close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జ్ఞానోదయం

జ్ఞానోదయం
- యర్రంశెట్టి మధు

‘‘ధర్మం చెయ్యి తల్లీ’’
ఆ స్వరం ఎక్కడో విన్నదిలా అనిపించి- గుడి మెట్లు ఎక్కుతున్నదాన్నల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాను.

వయసు నలభై యాభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది. అయితే వృద్ధాప్యం కాస్త తొందరపడినట్టుంది. కళ్ళూ బుగ్గలూ లోపలికంటా పీక్కుపోయి, చర్మం ముడతలుదేలి ఉంది. వెన్నెముకలో సత్తువలేదేమో- నడుం బాగా వంగిపోయి ఉంది. ఒక కాలులేని కారణంగా చంక కర్ర సహాయంతో నిలబడీ నిలబడలేక అటూ ఇటూ కదులుతోంది.

ఆమెని ఎక్కడో చూసినట్టే అనిపించింది. కానీ ఎక్కడ చూశానో గుర్తురాలేదు. ఆ విషయమే ఆలోచిస్తూ ఇంకా దీక్షగా ఆమె మొహంలోకి చూసి ఉలిక్కిపడ్డాను.

ఆమె... రాగమ్మ, మా పనిమనిషి!
మూడేళ్ళక్రితం అనుకుంటా... నా ఇంట్లో పనికి కుదిరింది. మనిషి కూడా మంచిదే. మాటామంచీ ఎరిగినదే. పని ఎంత కష్టమైనదైనా ఇష్టంగానే చేసేది. ఎప్పుడూ తన మొహంలో విసుగూ చిరాకూ కనపడనిచ్చేది కాదు. టైమూ కాకరకాయంటూ పనిని మధ్యలో వదిలేసి వెళ్ళేదేకాదు. దిక్కుమాలిన షరతులన్నీ పెట్టి జీతాలు పెంచమంటూ విసిగించేది కూడా కాదు. పని మొత్తం తెమిలాక- మేము తినగా మిగిలినవి ఏమైనా ఉంటే సాయంత్రం తన ఇంటికి పట్టుకెళ్ళేది.

ఒకరోజు ఏమైందోగానీ పనిలోకి రాలేదు. నేను వాకబు చేస్తే తన కాలికేదో దెబ్బ తగిలినట్టు తెలిసింది.

వారం తర్వాత, మా పక్కింటివాళ్ళ పనిమనిషి నూకాలు వచ్చి అసలు విషయం చెప్పింది- ‘‘అమ్మగారూ, రాగమ్మకి కాలు విరిగి హాస్పిటల్లో ఉందమ్మా’’ బాధగా అంది.

నేనూ బాధపడి ‘‘అయ్యో, ఎలా ఉందే ఇప్పుడు?’’ అన్నాను.

‘‘కాలు తీసెయ్యాలంటున్నారమ్మా!’’

నేను షాకయి ‘‘అంత దెబ్బ ఎలా తగిలిందే?’’ అన్నాను.

‘‘ఒక రాత్రి ఇంటికి వెళ్తుండగా, ఏదో చెట్టుకొమ్మ విరిగి మీదపడిందట!’’

నేను తిరిగి నూకాలుని ప్రశ్నించలేదు. ‘‘తిరిగి పనిలోకి రాగలదా?’’ అన్నాను.

‘‘ఏమోనమ్మా, దేవుడి దయ!’’

వారం కాదు, నెల గడిచిపోయింది. రాగమ్మ తిరిగి పనిలోకి రాలేదు. నా అవసరంకొద్దీ నేను వేరే పనిమనిషిని కుదుర్చుకున్నాను.

ఇది జరిగి రెండేళ్ళయింది.

ఇదిగో, ఇప్పుడు... ఈ దీనస్థితిలో రాగమ్మని చూసేసరికి నాకు ఆశ్చర్యంతోపాటు బాధ కూడా కలిగింది. పోనీ పలుకరిద్దామా అనుకుంటే- ఆమె మురికి బట్టలూ, ఆకారం చూసి నామోషీగా అనిపించింది. గబుక్కున ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే ఏమనుకుంటారో అన్న శంక కలిగింది. ఇక ఆ ప్రయత్నం విరమించుకుని, నా పర్సులోంచి ఒక పది రూపాయల నోటుని తీసి రాగమ్మ బొచ్చెలో వేశాను.

