close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చంద్రుడి మీదకి వెళ్లొచ్చినట్లే ఉంది..!

చంద్రుడి మీదకి వెళ్లొచ్చినట్లే ఉంది..!

బెంగళూరు నుంచి దిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడనుంచి మరో విమానంలో 1325 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్‌ లద్దాఖ్‌కు గంటలో చేరుకున్నాం. లేహ్‌ అనేది జస్కర్‌, లద్దాఖ్‌ పర్వతశ్రేణుల మధ్య ఉన్న లోయ. ఇది చైనా, టిబెట్‌ సరిహద్దులో ఉంది.

ఆక్సిజన్‌ అందలేదు!
హిమాలయ పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి 3,500 వేల అడుగుల ఎత్తులోని లేహ్‌కి చేరగానే వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి కొంత ఇబ్బందికి గురయ్యాం. దీన్ని ఎక్యూట్‌ మౌంటెయిన్‌ సిక్‌నెస్‌గా పిలుస్తారు. అందుకే పర్వతారోహకులను రెండుమూడురోజులు వాతావరణానికి అలవాటుపడేవరకూ ఆ ప్రాంతంలోనే ఉంచుతారు. దాంతో మేం మూడురోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లద్దాఖ్‌లోని ప్రాంతాలన్నీ తిరిగాం. పట్టణంలోని ప్రధాన బజారుకి వెనకగా ఉన్న చాంగ్‌ గలి అనే రోడ్డులోని చిన్న దుకాణాల్లో ముత్యాలూ పగడాలూ లాపిస్‌ లాజులి వంటి రత్నాలూ బాగా దొరుకుతాయి. ఒకరోజు సాయంత్రం జపాన్‌వాళ్లు నిర్మించిన చాంగ్స్‌ పా అనే శాంతి స్థూపాన్ని దర్శించాం. దీన్ని 1985లో దలైలామా ప్రారంభించారట. ఇది తెలుపురంగులో అద్భుతంగా ఉంది. రాత్రివేళ లైట్లలో అందంగా మెరుస్తూ కనిపించింది. దీన్ని చూడ్డానికి అనేకమంది సందర్శకులు ఏటా లద్దాఖ్‌ను సందర్శిస్తుంటారట.

నాలుగోరోజు లామాయురు - చిల్లింగ్‌ ట్రెక్‌కు బయలుదేరాం. లేహ్‌ పట్టణంలో ట్రెక్కింగ్‌కు సంబంధించిన ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. మేం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడంతో అక్కడకు వెళ్లగానే ఆ ఏజెన్సీకి వెళ్లి రిపోర్టు చేశాం. వాళ్లు మాకు గైడ్లనీ వంటమనిషినీ సామాన్లు చూసుకునే కేర్‌ టేకర్‌నీ ఏర్పాటుచేశారు. వాళ్లు మాకోసం కూరలూ వంటసామాన్లూ టెంట్లూ అన్నీ తీసుకుని మాతోపాటు బయలుదేరారు. సామాన్లు మోసేందుకు కంచరగాడిదలూ పొట్టి గుర్రాలూ కూడా తీసుకొచ్చారు. ఈ సామాన్లు వేసుకుని వంటమనిషీ కేర్‌టేకరూ మాకన్నా ముందుగానే వెళ్లిపోయేవారు. మేం చేరాల్సిన మజిలీకి ముందుగానే చేరుకుని టెంట్లు వేసి వంటలు చేసి ఉండేవారు.

సరస్సు మాయమైంది!
ముందుగా లేహ్‌ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లామాయురు అనే ప్రాంతానికి చేరుకున్నాం. నిజానికి ఈ లామాయురు అనేది ఒకప్పుడు పెద్ద సరస్సు అనీ లాట్సొవా నరోపా అనే బౌద్ధగురువు చేతి మహిమతో ఆ సరస్సు అంతర్థానమైందనీ చెబుతారు. ఇక్కడే పదో శతాబ్దంలో రింకె జాంగ్పొ స్థాపించిన బౌద్ధారామాన్నీ సందర్శించాం. లద్దాఖ్‌ ప్రాంతంలోకెల్లా పురాతనమైనది ఇదే. ఈ ట్రెక్‌లో హిమాలయాల సౌందర్యాన్నే కాదు, బౌద్ధారామాల్నీ అక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్నీ పరిశీలించవచ్చు.

