close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బామ్మకి ప్రేమతో...

బామ్మకి ప్రేమతో...
- వలివేటి నాగచంద్రావతి

బ్బుమని పడిన శబ్దం పెరట్లోంచి. మామిడిచెట్టు కింద పకపకలాడుతోన్న పిల్లల నవ్వులాగినయ్‌.

‘‘పుట్టింట్లో నేతులు తాగామని ఏం గొప్పలు చెప్పుకుంటారో కొందరు- ఎంత గింజుకున్నా నాకా అలవాటు అబ్బలేదు స్మీ’’- ఒకరు.

‘‘అడుగు మాడిన వాళ్ళింట్లో కళ్ళు తెరిచినవాళ్ళకు నేతి వాసనలేమి తెలుస్తయ్‌’’- ఇంకొకరు.

ఇలా పరస్పరం తోటికోడళ్ళు అన్యాపదేశంగా విసురుకుంటున్న వ్యంగ్యాస్త్రాలు ఆగినయ్‌.

ఘొల్లుమంటున్నారు పిల్లలు. మాటల వార్‌కి తాత్కాలిక విరామమిచ్చి పరిగెత్తుకెళ్ళారు తోటికోడళ్ళు.

ఏవుందీ తరచూ జరిగేదే. ఆటలంటూ పిల్లలు చెట్లెక్కెక మానరు, అప్పుడప్పుడూ పడకా మానరు. మామూలే అది.

ఈసారి పడింది పెద్దామె శమంత పెద్దకొడుకు సిద్ధార్థ.

‘‘ఆ పైకొమ్మదాకా ఎక్కేశాడాంటీ.’’ ‘‘ఆ వేలాడే పెద్దకాయ లేదూ... దాన్నందుకోబోయి పడిపోయాడు.’’ ‘‘పడేటప్పుడు ఈ కొమ్మ పట్టుకున్నాడు కూడా. పాపం... అది కూడా

విరిగిపోయి, దాంతోపాటు పడిపోయాడు’’ - పక్కింటి పిల్లలిద్దరూ ఎక్కడ ఛాన్స్‌ మిస్సవుతామోనన్నట్టు పోటాపోటీగా సిద్ధూ పడిపోయిన

విధానాన్ని విశదీకరించారు.

‘‘ఈ వసుధే, ఆ కాయ కావాలంది’’ చెల్లెలన్న వలపక్షం ఏమాత్రం లేకుండా పదేళ్ళ వసుధకేసి వేలు చూపిస్తూ నేరారోపణ చేశాడు చైతు. వీళ్ళిద్దరూ చిన్నామె హేమంత పిల్లలు.

‘‘ఉహు... ఉహు...’’ తప్పించుకోవటమెలాగో తెలీక బిక్కమొహం పెట్టింది వసుధ.

ఉరిమి చూసింది కొడుకు వంక హేమంత- ‘ఎప్పుడేం చెప్పకూడదో కూడా తెలీదు వెధవకి.’

‘‘మీ దుంపతెగ. ఎలా పడ్డాడో ఎందుకు పడ్డాడో తరవాత విచారణ చెయ్యొచ్చు. ముందు వాడి సంగతి చూడండీ’’ వంటింటి గుమ్మంలో నుంచుని ఆదుర్దాపడుతూ హెచ్చరిస్తోంది రాజేశ్వరమ్మ.

అప్పటికింకా పడినవాడు లేవలేదు. ‘‘వెధవా, పెద్ద వీరుళ్ళా అందరి కోరికలూ తీర్చటానికి బయల్దేరావ్‌. ఎన్నిసార్లు చెప్పాను చెట్లెక్కొద్దని. తాటతీస్తా లోపలికి పద’’ మండిపడుతూ విసురుగా కొడుకు రెక్క పట్టుకు లేవదీయబోయింది శమంత.

ఒంటిమీద చెయ్యి వేయగానే గిలగిల్లాడుతూ బొబ్బలు పెట్టాడు సిద్ధూ.

‘‘అమ్మో, వీడికి చెయ్యో కాలో విరిగినట్టుంది.’’

