close
ప్రభువు పాదముద్రలు... బైబిలు కథలు!

ప్రభువు పాదముద్రలు... బైబిలు కథలు!

సుక్రీస్తు...తన రక్తంతో లోకాన్ని శుద్ధి చేశాడు. తన గాయాలతో వ్యవస్థకు స్వస్థత ప్రసాదించాడు. తాను ముళ్ల కిరీటం ధరించి, ప్రపంచానికి పూలదారి పరిచాడు. తాను శిలువ మోసి, సమస్త మానవాళినీ పాపభారం నుంచి విముక్తం చేశాడు. బాధాతప్త హృదయులకు జీవితం మీద ఆశనీ, భవిష్యత్తు మీద నమ్మకాన్నీ కలిగించాడు. ఆ కరుణామయుడి ముందు ప్రేమపూర్వకంగా మోకరిల్లే కృతజ్ఞతోత్సవమే క్రిస్మస్‌!

బైబిలు...
అనిర్వచనీయమైన ప్రేమ, అనంతమైన విశ్వాసం, అపారమైన కరుణ, ఎల్లలులేని క్షమాగుణం...బైబిలులో వాక్యాలై ప్రవహిస్తాయి. అందులోనూ, క్రైస్తవ సాహిత్యంలో తారసపడే కథలు...నిత్యజీవితంలోని మంచిచెడుల్ని తూకమేసినట్టు బేరీజువేస్తాయి. మనిషిలోని జ్ఞానాజ్ఞానాల్ని రాయంచలా వేరు చేసి చూపిస్తాయి. బైబిలు సారమంతా...ఆ చిన్నచిన్న కథల్లో ఇమిడి ఉంది. అందులోనూ రకరకాలు. ఏసు బోధనల్లో అంతర్లీనమైనవీ, పవిత్ర గ్రంథంలో పాత్రలైనవీ, అనుబంధ సాహిత్యంలో భాగమై బాధ్యతల్ని గుర్తుచేసేవీ...ఇలా అనేకం! సంభాషణల రూపంలోనూ, ప్రశ్నజవాబుల మాధ్యమంలోనూ కొన్ని తారసపడతాయి. ప్రతి కథలో విస్పష్టమైన సందేశం ఉంటుంది - అది హెచ్చరికంత తీవ్రస్థాయిలో ఉండవచ్చూ, ఆత్మీయ భాషణలా మృదుమధురంగానూ సాగవచ్చు. ఎలా ఉన్నా మంచి మంచే. ఆ నీతిని గ్రహించాల్సిందే. జీవితాలకు అన్వయించుకోవాల్సిందే. ఈ ప్రక్రియ ద్వారానే మనిషి పరిశుద్ధుడు అవుతాడు.

