close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘అక్షయపాత్ర’లో... నేనో పాత్రధారినే!

‘అక్షయపాత్ర’లో... నేనో పాత్రధారినే!

కురుక్షేత్రం...
అర్జునుడు అయోమయంలో ఉన్నాడు. ధైర్యంగా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాడు. ఆ అనిశ్చితినీ భయాన్నీ తన సందేశంతో పోగొట్టాడు గీతాచార్యుడు.
శ్రీకృష్ణ ఉవాచ: యోగస్థః కురు కర్మాణి...జయాపజయాల మీద ఆసక్తి లేకుండా సమభావనతో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అదే యోగమంటే!

* * *

బెంగళూరులోని... అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్‌) ఆలయం.
మధుపండిత్‌ స్వామీజీకి ఆ కాగితం మీద అక్షరాలు కనిపించడం లేదు, అమాయకులైన పసివాళ్ల మొహాలే దర్శనమిస్తున్నాయి. మహానగరంలో వేలమంది చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు, పోషక విలువల లోపంతో బాధపడుతున్నారు. చిన్నికృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెనవేలితో ఎత్తిన కథల్ని పరవశంగా చెప్పుకుంటాం. నిరుపేద చిన్నారులకు మాత్రం, ఓమోస్తరు బరువైన పుస్తకాల సంచిని కూడా భుజానికి ఎత్తుకునేంత సత్తువ ఉండదు. బాల్యానికి ఇన్ని అవస్థలెందుకు!

- రెండు నెలలుగా సాగుతోందా అంతర్మథనం. అది పదిహేను వందలమంది బడి పిల్లల మధ్యాహ్న భోజనానికి సంబంధించిన దస్త్రం. అప్పటిదాకా ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు. సంతకం చేయడానికి కలాన్ని బయటికి తీసిన ప్రతిసారీ, ఇస్కాన్‌ ఆర్థిక పరిమితులు గుర్తుకొస్తాయి. నిధుల కొరత భయపెడుతుంది. అలా అని, తిరస్కరించడానికి మనసొప్పడం లేదు. కర్తవ్యబోధ చేయమంటూ, కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడిని వేడుకున్న అర్జునుడిలా...ఇస్కాన్‌ వ్యవస్థాపకులైన ప్రభుపాదుల్ని ప్రార్థించారు మధుపండిత్‌జీ. ‘కృష్ణుడే సకల సృష్టికీ ఆధారం అయినప్పుడు, నీకెందుకు సంకోచం? ఏ మాత్రం సంశయించినా, కృష్ణుడి మీద నీకు పరిపూర్ణ విశ్వాసం లేనట్టే. ప్రపంచమంతా వచ్చి పంక్తిలో కూర్చున్నా సరే, కడుపునిండా భోజనం పెడదాం. కృష్ణుడే ఆ ఏర్పాట్లన్నీ చేస్తాడు’ - అంటూ ఎదురుగా ఉన్న వర్ణచిత్రంలోంచి

ప్రభుపాదులు ఆదేశిస్తున్న భావన కలిగింది. మరు నిమిషమే, కాళింగుని తలల మీద బాలకృష్ణుడి లయబద్ధమైన అడుగుల్లా...దస్త్రం మీద తీరుగా మధుపండిత్‌జీ సంతకం!

‘ఆ సంతకం కృష్ణుడి సంకల్పం. ఆమాటకొస్తే, నా జీవనయాత్రంతా కృష్ణ సంకల్పమే’ అంటూ ఐఐటీ నుంచి ఇస్కాన్‌ వైపుగా తన ప్రయాణాన్ని వివరిస్తారు మధుపండిత్‌జీ...

* * *

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి సంబంధించినంత వరకూ చదువంటే పరుగే. ఆరునూరైనా అందరికంటే ముందుండాల్సిందే! ప్రాజెక్టులూ పరీక్షలూ వెన్నంటి తరుముతుంటాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలాంటి, వేలమంది విద్యార్థుల్లో నేనూ ఒకడిని. నాకు భౌతికశాస్త్రం అంటే ప్రాణం. దానికో కారణం ఉంది. భౌతికశాస్త్రం సృష్టి లోతుపాతుల్ని చెబుతుంది. అలా అలా...శోధిస్తూపోతే సృష్టికర్త మూలాలు తెలుస్తాయన్న ఆశ.

