close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పచ్చదనం... 2017 ఫ్యాషన్‌ వర్ణం..!

పచ్చదనం... 2017 ఫ్యాషన్‌ వర్ణం..!

  పర్యావరణ ప్రియం!

పర్యావరణానికి అత్యంత ప్రియమైనది పచ్చదనమే. అది ఉంటేనే భూగోళం వేడెక్కకుండా సకల ప్రాణులతో కళకళలాడుతుంటుంది. అందుకే ఇటీవల పచ్చనిచెట్ల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపడుతున్నారు. వాటి పరిరక్షణకోసం కాలుష్యాన్ని తగ్గిస్తూనో ఇంధనాన్ని పొదుపు చేస్తూనో తయారుచేసే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలూ కార్లూ బైక్‌లూ ఫ్యాక్టరీలూ కార్పొరేట్‌ భవనాలూ... ఇలా అన్నింటిముందూ గ్రీన్‌ అన్న పదం ఓ లేబుల్‌ మాదిరిగా తప్పనిసరి అయిపోయింది.

పచ్చాపచ్చని ఛాయల్లో...

కుపచ్చరంగు భావోద్వేగాల్ని సమన్వయం చేస్తుందనీ, ప్రేమతత్వాన్ని పెంచుతుందనీ, ఆందోళననీ డిప్రెషన్‌నీ ఒత్తిడినీ తగ్గిస్తుందనీ చెబుతారు కలర్‌థెరపిస్టులు. ఈ రంగుని ఇష్టపడేవాళ్లలో విశ్వసనీయతా సామరస్యతా సేవాగుణమూ దయాస్వభావమూ కూడా ఎక్కువే. మంచి శ్రోతలు కూడా. అయితే ఆకుపచ్చరంగులో ఛాయలనేకం. లేతాకుపచ్చరంగు ప్రియులు కొత్తదనాన్ని కోరుకునేవాళ్లయితే, ఆలివ్‌గ్రీన్‌ ఛాయను ఇష్టపడేవాళ్లు శాంతి కాముకులై ఉంటారు. చిగురాకుపచ్చవర్ణం చిన్నవయసునీ పసి మనస్తత్వాన్నీ సూచిస్తే; పచ్చరాయి రంగుని కోరుకునే వాళ్లలో సృజనాత్మకత, భావోద్వేగ సమన్వయం మెండుగా ఉంటాయట. యౌవనోత్సాహాలతో తుళ్లిపడేవాళ్లు నిమ్మపచ్చకు దాసోహులయితే; సిరిసంపదలకు ప్రతీకగా నిలిచే ముదురాకుపచ్చ లేదా గడ్డి రంగుప్రియుల్లో ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించాలనుకునే మనస్తత్వం అధికం. నీలిపచ్చ(ఆక్వాగ్రీన్‌)ను ఇష్టపడేవాళ్లు మంచి సంరక్షకులు కాగా; పసుపుపచ్చప్రియుల్లో కాస్త భయమెక్కువ అన్నది నిపుణుల విశ్లేషణ.

ఆకులో ఆకునై...

కుపచ్చవర్ణం ఆకులకే సొంతం అనుకుంటాం. కానీ సంపెంగ, గిన్నెమాలతి... వంటి కొన్ని రకాల పూలు కూడా పచ్చదనంతో విచ్చుకుంటాయి. చైనా గులాబీలో పూలకింద ఉండే ఆకుపచ్చని చిన్న ఆకులే రేకులుగా మారి ఘాటైన వాసనతో పరిమళిస్తుంటాయి. అంతేనా... కాలిఫోర్నియాకు చెందిన రాల్ఫ్‌ మూరె అనే నిపుణుడు ఆకుపచ్చని గులాబీల్నీ కృత్రిమంగా సృష్టిస్తే, బెంగళూరులోని ఓ ఇంట్లో సహజంగానే ఆకుపచ్చ గులాబీలు పూసి అందరినీ అబ్బురపరిచాయి. చామంతి, డాలియా, మరికొన్ని గడ్డిజాతులు సైతం ఆకుపచ్చరంగులో విరబూస్తూ వృక్షనిపుణుల్నీ చకితుల్ని చేస్తున్నాయి.

పచ్చ ఎంతందం!

నీలాకాశాన్ని నీలిసాగర సౌందర్యాన్నీ చూసి ‘నాకేమో.. ఈ మట్టి రంగూ... వాటికేమో ఆనందవర్ణమా...’ అని కోపంతో రగిలిపోతున్న భూమాతను చల్లబరిచేందుకు ఆ బ్రహ్మదేవుడు కొండలూ గుట్టలూ లోయలూ మైదానాలూ... ఇలా ఇలాతలమంతా పచ్చదనాన్ని సృష్టించేశాడట. తన ఒడిలో విరిసిన ఆ పచ్చని ప్రకృతికాంత అందాలకూ చల్లదనానికీ పులకించిపోయిన పుడమితల్లి తన దృష్టే తగులుతుందేమోనని భయపడి ఏడాదికోసారి శిశిరరుతువుతో దిష్టి తీసేస్తుందట. అవునుమరి, చిగురాకులూ లేతాకులూ ముదురాకుల్లా రకరకాల ఛాయల్లో కనువిందుచేసే పచ్చదనాన్ని చూస్తూ పరవశించని వాళ్లెవరుంటారు...

