close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘కృత్రిమ’ మేధావి!

‘కృత్రిమ’ మేధావి!

పెసరట్టు కడక్‌!
చికెన్‌ బిర్యానీ, డబుల్‌ మసాలా!
తందూరీ రోటీ, నూనె తక్కువ!
...కోరిన రుచుల్ని కోరినట్టుగానే వండిపెట్టే ‘రోబోషెఫ్‌’లు మార్కెట్లోకి వస్తున్నాయి. రాగి దోసె, జొన్న పులావ్‌ - ఇలా మీ కుటుంబానికో, మీ ప్రాంతానికో మాత్రమే పరిచయమైన వంటైనా సరే. రోబో భీముడు...పక్కా లోకల్‌ ఘుమఘుమలతో వడ్డించేస్తాడు. కాకపోతే, ఆ పద్ధతిని వీడియో తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఆ బొమ్మల్ని చూసే వంట నేర్చేసుకుంటుందా యంత్రం. ఉడుపీ హోటళ్ల మసాలా దోసెలూ, హైదరాబాదీ రెస్టరెంట్ల బిర్యానీలూ, మెక్‌డొనాల్డ్స్‌వారి బర్గర్లూ...మనింట్లోనే, మన రోబోతోనే వండించుకుని తినవచ్చు. అడిగితే, ఆయా రుచుల్లోని పోషక విలువల సమాచారాన్నీ అందిస్తుంది. పనంతా అయిపోయాక...పాత్రల్ని శుభ్రంగా తోమేస్తుంది కూడా. అంతేనా...దినుసుల్లో ఏ బొద్దింకలో, గులకరాళ్లొ కనిపిస్తే...వెంటనే అలారమ్‌ మోగిస్తుంది. ఈ చేయితిరిగిన షెఫ్‌ కమ్‌ నమ్మకమైన పనిమనిషి కమ్‌ నిపుణుడైన న్యూట్రిషనిస్ట్‌ కమ్‌ కృత్రిమ మేధావి రోబో... పాకశాస్త్ర రంగంలో ప్రకంపనలు సృష్టించబోతోంది.

* * *

‘డూడ్‌! నీ మనసెక్కడికో వెళ్లిపోతోంది. కాస్త పనిమీద దృష్టిపెట్టు’
‘అరె భాయ్‌! అంత దూకుడెందుకు. నువ్వు ఒత్తిడిలో ఉన్నావిప్పుడు. స్టాక్‌మార్కెట్‌ నిర్ణయాల్ని రేపటికి వాయిదా వేసుకో’
‘ఒరే బుద్ధావతారం! ఇంకా అర్థం కాలేదా? ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో చదువుకున్నావే, ఆ ఫార్ములాను ఇక్కడ ప్రయోగించి చూడు...’
- ‘బ్రెయిన్‌ సెన్సింగ్‌ హెడ్‌ బ్యాండ్‌’ను తగిలించుకుంటే చాలు. ఆ తెలివైన యంత్రం సెన్సర్ల సాయంతో మన మెదడు ఏ స్థితిలో ఉందన్నది అంచనా వేసి...సెల్‌ఫోన్‌కు సమాచారం పంపుతుంది. అందులో హెచ్చరికలుంటాయి, విశ్లేషణలుంటాయి, సలహాలూ సూచనలూ ఉంటాయి. ఇప్పటికే, ఈ పరికరాన్ని ప్రయోగాత్మకంగా ఓ యాభైమంది నిపుణుల మీద ప్రయోగించారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, మరో ఆర్నెల్లలో అమ్మకానికి రావచ్చు.

