close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మనసే... ఒక పూలతోట

మనసే... ఒక పూలతోట
- సునీత గంగవరపు

ఇంటిముందు మెట్ల మీద కూర్చుని పూలు అల్లుతోంది సావిత్రి. రంగురంగుల కనకాంబరాలూ... మధురోహలతో మరులుగొలిపే మల్లెలూ... సరసోక్తుల సరిగమలు పలికే సంపెంగలూ ఆమె ఒడిలో సమావేశమై సువాసనలు వెదజల్లుతూ వెచ్చని వూసులాడుకుంటున్నాయి. వేళ్ళమధ్యన దారాన్ని కూర్చుకొని పూలను వరుసగా దారానికి చుట్టి ఒడుపుగా లాగుతూ చక్కని పూలదండ అల్లింది సావిత్రి. ఆమె మనుమరాలు ఆకాంక్ష అప్పుడే స్నానం చేసి దువ్వెన చేతబట్టుకుని వచ్చి అమ్మమ్మ ఒడిలో కూర్చుంది- జడ వేయమన్నట్లు. పొడవాటి నీలంరంగు కుచ్చుల గౌనులో తెల్లగా బొద్దుగా మైనపుబొమ్మలా ఉన్న ఏడేళ్ళ మనవరాలిని తృప్తిగా చూసుకుని తల దువ్వసాగింది.

‘‘అమ్మమ్మా’’ ముద్దుగా పిలిచింది ఆకాంక్ష.

‘‘ఏమిటి తల్లీ’’

‘‘నువ్వు పూలెందుకు పెట్టుకోవు? రోజూ పూలన్నీ అల్లి నాకూ మమ్మీకే పెడతావు. నువ్వెందుకు పెట్టుకోవు అమ్మమ్మా.’’

అమాయకంగా, దీర్ఘం తీస్తూ అడిగిన మనవరాలి ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక కొన్ని క్షణాలు తడబడింది సావిత్రి. సమాధానం చెప్పకుండా జడ అల్లి పూలు పెట్టింది. అప్పుడే తల తడుచుకుంటూ వరండాలోకి వచ్చిన ప్రమద కూతురి మాటలు వినడంతోబాటు తల్లిపడే ఇబ్బందిని గమనించింది.

‘‘ఆకాంక్షా, నువ్వు హోంవర్క్‌ కంప్లీట్‌ చేశావా? ఏం చేశావో ఎలా చేశావో వచ్చి నాకు చూపించు’’ అన్న ప్రమద మాటలకు ‘‘వస్తున్నా మమ్మీ’’ అంటూ లోపలికి పరుగుతీసింది ఆకాంక్ష. మెట్లమీద ఒంటరిగా మిగిలిపోయిన తల్లి దగ్గరికి వచ్చింది ప్రమద.

‘‘ఎప్పుడూ ఈ మొక్కల దగ్గరే కాలం గడుపుతావేంటమ్మా. ఇంట్లోకి వచ్చి కాస్త వంటపనిలో సహాయం చేయవచ్చు కదా! పని చేయడం ఇష్టంలేకపోతే టీవీలో నీకిష్టమైన ఛానెల్‌ పెట్టుకుని చూడు. పాపకు కథలు చెప్పు, కబుర్లు చెప్పు. అంతేకానీ, ఎప్పుడూ ఈ మొక్కల మధ్యనే ఏదో ఆలోచిస్తూ తిరుగుతుంటే, నీ ఆరోగ్యం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందమ్మా’’ అంది.

కూతురి మాటలకు నవ్వి చెప్పింది సావిత్రి... ‘‘పిచ్చి తల్లీ! నాకు ఆరోగ్యాన్నిచ్చేదీ ఆయువునిచ్చేదీ ఈ పూలమొక్కలే. ఆ గులాబీమొక్క చూడు... నేను తోడుగా ఉన్నానన్న ఆనందమేమో... ఎంత ఉత్సాహంగా విచ్చుకుంటుందో. ఆ విరజాజి కొమ్మను చూడు... నా మాటలు అర్థమవుతున్నాయేమో ఎంత హాయిగా వూయలూగుతుందో..!’’

‘‘అబ్బా, నీ ధ్యాస నీదేకానీ నేను చెప్పే విషయం అర్థంచేసుకోవేంటమ్మా’’ అసహనంగా అంది ప్రమద.