రాగమ్మ నన్ను గుర్తుపట్టిందో లేదో కానీ ‘‘నీ కుటుంబం చల్లగుండాలమ్మా’’ అని దీవించింది.

దాని దీవెన నా గుండెల్ని తాకినట్లయింది. ఏదో చెప్పలేని అనీజీనెస్‌ నన్ను అలుముకుంది. అయినా సర్దుకుని పేలవంగా నవ్వి ముందుకి కదిలాను. నా మనసంతా ఒక విధమైన అపరాధభావనతో నిండిపోయింది. కాస్త దూరం నడిచి వెనక్కి తిరిగి చూశాను.

జీవంలేని రాగమ్మ గాజుకళ్ళు జాలిగా చూస్తూ కనిపించాయి- ఎన్నో ప్రశ్నల్ని నాకు సంధిస్తూ.

నేను వాటికి జవాబు వెతికే పనిలో పడలేదు. మౌనంగా నడవసాగాను. మెట్లు ఎక్కుతున్నాననే మాటేగానీ- అడుగులు ముందుకి పడలేదు. మెట్లకి ఇరువైపులా ఉన్న చెట్లు కూడా నన్ను చూసి నవ్వుతున్నట్లే తోచాయి. మరిచిన మేలు పదేపదే గుర్తుకువచ్చి నన్ను దహించసాగింది.

* * *

ఆరోజు...
‘గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావొచ్చు. ఒకటో నంబరు ప్రమాదసూచిక ఎగురవేయటమైనది. బెస్తవారు సముద్రంలోకి వేటకి వెళ్ళరాదు’ అన్న వాతావరణ శాఖవారి ప్రకటన టీవీలో విన్నప్పటి నుంచీ నా మనసు మనసులో లేదు.

సమయం ఆరయింది. వాతావరణం మారి నల్లటి మబ్బులుపట్టి, గాలి-తుప్పర ప్రారంభమయ్యాయి. గాలి వేగానికి ఎక్కడో కరెంటు తీగలు తెగిపోయాయట, కరెంటు లేదు. బయటంతా చీకట్లు అలుముకున్నాయి. చంటిగాడు స్కూలు నుంచి ఇంకా ఇంటికి రాలేదు. వాడిని తీసుకొచ్చే వ్యాను కోసం ఎదురుచూస్తూ బయట గుమ్మంలో నిలుచున్నాను.

చూస్తుండగానే అరగంట గడిచింది.

స్కూలు వ్యాను మాత్రం అయిపులేదు. నా గుండెల్లో సన్నటి దడ ప్రారంభమైంది. భయంతో కాళ్ళు వణకసాగాయి.

అసలు స్కూలు వ్యాను ప్రతిరోజూ ఐదున్నర గంటలకే వచ్చి, ఇంటి ముందాగి హారన్‌ మోగిస్తుంది. నేను వెంటనే వెళ్ళి వాడిని లోపలికి తీసుకుని వస్తాను. అలాంటిది, ఈ రోజేమయిందోగానీ వ్యాను జాడలేదు. అప్పటికీ నేను చంటిగాడి స్కూలుకి ఫోన్‌ చేసి అడిగితే ‘వ్యాను బయలుదేరిపోయిందనీ, వ్యాను డ్రైవరు కొత్తవాడు కాబట్టి- రూట్లు తెలుసుకోవటంలో కాస్త జాప్యం జరిగివుంటుందనీ మరి కొద్దిసేపట్లోనే రావచ్చనీ’ చెప్పారు.

చెప్పి గంటదాటినా కూడా వ్యాను రాకపోయేసరికి, నాకు ఏడుపు ముంచుకొచ్చింది. అసలే కరెంటు లేదు, దారులన్నీ చీకటిమయం, గుంతలరోడ్లు. డ్రైవర్‌ కొత్తవాడట. పిల్లల్ని ఎలా గమ్యం చేరుస్తాడో అనుకుంటే పైప్రాణాలు పైనే పోతున్నాయి.

పోనీ, స్కూలుకి వెళ్ళి విచారిద్దామా అంటే, అది దగ్గరా దాపూ కాదు. మా ఇంటినుంచి సుమారు కిలోమీటరు దూరం పైనే ఉంటుంది. పైగా ఆ రూట్లు కూడా నాకు సరిగా గుర్తుండవు. అదీగాక ఇంతటి గాలీవానలో తెలిసీతెలియని దారెంట వెళ్ళాలంటే నాకు ధైర్యం కూడా చాల్లేదు. ఇంట్లో కూడా ఎవరూ లేరు.