* * *

‘అదిగో...ఆ కోలమొహం అమ్మాయికి వంగపండు రంగంటే మహా ఇష్టం. సంప్రదాయ డిజైన్లంటే ప్రాణమిస్తుంది. కాకపోతే, గీచిగీచి బేరాలాడుతుంది. డిస్కౌంటు ఇవ్వమంటూ ప్రాణాలు తోడేస్తుంది. తన అభిరుచుల ప్రకారం చూస్తే...కుడివైపు అరలోని ఐటమ్‌ నంబర్‌...ఎక్స్‌వైజెడ్‌ను కొనే అవకాశం ఎక్కువ! ముందు అవే చూపించు’ - ఖాతాదారులు ఏ బట్టల దుకాణంలోనో కాలుపెట్టడమే ఆలస్యం, కంప్యూటర్లు ఆ కస్టమర్ల కొనుగోలు చరిత్రనంతా చెప్పేస్తాయి. సేల్స్‌ సిబ్బంది ఆ వివరాలతో అల్లుకుపోవచ్చు. ‘సేల్స్‌ఫోర్స్‌’ సంస్థ ఈ టెక్నాలజీకి ప్రాణంపోసింది

* * *

అవసరం ఆవిష్కరణకు అమ్మ లాంటిది. అవసరం లోంచి ఆలోచన పుడుతుంది. ఆలోచనతో పాటే అంతర్మథనం జరుగుతుంది. అంతర్మథనం ఫలితంగా ఆవిష్కరణ ప్రాణం పోసుకుంటుంది. లోహాన్ని తవ్వితీసినా, చక్రాన్ని తయారు చేసుకున్నా, యంత్రాన్ని బిగించుకున్నా, కంప్యూటర్‌ని కనిపెట్టినా, ఇంటర్నెట్‌ని సిద్ధం చేసుకున్నా...దేనికైనా సరే, అవసరాలే ప్రాతిపదిక. ఆవిష్కర్త మేధస్సు వికసించేకొద్దీ, ఆవిష్కరణల సాంకేతిక సామర్థ్యమూ అధికమైంది. అయినా మనిషిలో ఏదో అసంతృప్తి. తన ఆలోచనలకు రూపమిచ్చే ‘మర’యంత్రాల్నే కాదు, తనలా ఆలోచించే ‘మేధో’ యంత్రాలకూ ప్రాణంపోయాలన్న తపన మొదలైపోయింది. సరిగ్గా ఈ దశలోనే, నిత్య జిజ్ఞాసి మెదడులో ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌’ అన్న భావన మొగ్గ తొడిగింది.

మానవుడు బుద్ధిజీవి, ఆలోచనా పరుడు. ఆ బుద్ధికి మూలం మెదడు. మనిషి మెదడు మహా సంక్లిష్టమైన నిర్మాణం. దాదాపుగా అనుకరణ అసాధ్యమైన వ్యవస్థ. ప్రతి మెదడూ ఒకేలా పనిచేస్తున్నా ...ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. ఒక్కో సందర్భంలో ఒక్కోలా స్పందిస్తారు. ఒక్కో సంఘటనను ఒక్కోలా విశ్లేషిస్తారు. జీవితానుభవాల్ని బట్టి ఆలోచనలుంటాయి. పుట్టిపెరిగిన వాతావరణాలూ, చదివిన చదువులూ, తిప్పేసిన పుస్తకాలూ, ప్రభావితం చేసిన వ్యక్తిత్వాలూ...అన్నీ కలసి స్పందనలనూ ఉద్వేగాలనూ నిర్ణయిస్తాయి. అందుకే....కొందర్లో హింసాప్రవృత్తీ, కొందర్లో శాంతస్వభావమూ. కొందరు మహా బోళాగా ఉంటారు, కొందరు మరీ గుంభనంగా వ్యవహరిస్తారు.

మనిషి అబ్బసొత్తయిన తెలివితేటల్ని యంత్రానికి ధారపోయడం సాధ్యమేనా? అంటే, కొంతమేర సాధ్యమే. మనిషికి అనుభవాల్లాంటివి, యంత్రానికి గణాంకాలు. యంత్రుడు ఆ ‘బిగ్‌డేటా’ను విశ్లేషించుకుంటాడు. ఆ అంచనా ఆధారంగా ఓ నిర్ణయానికొస్తాడు. అందులో కచ్చితత్వం ఎంతన్నది...డేటాలోని నాణ్యతను బట్టి ఉంటుంది. డేటా పరిమాణాన్ని బట్టి కూడా తేడాలుంటాయి. ఆ కృత్రిమమేధకు రూపమిచ్చిన నిపుణుడి అభిరుచులూ అభిప్రాయాల ప్రభావమూ ఎంతోకొంత పనిచేస్తుంది.

