close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ కూర రోజూ తింటా!

ఆ కూర రోజూ తింటా!

రవిచంద్రన్‌ అశ్విన్‌... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌. టెస్టుల్లో అత్యధికంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’లు అందుకున్న భారత ఆటగాడు. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లా ఎప్పటికప్పుడు తన బౌలింగ్‌లో కొత్తదనాన్ని తెస్తున్న అశ్విన్‌ని చూస్తూనే ఉన్నాం. ఓసారి అతడిలోని సాధారణ వ్యక్తిని చూస్తే...

పుస్తకాలు వదలను

బంధువుల్లో నాతోటివారంతా బాగా చదివేవారు. దాంతో క్రికెట్‌తో ఎంత బిజీగా ఉన్నా, చదువుల్లోనూ ముందుండాల్సి వచ్చేది. స్కూల్‌ రోజుల్లో చరిత్ర అంటే బాగా ఇష్టం. పెద్దయ్యాక పురావస్తు శాస్త్రం చదవాలని ఉండేది. కానీ అక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయని ఇంట్లోవాళ్లు అడ్డుచెప్పారు. దాంతో ఇంజినీరింగ్‌ చేశాను. 19 ఏళ్లపుడు ‘యాటిట్యూడ్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’ అనే పుస్తకం చదివాక పుస్తకాలు చదవడం అలవాటుగా మారింది. నిత్యం ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాను.


స్నేహితులూ పర్యటనలూ... 

సాయికుమార్‌, అరవింద్‌ శ్రీనివాసన్‌, సతీష్‌, సురేష్‌, విఘ్నేష్‌, అభిమానిగా పరిచయమై స్నేహితుడిగా మారిన విక్కీ... మేమంతా ఏడాదికోసారైనా పాండిచ్చేరి, గోవా... ఇలా ఏదో ఒకచోటుకి విహారయాత్రకు వెళ్తాం. అప్పుడు చిన్నపిల్లలమైపోతాం. మా అల్లరికి హద్దే ఉండదు. అయితే మా సరదాల కోసం వేరెవ్వరినీ ఇబ్బందిపెట్టం. చెన్నైలో ఉంటే హోటళ్లకీ, సినిమాలకీ వెళ్తుంటాం.


పూజగదిలో బాలూ బ్యాట్‌ 

మా ఇంట్లోని పూజగదిలో దేవుడి పటాల పక్కన క్రికెట్‌ బ్యాట్‌, బంతి, హెల్మెట్‌, స్టంప్స్‌ ఉంటాయి. దేవుళ్లని పూజించినట్టే వాటినీ పూజిస్తాను. నేను మైదానంలో మంచి ప్రదర్శన చేసినప్పటి బంతుల్నీ, స్టంప్స్‌నీ తెచ్చి అక్కడ పెడతాను.


నేను మిస్సయ్యేది అవే...

నేను ఇంటి దగ్గర లేకుంటే మూడింటిని మిస్సవుతాను. అవి... మా పాప అఖిర. తనకిప్పుడు 15 నెలలు. ఇప్పుడు పక్కన లేకున్నా రోజూ అఖిరాని ఫేస్‌టైమ్‌లో చూస్తుంటాను. ఇంకా కుక్కపిల్లలూ, బంగాళాదుంప కూర. ఇంటి దగ్గర ఉంటే రోజూ బంగాళాదుంప వండించుకుంటాను. క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక వ్యాపారంలో స్థిరపడాలని ఉంది. కొన్నాళ్లు చదువుకి గ్యాప్‌ ఇచ్చినా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నాను. ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకోవాలనేది నా కోరిక.


త్రిష అంటే ఎంతిష్టమో! 