ఆయనేమో డ్యూటీ పనిమీద ఒడిశా వెళ్ళి రెండురోజులైంది. ‘క్యాంపు పొడిగించబడిందనీ, మరో రెండురోజుల వరకూ రాననీ’ నిన్ననే ఫోన్‌ చేసి చెప్పారు. మా చుట్టుపక్కల వాళ్ళతో నాకు పెద్దగా పరిచయాలు లేవు. ఎందుకనోగానీ నాకు మొదటి నుంచీ అలా పరిచయాలు పెంచుకోవటం అలవాటులేదు. ఏవైనా వస్తువులు అప్పు అడగటం, బదులు తెచ్చుకోవటం నాకు ఇష్టంలేనివి. పోనీ మా పనిమనిషి రాగమ్మ అయినా వస్తుందనుకుంటే, అది వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు.

వాతావరణ పరిస్థితి దానికి ముందే తెలుసు కాబోలు- ఒక అరగంట ముందుగానే ఇంటికి వచ్చి ఇంటిపనీ, అంట్లపనీ పూర్తిచేసి హడావుడిగా తిరిగి దాని గుడిసెకి వెళ్ళిపోయింది. ఇక రేపు ఉదయానికిగానీ అది పనిలోకి రాదు.

ఇవన్నీ తలుచుకునేకొద్దీ నాకు ఏడుపు ముంచుకు వచ్చింది. ఎవరిమీదనో తెలియని కోపం. ఆ కోపాన్ని ఎవరిమీద ప్రదర్శించాలో తెలియలేదు. మరోసారి వెళ్ళి స్కూలుకి ఫోన్‌ చేస్తే ఎంతకీ ఎత్తలేదు. దాంతో మరింత బెంబేలెత్తిపోయాను. ఏడుపే తరవాయిగా వచ్చి గుమ్మంలో నిలుచున్నాను.

ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు.

అయినా ఈ రాగమ్మ ఏదో కొంపలు మునిగిపోయేటట్టు అప్పుడే వెళ్ళాలా! ఇంకాసేపు ఇక్కడే ఉంటే దాని సొమ్మేంపోయింది? మొగుడా మొద్దులా పిల్లా జెల్లా? పెళ్ళయి ఏడాదికూడా తిరక్కముందే మొగుడ్ని మింగేసింది. అంతటితో జీవితం ముగిసిపోయినట్టు- మోడుగా మిగిలిపోయింది. అంతోటిదానికి ఎక్కడుంటే ఏమిటి? పోనీ కొంపైనా ఉందా అంటే అదీలేదు. నాలుగు కాలిగుంజల మీద గోనెపట్టాలు కప్పిన పూరికొంప దానిది. అది ఏ దొంగలెత్తుకుపోతారని అంత హడావుడిగా వెళ్ళటం?

అయినా నాది అర్థంలేని కోపమే. పసివాడు ఇంకా ఇంటికి రాలేదన్న అసహనంతో అలా ఆలోచిస్తున్నాను కానీ, రాగమ్మ తన ఇంటికి వెళ్ళిపోవటానికి కారణం నా పిసినారితనమే!

వాతావరణ ప్రకటన విన్న వెంటనే రాగమ్మ మామూలు సమయంకంటే ముందుగానే పనిలోకి వచ్చింది. తన పనులన్నీ త్వరత్వరగా పూర్తిచేసి వచ్చి ‘‘ఈ రోజేదో గాలీ వానా అని చెపుతున్నారమ్మా, నన్నుగానీ ఉండిపొమ్మంటారా?’’ అంది.

మామూలుగా అయితే అదెప్పుడూ అలా అడగదు. బహుశా వర్షం వస్తే దాని గుడిసె నీటితో నిండి పడుకోవటానికి జాగా కూడా ఉండదన్న ఆలోచన వచ్చి కావచ్చు- ఈరోజు అడిగింది.

నేను ఆలోచించి ‘‘సరే, ఇంటికివెళ్ళి భోజనం అదీ చేసి రావే’’ అన్నాను. ఇక్కడుంటే దాని తిండి ఖర్చు నేను భరించాలి- అదీ నా ఆలోచన. పాపం, అదేమనుకున్నదో కానీ ముఖం నల్లగా పెట్టుకుని మౌనంగా వెనుతిరిగింది.