ఇప్పటికే సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ తదితర డిజిటల్‌ పర్సనల్‌ అసిస్టెంట్లు సెల్‌ఫోను యజమానుల మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వివరాలనో, బ్రౌజింగ్‌ చరిత్రనో విశ్లేషించుకుని అమెజాన్‌ మన అభిరుచుల్నీ అవసరాల్నీ అంచనా వేస్తోంది. ఆ ప్రకారంగానే... మనకు ఇష్టమైన పుస్తకాల్నో, నచ్చే దుస్తుల్నో సిఫార్సు చేస్తోంది. ఇదంతా, కృత్రిమ మేధస్సు ఫలితమే. అంతకు మించిన, తెలివితేటల్ని ప్రదర్శించే (డీప్‌ లెర్నింగ్‌) యంత్రాలూ రంగంలో దిగుతున్నాయి.

మనిషే మారాజు...
‘సూపర్‌ మనిషి’ని సృష్టించడమా...
మనిషినే సూపర్‌గా తీర్చిదిద్దడమా...
కృత్రిమ మేధస్సు అసలు లక్ష్యం ఏమిటి?

- జనం పెరుగుతున్నారు. అవసరాలు పెరుగుతున్నాయి. మార్కెట్‌ విస్తరిస్తోంది. నూటికినూరుపాళ్లు ‘యాంత్రికమైన’ పనుల్ని యంత్రాలకే పురమాయించగలిగితే, ‘సృజన’, ‘భావుకత’ ...తదితర మానవీయ గుణాలతో ముడిపడిన బాధ్యతల్ని మనిషే దర్జాగా చేపట్టవచ్చు. దీనివల్ల మనిషితనానికి గుర్తింపు లభించినట్టూ అవుతుంది. అయితే, ఆ పదోన్నతి అయాచితంగా రాదు. నైపుణ్యాన్ని పెంచుకోవాలి, పనితీరును మెరుగుపరుచుకోవాలి. ఆ సంధి యుగంలో...కష్టాలూ నష్టాలూ తప్పవు. అంతెందుకు, గూగుల్‌ ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు’నే తీసుకుందాం. అదే టెక్నాలజీని లారీలకూ ట్రక్కులకూ విస్తరించుకోవచ్చు. దీనివల్ల, లక్షలమంది డ్రైవర్లు వీధినపడే ప్రమాదం ఉంది. ‘ఉబర్‌’ లాంటి అద్దె కార్ల కంపెనీలు కూడా ఆతరహా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. డ్రైవరు అనే పాత్ర లేకపోతే, తక్షణలాభం పొందేదీ ఆ వ్యాపారాలే. ఆపిల్‌, శామ్‌సంగ్‌ తదితర సంస్థలకు సెల్‌ఫోన్లు తయారు చేసిపెట్టే ఫాక్స్‌కాన్‌ ఇప్పటికే దాదాపు అరవైవేలమంది ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్టు సమాచారం. కృత్రిమ మేధస్సు పుణ్యమాని...గతంలో ఇద్దరు చేసిన పనిని, ఇప్పుడు ఒక్కరే చేయగలుగుతున్నారు. దీంతో కోతలు తప్పడం లేదు. మెక్‌డొనాల్డ్స్‌ లోనూ ఉద్వాసనలు మొదలయ్యాయి. ‘రోజుకు వేయి రూపాయలు ఇచ్చి ఓ ఉద్యోగిని నియమించుకోవడం కంటే, ఒకేసారి లక్ష రూపాయలు పెట్టి ఓ రోబోను కొనుక్కోవడమే తెలివైన పని. ఏ వ్యాపారి అయినా ఇలానే ఆలోచిస్తాడు...’ అంటారు ఆ సంస్థ ప్రతినిధులు. ఆన్‌లైన్‌లో ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే క్లియర్‌టాక్స్‌ అనే అంకుర సంస్థ...ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కూడా లేకుండానే ఏటా పది లక్షల దరఖాస్తుల్ని ప్రాసెస్‌ చేస్తోంది. లావాదేవీల్లో 95 శాతం నుంచి 98శాతం దాకా కచ్చితత్వం ఉంటోందని నిర్వాహకులు ప్రకటించారు కూడా. అదే పనిని, మనుషులతో చేయించాలంటే వందలమంది కావాలి.

