close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చనిపోయాకా బతికేందుకు!

చనిపోయాకా బతికేందుకు!

మాయదారి రోగం రాయిలాంటి మనిషిని పొట్టనపెట్టుకుంది అనే రోదన వినేఉంటాం. కానీ ఆ రోగానికి మందు కనిపెడితే నిజంగా ఆ వ్యక్తి బతికేవాడా... అంటే, ఏమో అయ్యుండొచ్చు అనే సమాధానం వస్తుంది. మరి ఆ మందు కనిపెట్టే దాకా శరీరం ఉంటే ప్రాణం తిరిగొస్తుందా అంటే, ఆ విషయాన్ని కొట్టిపారేయలేం అంటుంది క్రయోనిక్‌ శాస్త్రం. అందుకే ఆ రోజు వచ్చే వరకూ శరీరం దెబ్బతినకుండా దాచే బాధ్యత తీసుకుంది. అలా కొన్ని వందల శరీరాల్ని మళ్లీ బతికించేందుకంటూ భద్రపరిచేలా చేసింది.

శాస్త్రసాంకేతిక రంగాలు నానాటికీ పెనువేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. వాటి మూలంగా కొత్తకొత్త ఆవిష్కరణలూ. వైద్యమే లేదనుకున్న చాలా రోగాలు ఇప్పుడు సులువుగా నయమవుతున్నాయి. అలా శాస్త్ర పురోభివృద్ధి పట్ల అచంచల విశ్వాసం ఉన్న ఓ 14ఏళ్ల పాప... ‘నాకు చిరకాలం బతకాలని ఉంది. కానీ నాకొచ్చిన అరుదైన క్యాన్సర్‌వ్యాధి వల్ల నేను చనిపోతానని తెలుసు. ఈ రోగానికి ఈరోజు మందు లేకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తప్పక దానికీ మందు కనిపెడతారు. ఆనాటికి నేనుండాలి కదా. అందుకే క్రయోనిక్‌ ప్రిజర్వేషన్‌ పద్ధతిలో నా శరీరాన్ని భద్రపరచండి’ అంటూ పెట్టుకున్న అభ్యర్థనను బ్రిటిష్‌ కోర్టు తోసిపుచ్చలేకపోయింది. గతనెల ఆ పాప శరీరాన్ని అమెరికాలోని క్రయోనిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భద్రపరిచారు.

ఇంతకీ ఏమిటీ క్రయోనిక్స్‌...
మందులేని రోగాల వల్ల చనిపోయిన వాళ్ల శరీరాల్ని భవిష్యత్తులో మందు దొరికినప్పుడు బతికించేందుకు అతిశీతల ఉష్ణోగ్రతల వద్ద భద్రపరచడాన్నే క్రయోనిక్స్‌ అంటారు. ఇందులో లిక్విడ్‌ నైట్రోజన్‌లాంటి ద్రవాలను ఉపయోగించి కణజాలం, మెదడు సహా ఏ అవయవాలూ దెబ్బతినకుండా మందు కనిపెట్టే రోజు వరకూ జాగ్రత్తపరుస్తారు. లోపలి కణజాలం దెబ్బతినకుండా కాపాడితే రేపటి వైద్యానికి శరీరం సిద్ధంగా ఉంటుందనేది వీళ్ల నమ్మకం. ప్రస్తుతం ఈ పద్ధతిలో మనుషులతో పాటు, జంతువుల శరీరాల్నీ భద్రపరుస్తున్నారు. ఇష్టాన్ని బట్టి కేవలం తలనూ లేదా మెదడునూ కూడా వందల ఏళ్లు భద్రపరచుకోవచ్చు. ఈ పద్ధతిలో శీతలీకరించిన ఓ కుందేలు మెదడును ఇటీవల బయటికి తీసినప్పుడు భద్రపరచిన నాటికీ ఇప్పటికీ దాని మెదడులో ఎలాంటి తేడా లేదట. దీన్ని ఈ దిశలో ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇక్కడున్నాయి...
ఇలా శరీరాల్ని శాశ్వతంగా భద్రపరిచే కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా మూడు ఉన్నాయి. అందులో అల్కార్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆర్గనైజేషన్‌, క్రయోనిక్‌ ఇన్‌స్టిట్యూట్లు అమెరికాలో ఉండగా క్రయోరస్‌ అనే మరో కేంద్రం రష్యాలో ఉంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 350 మంది తమ మొత్తం శరీరాన్నీ లేదా తలనూ వీటిలో భద్రపరచుకోగా, మరో రెండు వేల మంది వరకూ ముందే తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మొట్టమొదట ఈ విధానం ద్వారా శరీరాన్ని భద్రపరచుకున్న వ్యక్తి కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ బెడ్‌ఫోర్డ్‌. 1967లో ఈయన చనిపోగా అల్కార్‌ లైఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ కేంద్రంలో ఉంచారు. ప్రఖ్యాత బేస్‌బాల్‌ ఆటగాడు టెడ్‌ విలియమ్స్‌ తల కూడా ఇక్కడే ఉంది. ప్రఖ్యాత పాప్‌సింగర్‌ బ్రిట్నీస్పియర్స్‌, ప్రముఖ టీవీషో వ్యాఖ్యాత లారీకింగ్‌, ద ఎక్స్‌ ఫ్యాక్టర్‌ తదితర టీవీ షోల వ్యాఖ్యాత సైమన్‌ కోవెల్‌ తదితరులు తాము కూడా ఈ పద్ధతిలో శరీరాన్ని భద్రపరచుకోవాలనుకుంటున్నట్టు వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు.