బౌద్ధారామాన్ని సందర్శించాక గైడ్‌ సహాయంతో పర్వతారోహణ ప్రారంభించాం. ఆ కొండల్లో అన్నీ మెలికల దారులే. వాటి వెంబడి నడుచుకుంటూ వెళ్లాం. కొంతవరకూ తారురోడ్లూ మరికొంత మట్టిరోడ్లూ ఉన్నాయి. అక్కడ ఉన్న కొండల్ని చూస్తుంటే మాకేదో చంద్రగ్రహంమీద నడుస్తున్నామా అనిపించింది. అందుకేనేమో వాటిని మూన్‌ స్కేప్‌ అంటారట. నడక మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉన్నా కొంతసేపటికి ఆయాసం రావడంతో మెల్లగా వేగం తగ్గించాం. అలా కాసేపు వేగంగానూ మరికాసేపు నెమ్మదిగానూ నడుస్తూ 3750 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రింక్టి లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం.

అక్కడ నుంచి మళ్లీ సన్నని దారిలో కిందకు దిగుతూ షిల్లా అనే గ్రామం మీదుగా నడుస్తూ 3160 మీటర్లలోని వాన్లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. మేం అక్కడకు చేరుకునేసరికి టెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బాగా అలసిపోవడంవల్ల వెంటనే నిద్రపట్టేసింది. తరవాతిరోజు పొద్దునే అల్పాహారం తిని మళ్లీ నడక మొదలుపెట్టాం. దారిలో ఫెంజిల్లా, ఉరి అనే గ్రామాల మీదుగా 3740 మీటర్ల ఎత్తులోని హింజు అనే గ్రామానికి చేరుకుని ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాం.

మూడోరోజు ఉదయాన్నే హింజు నుంచి 4950 మీటర్ల ఎత్తులోని కాంజెస్కి లా అనే ప్రాంతానికి ఎక్కాం. మా పర్వతారోహణలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఇదే. అక్కడ నుంచి చూస్తే మేఘాలు కొండ శిఖరాన్ని తాకుతున్నాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అనిపించింది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని తరవాతిరోజు ఉదయాన్నే కాంజెస్కి లా నుంచి 3810 మీటర్ల ఎత్తుకి దిగాం. అక్కడక్కడా ఎత్తైన మంచు శిఖరాల మీద నుంచి జాలువారే నదీపాయల్ని దాటుకుంటూ సుందా చెన్‌మో అనే గ్రామానికి చేరుకున్నాం. ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అడవి గులాబీలు తలలూపుతూ స్వాగతిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ దారిలో మాకు జడలబర్రెలూ వాటిని మేపే వాళ్ల గుడిసెలూ కనిపించాయి.

ఆ తరవాతి మజిలీ లానాఖ్‌ లా... అది 4370 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పైకి ఎక్కుతూ 4820 మీటర్ల ఎత్తులోని డూంగ్‌ డూంగ్‌ చాన్‌ లా అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడి నుంచి 3550 మీటర్ల దిగువన ఉన్న లోయలోని చిల్లింగ్‌ అనే ప్రాంతానికి దిగడంతో మా పర్వతారోహణ దిగ్విజయంగా పూర్తయింది. లద్దాఖ్‌ ప్రాంతంలో రాగి, ఇత్తడి, కంచు, వెండి, ఇనుము... వంటి లోహవస్తువులు విక్రయించే మార్కెట్‌ ఉన్న గ్రామం చిల్లింగ్‌ ఒక్కటే. ఆ గ్రామంలో కాసేపు తిరిగి చూశాం. తరవాత జస్కర్‌ నది, సింధూనది కలుసుకునే నిమ్మొ అనే ప్రదేశానికి వెళ్లాం. సింధూనది టిబెట్‌ నుంచి మనదేశంలోని లేహ్‌ పట్టణంగుండా ప్రవహిస్తూ పాకిస్థాన్‌కు చేరుకుని అటునుంచే అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