చిన్నప్పట్నుంచీ నాకు కుక్కపిల్లలంటే ఇష్టం. మా ఇంట్లో జర్మన్‌ షెపర్డ్‌ ఉండేది. కానీ నాకప్పుడు ఆస్థమా ఉండటంవల్ల దాన్ని వేరేవాళ్లకి ఇచ్చేశాం. నా భార్య ప్రీతీకి కూడా కుక్కపిల్లంటే ఇష్టం. తను వచ్చాక ఇంట్లో మళ్లీ కుక్కపిల్లల్ని పెంచడం మొదలుపెట్టాం. ఇప్పుడు రెండు లాబ్రడార్లూ, మూడు దేశవాళీ కుక్కపిల్లలూ ఉన్నాయి. కుక్కల్ని పెంచుకోమంటూ ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున చెన్నైలో ప్రచారం కూడా చేశాను. నటి త్రిష అంటే నాకు బాగా ఇష్టం. ఆ ప్రచారానికి ఆమె కూడా రావడంతో తనతో మాట్లాడే ఛాన్స్‌ వచ్చింది.


మూలాల్ని మర్చిపోను... 

నేను పుట్టి పెరిగిన వెస్ట్‌ మంబళం ప్రాంతంలోనే ఇప్పటికీ ఉంటున్నాం. కాకపోతే ఇంటిని కొత్తగా మార్చుకున్నాం. మా పాత ‘మారుతి 800’లో తిరగడం నాకు ఇష్టం. బీఎమ్‌డబ్ల్యూ, ఆడీలలో తిరిగినా ఆ సంతోషం రాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రుచుల్ని చూసినా మా వీధిలో ఛాట్‌ బండార్‌ దగ్గర ఛాట్‌ తింటుంటే ఆ కిక్కేవేరు.


 

 అవీ ఇవీ

నాకో కూతురు కావాలి...!

క్కోసారి ఆనందమూ విషాదాన్ని మోసుకొస్తుందేమో..! చైనాలో వృద్ధుల జనాభా గత ముప్పైఏళ్లలో బాగా పెరిగింది. వాళ్లు ఎక్కువ కాలం జీవించడం సంతోషించదగ్గ పరిణామమే అయినా భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్న వాళ్లు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారట. అయితే అయినవాళ్లు అందరూ ఉన్నా ఒంటరి జీవితం గడుపుతున్న అరవైమూడేళ్ల లీయాన్‌ లిన్‌ ఈమధ్య ఇంటర్నెట్‌లో పెట్టిన ఓ అభ్యర్థన ఎంతోమందిని ఆలోచనలో పడేసింది. రకరకాల ప్రాంతాలకు వెళ్లి ప్రకృతి అందాలను తనివితీరా చూడాలని ఎంతో ఆశపడుతుందట లీయాన్‌. కానీ ఒంటరిగా ప్రయాణించడానికి భయపడుతున్న ఆమె సెలవుల్లో తనతో గడపడానికీ తన మనసులోని భావాలను పంచుకోడానికీ ఓ కూతురు కావాలంటోంది. పెద్దవాళ్లను ఆదరించే మనసున్న అమ్మాయి తనతో కలిసి ప్రయాణిస్తే అడిగినంత మొత్తం ఇవ్వడంతో పాటు ఐఫోన్‌-7నూ బోనస్‌గా అందిస్తానంటోంది. లీయాన్‌ సొంత కూతురు కెనడాలో స్థిరపడిపోయింది. ఇక లీయాన్‌ భర్త స్నేహితులతో కలిసి పర్యటనలకు వెళుతుంటాడట. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే కూతురుకాని కూతురితో ప్రయాణాలు చేయాలనుకుంటోంది లీయాన్‌.

భలే ఉద్యోగం

కొన్ని ఉద్యోగాల్లో చేయాల్సిన పనులు వినడానికే చాలా వింతగా ఉంటాయి. క్యూబాకు చెందిన అలీడా రోడ్రిగజ్‌ పెడ్రసా చేస్తోన్న ఉద్యోగం కూడా అచ్చం అలాంటిదే. ఈమె చేయాల్సిందల్లా పార్కులో ఉన్న జాన్‌ లెనన్‌ అనే సంగీతకారుడి విగ్రహానికి ఉన్న కళ్లజోడును ఎవ్వరూ దొంగిలించకుండా చూడటమే. ఈ సంగీతకారుడు అమెరికా విధానాలను వ్యతిరేకించడం ద్వారా క్యూబా అధ్యక్షుడు క్యాస్ట్రో అభిమానాన్ని సంపాదించాడు. దాంతో లెనన్‌ చనిపోయిన తర్వాత ఆ కళాకారుడి విగ్రహాన్ని పార్కులోని బెంచీ మీద కూర్చున్నట్టుగా ఏర్పాటుచేశారు. అయితే పర్యటకులు అభిమానంతో ఆ విగ్రహం దగ్గర ఫొటోలు తీయించుకోవడంతోపాటు అతడి గుర్తుగా కళ్లజోడునూ పట్టుకెళ్లిపోతున్నారట. ఎన్నిసార్లు కళ్లజోడు పెట్టినా కథ మొదటికే రావడంతో దాన్ని పరిరక్షించడానికి అలీడాను కొత్తగా ఉద్యోగంలో నియమించారు. పర్యటకులు ఫొటోలు తీయించుకోగానే కళ్లజోడును తీసి పదిలపరచడమే ఆమె చేయాల్సిన పనట.