ఎలా చేస్తారంటే...
నమోదు చేసుకున్న వాళ్లు అవసాన దశలో ఉన్నప్పుడు ఈ సంస్థల వారికి చెబితే ముందుగా వాళ్ల ప్రతినిధులను పంపుతారు. వ్యక్తి చనిపోయిన వెంటనే డ్రైఐస్‌ ద్వారా వాళ్ల శరీరాన్ని బాగా చల్లబరచి, రక్తాన్ని గడ్డకట్టనీయకుండా ప్రత్యేక ఇంజెక్షన్లు ఇచ్చి ఆ శరీరాన్ని కేంద్రానికి తీసుకెళతారు. శరీరంలో ఉండే ద్రవపదార్థాలు గడ్డకట్టడం వల్ల కణజాలం నాశనం అవుతుందట. అందుకే రక్తంతో సహా దేహంలో ఉండే అన్ని రకాల ద్రవాల్నీ పూర్తిగా తొలగించి, వాటి స్థానే క్రయోప్రొటెక్టంట్‌గా పిలిచే ప్రత్యేక ద్రవాన్ని ఎక్కిస్తారు. ఇది అతిచల్లని వాతావరణంలో కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది. దీని తరువాత శరీరాన్ని -196 డిగ్రీల సెల్సియస్‌ దగ్గర ఉండే లిక్విడ్‌ నైట్రోజన్‌తో నిండి ఉండే ఒక లోహపు సిలిండర్‌లాంటి పరికరంలో తలకిందులుగా భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచేందుకు దాన్ని ఉంచుకునే కేంద్రాన్ని బట్టి పూర్తి శరీరానికి 25 లక్షల రూపాయల నుంచి కోటిన్నర రూపాయల దాకా ఖర్చవుతుంది. అదే కేవలం తలకైతే 12 లక్షల రూపాయల నుంచి 55 లక్షల రూపాయల వరకూ అవుతుంది. రచయితలూ, కళాకారులూ, శాస్త్రవేత్తలూ, ముందు కాలాన్ని చూడాలనుకునే ఔత్సాహికులూ... ఇలా ఎందరో ఈ తరహా చికిత్సను ఆశ్రయిస్తున్నారు. ఆశ మనిషిని బతికిస్తుంది అంటారు... చనిపోయాకా బతుకుతామన్న ఆశ ఒక్క మనిషికి మాత్రమే సొంతమేమో... ఏమో అది అత్యాశకాదని నిరూపించే రోజూ రావొచ్చు... ఎవరుచూశారు కనుక!