* * *

ఔను, మోకాలి దగ్గర ఎముక ఫ్రాక్చరయింది సిద్ధూకి. ఇక ఆస్పత్రికి పరుగులు పెట్టడం, ఎక్స్‌రేలూ, కట్టు కట్టించడం, డబ్బు వదిలించుకోవటం- ఇవన్నీ ఆ తరవాతి టెన్షన్‌ పర్వంలోని విశేషాలు. అయిదు వారాలు కదలనివ్వకూడదన్న డాక్టర్ల తీర్పు తీసుకుని ఇంటికి వచ్చారు.

మర్నాడు ఆదివారం. రాజేశ్వరమ్మగారి పెద్దకొడుకు చక్రపాణిగారి భాగంలో కుటుంబసభ్యుల అత్యవసర సమావేశం.

చర్చాంశం- పిల్లల్ని అదుపులో పెట్టడం ఎలా?

ఇంటికి పెద్ద తలకాయ రాజేశ్వరమ్మ. ఇంట్లో ఉన్న కుర్చీల్లోకెల్లా పెద్దదాన్లో కూర్చుంది. ఆవిడకు తెలుసు- ఆ కుర్చీ మినహా తనకక్కడ విలువేమీలేదని. వూరికే ‘పెద్దల్ని గౌరవిస్తున్నాం’ అనే ఆత్మసంతృప్తి కోసం తననక్కడ

కుదేస్తారనీ, తన సలహాలు వాళ్ళకేమీ నచ్చవనీ.

‘‘ఈ సిద్ధూగాడితో చావొచ్చిపడింది. ఈ నెలాఖరు రోజుల్లో ఎంత ఖర్చు నెత్తిమీదికి తెచ్చాడో చూడండి’’ నుదురు కొట్టుకుంటూ ప్రారంభం చేసింది శమంత.

‘‘ఒక్క సిద్ధూనే ఏమిటి? ఎవరిక్కడ తక్కువ తిన్నారని? కిందటి నెల్లోనేగా బొమ్మలు బొమ్మలంటూ ఈ వసుధ కొబ్బరాకులు చీరుతూ బొటనవేలు గోరూడగొట్టుకుందీ. అది సెప్టిక్కయి నెల్లాళ్ళు ఆస్పత్రుల చుట్టూరా తిరగలా.’’

మామూలుగా అయితే తోటికోడళ్ళిద్దరూ ఉప్పూ నిప్పేగానీ ఇలాంటి విషయాల్లో చక్కగా ఒకటయిపోతుంటారు.

‘‘మరె, ఎన్నని చెప్పుకుంటాం. పెరట్లో చెట్లుండటం కాదుగానీ ఒకటి మరిచిపోయేలోపు ఇంకో ఉపద్రవం తీసుకురానే వస్తున్నారీ పిల్లరాక్షసులు. మొన్నమొన్నేగా మధుగాడు కొబ్బరిచెట్టు మొదట్లో కనిపించిందని తేలుపిల్ల కొండికి దారం కట్టి ఇంట్లోదాకా తెచ్చాడు. అది కుట్టుంటే ఏమయ్యేది? ఇవాళేమో సిద్ధూగాడు తీరిగ్గా కూచుని చెట్టెక్కి, కాలు విరగ్గొట్టుకున్నాడు. అసలే పదో తరగతి... నెల్లాళ్ళు స్కూలు గోవిందా’’ విసుగంతా మొహంలో చూపిస్తూ బారెడు నిట్టూర్చింది శమంత.

‘చెట్లూ పెరడూ అంటూ దార్లోకి తెస్తున్నారు మాటల్ని’ లోలోపలే ఉస్సురనుకుంది రాజేశ్వరమ్మ.

‘‘మన పిల్లలయితే సరే. మన చెట్టూ, మన పిల్లలూ, మన ఖర్మా అని సరిపెట్టుకుంటాం. సెలవొచ్చిందంటే చాలు... చుట్టుపక్కల పిల్లలందరూ మన పెరట్లోనే మకామయ్యె. అల్లరల్లరీ, గోలగోలా... వద్దనటానికి లేదు. ఇరుగూ పొరుగాయె... మొహమాటం. వాళ్ళే దెబ్బో తగిలించుకున్నప్పుడల్లా కంప్లైంట్లూ తగూలూ నిష్ఠూరాలూ... వెధవది పెద్ద తలనొప్పయిపోయింది.’’

‘చెట్లవల్లే తప్ప పిల్లలింకే రకంగానూ గొడవలు తేరుగావును’ బలహీనంగా గొణుక్కుంది రాజేశ్వరమ్మ.

