close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనం మరచిపోయాం... గూగుల్‌ గుర్తుపెట్టుకుంది!

మనం మరచిపోయాం... గూగుల్‌ గుర్తుపెట్టుకుంది!

ఝాన్సీ లక్ష్మి, సరోజినీ నాయుడు, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌... భారతీయ చరిత్రలో తమకంటూ ఓ పేజీ దక్కించుకున్న వాళ్ల గురించి చెప్పమంటే ఇలా కొద్ది మంది పేర్లే గుర్తొస్తాయి. కానీ వందల ఏళ్లుగా దేశ అభివృద్ధికి పునాదులు వేసిన వాళ్లూ, శాస్త్రవేత్తలుగా, వైద్యులుగా, కవయిత్రులూ కళాకారిణులుగా రాణించిన మహిళలు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ల జీవితాల్నీ, విజయాల్నీ వెలుగులోకి తెచ్చి, దేశ ప్రగతిలో ఆడవాళ్ల పాత్రను తెలిపే అద్భుతమైన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది గూగుల్‌.

‘ఏ దేశ చరిత్ర చూసినా మగవాళ్ల ఆధిపత్యమే కనిపిస్తుంది. ఎందుకంటే వాటిని రాసేది వాళ్లే కదా’ అంటారు రోసాలిండ్‌ మైల్స్‌ అనే ఒక ఇంగ్లిష్‌ కవి. ఒక్కసారి మన దేశ చరిత్రను గమనించినా ఆ విషయం నిజమనే అర్థమవుతుంది. పురాణాల నుంచీ ప్రస్తుత జమానా దాకా హద్దులూ, ఆంక్షలూ చెరిపేస్తూ, తమ రంగాల్లో అసాధారణ విజయాలు నమోదు చేసిన మహిళలు చాలామంది ఉంటారు. కానీ వాటిలో చరిత్ర ప్రతుల నుంచి స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాల దాకా వచ్చే కథలు చాలా తక్కువ. అందుకే ఎంతో మంది మహిళల విజయగాథలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు వాటన్నింటినీ వెలికి తీసి, వాళ్ల ఘనతను ఈ తరం వాళ్లకీ, ఇక నుంచీ ప్రతి తరానికీ తెలియజేసే ప్రయత్నాన్ని గూగుల్‌ సంస్థ మొదలుపెట్టింది. ‘గూగుల్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌’ విభాగం ఆధ్వర్యంలో ముందుకెళ్తొన్న ఈ ఆన్‌లైన్‌ ప్రదర్శనలో భాగంగా వివిధ రంగాల్లో తమదైన ముద్రవేసిన ఆడవాళ్లకు సంబంధించిన రెండు వేలకుపైగా ఫొటోలూ, పెయింటింగులూ, వీడియోలూ, ఇతర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం దేశవ్యాప్తంగా అనేక మ్యూజియంల సహాయం తీసుకున్నారు. ఇప్పటికే గుర్తింపు ఉన్న మహిళలు కాకుండా ఎవరికీ తెలియని వాళ్ల సమాచారానికి ప్రాధాన్యమిచ్చారు. ‘అన్‌హర్డ్‌ స్టోరీస్‌’ పేరుతో మొదలైన ఈ ప్రాజెక్టులో శాస్త్రవేత్తలూ, కవయిత్రులూ, వైద్యులూ, ఇంజినీర్లూ, రాజకీయ నేతలూ... ఇలా అనేక రంగాల వాళ్లకు చోటు కల్పించారు.

