close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందరి విజయం... సుందర చల్లపల్లి!

అందరి విజయం... సుందర చల్లపల్లి!

‘సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌’లో భాగంగా...వైద్య విద్యార్థులకు బోధించే ‘ది గ్రేట్‌ శానిటరీ అవేకెనింగ్‌’ పాఠం పరిసరాల పరిశుభ్రత మీదే ప్రజల ఆరోగ్యమూ ఆయుర్దాయమూ ఆధారపడి ఉంటాయని చెబుతుంది. ఆ దంపతులు మాత్రం...చాలామంది వైద్యుల్లా పట్టా చేతికిరాగానే పాఠాన్ని మరచిపోలేదు. తాము వైద్యశాలను నిర్వహిస్తున్న గ్రామంలో ఆ సూత్రాన్ని అమలు చేశారు. ఫలితంగా, గ్రామం మారింది. మరిన్ని గ్రామాలకు మార్పు సందేశమైంది.

ఆ ‘స్వచ్ఛ’ ప్రయోగశాల పేరు...చల్లపల్లి!

* * *

కృష్ణాజిల్లాలోని చల్లపల్లి దివిసీమకు ముఖద్వారం. జనాభా ఇరవై వేలు. గ్రామంలో పద్దెనిమిది వార్డులున్నాయి. ఐదువేల గడపలున్నాయి. రెండు ప్రధాన వీధులున్నాయి. చిన్నాచితకా ఉపవీధులు నూటనలభై దాకా ఉండవచ్చు. 216వ నంబరు జాతీయ రహదారి ఈ గ్రామం మీదుగానే వెళ్తుంది. వూళ్లొ అన్నీ ఉన్నా, శుభ్రతే కరవు.

ఆ దుస్థితి డాక్టర్‌ పద్మావతి, డాక్టర్‌ దాసరి రామకృష్ణప్రసాద్‌లను కలవరపరచింది. పచ్చని గ్రామం రొచ్చుగుంతలా మారిందెందుకు? చల్లదనాన్ని మోసుకురావాల్సిన గాలి ...చికాకు కలిగించే దుర్గంధాన్ని తీసుకొస్తోందేమిటి? మన వంతుగా ఏమీ చేయలేమా? ఓ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేమా?

- ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలకు జవాబు వెదికే ప్రయత్నం ప్రారంభించారు డాక్టర్‌ ప్రసాద్‌. నలుగురూ కూర్చుని చర్చించుకుంటే, ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో అన్న ఆశతో తమ కాలనీవాసులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఓ వేదికంటూ కనిపించేసరికి, అందరి గుండెల్లోని ఆవేదనా పొంగుకొచ్చింది. పాడుకంపును పొలిమేరలు దాటించాలని తీర్మానించారు. తొలి ప్రయత్నంగా ‘ఇక్కడ మలమూత్ర విసర్జన చేయరాదు’ అన్న బోర్డు తగిలించారు. దాన్నెవరూ పట్టించుకోలేదు. మహా అయితే ఓ చూపు చూసి, తమ పని తాము చేసుకుపోయారు. ‘ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా...’ అంటూ టముకు వేయించారు. దాన్నో చోద్యంలా చూడటమే తప్పించి, మనసు మార్చుకున్న దాఖలాల్లేవు. చివరి అస్త్రంగా...కాలనీవాసులు వంతులు వేసుకుని తెల్లవారుజాము నుంచీ అరగంటకు ఒకరు చొప్పున గస్తీ తిరిగారు. చేతిలో నీళ్ల డబ్బాతో ఎవరు ఎదురొచ్చినా చిరునవ్వుతో పలకరించారు. చేతులు జోడించి నమస్కారం పెట్టి...‘బహిరంగ మలవిసర్జన అనాగరికం. అనారోగ్యకరం. ఈ అలవాటు మానుకోండి’ అని సున్నితంగా విన్నవించారు. అలాంటి సందర్భాల్లో, అవతలివారి అహం దెబ్బతింటుంది. ‘మీరెవరు చెప్పడానికి?’ అంటూ హూంకరిస్తారు. ‘ఏం చేసుకుంటావో చేసుకో...’ అని గొడవకు దిగుతారు. ఇక్కడా అదే జరిగింది. అయినా, డాక్టరుగారి నేతృత్వంలోని స్వచ్ఛ బృందం సహనాన్ని కోల్పోలేదు. ‘మంచి మాట-మంచి పాట’ పేరుతో ‘నా జన్మ భూమి ఎంత అందమైన దేశమూ...’ తదితర పాటలతో ప్రచార కార్యక్రమాలు హోరెత్తించారు. ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నా, అలవాటుకొద్దో కాలక్షేపానికో చెంబుపట్టుకుని వీధుల్లోకి వచ్చేవారి సంఖ్యా తక్కువేం కాదు. అదెంత అనారోగ్యకరమైన అలవాటో వారికి ‘బహిరంగంగా...’ బోధించారు. కార్యకర్తల ప్రయత్నాన్ని చూసి, ‘ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు. మీరు చెబితే మాత్రం ఆగుతుందేమిటి?’ అంటూ గేలి చేసినవాళ్లూ ఉన్నారు. నిజమే, తొలి రోజు ఆగలేదు. తొలివారం ఆగలేదు. కానీ పక్షంరోజుల్లో స్పష్టమైన తేడా కనిపించింది. మూడు నెలల్లో పూర్తిగా నిలిచిపోయింది. ఈ మార్పు చల్లపల్లిలోని ఓ వీధికే పరిమితం కావచ్చు. కానీ, అపరిశుభ్రతను మొత్తంగా గ్రామం నుంచే తరిమేయగలమన్న నమ్మకాన్ని కలిగించింది.

