close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ట్రెండ్‌

ట్రెండ్‌
- నందిరాజు పద్మలతా జయరాం

మిటో! నా జీవితంలో ప్రతి ఘటనా... అదే... ప్రతి సంఘటనా కన్ఫ్యూజన్‌తోనే మొదలవుతోంది. ఎప్పుడూ రెండో మూడో ఆప్షన్స్‌ ఉండటం, ఇదమిద్ధంగా ‘ఇదే’ అని తేల్చుకోలేకపోవడం మామూలైపోయింది. ఇంటర్మీడియట్‌లో చేరేముందూ అంతే! అటు లెక్కలూ ఫిజిక్సుల్లో సెంట్‌ కొట్టాను. ఇంగ్లిషులోనూ తొంభైతొమ్మిది సాధించాను. మంచి మిషనరీ కాలేజీలో ఆర్ట్స్‌లో సీటొచ్చింది. ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఎంట్రన్స్‌లో నంబర్‌ వన్‌ కాలేజీలో స్టార్‌ బ్యాచ్‌లోనూ సీటొచ్చింది. ఇంగ్లిషు మాస్టార్ని చేయడం ఇష్టంలేని నాన్న- నన్ను లెక్కలు ఫిజిక్సుల్లోనే చేర్చారు. ఆ తర్వాతా అంతే! ఐఐటీలోనూ, మిగతా అన్నింటిలోనూ కూడా సీట్లొచ్చాయి. ఉద్యోగమూ అంతే! ఎంపిక కోసం తలలు బద్దలు కొట్టుకోవడం, వాదోపవాదాలూ సముదాయింపులూ, ఆఖరికి పెద్దవాళ్ళ మాటనే ఒప్పుకోవడాలు. ఉహు, పెళ్ళి విషయం మాత్రం పూర్తిగా నా వ్యక్తిగతం. ఒప్పుకోనంటే ఒప్పుకోనంతే! పార్వతి అట... పేరు కూడా పాతదే! ఫొటో చూశాను. పూర్తి పాతకాలపు పిల్లలాగే ఉంది. ఉద్యోగం ఇష్టంలేక చదువుకుని కూడా ఇంట్లో సంగీతం పాఠాలు చెప్పుకుంటోందట. అమ్మకి సాంప్రదాయం నచ్చింది, నాన్నకి ఆ పిల్ల సంగీతం నచ్చింది. మరి నాకు నచ్చొద్దా! ట్రెండ్‌కి తగ్గట్లుండొద్దూ!

‘‘ఏంటి వేమూరీ, డిస్టర్బ్‌డ్‌గా ఉన్నావు. అవతల ప్రీ ప్లేస్‌మెంట్‌ మొదలయింది’’ యజ్ఞేశ్‌ వచ్చాడు. ఇక్కడందరూ అందర్నీ ఇంటిపేర్లతోనే పిలుస్తారు దాదాపుగా.‘‘కానీలే. రిటెన్‌టెస్ట్‌ తర్వాత టెక్నికల్‌ రౌండ్‌-వన్‌లో ఆ తర్వాత హెచ్‌ఆర్‌ రౌండ్‌లో ఉంటాన్నేను.’’

‘‘సరే అయితే. రెండు ఉద్యోగాలకి నూటయాభై మంది. ఎక్కువభాగం ఇక్కడే ఫిల్టర్‌ చేయాల్సుంటుంది మనం’’ అంటూనే వెళ్ళాడు యజ్ఞేశ్‌. ఈవారం మొత్తం కొత్తవాళ్ళ ఎంపిక కోసమే కేటాయించింది మా యాజమాన్యం. సీనియర్‌ ప్రాజెక్ట్‌ లీడ్‌ని కనుక ఈ కోర్‌ కమిటీకి నేనే హెడ్‌ని. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం వెళ్ళినా సరైన అభ్యర్థులు లభించక, మళ్ళీ ఇలా రిక్రూట్‌మెంట్‌ మొదలెట్టాల్సొచ్చింది. రాత పరీక్షలో నెగ్గినవాళ్ళని మిగిలిన పరీక్షలకి కూర్చోబెట్టి, ఎలాగైనాసరే ఓ ఇద్దరిని ఎంపిక చేసుకోవాలి. అవతల ఇజ్రాయిల్‌ దేశపు కస్టమర్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ సపోర్టు కోసం ఆఫర్‌ ఇచ్చి ఉంది. సమయానికి అందుకోకపోతే కోట్లల్లో నష్టం.