అన్నీ చెక్క ఆలయాలే!
సింధూనదీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే చిన్నా పెద్దా మొక్కలు కనిపిస్తాయి. మిగిలిన ప్రాంతమంతా ఎడారే. అక్కడ ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్‌, గోధుమ, బార్లీ పంటలు పండిస్తారు. అవే వాళ్ల ప్రధాన ఆహారం. అక్కడక్కడ గడ్డి తుప్పలు కనబడుతూ ఉంటాయి. సింధూనదిలో కనిపించే నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలకు తాగునీరూ సాగునీరూ అన్నీ సింధూ జలాలే. లేహ్‌కి తిరిగివచ్చి అక్కడి ప్రదేశాలన్నీ చూశాం. లేహ్‌ పట్టణమంతా బౌద్ధమతస్తులే. ఇక్కడి ఆలయాలన్నీ చెక్కతో చేసినవే. బుద్ధ విగ్రహాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఆలయాల్లో ఉండే పూజారులను లామాలు అంటారు. లేహ్‌లో 1672 సంవత్సరంలో కట్టిన హెమిస్‌ అనే ఆలయానికి వెళ్లాం. అక్కడినుంచి పదో శతాబ్దంలో నిర్మించిన ఆల్చీ అనే పురాతన ఆలయాన్ని సందర్శించాం. తరవాత పట్టణంలోని పురాతన వస్తుప్రదర్శనశాల చూడ్డానికి వెళ్లాం. అందులో లద్దాఖ్‌కు చెందిన చారిత్రక వస్తువులూ ఆయుధాలూ ఉన్నాయి.

కాలినడకే శరణ్యం!
కార్గిల్‌, లేహ్‌ రెండూ లద్దాఖ్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. లేహ్‌ పట్టణంలో స్కూళ్లూ కాలేజీలూ ఉన్నాయి. అక్కడి పర్వతశ్రేణుల్లో కూడా ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా దిగువన ఉన్న ప్రదేశాల్లో చిన్న గ్రామాలు చాలానే ఉన్నాయి. హింజు, వాన్లా... వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి. ఆయా గ్రామాల్లో ఇళ్ల సంఖ్య పదీ ఇరవైకి మించదు. జడలబర్రె, కుందేళ్లను పోలిన మార్‌మోట్‌, జింకలూ పష్మీనా గొర్రెల్నీ ఎక్కువగా పెంచుతారు. పష్మీనా గొర్రెల నుంచి తీసిన వూలు చాలా ఖరీదు. దాంతో వాళ్లు శాలువాలూ స్వెట్టర్లూ అల్లి విక్రయిస్తుంటారు. అదే వాళ్ల ప్రధాన ఆదాయం.

అక్కడ ప్రతి గ్రామంలోనూ ధర్మచక్ర అనే ప్రార్థనా చక్రాలు ఉంటాయి. వూళ్లలో చిన్న చిన్న స్కూళ్లు ఉన్నాయి కానీ కాలేజీ చదువుకి మాత్రం లేహ్‌కి రావాల్సిందే. కొండ ప్రాంతాలనుంచి కిందకి రావాలంటే కాళ్లే వాళ్లకి వాహనాలు. కిందకు వచ్చి కూరలూ సరుకులూ తీసుకెళుతుంటారు. సువాసన భరితమైన పూలు అక్కడ చాలానే దొరుకుతాయి. వాటితో అగరబత్తీలు తయారుచేస్తుంటారు.

