close
హిమగిరుల్లో మణిమహేశ్‌..!

హిమగిరుల్లో మణిమహేశ్‌..!

‘దేవభూమిగా పిలిచే హిమాలయాలు ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయాలు. వాటిలో ఏ కొన్నింటిని దర్శించుకోగలిగినా జన్మ ధన్యమైనట్లుగానే భావిస్తారు హైందవ భక్తులు. అలాంటి వాటిల్లో మణిమహేశ్‌ కైలాశ్‌ కూడా ఒకటి’ అంటూ ఆ యాత్రావిశేషాలను అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన వి. మల్లికార్జున్‌.

హిమాలయ శిఖరాల్లో వెలసిన చార్‌ధామ్‌, అమర్‌నాథ్‌, పంచకైలాశ్‌లను ఒక్కసారైనా సందర్శించాలనుకుంటారు భక్తులు. అందులో భాగంగానే పంచ కైలాసాల్లోని ఓ కైలాసాన్నయినా దర్శించాలనుకున్నాం. ఆదికైలాశ్‌, మానససరోవర్‌, కిన్నెర కైలాశ్‌, శ్రీఖండకైలాశ్‌, మణిమహేశ్‌ కైలాశ్‌లనే పంచకైలాశ్‌లుగా చెబుతారు. ఉత్తరాఖండ్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉండే ఆదికైలాశ్‌ను ఆనుకునే ‘ఓం’ పర్వతం ఉంటుంది. మానససరోవరం చైనా అధీనం లోని టిబెట్‌లో ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో 17,500 అడుగుల ఎత్తులో కనిపించేదే కిన్నెర కైలాశ్‌. శ్రీఖండ కైలాశ్‌ కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో 17 వేల ఎత్తులో ఉంటుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో 18,547 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చేదే మణిమహేశ్‌ కైలాశ్‌. దీన్నే చంబా కైలాశ్‌ అనీ పిలుస్తారు. ఈ యాత్ర కృష్ణాష్టమి(శ్రావణ బహుళ అష్టమి)నుంచి రాధాష్టమి(భాద్రపద శుద్ద అష్టమి)వరకు కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ఎలాగైనా మేం ఆ ప్రదేశాన్ని చూడాలనుకుని ఓ బృందంగా బయలుదేరాం.

శిఖర దర్శనం!
హైదరాబాద్‌ నుంచి చండీగఢ్‌ వరకూ విమానంలో వెళ్లి అక్కడి నుంచి ఎనిమిది గంటలపాటు ప్రయాణించి ధర్మశాల మీదగా 6,831 అడుగుల ఎత్తులో ఉన్న మెకలోడ్‌గంజ్‌ చేరుకుని ఆ రాత్రికి అక్కడ బసచేశాం. దారిలో ఆనందీపూర్‌ సాహిబ్‌లో సిక్కుల పదో గురువు శ్రీగురు గోవింద్‌ సింగ్‌ ఖల్సా పంత్‌ను దర్శించుకున్నాం. రెండోరోజు ఎత్తైన కొండల్లో ప్రయాణం చేస్తూ జిల్లా కేంద్రమైన చంబాకి చేరుకున్నాం. ఇక్కడ వెయ్యి సంవత్సరాల పురాతన లక్ష్మీనాథ మందిరాన్ని దర్శించి ఆ రాత్రికి అక్కడే విశ్రమించాం. మర్నాడు ఉదయాన్నే మణిమహేశ్‌ కైలాశ్‌కు బయలుదేరాం. ఈ ప్రయాణం మొత్తం ఘాట్‌రోడ్డులోనే... ఒకవైపు ఎత్తైన కొండలూ ఆ కొండల్లోనుంచి జాలువారుతున్న జలపాతాలూ మరోవైపు లోయలూ వాటిల్లో పారే నదీప్రవాహాలూ ఎటు చూసినా పచ్చదనం పల్లవిస్తుంటుంది. సుమారు 65కిలోమీటర్ల ఎత్తైన కొండలద్వారా ప్రయాణించి బర్మోర్‌కి చేరుకున్నాం. ఇక్కడకు ఆరు కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణిమాత గుడి ఉంటే అక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లాం. ఈ మాతను దర్శించుకున్న తరవాతే మణిమహేశ్‌ కైలాశ్‌కు వెళ్లాలని చెబుతారు. ఈ బర్మోర్‌ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే హఠ్‌సర్‌ అనే ప్రదేశం వస్తుంది. అక్కడినుంచి మరో 14 కిలోమీటర్లు నడిస్తే మణిమహేశ్‌కు చేరుకోవచ్చు. కానీ ఆ దారిలో నడవడం చాలా కష్టం. కాబట్టి బర్మోర్‌ నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లాలనుకున్నాం. వాతావరణం అనుకూలించక రెండు రోజులు నిరీక్షించి, మూడోరోజు హెలీకాఫ్టర్‌లో బయలుదేరాం. కేవలం ఐదు నిమిషాల్లోనే మణిమహేశ్‌కు చేరుకున్నాం అక్కడ దిగిన వెంటనే మాకు మణిమహేశ్‌ కైలాశ్‌ శిఖర దర్శనభాగ్యం కలిగింది. భానుడి కిరణాలు నేరుగా శిఖరాగ్రాన్ని తాకగానే ఆ కొండ ఓ మణిలా మెరుస్తూ అద్భుతంగా కనిపించింది. బంగారువర్ణంలో మెరుస్తోన్న ఆ శిఖరాన్ని ఎంతసేపు చూసినా తనివితీరలేదు. దాన్ని అలాగే చూస్తే మంచులో త్రినేత్రుడు, త్రిశూలం, ఓంకారం, వినాయకుడి రూపాలు మాకు గోచరించాయి.