టెక్నాలజీ, కాస్త ఆలస్యంగా అయినా ఒక రూపంలో జరిగిన నష్టాన్ని మరో రూపంలో పూడ్చేస్తుంది. గూగుల్‌ కారు సురక్షితంగా వీధుల్లో నడవాలంటే, గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ సమర్థంగా పనిచేయాలి. అంటే, జీపీఎస్‌ నిపుణుల్ని కొలువులు వరించినట్టే. డ్రైవరును పెట్టుకోవాల్సిన అవసరం ఉండదంటే, కారు నిర్వహణ వ్యయం భారీగా తగ్గినట్టే, స్టీరింగ్‌ ముందు కూర్చుని ట్రాఫిక్‌లో బండి నడపాల్సిన కష్టమూ తప్పినట్టే. దీంతో, కార్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు మెకానిక్కులకు ఉపాధి పెరిగినట్టే, ఆటోమొబైల్‌ ఇంజినీర్లకు అవకాశాలు అధికం అయినట్టే. ఉద్యోగాల విషయంలోనూ అంతే. మెల్లమెల్లగా రిసెప్షనిస్టులూ, నర్సులూ, డేటా ఎంట్రీ ఆపరేటర్లూ తదితర పాత కొలువులు మాయమైపోతాయి, ఇంకేవో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఆ మార్పును అందిపుచ్చుకోవాలంటే కాలంతో పాటూ...అవసరమైతే కాలం కంటే కాస్త వేగంగానే మారాలి. లేకపోతే మాత్రం...చేతికి చిప్పే, పింక్‌ స్లిప్పే!