అసలైన సౌందర్యం...
జానెడు ఎత్తు పెంచుకునే ప్రయత్నంలో ఓ కుర్రాడు ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు. కొత్త నిగారింపు తెచ్చుకునే ఆరాటంలో ఓ యువతి రసాయన స్నానానికి సిద్ధపడుతుంది. బట్టతల మీద వెంట్రుకల్ని మొలిపించుకునే ఆత్రుతలో ఓ నడివయసు పెద్దమనిషి తలనిండా చిల్లులు పొడిపించుకుంటాడు. కృతకమైన మెరుగుల కోసం అంత ఆరాటం అవసరమా? ఐహిక మోహాల వలలో పడినవారికి ఈ బైబిలు కథ కనువిప్పు. సిరియా సైన్యం షోమ్రోను పట్టణాన్ని చుట్టుముట్టింది. ఆత్మరక్షణ కోసం ఇశ్రాయేలీయులు నగర ద్వారాన్ని మూసేసుకున్నారు. ఆ ఆక్రోశంలో సిరియా సైనికులు నానా పన్నాగాలూ పన్నారు. సరిహద్దుల్ని దిగ్బంధనం చేశారు. కొంతకాలానికి, షోమ్రోను పట్టణంలో ఆహారం నిండుకుంది. నీటి కరవు ఏర్పడింది. అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ చేదు అనుభవాల తర్వాత...ఆశావాదులంతా ఒకవైపూ, నిరాశావాదులంతా మరోవైపూ - నిట్టనిలువునా చీలిపోయారు. ‘త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయి. ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది’ అని ఎలీషా ప్రవక్త ఆశావాదంతో ప్రకటించాడు. షోమ్రోను రాజు మాత్రం పక్కా నిరాశావాదిలా వ్యవహరించాడు. అంతిమంగా ఆశావాదమే గెలిచింది. అదో అద్భుతం! ఇంత కట్టుదిట్టం చేసినా, శత్రువులు తలవంచకపోవడంతో సిరియా సైనికుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. పిరికితనం ఆవహించింది. ఏ అర్ధరాత్రో స్థానిక ప్రజలు మెరుపు దాడికి దిగుతారన్న భయం మనసుల్ని తొలిచేయసాగింది. ఆ మానసిక స్థితిలో...ఏ కాస్త అలికిడైనా రథాల ఉరుకుల్లా, గుర్రాల సకిలింతల్లా వినిపించసాగింది. అంతే, ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పట్లో కుష్ఠురోగులకు నగర ప్రవేశం ఉండేది కాదు. పొలిమేరలకు అవతలే తలదాచుకునేవారు. ఆకలిని తట్టుకోలేక, శత్రువుల్ని యాచించి అయినా సరే ఓ నాలుగు మెతుకులు తెచ్చుకుందామని నలుగురు రోగులూ సైనికుల గుడారాల వైపు వెళ్లారు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆనందంతో గంతులేశారు. ఎటుచూసినా...వైరివర్గాలు వదిలివెళ్లిన ఆహారపు గుట్టలే. అలా అని, ఆ నలుగురూ ఆబగా కడుపునింపుకోలేదు. పేరాశతో పొట్లాలూ కట్టుకోలేదు. పరుగుపరుగున వెళ్లి గ్రామస్తులకు చెప్పారు. ఒంటినిండా పుండ్లతో అసహ్యంగా ఉన్న ఆ కుష్ఠురోగులే, ప్రజల కళ్లకి అందమైన దైవదూతల్లా కనిపించారు. నేనూ నాదీ అనుకునే స్వార్థపరుడు, ఎంత సౌందర్యవంతుడైనా, కురూపితో సమానం. నలుగురి గురించీ ఆలోచించే వ్యక్తి....నిజంగానే కురూపి అయినా అతడి ఆత్మసౌందర్యం అందర్నీ సమ్మోహితుల్ని చేస్తుంది. కాబట్టే, ‘సువార్తను ప్రకటించే పాదాలు ఎంతో సుందరం’ అంటుంది బైబిలు.

క్షమాగుణం...
అబద్ధం చెప్పారని ఒకరితో, నిజం చెప్పలేదని ఒకరితో, కీడు చేశారని ఒకరితో, మంచి చేయలేదని ఒకరితో - జీవితంలో తారసపడిన ప్రతి పాత్రనీ శత్రువర్గంలో చేరుస్తూపోతే...చివరికొచ్చేసరికి ఆత్మీయులే లేకుండాపోతారు. బంధాలు బీటలువారతాయి. మనశ్శాంతి కరవు అవుతుంది. క్షమాగుణమే ఈ మనో దౌర్బల్యానికి మందు. ఎప్పటికప్పుడు, ఎవరికివారిని హృదయపూర్వకంగా క్షమిస్తూపోతే...బుర్రలో అర్థంలేని చెత్తంతా పేరుకుపోదు. మనసు తేలికపడిపోతుంది. జీవితం అందంగా అనిపిస్తుంది. ఆ మనిషి దావీదులా ప్రేమస్వరూపుడు అవుతాడు. దావీదు క్షమాగుణానికి ప్రతిరూపం. కన్నకొడుకే తిరుగుబాటు చేసినా క్షమించి వదిలేస్తాడు. దీంతో శత్రువులూ చిన్నచూపు చూస్తారు. వెన్నంటి తరుముతారు. వాళ్లనూ క్షమిస్తాడు. అనేకానేక పరిణామాల తర్వాత మళ్లీ దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడు. చేతికి అధికారం వచ్చాక కూడా...నిన్నటిదాకా చిన్నచూపు చూసినవారిపై కక్షసాధింపులకు పాల్పడడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో క్షమించేశామని అనుకోవడం కాదు, ప్రతీకారం తీర్చుకునే శక్తి ఉన్నప్పుడు కూడా...సహృదయంతో స్పందించడమే క్షమ!

