close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మాట మారితే... జీవితం మారినట్టే!

మాట మారితే... జీవితం మారినట్టే!

మెదడు ఓపెద్ద పదకోశం. అక్కడ, టన్నులకొద్దీ మాటల మూటలుంటాయి. ప్రతిమూటలో వేలకొద్దీ పదాలుంటాయి. అందులో, తరచూ వాడే మాటలు పైపైనే కనిపిస్తాయి. అరుదుగా ఉపయోగించేవి అడుగుబొడుగున దాగుంటాయి. అస్సలు వాడనివి అంతరించిపోతాయి. ఇటుకల్ని పేర్చి గోడ కట్టినట్టు...ఆ మాటలతోనే ఆలోచనల్ని రూపొందించుకుంటాం, సంభాషణల్ని సిద్ధం చేసుకుంటాం, కాగితం మీద నాలుగుముక్కలు రాయాల్సి వచ్చినప్పుడు కూడా ఆ మూటలోకే తొంగిచూస్తాం. సదరు బస్తాలోని సరుకును బట్టే...నువ్వేం ఆలోచిస్తావో చెప్పవచ్చు, నువ్వేం మాట్లాడతావో వూహించవచ్చు. ఓ భాషలో లక్ష చిన్నాపెద్దా పదాలు ఉన్నాయనుకుంటే...నిత్యజీవితంలో ఉపయోగించేది మాత్రం, అందులోంచి ఏ కొన్ని వేలో. మరీ ధారాళంగా వాడేది ఏ ఐదారొందలో. నోరు తెరవగానే వూతపదాల స్థాయిలో ఉబికివచ్చేవి - పాతిక నుంచి యాభై మాత్రమే! వీటి మీద దృష్టిపెట్టినా చాలు - మనల్ని మనం కొత్తగా తీర్చిదిద్దుకోవచ్చు.

పెట్టనికోటే..
మాటల్ని తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. మాటంటే మీ వాంగ్మూలం, మీ మనసుకు అద్దం. గొంతులోంచి పొంగుకొచ్చే ప్రతి మాటా...మొత్తంగా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నిరాశావాదాన్ని మోసుకొచ్చే మాట మాట్లాడిన ప్రతిసారీ శరీరం కించిత్‌ కుంచించుకుపోతుంది. భృకుటి కాస్త ముడిపడుతుంది. కళ్లు కాసేపు శూన్యంలోకి చూస్తాయి. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది. మెదడు మరింత బేజారైపోతుంది. నిశ్శబ్ద విషాద సంగీతమేదో మన చెవుల్ని తాకుతుంది. అదే, ఆశావాదాన్ని ప్రతిబింబించే మాట నాభిలోంచి పొంగుకొస్తున్నప్పుడైతే...ఛాతీ ఓ రెండంగుళాలు విస్తరిస్తుంది. కళ్లు మెరుస్తాయి. మెదడులో ఉత్సాహ రసాయనాల వూట పెరుగుతుంది. ఒక్క మాటకే అంత శక్తి ఉంటే...రోజూ అప్రయత్నంగా వాడిపడేసే ఏడువేల పదాలు (మహిళలైతే ఇరవైవేల పదాలని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా అంచనా) ఇంకెంత ప్రభావితం చేయాలీ, ఇంకెంత శక్తినివ్వాలీ! అందుకే...నచ్చిన కొలువునో, భావసారూప్యం ఉన్న భాగస్వామినో, మంచి పుస్తకాన్నో, సౌకర్యవంతమైన ఇంటినో ఎంపిక చేసుకున్నంత జాగ్రత్తగా మాటనూ ఎంచుకోవాలి. బుట్టలోంచి పుచ్చొంకాయల్ని ఏరి పారేసినట్టు...వద్దు, కాదు, కుదర్దు, అసాధ్యం వగైరా వగైరా నెగెటివ్‌ పదజాలాన్ని తీసిపడెయ్యాలి. ఇలాంటి చేవచచ్చిన మాటలు తరచూ మన సంభాషణల్లో తారసపడుతున్నాయంటేనే - నిరాశావాదం నిలువునా ముంచేస్తోందని అర్థం. ఆలోచనల నిండా వ్యతిరేక ధోరణే ఉన్నప్పుడు...జీవితంలో సానుకూలతకు చోటెక్కడ ఉంటుంది? దీంతో...ఏ నిర్ణయమూ తీసుకోలేం, ఎవర్నీ నమ్మలేం, ఏ అద్భుతాన్నీ ఆస్వాదించలేం! మంచి-చెడు, ఆశావాదం-నిరాశావాదం, ఆత్మవిశ్వాసం-ఆత్మన్యూనత...ఇలా మనిషిలో రెండు కోణాలూ ఉంటాయి. ఒకదాని మీద మరొకటి పట్టుబిగించే ప్రయత్నం చేస్తుంటాయి. మనలోని నెగెటివ్‌ ధోరణుల మీద యుద్ధం ప్రకటించడానికి పాజిటివ్‌ పదాల్ని ఫిరంగి గుండ్లలా వాడుకోవాలి. సాధిస్తా, గెలుస్తా, నేను చేయగలను, అద్భుతం, ఆనందం...ఇలా నిన్నటిదాకా పెద్దగా ఉపయోగించని పదాల్ని ఇక నుంచీ ధారాళంగా వాడాలి. మెల్లమెల్లగా ఆ మాటలు ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఆచరణని ప్రభావితం చేస్తాయి.

