close
కొత్తగా...

కొత్తగా...

ఫోనే ఫొటో ఫ్రేమ్‌

ఎంత స్మార్ట్‌ ఫోన్లు వచ్చినా ఆఫీసుల్లోనూ పెద్దవాళ్లున్న ఇళ్లలోనూ ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు ప్రాముఖ్యత తగ్గలేదు. వాటిని సరికొత్తగా మార్చేందుకు వస్తున్నవే ‘ఫ్రేమ్‌ టెలీఫోన్లు’. ఫొటోఫ్రేమ్‌ ఆకారంలో టచ్‌ స్క్రీన్‌తో ఉండే ఈ ఫోన్‌ తెరమీద మామూలుగా ఉన్నప్పుడు మనం సెట్‌ చేసిన ఫొటో కనిపిస్తుంది. కాబట్టి, చూసేవారికి అది ఫొటోఫ్రేములా ఉంటుంది. ఇక, ఏదైనా కాల్‌ వచ్చినపుడు ఫోన్‌ నంబర్లతో పాటుగా నిక్షిప్తం చేసిన వారి ఫొటో దర్శనమిస్తుంది. ఇవి త్వరలోనే మార్కెట్లోకి వస్తాయట.


డబ్బాల స్టాండ్లు!

వంగం, చెక్క, గసగసాలూ, ధనియాలూ... ఇలా రోజువారీ వంటల్లో వాడే వాటిని వేరు వేరు డబ్బాల్లో వేసి పెట్టడం వల్ల స్థలమూ, ప్రతిసారీ వాటిని తీరుగా సర్దడానికి సమయం కూడా వృథానే. పైగా అరల్లో పెట్టినప్పుడు ఏది ఎక్కడుందో ఒక్కోసారి త్వరగా కనిపించవు. ఆ ఇబ్బంది లేకుండా నాలుగైదు డబ్బాలను ఒకే స్టాండ్‌కి అమర్చిన ‘మల్టీ మసాలా బాక్సులు’ వస్తున్నాయిప్పుడు. వరుసగా ఉన్నప్పుడు నిలువెత్తు క్యారేజీ గిన్నెల్లా ఉండే వీటిని అవసరమైనపుడు పక్కకు తిప్పి వాడుకోవచ్చు. అంతేకాదు, ఒకదానిమీద ఒకటి అమరి ఉండడం ఉల్ల ప్రతిసారీ మూతలు తీసి పెట్టాల్సిన పనికూడా ఉండదు. వీటిలో ఏ డబ్బాకాడబ్బాను గిన్నెల్లా విడిగా తియ్యొచ్చు కాబట్టి, డైనింగ్‌ టేబుల్‌మీద రకరకాల పచ్చళ్లూ సోంపులాంటివాటిని వేసుకోవడానికీ బాగుంటాయి. అంతేకాదు, చిన్నచిన్న యాక్సెసరీలను వేటికవే సర్దుకోవడానిక్కూడా ఇవి చక్కగా ఉంటాయి. మీకూ కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు.


ఈ కుండీకి అన్నీ తెలుసు

మొక్కలంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ హడావుడిగా ఉండేటపుడు వాటికీ కొంత సమయం కేటాయించాలంటేనే అందరికీ సాధ్యం కాదు. వూరెళ్లినపుడు అవి ఎండిపోతాయేమోననే భయం మరోపక్క. కానీ ఈ ‘ప్యారెట్‌ పాట్‌’లో మొక్కను వేస్తే మనకలాంటి ఇబ్బందే ఉండదు. ఎందుకంటే రెండు పొరలుగా ఉండే ఈ కుండీ అడుగునున్న చిన్నసైజు తొట్టెలో వారానికోసారి నీళ్లుపోస్తే చాలు, మొక్క మొదల్లో తేమ తగ్గినపుడు కుండీనే తెలుసుకుని కిందనున్న ఆ నీటిని సన్నటి ధారలుగా అవసరమైనంత మేర మొక్కకు పోస్తుంది. సెన్సర్లద్వారా పనిచేసే ఈ కుండీ ఇలా తేమశాతాన్ని గుర్తించడంతో పాటు, మొక్కకు సరైన పోషకాలు అందుతున్నాయా కాంతి సరిపోతుందా, ఎక్కువవుతుందా అన్న విషయాలనూ ఆప్‌ద్వారా మన ఫోన్‌కి పంపిస్తుంది. బాగుంది కదూ!