క్రీస్తు సన్నిధిలో ఓసారి క్షమాగుణం మీద చర్చ జరిగింది. ‘ప్రభూ! ఎవరినైనా ఎన్నిసార్లు క్షమించవచ్చు?’ అని అడిగాడో శిష్యుడు. ‘ఏడుసార్లు కాదు, ఏడు డెబ్భైసార్లు...అంటే, 490 సార్లు క్షమించు’ అన్నాడు ప్రభువు. అలా అని, 491వ సారి నుంచీ అస్సలు క్షమించకూడదని కాదు. అంతటి ఓరిమిని సాధించాక...ఆలోచనలో, ఆచరణలో క్షమాగుణం ఓ భాగమైపోతుంది. ఇక, ప్రతి చిన్న క్షమాపణనూ లెక్కబెట్టుకోవాల్సిన అగత్యం రాదు. ఓ వ్యభిచారిణిని తనముందు నిలబెట్టినప్పుడు క్రీస్తు...ఆమెకు శిక్ష విధించరాదనే చెప్పాడు. ‘ఆమె తప్పు చేసింది నిజమే. కానీ మీలో ఏ తప్పూ చేయనివారు ఎవరైనా ఉంటే, ఆమెపై మొదటి రాయి విసరండి’ అన్నాడు. ‘నేను నిన్ను నిందించను. ఇక నుంచీ పాపం చేయవద్దు’ అని సున్నితంగా మందలించి పంపాడు. ‘తండ్రీ! వీరిని క్షమించు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు’ అంటూ శిలువపై నుంచీ క్రీస్తు పలికిన మాట..క్షమాగుణానికి శిఖరసమానం!

విలువల పునాది...
మేడ కట్టావా, పూరిగుడిసె కట్టావా? - అన్నది ముఖ్యం కాదు. దాన్ని ఏ పునాదుల మీద నిర్మించావన్నది ప్రధానం. అవినీతి మూలాలతో పోగేసిన సంపద ఏదో ఒకరోజు సైతానులా మనల్నే మింగేస్తుంది. దీనికి సంబంధించి ఏసుక్రీస్తు హెచ్చరికలాంటి కథ చెప్పారు. ఓ గ్రామంలో బుద్ధిమంతుడూ, బుద్ధిహీనుడూ ఉండేవారు. బుద్ధిహీనుడు ఇసుకలో పునాదులేసి ఇల్లుకట్టుకున్నాడు. బుద్ధిమంతుడు బండరాళ్లతో పునాదులేసి ఇల్లు కట్టుకున్నాడు. ప్రకృతి బీభత్సానికి ఇసుకలో కట్టిన ఇల్లు కుప్ప కూలిపోయింది. బలమైన బండరాళ్ల ఆసరాతో నిర్మించిన ఇల్లు మాత్రం ఆటుపోట్లను తట్టుకుని స్థిరంగా నిలిచింది. ‘ప్రపంచాలు దేవుని మాట మీదే నిర్మితమై ఉన్నాయి’ అంటుంది బైబిలు. ఇంటికి పునాదిలా, ప్రపంచానికి దేవుడి మాట. ఆ మాట...విలువలకు ప్రతీక. ఆ సుభాషితాన్ని కాదని, ఏ రాకాసి స్వభావాన్నో నమ్మితే మాత్రం...ఇసుకలో మేడకట్టుకున్నట్టే.

సొలొమోను శక్తిమంతుడైన పాలకుడు. మహామేధావి. అతడి రాజ్యం ఐశ్వర్యాలతో తులతూగేది. దీంతో, మెల్లమెల్లగా అహాన్ని తలకెక్కించుకున్నాడు. అజ్ఞానం పొరలుగమ్మేసింది. విలాసాలకు బానిసైపోయాడు. స్త్రీలోలత్వంలో చిక్కుకుపోయాడు. ఫలితంగా, నిన్నటిదాకా అభిమానించిన ప్రజలే శత్రువును చూసినట్టు చూశారు. పాలన వ్యవస్థకు బీటలు పడ్డాయి. ఆయన తర్వాత ఇశ్రాయేలు రాజ్యం పతనమైపోయింది. మనిషి మీద పెత్తనం సాధించడానికి దైవీగుణమూ, అసురీగుణమూ పోటీపడుతుంటాయి. విలువల పునాదులు బలంగా ఉంటే, సైతాను మాయలు మనల్నేమీ చేయలేవు. ఆ మనోబలంతో సర్వకాల సర్వావస్థల్లోనూ మంచి వైపే నిలబడతాం. ‘నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు’ అన్న బైబిలు వాక్కు అంతరార్థం అదే. మన వ్యక్తిత్వమే దుర్భేద్యమైన ప్రాకారమై మనల్ని కాపాడుతుంది. వ్యక్తిత్వానికి బీటలుపడిన నాడు...‘ప్రాకారములేక పాడైపోయిన పురము లాంటిది...’ అవుతుంది బతుకు.