‘‘మల్లెపాదులో నీళ్ళు సరిగా నిలవడం లేదు ప్రమదా. ఆ ముద్దమందారం వారంరోజులైనా ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. వాటిని కాస్త పరామర్శించి వస్తాగానీ... నువ్వెళ్ళి వంటపని చూడు. జీవన్‌ వచ్చే టైమ్‌ అయినట్లుంది’’ కాళ్ళకు చెప్పులేసుకుని ఇంటి చుట్టూ విస్తరించి ఉన్న పూలతోటలోకి నడుస్తూ చెప్పింది సావిత్రి.

చేసేదేమీలేక చిన్నగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది ప్రమద.

సావిత్రి ఒక్కో పూలమొక్క దగ్గరికీ వెళ్ళి తడిమి చూస్తోంది. మొగ్గలేసిన మొక్కలను ప్రేమగా నిమిరింది. విచ్చుకున్న పూలరేకులను చూపుడువేలి కొనతో సున్నితంగా స్పర్శించింది. వాడి, రాలిపోయిన పువ్వులను చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూస్తుంటే, మనవరాలి ప్రశ్న గుర్తుకొచ్చింది. అవును... తను పూలెందుకు పెట్టుకోవడం లేదు? సమాధానం ఉండీ లేని గతం... పువ్వులా రాలిన గతం... ముల్లులా గుచ్చుకుంటుంటే, తోట మధ్యలో ఉన్న సిమెంటు బెంచీపై నిస్సత్తువగా కూర్చుంది సావిత్రి- అప్రయత్నంగానే గతాన్ని గుర్తుచేసుకుంటూ!

‘‘ఈరోజు పూలు పెట్టుకోలేదేంటి సావిత్రీ’’ పలకను ఒడిలో పెట్టుకుని, వేళ్ళను లెక్కిస్తూ కూడికలు చేస్తున్న సావిత్రిని పలకరించాడు చంద్రం. వాళ్ళిద్దరూ అదే వూళ్ళొని ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు.

‘‘మరే, మా అమ్మకు ఒంట్లో బాగులేదంట, పడుకుంది’’ ఒత్తైన తన రెండు జడలను వెనక్కి వేసుకుని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది సావిత్రి. సావిత్రివాళ్ళ పెరట్లో మల్లె, విరజాజి, కనకాంబరాలు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. సావిత్రివాళ్ళ అమ్మ రోజూ తల నున్నగా దువ్వి, రెండు జడలు వేసి రోజుకోరకం పూలు పెట్టేది. స్కూల్లో పిల్లలంతా సావిత్రి జడలనూ జడలో పూలనూ ఇష్టంగా చూసేవారు. చంద్రానికయితే ఆ ఇష్టం ఇంకాస్త ఎక్కువగా ఉండేది.

‘‘మరి, మా చేలో చాలా పూలు పూశాయి, పాస్‌ బెల్‌కు వెళ్ళి తెచ్చుకుందామా?’’ అడిగాడు చంద్రం.

‘‘ఓ’’ ఆనందంగా ఒప్పుకుంది సావిత్రి.

బెల్‌ కొట్టగానే వూరి చివరనున్న చంద్రంవాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ. మిరపతోట మధ్యలో రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దినట్లు విరగబూసి ఉన్నాయి బంతిపూలు. వాటిలో కొన్ని తెంచుకుని సూదీ దారంతో దండగా కట్టారు. జడలో పూలను పెట్టుకోవడానికి సావిత్రికి సహాయం చేశాడు చంద్రం. స్వచ్ఛంగా... జడకు పూసిన పువ్వుల్లా ఉన్న వాటి అందాన్ని ఆరోజంతా గమనిస్తూనే ఉన్నాడు అతను.

అలా... అప్పుడప్పుడు... వీలైనప్పుడల్లా సావిత్రికి పూలను ఇస్తూనే ఉన్నాడు చంద్రం. సావిత్రి కూడా వాటిని ఆనందంగా స్వీకరించేది. క్రమంగా వారి తరగతులు మారుతున్నాయి... వయసు పెరుగుతోంది... పూలు ఇవ్వడంలోని తీసుకోవడంలోని అర్థాలు మారుతున్నాయి. ఆ అర్థాల అంతరార్థాన్ని గ్రహించగలిగే మానసిక పరిపక్వత వారికి వచ్చింది. కానీ, ఆ ఆనందాన్ని వదులుకునే ఉద్దేశం వారిద్దరిలో ఎవరికీ లేదు.