సరిగ్గా ఆ సమయంలోనే... అంటే, 2014 అక్టోబరు 2న ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్‌’ నినాదం చేశారు. స్వయంగా తానే చీపురు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. మోదీజీ అడుగుజాడల్లోనే...కేంద్రమంత్రులూ, ముఖ్యమంత్రులూ, మంత్రులూ, ఎమ్మెల్యేలూ. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ చల్లపల్లిలో ‘స్వచ్ఛ భారత్‌’ అమలుకు సంబంధించి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధిగా డాక్టర్‌ ప్రసాద్‌ అందులో పాల్గొన్నారు. సంవత్సరంపాటూ రోజుకు గంట చొప్పున, వారానికి అయిదు రోజులు...స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగస్వామిని అవుతానని ఆ వేదిక మీదే ప్రకటించారు. అన్నట్టుగానే...2014 నవంబరు 12వ తేదీ తెల్లవారుజామున వీధుల్లోకి వచ్చారు. ఆయనతో పాటే మరో పదిహేనుమంది సిద్ధమయ్యారు. నాలుగున్నర నుంచి ఆరున్నర వరకూ...రోగికి చికిత్స చేస్తున్నంత శ్రద్ధగా వీధుల్ని శుభ్రం చేశారు. ఆ చిత్తశుద్ధిని చూసి వూరంతా ముక్కున వేలేసుకుంది. ‘ఫొటో పోజుల కోసమే ఇదంతా’ అని వెటకారంగా మాట్లాడినవారూ ఉన్నారు. రోజులు గడిచేకొద్దీ, కార్యకర్తల సంఖ్య పెరిగేకొద్దీ...అందర్లోనూ ఆత్మపరిశీలన మొదలైంది. తామంతా బాధ్యత లేకుండా చెత్తాచెదారాలు పడేస్తుంటే, ఎవరో వచ్చి శుభ్రం చేయడం నామోషీగా అనిపించసాగింది. ఒకరోజు, రెండ్రోజులు...ఎంతకాలమని మనస్సాక్షిని మభ్యపెడతారు. ఓ దశకు వచ్చేసరికి అపరాధభావం పొంగుకొచ్చింది. తప్పు తెలుసుకున్నారు. చీపురు పట్టుకున్నారు.