కంప్యూటర్లో అభ్యర్థుల వివరాలను చూస్తున్నాను. దివ్య... ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుందే! అవును... తెలుగు మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో చూశాను. వెరీగుడ్‌, అందంగా ఉంది... అర్హతా ఉంది.
‘‘వేమూరీ, రిటెన్‌ టెస్ట్‌ అయిపోయింది’’ పేపర్స్‌ పట్టుకొస్తూ అన్నాడు యజ్ఞేశ్‌.
‘‘వాల్యుయేషన్‌ కూడా కానిద్దాం. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు ఉన్నారుగా... వాళ్ళ సాయం తీస్కో’’ చెప్పాను.
కేవలం ఇరవయ్యారుమంది తేలారు. అదృష్టం, అందులో దివ్య పేరుంది.

తర్వాతి రౌండ్‌- గ్రూప్‌ డిస్కషన్‌. ‘జామ్‌’ అంటాం మా పరిభాషలో. ఒక అంశాన్నిచ్చి దాని గురించి మాట్లాడమంటాం. మొత్తం డిస్కషన్‌ అంతా వీడియో రికార్డ్‌ అవుతుంది. వారిలోని కమ్యూనికేషన్‌ స్కిల్‌నీ అభిప్రాయాల్నీ నడవడికనీ భాషనీ పసిగట్టడానికి ఇదో టెక్నిక్‌.

అంతా విరిసీ విరియని మొగ్గలే! భవిష్యత్తు పట్ల ఆందోళనా భయం ఉన్నవాళ్ళే ఎక్కువమంది. ఒకటో రెండో మాటలు కలపడం తప్ప, దాదాపు పదిమంది చురుకుగా లేరు. ఇచ్చిన అంశంపట్ల అవగాహన, సమాచారం లేకపోవడంకూడా ఒక కారణం కావచ్చు. ‘యుక్తవయసులో ఉన్నవాళ్ళకి బాయ్‌ఫ్రెండ్స్‌, గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉండటం అవసరమా... కెరీర్‌కి అది ఆటంకమా ఉపయుక్తమా’- ఇదీ అంశం.

‘అవసరం’ అన్నవాళ్ళు కారణాలు చెప్పారు. అమ్మాయిలు ‘బాయ్‌ఫ్రెండ్స్‌ ఉంటే భద్రత ఉంటుందనీ, నమ్మకంగా ధైర్యంగా తిరగగలుగుతామనీ పాకెట్‌మనీ మిగుల్చుకుని షాపింగ్‌ సరదాలు వాళ్ళచేత ఖర్చు చేయించి తీర్చుకోవచ్చనీ చెప్పారు. అబ్బాయిలు ‘గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉంటే ప్రిస్టేజీ పెరుగుతుందనీ ఇగో స్థాయి నిలకడగా ఉంటుందనీ’ చెప్పారు. గర్ల్‌ఫ్రెండ్స్‌ వద్దన్న అబ్బాయి ఒక్కడు కూడా లేడు. ఇక బాయ్‌ఫ్రెండ్స్‌ అవసరంలేదన్న వాళ్ళల్లో దివ్య ఒకతె. ఆమె వాదన కూడా చాలా సహేతుకంగా ఉంది.