నాన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో శాస్త్రవేత్త. నాలోని ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించేవారు. నాలుగో తరగతి వరకూ బెంగళూరులో చదువుకున్నా. ఆతర్వాత నాన్నకు త్రివేండ్రంలోని ఇస్రోకు బదిలీ అయ్యింది. దగ్గర్లోనే బ్రిటిష్‌ లైబ్రరీ ఉండేది. అక్కడ ఏ కొత్త ఫిజిక్సు పుస్తకం కనిపించినా, ఇంటికి తెచ్చుకుని చదివేవాడిని. చదరంగం అన్నా ఇష్టమే. జూనియర్స్‌ విభాగంలో, రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌ సాధించాను. పదో తరగతికి రాగానే, కొద్దికాలం పాటూ చదరంగం జోలికి వెళ్లొద్దని నాన్న తేల్చి చెప్పారు. దీంతో చదువుల మీదే దృష్టి పెట్టాను. ఆ ఏడాది గణితంలో నూటికి నూరు మార్కులు సాధించిన అతికొద్దిమంది విద్యార్థుల్లో నేనూ ఒకడిని. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు - నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా స్కాలర్‌షిప్‌ వచ్చింది. ఓ గాజు పదార్థాన్ని వేడి చేసే కొద్దీ, ఆ గాజు బీటలువారే తీరు ఎలా మారుతుందన్న దానిమీద నేనో చిన్నపాటి పరిశోధన చేశాను. అది నిపుణుల బృందానికి నచ్చింది. అప్పట్లో ఐఐటీలూ బిట్స్‌ పిలానీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలూ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామినేషన్‌ విజేతలకు నేరుగా ప్రవేశం కల్పించేవి. నాకు ముంబయి ఐఐటీలో సీటు వచ్చింది. సంతోషంగా చేరిపోయా. కారణం, మళ్లీ ఫిజిక్సే! పెద్ద లైబ్రరీ ఉందక్కడ. పెద్దపెద్ద ప్రొఫెసర్లూ ఉంటారు. చాలా విషయాలు తెలుసుకోవచ్చు. భౌతికశాస్త్రం ప్రధానంగా...ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సును ఎంచుకున్నా.

సృష్టి నుంచి సృష్టికర్త...
నేను అనుకున్నది వేరు. అక్కడ జరుగుతున్నది వేరు. చాలా నిరుత్సాహపడ్డాను. మార్కుల కోసం, గ్రేడుల కోసం ఒకటే పరుగు. ఆ ఆరాటంలో పడిపోయి అసలు చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నానేమో అనిపించింది. నా ఆవేదన ఎవరితో చెప్పుకోవాలి, చెప్పినా ఎవరు మాత్రం అర్థం చేసుకుంటారు? రెండేళ్ల మానసిక సంఘర్షణ తర్వాత...సివిల్‌ ఇంజినీరింగ్‌కు మారిపోయాను. మాకు ఆ వెసులుబాటు ఉండేది. మిగతా చదువులతో పోలిస్తే సివిల్‌ ఇంజినీరింగ్‌కు పోటీ తక్కువ. మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఖాళీ సమయంలో ఫిజిక్స్‌ పుస్తకాలు చదువుకోవచ్చని నా ఆలోచన. క్లాసులు అయిపోవడమే ఆలస్యం, లైబ్రరీకి వెళ్లిపోయేవాడిని. తాళాలు వేసేదాకా...పుస్తకాలే ప్రపంచం.