 

పక్కా ప్రణాళిక...
మోదీ ‘స్వచ్ఛభారత్‌’ పిలుపుతో వేల గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టారు. చాలా చోట్ల ఒకట్రెండు నెలల్లోనే ఉత్సాహం ఆవిరైపోయింది. అదృష్టంకొద్దీ చల్లపల్లి ప్రజలకు అలాంటి ఆరంభశూరత్వం లేదు. అన్నింటికీ మించి, ఆ ఉద్యమానికి డాక్టర్‌ ప్రసాద్‌ దంపతుల రూపంలో బలమైన నాయకత్వం లభించింది. చేతిలో చీపుళ్లు పట్టుకుని గాలివాటంగా ఏదో ఓ వీధిని శుభ్రం చేయడం కాదు...పక్కాగా ఓ ప్రణాళిక ప్రకారం పనిచేస్తూ వచ్చారు. సమస్య...పరిష్కార మార్గాలు...ఉత్తమ పరిష్కారం...వ్యూహం....అమలు...సమీక్ష - ఇలా ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. లోపాలుంటే సరిచేసుకుంటారు. సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. నిర్ణయాలన్నీ సమష్ఠిగా ఉంటాయి. దీంతో... ‘ఈ ఉద్యమం నాదీ...’ అన్న భావన కార్యకర్తల్లో బలంగా నాటుకుంది. సగటున రోజూ ఓ వందమంది దాకా...తెల్లవారుజాము నాలుగున్నరకంతా ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలో కలుస్తారు. వీధులు శుభ్రం చేయడం, డ్రెయిన్లు పూడికతీయడం, పిచ్చి కంపలు తొలగించడం, అశుద్ధాన్ని ఎత్తేయడం...ఆపూట కార్యక్రమం ఏదైనా కావచ్చు. ఆ చేతులు...చీపుర్లు పట్టుకుంటాయి, చెత్తతట్టల్ని తలకెత్తుకుంటాయి, మురుగునీటిలో మునకలేస్తాయి. ఆ బృందంలో విద్యావంతులుంటారు, నిరక్షరాస్యులుంటారు, వయోధికులుంటారు, యువకులూ ఉంటారు. ఉద్యమక్షేత్రంలో అంతా సమానమే. ఆ రెండుగంటలూ స్వచ్ఛతే సర్వస్వం. పనే వ్యాయామం, పనే యోగా, పనే ధ్యానం, పనే ప్రార్థన. అంతలోనే, డాక్టరుగారి చేతిలోని విజిల్‌ మోగుతుంది. ఆ పూట కార్యక్రమం పూర్తయినట్టు అదో సంకేతం. ఒంటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ..ఒడ్డుకు వచ్చేస్తారు. కలసి కాఫీ తాగుతూ...రేపు ఎక్కడ కలుసుకునేదీ నిర్ణయిస్తారు.

చీపుళ్లూ, పలుగులూ, పారలూ, ట్రాక్టర్లూ, ట్యాంకర్లూ...ఒకటేమిటి, అవసరమైన సామగ్రినంతా సిద్ధం చేసుకుంది ‘స్వచ్ఛ చల్లపల్లి’ బృందం. ఆ సేవాస్ఫూర్తికి మెచ్చి స్వచ్ఛందంగా సరంజామాను సమకూర్చినవారూ ఉన్నారు. ఎముకల వ్యాధి నిపుణులు డాక్టర్‌ గురవారెడ్డి చెత్త సేకరణకు వాహనాన్నిచ్చారు. ఏడాది పాటూ నెలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయమూ చేశారు. శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు వరప్రసాదరెడ్డి శ్మశానం, డంపింగ్‌యార్డు అభివృద్ధికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చారు. డాక్టరుగారి కుటుంబ సభ్యులూ, స్వచ్ఛ కార్యకర్తలూ తలో కొంత వేశారు. నిధుల కొరతతో ఏ కార్యక్రమమూ ఆగిపోకూడదన్న ఆలోచనతో ‘మన కోసం మనం’ పేరుతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు.