తెల్లవారితే పదో తరగతి చివరి పరీక్ష. స్నేహితురాలు హేమ ఇంట్లో కంబైన్డ్‌ స్టడీ చేసి పొద్దుగుంకేవేళ ఇంటికి వెళుతున్న సావిత్రికి సడెన్‌గా ఎదురువచ్చాడు చంద్రం.

‘‘సావిత్రీ, నీతో మాట్లాడాలి’’ చెప్పాడు.

సావిత్రి భయంభయంగా చుట్టూ చూసింది.

‘‘ఫర్వాలేదు, అక్కడ నిలబడి మాట్లాడుకుందాం’’ ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న వేపచెట్టు నీడకు చేరుకున్నారు.

‘‘సావిత్రీ, రేపు చివరి పరీక్ష. ఆ తర్వాత నువ్వు ఏ కాలేజీలో చేరుతావో... నేనెక్కడ చదువుతానో! ఎక్కడైనా కానీ, మన చదువులు పూర్తయ్యాక నీకిష్టమైతే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం సావిత్రీ’’ ఉద్వేగంగా అడుగుతున్నాడు చంద్రం.

సావిత్రికీ అతనంటే ఇష్టమే. కానీ కులాలు వేరు. రెండు కుటుంబాల సంప్రదాయాలూ పద్ధతులూ వేరు. పెద్దలు తమ పెళ్ళి జరగనిస్తారా? సావిత్రి ఆలోచిస్తోంది.

‘‘ఎన్నాళ్ళయినా నీకోసం ఎదురుచూస్తుంటాను. నువ్వెక్కడున్నా ఏ పువ్వును చూసినా నేను నీకు గుర్తుకురావాలి. ఏదీ ఒక్కసారి దోసిలిపట్టు’’ చెప్పాడు. సావిత్రి దోసిలి పట్టగానే ప్యాంటు జేబులో నుంచి తీసిన మల్లెమొగ్గలను ఆమె దోసిట్లో పోశాడు.

‘‘రేపు పరీక్ష రాశాక కలుద్దాం సావిత్రీ, బై’’ అంటూ వెళ్ళిపోయాడు చంద్రం. ఆ తెల్లవారుజామున పక్కమీద నలిగిపోయిన మల్లెల పరిమళం ఇంకా సావిత్రిని విడిచిపోలేదు. చంద్రం ఇచ్చిన పువ్వుల తాలూకు సువాసన అతని జ్ఞాపకాలుగా మారి చుట్టుముడుతుంటే... అవ్యక్తమైన అనుభూతితో బద్దకంగా కళ్ళు తెరిచింది. ఆరోజు జరగబోయే చివరి పరీక్ష కోసం చంద్రం ఆలోచనలను బలవంతంగా పక్కకునెట్టి పుస్తకం తెరిచి చదవసాగింది.

ఇంతలో బయట ఏదో కలకలం. సావిత్రి తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది. వూరి జనాలు ఏదో చెప్పుకుంటూ అటూ ఇటూ పరిగెడుతున్నారు. అంతలో హడావుడిగా పరిగెత్తుకొచ్చిన హేమ అంది- ‘‘ఎంత ఘోరం జరిగిపోయిందో చూశావే! మన చంద్రం కరెంట్‌ షాక్‌ తగిలి చనిపోయాడట.’’

సావిత్రికి తను విన్నదేమిటో అర్థంకాలేదు. అప్రయత్నంగా అడిగింది ‘‘ఏ చంద్రం..?’’ అని.

‘‘మన క్లాస్‌మేట్‌ చంద్రమే. నీకు ఎప్పుడూ పూలు ఇస్తుంటాడు కదా... ఆ చంద్రం. పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళాడట. స్విచ్‌ వేస్తుంటే షాక్‌ కొట్టి...’’ హేమ ఏదో చెప్తూనే ఉంది. సావిత్రికి ఏమీ వినబడటం లేదు. పరిసరాలనూ పరిస్థితులనూ గమనించడానికి ఆమె శరీర అవయవాలు సహకరించడం లేదు. అణువణువూ ఆక్రమించుకున్న అశక్తతతో, రెండు చేతులతో తలపట్టుకుని అలాగే కూలబడిపోయింది.