మనతో మనం...
గాఢనిద్రలో మినహాయిస్తే మనతో మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అది ముఖ్యమైన విషయం కావచ్చూ, పరమచెత్త వ్యవహారమూ కావచ్చు. రోజూ మనకు యాభైవేల ఆలోచనలు వస్తాయి. ప్రతి ఆలోచన తర్వాతా ఓ స్వీయ సంభాషణ జరిగితీరుతుంది. అంటే, యాభైవేలసార్లు మనతో మనం మాట్లాడుకుంటాం. అందులో ఎనభైశాతం వరకూ ‘అలా జరిగితే బావుండేదీ’, ‘ఇలా జరిగితే బావుండేదీ’ - తరహా పశ్చాత్తాప వచనాలే. మరొకరితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా...మనలో మనం మాట్లాడుకున్నాకే, బయటి వ్యక్తితో సంభాషిస్తాం. నాటకానికి ముందు రిహార్సలు లాంటిది - స్వీయ సంభాషణ. రిహార్సలు పక్కాగా ఉంటేనే, నాటకమూ రక్తికడుతుంది. మాట మీద పెత్తనం సాధించాలనుకుంటే, ఈ దశలోనే జాగ్రత్త వహించాలి.

దినపత్రిక తిరగేస్తున్నప్పుడు, ఏ విజేత గెలుపు కథనమో కనిపిస్తుంది. సందర్భోచితంగా, తాను అనుభవించిన కష్టాల్నీ ప్రస్తావిస్తాడు కథానాయకుడు. వాటిని చదవగానే, మన జీవితాన్ని అగాథంలోకి తోసేసిన ఓ సంఘటనా కళ్లముందు మెదుల్తుంది. అలా...ఒకదాని వెంట ఒకటి సినిమా రీలులా తిరిగిపోతాయి. ఎన్ని కష్టాల్ని అనుభవించాం, ఎంత వైఫల్యాన్ని మూటగట్టుకున్నాం, ఎంత దుర్భర జీవితం గడిపాం - అంటూ మనతో మనం ఆ ఏడుపుగొట్టు కథంతా చెప్పుకుంటూ వెళ్తాం. ఆ సమయంలో - ఓటమి, దురదృష్టం, కన్నీళ్లు... ఇలా అనేకానేక నెగెటివ్‌ పదాలు ప్రవహిస్తాయి. అతడు వైఫల్యాన్ని అధిగమించిన తీరు మీద మనం దృష్టిపెట్టి ఉంటే ‘సెల్ఫ్‌టాక్‌’ మరోలా ఉండేది. ఇంకోరకమైన పదజాలం మన ఆలోచనల్ని నడిపించేది - ఆశావాదం, పోరాటం, ఆత్మవిశ్వాసం స్వీయసంభాషణలో భాగమయ్యేవి. మనతో మనం ఏం మాట్లాడాలన్నదే కాదు...ఆ సంభాషణలో ఎలాంటి మాటలు వాడాలన్నదీ ముందే నిర్ణయించుకోవాలి.