సృష్టిలోతుల్ని తెలుసుకుంటున్న క్రమంలో ...నా ఆలోచనలు సృష్టికర్త మీద నిలిచాయి. పదార్థం, అణువు, పరమాణువు...సృష్టిలో ప్రతి అమరికా అద్భుతమే! ఎవరో పూనుకుని శ్రద్ధగా నిర్మించినట్టు ప్రకృతిలో ఎంతో సమతౌల్యం కనిపిస్తుంది. చేయితిరిగిన ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి? - అదే ధ్యాస! అవే ఆలోచనలు!! చదువుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాను. పరీక్షల్నీ ప్రాజెక్టుల్నీ పట్టించుకోవడం మానేశాను. తరగతిలో నా ర్యాంకు ఘోరంగా పడిపోయింది. వీటన్నిటి కారణంగా...ఇదీ అని చెప్పలేని అసహనం. ఆ నిస్పృహలో ధూమపానానికి అలవాటు పడ్డాను. నేను చదివిన పాశ్చాత్య ఆధ్యాత్మిక గ్రంథాలేవీ నా అయోమయాన్ని తగ్గించలేకపోయాయి. నేనెవర్ని? సత్యాన్నా? భ్రాంతినా? భ్రాంతిలాంటి సత్యాన్నా? - మనసును తొలిచేస్తున్న ప్రశ్నకు జవాబు తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో చావే నయమన్న నిర్ణయానికొచ్చాను. ఆత్మహత్యకు ముహూర్తం సిద్ధం చేసుకున్నాను. బలహీనమైన మనసు మనిషినెలా తప్పుదారి పట్టిస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

అదే నా జీవితంలో చిట్టచివరి రోజని నిర్ధారించుకున్నాను. తెల్లారేసరికి నేనుండను. ఆ సాయంత్రం కూడా, యథాలాపంగా లైబ్రరీ దిశగా నడిచాను. రోజూ చదివే పుస్తకాల వైపు కాకుండా, కొత్త అరల వైపు తొంగిచూశాను. అది కూడా యథాలాపంగానే. చనిపోవడం ఖాయం అయినప్పుడు, భారమైన గ్రంథాలు చదివి బుర్ర వేడెక్కించుకోవడం ఎందుకు? హాయిగా సాగిపోయే సాహిత్యమైతే మేలు. ఎదురుగా రంగుల ముఖచిత్రంతో ఓ పుస్తకం కనిపించింది. ఇస్కాన్‌ వ్యవస్థాపకులు ప్రభుపాదుల రచన అది. ఒకటి, రెండు, మూడు, పది, పదిహేను...పేజీలు తిరగేస్తున్నకొద్దీ ఎంతోకాలంగా నన్ను వేధిస్తున్న అనేకానేక ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అనిపించింది. నువ్వు ఎవరివి, ఈ భూమి మీదికి ఎందుకొచ్చావు, నీలక్ష్యం ఏమిటి...మొత్తంగా కర్తవ్యబోధ చేసిందా గ్రంథం. ఇదంతా తెలియకనే, నేను ఆత్మహత్యకు సిద్ధపడ్డాను. ఇక చావుతో పనేముంది! ఆతర్వాత, ప్రభుపాదుల రచనలన్నీ వరుసబెట్టి చదివాను. అందులోనూ స్వామీజీ వ్యాఖ్యానంతో వెలువడిన భగవద్గీత సైన్సులకే సైన్సు! గాలి, నీరు, ఆకాశం..మొదలైన పంచభూతాల వరకే సైన్స్‌ పరిధి. గీతాకారుడు అంతకుమించిన సూక్ష్మ ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తాడు. నిర్దిష్టమైన వాతావరణంలో ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ అణువులు కలసి నీరుగా మారినట్టు...మనసునూ శరీరాన్నీ ఏకోన్ముఖం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలం. గీత ప్రభావంతో నా జీవన దృక్పథం మారిపోయింది. నాలోని నిరాశావాదం మటుమాయమైంది. సునాయాసంగా బీటెక్‌ పూర్తి చేసి, ఎంటెక్‌లో చేరాను.

 