గాడిదలు పైజమాలు వేస్తే...

స్వచ్ఛమైన ప్రకృతి అందాలను చూసి పరవశించిపోవాలని ఆశపడే పర్యటకులు రియా ద్వీపానికి వెళుతుంటారు. ప్రకృతితోపాటు అక్కడి గాడిదలూ పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయట. కారణం... అవి పైజమాలు వేసుకుంటాయి. అలాంటి వస్త్రధారణ వెనుకా ఓ బలమైన కారణం ఉంది. ఈ గాడిదల్ని ఒకప్పుడు స్థానిక ఉప్పు పరిశ్రమల్లో పనులకు వినియోగించేవారు. ఆ సమయంలో దోమలూ, పురుగులూ కుట్టి ఇబ్బంది పెడుతుండటంతో వాటి బారి నుంచి గాడిదలను కాపాడటానికి యజమానులు పైజమాలు కుట్టించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం వాటిని ఉప్పు పరిశ్రమల్లో పనులకు వినియోగించకపోయినా వాటిని చూడటానికి పర్యటకులు విపరీతంగా వస్తుండటంతో పైజమాల పద్ధతిని ఇంకా కొనసాగిస్తున్నారట.

కానుకలే కానుకలు...!

పిల్లలకు ఏదైనా కానుక ఇచ్చినపుడు వాళ్ల ముఖం ఆనందంతో ఎంత వెలిగిపోతుందో చెప్పలేం. అలాంటి ఆనందాన్ని తన ముగ్గురు పిల్లల ముఖాల్లోనూ చూడాలనుకుంది ఎమ్మాటప్పింగ్‌. అందుకే ఈ క్రిస్‌మస్‌ సందర్భంగా ఒక్కొక్కరికీ తొంభైఏడు కానుకలను ఇచ్చింది. కిందటి ఏడాది ఒక్కక్కరికీ ఎనభైఏడు కానుకలను ఇచ్చినపుడే పిల్లల్ని పాడుచేస్తోందని చాలామంది విమర్శించారట. అయినా అవేమీ పట్టించుకోకుండా మరిన్ని కానుకలతో ఈ ఏడాది పిల్లల్ని సంతోషపెట్టింది. ‘ఏడాది పొడవునా అత్యవసరమైన వస్తువులే కొంటాను. క్రిస్‌మస్‌కు మాత్రం మరో శాంటాలా మారి పిల్లలను కానుకలతో ముంచెత్తితేనే నాకు ఆనందం’ అంటోంది ఎమ్మా.

వూరంతా దిష్టిబొమ్మలే...

ద్యోగాల కోసం యువత వలసబాట పడుతుంటే పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. గ్రామాల్లో వృద్ధులు మాత్రమే మిగిలిపోతున్నారు. ఒకప్పుడు కళకళ్లాడిన పల్లెలు మనుషుల్లేక బోసిపోవడం చూసి చాలామంది బాధపడుతుంటారు. జపాన్‌లోని నగోరో గ్రామాన్ని చూసి అయానో సుకిమి కూడా అలాగే ఆవేదన చెందింది. కొన్నేళ్లపాటు పట్నంలో పనిచేసి చివరికి గ్రామానికి చేరుకున్న అయానో ఒకరోజు కూరగాయల తోట కోసం దిష్టిబొమ్మను తయారుచేస్తుండగా ఆ బొమ్మలో ఆమె తండ్రి పోలికలు కనిపించాయట. దాంతో ఆ రోజునుంచీ మనుషుల పోలికలతో ఉన్న దిష్టి బొమ్మలను తయారుచేసి వాటికి పాత దుస్తులు తొడిగి బస్టాపుల్లోనూ, రోడ్డుకు ఇరువైపులా పెట్టడం మొదలుపెట్టింది. పల్లెను విడిచి పట్నానికి వెళ్లిన ప్రతి ఒక్కరి పేరునా బొమ్మను తయారుచేస్తోంది. ఇలాగైనా తన వూరు ఒకప్పటిలా కళకళ్లాడాలని తాపత్రయపడుతోంది.