2500ఏళ్ల చరిత్ర
తాజ్‌మహల్‌ అనగానే ముంతాజ్‌, షాజహాన్‌ గుర్తొస్తారు. కానీ అప్పట్లోనే సూఫీ మతపెద్దల జీవిత చరిత్రల్ని రాసిన వాళ్లిద్దరి పెద్ద కూతురు జహనారా గురించి ఎవరికీ తెలీదు. దిల్లీలో ప్రఖ్యాత చాందినీ చౌక్‌ ప్రాంతంతో సహా దేశంలో ఎన్నో పేరున్న నిర్మాణాలకు ఆమే డిజైన్‌ వేసింది. సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలేకి వచ్చిన పేరు ఆయన భార్య సావిత్రిబాయ్‌కి రాలేదు. దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్‌ ఆమేననీ, అమ్మాయిల కోసం మొట్టమొదటి పాఠశాలను మొదలుపెట్టిందీ ఆవిడేనన్న విషయం ఎక్కువగా ప్రస్తావనకు రాదు. 1865లో అమెరికాలో వైద్య విద్యని అభ్యసించిన తొలి భారతీయ మహిళ యమునా జోషి, వైద్యురాలిగా భారత్‌లో తొలిసారి ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన రక్మా బాయ్‌, 80ల్లో ఫిజిక్స్‌లో అద్భుతమైన పరిశోధనలకు తెరతీసిన శాస్త్రవేత్త విజయలక్ష్మి, దేశంలోని ప్రముఖ క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో ఒకటైన చెన్నై అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించిన ముత్తులక్ష్మీరెడ్డి... ఇలాంటి ఎంతోమంది స్ఫూర్తిదాయక మహిళలకు సంబంధించిన వందల కథనాలు ఫొటోలతో సహితంగా అందులో అందుబాటులో ఉన్నాయి. పురాణాల్లో స్త్రీల ప్రాధాన్యం, మహిళా సంగీత కళాకారిణుల బృందాలూ, మహిళా నాట్య, నాటక మండళ్లూ... ఇలా భారతీయ స్త్రీలకు స్ఫూర్తినిచ్చిన సంఘాలూ, వ్యక్తుల సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

అక్కడికే వెళ్లిన అనుభూతి!
చరిత్రలోనే కాదు, ప్రస్తుత తరంలోనూ ఎక్కువ ప్రచారం లేకుండా ఏదో ఒక సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న మహిళలు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లతో మాట్లాడి గూగుల్‌ ప్రత్యేకమైన డాక్యుమెంటరీలను రూపొందించింది. రాణీ రూపమతీ పెవిలియన్‌, కస్తూర్బా మెమొరియల్‌, దిల్లీ రాణి మహల్‌, పద్మినీ ప్యాలెస్‌ లాంటి అనేక చారిత్రక నిర్మాణాలను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి చూసిన అనుభూతిని కలిగించేందుకు 360 డిగ్రీల కోణాల్లో ఆయా ప్రదేశాల వర్యు్చవల్‌ టూర్‌ని కూడా ఏర్పాటు చేసింది. ‘ఈ రోజు భారతీయ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారంటే దానికి సామాజిక కట్టుబాట్లను పక్కనబెట్టి నాటి తరం స్త్రీలు వేసిన పునాదులే కారణం. అలాంటి వాళ్ల గురించి ఈ తరం వాళ్లకి తెలియజేసి, వారికి మరింత స్ఫూర్తినివ్వాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం’ అంటారు భారత్‌లో గూగుల్‌ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు లూసెలా. కేవలం చరిత్రతో ఆన్‌లైన్‌ ప్రదర్శనను సరిపెట్టకుండా, దేశవ్యాప్తంగా అనేక మంది ఆడవాళ్లు వేసిన చిత్రాలూ, తయారు చేసిన కళాకృతులూ, వాళ్లు రాసిన పుస్తకాల ప్రతులనూ అందుబాటులో ఉంచారు. అత్యంత శక్తిమంతమైన గిగాపిక్సెల్‌ కెమెరాలతో తీసిన ఫొటోలను పొందుపరచడంతో వెయ్యేళ్ల నాటి పెయింటింగులను కూడా ఎన్నో రెట్లు జూమ్‌ చేసుకొని చూడొచ్చు.

అచ్చంగా భారతీయ స్త్రీల గొప్పతనాన్ని తెలియజేసే ఉద్దేశంతో మొదలైన తొలి ప్రదర్శన ఇదే. మనవాళ్లకు రాని ఆలోచన గూగుల్‌కి రావడం అభినందించాల్సిన విషయమే కదా. గూగుల్‌లోకి వెళ్లి ‘విమెన్‌ ఇన్‌ ఇండియా-అన్‌హర్డ్‌ స్టోరీస్‌’ అని కొడితే వచ్చే వెబ్‌సైట్లోకి వెళ్తే ఈ మహిళా మ్యూజియంలోకి అడుగుపెట్టొచ్చు. ప్రవేశం ఉచితమేనండోయ్‌.


‘అండర్‌-25’... ఓ యువ మేళా!

దేశంలో యువత ఉద్యోగాల కోసమే కలలుగనడంలేదు. సొంత కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. యువత అంటే భవిష్యత్తు కాదు, వర్తమానమేనని చాటిచెబుతోంది. వ్యవస్థ సహకరించకపోయినా తమకుతామే సహకరించుకుంటోంది. అలాంటివారిని చూడాలంటే ‘అండర్‌-25 సమిట్‌’కు వెళ్లాల్సిందే!