మాటల్లోనే చెప్పొచ్చు

పిల్లలు బడికీ కాలేజీకీ వెళ్లాక, పెద్దవాళ్లు ఆఫీసులకి వెళ్లడం, మళ్లీ ఒక్కొక్కరూ ఒక్కోసమయానికి తిరిగి రావడం... చాలామంది ఇళ్లలో రోజూ జరిగేదిదే. ఫలానా చోట స్నాక్స్‌ ఉన్నాయి వచ్చాక తినమని పిల్లలకి తెలియజేయాలన్నా, ఇంకేదైనా మర్చిపోకుండా చెయ్యాల్సిన పనిని భాగస్వామికి చెప్పాలన్నా చిన్న కాగితం మీద రాసి, ఫ్రిజ్‌కి అంటిస్తుంటాం. కానీ, హడావుడిగా ఆఫీసుకి బయలుదేరేటపుడు కాగితం మీద రాసి, అంటించాలంటే కాస్త సమయం పడుతుంది. అలాకాకుండా చెప్పాల్సిన విషయాన్ని చిటికెలో వీడియో సందేశంగా మార్చేలా వస్తున్నవే ఈ ‘డిజిటల్‌ వీడియో మెమో ఫ్రిజ్‌ మ్యాగ్నెట్‌’లు. అగ్గిపెట్టె సైజు డిజిటల్‌ కెమేరాల్లా ఉండే వీటిని అయస్కాంతం సహాయంతో ఫ్రిజ్‌లాంటి వాటికి సులభంగా అంటించేయొచ్చు. ఇక, రీఛార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ డిజిటల్‌ మెమో ముందు నిలబడి, బటన్‌ నొక్కి, అనుకున్న విషయాన్ని గబగబా చెప్పేస్తే అది అందులో ఫీడ్‌ చేసుకుంటుంది. మిగిలినవాళ్లు రాగానే ప్లే బటన్‌ నొక్కి, ఆ వీడియో సందేశాన్ని చూడొచ్చు.


రండి రండి... బరువు చూడండి

ఇంటికొచ్చినవాళ్లు గుమ్మం ముందున్న మ్యాట్‌ మీద అడుగెయ్యగానే అది వారి బరువును చూపించేస్తే... ‘ఇదేం చిత్రం’ అనుకోకుండా ఉండగలరా... అలాంటిదే ఈ ‘డోర్‌మ్యాట్‌ స్కేల్‌’. కొబ్బరి పీచుతో చేసిన పట్ట మధ్యలో పలుచటి వెయింగ్‌ మెషీన్‌ను పెట్టి రూపొందించిన ఈ మ్యాట్‌లో బరువును సూచించే కొంత భాగం మినహా మిగిలిందంతా చూడ్డానికి డోర్‌మ్యాట్‌లానే ఉంటుంది. కాబట్టి, ఇది రెండు రకాలుగా ఉపయోగపడటంతోపాటు, చూసిన వారికి కొత్తగానూ ఉంటుంది.


చమ్కీల మాయ

దిండు మీద చెయ్యి పెట్టి, కింది నుంచి పైకి జరపగానే చెయ్యి వెళ్లినంతమేరా రంగు మారిపోతుంది. వేళ్లతో అక్షరాలు రాసినా అక్కడ బట్ట మరోరంగులోకొచ్చేస్తుంది. ఇవి... కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ‘మర్మెయిడ్‌ పిల్లో’ ప్రత్యేకతలు. ఈ కుషన్‌ కవర్లకు కుట్టిన చమ్కీలకు పైవైపున ఓ రంగూ లోపలి వైపు మరో రంగూ ఉంటుంది. దాంతో మనం చేత్తో రాసినట్లు అనగానే చమ్కీలు వెనక్కు తిరిగి వెనకున్న రంగు కనిపిస్తుంది. ఇంత వినూత్నంగా ఉన్నాయి కాబట్టే, వీటికి సోషల్‌ మీడియాలోనూ కోట్ల లైక్‌లు వస్తున్నాయి. ఇదిచాలదూ, ఈ కుషన్లు మన హాల్లో ఉంటే ఇంటికొచ్చిన అతిథులు ఎంతగా ఆశ్చర్యపోతారో చెప్పడానికి.


డిజైన్లు మారే కారు

స్మార్ట్‌ఫోన్‌లో రోజుకో స్క్రీన్‌ సేవర్‌, వాట్సాప్‌లో గంటకో ముఖచిత్రం పెడుతున్న రోజులివి. మరి రోజూ తిరిగే కారుని మాత్రం ఎంతకాలమని ఒకే డిజైన్‌లో చూడగలరు. అందుకే, ఈతరం కోసం క్రొయేషియాకు చెందిన డిజైనర్‌ ‘ఎల్విస్‌ టామ్‌జెనోవిక్‌’ మోయ్‌ పేరుతో ఓ కొత్తరకం కారుకి రూపకల్పన చేశాడు. దీని పైభాగంలో పాలీకార్బొనేట్‌తో చేసిన రెండు పారదర్శక పొరల మధ్య టీవీ తెరలాంటి ఓ స్క్రీన్‌ని ఏర్పాటు చేశాడట. దీనిద్వారా ఫోన్‌లో ఉండే రకరకాల డిజైన్లనూ ఫొటోలనూ వీడియోలనూ కారుమీద ప్రసరణ అయ్యేలా చెయ్యొచ్చు. అంటే, ముందు ముందు కార్లు కూడా ఫోనూ టీవీ తెరల్లా ఫొటోలూ వీడియోలతో కళకళలాడతాయన్నమాట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.