వెళ్తుంటే మళ్ళీ అడిగాను ‘‘వస్తావు కదే?’’ అది సమాధానం చెప్పలేదు. ‘వూ’ అని మాత్రం అంది. అది మళ్ళీ రాలేదు.

ఇప్పుడు అది తలుచుకుని నన్ను నేనే తిట్టుకున్నాను. కనీసం అది తోడుగా ఉన్నా కూడా, నాకు అంత బెంగ ఉండకపోను. స్కూలుకి వెళ్ళి చంటిగాడిని తీసుకురమ్మన్నా వెళ్ళి ఉండేది. ఇప్పుడు నా పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అయింది.

చూస్తుండగానే మరో అరగంట గడిచింది. చంటిగాడిని తలుచుకునేకొద్దీ ఏడుపు ఆగలేదు. కళ్ళు తుడుచుకుంటూనే ఇంట్లోకీ బయటికీ తిరిగాను. మనసునిండా ఏవేవో భయాలు. ‘అసలు చంటిగాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? వ్యాను ఎక్కి ఉంటాడా? లేకపోతే ఏ

మూలనోపడి నిద్రపోతూవుంటే- వ్యానువాళ్ళు నిర్లక్ష్యంగా వదిలేసి వచ్చారా? ఆ ఆలోచన రాగానే నా కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఏదైతే అదైందిలెమ్మని స్కూలుకి ఒకర్తినే వెళ్ళటానికి సిద్ధపడ్డాను. అనుకున్నదే తడవుగా ఇంట్లోకి వెళ్ళి టార్చిలైటూ, గొడుగూ, ఒక శాలువా తీసుకుని బయటికి వచ్చాను. తాళం వేస్తుండగా- ‘‘అమ్మగారూ, ఈ టైమ్‌లో ఎక్కడికి?’’ అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూశాను.

ఎదురుగా రాగమ్మ - దేవతలా నిలబడి ఉంది.

దాన్ని చూడగానే సంతోషం, దుఃఖం కలగలిపి నా గొంతు పూడుకుపోయింది. సమాధానం కూడా చెప్పకుండా అమాంతం దాన్ని పట్టుకుని పెద్దగా ఏడ్చేశాను.

అది బిత్తరపోయి ‘‘ఏమైందమ్మగారూ?’’ అంది.

‘‘చ.. చంటిగాడు...’’ ఇక మాటలు పెగల్లేదు.

‘‘చంటికి ఏమైందమ్మా?’’

అప్పటికి నేను కాస్త తేరుకుని ‘‘వాడింకా ఇంటికి రాలేదే’’ అన్నాను.

అది బాధపడి ‘‘అయ్యో, ఎంత పని జరిగిందమ్మా... త్వరగా స్కూలుకి వెళ్దాం పదండి’’ అని తొందరపెట్టింది.

చీరచెంగు నెత్తిన వేసుకుని రాగమ్మ ముందు వెళ్తుండగా... గొడుగూ, టార్చిలైటుతో నేను వెనుక కదిలాను. స్కూలుకి వెళ్ళినంతసేపూ, పాపం అది తడుస్తూనే ఉంది. అంత చలిలోనూ నాకు ధైర్యం చెపుతూనే నడిచింది.

నేను అనుకున్నదే నిజమైంది.

చంటిగాడు స్కూలు వరండాలో ఒక మూల కోడిపిల్లలా ముడుచుకుని భయంతో వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. వాడిని ఆ స్థితిలో చూడగానే నా కడుపు నీరైపోయింది. అమాంతం వెళ్ళి వాడిని దగ్గరకి తీసుకుని నా గుండెలకి హత్తుకున్నాను.

రాగమ్మ కూడా కన్నీళ్ళు పెట్టుకుని, కాసేపు స్కూలు యజమాన్యాన్నీ, వ్యాను డ్రైవర్నీ తిట్టిపోసింది. ఆ తర్వాత చంటిగాడిని అందుకుని తన చంకనేసుకుంది. నా చేతిలోని శాలువా వాడిమీద కప్పింది. ‘‘మీరు పదండమ్మా, బాబుని నేను ఎత్తుకొస్తాను. ఈ వర్షంలో అది మీవల్లయ్యే పనికాదు’’ అని చెప్పి, చంటిగాడి చెవుల్లోకి గాలి దూరకుండా మరోసారి శాలువాని సర్ది తన గుండెల్లో పొదువుకుని ముందుకి కదిలింది.