క్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మనదేశంలో సగం మంది పాతికేళ్లలోపువారే. ‘మనశక్తి యువశక్తి’ అన్నమాట అన్నిచోట్లా వినిపిస్తోంది. సాంకేతికత అందుబాటు, ప్రభుత్వ మద్దతు, పెట్టుబడిదారుల ఆసక్తి... మొత్తంగా దేశంలో అంకుర సంస్థలకు మంచి ప్రోత్సాహం దొరుకుతోంది. అయితే అక్కడా కొన్ని పరిమితులున్నాయి. వ్యవస్థాపకులు కంపెనీ పెట్టిన రంగంలో అనుభవం పొందాలి, ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేయాలి, పేరున్న విద్యా సంస్థల్లో చదువుకోవాలి... ఇవేవీ లేకుండా కంపెనీ పెట్టడం అంత సులభం కాదు. ఆ విషయం ఆంటో ఫిలిప్‌కి తొందరగానే అనుభవమైంది.

చదువుతూనే కంపెనీ
బెంగళూరులోని క్రైస్ట్‌ యూనివర్సిటీలో బీకామ్‌ మొదటి ఏడాది చదువుతున్నపుడే రిస్ట్‌ బ్యాండుల తయారీ సంస్థని ప్రారంభించాడు ఫిలిప్‌. కాలేజీలూ, యూనివర్సిటీల పేర్లతోపాటు ఫంకీగా ఉండే రిస్ట్‌బ్యాండ్‌లను తయారుచేసేది అతడికి చెందిన ‘బిగ్‌ బ్యాండ్‌ థియరీ’ సంస్థ. ఏడాదిలో 1.80లక్షల రిస్ట్‌ బ్యాండ్‌లను అమ్మాడు. తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలనుకున్నాడు. కానీ పెట్టుబడి కోసం ఎవరిని కలిసినా ‘పిల్లాడిలా కనిపిస్తున్నావ్‌.. నువ్వేం వ్యాపారం చేస్తావ్‌’ అని పంపేసేవారు. వ్యాపారానికీ వయసుకీ ఎందుకు ముడిపెడతారోనని చాలాసార్లు అనుకునేవాడు ఫిలిప్‌. తనలాగే చాలామందికి ఈ సమస్య ఎదురయ్యే ఉంటుందనుకున్నాడు. తన కాలేజీలోనే బీబీఎమ్‌ చదువుతున్న మిత్రుడు శ్రేయాన్స్‌ జైన్‌ని కలిసి పాతికేళ్లలోపు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు ‘అండర్‌-25 క్లబ్‌’ని ఏర్పాటుచేద్దామన్నాడు. అక్కడ పాతికేళ్లలోపు యువకులూ, విద్యార్థులూ తమ వ్యాపారాల గురించి తోటివారితో చర్చించడం, వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అనుభవజ్ఞుల మార్గనిర్దేశం తీసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం... మొదలైనవి చేయాలన్నది ప్రణాళిక. ఏడాదిపాటు దానిగురించి ఫిలిప్‌, జైన్‌ ప్రణాళికలు వేసుకునేవారు. 2014 ఫిబ్రవరి 23న బెంగళూరులో మొదటి ‘అండర్‌-25 స్టార్టప్‌ సమిట్‌’ని నిర్వహించారు.

‘స్టార్టప్‌లకోసం స్టార్టప్‌’ అంత సులభమైన వ్యవహారం కాదు. నమ్మకమైన, విలువైన వేదికమీద తప్పిస్తే తమ ఆలోచనల్ని ఎవరూ అంత సులభంగా పంచుకోరు. అలాంటి నమ్మకమైన వాతావరణమే ‘అండర్‌-25’లో కల్పించారు ఫిలిప్‌, జైన్‌. మొదటి సమావేశానికి ఉచిత ప్రవేశం కల్పిస్తే 100 మంది వచ్చారు. బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా పేరున్న ఎనిమిది మంది యువ వ్యాపారుల్ని సమావేశంలో మాట్లాడేందుకు తీసుకొచ్చారు. మరోవైపు స్పాన్సర్లనీ సంపాదించారు. మొత్తానికి ఆరంభం అదిరింది. 2015లో నిర్వహించిన సమిట్‌కి 600 మంది వచ్చారు. 2016 జనవరిలో జరిగిన సమావేశానికి 1700 మంది హాజరయ్యారు. ఆ సమావేశంలో దాదాపు 100 మంది వక్తలు తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సమావేశానికి దేశం నలుమూలల నుంచీ ఔత్సాహిక యువ వ్యాపారులు హాజరయ్యారు. ‘ఇలాంటి సమావేశాన్ని మా నగరంలోనూ ఏర్పాటుచేయండి’ అంటూ చాలామంది కోరడంతో ముంబయి, హైదరాబాద్‌, దిల్లీల్లోనూ ‘అండర్‌-25’ సమావేశాల్ని నిర్వహించారు. జులై 31న హైదరాబాద్‌లోని టి-హబ్‌లో నిర్వహించిన సమావేశానికి వెయ్యిమంది హాజరయ్యారు.