పచ్చని ఆరోగ్యం!

ప్రకృతి సంకేతంగా నిలిచే హరితవర్ణం ఆరోగ్యానికీ చిహ్నమే. ఆకుపచ్చని రంగులో ఉండే పాలకూర, తోటకూర, బచ్చలి, గోంగూర, కేల్‌, ఆస్పరాగస్‌, బ్రకోలి, బీర, సొర, కాకర, కివీ, ఆకుపచ్చ ఆపిల్‌, జామ... వంటి ఆకుకూరలూ, కూరగాయలూ పండ్లన్నీ కూడా పీచుకీ విటమిన్లకీ యాంటీఆక్సిడెంట్లకీ మంచి నిల్వలు. వీటిల్లో క్యాన్సర్‌ నిరోధకాలూ ఎక్కువే. గ్రీన్‌ టీ సరేసరి. అందుకే ఔషధాలూ పోషకపదార్థాలను తయారుచేసే కంపెనీలు తమ ఉత్పత్తులమీద ఈ రంగు లోగోలను ఎక్కువగా ముద్రిస్తుంటాయి.

పచ్చనిచెట్ల మధ్యలో నిల్చొని ఆ తాజా గాలిని గుండెల నిండుగా పీల్చి వదిలితే అది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో జబ్బులు తగ్గుముఖం పడతాయి. పచ్చని పొలాల్ని ఓ గంటసేపు తదేకంగా చూస్తే కంటి సమస్యలు తగ్గుతాయని యోగ శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పచ్చని వాతావరణంలో కండరాలూ నాడులూ కొత్త శక్తిని నింపుకుంటాయి. దాంతో ఎంతో ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది. పచ్చదనం గుండె వేగాన్ని పెరగకుండా చూస్తుంది. చుట్టూ ఆకుపచ్చరంగు ఉంటే చదివే శక్తి పెరుగుతుందనీ చదివింది త్వరగా అర్థం చేసుకుంటారనేది ఓ పరిశోధన.

పచ్చ నాకు సాక్షిగా..!

తాజాదనాన్నీ ఆహ్లాదాన్నీ నింపుకున్న పచ్చదనం కొత్తదనానికీ పునరుజ్జీవనానికీ సంకేతం. అందుకే నిస్సారమైన జీవనవేగంతో విసిగిపోతోన్న ఆధునిక మానవుడు ఆ ప్రకృతిలోనే తడిసిముద్దవ్వాలని కోరుకుంటూ ఇంటాబయటా మొత్తంగా తన చుట్టూ పచ్చదనాన్ని సృష్టించుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇంట్లోని ఫర్నిచర్‌తోబాటు ఇంటినీ హరితవర్ణంతో అలంకరించుకుంటున్నాడు. ముఖ్యంగా గదిలో ఆకుపచ్చరంగు వేస్తే టీవీ చూడటం వల్ల అలసిన కళ్లు సేదతీరతాయట. అయితే గది మొత్తంగా ఒకే రంగు కాకుండా నిమ్మపచ్చతోపాటు లేత గులాబీ, లేతనీలం తెలుపూ కలిపి వేస్తే ఎంతో ఆహ్లాదంగా ఉంటుందట. పైగా ఈ రంగువల్ల గది చిన్నగా ఉన్నా విశాలంగానూ కనిపిస్తుంది.

రంగుల మేళవింపు!

కుపచ్చని ఆకుల్లో విరిసే రంగుల పూలన్నీ చూడ్డానికి అందంగానే ఉంటాయన్నది తెలిసిందే. అందుకే అందాల ఆకుపచ్చ రంగు ఏ వర్ణంతోనయినా జత కట్టేస్తుంది. ఆకుపచ్చ ఛాయలకి ఎరుపూ, మెజెంతా వర్ణాలను జోడిస్తే ఎవరైనా సరే, కళ్ళప్పగించి చూడాల్సిందే. రంగుల మేళవింపు అవసరం లేకుండానూ హరితప్రియులకోసం అచ్చంగా ఆకుపచ్చ ఛాయల్లోనే ఆధునిక, సంప్రదాయ దుస్తులన్నీ రాబోతున్నాయి. ఇంకెందుకాలస్యం... ఆ పచ్చదనాల అందాలను సొంతం చేసుకునేందుకు సిద్ధంకండి మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.