‘‘నాకు నామీద నమ్మకం ఉంది. నా భద్రత నేను చూసుకోగలను. నా ఖర్చులకి నా పాకెట్‌మనీ చాలకపోతే, నిజాయతీగా నా తల్లిదండ్రులను అడిగి తీసుకునే స్వేచ్ఛ నాకుంది. నా అవసరం కోసం నేను బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుంటే, అతని మరో అవసరానికి నేను లొంగాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. ఫ్రెండ్‌గా నాకు ఆడా మగా ఇద్దరూ అవసరమే కానీ, ఆ అనుబంధానికి మరోరంగు పులమను.’’

వీడియోలో దివ్యను చూసి నేను చాలా ఇంప్రెస్‌ అయ్యాను. నిజానికి నేను ఈమెను వారంక్రితమే ‘నెట్‌’లో చూసి ఇష్టపడ్డాను. పెద్దవాళ్ళతో చర్చించలేదు ఇంకా.

మూడో రౌండ్‌లోకి వచ్చింది దివ్య, మరో అయిదుగురితో కలిసి. నేను కమిటీలో ఉన్నాను. ఒక్కొక్కరినీ పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇది పూర్తిగా టెక్నికల్‌ రౌండ్‌. అభ్యర్థుల సబ్జెక్ట్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించే రౌండ్‌.

‘‘ ‘డాటా అనలిటిక్స్‌’ నాకు రాదు. రెండో సంవత్సరంలో చదువుకున్నాను. ఇప్పుడు మర్చిపోయాను. ‘డాటా మైనింగ్‌’ గురించి అడగండి. ‘సి లాంగ్వేజీ’ బాగా వచ్చు నాకు. అదైనా సరే’’ నేనిచ్చిన ప్రశ్నకి జవాబు ఇవ్వలేక నిక్కచ్చిగా అడిగింది దివ్య.

‘‘అదెలా కుదురుతుంది? కంపెనీకి ఏది అవసరమో అది కదా మీకు తెలియాలి’’ కొద్దిగా కోపంగా అడిగింది నా కొలీగ్‌ మల్హోత్రా.
‘‘సమయమివ్వండి, లేదూ ఉద్యోగం ఇచ్చి ట్రైనింగ్‌ ఇవ్వండి... నేర్చుకుంటాను.’’ దివ్య సమాధానం నాకు బాగా నచ్చింది.
మిగతావాళ్ళు అంతా సుముఖంగా లేకపోయినా, నేనామెను తర్వాతి రౌండ్స్‌కి ఎంపిక చేశాను. కేవలం ఉద్యోగం ఇవ్వడం మాత్రమే కాదు కదా నా ఉద్దేశ్యం.
మరో రెండు మెట్లెక్కి నలుగురిలో ఒకరుగా తేలింది దివ్య.

హ్యూమన్‌ రిలేషన్స్‌ రౌండ్‌ మొదలయింది. ఇదే ఆఖరు. దీని తర్వాత జీతం గురించి మాట్లాడుకుని ఆఫర్‌ లెటర్‌ ఇవ్వడమే! దివ్య గురించి ఒక నిర్ణయానికి రావడానికి నాకిది మంచి అవకాశం. నిజానికీ మధ్య అమ్మాయిలు, అబ్బాయిలకి పెద్ద ఛాయిస్‌ ఇవ్వడం లేదు. ఆడపిల్లల డిమాండ్లూ వాళ్ళ తల్లిదండ్రుల కోరికలూ పెరిగిపోయి, పెళ్ళికాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతోంది. కానీ, నాది ఓ రకంగా అదృష్టమే! అటు పార్వతి తల్లిదండ్రులకి నేను బాగా నచ్చాను. మరోవైపు మేనరికం కూడా సిద్ధంగా ఉంది. ఇటువైపు ఈ దివ్య నాకు బాగా నచ్చింది. నేనామెకు నచ్చుతానన్న నమ్మకం కూడా కలుగుతోంది. ట్రిపుల్‌ ఛాయిస్‌. కానీ, నా ఓటు దివ్యకే.