యువ ఉత్సవం
యువత అంటే విద్య, విజ్ఞానమే కాదు, వినోదం కూడా. ఆ విషయం పెద్దవాళ్లకైతే ప్రత్యేకించి చెప్పాలి కానీ 21 ఏళ్ల ఫిలిప్‌, జైన్లకు తెలీదా! అందుకే తమ అండర్‌-25 సమావేశాల్లో వినోదాన్ని జోడించారు. క్రితంసారి బెంగళూరులో డిజైన్‌, సంగీతం, ఆహారం, సాంకేతికత, యంగ్‌ అచీవర్స్‌ లాంటి విభాగాల్ని కొత్తగా ప్రవేశపెట్టారు. దాంతో అప్పటివరకూ స్టార్టప్‌ ఉత్సవంగా ఉన్న ‘అండర్‌-25’ కాస్తా యువ ఉత్సవంగా మారింది. కేవలం వ్యాపారమనే కాకుండా యువతలోని సృజనాత్మకతనీ, ప్రతిభాపాటవాలనీ వెలికితేసే ఉద్దేశంతో ఇతర విభాగాల్నీ తీసుకొచ్చారు. ఆ సమావేశాల్లో 24 గంటల హ్యాకథాన్‌ను కూడా నిర్వహించారు. యువ వ్యాపారుల తల్లిదండ్రులు తమ పిల్లల గురించి వివరించే చర్చావేదికను పెట్టారు. చిత్రకారులూ, కళాకారులూ తమ చిత్రాల్నీ కళాఖండాల్నీ ప్రదర్శనకు ఉంచారు. సంగీతకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కొన్ని విభాగాల్లో పోటీల్నీ నిర్వహించారు. అండర్‌-25 సమావేశాల్లోని వక్తల్లో పాతికేళ్లలోపువారే ఎక్కువ. ఐఐటీ ప్రవేశపరీక్షకి ఉపయోగపడే ‘ఎగ్జామిఫై’ ఆప్‌ను తీసుకొచ్చిన 20ఏళ్ల అంగద్‌ నాద్‌కర్ణి, పదేళ్ల రేసర్‌ రుహాన్‌ అల్వా, 22 ఏళ్లకే బేకరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగాల్లో రాణిస్తున్న కవలలు టెస్సా, టీనా... ఇలా ఎందరో అండర్‌-25 వేదికలపైన తమ విజయగాథలు వినిపించారు. వీరితోపాటు వివిధ రంగాల్లోని అనుభవజ్ఞులకీ వక్తల్లో చోటు ఉంటుంది.

ప్రస్తుతం అండర్‌-25ని దేశంలోని మరిన్ని నగరాలకు విస్తరించే పనిలో ఉన్నారు ఫిలిప్‌, జైన్‌. 2017 బెంగళూరు అండర్‌-25 సమిట్‌ జనవరి 5-8 మధ్య జరగనుంది. ఈ సమావేశాల్లో పాతికేళ్లుపైబడిన వాళ్లకీ ప్రవేశం ఉంది. కాకపోతే వాళ్లకి ఫీజు ఎక్కువ. ఏంటీ బెంగళూరు వెళ్లిరావడానికి టికెట్లు బుక్‌ చేయాలనుకుంటున్నారా, అంతకంటే ముందు under25summit.com వెబ్‌సైట్లో సమావేశానికి రిజస్ట్రేషన్‌ చేసుకోండి. లేకుంటే మీ టికెట్లు వృథా కావచ్చు.


ఆ ‘ఇడియట్‌’ అతడే!

జమ్ము కశ్మీర్‌లోని లద్దాఖ్‌కి వెళ్లే పర్యటకులకు ప్రకృతి అందాలే కనిపిస్తాయి. కానీ చలికాలంలో పంటలు పండించుకోవడానికి నీరు లేక పడే ఇబ్బందులు స్థానికులకే తెలుస్తాయి. దశబ్దాల తరబడి సాగుతోన్న ఆ వెతలకు మంచు స్థూపాల రూపంలో పరిష్కారం చూపించిన సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ఇటీవలే రోలెక్స్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు వరించింది. ప్రపంచంలో ఎక్కడా లేని సృజనాత్మక విద్యావిధానాన్ని మొదలుపెట్టి ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ పాత్రకు స్ఫూర్తినిచ్చిందీ అతడే.