ఇతరులతో మనం...
జాతీయ రహదారి మీద వాహనం వెళ్తూ ఉంటుంది. హఠాత్తుగా ఏ గేదో అడ్డుగా వస్తుంది. డ్రైవరు చాకచక్యంతో బండిని ఆపేస్తాడు. లేదంటే, ఇంకోవైపు మళ్లిస్తాడు. సంభాషణల విషయంలోనూ అలాంటి నైపుణ్యమే అవసరం. ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. అంతలోనే, మన సంభాషణ పక్కదారి పట్టిందేమో అన్న అనుమానం వస్తుంది. నెగెటివ్‌ పదాలు పొంగిపొర్లుతున్నట్టు అర్థమైపోతుంది. ఇక ఆలస్యం చేయకూడదు. తెలివిగా సంభాషణను దార్లో పెట్టాలి. పాజిటివ్‌ పదజాలంతో అప్పటిదాకా పడిన ‘నెగెటివ్‌’ బీటల్ని పూడ్చేయాలి. మాట్లాడి ఆలోచించడం కాదు, ఆలోచించి మాట్లాడాలి. అప్పుడిక నాలుక కరుచుకోవాల్సిన అవసరం రాదు. ప్రతి భావమూ, ప్రతి వ్యక్తీకరణా మన అనుమతి తర్వాతే...గొంతు దాటాలి! ‘ఎరుక’ అంటే అదే!

 

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ విస్తరించాక...లిఖిత పూర్వక సంభాషణలూ పెరిగిపోయాయి. చాటింగ్‌లూ, వ్యాఖ్యానాలూ, విమర్శలూ, ప్రశంసలూ, తిట్లూ...ఏవైనా కావచ్చు, ఒక్కసారి ‘ఎంటర్‌’ కొట్టామంటే, ఇక వెనక్కి తీసుకోలేం. క్షమాపణలతో సరిపెట్టేలోపు, జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. కార్పొరేట్‌ నియామక సంస్థలు సిబ్బంది ఎంపికకు ముందు, అభ్యర్థుల సోషల్‌ మీడియా సంభాషణల్ని జల్లెడపడుతున్నాయి. ఏ కాస్త ‘నెగెటివ్‌’ పదజాలం కనిపించినా...దరఖాస్తును బుట్టదాఖలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ రుణ సంస్థలు కూడా ఈ దార్లోనే నడుస్తున్నాయి. పదాల మీద పట్టులేనివారికి ఆర్థిక వ్యవహారాల మీదా పట్టు ఉండదన్న అంచనాకు వస్తున్నాయి. మచ్చలేని ఆర్థికచరిత్ర ఉన్నా, ఓపట్టాన రుణం మంజూరు చేయవు.

నెగెటివ్‌ పదజాలం అంటువ్యాధి లాంటిది. భర్త నుంచి భార్యకూ భార్య నుంచి పిల్లలకూ...వ్యాపించేస్తుంది. ‘స్వామీజీ! నా భర్త ఆఫీసు నుంచి రాగానే ఏదో ఓ మాట అంటాడు. నేను కోపంతో ఎదురుతిరుగుతాను. తను ఆవేశంగా రెచ్చిపోతాడు. నేనూ అసహనంగా రంకెలేస్తాను. ఈ గొడవలతో పిల్లలు బెదిరిపోతున్నారు, ఇరుగూపొరుగూ చిన్నచూపు చూస్తున్నారు. మీరే పరిష్కారం చెప్పాలి...’ అంటూ గురూజీ కాళ్ల మీద పడిందో మహిళ. ‘ఓ చెంబునిండా మంత్రజలం ఇస్తాను. మీవారికి కోపం రాగానే నువ్వు ఆ నీటిని నోట్లో పోసేసుకో. అతడికి కోపం తగ్గేదాకా ఉమ్మేయకుండా పుకిలిస్తూ ఉండు. అర్థమైందా?’ అంటూ చేతిలో నీటి పాత్ర పెట్టాడు. అప్పటి నుంచీ వాదప్రతివాదాల్లేవు, మాటల యుద్ధాల్లేవు. కొద్దికాలానికి ఆమె మళ్లీ వచ్చింది. ‘స్వామీజీ! మంత్రజలం నిండుకుంది. ఇంకాస్త ఇస్తారా?’ అని అడిగింది. ‘మంత్రం నీళ్లలో లేదు. మౌనంలో ఉంది’ అని నవ్వుతూ జవాబిచ్చారు గురువుగారు. మాట విలువ తెలిసిందంటే, మౌనం విలువా తెలిసినట్టే. మౌనాన్ని వీడి మాట్లాడుతున్నామంటే..అందుకో ప్రయోజనం ఉండాలి, ఆ మాట ద్వారా ఎంతో కొంత మంచి జరగాలి. ఆ మాట విజయానికో వికాసానికో ఉపయోగపడాలి. ఇవేవీ కాకపోయినా, కనీసం నష్టం ఉండకూడదు. ‘పాజిటివ్‌’ పదాల వాడకంతోనే ఇదంతా సాధ్యం.