ఏమాత్రం తొట్రుపాటు లేకుండా విష్‌ చేసి కూర్చుంది దివ్య. ఎంటెక్‌ చేశాక ఎంబీఏ కూడా చేసినందున హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలు కూడా నేను చేస్తూనే ఉంటాను.
కాసేపు చదువూ కాలేజీ కుటుంబం... వగైరాల గురించి వివరాలడిగాక- ‘‘ఈ ఉద్యోగానికి మేం రెండేళ్ళపాటు బాండ్‌ అడుగుతాం. ఇస్తావా?’’ అడిగాను.
‘‘నేను సిద్ధం. మీ కంపెనీలో ఉద్యోగం రావడం నాకు సంతోషదాయకం.’’
‘‘ఒకవేళ ఏదైనా కారణం- అంటే- పెళ్ళి అయి, మీ భర్త ఒప్పుకోలేదనుకో... అప్పుడు ఉద్యోగం మానేస్తావా!’’

‘‘ఉహు! ఉద్యోగం నా ఆత్మాభిమానానికి సంకేతం. వివాహం నా జీవితావసరం. మా ఆయన్ని ఒప్పించి ఉద్యోగం చేస్తా. కుదరకపోతే మీ కంపెనీనే అడిగి ఇంటినుంచి పనిచేస్తా.’’
దివ్య తెలివితేటలకీ లౌక్యానికీ నాకు ముచ్చటేసింది. ఉద్యోగానికి సమాధానాలు చాలు కానీ, నాకోసం ఇంకొన్ని ప్రశ్నలడిగాను. వాటికి కూడా తీరైన సమాధానం చెప్పి మెప్పించింది నన్ను.
అత్తమామలు తల్లిదండ్రులతో సమానమంది. కలిసి ఉండటంలోనే ఆనందముందంది. మానసిక ప్రశాంతత డబ్బుకన్నా ముఖ్యమంది. ఏ విధంగా చూసినా దివ్య నాకు బ్రహ్మాండంగా నచ్చేసింది.

రెండోరోజుకల్లా ఆఫర్‌ లెటర్‌ దివ్యకి అందింది.

* * *

‘‘ఏరా, ఏదో ఒకటి చెప్పాలి కదా! మామయ్యకి- నువ్వు మేనరికం ఆరోగ్యరీత్యా మంచిది కాదంటున్నావని చెప్పి పంపేశాను. మరి పార్వతి సంగతి ఏం చేద్దాం?’’ అడిగింది అమ్మ.
ఇరవయ్యెనిమిది దాటుతోంది నాకు. తొందరపడాలి, తప్పదు. దివ్యతో మాట్లాడేందుకు అవకాశం కుదరడం లేదు.
‘‘మంచి సంబంధమేదైనా వస్తే వాళ్ళని చేసేసుకోమని చెప్పమ్మా. మనకోసం ఆపడం, ఆనక మనం వద్దనడం తప్పు కదా!’’
‘‘అంటే, నీకు నచ్చలేదన్నమాట. నీ ఇష్టం, బలవంతపెట్టం. నిర్ణయం నీదే, ఆలోచించుకో! మనవాళ్ళల్లోనే ముప్ఫైలు దాటినవాళ్ళు నలుగురున్నారు. ఈతరంలో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు. త్వరపడకపోతే పెళ్ళవ్వడం కష్టం’’ నాన్న హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోయారు.
ఇక త్వరపడాల్సిందే!