‘‘మొన్నొచ్చిన తుఫానప్పుడూ...’’ మామిడిచెట్టు కొమ్మొకటి విరిగిపడి పక్కింటివాళ్ళ వసారా సిమెంటు రేకులు విరిగిపోయి ముక్కలవటం వల్ల ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చిందో జ్ఞాపకం చేసి, ఆ చెట్ల మూలంగా తామెంత కష్టనష్టాల పాలవుతున్నారో చెప్పాలనే హేమంత తాపత్రయానికి ‘సరే, సరే’ అంటూ ఆనకట్టవేశాడు సుదర్శనం.

లేకపోతే చిన్న విషయానికైనా చిలవలూ పలవలూ జోడించి ఆపకుండా గంట మాట్లాడగలదు తన భార్య అని తెలుసతనికి.

‘‘ఇంతకీ ఏం చేద్దామంటావురా చిన్నా?’’ తమ్ముడి మద్దతు అవసరమైనప్పుడు ఇలాగే ముద్దుగా సంభోదిస్తూ ఉంటాడు చక్రపాణి.

‘‘ఏవుందీ... మనం ఏదన్నా చెప్పినా అమ్మ వినదుగా. పోనీ ఆవిడ చెప్పినట్టే పెరట్లో చెట్లున్న స్థలందాకా గోడ కట్టించేద్దాం’’ ఒక నిష్ఠూర వీక్షణం తల్లివైపు విసిరి అన్నాడు సుదర్శనం.

‘‘ఆహా, ఎంత తెలివైన సలహానో! ఏదో సామెత చెప్పినట్టు... వెనకటికెవడో మీలాంటివాడే కొబ్బరిచెట్టుకి మడి పంచె ఆరేసి, దొంగొచ్చి మడి పంచె ముట్టుకోకుండా కాయలెలా తెంపుకెడతాడో చూస్తానన్నాట్ట. సరాసరి చెట్టెక్కకుండా గోడా, నిచ్చెనా కూడా ఏర్పాటుచేయండి వాళ్ళకి’’ అంది హేమంత వెటకారంగా.

‘‘మరేం చేయమంటావ్‌... చెట్ల మాటెత్తితే చాలు... అమ్మ ఎమోషనల్‌ డైలాగులతో మనల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తుందయ్యె. ఇక నాకొక్కటే మార్గం కనిపిస్తోందన్నయ్యా.’’

‘‘చెప్పు’’

‘‘పిల్లల్ని హాస్టల్లో చేర్పించేద్దాం. ఏ పండక్కో వస్తారు. నాల్రోజులు చుట్టాల్లా ఉండెళ్ళిపోతారు. ఆ నాలుగు రోజులూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు.’’

ఆలోచిస్తున్నట్టో విచారిస్తున్నట్టో అయిదు నిమిషాలపాటు అందరూ మౌనంగా ఉండిపోయారు.

చివరికి పొడుగ్గా ఓ శ్వాస పీల్చి వదిలి ‘‘అదే మంచిదనుకుంటా’’ అన్నాడు చక్రపాణి గత్యంతరంలేక, ఆ నిర్ణయానికి ఒప్పుకున్నట్టు.

‘‘హ్హు... ఇక నాలుగేళ్ళుపోతే పైచదువులూ ఉద్యోగాలూ అంటూ మనల్నొదిలి ఎలాగూ వెళ్ళిపోతారు పిల్లలు. కనీసం ఈ నాల్రోజులైనా వాళ్ళకి మంచీ చెడ్డా నేర్పుకోటానికీ అచ్చటా ముచ్చటా చూసుకోటానికీ ప్రాప్తంలేదు మనకి. ఏమిటో- పిల్లలకంటే మనకా మాయదారి చెట్లే ఎక్కువైపోయాయి. ఏం చేస్తాం, కానివ్వండి’’ ఏడుపు గొంతుతో తడిలేని కళ్ళు వత్తుకుంది శమంత.

సభ ముగిసి లేవబోతూ ‘‘సరే, రేపు వాళ్ళ స్కూలుకి వెళ్ళి ప్రిన్సిపాల్‌తో మాట్లాడి వస్తాను’’ అన్నాడు చక్రపాణి.