* * *

‘‘నువ్వు ఎప్పుడైనా... ఎవరినైనా ప్రేమించావా సావిత్రీ...’’ వూహించని అతని ప్రశ్నకు ఉలిక్కిపడి చూసింది సావిత్రి. తెల్లవారుజామున మంచంమీద మరోవైపుకు తిరిగి పడుకున్న సావిత్రిని తనవైపుకు తిప్పుకుంటూ అడిగాడు ఆమె భర్త రాంబాబు.

సావిత్రి పదో తరగతి చివరి పరీక్ష ఫెయిలయింది. ఆడపిల్లలను చదివించడమే గొప్ప. దానికితోడు ఫెయిలై ఇంట్లో ఉంటే మరీ అవమానంగా భావించే ఆమె పల్లెటూరి తల్లిదండ్రులు రెండేళ్ళు తిరక్కుండానే ఆమె అభిప్రాయంతో పనిలేకుండా పెళ్ళి చేశారు. పెళ్ళయిన రెండు నెలల తర్వాత భర్త అడిగిన ఆ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో అర్థంకాలేదు సావిత్రికి.

‘‘ఫర్వాలేదులే చెప్పు! వయసులో ఉన్న యువతీ యువకులు ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడకపోతే వారిలో ఏదో లోపమున్నట్లంట. మా సైన్స్‌ సారు చెప్పేవాడు. పోనీ, నా లవ్‌స్టోరీ చెప్పమంటావా ముందు’’ రాంబాబు మాటలకు తేలిగ్గా వూపిరి తీసుకుని ‘‘చెప్పండి’’ అంది సావిత్రి.

‘‘రాజేశ్వరి అని- మా ఇంటిపక్కనుండేది. ఇద్దరం సినిమాలకూ షికార్లకూ తిరిగాం. చేలల్లో, చెట్లమాటున కబుర్లు చెప్పుకున్నాం. మేము తిరగడానికి లేని ఆటంకం ‘పెళ్ళి’ అనేసరికి వచ్చింది. నాకు గవర్నమెంటు ఉద్యోగముంటే కానీ అమ్మాయినివ్వమన్నారు రాజీ తల్లిదండ్రులు. నేను పంతానికి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నా. కానీ, ఉద్యోగమొచ్చాక అన్పించింది... ఈ నల్లపిల్లని ఎందుకు చేసుకోవడం అని. అందుకే, వెతికి వెతికి కుందనపుబొమ్మ లాంటి నిన్ను చేసుకున్నాను’’ చెప్పి గట్టిగా నవ్వాడు రాంబాబు.

సావిత్రి నవ్వలేదు. తనేం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది. రాంబాబు మళ్ళీ గుచ్చిగుచ్చి అడగడంతో... జడలో నలిగిన మల్లెపూలూ గుండెల్లో దాగిన చంద్రం జ్ఞాపకాలూ మనసుని మెత్తగా తాకగా, ఒక రకమైన ట్రాన్స్‌లో ఉన్నట్లు చంద్రం గురించి అతనికంతా చెప్పేసింది. అదే ఆమె చేసిన మొదటి తప్పు. బహుశా చివరి తప్పు కూడా అదేనేమో!

‘‘అందుకేనా... రోజూ తలనిండా పూలు పెట్టుకుంటావు. పూలను చూస్తుంటే- అచ్చం నీ బాయ్‌ఫ్రెండ్‌ను చూసినట్లే ఉంటుంది కదూ!’’ వూహించని అతని రియాక్షన్‌కు బిత్తరపోయింది సావిత్రి.

‘‘ఛఛ, అలాంటిదేమీ లేదండీ. అయినా మీరు కూడా చెప్పారు కదా అని...’’

‘‘అంటే, నేను తప్పు చేస్తే నువ్వు కూడా చేస్తావన్నమాట. నేను మగాణ్ణి... వందచోట్లకి వెళ్ళి వందమందితో తిరిగినా నన్ను అనేవాళ్ళు లేరు. నీకూ తిరగాలని ఉందా?’’