- లక్ష్మీహరిత ఇంద్రగంటి

 

నింగికి నిచ్చెన వేస్తున్నారు!

ఆకాశంలోని చందమామ అందాల్ని చూడటమంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. బెంగళూరుకు చెందిన ‘టీమ్‌ ఇండస్‌’ సంస్థ ఉద్యోగ బృందానికి ఆ ఇష్టం అక్కడికే పరిమితం కాలేదు. చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపాలని లక్ష్యంగా పెట్టుకునేంతవరకూ వెళ్లింది.

2017 డిసెంబరు నాటికల్లా చంద్రుడిపైకి వ్యోమ నౌకను పంపండి, రూ.140 కోట్లు అందుకోండి... ‘గూగుల్‌ లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌’ పోటీ నిర్వాహకులు పదేళ్ల కిందట ఇచ్చిన పిలుపిది. మనలాంటి దేశాల్లో ఇలాంటి పోటీలపైన ఆసక్తి ఏపాటిగా ఉంటుందో వూహించవచ్చు. రాహుల్‌ నారాయణ్‌కూ దీని గురించి తెలీదు. అప్పటికాయన ‘ఏగ్నిసియెంట్‌’ పేరుతో ఐటీ సేవలు అందించే సంస్థని నడుపుతున్నాడు. 2010లో ఓ విదేశీ ఖాతాదారు నుంచి ‘లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌’ గురించి తెలుసుకున్నాడు. తర్వాత ఇంటర్నెట్‌లో పూర్తి వివరాలు చూశాడు. అప్పటికే చాలా సంస్థలు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే అక్కడ మనదేశం నుంచి ఎవరూ లేరు. భారత్‌ నుంచి ఎవరైనా పోటీలో దిగితే బాగుంటుందనుకున్నాడు రాహుల్‌. కానీ అదేమీ సరదాకి పాల్గొనే పాటల పోటీ కాదు... క్లిష్టమైన రాకెట్‌ సైన్స్‌. దానికి తోడు బరిలో దిగడానికి ఫీజు రూ.35 లక్షలు. ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమే. బాగా ఆలోచించి పోటీ గురించి స్నేహితుల్లో కొందరిని సంప్రదించాడు రాహుల్‌. నలుగురి నుంచి సానుకూలత వచ్చింది. వారితో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి పోటీకి దరఖాస్తు చేశాడు. తన బృందానికి ‘టీమ్‌ ఇండస్‌’ అని పేరుపెట్టాడు. బృందంలో అంతరిక్ష రంగం గురించి అవగాహన ఉన్నవాళ్లెవరూ లేరు. కానీ అందరికీ పోటీపైన ఆసక్తి మాత్రం ఉంది. ఆ సమయంలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.కస్తూరిరంగన్‌ను కలిశారు. రాహుల్‌ బృందంతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం చేయలేని పనిని ఓ ప్రైవేటు సంస్థ చేస్తాననడంతో ఎంతో సంతోషించారు. సలహాలూ, సూచనలూ ఇచ్చారు. కొన్నాళ్లకు ప్రాజెక్టుకు సాయపడగల ఇస్రో మాజీ శాస్త్రవేత్తల్ని పరిచయం చేశారు.