రెండు జీవితాలు...
ఆ ఇద్దర్లో ఒకరు చరిత్రలో నిలిచిపోయారు. మరొకరు అనామకంగా అంతరించిపోయారు. ఈ రెండు కథలూ రెండు పాఠాలే. ఏసుక్రీస్తు జెరికొ నగరం గుండా వెళ్తున్నప్పుడు...జక్కయ్య అనే సంపన్నుడు ప్రభువును చూడాలని ఆరాటపడ్డాడు. అసలే పొట్టివాడు...అంతమందిని దాటుకెళ్లి ఎలా చూడగలడు? దగ్గర్లోని ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. జీసస్‌ రానేవచ్చాడు. జక్కయ్యను చూసి ‘నేను మీ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అనుకున్నా. నువ్వేమో చెట్టు దిగడం లేదు...’ అంటూ ప్రేమగా పలకరించాడు. జక్కయ్య ఆ అభిమానానికి మురిసిపోయాడు. చకచకా దిగొచ్చి ‘ప్రభూ! నా సంపదల్లో సగభాగం పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా అన్యాయం చేసుంటే, పరిహారంగా నాలుగురెట్లు చెల్లిస్తా’ అని ప్రకటించాడు. ఆ ప్రాయశ్చిత్త స్వభావమే, ఆ ఉదారగుణమే జక్కయ్యను చరితార్థుడిని చేసింది, ప్రభువు ప్రేమకు పాత్రుడిని చేసింది. మరో సందర్భంలో క్రీస్తుకు ఇంకో సంపన్నుడు తారసపడ్డాడు. ‘ప్రభూ! ఉన్నత మార్గానికి దారి చెప్పండి..’ అని వినయంగా అర్ధించాడు. ‘నీకు ఉన్నదంతా పేదలకు ఇచ్చేసి...నాతో వచ్చేయి...’ అని సలహా ఇచ్చాడు క్రీస్తు. అతడు అయిష్టంగా వెనుదిరిగిపోయాడు. ఆస్తులు పోతాయని భయపడ్డాడే కానీ, జీవితాన్ని సార్థకం చేసుకునే ఓ మంచి అవకాశం చేజారిపోయిన విషయాన్ని గ్రహించలేక పోయాడు. మన ఆలోచనలే మన ఆచరణలు. ఆ ఆచరణలే చరిత్రలో మన స్థానాన్ని నిర్ణయిస్తాయి.