* * *

‘‘ఎస్‌, వేమూరీ! కలవాలన్నారు కదా... చెప్పండి’’ తన డెస్క్‌ దగ్గరి నుండి లేచి వచ్చింది దివ్య. ఇక్కడ బాస్‌లని కూడా పేర్లుపెట్టే పిలుస్తారు.
‘‘అవును, కొంత పర్సనల్‌. ఇక్కడొద్దు, ఇంటికి వెళ్ళేటపుడు రా దివ్యా! ఈరోజు నిన్ను డ్రాప్‌ చేస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం’’ చెప్పాను.
ప్రశ్నార్థకంగా చూసింది దివ్య. ‘అలాగే’ అన్నట్లు తలూపి వెళ్ళిపోయింది.
సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఇద్దరం బయల్దేరాం. ఆఫీసులో ఎంతో క్యాజువల్‌గా మాట్లాడే నేను, ఎందుకో చాలా కలవరంగా, అలజడిగా ఫీలవుతున్నాను. ఎలా మొదలుపెట్టాలా అన్న సంశయం. నాకన్నా చాలా లెవెల్స్‌ కింద ఉన్న దివ్య ఇయర్‌ఫోన్‌లో పాటలు వింటూ రిలాక్స్‌డ్‌గా ఉంది. కొత్తవాళ్ళతో ఉన్నట్లుకాక, ఏదో క్యాబ్‌ ఎక్కినట్లు మామూలుగా ఉంది.
‘‘సగం దూరం వచ్చేశాం, ఏం మాట్లాడాలనుకుంటున్నారు?’’ తనే అడిగింది.
‘‘అది... అంటే...’’ తడబడుతున్నాను.
‘‘నా వూహ నిజమైతే గనుక మీరు నన్ను ముందే చూశారు కదూ...’’
‘‘అహ లేదే! అంటే...’’
‘‘అదేలెండి! కంప్యూటర్‌ పెళ్ళిచూపుల్లో- అదేనండీ... తెలుగు మ్యాట్రిమోనీలో చూశారు కదూ’’ నవ్వేసింది.
‘‘అంటే... మీరు... అదే... నువ్వు... నువ్వు కూడా చూశావా?’’ అడిగాను.
‘‘మీ వివరాలన్నీ ఉన్నాయండీ నా దగ్గర. నాకు కూడా మీ సంబంధం బాగుందనిపించింది. అనుకోకుండా ఇక్కడే ఉద్యోగం రావడంతో మరింత దగ్గరగా చూశాను. అన్నట్లు... జాతకాలు కూడా కలిశాయి.’’

నా మనసు ఉక్కిరిబిక్కిరయింది. ఆనందంతో ఛాతీ ఉప్పొంగింది.
‘‘ఓహ్‌, థాంక్యూ! పద, కాఫీ తాగుదాం’’ రెస్టారెంట్‌ దగ్గర కారాపాను.
‘‘నా పేరెంట్స్‌ చాలా సంతోషిస్తారు. రోజురోజుకీ నాపైన ఒత్తిడి పెరుగుతోంది పెళ్ళి చేసుకోమని. ఇంత త్వరగా ఈ విషయం ఓ కన్‌క్లూజన్‌కి వస్తుందని... ఓహ్‌... అస్సలనుకోలేదు’’ ఫోర్క్‌తో పిజ్జాముక్కని ఆమెకి అందిస్తూ చెప్పాను.
‘‘ఓ, మీ పేరెంట్స్‌ కూడా ఇక్కడే ఉంటారా. అవున్లే, మీ అమ్మా నాన్నా ఇద్దరూ ఉద్యోగస్తులే కదూ! తమ్ముడు కూడా ఉన్నాడు కదూ మీకు’’ అడిగింది దివ్య.
‘‘అవును. బాగా చిన్నవాడు వాడు. నాన్నకింకా ఒక్క ఏడాదే సర్వీసుంది. అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయొచ్చు. ఇద్దరిదీ ప్రైవేట్‌ సర్వీసే!’’
‘‘ఐసీ! పెన్షన్‌ లేని సర్వీస్‌ అన్నమాట. సరే, పెళ్ళయాక మనం ఇల్లెక్కడ తీసుకుందాం?’’
దివ్య మాటలు నాకు అర్థంకాలేదు.

