close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ ఓడలో ప్రియా పచ్చళ్లూ వడ్డించారు..!

ఆ ఓడలో ప్రియా పచ్చళ్లూ వడ్డించారు..!

మా అబ్బాయి దగ్గరకు వెళ్లినప్పుడు ‘ఇండిపెండెన్స్‌ ఆఫ్‌ ద సీస్‌’ అనే ఓడలో అట్లాంటిక్‌ మహాసముద్రంలో విహరించేందుకు నాలుగురోజుల యాత్రకు బయలుదేరాం. డెట్రాయిట్‌ నుంచి ఫ్లోరిడాకు వెళ్లి అక్కడి నుంచి ఓడరేవుకి వెళ్లాం. మేం ఎక్కిన ఓడ ఫ్లోరిడా తీరంలోని అట్లాంటిక్‌ మహాసముద్రంలో బయలుదేరి మెక్సికోలోని కరీబియన్‌ సముద్రంలోని కాజ్‌మల్‌ ద్వీపానికి వెళ్తుంది. రాయల్‌ కరీబియన్‌ కంపెనీకి చెందిన ఈ పదిహేను అంతస్తుల ఓడ గంటకు 43 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఓడలో 4,370 మంది ప్రయాణికులుంటే, 1,360 మంది సిబ్బంది ఉంటారు. ఓడ దగ్గర మా పాస్‌పోర్టులు చూపించాక మాకు గదులు కేటాయించారు. తాళాలు తీసుకుని ఎలివేటర్‌ ద్వారా పైకి వెళ్లాం. మా రెండు సూట్స్‌కీ డెక్‌లు ఉన్నాయి. అక్కడ కూర్చుని సముద్ర అందాలను ఆస్వాదించవచ్చు. గదుల్లో మంచం, సోఫాలతోపాటు టీవీ, ఫ్రిజ్‌, ఫోన్‌ వంటి సౌకర్యాలన్నీ ఉన్నాయి.

మేం ఫ్రెష్‌ అయి లంచ్‌కి పదకొండో అంతస్తుకి చేరుకున్నాం. అక్కడ శాకాహార, మాంసాహార వంటకాలన్నీ కలిసి కనీసం వంద రకాలకు పైనే ఉన్నాయి. ఎంత కావాలన్నా తినొచ్చు. పరిమితి లేదు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం ఐదు గంటలకు ఓడ బయలుదేరింది. ఆరు గంటలకు ప్రయాణికులందరినీ డెక్‌మీద సమావేశపరిచి, అన్ని విషయాలూ చెప్పారు. ప్రమాదం జరిగితే లైఫ్‌ బోట్ల ద్వారా ఎలా తప్పించుకోవాలో వివరించారు. ఓడలో జిమ్‌, బ్యూటీపార్లర్‌, వేడి-చల్లని నీళ్ళ ఈతకొలనులు... ఇలా ఎన్నో వసతులు ఉన్నాయి. మేము కాసేపు షాపింగ్‌ చేసి, రాత్రి ఎనిమిది గంటలకు డిన్నర్‌ హాలుకి వెళ్లాం. అది మూడు అంతస్తులుగా ఉంది. అందులో రెండువేలమంది ఒకేసారి భోజనం చేయవచ్చు. వెయిటర్స్‌లో చాలామంది భారతీయులూ ఉన్నారు. మాకు ప్రియా పచ్చళ్లు కూడా వడ్డించారు.