సేవ అంటే మనకున్న దాతృత్వమో, మనలోని గొప్పదనమో కాదు...బాధ్యత, మనిషిగా కనీస బాధ్యత! చాలాసార్లు, నాలుగు పాతగుడ్డల్ని తీసుకెళ్లి ఏ యాచకులకో ఇచ్చి సంతృప్తిచెందుతాం. చిరుగుల పది రూపాయల నోటును ముష్టివాడి పళ్లెంలో వేసి మహదానందపడిపోతాం. అంతకుమించి, ప్రపంచంలో ఏం జరిగినా మనకు సంబంధం లేదనుకుంటాం. అలాంటి పైపై స్పందనల్ని సృష్టికర్త మెచ్చుకోడు. దేవుడిని విశ్వసించడం అంటే..సమాజమే పట్టనట్టు బతకడం కాదు. చెడు కనిపించగానే అల్లంత దూరం నుంచే పారిపోవడమూ కాదు. ధైర్యంగా నిలబడటం, ఎదురొడ్డి పోరాడటం. సాహసికుల్నే దేవుడు ఇష్టపడతాడని బైబిలు చెబుతోంది. గిద్యోను అచ్చంగా అలాంటి పిరికివాడే. కళ్లముందు అన్యాయం జరుగుతున్నా పట్టనట్టు ఉండేవాడు. మంచిరోజు రాకపోతుందా అని పలాయనమంత్రం పఠించేవాడు. మిద్యానీయులు మహాక్రూరంగా ఇశ్రాయేలీయులను వేధిసున్న రోజులవి. ఓ దైవదూత వెళ్లి ‘ఆ శత్రువుల్ని నిర్మూలించాల్సిన బాధ్యత దేవుడు నీకు అప్పగించాడు’ అని చెప్పాడు. ఆ మాటతో గిద్యోను ఆలోచనా ధోరణిలో సమూలమైన మార్పు వచ్చేసింది. ఎనలేని ధైర్యం సొంతమైంది. శత్రుసైన్యాన్ని దునుమాడి గెలిచాడు. ‘గొప్పగొప్ప కార్యాలు చేయాలన్న ఆలోచన లేకపోతే నీ విశ్వాసంలోనే ఏదో లోపం ఉన్నట్టు...’ అంటుంది బైబిలు.

బలమైన సంకల్పం ఉంటే, ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారి మన లక్ష్యాల్ని ఎలా నెరవేరుస్తాయో నెహెమ్యా ఉదంతం నిరూపిస్తుంది. తనో బానిస సంతానం. బబులోని చక్రవర్తి దగ్గర ద్రాక్షసారా అందించేవాడు. అంకితభావంతో చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్నాడు. పూర్వీకుల పట్టణమైన యెరూషలేము వెళ్లేందుకు అనుమతి సంపాదించాడు. అంతటితో ఆగకుండా...ప్రజల్ని సమైక్య పరచి, తొంభై ఏళ్ల శిథిల ప్రాకారాన్ని యాభైరెండు రోజుల్లోనే పూర్తి చేశాడు. ఎక్కడి బానిస? ఎక్కడి పునర్నిర్మాణం? - సంకల్పశక్తితోనే ఆ మహాలక్ష్యం సాధ్యమైంది.

వికాసాల విత్తనం...
నేర్చుకునే మనసుండాలే కానీ, ప్రపంచమే ఓ పెద్ద విశ్వవిద్యాలయం, ప్రకృతే పరమగురువు. కానీ, మనం ఆ జ్ఞాన గవాక్షాల్ని చేతులారా మూసేసుకుని...చిమ్మచీకట్లో బతికేస్తాం, వెలుతురన్నదే లేదని గగ్గోలుపెడతాం. క్రీస్తు ‘పడవ ప్రసంగం’లోని ఓ ఉదంతం ఆ చిమ్మచీకటిని తొలగిస్తుంది. రైతు విత్తనాలు చల్లుతున్నప్పడు...కొన్ని రహదారి మీద పడ్డాయి. వాటిని పక్షులు తినేశాయి. కొన్ని రాతి నేలమీద పడ్డాయి. అవి మొలకెత్తినా, కొద్దికాలానికే ఎండిపోయాయి. కొన్ని మాత్రం సారవంతమైన నేల మీద పడి...పంటనిచ్చాయి. రైతు ఆకలిని తీర్చాయి. చెవులతో వినో, కంటితో చూసో, నోటితో చర్చించుకునో...మంచిని మరచిపోతే, అది బండరాయి మీద పడిన విత్తనమే. మనకైనా, సమాజానికైనా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఆ మంచిని నేరుగా హృదయంలోకి తీసుకోవాలి. అప్పుడే, బతుకులో సాఫల్యాల పంట!

ఇశ్రాయేలీయుల నాయకుడు యెహోషువ గోత్రాలవారీగా భూభాగాల్ని పంచే ఏర్పాట్లు చేశాడు. ఎవరికి వారు సస్యశ్యామలమైన నేల కోసం ఆరాటపడ్డారు. కాలేబు మాత్రం...శాంతిభద్రతల పరంగా సమస్యలున్న హెబ్రోను ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అలా అని అదేమైనా సారవంతమైన ప్రాంతమా అంటే...కాదు. ఎటు చూసినా రాళ్లూ రప్పలే. చెమటోడ్చి బాగు చేసుకోడానికి బోలెడంత వయసు చేతిలో ఉందా అంటే...కానే కాదు! అప్పటికి కాలేబు వయసు ఎనభై అయిదు. అయినా సరే నిరాశపడలేదు. శత్రువుల్ని దిక్కుకొకరిగా తరిమేశాడు. బీడుభూమిని దున్నేసి ద్రాక్షపంట పండించాడు. లక్ష్యశుద్ధి ఉన్నప్పుడు, ఆశయం బలమైంది అయినప్పుడు వయసును అధిగమించవచ్చు, ప్రకృతినీ లొంగదీసుకోవచ్చు.