‘‘ఇల్లెందుకు తీసుకోవడం? మాది సొంత ఇల్లే! అందరం కలిసే ఉంటాం కదా!’’ అయోమయంగా అన్నాను.
‘‘ఇంపాజిబుల్‌ వేమూరీ! కష్టం, జెనరేషన్‌ గ్యాప్‌. మన జీవితం మనది. మన సంపాదన మనది. కలిసి ఉండే కుటుంబాల రోజులింకా ఉన్నాయా’’ తేలిగ్గా తీసేసింది దివ్య.
‘‘మరి ఆరోజు అలా చెప్పావు ఇంటర్వ్యూలో. భర్తను ఒప్పించి జాబ్‌ చేస్తానన్నావు. అత్తామామలు, అమ్మానాన్నలతో సమానమన్నావు. జాయింట్‌ ఫ్యామిలీ కల్చర్‌ నచ్చుతుందన్నావు. అంతా ట్రాష్‌ అన్నమాట.’’
చిన్నగా నవ్వింది దివ్య.

‘‘ఓహ్‌, అదా! మిగతావాళ్ళకన్నా విభిన్నంగా ఉండాలి కదా! గ్రూప్‌ డిస్కషన్స్‌లో, వన్‌ టు వన్‌ ఇంటర్వ్యూలలో నాకు నచ్చినట్లుగా కాక, అవతలవాళ్ళను ఇంప్రెస్‌ చేసేటట్లుగా మాట్లాడాలి కదా!’’
చుక్కలు కనిపించాయి నాకు. ఆరోజు ఎంత నిజాయతీగా చెప్పింది.
‘‘ఐసీ... అబద్ధాలు చెప్పొచ్చన్నమాట.’’
‘‘అలా అని కాదు వేమూరీ! వ్యక్తిత్వ వికాస కోర్సులో నేర్పిన ట్రిక్స్‌ ఇవి. వాళ్ళు మాటల్ని అమ్ముతారు, కంపెనీలు మాటల్ని నమ్ముతాయి. ఏదో ఉద్యోగావసరం... దట్సాల్‌!’’
అంతర్గతంగా ఉన్న వ్యక్తిత్వాన్నీ మనస్తత్వాన్నీ కప్పిపెట్టి, నటించడం నేర్పుతున్నాయా ఈ కోర్సులు. మనసుకీ బుద్ధికీ పొంతన లేకుండా చిలకపలుకులు పలకడానికి చాలా టాలెంట్‌ కావాలి.

‘‘మీరు మరోలా భావించవద్దు. ట్రెండ్‌కి తగ్గట్లు ప్రాక్టికల్‌గా బతకగల్గితేనే మనం సంతోషంగా ఉంటాం. నాకు ఏ సంబంధంలేని వ్యక్తులకి నా కష్టార్జితం ధారపోసి, అవసరమైతే సర్వీస్‌ చేసేంత పాతతరం వ్యక్తిని కాదు నేను. మరో విషయం... పెళ్ళయ్యాక, భర్తతో కలిసి విదేశాల్లో ఉద్యోగానికి వెళ్ళాలనే ఆశ కూడా ఉంది నాకు’’ చాలా స్పష్టంగా చెప్పింది దివ్య, కోక్‌ తాగుతూ.ఆలోచనలోపడ్డాను.
‘‘ఏదిఏమైనా, మీరు నాకు నచ్చారు వేమూరీ! మరీ ఓపెన్‌గా నా అభిప్రాయం చెప్పానని కోపం లేదు కదా’’ చనువుగా నా చేతిమీద చెయ్యి వేస్తూ అంది.
‘‘అస్సల్లేదు, పద వెళ్దాం’’ లేచాను.

* * *

‘‘ష్‌... మాట్లాడకు. అదిగో తనే పార్వతి, చూడు’’ టీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమం చూస్తున్న అమ్మ చూపించింది, తియ్యగా పాడుతున్న అమ్మాయిని.
‘‘ఒరేయ్‌! రేపెళ్ళి చూద్దామేమిటి పార్వతిని. నేనింకా వాళ్ళకి కబురేం చేయలేదులే!’’ పాట పూర్తయ్యాక నన్ను చూసిన నాన్న అన్నారు.
ఈసారింక కన్ఫ్యూజనేం లేదు. యథాప్రకారం ‘పెద్దల మాటే చద్దిమూట’ అయింది. పార్వతి నా జీవితంలోకి రాబోతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.