‘‘వద్దు’’ మొదటిసారి నోరు విప్పింది రాజేశ్వరమ్మ. పెదాలు వణుకుతున్నాయి ఆవిడకు.

‘‘వద్దురా, పిల్లలు కనబడకపోతే నేనుండలేను.’’

‘‘మరి, అవ్వా కావాలీ బువ్వా కావాలీ అంటే...’’

‘‘చెట్లే తీసేయండి’’ అన్నదావిడ కుర్చీలోంచి లేస్తూ. గుమ్మం దాటి వెళ్ళబోతూ చూసింది- అనుకున్నది సాధించుకున్న ఉత్సాహంలో నుదుటి చిట్లింపులు పోయి కళకళ్ళాడిపోతున్నాయి కొడుకూ కోడళ్ళ మొహాలు.

చివుక్కుమన్నదావిడ మనసు. ‘తన మమకారానికీ, అనుభూతులకీ ఏ విలువా ఇవ్వరా వీళ్ళు?’

రాజేశ్వరమ్మ మౌనంగా దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది. మనసు కుదుటపడ్డానికి ‘రామకోటి’ రాసుకోవడం మొదలుపెట్టింది. వేళ్ళేమో అలవాటుగా ‘శ్రీరామ శ్రీరామ’ అని దిద్దుతున్నాయే కానీ, మనసెక్కడో-

కొడుకులు లేని కారణంగా తండ్రి తన పరంచేసి పోయిన వెయ్యి గజాల స్థలమది. ముందువైపు కొంత జాగాలో భర్త ఇల్లు కట్టించారు. మిగతాదంతా తన ఇష్టారాజ్యమే! ఎన్నో మొక్కలు వేసుకున్నదక్కడ. మొక్కనాటి, నీళ్ళు పోసి, బాసటగా ఓ కర్ర గుచ్చడం కాణ్ణించీ... అన్నీ గుర్తున్నాయి తనకి. నాటిన ప్రతి మొక్క వెనకా ఒక జ్ఞాపకం దాక్కునుంది. ఆ తెల్ల గులాబీ మామిడిచెట్టు పచ్చడికి రుచిగా ఉంటుందని తల్లి శ్రమపడి సేకరించి తెచ్చిచ్చిన మొక్క, గంగాబొండాల కొబ్బరిచెట్టు అనంతపురంలో ఉంటే తన మేనమామ తెచ్చిచ్చినవి, ఆ పాల సపోటా చెట్టూ, ఆ కలకత్తా జామచెట్టూ తన స్నేహితురాలు ఉమ అత్తవారింటికి వెళ్ళిపోతూ తను గుర్తుండిపోయేలా నాటి వెళ్ళినవి.

దోమలు రాకుండా ఉంటాయంటూ కొంతమేర తులసీవనం, పడగ్గదులు ఘుమఘుమలాడాలంటూ కిటికీల దగ్గర నైట్‌క్వీనూ వేశారు తన భర్త. ఈశాన్యం మూల రావిచెట్టూ, వేపచెట్టూ కలిపి వేసి, ప్రతి పర్వదినాన వాటి దగ్గరే వైభవంగా పూజలు జరిపేవారు తన అత్తగారు.

ఒంట్లో ఓపికా మనసులో ఉత్సాహం ఉన్న ఆ వెనకటి రోజుల్లో రకరకాల పూలమొక్కలు పాతుకుంది. ఉదయాన్నే పెరట్లోకొస్తే కొమ్మకొమ్మకీ పువ్వులు విరబూసి వనదేవత విరగబడి నవ్వుతున్నట్టుండేది. కూరగాయలైతే తాము వాడుకోగా ఇరుగూపొరుక్కి పంచిపెట్టేటన్ని మిగిలేవి.

ఇప్పుడవేమీలేవ్‌. కోడళ్ళు ఈ కాలపు మహిళామణులు. వాళ్ళ కాలక్షేపాలూ ఉద్దేశాలూ వేరు. చేతికి మట్టంటనివ్వరు. ‘వెధవ చాకిరీ, పది రూపాయలు పడేస్తే కావాల్సినన్ని పూలు. పాతిక విసిరేస్తే ఇష్టమొచ్చిన కూర...’ ఇలాంటి అభిప్రాయాలతో నిర్లక్ష్యాలతో చిన్నపాదులూ పొదలూ మొక్కలూ అంతరించిపోయినయ్‌.