అదే ప్రేమంటే...
మనకు సాయం చేస్తే మిత్రుడు, చేయకపోతే శత్రువు. గంగిరెద్దులా తలూపితే విధేయుడూ, లోపాన్ని ఎత్తిచూపితే అవిధేయుడూ. ఎదుటి మనిషిని మనం బేరీజువేసే పద్ధతి ఇలానే, ఇంత ఇరుకిరుకుగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తి అభిమానించినా, ద్వేషించినా...నిజమైన ప్రేమలో హెచ్చుతగ్గులు ఉండవు. ఓ సందర్భంలో సాక్షాత్తూ ఏసుక్రీస్తే చెప్పిన అనుబంధాల కథ ఇది. అనగనగా ఓ తండ్రి. అతడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు బుద్ధిమంతుడు. రెండోవాడే, పూర్తిగా దారితప్పాడు. వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. తండ్రితో గొడవపడి ఆస్తిలో వాటా తీసుకుని వెళ్లిపోయాడు. సంపదలన్నీ కరిగిపోయాక....పందుల్ని మేపుతూ, వాటికి వేసే దాణాతో కడుపునింపుకునేవాడు. క్రమంగా అతన్లో పరివర్తన కలిగింది. వెళ్లి తండ్రి పాదాల మీద పడ్డాడు. ‘బిడ్డగా స్వీకరించమని కోరలేను. నాకంత దురాశా లేదు. నీ ఇంటి బానిసగా ఆమోదించినా అదే పదివేలు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తండ్రి గతాన్నంతా మరచిపోయి, ఆనందంగా అక్కున చేర్చుకున్నాడు. ‘నా బిడ్డ! తప్పి దొరికాడు, చచ్చి బతికాడు..’ అంటూ ఆత్మీయులకు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. ‘తండ్రి ప్రేమలోని గొప్పదనమే అది...’ అంటాడు ప్రభువు. తనని తీవ్రంగా ద్వేషిస్తున్నప్పుడూ ప్రేమించాడు, తప్పు తెలుసుకుని దగ్గరికొచ్చినప్పుడూ ప్రేమించాడు. నిజమైన ప్రేమ పరిస్థితుల్ని బట్టి మారదు, అవసరాన్ని బట్టి రూపాంతరం చెందదు - అన్న గొప్ప నీతి ఈ కథలో ఉంది.

ఎదిగేకొద్దీ....
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అలాంటి బిడ్డలంటేనే పరమాత్మకు ప్రేమ. క్రిస్టోఫర్‌ కథలోని నీతి అదే. అతడో మహాబలి. సునాయాసంగా ఏటికి ఎదురీదగల ధీశాలి. దయాగుణమూ అపారమే. కానీ, మనసులో ఏ మూలనో కాస్త గర్వం, తనను మించినవారు లేరన్న అహంకారం. రక్తం గడ్డకట్టుకుపోయే చలిలో...ఓ పసివాడు సాయం కోసం పిలిచాడు. పరుగుపరుగున వెళ్లాడు క్రిస్టోఫర్‌. ఒడ్డున చేర్చి పుణ్యం కట్టుకోమని బతిమాలాడా పిల్లాడు. ‘ఓస్‌...అదెంతపని!’ అంటూ భుజానికి ఎత్తుకున్నాడు. అడుగులు పడుతున్నకొద్దీ ఆ పసివాడు ఇంతై ఇంతింతై...కొండంత బరువెక్కిపోతున్నట్టు అనిపించసాగింది. శక్తినంతా కూడదీసుకుని అడుగులేశాడు. ఒడ్డుకు చేరగానే కుప్పకూలిపోయాడు క్రిస్టోఫర్‌. ఎదురుగా దివ్యతేజస్సుతో దేవుడి పుత్రుడు! కన్నీళ్లు ఉప్పొంగాయి. అజ్ఞానమూ అహంకారమూ ఆ కన్నీళ్లతో పాటూ బయటికి వచ్చేశాయి. క్రిస్టోఫర్‌ పునీతుడు అయ్యాడు...సెయింట్‌ క్రిస్టోఫర్‌గా జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.