నిష్క్రమణ...
జీవితం పట్ల స్పష్టత పెరుగుతున్న కొద్దీ...సువిశాలమైన క్యాంపస్‌ కూడా ఇరుకిరుకుగా అనిపించసాగింది. ఇరవై రెండేళ్ల వయసులో...నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో ఐఐటీ నుంచి శాశ్వతంగా బయటికొచ్చాను. నేరుగా ఇంటికెళ్లి నాన్నతో నా ఆలోచనల్ని పంచుకున్నాను. ‘నిన్ను నీవు తెలుసుకోడానికి కెరీర్‌ను వదులుకోవాల్సిన పన్లేదు’ అని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆఫీసుకు తీసుకెళ్లి ఇస్రో డైరెక్టరుతోనూ అలాంటి సలహా ఏదో ఇప్పించారు. ఆ పెద్ద మనిషితో చాలాసేపే వాదించాను. చివరికి, ఆయనే నా దార్లోకి వచ్చారు. ‘తనకి ఇష్టమైందే చేయనివ్వండి’ అని నాన్నకు సూచించారు. అన్నీ వదులుకుని, అందర్నీ కాదనుకుని ఇస్కాన్‌లో చేరాను. రెండేళ్లపాటూ దేశమంతా తిరిగాను. పల్లెపల్లెకూ వెళ్లాను. అసలు సిసలు భారతదేశం అక్కడే కనిపించింది. ఇస్కాన్‌ సాహిత్యాన్ని పరిచయం చేయడం, భగవద్గీత సందేశాన్ని వినిపించడం, హరేకృష్ణ మంత్రాన్ని ఉపదేశించడం...నా దినచర్య. ఆతర్వాత, బెంగళూరులోని ఇస్కాన్‌ శాఖ బాధ్యతలు అప్పగించారు. శివార్లలోని అద్దిల్లే మా ఆఫీసు. ప్రభుపాదులవారు చేతిలో నలభై రూపాయలతో ఒంటరిగా అమెరికా వెళ్లారు. తిరిగి వస్తున్న సమయానికి మాత్రం...ఆయన వెనకాల వేలాది జనం! ఆ స్ఫూర్తితోనే...చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయినా, బెంగళూరులో ఇస్కాన్‌ ఆలయ నిర్మాణానికి పూనుకున్నా. కోరగా కోరగా ప్రభుత్వం స్థలం ఇచ్చింది. దానికి పదిలక్షల రూపాయల వెలకట్టింది. ఎటుచూసినా రాళ్లూరప్పలే. చుట్టుపక్కల ఫ్యాక్టరీల కాలుష్యం. సరైన దారి కూడా లేదు. ఇవేవీ కాదు...ఓ మూలన ఏపుగా పెరిగిన తులసి మొక్కలు నన్ను ఆకర్షించాయి. తులసి ఉన్నచోటే కృష్ణుడు ఉంటాడు! ఇదే, నా కృష్ణుడి చిరునామా - అనిపించింది. ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ నిర్మాణం మొదలుపెట్టాం. ఆ మహాకార్యంలో ఎంతోమంది సామాన్యులు ఉడతసాయం అందించారు. ‘సుధామ సేవ’ పేరుతో రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి మూడువందల అరవై అయిదు రూపాయలు ఇచ్చినా అదే మహద్భాగ్యమని చెప్పాం. స్పందన అనూహ్యంగా వచ్చింది. ఆలయం ఓరూపానికి రావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. దాదాపు నలభై లక్షలు ఖర్చయింది. ఇప్పుడు, బెంగళూరులోని దర్శనీయ స్థలాల్లో ఇస్కాన్‌ ఆలయమూ ఒకటి. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టు...కృష్ణుడి లీలలన్నీ ఆపాత మధురాలే. ఆ కమ్మదనం ప్రసాదంలోనూ ప్రతిబింబించాలి. ఇస్కాన్‌లో చాలా భక్తిగా, శ్రద్ధగా ప్రసాదం తయారు చేస్తాం. ఆ రుచిని భక్తులు ఓ పట్టాన మరచిపోలేరు. ఇక్కడో మర్మం ఉంది. కృష్ణ ప్రసాదమే ఇంత రుచిగా ఉంటే, కృష్ణతత్వం ఇంకెంత రుచిగా ఉంటుందో అన్న జిజ్ఞాసను రేకెత్తించడానికి ఇదో మార్గం కూడా.

 