 

మోదీ మెచ్చిన రైతు!

గుజరాత్‌ వెళ్లి ‘సర్కారీ గోలియా’ గ్రామం ఎక్కడుందని అడిగితే చెప్పలేరేమోగాని ‘అనార్‌ గావ్‌’ అనడిగితే ఎవరైనా చెప్పేస్తారు. అంతేకాదు, ఆ గ్రామానికి చెందిన రైతు గెనాభాయ్‌ పటేల్‌ గురించి మరింతగా వివరిస్తారు. ఎందుకంటే గెనా రైతు మాత్రమే కాదు, దానిమ్మ విప్లవం!

పుట్టుకతోనే దివ్యాంగుడైన గెనాభాయ్‌ పటేల్‌ ఆధారం లేనిదే నిలబడలేడు. కానీ ఇప్పుడు అతడు చూపిన దారి ఎందరో రైతుల్ని తమ కాళ్లమీద నిలబడేలా చేస్తోంది. గెనాభాయ్‌ పన్నెండో తరగతి వరకూ చదువుకున్నాడు. కానీ, చదువు అంతంత మాత్రమే. దాంతో ఉద్యోగ ప్రయత్నాలూ చేయలేదు. అతడిది వ్యవసాయ కుటుంబం. అలాగని అందరిలా పొలంలో దిగి పని చేయలేడు. దాంతో బతుకు తెరువుకి దారులు చాలా తక్కువే కనిపించేవి. ‘వూళ్లొ ఉంటూ వ్యవసాయం చేయించేవాణ్ని. కానీ ఏడాది తిరిగే సరికి రూ.10 వేలు కూడా మిగిలేది కాదు. దాంతో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని అమ్మేవాణ్ని. అందులో లాభాలు వస్తున్నా, నా పొలంలోనే ఏదైనా చేయాలని ఉండేది’ అని చెబుతాడు గెనాభాయ్‌.

అందుకే దానిమ్మ
శారీరక శ్రమ తక్కువగా ఉండే పంటని సాగుకు ఎంచుకోవాలనుకున్నాడు గెనాభాయ్‌. దానికోసం రైతులూ, వ్యవసాయ అధికారులూ, శాస్త్రవేత్తలూ... ఇలా చాలామందిని అడిగాడు. చివరకు దానిమ్మ సాగుచేయాలనుకున్నాడు. ఏ రకం విత్తనాన్ని నాటాలనే విషయంపైనా చాలా ఆలోచించాడు. ఎందుకంటే గుజరాత్‌లో నీటి లభ్యత తక్కువ. వాతావరణం పొడిగా ఉంటుంది. దాంతో దానిమ్మ ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతానికి వెళ్లి పరిశీలించిన గెనాభాయ్‌... గుజరాత్‌ వాతావరణానికి సిందూరీ రకం దానిమ్మ బాగా సరిపోతుందని గ్రహించాడు. తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అప్పటివరకూ ఆ ప్రాంతంలో ఎవరూ దానిమ్మ సాగుచేయలేదు. దాంతో వారు మొదట ఆసక్తి చూపకపోయినా, గెనా పట్టుదల చూసి తర్వాత మెత్తబడ్డారు. ‘నేను పెద్ద సాహసం చేస్తున్నానని చాలామంది హెచ్చరించేవారు. కానీ గుజరాత్‌ వాతావరణం దానిమ్మ పంటకు అనుకూలంగా ఉంటుందని నాకు గట్టి నమ్మకం. దానికితోడు ఒకసారి నాటితే 20 ఏళ్లపాటు తోట పండ్లను ఇస్తుంది’ అని చెబుతాడు గెనాభాయ్‌.