* * *

స్వీయసంభాషణల్లో మంచి మాటలే దొర్లేలా జాగ్రత్తపడతాం. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడూ నాలుక దగ్గరపెట్టుకుంటాం. మరి, మన చుట్టూ ఉన్న ప్రపంచం మాటేమిటి? గుట్టలు గుట్టలుగా మన గుమ్మాన్ని తట్టే ఆ ‘నెగెటివ్‌’ పదజాలం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఈ అనగనగా కథ అందుకో చక్కని పరిష్కారాన్ని సూచిస్తోంది...

రెండు దూరదేశపు కప్పలు పొరపాటున బావిలోకి దూకాయి. అయినా, ఆశ వదులుకోకుండా... ఒడ్డుకు ఎగిరే ప్రయత్నం చేయసాగాయి. ‘అయిపోయింది. మీ జీవితం ఇంతటితో పూర్తయిపోయింది. ఇదంతా వృథా ప్రయాసే’ అంటూ ఆ కొత్త కప్పల్ని మిగతా మండూకాలు ఎగతాళి చేయసాగాయి. ఆ నిరుత్సాహపూరిత వాతావరణం ఓ కప్పమీద నిజంగానే పనిచేసింది... ఆ ఒత్తిడి మధ్య ఒడ్డుకు ఎగిరే ప్రయత్నంలో కాలుజారి కిందపడిపోయింది. చివరికి ఓటమిని అంగీకరించేసింది. మరొకటి మాత్రం...ఆ గాయాల్నీ వైఫల్యాల్నీ లెక్కపెట్టకుండా, లక్ష్యాన్ని చేరుకుంది. తోటి కప్పల ఎగతాళిని అస్సలు పట్టించుకోలేదు. కారణం...దానికి చెముడు. చుట్టూరా, నిరాశాపూరిత స్వరాలు వినిపిస్తున్నప్పుడు, మనం కూడా చెవిటి కప్పల్లానే వ్యవహరించాలి.


అవును...

వును...ఈ పని చేస్తాను. అవును... ఈ సవాలు స్వీకరిస్తున్నాను. అవును... ఫలానా బాధ్యత నాదే. అవును...నేనోడిపోయాను - అని స్థిరంగా చెబుతున్నామంటేనే, మార్పును స్వాగతించే ధైర్యం మనకున్నట్టు, జీవితంతో పోరాడే సత్తువ పుష్కలమైనట్టు. ప్రతి సందర్భంలోనూ అవుననాలా, కాదనాలా - అన్న మానసిక తర్జనభర్జన జరుగుతూనే ఉంటుంది. కాదు...అనేసి హాయిగా బాధ్యత నుంచి తప్పించుకోవచ్చు. అవును...అనడం ద్వారా ఇబ్బందులు రావచ్చు. ఒకట్రెండు ఒత్తిడులూ, అవరోధాలూ ఉండవచ్చు. అవునన్నవారిని విజేతగా నిలబెట్టే ప్రక్రియలో అవన్నీ ఉలిదెబ్బలే. అవును - ఓ అవకాశాల సింహ ద్వారం.


బావుంది!

‘నీ నవ్వు బావుంది’, ‘నీ జడలోని పువ్వు బావుంది’, ‘నువ్విచ్చిన జున్నుముక్క బావుంది’, ‘నువ్వేసుకున్న చొక్కా బావుంది’...ఒకటేమిటి, ప్రతి ప్రశంసనూ ఆత్మీయులకు చేరవేయండి. ప్రశంసించడానికి ఎదుటివారు మహామహా విజయాలే సాధించక్కర్లేదు. పెద్దపెద్ద పదాలూ అవసరం లేదు. మెచ్చుకోలులో నిజాయతీ ఉంటే చాలు. ‘ఎలా ఉన్నారు?’ అని ఎవరైనా అడిగినప్పుడు కూడా..‘బండి నడుస్తోంది’ అనో, ‘ప్చ్‌..ఫర్వాలేదు’ అనో నసిగేయకండి. ‘బావున్నాను...చాలా బావున్నాను...అద్భుతం’ - అని ఆనందంగా చెప్పండి. ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ - అన్న సందేశం ఆ వ్యక్తీకరణలో ప్రతిఫలించాలి.


క్షమించండి! 

