెకట్టు, తెల్లని ఖద్దరు చొక్కా, భుజంపై కండువాతో మావగారూ, జరీ చీరలో, మెడలో మంగళసూత్రం, నల్లపూసలు తప్ప మరో ఆభరణం ధరించని అత్తగారూ వెలవెలబోతున్నట్లు అనిపించారు శశికాంత్‌కు. ఖరీదైన సూట్‌లో మెరిసిపోతున్న శశికాంత్‌, తన అత్తమామలను చూసి అవమానంగా ఫీలయ్యాడు.

వియ్యంకుడిని తోటి వ్యాపారస్తులకు పరిచయం చేయడానికి వెనుకంజ వేశాడు సుందరరావు.‘‘మీ అమ్మనీ, నాన్నగారినీ డ్రెస్‌ మార్చుకురమ్మను’’ కోపంగా చెప్పాడు కాళిందికి.

డ్రెస్‌కోడ్‌ తెలియని పల్లెటూరు మనుషులంటూ వారిని ఈసడించుకున్నాడు.

‘‘మా నాన్నగారెప్పుడూ పంచెకట్టే... వాళ్ళు అలాగే ఉంటారు’’ జవాబిచ్చింది కాళింది.

అక్కడ పరిస్థితిని గమనించి ‘అనువుగానిచోట’ అనుకుని పక్కకి తప్పుకున్నారు జోగారావు, సుభద్రలు.

వేదిక మీద కొత్త దంపతుల పక్కన నిలుచున్నారు శశికాంత్‌ తల్లిదండ్రులు.

‘అమ్మానాన్నలు కూడా పక్కన నుంచుంటే బాగుండు’ననుకున్న కాళిందికి నిరాశ ఎదురైంది.

అత్తమామలు ఎక్కడ వేదికనెక్కుతారో అని భయపడిన శశికాంత్‌ వాళ్ళు కనపడకపోవడంతో వూపిరి పీల్చుకున్నాడు.

అప్పట్నుంచీ సమయం వచ్చినప్పుడల్లా అత్తమామలను కామెంట్‌ చేయడం మానలేదు శశికాంత్‌.

* * *

పెళ్ళయిన నాలుగేళ్ళకు కాళింది నెల తప్పింది. ‘మూడోనెల’ అని డాక్టర్‌ నిర్ధారించినప్పటి నుండీ అర్ధాంగిని అపురూపంగా చూసుకోసాగాడు శశికాంత్‌. ఏడోనెల రాగానే ఉద్యోగానికి రాజీనామా చేసింది కాళింది. సారె తెచ్చిన కాళింది తల్లిదండ్రులు- కూతురిని పుట్టింటికి తీసుకెళ్ళి పురుడు పోసి పంపించడం ఆచారమంటూ అమ్మాయిని తమతో పంపించమని అల్లుడిని కోరారు.

‘‘అమ్మో, ఆ పల్లెటూరా... కాళిందిని పంపే ప్రసక్తేలేదు. ఇక్కడే పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రిలో నెలనెలా చెకప్‌ చేయిస్తున్నాను. ఆ ఆసుపత్రిలో ఆధునిక సదుపాయాలుంటాయి. స్పెషలైజ్డ్‌ డాక్టర్లుంటారు. కాళింది ఇక్కడే పురుడు పోసుకుంటుంది’’ గట్టిగా చెప్పాడు శశికాంత్‌.

కాళింది కూడా కార్పొరేట్‌ ఆసుపత్రి అయితే సౌకర్యంగా ఉంటుందనుకుంది. చేసేదేంలేక జోగారావు, సుభద్రలు తిరుగు ప్రయాణమయ్యారు.

* * *

ఆరోజు కాళిందిని టెస్ట్‌ చేసిన గైనకాలజిస్టు మరో వారం పదిరోజుల్లో పురుడు రావచ్చనీ, సిజేరియన్‌ తప్పదనీ, తల్లీ బిడ్డ క్షేమంగా ఉండటానికి ఆపరేషన్‌ అవసరమనీ చెప్పి, కాళిందిని ఆపరేషన్‌కు మానసికంగా సిద్ధంచేసింది.