రెండేళ్లలో కోట్లు
మొత్తానికి 2004లో 13 ఎకరాల్లో దానిమ్మ మొక్కల్ని నాటాడు గెనాభాయ్‌. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే 50 శాతం సబ్సిడీని ఉపయోగించుకున్నాడు. తోటకి బిందు సేద్యం ద్వారా నీరందించేవాడు. చిన్న ట్రాక్టర్‌తో తనే దుక్కి దున్నేవాడు. రెండేళ్ల వరకూ సోంపు, కూరగాయల్ని అంతర పంటలుగా వేశాడు. మరోవైపు 12 ఆవుల్ని కొని పెంచాడు. ‘నేను దానిమ్మ నాటుతున్నాను. మీరూ వేయండ’ని గ్రామంలోని రైతులకు సూచిస్తే, ‘ఈ వికలాంగుడు అందరినీ వికలాంగులుగా మార్చేస్తాడులా ఉంది’ అని హేళనగా మాట్లాడారే తప్ప ముందుకు రాలేదెవరూ. రెండేళ్ల తర్వాత గెనా తోట విరగగాసింది. ఆ ఏడాది 54వేల కిలోల దిగుబడి వచ్చింది. అప్పటిదాకా మొత్తం రూ.60 లక్షలు ఖర్చు పెట్టగా రూ.3.14కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి కాపు వచ్చేంతవరకూ వ్యవసాయ అధికారుల సూచనల్ని తూచా తప్పకుండా పాటించాడు గెనాభాయ్‌. సేంద్రియ ఎరువుల్ని ఎక్కువగా వాడేవాడు. తోటంతటికీ నైలాన్‌ వల వేసి పంటని పక్షులూ, ఉడతల నుంచి రక్షించేవాడు. ఆ తర్వాత నుంచి ఏటా ఎకరాకు రూ.10లక్షల లాభం వస్తోంది. వ్యవసాయ అధికారులు దానిమ్మ సాగు గురించి సదస్సులు నిర్వహించి గెనాభాయ్‌ని ఉదాహరణగా చూపేవారు. గెనా కూడా అలాంటి సదస్సులకు ఉత్సాహంగా వెళ్లేవాడు. ప్రస్తుతం గెనా 27 ఎకరాల్లో దానిమ్మ సాగుచేస్తున్నాడు. అతడి గ్రామంలో 150 మంది రైతులు అతడి బాటలోనే నడుస్తున్నారు. అందుకే ఆ గ్రామానికి ‘అనార్‌ గావ్‌’గా పేరొచ్చింది. గెనా ప్రభావంతో గుజరాత్‌ పొరుగునున్న రాజస్థాన్‌లోనూ దానిమ్మ సాగు పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దిల్లీ, జైపూర్‌, నాగపూర్‌, కోల్‌కతాల నుంచి వ్యాపారులు గెనా సొంత జిల్లా బనాస్‌కంఠాలోని ‘దీశా’ పట్టణానికి వచ్చి దానిమ్మ కొంటుంటారు. కొందరు వాటిని ఐరోపా, ఆఫ్రికా, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఇటీవల ‘దీశా’లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గెనాభాయ్‌ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. నిజానికి 2006 నుంచీ గెనా గురించి మోదీకి తెలుసు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెద్ద కొబ్బరికాయంత దానిమ్మని బహుమతిగా ఇచ్చాడు గెనా. గుజరాత్‌ ప్రభుత్వం నుంచి ‘కృషి రుషి’, రాజస్థాన్‌ ప్రభుత్వం నుంచి ‘హల్‌దార్‌ శిరోమణి’, 2014లో ‘మహీంద్రా సంవృద్ధి’ జాతీయ అవార్డుల్ని అందుకున్న గెనా... ప్రస్తుతం దీశాలోని వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సలహా సంఘం సభ్యుడిగా, ‘బనాస్‌ ఆగ్రో ప్రొడ్యూసర్స్‌ అండ్‌ ప్రాసెసర్స్‌’ కంపెనీ అధ్యక్షుడిగా ఉన్నాడు.