భగవంతుని కృప ఉంటేనే...
మేం దిగిన హెలీపాడ్‌కు దాదాపు 1500 మీటర్ల దూరంలో సరోవరం ఉంది. అందులో భక్తులంతా స్నానమాచరిస్తారు. తరవాత అక్కడనుంచి కనిపించే ఎత్తైన శిఖరాన్ని కనులారా దర్శించుకుంటారు. ఆ శిఖరాన్నీ ఈ సరోవరాన్నీ రెండింటినీ శివుడు కొలువైన ప్రాంతంగా భావిస్తారు స్థానిక గడ్డి తెగ ప్రజలు. పార్వతిని పెళ్లిచేసుకున్నాక ఈ ప్రాంతాన్ని శివుడు సృష్టించాడనీ చెబుతారు. పర్వతంమీద శివలింగం ఆకారంలో ఉన్న రాతిని శివరూపంగానూ పర్వతపాదాల్లోని మంచు మైదానం శివుడి ఆటస్థలంగానూ కొలుస్తారు. ఎవరూ ఆ శిఖరాన్ని అధిరోహించలేరనీ, పూర్వం గడ్డి తెగకు చెందిన ఓ గొర్రెల కాపరి శిఖరాన్ని అధిరోహించబోతే ఆ గొర్రెలతో సహా శిలగా మారిపోయాడనీ అంటారు. ఆ శిఖరంమీద ఉన్న చిన్న రాళ్లను గొర్రెలుగానూ మధ్యలో ఉన్న ఓ పెద్ద రాయిని కాపరిగానూ పేర్కొంటారు స్థానికులు. పౌరాణిక కథనాలు ఎలా ఉన్నా మణిమహేశ్‌ కైలాశ్‌ పర్వతారోహకులకు ఓ సవాల్‌ అనే చెప్పాలి. గతంలో కొందరు ప్రయత్నించి విఫలమయ్యారు కూడా. అంతేకాదు, భగవంతుడి అనుగ్రహం ఉన్నవాళ్లకే ఆ శిఖరం దర్శనమిస్తుందట. ఎంతో కష్టపడి అక్కడికి వచ్చినా ఒక్కోసారి ఆ శిఖరం చుట్టూ ఆవరించిన మేఘాలు దాన్ని కనిపించనీయవు. అది విన్నాక శిఖర రూపంలో దర్శనమిచ్చిన ఆ పరమశివుడికి మరోసారి నమస్కరించి అక్కడే ఉన్న సరోవరం చుట్టూ పరిక్రమ చేశాం. అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. అందుకే పరిక్రమను త్వరత్వరగా ముగించుకుని హెలీకాప్టర్‌లో తిరిగి బర్మోర్‌కి చేరుకున్నాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.