కొత్తకొత్తగా...
ఈ మధ్యే గూగుల్‌ ఓ భారతీయ అంకుర సంస్థను సొంతం చేసుకుంది. ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ సంస్థ పేరు టుపుల్‌జంప్‌. వ్యాపార గణాంకాల్ని విశ్లేషించడంలో దిట్ట. ఫలానా రోజునో, ఫలానా నెలలోనో ఎంతమంది ఆ షోరూమ్‌ను సందర్శించారు, ఎంతమంది షాపింగ్‌ చేశారు, ఎంతమంది ఏమీ కొనకుండా వెళ్లారు, ఎంతమంది ఆ సేవలతో సంతృప్తి చెందారు, ఎంతమంది అసంతృప్తితో వెనుదిరిగారు...తదితర వివరాలన్నీ సచిత్రంగా అందిస్తుంది. అంటే, అచ్చమైన గణాంకాల్ని పనికొచ్చే సమాచారంగా, విలువైన విశ్లేషణలుగా మార్చేస్తుందన్నమాట! టుపుల్‌జంప్‌తో పాటూ అనేకానేక భారతీయ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ కంపెనీల మీద ఫేస్‌బుక్‌, ఆపిల్‌, గూగుల్‌, ఇంటెల్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర దిగ్గజాలు కన్నేస్తున్నాయి. గత పద్దెనిమిది నెలల్లో అరడజను సంస్థల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనేసుకున్నాయి. నిన్నమొన్నటిదాకా ఐటీ, అనుబంధ వ్యాపారాలకే పరిమితమైన అంకుర కుమారులు...ఇటువైపూ వస్తున్నారు. ప్రస్తుతం, దేశంలో నూటడెబ్భై ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ కంపెనీలు ఉన్నట్టు ఓ లెక్క. అచ్చంగా మనిషిలా ఆలోచించేలా, దాదాపుగా మనిషిలా స్పందించేలా కంప్యూటర్లనూ రోబోలనూ తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవన్నీ పనిచేస్తున్నాయి. రతన్‌టాటాను ఆకర్షించిన కృత్రిమ మేధో సంస్థ నికి.ఎఐ అయితే, కంప్యూటర్లకు సంభాషణా చాతుర్యాన్నీ ఒంటబట్టిస్తోంది. ‘మిత్రమా నా సెల్‌ఫోన్‌ బిల్లు చెల్లించు’ అని చెప్పగానే...మన క్రెడిట్‌కార్డు నంబరునో, డెబిట్‌కార్డు నంబరునో అనుసంధానించుకుని ఏ ఎయిర్‌టెల్‌ ఖాతాలోకో వెళ్లి చెల్లింపు జరిపేస్తుంది. ఇంకా... విమాన టికెట్లు బుక్‌ చేస్తుంది, రెస్టరెంట్‌లో సీటు రిజర్వు చేస్తుంది. అదే సమయంలో మన ఇష్టాల్ని కూడా దృష్టిలో ఉంచుకుంటుంది...రెస్టరెంట్‌లో అయితే కార్నర్‌సీటునూ, విమానంలో అయితే ముందువరుస సీటునూ ఎంపిక చేస్తుంది. అంతేనా, అత్యుత్తమ టర్మ్‌ పాలసీని సూచించమంటే తూకమేసినట్టు బేరీజువేస్తుంది. చలికాలంలో వెళ్లడానికి అనువైన పర్యటక కేంద్రాల పేర్లు చెప్పమన్నా క్షణాల్లో చిట్టా విప్పేస్తుంది. ఆ ప్రయత్నంలో, మన తరఫున గూగుల్‌ అంతా జల్లెడేసి గాలిస్తుంది.

విజువల్‌ ఇంటెలిజన్స్‌...
అందమైన ఛాయాచిత్రాన్నో, వర్ణచిత్రాన్నో చూడగానే ఏ భావుకుడి హృదయమైనా స్పందించి తీరుతుంది. తన మనసులోని మాటేదో చెబుతాడు, లేదంటే కాగితం మీద రాస్తాడు. కృత్రిమ మేధతో కంప్యూటర్‌నూ కవికుమారుడిగా మార్చేసింది స్నాప్‌షాప్‌. ఈ అంకుర సంస్థ ‘ఇమేజ్‌ క్యాప్షనింగ్‌’లో మంచి ప్రగతిని సాధించింది. ఇదే పరిజ్ఞానాన్ని రోబోలకు అనుసంధానిస్తే కనుక...మనుషుల్లానే అవి పరిసరాల్ని గమనించగలవు, ప్రకృతిని అర్థం చేసుకోగలవు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌లోనూ అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఏ పెళ్లిలోనో, పార్టీలోనో ఎవరో తొడుక్కున్న ఫలానా బ్రాండు చొక్కా కోసమో, ఫలానా రంగు టీషర్ట్‌ కోసమో అమెజాన్‌లోనో, ఫ్లిప్‌కార్ట్‌లోనో చేతులు నొప్పిపుట్టేలా వెదకాల్సిన పన్లేదు. ఆ ఫొటోను క్లిక్‌ చేసి పెడితే సరిపోతుంది. ‘విజువల్‌ సెర్చ్‌’ అనేది ఇ-షాపింగ్‌ రూపురేఖలే మార్చేయబోతోంది. మీ ఆకృతికి ఎలాంటి బట్టలు నప్పుతాయో, ఏ రంగులైతే బావుంటాయో బల్లగుద్ది చెప్పగలిగే ‘డిజిటల్‌ అద్దాలు’ కూడా రానున్నాయి. ఇదంతా ‘విజువల్‌ ఇంటెలిజన్స్‌’లో భాగమే. ఓ ఫొటోను చూపిస్తే...అందులో కుక్క ఉందో, పిల్లి ఉందో కచ్చితంగా చెప్పగలిగే యంత్రాలు...శరీర భాగాల ఛాయాచిత్రాల్ని చూసి...కాలేయంలో దెబ్బతిన్న భాగాన్నో, రక్తనాళాల్లో గడ్డకట్టుకుపోయిన ప్రాంతాన్నో ఎందుకు కనిపెట్టలేవు? గూగుల్‌ ఆ కోణంలోంచీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఫేస్‌బుక్‌ అయితే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ పరిశోధనల కోసం ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేసింది.