‘దానిమ్మ విప్లవం’ గురించి గెనాభాయ్‌ని అడిగితే, ‘ఒకప్పుడు మూడు చక్రాల రిక్షాలో తిరిగేవాణ్ని. తర్వాత మూడు చక్రాల స్కూటర్‌ కొన్నాను. ఇప్పుడు కారులో తిరుగుతున్నాను. ఒకప్పుడు మా వూళ్లొ ప్రతి రైతు ఇంట్లో సైకిలే ఉండేది. ఇప్పుడు వాళ్లందరూ కూడా కార్లలో తిరుగుతున్నారు. అయినా, మేమంతా పొలాలకు వెళ్లడం మాత్రం మానలేదు’ అంటూ తనలోని రైతుని గర్వంగా గుర్తుచేస్తాడు.


 

అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదం

శీతల స్నానం, భూతల శయనం, ఏక భుక్తం... అయ్యప్ప దీక్షధారులు తప్పనిసరిగా పాటించే నియమాలివి. వేర్వేరు పనులమీద బయటకు వచ్చే స్వాములకు ఒంటి పూట భోజనం ఇబ్బంది అవుతుండటాన్ని గమనించి, పరిష్కారంగా వారికి అన్నప్రసాదం అందిస్తున్నాడు ఓ అయ్యప్ప భక్తుడు.

య్యప్ప దీక్షలో ఉండే భక్తులు ఉదయం, సాయంత్రం అల్పాహారం తీసుకొని, మధ్యాహ్నం పూట భోజనం చేస్తారు. పూజకూ, వసతికీ ఏర్పాట్లుండే సన్నిధానానికి దూరంగా ఉద్యోగాలూ, వ్యాపారాలూ, ఇతర పనులమీద వెళ్లేవారికి అన్నిచోట్లా నియమనిష్ఠలతో వండివార్చిన భోజనం దొరకదు.25 ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న కొండా వేంకటేశ్వర్లుకి ఈ విషయం అనుభవమే. అందుకే వారికోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ పెద్ద వినాయకుడి మండపానికి దగ్గర్లోని తన ఇంటివద్ద ఏటా ఉచిత భోజనం అందిస్తున్నాడు.