తెలిసో తెలియకో, అజ్ఞానంతోనో అహంకారంతోనో - ఎదుటి మనిషిని బాధపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు, అలా బాధపెట్టడాన్ని...హక్కుగానో, అధికారంగానో భావిస్తాం కూడా. ఆ మూర్ఖత్వపు ముసుగును తొలగించుకున్న మరుక్షణమే, మన కారణంగా ఇబ్బందిపడినవారిని..క్షమించమని వేడుకోవాలి. అది అవమానమో మచ్చో కాదు. ప్రతి క్షమాపణ తర్వాతా...మన వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుంది. మనసు ఇంకాస్త తేలికపడుతుంది. క్షమాపణలో...తప్పుచేశామన్న పశ్చాత్తాపం ఉంటుంది, ఆ పొరపాటును గ్రహించామన్న జ్ఞానం ఉంటుంది, మరోసారి చేయబోమన్న ఎరుక ఉంటుంది, దాన్ని సరిదిద్దుకోబోతున్న సూచనా ఉంటుంది.


 కృతజ్ఞతలు... 

నిత్య జీవితంలో ధారాళంగా, వీలైతే వూతపదంలా ఉపయోగించాల్సిన మాట ఇది. ‘కృతజ్ఞత’, ‘కృతజ్ఞత’, ‘కృతజ్ఞత’ అని ఒకటికి పదిసార్లు జపించినా - అదే పరమమంత్రమై జీవితం పట్ల సానుకూల ధోరణిని కలిగిస్తుంది. ఒక్కసారి గతాన్ని నెమరేసుకుంటే - ఎంతోమందికి రుణపడి ఉంటాం మనం! ఒకరిద్దరు కృతఘ్నులు తారసపడినా...వాళ్లకూ అంతిమంగా కృతజ్ఞులమే! ఎందుకంటే, ఆ మహానుభావులే లేకపోతే, ఆ గాయాలే తగలకపోతే, మనకింత పోరాట పటిమ అబ్బేది కాదేమో! ‘కృతజ్ఞతలు’ అన్న మాటను రోజుకు పదిసార్లు ఉపయోగించినవారితో పోలిస్తే, వందసార్లు ఉపయోగించినవారు ఎన్నో రెట్లు ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉన్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌హెల్త్‌ అధ్యయనంలో వెల్లడైంది.


మనం...

ఓ ఇరవై నాలుగు గంటల్లో...ఎన్నిసార్లు ‘నేను’ అంటున్నారో, ఎన్నిసార్లు ‘మేము’ అంటున్నారో లెక్కబెట్టుకోండి. సాధారణంగా, ‘నేను’ పెత్తనమే ఎక్కువ. క్రమక్రమంగా ‘నేను’ను ‘మనం’ అధిగమించాలి. అదే, వికాసానికి తొలి కొలమానం. నేను అనుకుంటే - ఇరుకిరుకు గల్లీలో నడుస్తున్నంత ఉక్కపోతగా ఉంటుంది. మనం అన్న భావన సువిశాల రాచవీధిలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇస్తుంది. నేను, నా..అన్న మాటల్ని రోజువారీ పదకోశంలోంచి తీసేయండి. మన బాధ్యత, మన లక్ష్యం, మన విజయం...ఇవన్నీ సమష్టి జీవనానికి సంకేతాలు, సంఘజీవులం అనడానికి సాక్ష్యాలు.


 దయచేసి... 

‘దయచేసి...మీ బండిని కాస్త పక్కనపెడతారా? ముందుకెళ్లాలి’, ‘దయచేసి...కాస్త చిన్నగా మాట్లాడతారా?, పనికి ఇబ్బంది అవుతోంది’, ‘దయచేసి...నాకో అవకాశం ఇస్తారా? నన్ను నేను నిరూపించుకుంటాను’ - బాసు నుంచి దాసు దాకా ఎవరితో మాట్లాడినా ‘దయచేసి’ని ఇంతే వినయంగా జోడించాలి. ఆ మాటతో ఆదేశానికి సున్నితత్వం తోడవుతుంది, విన్నపానికి ఆర్ద్రత జత చేరుతుంది. ఎంత కఠినాత్ములైనా కరిగిపోతారు. ఎంత మొండి మనిషి అయినా పట్టు సడలిస్తాడు. ఆంగ్లంలోని అత్యంత శక్తిమంతమైన పదంగా ‘ప్లీజ్‌’కు పట్టంకట్టారు సైకాలజిస్టులు.


ఎందుకంటే?