లిల్లీపుట్స్‌!
మూడో రోజు ఉదయం ఏడు గంటలకే అల్పాహారం ముగించుకుని సిద్ధంగా ఉన్నాం. ఓడ కాజ్‌మల్‌ దీవికి చేరుకుంది. అందరం పాస్‌పోర్టులు చూపించి వాళ్లిచ్చిన టర్కీ టవల్సు తీసుకుని ఓడ దిగాం. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మేం ప్రయాణించిన ఓడ ఎంత పెద్దదో తెలిసింది. దాని పక్కన మేమంతా లిల్లీపుట్స్‌లా ఉన్నాం. ట్యాక్సీలు మాట్లాడుకుని బీచ్‌కు చేరుకున్నాం. పిల్లలూ పెద్దలూ అందరం సిమ్మింగ్‌ చేశాం. తరవాత స్నోర్కలింగ్‌కి బయలుదేరాం. చిన్న గొట్టం ఉన్న మాస్క్‌ పెట్టుకుని, తలను నీళ్లలో ముంచి ఈదుతూ లోపలున్న రంగురంగుల చేపల్ని చూడటం భలే ఆనందాన్నిచ్చింది. పక్కనే కోచ్‌ ఉంటాడు కాబట్టి భయం ఉండదు. అదయ్యాక అక్కడున్న దాబాల్లో లంచ్‌ చేసి సాయంత్రం ఐదు గంటలకల్లా తిరిగి వచ్చి ఓడ ఎక్కేశాం. ఈ కాజ్‌మల్‌ దీవిలో చాలామంది షాపింగ్‌ కూడా చేశారు. ఈ దీవి సహజ బీచ్‌లకు పుట్టిల్లు అని చెప్పాలి. రకరకాల నీటి క్రీడలకోసమే చాలామంది సందర్శకులు ఇక్కడకు వస్తుంటారు. స్టాఫ్‌ అంతా మమ్మల్ని పేరుపేరునా లోపలకు ఆహ్వానించారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు తిరుగు ప్రయాణం మొదలైంది. నాలుగో అంతస్తులో అతి పెద్ద కాసినో ఉంది. అక్కడే ఓ ఆర్ట్‌ గ్యాలరీ కూడా ఉంది. అందులో ప్రఖ్యాత చిత్రకారులు వేసిన చిత్రాలెన్నో ఉన్నాయి. వాటిల్లో 50 నుంచి వేల కోట్ల డాలర్లు ఖరీదు చేసేవి ఉన్నాయి.

పున్నమిరోజు...
ఆ రోజు రాత్రి పౌర్ణమి. అలల ఉధృతికి ఓడ కొద్దిగా వూగుతోంది. నిలబడితే పడిపోతామేమో అనిపించింది. ఆ రాత్రి పదకొండు గంటల సమయంలో మా పిల్లలు మాకు ఓ అద్భుతం చూపిస్తామంటూ ఐదో అంతస్తులో ఓడకంతటికీ ముందుభాగంలో ఉన్న టిప్‌ దగ్గరకు తీసుకెళ్లారు. దాని పేరు ‘బౌ ఆఫ్‌ ద షిప్‌’. ఆ వెన్నెల రాత్రిలో హోరుగాలిలో ఆకాశమూ నీరూ కలగలిసినట్లు కన్పిస్తున్న ఆ అనంత ప్రకృతిని చూడటం ఓ గొప్ప అనుభూతి. ఆ గాలిహోరులో ఒకరిమాట ఒకరికి వినిపించదు. అందరం శిలల్లా నిలబడి ఆ అద్భుతాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించాం. అదో అద్వైత రస సిద్ధి...ఆ దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం.

ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాల హాల్లో గంటల కోలాహలం. సిబ్బంది అంతా గరిటెలతో పళ్లాలమీద గంటలు కొడుతూ హాలంతా తిరుగుతూ మాకు వీడ్కోలు పలికారు. అది చూస్తుంటే పాతకాలంనాటి పెళ్లిళ్లలో చివరిపూట ఆడపెళ్లివారు గంట కొట్టడం జ్ఞాపకమొచ్చింది.

నిజానికి బయలుదేరేముందు చాలా భయపడ్డాం. మేమిద్దరం శాకాహారులం. పైగా చక్కెర వ్యాధి. కానీ ఓడలో చపాతీలూ పప్పూ కూరలూ ఉప్మా... లాంటివి చాలానే ఉన్నాయి. మొత్తంగా మా ఓడప్రయాణం ఎంతో ఆనందంగా ముగిసింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.