ఇండీ సిద్ధం!
‘టీమ్‌ ఇండస్‌’లో ప్రస్తుతం 100మంది ఉద్యోగులున్నారు. వారిలో 80మంది ఇంజినీర్లూ, 20మంది ఇస్రో మాజీ శాస్త్రవేత్తలూ. ఇంజినీర్లంతా పాతికేళ్లలోపు వారైతే, శాస్త్రవేత్తలు 60 ఏళ్లు నిండినవాళ్లు. యువ శక్తి, అనుభవ యుక్తి కలిసి ప్రాజెక్టుకోసం కృషి చేస్తోందన్నమాట. ఈ పోటీ తుది దశకు చేరుకుంది. ఈ దశలో కొన్ని సంస్థలకు ‘మైల్‌స్టోన్‌’ అవార్డు పేరుతో నిర్వాహకులు బహుమతి ఇస్తారు. ‘ల్యాండర్‌ టెక్నాలజీ’ని సిద్ధం చేసుకున్నందుకు ప్రోత్సాహకంగా రూ.7 కోట్ల విలువైన అవార్డును టీమ్‌ ఇండస్‌ ఇటీవల అందుకుంది. ఎక్స్‌ప్రైజ్‌ నిబంధనల ప్రకారం చంద్రుడిపైన దిగాక వ్యోమ నౌక కనీసం 500 మీటర్లు వెళ్లాలి, హెచ్‌డీ ఫొటోలూ, వీడియోని సేకరించి భూమ్మీదకు పంపాలి. ఇప్పటికే ‘ఇండీ’ పేరుతో అందుకు అవసరమైన నమూనా వ్యోమ నౌకని టీమ్‌ ఇండస్‌ సిద్ధం చేసింది. చంద్రుడి ఉపరితలం దుమ్ము, రాళ్లతో నిండి ఉంటుంది. ఆ పరిస్థితుల్లోనూ నాలుగు చక్రాలూ 360 డిగ్రీల్లో తిరగగలిగేలా ఇండీని రూపొందించారు. ఇదే సమయంలో ‘ల్యాబ్‌2మూన్‌’ పేరుతో ‘చంద్రుడిపై జీవరాశి మనుగడ’ అనే అంశంపైన ప్రపంచస్థాయి పోటీ కూడా పెట్టింది టీమ్‌ ఇండస్‌. ఈ పోటీ విజేత తయారుచేసే పరికరాన్ని ఇండీతోపాటు చంద్రుడిపైకి పంపుతారు.

నిధులు కావాలి!
రాకెట్‌ కొనుగోలు, సాంకేతికత అభివృద్ధి, క్షేత్రస్థాయి ఖర్చులూ కలిసి లూనార్‌ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఇండస్‌కు సుమారు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇప్పటివరకూ టీమ్‌ ఇండస్‌ రూ.21కోట్లు సేకరించింది. వాటిలో పెట్టుబడుల ద్వారా 14 కోట్లు, ఎక్స్‌ప్రైజ్‌ మైల్‌స్టోన్‌ అవార్డుద్వారా ఏడు కోట్లు వచ్చాయి. ఇండస్‌ పెట్టుబడిదారుల్లో నందన్‌ నీలేకని ఒకరు. మరో విడత పెట్టుబడుల్ని ఆహ్వానించి రూ.100 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఎక్స్‌ప్రైజ్‌కు పోటీ పడుతున్న ఇతర సంస్థలు తమ వ్యోమ నౌకను ఆయా దేశాల్లోని ప్రైవేట్‌ రాకెట్‌ లాంచింగ్‌ సంస్థల నుంచి ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. ఇండస్‌ మాత్రం ఇందుకు ఇస్రోకు చెందిన ‘పీఎస్‌ఎల్‌వీ’ని ఉపయోగించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం వరుసగా 35 సార్లు విజయవంతమైంది. మిగతా సంస్థలు పంపే రాకెట్లలో కొన్ని మొదటిసారి పంపుతున్నవి కాగా, మిగిలిన వాటి విజయశాతం చాలా తక్కువగా ఉంది. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో 90 శాతం ప్రైవేటుగా సేకరించాలనేది ఎక్స్‌ప్రైజ్‌ నిబంధన. అందుకే వీరు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను ఆశించడంలేదు. అయితే తమ వ్యోమ నౌకను ఇస్రోకు చెందిన ప్రయోగశాలల్లో పరిశీలించుకునే అవకాశం ఉండటం టీమ్‌ ఇండస్‌కు ఆర్థికంగా కలిసొచ్చే అంశం.లూనార్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి ఆపైన అంతరిక్ష సంబంధ వాణిజ్యంలో కొనసాగాలని చూస్తోంది టీమ్‌ ఇండస్‌. ఈ ప్రయాణంలో తమకు ఉపగ్రహాలను అభివృద్ధిచేసే సామర్థ్యం వస్తుందంటూ చంద్రుడిపైకి మనిషిని పంపడం కూడా తమ లక్ష్యాల్లో ఒకటని చెబుతారు రాహుల్‌. లూనార్‌ ఎక్స్‌ప్రైజ్‌ గెలుపొందడంద్వారా అంతరిక్ష విభాగంలోనూ భారతీయ సామర్థ్యాన్ని తెలియజేస్తూ యువతలో స్ఫూర్తి నింపుతామంటారాయన. టీమ్‌ ఇండస్‌ ‘చంద్రయాన్‌’ విజయవంతం కావాలనీ రాహుల్‌ మాట నిజమవ్వాలనీ ఆశిద్దాం!