మనిషి తయారు చేసిన యంత్రాలు మనిషినే అంచనా వేసే స్థాయికొచ్చాయి. ఎదుటి వ్యక్తి స్పందనను వూహించే రోబోల్ని అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు రూపొందిస్తున్నారు. యూట్యూబ్‌లోని వీడియోలూ, టీవీషోలలోని వ్యక్తుల హావభావాల్ని కంప్యూటర్‌కు అనుసంధానం చేయడం ద్వారా..వాటికి సామాజిక ప్రవర్తన మీద అవగాహన కల్పించగలిగారు సైంటిస్టులు. ఎదుటి వ్యక్తి...కరచాలనం చేయనున్నాడా, ఆలింగనం చేసుకోబోతున్నాడా, ముద్దులతో ముంచెత్తనున్నాడా అన్నదీ అవి (80శాతం కచ్చితత్వంతో) వూహించేస్తాయి.

వ్యూహ రచన సామాన్యమైన విషయం కాదు. వేయి కోణాలలోంచి ఆలోచించాలి. రెప్పపాటు కాలంలోనే స్పందించాలి. యంత్రాలు ఆ కళలోనూ ఆరితేరుతున్నాయి. అమెరికన్‌ పరిశోధకులు ‘ఆల్ఫా’ పేరుతో రూపొందించిన నమూనా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ పరికరం...గగనతలంలో వైరిదేశాల విమానాల్ని లక్ష్యం చేసుకుని...బాంబుల మోత మోగిస్తుంది. అంతటితో ఆగకుండా...శత్రువు తన వ్యూహాన్ని కనుక మార్చుకుంటే, అంతే వేగంగా అదీ తన ప్రతి వ్యూహాల్ని రచిస్తుంది.

‘కృత్రిమ’ వైద్యం...
వైద్యరంగంలో కృత్రిమమేధ చాలా మార్పుల్నే తీసుకొస్తోంది. ఇక్కడా ‘బిగ్‌ డేటా’దే కీలకపాత్ర! వేలమంది, లక్షలమంది రోగుల ఆరోగ్య చరిత్రనూ, రోగ లక్షణాల్నీ కంప్యూటర్‌కు అందిస్తే...కృత్రిమ మేధ ఆ గుట్టల గుట్టల సమాచారాన్ని సమర్థంగా విశ్లేషిస్తుంది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ ఆధారంగా క్యాన్సర్‌ వ్యాధి ‘సోర్స్‌కోడ్‌’ను కనిపెట్టే ప్రయత్నం చేస్తోంది. వాట్సన్‌ ఆంకాలజీ పేరుతో ఐబీఎమ్‌ కూడా చురుగ్గా పరిశోధనలు మొదలుపెట్టింది. రక్త పరీక్షలూ, మలమూత్ర పరీక్షలూ, ఎక్స్‌-రే స్కానింగ్‌...తదితర విశ్లేషణలను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ సాయంతో కంప్యూటర్లకు పురమాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సిగ్‌టుపుల్‌ అనే సంస్థ ఆ పన్లో నిమగ్నమైంది. ఆ పరిశోధనలు కనుక ఓ కొలిక్కి వస్తే, రోగనిర్ధారణ రంగంలో చాలా మార్పులే చోటు చేసుకుంటాయి. ఆ అంచనాతోనే ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకులు సచిన్‌, బిన్నీ బన్సల్‌ ద్వయం ఈ అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టింది. మరో బెంగళూరు కంపెనీ ఎఇంద్రా సిస్టమ్స్‌ ...కృత్రిమ మేధస్సు సాయంతో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను గుర్తించగలిగే చవకైన పరికరాన్ని రూపొందిస్తోంది. ఉబ్బసం, అల్జీమర్స్‌ తదితర సమస్యల్ని ముందుగా పసిగట్టడంలోనూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ ప్రధాన పాత్ర పోషించబోతోంది. కృత్రిమ మేధస్సు ‘జెనెటిక్‌ ఇంజినీరింగ్‌’లోనూ వూహించని మార్పుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. జన్యు రహస్యాల్ని కనిపెట్టగలిగితే...రోగాల మూలాలూ, సృష్టి గుట్టుమట్లూ బట్టబయలైపోతాయి. అదే జరిగితే, మృత్యువునూ గుప్పిట్లోకి తీసుకోవచ్చు.