భోజన సేవ...
అప్పట్లో ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వోగా ఉన్న మోహన్‌దాస్‌ పాయ్‌ ఓరోజు మా ఆఫీసుకు వచ్చారు. ‘కమ్మని ప్రసాదంతో వేలమంది భక్తుల కడుపునింపుతున్నారు. ఆ భాగ్యాన్ని చుట్టుపక్కలున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం ఎందుకు ఇవ్వకూడదు?’ అని సూచించారు. ‘తప్పకుండా! మా దగ్గర విశాలమైన వంటగది ఉంది కానీ, వాహనాల్లేవు. ఓ రెండు వాహనాలు సమకూరితే...’ అంటూ నేను మాట పూర్తిచేసేలోపు ‘ఆ బాధ్యత నాదీ...’ అంటూ భరోసా ఇచ్చారు. ఆయన వెళ్లిపోయాక ఆలోచనలో పడ్డాను. రోజూ రెండు లారీల భోజనం అంటే మాటలా? లెక్క వేసుకుంటే, ఓ ఇరవై రోజుల ఆహారానికి అయ్యే ఖర్చు...రెండు లారీల ధర కంటే ఎక్కువే. అయినా సరే, ఎందుకు వెనకడుగు వేయాలి, కృష్ణుడే నాతో మాట ఇప్పించాడు. కృష్ణుడే ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా జరిపిస్తాడు - అని మనసుకు సర్దిచెప్పుకున్నా. ప్రభుపాదుల జీవితంలో జరిగిన ఓ సంఘటనా నా కళ్లముందు కదలాడింది... పశ్చిమ బంగాలోని మాయాపూర్‌.

అర్ధరాత్రి సమయం.
పిల్లల ఏడుపులు. కుక్కల అరుపులు. ఆ అలికిడికి ప్రభుపాదులకు మెలకువ వచ్చింది. కిటికీలోంచి చూశారు. ఎదురుగా పేద పిల్లలు...ఎంగిలి ఆకుల కోసం వీధి కుక్కలతో పోటీపడుతున్నారు. ఆకలికి జాలి, దయా...రెండూ లేవు. అంతకుముందే, పక్కనున్న భవంతిలో బ్రహ్మాండమైన విందు జరిగింది. ఆ విస్తళ్లు అక్కడ వడ్డించినవే.... ఆ దృశ్యాన్ని చూసి ప్రభుపాదుల కళ్లలోంచి ధారాపాతంగా నీళ్లు. ‘ఇస్కాన్‌ చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఏ పసివాడూ ఆకలితో అలమటించకూడదు’ - అని మనసులో సంకల్పం చెప్పుకున్నారు. ఆ మహాకార్యాన్ని ఇప్పుడు నా ద్వారా జరిపిస్తున్నారేమో!

బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని ఐదు పాఠశాలల్లో పదిహేను వందలమందికి భోజనాన్ని అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ‘స్వామీజీ! మా పిల్లలకూ అన్నంపెట్టండి’ అంటూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆ సమయానికి ప్రభుత్వం నుంచి కానీ, కార్పొరేట్‌ సంస్థల నుంచి కానీ ఎలాంటి సాయమూ అందేది కాదు. సామాన్యులు విరాళంగా ఇచ్చే చిన్నచిన్న మొత్తాలే ఆధారం. ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించడానికి కూడా మనసు ఒప్పలేదు. ‘అన్నం పెట్టను...’ అనడం మహాపాపం! అందులోనూ చిన్నారులకు! కానీ, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ‘అమ్మా! నువ్వు ఈ జగానికంతా తల్లివి. నీ బిడ్డలకు అన్నం పెట్టమని ప్రత్యేకించి అడగాలా? ఆ బాధ్యత నీదే. నా వంతు ప్రయత్నం చేస్తానంతే...’ - అంటూ రాధాకృష్ణుల విగ్రహం ముందు నిలబడి అమ్మవారిని ప్రార్థించాను. మా కృషికి దైవ సంకల్పం తోడైంది. చకచకా అన్నీ సమకూరాయి. అన్నసేవ ఓ మహాకార్యం. నిధుల కొరతతోనో, నిర్వహణ లోపం కారణంగానో ఏ దశలోనూ ఆ యజ్ఞం ఆగిపోకూడదు. అందుకే, ప్రత్యేకించి ఓ ట్రస్టును ఏర్పాటు చేశాను. వ్యాపార సంస్థలు బ్రాండ్‌ విలువను పెంచుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాయో, అక్షయపాత్ర ట్రస్టుకు ఓ విలువా, విశ్వసనీయతా తీసుకురావడానికి అన్ని వ్యూహాల్నీ అనుసరించాను. ఇదీ కృష్ణుడు నేర్పిన పాఠమే. ధర్మ సంరక్షణ కోసం జగన్నాటక సూత్రధారి మహాభారతాన్ని ఎన్ని మలుపులు తిప్పాడూ, ఎంత నాటకం ఆడించాడూ!