 

ఒక్కడు... వూరందరికీ ఇళ్లు కట్టించాడు

క్షిణ చైనాలోని క్సిన్యు ప్రాంతంలో ఉన్న షియాంగ్‌కెంగ్‌ గ్రామం అయిదేళ్ల కిందట మట్టి రోడ్లూ గుడిసెలూ చిన్న చిన్న ఇళ్లతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం నగరాల్లో సంపన్నవర్గం ఉండే చిన్నసైజు టౌన్‌షిప్‌లా మారిపోయింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన అద్దాల మేడలూ విలాసవంతమైన భవనాలతో కళకళలాడుతోంది. మట్టిరోడ్లు కాస్తా సిమెంట్‌ రోడ్లైపోయాయి. మామూలుగా ఏ వూరిలోనైనా ఇలాంటి మార్పు రావాలంటే ప్రజలందరూ ముందడుగు వెయ్యాలి. అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అదంతా జరగాలంటే ఎన్ని ఏళ్లైనా పట్టొచ్చు. కానీ షియాంగ్‌కెంగ్‌ గ్రామం రూపు రెండు మూడేళ్లలోనే సమూలంగా మారిపోయింది. కారణం... ఎంతోమంది మధ్యతరగతి, పేదవారి తలరాత మార్చగల ఓ ధనవంతుడు ముందడుగు వేశాడు. అతడే 56 ఏళ్ల ‘షియాంగ్‌ షుయ్‌హువా’. పేదరికంలో పుట్టినా అదృష్టం, కష్టం కలిసొచ్చి సంపన్నులుగా మారినవారు చాలామందే ఉంటారు. అయితే, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారిని గుర్తుపెట్టుకునేవారూ పుట్టిన వూరికి ఏదో ఒకటి చేయాలనుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తే షియాంగ్‌. ఆ వూరిలోనే పుట్టి, భవన నిర్మాణ వ్యాపారం, ఉక్కు పరిశ్రమల ద్వారా సంపన్నుడైన అతడు తిరిగి వూరికోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు.