కొన్ని లోపాలూ...
‘కృత్రిమ మేధ అణుబాంబు కంటే ప్రమాదకరం. ఆ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడం అంటే...ఇంకాస్త త్వరగా మానవాళి తన వినాశానికి ముహూర్తం పెట్టుకోవడమే’ - అంటూ ఆమధ్య చాలా తీవ్రంగా హెచ్చరికలు చేశారు ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్స్‌. ఆ ఆందోళనను తేలిగ్గా కొట్టిపారేయలేం. కృత్రిమ మేధ...ఇప్పటికే ఒకట్రెండు సమస్యలకు కారణం అవుతోంది. దాన్ని సృష్టించే మనిషిలోని పైత్యాలన్నీ టెక్నాలజీలోకీ జొరబడుతున్నాయి. ఉద్యోగార్థుల్ని అంచనా వేసే ఓ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ సాఫ్ట్‌వేర్‌లో...ఫలానా ప్రాంతానికి చెందినవారిలోనో, ఫలానా జాతికి చెందినవారిలోనో నేర స్వభావం ఎక్కువనో, కష్టపడే గుణం శూన్యమనో ప్రోగ్రామ్‌ చేశారనుకోండి. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటీవల ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో...ప్రాథమిక వడపోతను కృత్రిమ మేధ సాయంతోనే జరిపారు. ఎంపిక హాస్యాస్పదంగా ఉండటంతో, గుట్టుచప్పుడు కాకుండా ఫలితాల్ని రద్దు చేశారు. సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్ల విషయంలోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతోనో, ఇంకేదో కారణంతోనో ఆ వాహనం అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటే, బాధ్యత ఎవరిది? బండి యజమానిదా, ఆ ప్రోగ్రామ్‌ను రూపొందించిన నిపుణుడిదా? తమ లోపాల్ని తాము తెలుసుకునే యంత్రాలు వచ్చేదాకా...ఈ ప్రశ్నలకు జవాబు దొరకదు. అదంతా జరగడానికి ఇంకో పదేళ్లు పట్టినా పడుతుంది.

యంత్రాలకు హృదయం ఉండదు, హృదయ స్పందనా తెలియదు. ఆ లోటు చాలా విషయాల్లో బయటపడుతూనే ఉంది. ఓ వంద ఫొటోలలోంచి ‘అసభ్యకరమైన’ వాటిని తొలగించమని పురమాయిస్తే... ఆతరహా ఛాయాచిత్రాలతో పాటూ చిరుగుల బట్టలతో యాచన చేస్తున్న ఓ నిరుపేద బాలిక చిత్రాన్నీ ఏరిపడేశాడు ‘తెలివైన’ యంత్రుడు! ఆ హృదయవిదారక దృశ్యం దానికి ‘అసభ్యకరం’గా అనిపించి ఉండవచ్చు. ‘మనసు’ లేకపోతే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి.