తరవాతి రోజు టిబెట్‌ సరిహద్దులో ఉన్న పాన్‌గాంగ్‌ అనే సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఆ సరస్సు 4267 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉంది. లేహ్‌ నుంచి ఐదు గంటలు ప్రయాణం చేసి ఆ సరస్సుకి చేరుకున్నాం. అందులో సగ భాగం భారతదేశంలోనూ మిగిలిన సగం టిబెట్‌ ప్రాంతంలోనూ ఉంది. ఆ సరస్సు అందాన్ని మాటల్లో వర్ణించలేం. అందులోని నీరు సూర్యకాంతిని అనుసరించి రంగులు మారుతుంటుంది. వూదారంగు నుంచి ఆకుపచ్చా, నీలం రంగుల్లోకి మారుతూ సందర్శకుల్ని మరోలోకంలో విహరింపజేస్తుంది. ఆ సరస్సుకి వెళ్లే దారిలోనే చాంగ్లా అనే ప్రాంతం వస్తుంది. అది ప్రపంచంలోనే వాహనాలు వెళ్లే మూడో ఎత్తైన రోడ్డు. చాంగ్లా ప్రాంతంలో ఓ కేఫెటేరియా ఉంది. అక్కడ కాస్సేపు ఆగి టీ తాగాం. అక్కడే తుక్వా అనే ఓ వంటకాన్నీ రుచి చూశాం. మరో రోజు లేహ్‌కి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్దుంగ్‌ లా పాస్‌కీ వెళ్ళొచ్చాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు.

విద్యార్థులే గైడ్లు!
ఈ యాత్రలో గైడ్లూ కేర్‌టేకరూ మాకు అందించిన సహకారం మర్చిపోలేనిది. మా పర్వతారోహణ విజయవంతంగా ముగించడానికి వాళ్లే కారణం. ఉదయాన్నే వంటచేసి బాక్సుల్లో పెట్టి ఇచ్చేవారు. మేం బయలుదేరే సమయానికి టిఫెన్‌ రెడీ చేసి అందించేవారు. మళ్లీ రాత్రికి మేం చేరబోయే ప్రాంతానికి మాకన్నా ముందే వెళ్లి టెంట్లు వేసి వంటలు చేసి తయారుగా ఉంచేవారు. అక్కడ ఎక్కువగా చదువుకునే విద్యార్థులే గైడ్లుగా పనిచేస్తారు. ట్రెక్కింగ్‌ ఏజెన్సీల ద్వారా ఈ ఏర్పాటు చేసుకుని చదువుకి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వివిధ ప్రాంతాల యాత్రికులతో కలిసి తిరగడంవల్ల వాళ్లు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటుంటారు. ఆయా వ్యక్తుల ఆచార వ్యవహారాలూ జీవన విధానాలూ అన్నీ తెలుసుకుంటారు. రకరకాల భాషలు నేర్చుకుని ఏ రాష్ట్రం వారితో ఆ భాషలో మాట్లాడుతున్న పిల్లలను చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంతేకాదు, మాకు వండిపెట్టే వ్యక్తి పాకశాస్త్ర నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాం. ఉదయాన్నే ఉడికించిన గుడ్లూ అరటిపండ్లూ ఆలూపరాటాలూ అల్పాహారంగా ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజనానికి ఉడికిన బంగాళాదుంపలూ శాండ్‌విచ్‌లూ చాక్లెట్లూ ఫ్రూటీలూ బాక్సుల్లో అందించేవారు.

పగలంతా కొండలు ఎక్కీ దిగీ బాగా అలసిపోయి రాత్రికి మజిలీకి చేరుకునేసరికి వేడి వేడి అన్నమూ పప్పూ పన్నీరుతో కూరా పండ్లూ ఇచ్చేవారు. అవన్నీ తృప్తిగా తిని, అప్పటికే పక్కలు వేసి సిద్ధంగా ఉంచిన టెంట్లలో హాయిగా నిద్రపోయేవాళ్లం. ఆ విధంగా వాళ్ల సహకారంతో మా ట్రెక్కింగ్‌ను దిగ్విజయంగా పూర్తిచేసుకోగలిగాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.