వందల్లో స్వాములు
వెంకటేశ్వర్లు ఇంట్లోనే ఏటా సన్నిధానం ఏర్పాటుచేస్తారు. ఆయన తమ్ముడితోపాటు అక్కడ మరో 20మంది వరకూ దీక్షధారులు ఉంటారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని వెంకటేశ్వర్లు 2011లో మొదలుపెట్టారు. అప్పట్లో రోజూ 300 మంది స్వాములు అక్కడికి భిక్షకోసం వచ్చేవారు. ప్రస్తుతం 700 మంది వరకూ వస్తున్నారు. ఏటా నవంబరు మూడో వారంలో మొదలుపెట్టి జనవరి మొదటి వారం వరకూ 45 రోజులపాటు ఈ భోజన ఏర్పాట్లు చేస్తారు. ఆ సమయంలో మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగింటి వరకూ భోజనం అందుబాటులో ఉంటుంది. ఈ 45 రోజులూఉదయాన్నే దీక్షధారుల కోసం వంట మొదలవుతుంది. ఉదయం 11:45కి నైవేద్యం సమర్పించాక భక్తులకు అన్నప్రసాదం అందిస్తారు. ఈ సమయంలో వంటా, వడ్డన కోసం కనీసం 15 మంది పనిచేస్తారు. భోజనానికి వచ్చే భక్తులూ వడ్డనలో వీరికి సాయపడతారు. అన్నంతోపాటు పులిహోర, వెజ్‌బిర్యానీ, జీరారైస్‌, పుదీనా రైస్‌లలో ఏదో ఒక రకాన్ని వడ్డిస్తారు. రోజూ 150 కిలోల బియ్యం, 20 లీటర్ల నూనె, అయిదు కేజీల నెయ్యి, 50కిలోల కాయగూరలూ వంటకు ఉపయోగిస్తారు. ‘‘ఖైరతాబాద్‌ చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువ. సచివాలయం, విద్యుత్‌ సౌధ, రాజ్‌భవన్‌, ఏజీ ఆఫీసు, డీజీపీ ఆఫీసు, మింట్‌ కంపౌండ్‌లు ఇక్కడున్నాయి. ఇక్కడి ఉద్యోగులతోపాటు పనులమీద ఈ కార్యాలయాలకు వచ్చే అయ్యప్ప దీక్షధారులు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతుండటం గమనించాను. 2011లో ‘శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం’ ఏర్పాటుచేసి అయ్యప్ప భక్తులకు రెండు రకాల కూరలూ, పప్పూ, నెయ్యి, సాంబారు, అప్పడం, స్వీటు, హాటు, చిక్కటి పెరుగుతో భోజనం అందిస్తున్నాం. సికింద్రాబాద్‌కు చెందిన మా గురుస్వామి సింగం రామ్మూర్తి స్థానిక ‘అయ్యప్ప సంఘం’ తరఫున ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ఆయన స్ఫూర్తితో నేనూ ప్రారంభించాను’ అని చెబుతారు వెంకటేశ్వర్లు. ఈయన తమ్ముడూ, కొందరు శిష్యులూ కూడా ఏటా అయ్యప్ప మాలవేస్తారు. వారంతా ఈ కార్యక్రమంలో ఆయనకు సహాయంగా ఉంటారు. నీళ్లూ, వంట సామాన్లు తేవడం, వడ్డింపు... ఇలా తలో పనీ చూసుకుంటారు. వెంకటేశ్వర్లు తల్లి రోజూ వంట పనుల్ని పర్యవేక్షిస్తారు. వడ్డింపు ప్రక్రియ సజావుగా సాగేలా వెంకటేశ్వర్లు రోజూ దగ్గరుండి చూసుకుంటారు. అంతేకాదు, అయ్యప్ప పడిపూజకు అవసరమయ్యే శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, విష్ణుమూర్తి చిత్రపటాలతోపాటు మెట్లు ఉండే సెట్‌ను ఉచితంగా అందిస్తారు. ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం రోజున అక్కడకు వచ్చే భక్తులకు మండపం దగ్గర్లో ఉచితంగా అన్నపానీయాలు అందజేస్తారు.

పంబా సమీపాన...
వెంకటేశ్వర్లు సుమారు 100 మంది శిష్య బృందంతో ఏటా శబరిమల యాత్రకు వెళ్తారు. అలా వెళ్లినపుడు జనవరిలో నాలుగు రోజులపాటు భక్తుల కోసం కేరళలోనూ అన్నప్రసాదాల్ని అందిస్తారు. పంబా నదికి రెండు కి.మీ.దూరంలో దీనికోసం ప్రత్యేకంగా ‘విరి(గుడిసె)లు’ ఏర్పాటుచేస్తారు. అక్కడకు అవసరమయ్యే వంట పాత్రలూ, గ్యాస్‌ సిలిండర్లూ, సరుకుల్ని ఒక వ్యాన్‌లో హైదరాబాద్‌ నుంచి తీసుకువెళ్తారు. ఆ నాలుగు రోజులూ ఉదయం ఆరు నుంచి అల్పాహారం, మధ్యాహ్నం 12 గంటలు మొదలు రాత్రి 11:30 వరకూ అల్పాహారంతోపాటు భోజనం అందిస్తారు. ఆ సమయంలో సుమారు 30వేల మంది భక్తులు ఆకలి తీర్చుకుంటారు. దాదాపు 100 మంది దీనికోసం అక్కడ పనిచేస్తారు. వారిలో కొందరు మాలధారణలో ఉన్నవారు, కొందరు సాధారణ భక్తులూ, కొందరు పనివాళ్లూ ఉంటారు. ‘కేరళలో అన్నప్రసాదం ఏర్పాట్లలో 18ఏళ్లు మా గురుస్వామికి సాయపడ్డాను. ఆరేళ్ల నుంచి అక్కడా సొంతంగా సేవ చేస్తున్నా’ అని చెబుతారు వెంకటేశ్వర్లు. ఇక్కడ భక్తులు సేదదీరడానికీ ఏర్పాట్లు ఉంటాయి.