ఆ దృశ్యాన్ని వెనుకనుండి చూసిన నాకు- ఎందుకోగానీ కళ్ళు చెమ్మగిల్లాయి. రాగమ్మలాంటి మంచిమనిషికి బిడ్డలు లేకపోవటం బాధనిపించింది. ‘ఈరోజు అదేగనక లేకపోతే నా పరిస్థితి ఏమిటి?’ అనుకున్నప్పుడు మాత్రం- అది దేవతలా కనిపించింది. మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

ఇంటికి చేరగానే నేను యజమానురాలినైపోయాను. రాగమ్మ పనిదైపోయింది. నేను రాగమ్మ చంకలోంచి చంటిగాడిని అందుకుని గబగబా లోపలికి తీసుకుని వెళ్ళాను. వాడి తలా, ఒళ్ళూ తుడిచి పొడిబట్టలు వేశాను. పాలు కాచి, వేడివేడిగా తాగించాను. అప్పటికి వాడి భయం కాస్త సర్దుకుంది. వాడిని మంచంమీద పడుకోబెట్టి తిరిగి బయటికి వచ్చాను.

జోరు వానలో అప్పటివరకూ తడిసిన రాగమ్మ- చలికి గజగజ వణుకుతోంది. నాకు జాలనిపించింది. పాత గుడ్డ కోసం వెదికితే ఎక్కడా కనపడలేదు. మేం వాడే టవల్‌ ఇద్దామంటే మనసు రాలేదు. ఎందుకంటే అది వాడాక మేమిక దాన్ని ఉపయోగించలేం. చూస్తూ చూస్తూ నూటయాభై రూపాయల టవలు వదులుకోవాలంటే మనసొప్పక... ‘‘ఏమిటే ఇంకా అలాగే నిలబడ్డావ్‌, ఇంటికి వెళ్ళవా ఏమిటి?’’ అన్నాను

అధికారం కనపరుస్తూ.
నా మాటలకి అది ఆశ్చర్యపోయిందో లేక బాధపడిందో కానీ మొహం నల్లగా పెట్టుకుని ‘‘అలాగే వెళ్తానమ్మా’’ అంది.

‘‘భోంచేశావా?’’

అది సమాధానం చెప్పలేదు. తలాడించింది.

‘‘రేపు పనిలోకి వస్తావుకదటే?’’ మళ్ళీ నేనే అడిగాను.

‘‘వస్తానమ్మా’’ అంటూ వెళ్ళిపోయింది.

అది వెళ్ళిపోయాక నేను గదిలోకి వచ్చి తలుపులన్నీ బిగించి కిటికీలోనుంచి బయటికి చూశాను. వర్షపు ఉధృతి ఇంకా పెరిగినట్టుంది. వీధులన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. దూరంగా రాగమ్మ అడుగులో అడుగేస్తూ వెళ్తొంది. వెనక్కి పిలుద్దామా అనుకుని మళ్ళీ విరమించుకున్నాను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, లేకుంటే నెత్తికెక్కుతారు.

ఆ రాత్రి రాగమ్మ చీకట్లో వెళ్తుండగా గాలి ఉధృతికి- ఒక చెట్టుకొమ్మ విరిగిపడి దాని కాలు ఫ్రాక్చర్‌ అయిందట. తెల్లవార్లూ అలాగే రోడ్డుమీదనే బాధపడుతూ గడిపిందట. ఆ తర్వాత ఎవరో గమనించి, గవర్నమెంట్‌ హాస్పిటల్లో చేర్పించారట. అక్కడ కాలు నయం కాకపోగా మొత్తం కాలునే తీసేశారట!

ఆ విషయం వారం తర్వాత పక్కింటివాళ్ళ పనిమనిషి నూకాలు వచ్చి చెపితే తెలిసింది. నేను బాధపడి- ఒక వంద రూపాయలు తీసి దాని చేతికిచ్చి ‘‘ఈ డబ్బులు రాగమ్మకి చేర్చవే’’ అన్నాను.

అది నన్ను ఎగాదిగా చూసి ‘‘నేనిప్పుడు వెళ్ళటంలేదమ్మా’’ అంటూ వెళ్ళిపోయింది. అది వెళ్తూ మరోమాట కూడా చెప్పింది. ‘‘మీరు హాస్పిటల్‌కి వెళ్ళి దాన్ని పలకరిస్తే- దాని మనసు కాస్త కుదుటపడుతుందమ్మా... మీవల్లనేగా దాని కాలు పోయింది.’’ నాకు చురుక్కుమన్నా

సర్దుకున్నాను. వెంటనే ఆలోచనలోపడ్డాను.