ఓసారి మా కార్యక్రమాల్ని వివరించడానికి, అప్పటి కేంద్ర మానవ వనరుల మంత్రి మనోహర్‌జోషీని కలిశాను. ‘చాలా మంచి పనిచేస్తున్నారు! నిరుపేద పిల్లలకు అక్షయపాత్ర లభించింది’ అని ప్రశంసించారు.

అ...క్ష...య...పా...త్ర!

- ఎంత గొప్ప పోలిక. ఆయన ద్వారా భగవానుడే ఈ పేరు సూచించాడేమో. వనవాసంలోని పాండవులకు శ్రీకృష్ణుడు ప్రసాదించిన కానుక అది. ఎంతమంది అతిథులకైనా రుచికరమైన భోజనాన్ని సృష్టించి ఇస్తుందా పాత్ర. బడి వయసు బాల్యానికి ఆకలిని మించిన శత్రువు లేదు. కడుపులో పేగులు కేకలుపెడుతుంటే, పాఠాలేం వింటారు? గంట కొట్టాక ఏం తినాలో తెలియని అనిశ్చితిలో, తరగతి గదిలో ఏకాగ్రత ఎలా కుదుర్తుందీ? పోషక విలువల లోపంతో శుష్కించిన శరీరాలు ఆటలేం ఆడతాయీ, పాటలేం పాడతాయీ! అందుకే, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు అంతంతమాత్రంగానే ఉంటోంది. పెద్ద పరీక్షల్లో అత్తెసరు ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆకలి తీరితే పనితీరు మెరుగుపడుతుంది, జీవితాలూ మారిపోతాయి.

ఈ పదహారేళ్లలో అక్షయపాత్ర పదమూడున్నరవేల పాఠశాలల నుంచీ ఆకలిని తరిమేసింది. పది రాష్ట్రాల్లో, పదిహేడు లక్షలమంది చిన్నారులు మధ్యాహ్నం కడుపునిండా భోంచేస్తున్నారు. ఆ పూటకి అన్నం దొరకదేమో అన్న అభద్రతను విడిచిపెట్టి..హాయిగా చదువుకుంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరో లక్షన్నరమంది పసివాళ్లకు పోషక విలువలున్న ఆహారం అందుతోంది. మా వంటశాలలన్నీ అత్యాధునికంగా, పరిశుభ్రంగా ఉంటాయి. కూరగాయల్లోని పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా...అదే సమయంలో పిల్లలకు నచ్చేలా కమ్మగా వండి పెడతాం. అందుకే, బడిగంట కొట్టగానే విద్యార్థులు హుషారుగా బయటికొస్తారు. బుద్ధిగా వరుసలో నిలబడి వడ్డించుకుంటారు. ఒక్క మెతుకైనా వృథా చేయకుండా తృప్తిగా భోంచేస్తారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు...వెన్నముద్దలు తింటున్న చిన్నికృష్ణుడే గుర్తుకొస్తాడు. అక్షయపాత్ర యశోదమ్మలా ఆకలితీరుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో 99.61శాతం విద్యార్థులు...మునుపటితో పోలిస్తే తాము చాలా ఏకాగ్రతతో పాఠాలు వింటున్నామని చెప్పారు. పాఠశాలల్లో హాజరు మెరుగుపడింది. పిల్లల్ని బళ్లొ చేర్పించే తల్లిదండ్రులూ పెరిగారు. అందులోనూ, ఆడపిల్లలే ఎక్కువ. సంపన్నులే కడుపునిండా భోంచేస్తారనీ, పేదలు అర్ధాకలితో మాడిపోవాల్సిందేననీ పిల్లల్లో ఓ అపోహ ఉండేది. తమను తాము తక్కువగా భావించుకునేవాళ్లు. అక్షయపాత్ర వచ్చాక ఆ ఆత్మన్యూనత పూర్తిగా తొలగిపోయిందని ఓ సంస్థ గణాంకాలతో సహా నిరూపించింది. మునుపట్లా, విద్యార్థుల కళ్లకింద నల్లచారల్లేవు. ఆ కళ్ల నిండా రంగుల కలలే! తరగతి గదిలో బేలగా ఓ మూలన కూర్చునే ఆదిత్య ఇప్పుడు, పెద్దయ్యాక సైన్యంలో చేరతానని చెబుతున్నాడు. బడి మానేసి, పనికెళ్లకపోతే అన్నమెలా దొరుకుతుందని అమాయకంగా ప్రశ్నించిన రూప, బాగా చదువుకుని ఉపాధ్యాయురాల్ని అవుతానంటోంది. ఇలాంటి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. 2020 నాటికి యాభై లక్షలమందికి అన్నం పెట్టగలమన్న విశ్వాసం బలపడుతోంది. అయినా, ‘నేను చేస్తాను’ అనుకుంటేనే ఒత్తిడి. ‘కృష్ణుడే చేయిస్తున్నాడు...’ అని విశ్వసిస్తే, కొండనెత్తినవాడి మీదే కొండంత భారమేస్తే - భయమేం ఉంటుంది. అక్షయపాత్రకు కృష్ణుడే సూత్రధారి. నేను కేవలం పాత్రధారినే!