భూతల స్వర్గంలా కనిపించే లద్దాఖ్‌ అందాల్ని చూస్తేనే పర్యటకులకు కడుపు నిండిపోతుంది. కానీ స్థానికుల కడుపునిండాలంటే మాత్రం అక్కడ పంటలు పండాల్సిందే. నిత్యం నీరంతా గడ్డకట్టిన స్థితిలో ఉండే ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయడం మాటలు కాదు. దశాబ్దాల తరబడి వేధిస్తున్న ఈ సమస్యకు సోనమ్‌ వాంగ్‌చుక్‌ అనే స్థానిక శాస్త్రవేత్త పరిష్కారం చూపించాడు. ఎండాకాలంలో మంచు కరిగి వృథాగా కిందకి పోయే నీటిని భద్రపరిస్తే, వాటిని వ్యవసాయానికి వాడుకోవచ్చనీ, ఫలితంగా వరదల ప్రమాదమూ తగ్గుతుందన్నది అతడి ఆలోచన. దానికోసం ‘మంచు స్థూపాల’ పేరుతో వూళ్ల మధ్యలోనే లక్షల లీటర్ల నీటిని నిల్వ ఉంచుకునే భారీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. కరిగే హిమానీనదాల నీటిని ఒడిసిపట్టి, భారీ ఐసు కొండల్లా మార్చి అవసరానికి నీరందించేవే ఈ మంచు స్థూపాలు. దీనికోసం సోనమ్‌ మొదట వేల అడుగుల ఎత్తుమీదున్న సరస్సులోకి పైపులైన్‌ వేసి, మరో అంచుని వూరి మధ్యలో చదును చేసిన ప్రాంతం దగ్గర ఇరవై మీటర్ల ఎత్తులో అమర్చాడు. పైపులో నీరు గడ్డకట్టకుండా దాన్ని భూమికి రెండు మీటర్ల లోతులో ఉంచాడు. సరస్సులో నుంచి ప్రవహించేనీరు పైపులో నుంచి కింద పడే సమయంలో గాలి తగలగానే అది అక్కడికక్కడే గడ్డ కడుతుంది. అలా గడ్డకట్టిన నీరంతా అక్కడే భారీ మంచు కొండలా పేరుకుపోతుంది. చలికాలం ముగిసే సమయానికి చాలా నెమ్మదిగా ఆ ఐస్‌ కరగడం మొదలవుతుంది. ఆ నీటినే అక్కడి నుంచి చిన్నచిన్న పైపుల ద్వారా చుట్టుపక్కల పొలాలకు అందించొచ్చు. రెండేళ్ల క్రితం గ్రామమంతా నీటి కోసం అల్లాడుతున్న సమయంలోనూ ఆ మంచు స్థూపాల చుట్టుపక్కల మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టమూ పెరగడంతో గ్రామస్థులంతా ఆనందంలో మునిగిపోయారు. సోనమ్‌ ఆధ్వర్యంలో మరిన్ని మంచు స్థూపాల నిర్మాణాన్ని మొదలుపెట్టి నీటి కష్టాల్ని దూరం చేసుకుంటున్నారు. దాదాపు కోటిన్నర లక్షల లీటర్ల నీటిని నిల్వచేసుకునే ఈ స్థూపాలను ఆయా ప్రభుత్వాల కోరికపైన నేపాల్‌, స్విట్జర్లాండ్‌లలోనూ సోనమ్‌ నిర్మించడం విశేషం.