మిగిలినవి ఆ పెద్ద చెట్లే. భర్త పోయాక కొడుకులు ఇల్లు పంచుకుని విడిపోతామంటే వాళ్ళ తగవులు వినలేక సరేనంది. పెరటి కొలతలు తీస్తుంటే మాత్రం అడ్డంపడింది - చెట్లు ముట్టుకోవద్దంది. ఇల్లు తనపేర ఉండటం నుంచి సాహసించి వాళ్ళూ ఏమీ అనలేకపోయారు. కాకపోతే వాళ్ళ పథకాలేమిటో తనకు తెలుసు. వాళ్ళు బైటపెట్టరు, తను అడగదు.

కోడళ్ళు అప్పట్నుంచే తనమీద ప్రచ్ఛన్నయుద్ధం మొదలుపెట్టారు. చెట్లకింద ఆకులు తెగ రాల్తున్నాయంటారు, వూడ్చీవూడ్చీ ఎత్తీఎత్తీ నడుములు పట్టేస్తున్నాయంటారు, భుజాలు విరిగిపోతున్నాయంటారు. పనిమనిషిని పెట్టుకోవటానికీ వందలూ వేలూ పొయ్యటానికీ మనమేమన్నా కోటీశ్వరులమా అంటారు. పిచ్చిమొక్కలు పెరిగిపోయి తేళ్ళూ జెర్రులూ చెప్పకుండా వచ్చేసే దగ్గర చుట్టాలయిపోతున్నాయంటారు. ఈ చెట్లు పిల్లలపాలిట గండాలయిపోతున్నాయంటారు. చిట్టచివర్న ఈ పనికిమాలిన చెట్లు తీసేస్తే దొడ్డి శుభ్రంగా హాయిగా ఉండునని తేలుస్తారు.

తను తెలీనట్టుండిపోతే వీటిమీద ఈవిడకెందుకో ఇంత వ్యామోహం అని సణుగుతారు.

వాళ్ళకేం తెలుస్తుంది- ఈ చెట్ల నీడ తనకిచ్చే స్వాంతన, పాత స్మృతుల తీయదనం. ఇప్పటికీ పోయినవిపోగా పొరపాటున ఏ చెట్టు మొదట్లోనో మిగిలిపోయిన ఏ చంద్రకాంతమొక్కో పూచి తనని చూసి నవ్వుతుంది. తను చెరిగిన చేటలోంచి ఎగిరిపడిన ఏ దనియం గింజో మొలకెత్తి తనని పలకరిస్తుంది. ఏ ఖరీదైన వస్తువూ తనకివ్వలేని ఆనందాన్ని అవి తనకందిస్తాయి.

ఇప్పుడు తిరుగులేని అస్త్రం ప్రయోగించారు. అడ్డాల్లో ఉండే తన బిడ్డలు గడ్డాలొచ్చి దూరం జరిగారు. అసలుకంటే వడ్డీ ముద్దన్నట్టు వాళ్ళ పిల్లలు తన సర్వస్వమిప్పుడు. తన పంచప్రాణాలు వాళ్ళు. ఈ శేష జీవితానికి అర్థం, ఆలంబన వాళ్ళే.

తను తీసే మజ్జిగలో వెన్న వాళ్ళకే. తన కంచంలో గోరుగుజ్జు వాళ్ళకే. పండగల్లోని అంతరార్థాల్లో, సామెతల్లోని పూర్వాపరాల్లో, కాశీమజిలీలూ విక్రమార్క సాహసాలూ... తను ఏం చెబుతున్నా చుట్టూచేరి తనకీ ఓ విలువుందనిపించేలా, తన అరకొర సాహిత్యాన్నే అద్భుతమన్నట్టు కళ్ళు పెద్దవి చేసుకుని, చెవులప్పగించి వినేది వాళ్ళే.

వాళ్ళు వెళ్ళిపోతే బతుకుమీద ఆశ చచ్చిపోదూ- తను సరైన నిర్ణయమే తీసుకుంది.