* * *

ఓ సమావేశంలో సహచరుడికి ఒక సందేహం కలిగింది. ‘ప్రభూ! నూటికినూరుపాళ్లు అంకిత భావంతో నేను పనిచేస్తున్నానో లేదో నిర్ధారించుకోవడం ఎలా?’ అని అడిగాడు. అక్షయపాత్ర విషయంలో, గతంలో నాకూ ఇలాంటి సందేహమే ఉండేది. ‘నీ వైపు నుంచి ఎలాంటి ప్రయత్న లోపమూ లేకుండా కష్టపడు. అది ఎంత శాతమన్నది కృష్ణుడే నిర్ధారిస్తాడు. ఎలాంటి ఫలితం ఇవ్వాలన్నదీ కృష్ణుడే నిర్ణయిస్తాడు’ - అంతరాత్మకు చెప్పుకున్నా, అందరికీ చెప్పినా...ఇదే నా మాటా, బాటా.


 

తొలి అక్షరాల నుంచి... తొలిజీతం వరకూ!

  ‘‘చాలా సందర్భాల్లో, మధ్యాహ్న భోజనంతోనే మన బాధ్యత తీరిపోదు. పేదల్లోనూ మరింత పేదలుంటారు. బీసీలూ ఎస్సీలూ ఎస్టీల్లోని...అలాంటి ఓ పాతికవేలమంది పిల్లల్ని ఎంచుకుని...ఒకటో తరగతి నుంచి జీవితంలో స్థిరపడేదాకా అన్ని బాధ్యతలూ తీసుకోవాలన్నది మా ఆలోచన. వాళ్లను ఐఏఎస్‌లుగా ఐపీఎస్‌లుగా డాక్టర్లుగా ఇంజినీర్లుగా తీర్చిదిద్దుతాం. తొలి పాఠశాలను తెలుగురాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇదంతా మొదటి అడుగే. దశలవారీగా మిగతా రాష్ట్రాలకూ విస్తరిస్తాం. చాలా పెద్ద ప్రాజెక్టు ఇది. కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. బాగా చదువుకున్నా, చక్కని ఉద్యోగాల్లో స్థిరపడినా...యువతలో తీవ్ర అశాంతి కనిపిస్తోంది. దీనికి కారణం దిశానిర్దేశం లేకపోవడమే. జగద్గురువు శ్రీకృష్ణుడిని అర్థం చేసుకుంటే...జీవితంలో ఎలాంటి సందేహాలూ ఉండవు. అందుకే, ‘ఫోక్‌’ (ఫ్రెండ్స్‌ ఆఫ్‌ లార్డ్‌ కృష్ణా) పేరుతో యువజన బృందాల్ని ఏర్పాటు చేస్తున్నాం. మంచినీ మానవతనీ విలువల్నీ వాళ్లకు బోధిస్తున్నాం. ఆ ప్రభావంతో వ్యసనాల నుంచి బయటపడుతున్నవారూ, కోపాన్నీ క్రమశిక్షణా రాహిత్యాన్నీ అధిగమిస్తున్నవారూ ఎంతోమంది. మాధవసేవ ప్రత్యక్ష సేవ, మానవసేవ పరోక్ష సేవ. మానవసేవకు అవసరమైన బలం మాధవసేవ ద్వారా లభిస్తుంది. ఆధ్యాత్మికశక్తి అంటే అదే. ఇక్కడ మతం కాదు, ఆధ్యాత్మికత ప్రధానం.’’


 

ఆధునిక ఆలయాలు...