హిజ్కియా కథ కూడా ఆధునిక జీవితాలకు అతికినట్టు సరిపోతుంది. విశ్వాసిగా అతడు యెరూషలేము ఆలయాన్ని పునరుద్ధరిస్తాడు.
జనరంజకమైన పాలనతో ప్రజల్ని సంతోషపెడతాడు. చాణక్యనీతితో పొరుగురాజ్యాల్ని మచ్చిక చేసుకుంటాడు. ప్రజలు పలికే జేజేలతో పరవశించిపోతాడు. ‘నీ ఇంటిని చక్కబెట్టుకో...’ అన్న దేవుడి వాక్యాన్ని మాత్రం విస్మరిస్తాడు. పిల్లల పెంపకాన్ని అశ్రద్ధ చేస్తాడు. కన్నకొడుకు మనష్షే రూపంలో ఓ శత్రువు తయారవుతున్నాడన్న విషయాన్ని గ్రహించలేకపోతాడు. మనష్షే మహా దుర్మార్గుడు. జనాన్ని అష్టకష్టాలకు గురిచేస్తాడు. దీంతో ఒక్కో ఇటుకా పేర్చినట్టు హిజ్కియా తీసుకొచ్చిన వైభోగమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. బతుకు పరుగులో పడిపోయి తండ్రిగానో, కొడుకుగానో బాధ్యతను విస్మరించే వారంతా హిజ్కియాలే!

 

* * *

క్రిస్మస్‌ చెట్టుకు సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. క్రీస్తు జనన వార్త తెలియగానే సమస్త ప్రకృతీ పండగ చేసుకుంది. పూలకొమ్మలు అందంగా నవ్వాయి. ఫల వృక్షాలు సంతోషంగా తలూపాయి. నక్షత్రాలు మరింత తళుకులీనాయి. పక్షులు రెక్కల్ని వూపుతూ నృత్యాలు చేశాయి. ఒక్క ‘ఫర్‌ ట్రీ’ మాత్రం... దిగాలుగా కూర్చుంది. ‘పువ్వులివ్వలేను. కాయలు పంచలేను. పక్షిలా ఎగరలేను. నక్షత్రంలా మెరిసిపోలేను. ఏ ప్రత్యేకతా లేని దాన్ని. ఏ సంబరమూ తెలియని బతుకైంది...’ అంటూ బాధపడిపోయిందట. దీంతో, జీవజాతులన్నీ ప్రేమగా తమలోని తేజస్సును ఆ చెట్టుకిచ్చి ‘క్రిస్మస్‌ ట్రీ’గా నామకరణం చేశాయి. క్రీస్తు జన్మదిన వేడుకల్లో ప్రధాన బాధ్యత అప్పగించాయి.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యము!

(సహకారం: రెవ పి.వరప్రసాద్‌)

మీరు నన్ను ప్రేమించినట్టు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు, ఇతరులనూ ప్రేమించండి.తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు.సమాజంలో ఉప్పులా వ్యవహరించాలి. నిశ్శబ్దంగా, నిరాడంబరంగా మన పని మనం చేసుకుపోవాలి.ఎండలో మాడిపోతున్న వ్యక్తికి గిన్నెడు నీళ్లిచ్చినా, అందులో సముద్రమంత ప్రేమ ఉంటుంది.నిత్యం సంతోషంగా ఉండండి. కృతజ్ఞతాగుణాన్ని వదిలిపెట్టకండి.మంచి మార్గం ఇరుకిరుకుగా ఉన్నా సరే, ఆ దార్లోనే ప్రయాణించండి.పరిపూర్ణ ప్రేమ భయాన్ని జయిస్తుంది.నీవు చేసే పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు.బలవంతుడనని విర్రవీగే వాడే అత్యంత బలహీనుడు.కత్తిని దూసేవాడు కత్తి వల్లే మరణిస్తాడు.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.