‘‘పురిటి సమయంలో మా అమ్మ నా దగ్గరుండాలి. తనుంటేనే నాకు ధైర్యం’’ కోరింది కాళింది.

‘‘మా అమ్మా నాన్నా ఉన్నారు, డాక్టర్లున్నారు. మీ అమ్మ ఎందుకు?’’ విసుక్కున్నాడు శశికాంత్‌.

కాళింది తన పట్టువీడలేదు.

శశికాంత్‌ మరేం మాట్లాడలేకపోయాడు. తల్లికి ఫోన్‌ చేసింది కాళింది. వెంటనే వచ్చింది సుభద్ర. వస్తూనే వంటింటి ఛార్జ్‌ తీసుకుంది. ఇంట్లోనే ఉన్న అత్తగారిని పట్టించుకోనట్టు మసలుతున్నాడు శశికాంత్‌.

* * *

బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, కుర్చీలో కూర్చుని, పేపరు తీసింది కాళింది. మావగారు బైటకు వెళ్ళారు. అత్తగారు టీవీ ముందు సెటిలయ్యారు. హార్లిక్స్‌ కలిపి తెచ్చి కాళిందికి అందించింది సుభద్ర. ఇంటిపనంతా ఒంటిచేత్తో చేస్తున్న తల్లిని అలా చూస్తూ ఉండిపోయింది కాళింది.

‘‘ఏమిటే, అలా చూస్తున్నావు. ఏదో వింతమనిషిని చూసినట్టు’’ అంటూ, ‘‘రెస్ట్‌ తీసుకో, ఎక్కువ ఆలోచించకు’’ సలహా ఇచ్చి వంటింట్లోకి వెళ్ళింది సుభద్ర.

తల్లివైపే చూస్తున్న కాళిందికి తల్లిని భర్త ‘క్వాక్‌’ అనడం గుర్తొచ్చింది.

* * *

పెళ్ళయిన మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగకు అల్లుడినీ కూతురినీ ఆహ్వానించాడు జోగారావు.

పల్లెటూరు రానని మొండికేసిన శశికాంత్‌ను బతిమాలి ఒప్పించింది కాళింది.

అత్తగారింట్లో అంటీముట్టనట్టున్నాడు అల్లుడు.

సంక్రాంతినాడు ఉదయం ఇంటిముందు ముగ్గులు పెడుతున్న అర్ధాంగిని చూస్తూ వరండాలో కూర్చున్నాడు శశికాంత్‌.

ఒక పెద్దావిడ పదేళ్ళ అమ్మాయితో వచ్చింది.

లోపలి నుండి వచ్చిన సుభద్ర ఆ అమ్మాయి చేయి పట్టుకుని నాడి చూసి, కళ్ళను పరిశీలించి పెరట్లోకి వెళ్ళి కొన్ని ఆకులు తెచ్చి, శుభ్రంగా కడిగి రసం తీసి, పెరుగు కలిపి తెచ్చి ఆ అమ్మాయిచేత తాగించింది.

‘‘మరో మూడు రోజులు మందు తీసుకుంటే తగ్గిపోతుంది’’ అని చెప్పింది.

వచ్చిన ఇద్దరూ సుభద్రకు నమస్కరించి వెళ్ళిపోయారు.

ముగ్గు పూర్తిచేసి వచ్చిన అర్ధాంగి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శశికాంత్‌.

‘‘ఆ అమ్మాయికి జాండిస్‌. మా అమ్మ పసరు వైద్యం చేస్తుంది. మా పెరట్లో చాలా మొక్కలు పెంచుతుంది. ఆ మొక్కల లక్షణాలూ ఉపయోగాలూ మా అమ్మకి తెలుసు. వాళ్ళ తాతగారు ఆయుర్వేద వైద్యులు. ఆయన దగ్గర అమ్మ వైద్యం నేర్చుకుంది. వైద్యానికి సంబంధించిన పుస్తకాలు చదివింది కూడా. లక్షణాలనుబట్టి రోగ నిర్ధారణ చేయగల నేర్పు అమ్మకుంది’’ వివరించింది కాళింది.