ఏదీ మర్చిపోలేదు
చిన్నతనంలో షియాంగ్‌ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతడి తల్లిదండ్రులు తమ నలుగురు పిల్లల ఆకలి తీర్చడానిక్కూడా ఎంతో కష్టపడేవారు. అలాంటి సమయంలో గ్రామస్థులు వారికి ఎప్పుడూ అండగా నిలబడేవారట. తరవాత బతుకుతెరువు కోసం కుటుంబంతో కలసి షియాంగ్‌ పట్టణానికి వెళ్లిపోయినా వూరి ప్రజలు పంచిన ప్రేమాభిమానాలూ అందించిన సహాయసహకారాల్ని మర్చిపోలేదు. అందుకే, వారు సరైన ఇళ్లు కూడా లేక బతుకీడుస్తున్న వైనాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే అందరికీ మంచి ఇళ్లు కట్టిస్తానని చెప్పి వారి పాత ఇళ్లను పడగొట్టించి ఆ స్థానంలో 72 కుటుంబాలకు అత్యాధునిక సౌకర్యాలతో ఫ్లాట్లు కట్టించాడు. ఇవికాక తమ కుటుంబానికి ఎక్కువ సన్నిహితంగా ఉన్న మరో 18 కుటుంబాలకు విడివిడిగా విలాసవంతమైన విల్లాల్ని నిర్మించాడు. ఇళ్లతోపాటు, గ్రామంలో అన్నివైపులా సిమెంట్‌ రోడ్లూ, కమ్యూనిటీ హాల్‌ కోసం విడిగా ఓ భవనమూ, ఈతకొలను, పార్కు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆటస్థలం... ఇలా సర్వహంగుల్నీ అక్కడ ఏర్పాటు చేశాడు. ‘నాకవసరమైనదానికన్నా ఎక్కువ డబ్బుని సంపాదించాను. అదంతా ఏం చేసుకోవాలి... అందుకే, నా జీవితం ఎక్కడ మొదలైందో గుర్తుచేసే నా వూరికీ, మేం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న అక్కడి ప్రజలకూ తిరిగివ్వాలనుకున్నా’ అంటాడు షియాంగ్‌. ఇందుకోసం మొత్తం ఎంత ఖర్చయిందన్న విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. కానీ షియాంగ్‌ విడిగా నిర్మించిన పద్దెనిమిది విల్లాలకే రూ.35 కోట్లు ఖర్చైందని సమాచారం. ఇక, మొత్తం 90 కుటుంబాల ఇళ్లకూ ఇతర సౌకర్యాల ఏర్పాటుకూ ఎంత అయిఉంటుందో వూహించుకోవచ్చు. ఇవేకాదు, షియాంగ్‌ ఈ గ్రామంలోని వృద్ధులకూ పేదలకూ రోజూ మూడు పూట్లా ఉచితంగా భోజనం కూడా పెడుతున్నాడు.కోటీశ్వరులెందరో ఉండొచ్చు. కానీ ఇలాంటి వారు కోటికొక్కరు మాత్రమే కనిపిస్తారనడంలో సందేహం లేదు కదూ...


 

సైబర్‌ సైనికులు...

ప్రపంచం ఇంటర్నెట్‌ చుట్టూ తిరుగుతోంది. అదే సమయంలో సైబర్‌ దాడుల్నీ ఎదుర్కొంటోంది. ఈ తరహా దాడులకు అడ్డుకట్టవేసే సైనికులే ఎథికల్‌ హ్యాకర్లు. మనదేశానికి చెందిన సాకేత్‌ మోదీ, త్రిస్నిత్‌ అరోరా ఇద్దరూ తమ సంస్థలద్వారా ఎథికల్‌ హ్యాకింగ్‌ సేవలు అందిస్తూ ఎన్నో కంపెనీల ఆన్‌లైన్‌ వ్యవస్థలకు భద్రత కల్పిస్తున్నారు.