‘స్వచ్ఛ చల్లపల్లి’ ఉద్యమకారులు సామాన్యుల వైపునుంచీ ఆలోచిస్తారు. ఆయా దురలవాట్ల వెనకున్న అవసరాలనూ అర్థం చేసుకుంటారు. బహిరంగ మలవిసర్జనకు ప్రధాన కారణం...టాయిలెట్‌ సౌకర్యం లేకపోవడమే. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్నవారికి తగిన ప్రత్యామ్నాయం చూపించడం కూడా తమ బాధ్యతేనని భావించారు. దాదాపు డెబ్భై మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు. మరో నూటముప్పై మరుగుదొడ్ల కోసం, పట్టుబట్టి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. ఆ మొత్తం చాలకపోతే, తమవైపు నుంచీ కొంత ఇచ్చారు.

రేయింబవళ్లూ...
స్వచ్ఛ సైన్యం చొరవతో చాలా వీధులు అద్దాల్లా మెరిసిపోయాయి కానీ, వూళ్లొ పోగైన చెత్తనంతా ఏం చేయాలో అర్థం కాలేదు. పంచాయతీకి శాశ్వత డంపింగ్‌యార్డు అంటూ లేదు. దీంతో, ఎక్కడ పడితే అక్కడ కుమ్మరించేవారు. గ్రామంలో ఎవరు అడుగుపెట్టినా...చెత్త కుప్పలే స్వాగతం పలికేవి. చివరికి పంట కాలువలు కూడా వ్యర్థాలతో పొంగిపొర్లేవి. ఆ సమస్యకు శ్రమదానంలో పరిష్కారం దొరికింది. తలోచేయీ వేసి పాత డంపింగ్‌ యార్డు స్థలాన్ని శుభ్రం చేసుకున్నారు. అదంతా ఓ కొలిక్కి రావడానికి నాలుగు వారాలు పట్టింది. ఆ పరిసరాల్ని పచ్చని మొక్కలతో ఉద్యానవనంలా తీర్చిదిద్దారు. కొన్ని చోట్ల, ఆక్రమణల కారణంగా స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలకు అవరోధం ఏర్పడింది. మిగతా సందర్భాల్లో అయితే...ఆ తొలగింపులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేవి. జనం ఉద్యమం కావడంతో...కాస్తంత వ్యతిరేకత కూడా వ్యక్తం కాలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగా...బహిరంగ మలవిసర్జన నిలిచిపోయింది, వీధుల్లో చెత్తవేయడమూ ఆగిపోయింది. మురుగునీటి ముచ్చటే లేకుండా పోయింది. ఏడాది తిరిగేసరికి చల్లపల్లి స్వచ్ఛంగా...కడిగిన ముత్యంలా మెరిసిపోయింది.

ప్రజా భాగస్వామ్యం...
ఒక నాయకుడూ, కొద్దిమంది కార్యకర్తలూ చేతులు కలిపితే...మహా అయితే ఓ కార్యక్రమాన్ని కొంతకాలం పాటూ నిర్విఘ్నంగా నడిపించగలరు. అదే స్ఫూర్తిని దీర్ఘకాలం కొనసాగించడం అసాధ్యం. ఆ పరిమితిని అధిగమించాలంటే, ప్రజల్ని మమేకం చేయాలి. ‘స్వచ్ఛ, సుందర చల్లపల్లి’ విజయ రహస్యం ఆ జన భాగస్వామ్యమే. వూళ్లొ పిల్లల పుట్టినరోజులు కూడా ఆ వేదిక మీదే జరుగుతాయి. మునుపట్లా విందులూ వినోదాలంటూ ఆర్భాటాలకు వెళ్లకుండా...ఆ డబ్బేదో ట్రస్టుకు విరాళంగా ప్రకటిస్తున్నారు. దీనివల్ల చిన్నారుల్లోనూ శుభ్రత పట్ల అవగాహన పెరుగుతోంది, బాధ్యత తెలుస్తోంది. ఓ సాధారణ దర్జీ, తన ఆర్థిక సమస్యలు తనకున్నా పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా దుస్తులు సమకూర్చడానికి ముందుకొచ్చాడు. ‘ఇంత మంది స్వచ్ఛందంగా పనిచేయడం గొప్ప విషయం. నావంతుగా, ప్రతినెలా పింఛను సొమ్ములోంచి ఓ ఐదువేల రూపాయలు విరాళంగా ఇస్తున్నా’ అంటారు ప్రాతూరి శంకర శాస్త్రి. ఇలాంటి ఉడత సాయాలే...కొండంత అండగా నిలుస్తున్నాయి, నిధుల కొరత లేకుండా చేస్తున్నాయి.