‘‘ఇప్పుడైతే అందరూ అమలాపురం, రాజమండ్రి వెళుతున్నారు కానీ, వైద్య సదుపాయాలు అందుబాటులోలేని ఆ రోజుల్లో... అంటే సుమారు ఇరవై, పాతికేళ్ళ క్రితం మా సుభద్ర ఈ చుట్టుపక్కల వూళ్ళలో గర్భిణీలకు పురుడు పోసేది. మంత్రసాని పనిచేసేది. అత్యవసర సమయాల్లో ఇప్పటికీ మా సుభద్రనే పిలుస్తారు’’ చెప్పాడు అక్కడేవున్న జోగారావు.

‘‘అబ్బో... అయితే అత్తయ్యగారికి సంపాదన బాగానే ఉంటుందన్నమాట’’ నవ్వాడు శశికాంత్‌.

‘‘లేదల్లుడూ... ఆమెదంతా ఉచిత వైద్యమే. నలుగురికీ చేతనైన సహాయం చేయడమే ఆమె తత్వం’’ భార్యని ప్రశంసించాడు జోగారావు.

‘‘ఇలాంటివాళ్ళను ‘క్వాక్స్‌’ అంటారు. వీళ్ళదంతా మిడిమిడి జ్ఞానం’’ కామెంట్‌ చేశాడు శశికాంత్‌.

జోగారావు మరేం మాట్లాడలేదు.

తల్లిని విమర్శించినందుకు బాధ కలిగినా మౌనంగా ఉండిపోయింది కాళింది.

* * *

ఆ సంఘటన గుర్తుకొచ్చి నిట్టూర్చింది కాళింది.

‘అత్తమామలంటే గిట్టని స్వభావం, ఏం చేస్తాం...’ అనుకుంటూ సర్దుకుపోతోంది కాళింది.

తప్పనిసరైతే తప్ప సంసారంలో కలతలు సృష్టించుకోకూడదన్నదే ఆమె అభిమతం.

* * *

కాసేపు బెడ్‌రూమ్‌లో కునుకు తీసింది కాళింది. మెలకువ రాగానే హాల్లోకి వచ్చి టీవీ ఆన్‌ చేసింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే ఇరవైనాలుగ్గంటల్లో హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెపుతున్న వార్త విని, భర్తకు వెంటనే ఫోన్‌ చేసి ఆ విషయం చెప్పింది.

బిగ్గరగా నవ్వాడు శశికాంత్‌. ‘‘టీవీలో వాన కురుస్తుందని చెప్పారంటే ఎండ కాస్తుందని అర్థం. డోంట్‌ వర్రీ’’ అన్నాడు.

‘‘టీవీలో కాదు వాన, హైదరాబాద్‌లో’’ జోక్‌ చేసింది కాళింది కాల్‌ కట్‌చేస్తూ.

కానీ, శశికాంత్‌ భావించినట్లు ఎండ కాయలేదు. వర్షం మొదలైంది.

మరునాడు శశికాంత్‌ ఆఫీసుకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

* * *

అల్పపీడన ప్రభావంతో... హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఇరవైనాలుగు గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి

జనజీవనం స్తంభించింది.

నిజాంపేటలో శశికాంత్‌ నివాసముంటున్న అపార్ట్‌మెంట్స్‌ సముదాయంలోకి నీళ్ళు ప్రవహించాయి. సెల్లార్‌ నీటితో నిండిపోయింది. కార్లు నీటిలో మునిగిపోయాయి. కరెంట్‌ లేక లిఫ్ట్‌ ఆగిపోయింది. అపార్ట్‌మెంట్స్‌ చుట్టూ భుజంలోతు నీళ్ళు... రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో... కలవరపాటుతో భయంభయంగా రెండోఫ్లోర్‌లోని తమ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలోంచి పరిసరాలు గమనిస్తున్న కాళిందికి బీపీ పెరిగింది. అంతే, నొప్పులు మొదలయ్యాయి. బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి మంచంమీద పడుకుని మూలుగుతోంది. ఆమె పరిస్థితిని గమనించిన శశికాంత్‌కు టెన్షన్‌ పెరిగింది.