‘సాయంత్రానికంతా పని పూర్తయిపోవాలి’ - అని చెప్పగలిగే అధికారం మీకు ఉండవచ్చు. అయితే, ‘ఎందుకంటే?’ అంటూ...ఎందుకు పూర్తిచేయాలో కూడా మీరు స్పష్టంగా వివరించగలగాలి. అధికారిగానే కాదు...ఓ భర్తగా, భార్యగా, తండ్రిగా, బిడ్డగా, సహోద్యోగిగా, స్నేహితుడిగా - ప్రతి ఆదేశం తర్వాతా, ప్రతి అభ్యర్థన తర్వాతా, ప్రతి విమర్శ తర్వాతా, ప్రతి తిరస్కరణ తర్వాతా ‘ఎందుకంటే...’ అన్న వివరణా తప్పక జోడించండి. ఆ ఒక్కమాటా కరవైతే, అది అసంపూర్ణ వ్యక్తీకరణే. అపార్థాలకూ అనుమానాలకూ ఆస్కారం ఇచ్చినట్టే.


మీరేమంటారు?

మనకు మాట్లాడటమే తెలుసు. వినే అలవాటు తక్కువ. మనం చెప్పాల్సిందేదో చెప్పేస్తాం. మనం తీసుకోవాల్సిన నిర్ణయమేదో తీసేసుకుంటాం. చర్చకు తావుండదు, అభిప్రాయాల్ని ఇచ్చిపుచ్చుకునే వాతావరణం ఏర్పడదు. ఫలితంగా...కుటుంబమైతే భార్యాపిల్లల్లో, సంస్థ అయితే ఉద్యోగుల్లో, నాయకుడైతే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడుతుంది. ఆ విపరిణామాలు ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు. కాబట్టి, మనం చెప్పాల్సిందేదో చెప్పేశాక, ‘మీరేం అంటారు?’ అంటూ ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆ అభిప్రాయాన్ని ఆమోదించినా, ఆమోదించకపోయినా...గౌరవించాలి.

 


హలో...గారూ!

‘నమస్తే, సుబ్బారావుగారూ!’, ‘హాయ్‌..వెన్నెలా!’, ‘ఏవండోయ్‌ గోపాలంగారూ!’, ‘బావున్నారా పుష్పాజీ!’ - మనల్ని ఎవరైనా పేరుపెట్టి పిలిస్తే...ఆనందభైరవి వింటున్నంత ఆనందంగా అనిపిస్తుంది. ఇంటిపేరు కూడా జోడిస్తే, ఆ కచేరీకి పక్కవాద్యాలూ పక్కాగా కుదిరినట్టే! ఎదుటి వ్యక్తికి నేను గుర్తున్నాను, నా ఒంటి పేరే కాదు, ఇంటిపేరూ తెలుసు - అన్న సంతృప్తి ముందు...పూల బొకేలైనా, పుల్లారెడ్డి మిఠాయిలైనా దిగదుడుపే. గార్లూ, సార్లూ జోడిస్తారా లేదా అన్నది మీ ఇష్టం. కానీ, సాధ్యమైనంత వరకూ నోరారా పేరు పెట్టే పిలవండి. ఆ పిలిచేదీ స్పష్టంగా...ఒత్తులూ పొల్లులూ ఎగిరిపోకుండా పిలవండి. మెదడుకు ఇదో వ్యాయామం కూడా! బంధాలే కాదు, జ్ఞాపకశక్తీ బలపడుతుంది.


ఏం ఫర్వాలేదు...

సమస్య ఎదురైందా? ‘ఏం ఫర్వాలేదు, పరిష్కరిద్దాం’. ప్రాజెక్టు చేజారిపోయిందా? ‘ఏం ఫర్వాలేదు, కొత్త క్లైంట్‌ను వెతుక్కుందాం’. ర్యాంకు రాలేదా? ‘ఏం ఫర్వాలేదు, మరోసారి ప్రయత్నిద్దాం?’ - ఇదీ సమస్యలకూ సవాళ్లకూ స్పందించాల్సిన పద్ధతి. అయినా, అంతా అయిపోయిందని గుండెలెందుకు బాదుకోవాలీ? జరిగిందేదో జరిగిపోయిందని తేలిగ్గా తీసుకోవాలి కానీ. జరగాల్సినదాని గురించి ఆలోచించాలి కానీ. వైఫల్య భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నవారికి ‘ఏం ఫర్వాలేదు’ అన్న మాట వేయి ఏనుగుల బలాన్నిస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.