అదేదో హాలీవుడ్‌ సినిమాలో...‘ఈ మానవుడు ఉన్నాడే...మహా స్వార్థపరుడు. మనల్ని సృష్టించినంత మాత్రాన మన మీద పెత్తనం చెలాయించే అధికారం తనకెక్కడుంది. మనిషనే వాడిని ఈ గ్రహం మీది నుంచి తరిమేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి..’ అంటూ రోబోలన్నీ కలసి మనిషికి పొగపెట్టే ప్రయత్నం చేస్తాయి. సినిమాలో అయితే ఆ దృశ్యాన్ని హాయిగా ఆస్వాదిస్తాం. నిజంగానే జరిగితే తట్టుకోగలమా?

తెలివైన యంత్రాల వరకూ ఫర్వాలేదు.
తెలివిమీరిన యంత్రాలతోనే...విధ్వంసం!
అనగనగా కథలో... మాంత్రికుడి ప్రాణాలు ఒంటిస్తంభం మీదున్న చిలకలో ఉన్నట్టు...యంత్రాల తుట్టతుది మీట వివేకవంతుడైన మనిషి చేతిలో ఉండాలి. ఆమాత్రం జాగ్రత్త తీసుకుంటే... యంత్రం ‘తెలివైన’ బానిసే!


15 లక్షలు

2021 నాటికి, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధిని కోల్పోయే ఉద్యోగులు. ఒకటిన్నర కోట్ల మంది ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగుల్లో ఇది పదిశాతం! అంటే, ప్రతి పదిమందిలో ఒకరు ఇంటిదారే!


3 : 1 నిష్పత్తి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి...పూర్తిగా స్వభావాన్ని మార్చుకుంటుంది. మనిషి చేయాల్సిన పనిని రోబోలో, కంప్యూటర్లో చేస్తాయి.


50 శాతం

ధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఉద్యోగి ఉత్పాదకతను దాదాపు రెట్టింపు చేయాలన్నది ఇన్ఫోసిస్‌ సహా వివిధ ఐటీ కంపెనీల ఆలోచన.


47 శాతం

టెక్నాలజీకి చిరునామా అయిన అమెరికాలో గిరిగీసినట్టు...సగానికి సగం కొలువుల్ని కాకెత్తుకెళ్లడం ఖాయం.


69 శాతం

భారతదేశంలో సగటు వృత్తి నిపుణులు చేస్తున్న పనుల్లో మేధో యంత్రాలకు బదిలీ చేయడానికి వీలైన బాధ్యతలు.


2, 277

అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంకుర సంస్థలు.


14.28 బిలియన్‌ డాలర్లు

అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు మార్కెట్‌ విలువ.


170

కృత్రిమ మేధస్సును ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్న దేశీ స్టార్టప్స్‌.


గట్టి బుర్రలే....

నిషిలా ఆలోచించే యంత్రాలు - ఒక దశ. మనిషి కంటే గొప్పగా ఆలోచించే యంత్రాలు - మరో దశ. అంతర్జాతీయ పరిశోధనలు రెండో దశ వైపుగా నడుస్తున్నాయి. ఓ సగటు మనిషి...నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్న పరిశోధనను అర్థం చేసుకోడానికి చాలా సమయమే పడుతుంది. కానీ తాజాగా కృత్రిమ మేధ ఓ గంట సమయంలోనే...ఆ సమాచారాన్నంతా విశ్లేషించుకుంది. వెనువెంటనే, ఆ ప్రయోగాన్ని తానూ చేసి చూపించింది. ఈ వేగం ..మనిషి మేధకు సవాలే. ‘గో...’ అనేది చదరంగాన్ని మించిన చైనీయుల మేధో క్రీడ. ఆ ఆటలో ఛాంపియన్‌ అంటేనే వేయి కంప్యూటర్లకు సరిసాటి. అలాంటిది, ఓ కంప్యూటర్‌ కాకలుతీరిన ‘గో’ ఆటగాడిని సునాయాసంగా ఓడించింది. మనిషి మీద యంత్రం సాధించిన మరో విజయమిది. ఈ పరిణామాలన్నీ విస్తరిస్తున్న యంత్ర ప్రాబల్యాన్ని వివరించేవే, పరోక్షంగా హెచ్చరించేవే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.