ఏం చేయాలి... ప్రస్తుత పరిస్థితిలో కాళిందిని ఆసుపత్రికి తీసుకెళ్ళడమెలా... బయట కాలుపెట్టలేని పరిస్థితి... తల పట్టుకున్నాడు శశికాంత్‌.

ఆసుపత్రికి కాల్‌ చేశాడు. ఆసుపత్రి చుట్టూ నీళ్ళున్నాయనీ, స్టాఫ్‌ చాలామంది రాలేదనీ, అంబులెన్స్‌ పంపడం వీలుపడదనీ డాక్టర్‌ చెతులెత్తేశాడు. శశికాంత్‌కు కాళ్ళూ చేతులు ఆడటంలేదు.

తల్లిదండ్రుల్ని సలహా అడిగాడు శశికాంత్‌.

‘‘ఏ కాస్త నలతగా ఉన్నా డాక్టరు దగ్గరకు పరుగెట్టడమే తెలుసు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. నాకు చాలా భయంగా ఉంది’’ చెప్పాడు సుందరరావు బిత్తరచూపులు చూస్తూ.

పది లక్షల బ్యాంక్‌ బాలెన్సూ... సెల్లార్లో ఏసీ కారూ... రెండు కిలోమీటర్ల దూరంలో ఆధునిక ఆసుపత్రీ... అవసరానికి ఏదీ అక్కరకు రాలేదు’ అనుకుంటూ తల పట్టుకున్నాడు శశికాంత్‌.

‘ప్రపంచమంతా నా గుప్పెట్లో- అని విర్రవీగే మనిషి, ప్రకృతి కోపిస్తే చిత్తయిపోక తప్పదు’ అనుకుంటూ బీపీ మాత్ర మింగి దిగులుగా కూర్చున్నాడు సుందరరావు. భగవంతుణ్ణి ప్రార్థించసాగింది శశికాంత్‌ తల్లి.

నొప్పులు భరించలేక అర్ధాంగి పెడుతున్న కేకలకు శశికాంత్‌ కళ్ళంట నీళ్ళు... ముగ్గురూ తత్తరపడుతున్న సమయాన... ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, పూజగదిలో అమ్మవారి ముందు ఒక్క క్షణం చేతులు జోడించి... వేడిపాలు పోసిన ఫ్లాస్కు పట్టుకుని, అల్లుడికి ధైర్యంచెప్పి బెడ్‌రూమ్‌లో అడుగుపెట్టి తలుపు మూసింది సుభద్ర.

తల్లిని చూసి బావురుమంది కాళింది.

‘‘భయపడకు తల్లీ... మరి కాసేపట్లో పండంటి బిడ్డను చూసుకుంటావు. పురిటి నొప్పులకు కన్నీళ్ళు పెట్టకూడదమ్మా. పుట్టబోయే బిడ్డను వూహించుకో... మనసు ప్రశాంతంగా ఉంచుకో... భగవంతుణ్ణి స్మరించు. కాస్త ఓర్చుకో’’ అనునయిస్తూ కాళింది చేత రెండు మాత్రలు మింగించింది సుభద్ర.

కాళిందికి సూచనలిస్తూ సుఖప్రసవానికి సమాయత్తం చేసింది.

* * *

కాన్పు కష్టమనీ, ఆపరేషన్‌ అవసరమనీ కార్పొరేట్‌ డాక్టర్లు చెప్పిన విషయం మననం చేసుకుంటూ ‘అత్తగారేం చేయగలదా’ అని భయపడుతూంటే... ఉత్కంఠతో నిమిషమొక యుగంలా నడుస్తోంది శశికాంత్‌కు.