‘ఎనిమిది’ తప్పాడు

భారతీయ ఎథికల్‌ హ్యాకర్లలో ప్రధానంగా వినిపించే పేర్లలో ‘త్రిస్నిత్‌ అరోరా’ ఒకటి. 2012లోనే 18ఏళ్ల వయసులో ఇంటినుంచే ‘త్రిస్నిత్‌ అరోరా సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్‌(టీఏసీఎస్‌ఎస్‌)’ని ప్రారంభించాడు. మరోవైపు ‘వాయిస్‌ ఆఫ్‌ హ్యాకర్స్‌’, ‘ది హ్యాకింగ్‌ ఎరా’ పుస్తకాలనీ రాశాడు. కంపెనీ ప్రారంభించిన స్వల్ప వ్యవధిలోనే కొన్ని ఆన్‌లైన్‌ నేరాల చిక్కులు విప్పేందుకు సీబీఐతోపాటు, పంజాబ్‌, గుజరాత్‌ రాష్ట్రాల పోలీసులకు అరోరా సహకరించాడు. ఒక సంస్థ సర్వర్‌లో సమాచారం దొంగిలించకుండా కాపాడటం, ఆన్‌లైన్‌ ఆర్థిక నేరాలను అడ్డుకోవడం, సైబర్‌ నేరాల విచారణ సమయంలో పోలీసులకు సాయంగా ఉండటం... మొదలైనవి టీఏసీ అందించే సేవల్లో ఉన్నాయి. సైబర్‌ దాడి వెనుక వ్యక్తుల్ని తెలుసుకోవడమే కాదు, దాడికి ప్రయత్నాలు జరుగుతున్న దశలోనూ వారిని గుర్తిస్తారు. రెండేళ్ల కిందట మొహాలీలో కొత్త కార్యాలయాన్నీ తెరిచాడు త్రిస్నిత్‌. తన ఖాతాదారైన ఓ అమెరికా హాస్పిటల్‌ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లో సైబర్‌ దాడి జరగనుందని పసిగట్టి వారికి ముందస్తు హెచ్చరికలు పంపాడు. యూఏఈకి చెందిన ఓ బ్యాంకు సర్వర్‌ హ్యాకింగ్‌కు గురై బ్యాంకుకు సర్వర్‌ నుంచి అనుసంధానం పోయింది. టీఏసీ బరిలోకి దిగి సర్వర్‌ను తిరిగి పొందడమే కాకుండా, హ్యాకింగ్‌ చేసిందెవరో కూడా గుర్తించింది. టీఏసీ ఖాతాదారుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అమూల్‌, ట్రాక్టర్‌ తయారీ సంస్థ సోనాలికతోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఉన్నాయి.

త్రిస్నిత్‌కి 11ఏళ్లపుడు అతడి తండ్రి కంప్యూటర్‌ కొనిచ్చాడు. అప్పట్నుంచీ కంప్యూటర్‌పైనే ఆడుకుంటూ, దానిపైన వివిధ రకాల ప్రయోగాలు చేసేవాడు. కంప్యూటర్‌కి దగ్గరై పుస్తకాలకు దూరం కావడంతో ఎనిమిదో తరగతి తప్పాడు. ఆ తర్వాత స్కూల్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టిన త్రిస్నిత్‌ దూరవిద్యలో పదో తరగతి, ప్లస్‌టూ, బీసీఏ పూర్తిచేశాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న స్నేహితుల సాయంతో కంప్యూటర్‌ గురించి తెలుసుకుంటూనే స్వల్ప వ్యవధిలోనే తిరిగి వారికి కంప్యూటర్‌ పాఠాలు నేర్పే స్థాయికి చేరుకున్నాడు. ఆ సమయంలో యూట్యూబ్‌ సాయంతో కంప్యూటర్‌ పాఠాలతోపాటు హ్యాకింగ్‌ గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. హ్యాకింగ్‌పైన సీబీఐ, వివిధ రాష్ట్ర పోలీసు సైబర్‌ విభాగాలతోపాటు యూఏఈ, యూకే, ఉగాండా లాంటి దేశాల్లోనూ శిక్షణ ఇచ్చాడు. టీఏసీని బిలియన్‌ డాలర్‌ కంపెనీగా మార్చి అమెరికా, ఇంగ్లాండ్‌, యూఏఈలలో కార్యాలయాలుపెట్టి సేవలు అందించాలనేదే తన లక్ష్యమని చెబుతాడు త్రిస్నిత్‌.


ప్రశ్నాపత్రం హ్యాక్‌చేసి...