రామకోటి మూసి ఓ నమస్కారం చేసి పెరట్లోకి వచ్చింది రాజేశ్వరమ్మ. తీరా చెట్లన్నీ గాలికి వూగుతూ ‘మాకు తిలోదకాలు వదిలేస్తున్నావా రాజమ్మా’ అంటున్నట్టనిపించేసరికి ఉలిక్కిపడింది.‘తన చేతిలో ఏముంది... ఏం చేయగలదు తను?’ ఉన్నట్టుండి అదోలాంటి నీరసం, నిస్సహాయత, విరక్తి ఒళ్ళంతా ఆక్రమించేశాయి. ‘అన్నిటినీ వదులుకుని పైకెళ్ళిపోయే ఈ వయసులో ఇంకా మనవల మీదా మానుల మీదా భ్రమలేమిటి నాకు. వద్దు, ఎవరూ వద్దు... ఏదీ వద్దు.’

* * *

‘‘ఈ ప్లాను చూడు తమ్ముడూ, ఈ స్థలమంతా ఉత్తినే పడుంటమెందుకని నిన్ననే వేయించాను. నాకొచ్చే స్థలంలో అపార్ట్‌మెంట్స్‌ మోడల్లో ఇలా నాలుగు ఫ్లాట్లు వేద్దామనుకుంటున్నాను. ఆఫీసులో లోనుక్కూడా అప్లై చేశాను’’ పరమోత్సాహంతో తమ్ముడికి ప్లాన్‌ ఉన్న షీటు అందించాడు చక్రపాణి.

‘‘చాలా బావుంది. నాకు మాత్రం నీ అంత ఓపికలేదన్నయ్యా. నాలుగ్గోడలు లేపి గోడౌను కట్టించి రెంటు కిచ్చేద్దామనుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల గోడౌన్లకి గిరాకీ పెరిగిందీ మధ్య’’ అన్నాడు సుదర్శనం.

శుభస్య శీఘ్రమని రెండురోజులక్రితమే పెరటి స్థలం కొలతలు వేయించారు. అప్పుడే అడిగింది రాజేశ్వరమ్మ- తనకు తెలిసినావిడ ఒకరు యాత్రా స్పెషల్‌లో తీర్థయాత్రలకు వెడుతోందట.

‘‘ఎప్పట్నుంచో పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలని కోరిక. నాకో టికెట్‌ రిజర్వ్‌ చేయించరా నాయనా’’ అని.

చెట్లు కొట్టేసేటప్పుడు ఆవిడ ఉండటంకంటే యాత్రలకు పంపడమే మంచిదని తోచి సరేనంటూ తల వూపేశాడు చక్రపాణి.

మౌనంగా సంచిలో బట్టలు సర్దుకుంటున్న బామ్మను నిస్సహాయంగా చూస్తున్నారు పిల్లలు. ఆమె కళ్ళల్లోని తడి వాళ్ళ గుండెల్ని తాకుతోంది.

అన్నదమ్ములిద్దరూ కాగితాలు ముందేసుకుని ఖర్చులూ లాభాలూ బేరీజు వేసుకుంటుంటే, ముగ్గురు మగపిల్లలూ కలిసికట్టుగా వచ్చి ముందు నుంచున్నారు. కాస్త దూరంలో వసుధ పులుకూ పులుకూ చూస్తోంది.

‘‘నాన్నా, చిన్నాన్నా, మాది ఓ రిక్వెస్ట్‌.’’

ఆశ్చర్యంగా కాస్త అనుమానంగా తలెత్తారు చక్రపాణీ, సుదర్శనం.

‘వీళ్ళు ఏ టెన్నిస్‌ కోర్టుకో, వాలీబాల్‌ ఆడ్డానికో ప్లేస్‌ మిగల్చమనరు కదా!?’

‘‘మాకీ తోటతో ప్రాణస్నేహం. తోటలోని చెట్లన్నీ కొట్టించేయాలని మీరు నిర్ణయించుకుంటే- బామ్మని కాశీ పంపించటంతోపాటు దయచేసి మమ్మల్నీ హాస్టల్‌కి పంపించేయండి. చెట్లు కొట్టేస్తే మేం ఈ ఇంట్లో ఉండంగాక ఉండం’’ చేతులు జోడించి- మెత్తగానే అయినా కచ్చితంగా చెబుతున్న వాళ్ళని చూస్తూ అవాక్కయ్యారు చక్రపాణీ, సుదర్శనం- ఆ వెనకాలే ఉన్న వారి భార్యామణులూను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.