తొలిదశలో...‘స్వచ్ఛ చల్లపల్లి’ ఉద్యమానికి ఒకట్రెండు అవరోధాలూ ఎదురయ్యాయి. ఒకరోజు రోడ్డు పక్కనున్న చెత్తగుట్టల్ని శుభ్రం చేస్తుంటే తీవ్ర దుర్గంధం వెలువడింది. ఆ ప్రభావానికి ముగ్గురు కార్యకర్తలు అనారోగ్యం పాలయ్యారు. ముళ్లపొదల్ని తొలగిస్తున్నప్పుడు బుస్సుమంటూ విష కీటకాలు బయటికొచ్చాయి. చిన్నచిన్న గాయాలూ, స్వల్ప అనారోగ్యాలూ కార్యకర్తల మనోస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి. సరికదా, పట్టుదల పదిరెట్లు పెరిగింది. సాంకేతిక సహకారం అందిస్తామంటూ ఎంతోమంది నిపుణులు ముందుకొస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఉదయ్‌సింగ్‌ గౌతమ్‌ అనే నిపుణుడు సమకూరుస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమానికి వెన్నంటి నిలిచారు. ఏ ఉద్యమానికైనా సాహిత్యమే ప్రాణం, పాటే వూపిరి. ఆ కొరతా లేదిక్కడ. జొన్నవిత్తుల, సుద్దాల అశోక్‌తేజ తదితర సాహితీవేత్తలు గేయాల మాలల్ని అల్లి ఇచ్చారు.

‘స్వచ్ఛ’ యాత్రికులు...
ఆనోటా ఈనోటా ‘స్వచ్ఛ చల్లపల్లి’ గురించి విని...ఎంతోమంది ఈగ్రామాన్ని సందర్శించారు. వంద రోజుల కార్యక్రమంలో చెస్‌ క్రీడాకారిణి, స్వచ్ఛభారత్‌ రాయబారి కోనేరు హంపి పాల్గొన్నారు. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రజల శుభ్రతా సంస్కారానికి చేతులెత్తి మొక్కారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ‘రేపటి భారతానికి నమూనా’ అని కొనియాడారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలో జరిగిన స్వచ్ఛభారత్‌ రాయబారుల సమావేశంలోనూ చల్లపల్లి ఉద్యమాన్ని ప్రస్తావించారు. గోపాలం శివన్నారాయణ (న్యూరో ఫిజీషియన్‌), డాక్టర్‌ మన్నం గోపీచంద్‌ (హృద్రోగ నిపుణులు), డాక్టర్‌ మిత్రా (సామాజిక వేత్త), కొసరాజు వీరయ్య చౌదరి (కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌), మంత్రులు కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు...ఇలా చల్లపల్లి స్వచ్ఛ ఉద్యమాభిమానుల జాబితా చాలా పెద్దదే. పంచాయతీరాజ్‌ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రెండేళ్ల ఉద్యమ సభకు విచ్చేసి...‘ఇంతటి స్ఫూర్తిని నా ముప్పై ఏళ్ల ప్రజా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలోని పదమూడువేల సర్పంచులను తీసుకొచ్చి చల్లపల్లిని పరిచయం చేయాలనుంది. చేస్తాను కూడా’ అని ప్రకటించారు.