‘ఇప్పుడు గనుక నేను హాస్పిటల్‌కి వెళ్తే- ఇప్పుడు ఇవ్వచూపిన వందకి బదులు- ఏ వెయ్యో, రెండువేలో రాగమ్మ చేతిలో పెట్టాల్సిరావచ్చు. లేదా దాని కాలు బాగుపడే వరకూ ఖర్చులన్నీ నా మీదనే పడ్డా పడొచ్చు’ అనుకుని, మళ్ళీ ‘అయినా, నేనెందుకు భరించాలి? అది నా ఇంట్లో వూరకనేగానీ పనిచేసిందా? నెలనెలా జీతం తీసుకుంటూనే ఉంది కదా! అడపా దడపా మిగిలిపోయిన అన్నం, కూరలూ తీసుకెళ్తుంది. పండగలనాడో పబ్బాలనాడో పాతచీరలు అవీ ఇస్తూనే ఉన్నాను. రోగాలనీ రొష్టులనీ అప్పుడప్పుడూ పదీ పాతికా తీసుకుంటూనే ఉంటుంది. అవి ఎప్పుడూ తిరిగి ఇచ్చిందిలేదు. కాకపోతే చంటిగాడి కోసమంటూ ఓ గంటసేపు నాతోపాటు వర్షంలో నడిచింది. అది రుణమనుకుంటే మరెప్పుడైనా- ఇంకో రూపంలో తీర్చుకోవచ్చు’ అలా అనుకుని, ‘‘నేను వెళ్తే మాత్రం పోయిన దాని కాలు తిరిగి వస్తుందటే’’ అన్నాను.

ఆ మాటతో నూకాలు నావైపు ఒకసారి చూసి వెళ్ళిపోయింది.

* * *

గుడి గంట మోగేసరికి నేను ఆలోచనల్నుండి బయటపడ్డాను. గుడిలో అట్టే జనం లేరు. పూజారి ఇచ్చిన హారతి కళ్ళకద్దుకుంటుంటే- ఎందుకోగానీ నా చేతులు వణికాయి. హారతి పళ్ళెంలో చిల్లరవేసి గర్భగుడి ముందు ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని నిలబడ్డాను.

రామయ్య అర్ధనిమీలిత నేత్రాలతో నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళు అంతలోనే తీక్షణతని సంతరించుకున్నాయి. వాటిద్వారా ఒక వెలుగు ప్రసరిస్తూ... ఏదో సందేశం వినిపిస్తూ... నా చెంప చెళ్ళుమనేలా...

‘దారినపోయే కుక్కకి పట్టెడు మెతుకులు విదిల్చితే అది జీవితకాలం- నువ్వు కనిపించినప్పుడల్లా ప్రేమగా తోక వూపుతుంది. అలాంటిది నీకోసం, నీ బిడ్డకోసం తన సర్వస్వం పోగొట్టుకున్న రాగమ్మ కోసం నువ్వేం చేశావ్‌? నీ భాషలో చెప్పాలంటే- అదెవరు, నువ్వెవరు? నీకు తోడుగా ఉండటం కోసం ఆ చీకట్లో అది నీ ఇంటికి ఎందుకు రావాలి? నీకోసం అది తన కాలునెందుకు కోల్పోవాలి?’ ... అలా ఎన్నో ప్రశ్నలు!

కళ్ళు విప్పాను. బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు... నా మనోఫలకం విచ్చుకుంది. ఏదో తెలియని ప్రశాంతత నా మనసంతా నిండిపోయింది. ఒక అదృశ్యపు వెలుగు దారి చూపుతుంటే వెనక్కి తిరిగాను. బాబు క్షేమంగా వస్తే హుండీలో వేస్తానన్న- మొక్కు తీర్చడం కోసం తెచ్చిన లక్ష రూపాయలు పర్సులో నుంచి బయటికి తీయలేదు.

దూరంగా రాగమ్మ రూపం అస్పష్టంగా ఉంది. ‘జైపూర్‌ కాలు పెట్టించడానికి లక్ష సరిపోతుందా, మరికొంత అప్పు తేవాలా’ అని ఆలోచిస్తూ... ‘ఈ క్షణం నుంచీ నువ్వు నా సొంత మనిషివి రాగమ్మా’ అనుకున్నాను గుడిమెట్లు దిగుతూ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.