ఉత్తీర్ణత 95శాతానికి...
ఇరవై ఏళ్లుగా లద్దాఖ్‌ వాసుల జీవితాల్ని మార్చేందుకు సోనమ్‌ చేస్తున్న ఎన్నో పనుల్లో ఈ మంచు స్థూపాల ఆవిష్కరణా ఒకటి. గతంలో అతడు ఏర్పాటు చేసిన ‘స్టూడెంట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ లద్దాఖ్‌’(సెక్మోల్‌) అనే విద్యా కేంద్రానికి ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అన్నింటికీ మించి కొన్ని వందల మంది జీవితాలు బాగుపడ్డాయి. అక్కడ పల్లెల్లో ప్రాథమిక విద్యంతా లద్దాఖీ భాషలోనే సాగడంతో పైతరగతులకు వెళ్లే కొద్దీ ఇంగ్లి్లష్‌, హిందీ భాషల్ని నేర్చుకోలేక పిల్లలంతా చదువులో వెనకబడేవారు. ఫలితంగా పదో తరగతిలో ఉత్తీర్ణత ఐదు శాతంలోపే ఉండేది. ఇరవై రెండేళ్ల క్రితం సోనమ్‌ ‘ఆపరేషన్‌ న్యూ హోప్‌’ పేరుతో అక్కడ విద్యా విధానంలో ప్రక్షాళన మొదలుపెట్టాడు. టీచర్లతో పాటు కొందరు విద్యావలంటీర్లకు శిక్షణ ఇచ్చాడు. పిల్లలకు ఇంట్లో స్థానిక భాష, స్కూళ్లలో ఇంగ్లిష్‌, హిందీ భాషలు నేర్పేలా చూశాడు. అలా అనేక చర్యల అనంతరం పదో తరగతిలో ఐదు శాతంగా ఉండే ఉత్తీర్ణత ఇప్పుడు తొంభై ఐదు శాతానికి చేరింది. ప్రస్తుతం జమ్ము క¹శ్మీర్‌ ప్రభుత్వం అతడి విధానాల్నే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది.

జీవితాలు మారాయి
సోనమ్‌ ఏర్పాటు చేసిన ‘సెక్మోల్‌’ విద్యా కేంద్రంలో పదోతరగతి ఫెయిలైన వాళ్లూ, ప్రతిభ ఉండీ చదువులో రాణించలేని వాళ్లకే ప్రవేశం. చదువూ, ఆటలూ, కళలూ, కంప్యూటర్లూ... ఇలా వాళ్లకు ఆసక్తి ఉన్న అంశాలనే అక్కడ బోధిస్తూ అందులోనే ఉపాధిని వెతుక్కునేలా చూస్తారు. అలా పదేళ్ల పాటు ఆ పాఠశాలలో పెరిగిన తిన్లాస్‌ కోరల్‌ అనే యువతి లద్దాఖ్‌లో మొట్టమొదటి మహిళా పర్యటక సంస్థను నెలకొల్పింది. స్టాంజిన్‌ దోర్జాన్‌ అనే మరో విద్యార్థి అక్కడ ఇప్పుడు ప్రముఖ సినీ దర్శకుడు. చోజాంగ్‌ నంగాయ్‌ అనే మరో యువకుడు ‘లద్దాఖ్‌ ఫైన్‌ ఫుడ్స్‌’ పేరుతో వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండ్‌ని మొదలుపెట్టాడు. ఇక పదోతరగతిలో ఐదు సార్లు ఫెయిలైన సెవాంగ్‌ రిగ్జిన్‌, తరవాత ముంబైలో జర్నలిజం చేసి ఆపైన ‘లద్దాఖ్‌ హిల్‌ కౌన్సిల్‌’లో విద్యాశాఖకు అధ్యక్షుడిగా ఎదిగాడు. ఐఏఎస్‌ అధికారిగా మారిన సెవాంగ్‌ తార్చిన్‌, జాతీయ ఐస్‌ హాకీ ఛాంపియన్‌ స్టాంజిన్‌ దోల్కర్‌... ఇలా ఒకప్పుడు చదువులో వెనకబడి ఎందుకూ పనికిరారని ముద్ర వేయించుకున్న చాలామంది సోనమ్‌ శిక్షణలో అత్యున్నత స్థాయికి ఎదిగారు.

ఎనిమిదేళ్ల వయసులో బడిలో చేరిన సోనమ్‌, తరవాత అందరితోపాటే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి తనకు నచ్చిన బాటలో నడుస్తూ, ఇతరులనూ నడిపిస్తున్నాడు. మన విద్యా విధానంలో లోపాల్ని ఎత్తిచూపిన ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలో ఆమిర్‌ఖాన్‌ వేసిన ‘ఫున్‌షుక్‌ వాంగ్డూ’ పాత్రకు స్ఫూర్తి ‘సోనమ్‌ వాంగ్‌చుకే’. అతడి కథ సినిమాకి ప్రేరణైతే, అతడి జీవితం సమాజానికే ప్రేరణ..!


విదేశీయుడూ... ఓ సంగీత విద్యాలయం!

హిందుస్థానీ సంగీతం విని ముగ్ధుడైపోయాడో కెనడా పర్యటకుడు. ఇక్కడి కళలూ, సంస్కృతులూ అతన్ని ఆకట్టుకున్నాయి. వంశపారంపర్యంగానో, డబ్బుండి నేర్చుకునే వాళ్లకో ఎక్కువగా చేరువయ్యే ఈ కళలను పేద పిల్లలకూ నేర్పించాలనుకున్నాడు. ఆ ఆలోచనకు రూపమే వందల మందికి ఉచితంగా పాటలతో పాటూ పాఠాలూ నేర్పిస్తున్న ‘కల్కెరి సంగీత విద్యాలయ’.