దస్సులూ, శిక్షణ తరగతులూ, వాణిజ్య ఒప్పందాలకోసం నిత్యం విదేశాలకు వెళ్లొస్తాడు పాతికేళ్ల సాకేత్‌ మోది. అలా ఒక రోజు విమానంలో ఉండగానే హ్యాకర్లు భారత్‌లో 32లక్షల డెబిట్‌ కార్డుల సమాచారాన్ని దొంగిలించారన్న వార్త చదివాడు. ఆ వార్త చదివి అతడు ఆశ్చర్యపోలేదు. హ్యాకర్లు ఆ పనిని ఏ విధంగా చేసుంటారన్న కోణంలోనే ఆలోచించడం మొదలుపెట్టాడు. దిల్లీలో అడుగుపెట్టాడో లేదో చాలా బ్యాంకుల ప్రతినిధులు డెబిట్‌ కార్డుల సమాచారం చోరీ అంశాన్ని పరిష్కరించమంటూ సాకేత్‌కి ఫోన్లు చేశారు. గతంలోనూ ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు చాలా సంస్థలు సాకేత్‌ని సంప్రదించాయి. అతడికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఖాతాదారుల్లో ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రఖ్యాత వ్యాపార సంస్థలూ ఉన్నాయి. అంతర్జాలంలో ఆయా సంస్థలు ఎదుర్కొనే హ్యాకింగ్‌ సమస్యలకు సాకేత్‌ సంస్థ పరిష్కారం చూపుతుంది. చిన్నప్పట్నుంచీ కంప్యూటర్‌కు సంబంధించిన అంశాల్ని తెలుసుకుంటూ దానిపైనే ఎక్కువ సమయం గడిపేవాడు సాకేత్‌. ప్లస్‌టూలో ఉన్నపుడు ప్రీపబ్లిక్‌ పరీక్షల సమయంలో కాలేజీ కంప్యూటర్లోని రసాయనశాస్త్ర ప్రశ్నాపత్రాన్ని హ్యాక్‌ చేశాడు. కానీ అపరాధ భావనతో ఆ విషయాన్ని పరీక్షకు ముందే ఉపాధ్యాయులకి చెప్పేశాడు. ఆ రోజు నుంచి హ్యాకింగ్‌ని చెడు మార్గంలో కాకుండా మంచి కోసం చేయాలని నిర్ణయించుకుని ‘ఎథికల్‌ హ్యాకర్‌’గా మారాడు సాకేత్‌.

ఇంజినీరింగ్‌ చేస్తూనే అంతర్జాల భద్రత గురించి ఐఐటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ పీహెచ్‌డీ విద్యార్థులకు సదస్సులు నిర్వహించేవాడు. 2012లో దిల్లీ కేంద్రంగా ‘లుసిడ్యూస్‌’ పేరుతో అంతర్జాలంలో భద్రతా సేవలు అందించే సంస్థను ప్రారంభించాడు. మరోవైపు దేశవిదేశాల్లో ఆ అంశంపైన శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటాడు సాకేత్‌. లుసిడ్యూస్‌ ఖాతాదారుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, స్టాండర్డ్‌ ఛార్టెర్డ్‌, టాటా స్కై, ఇండిగో లాంటి పేరున్న సంస్థలు 50కిపైనే ఉన్నాయి. వీటితోపాటు కేంద్ర హోం, ఆర్థిక, రక్షణ, పరిశ్రమల శాఖలూ ఈ సంస్థ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. ఈ ఏడాది ఆర్‌బీఐ ఏర్పాటుచేసిన ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)’ కూడా లుసిడ్యూస్‌ ఖాతాదారుల జాబితాలో చేరింది. లుసిడ్యూస్‌లో ప్రస్తుతం 70మంది యువ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది ఇరవైల్లో ఉన్నవారే. ఎథికల్‌ హ్యాకర్‌గా బిజీగా ఉండే సాకేత్‌ ఒక సంగీత బృందంలో పియానిస్టుగానూ ఉన్నాడు.


 

శ్మశానంలో ‘బతుకు’తున్నారు

రాత్రి పదకొండున్నర... ఒడిశాలోని డెప్పిగుడలో ఉన్న శ్మశానం పక్కగా వెళ్తున్న ఆ వ్యక్తికి లోపల ఎవరో తిరుగుతున్నట్లనిపించింది. చూస్తే దహన సంస్కారాలు జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించలేదు. పైగా వాళ్లు దహనవాటిక దగ్గర కూర్చుని అన్నం లాంటిదేదో తింటున్నారు. దాంతో అతడికి గుండెదడ పెరిగి, పరుగందుకున్నాడు. ఇంతకీ అక్కడున్నదెవరు..?