అరగంట గడిచింది.

కేర్‌కేర్‌మంటూ పసిబిడ్డ ఏడుపు వినిపించింది.

బొడ్డుకోసి, బిడ్డను తల్లినుండి వేరుచేసి, తలుపు తీసి ‘మగపిల్లాడు, తల్లీ బిడ్డా క్షేమం’ అనే శుభవార్తను వినిపించి, బిడ్డకు స్నానం చేయించి, తల్లి పక్కలో

పడుకోబెట్టింది సుభద్ర. బిడ్డ పుట్టిన సమయాన్ని నోట్‌ చేసిన కాగితాన్ని సుందరరావుకి అందించింది.

పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఓ స్పెషలిస్ట్‌ డాక్టరంత నేర్పుగా, వేగంగా పనులు చక్కబెడుతున్న అత్తగారివైపు ఆశ్చర్యంగా చూశాడు అల్లుడు.

సుభద్ర గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాక ముగ్గురూ చేతులూ కాళ్ళూ శుభ్రంగా కడుక్కుని గదిలోకి వెళ్ళారు.

అర్ధాంగిని ఆప్యాయంగా పలకరించాడు శశికాంత్‌. మగబిడ్డని చూసుకుని మురిసిపోయాడు.

మనవడిని చూసుకుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు తాత, మామ్మలు.

గులాబ్‌జామ్‌ కప్పుల్లో తెచ్చి ముగ్గురికీ అందించింది సుభద్ర.

‘‘ఇవెప్పుడు చేశారు?’’ ఆశ్చర్యం ప్రకటించాడు సుందరరావు.

‘‘ఇవాళొ రేపో పురుడు వస్తుందని గ్రహించాను. వాతావరణం గమనిస్తున్నాను. రెండు రోజులుగా ఎడతెగని వాన... ఏ క్షణానైనా అమ్మాయికి నొప్పులు

మొదలు కావచ్చనిపించి అవసరమైతే ఇంట్లోనే పురుడు పోయడానికి అవసరమైన పాతగుడ్డలు, స్పిరిట్‌, బ్లేడ్‌... వగైరా సరంజామాను బెడ్‌రూమ్‌లోని అల్మారాలో సర్దివుంచాను. స్వీట్‌ చేసి ఫ్రిజ్‌లో పెట్టాను. నా దగ్గరున్న పారాసిటమాల్‌, నొప్పుల మాత్రలను ప్రస్తుతానికి వాడాను. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను కనుకే కంగారుపడలేదు. అనుభవం అవసరానికి పనికొచ్చింది. నాలుగు రోజులు పోయాక తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తీసుకెళ్ళి కావలసిన టీకాలు వగైరా వేయించవచ్చు’’ అంటూ వినమ్రంగా చెపుతున్న అత్తగారి వైపు ఆశ్చర్యపోతూ చూశాడు శశికాంత్‌.

అతని కళ్ళమ్మట నీళ్ళు... ఆనందభాష్పాలు... తుడుచుకుంటూ చూస్తే... ఆ క్షణంలో అత్తగారు కామాక్షీదేవిలా కనిపించారు.

వంగి అత్తగారి పాదాలు పట్టుకున్నాడు అల్లుడు. ఆశీర్వదించారు అత్తగారు.

శశికాంత్‌ తల్లి వియ్యపురాలిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలియజేసింది.

‘‘మామయ్యగారికీ శుభవార్త చెపుదాం’’ అంటూ సెల్‌ తీశాడు శశికాంత్‌.

అత్తమామలు గౌరవనీయులని అతనికర్థమైంది. పల్లెటూరు మనుషులన్న చిన్నచూపు మాయమైంది. అది గ్రహించిన కాళిందిలో ఎంతో సంతృప్తి. ఆమె ముఖంలోని ఆనందం ఆ ఇల్లంతా ప్రతిఫలిస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.