కాశంలో మేఘాలు వస్తుంటాయీ పోతుంటాయి. ఒక ప్రాంతాన్ని దాటి అలా కదిలిపోయే మబ్బులు ఎన్నో. కానీ కొన్ని మబ్బులు నిలబడతాయి. వర్షాన్ని కురిపిస్తాయి. తానున్న ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి. అచ్చంగా రెండో కోవకు చెందుతాడు కెనడాకు చెందిన మాథ్యూ ఫోర్టియర్‌. దేశాన్ని చూసేందుకు భార్య అగాథ్‌ ఫోర్టియర్‌తో కలిసి వచ్చిన అతను ఇక్కడే ఉండిపోయి మన శాస్త్రీయ సంగీతాన్నే కాదు వివిధ సంగీత నృత్య కళలనూ ఎంతో మంది పిల్లలకు చేరువ చేస్తున్నాడు.

పర్యటనకు వచ్చి....
భారతదేశాన్ని చూసేందుకు వచ్చిన మాథ్యూ మొదట రవీంద్రుని ఆశ్రమం శాంతినికేతన్‌లో దాదాపు రెండేళ్లు గడిపాడు. అక్కడే యోగాతో పాటూ భారతీయ భాషలనూ నేర్చుకున్నాడు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలను తిరిగాడు. ఆ క్రమంలోనే హిందుస్థానీ సంగీతాన్ని విని పరవశుడయ్యాడు. దాన్ని వశం చేసుకోవాలని ఏళ్లతరబడి సాధన చేస్తూ ఆనందించాడు. ఆయన భార్య అగాథ్‌ కూడా ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసింది. అలా సంగీతం మీద తనకేర్పడిన ప్రేమే కర్ణాటక జిల్లాలోని ధర్వాడ్‌ దగ్గర కల్కెరి సంగీత్‌ విద్యాలయాన్ని స్థాపించాలనే ఆలోచనకు పాదుగొల్పింది.

సాధన చేస్తూ...
కర్ణాటక రాష్ట్రంలోని ధర్వాడ్‌ సంగీతానికి ప్రసిద్ధి చెందిందని తెలుసుకున్న మాథ్యూ, భార్యతో కలిసి అక్కడికి బయలుదేరాడు. అక్కడే సంగీత కళాశాలలో బ్యాచిలర్స్‌ డిగ్రీలో చేరాడు. అదే సమయంలో ఆ కళాశాల ప్రిన్సిపల్‌ ఉస్తాద్‌ హమీద్‌ఖాన్‌తో పరిచయం అయింది. అతనూ సితార్‌ విద్వాంసుడు. మాథ్యూ, అగాథ్‌, హమీద్‌ఖాన్‌లు సాయంత్రంపూట దాదాపు నలభై మంది పిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పేవారు. ఏడాది పాటు ఇది కొనసాగిన తర్వాత, ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా పూర్తిస్థాయి పాఠశాల స్థాపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ధర్వాడ్‌కు 16కి.మీ. దూరంలో ఉన్న కల్కెరి గ్రామంలో ఐదెకరాల స్థలాన్ని తీసుకుని అక్కడే 2002లో ‘కల్కెరి సంగీత్‌ విద్యాలయ’ పేరిట ఓ పాఠశాలను స్థాపించారు. 12 మంది పిల్లలూ ఇద్దరు టీచర్లతో మొదలైన ఈ పాఠశాల ఇప్పుడు 43 మంది సిబ్బందీ రెండువందల యాభైకిపైగా విద్యార్థులతో నిండిపోయింది.

ఏమిటీ పాఠశాల...
కల్కెరి సంగీత్‌ విద్యాలయ... పేరుకి పూర్తిస్థాయి సంగీత పాఠశాలే అయినా, ఇక్కడ మామూలు పాఠశాల తరగతులూ జరుగుతాయి. అంటే చదువూ, కళల్లో ఇక్కడి పిల్లలు సమాన శిక్షణ తీసుకుంటారు. కేవలం నిరుపేద పిల్లలనే ఇందులో చేర్చుకుంటారు. బట్టలూ, పుస్తకాలూ, భోజనం సహా పూర్తి వసతి ఉచితం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో పాటూ, తబలా, సితార, వయొలిన్‌, హార్మోనియం, వేణునాదం ఇలా వివిధ సంగీత కళలు నేర్పుతారు. ఐదోతరగతి వరకూ పిల్లలు వీటన్నింటిలో ప్రాథమిక పట్టు సాధిస్తారు. ఆరో తరగతి నుంచి వీటిలోంచి ఎవరికి నచ్చిన రెండు అంశాల్లో వాళ్లు శిక్షణ తీసుకోవచ్చు. వీటితో పాటూ భరతనాట్యం, డ్రామాల్లోనూ శిక్షణ ఉంటుంది. ఉదయం పూట ఒకగంట సాధన తరువాత తరగతులు ప్రారంభం అవుతాయి. మూడు గంటల పాటు వివిధ కళల్లో శిక్షణనిస్తారు. మిగిలిన సగంరోజూ ఆ రాష్ట్ర సిలబస్‌ ప్రకారం పాఠాలు బోధిస్తారు. ఇక్కడ పదోతరగతి వరకూ పాఠశాల ఉంది. పిల్లలు చదువుల్లోనూ మెరుగ్గా ఉంటూ 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఆరేళ్ల వయసు నుంచి 23 సంవత్సరాల వాళ్ల వరకూ విద్యార్థులు ఉన్నారు. పదో తరగతి పూర్తయ్యాక ఇక్కడే ఉండి ఉన్నత చదువులు చదువుకోవచ్చు. కామర్స్‌, ఆర్ట్స్‌, సైన్స్‌ ఇలా ఎవరికి నచ్చిన చదువు వాళ్లు చదువుకోవచ్చు. అలా పెద్ద చదువుల్లో ఉన్న పిల్లలు 14 మంది ఉన్నారు. పాఠశాల స్థాపన వెనుక ఉన్న వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన మరో వ్యక్తి మాథ్యూ సోదరుడు బ్లెయిజ్‌. ఇతను ‘యంగ్‌ మ్యూజిషియన్స్‌ ఆఫ్‌ ద వరల్డ్‌(కెనడా)’కు సంచాలకులుగా పనిచేస్తున్నారు.

పాఠశాల పూర్తిగా విరాళాల మీదే నడుస్తోంది. అందులో విదేశీ విరాళాలే ఎక్కువ. వీటిని తీసుకురావడంలో బ్లెయిజ్‌ ప్రముఖపాత్ర పోషిస్తున్నారు. పాఠశాల ప్రవేశాల కోసం కనీసం 300 దరఖాస్తులు వస్తాయట. పిల్లలూ, తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయడంతో పాటూ వాళ్ల ఇళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులూ, పాఠశాలలో చేరడం పట్ల వాళ్ల నిబద్ధతలను అంచనా వేసి చివరికి 20 నుంచి 25 మంది పిల్లలను ఎంపిక చేసుకుంటారు. ‘కళ మన నుంచి తరవాత తరాలకు చేరుతుంది. గురుశిష్యుల పరంపర ద్వారా కళలు వ్యాప్తి చెందుతాయని మేం నమ్ముతాం. అంత మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నప్పుడు పిల్లల్లోనూ ఆ ఉత్సాహం కనబడినప్పుడే మేం విజయం సాధిస్తాం. అందుకే చేర్చుకునేప్పుడే చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఉత్సాహం ఉన్న మరో విద్యార్థి ప్రవేశ అవకాశాన్ని కోల్పోకూడదు కదా’ అంటారు మాథ్యూ. ఇక్కడ స్వచ్ఛంద సేవకులూ ఎక్కువ మంది విదేశీయులే. మనం కూడా పాఠశాలకు సేవ చేయాలనుకున్నా, విరాళాలివ్వాలనుకున్నా కేఎస్‌వీ.ఓఆర్జీ.ఇన్‌ (ksv.org.in) లోకి వెళ్లొచ్చు.


బుర్జ్‌ ఖలీపాలో 22 అపార్ట్‌మెంట్లు!

బుర్జ్‌ ఖలీఫా... దుబాయిలోని ఆ భవనాన్ని ప్రత్యక్షంగా చూడ్డానికి సామాన్యులెంతో ఆసక్తి చూపిస్తారు. అందులో ఒక అపార్ట్‌మెంటునైనా సొంతం చేసుకోవాలని శ్రీమంతులంతా ఆశ పడతారు. అలాంటిది దాన్లో 22 అపార్ట్‌మెంట్లను సొంతం చేసుకున్నాడు దుబాయిలో స్థిరపడ్డ కేరళ వాసి జార్జ్‌ వి నెరియపరంబిల్‌.