అతనిలోని కొత్త కోణాన్ని గ్రహించి సావిత్రి కుంగిపోయింది. ‘నిజం చెప్పి తప్పు చేశానే’ అని పశ్చాత్తాపపడింది. అతని మనస్తత్వం రోజురోజుకూ కొత్తకొత్తగా అర్థమవుతుండగా దుఃఖాన్ని మౌనంగా గుండెల్లో దాచుకుంది. ఆమె మనసుతో, మనస్తాపంతో సంబంధం లేకుండా పుట్టిన ఆడపిల్లను శ్రద్ధగా పెంచసాగింది.

రాంబాబు అప్పటినుంచీ సావిత్రిని పూలు పెట్టుకోనిచ్చేవాడు కాదు. ఇంటి పెరట్లో కూడా పూలమొక్కలను పెరగనిచ్చేవాడు కాదు. చివరకు పూలమ్మేవారు ఎవరైనా ఆ ఇంటివైపు వస్తే... వారిమీద గట్టిగట్టిగా అరిచేవాడు.

వారి కూతురు ప్రమదకు అప్పుడు ఏడేళ్ళ వయసు. కాన్వెంట్‌లో చదువుతోంది. శుక్రవారంనాడు తలస్నానం చేసి రెండుజడలు వేస్తుంటే తల్లిని అడిగింది- ‘‘అమ్మా, ఈరోజు అందరూ సివిల్‌ డ్రస్‌ వేసుకుంటారు. అమ్మాయిలు పూలు పెట్టుకుని వస్తారు. నాకూ పూలు పెట్టవా’’ అని.

‘‘వద్దులే తల్లీ, మీ నాన్నగారికి ఇష్టం ఉండదు’’ కూతురుని ముద్దుపెట్టుకుని స్కూలుకు సాగనంపుతూ చెప్పింది సావిత్రి. ప్రమద నిరాశగా చూసింది. ఓరోజు బడి నుంచి వచ్చిన ప్రమద జడలో పూలను చూసి సావిత్రి కంగారుపడింది. కొనుక్కోవడానికి ఇచ్చిన చిల్లరతో పూలు కొనుక్కుని పెట్టుకుందట. ఎదుగుతున్న ఆడపిల్ల... తొమ్మిదో తరగతి చదువుతోంది. పూలమీదా గాజులమీదా సహజంగానే ఇష్టం ఉంటుంది. అయినా ఆంక్షలు తనమీద తప్ప కూతురిమీద ఉండకపోవచ్చు... సన్నగా నిట్టూర్చి ఇంటిపనిలో నిమగ్నమైంది సావిత్రి. అప్పటినుంచి అడపాదడపా ప్రమద పూలు పెట్టుకుంటూ ఉండేది.

ఒకసారి సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన ప్రమద హోంవర్క్‌ చేసుకుంటూ ముందు గదిలో కూర్చుంది. రాంబాబు ఆఫీసు నుంచి ఎందుకో ఆరోజు కాస్త ముందుగానే వచ్చాడు. రావడంతోనే కూతురి జడలో ఉన్న పూలమాలను గమనించాడు.

‘‘ఎక్కడివే నీకు పూలు?’’ అంటూ కూతుర్ని గట్టిగా నిలదీశాడు.

ప్రమద భయంభయంగా ‘‘వచ్చేటప్పుడు దారిలో కొనుకున్నా’’నని చెప్పింది.

వంటగదిలో ఉన్న సావిత్రి వీరి మాటలు విని కంగారుగా బయటికొచ్చింది.

‘‘పూలన్నా, వాటి వాసనన్నా నాకు ఎలర్జీ అని మీకు తెలుసు కదా! నువ్వు కూడా మీ అమ్మలాగా బరితెగించి, పూలతో ఆకట్టుకుని ఎవణ్ణో బుట్టలో వేసుకుందామని చూస్తున్నావేమో... నరికి పోగులు పెడతా’’నంటూ ప్రమద చెంపమీద గట్టిగా కొట్టాడు రాంబాబు.

అప్పటినుంచీ రాంబాబు సావిత్రినే కాదు, కూతురుని కూడా నిఘా నేత్రాలతో గమనించసాగాడు. కాస్త ఎక్కువగా అలంకరించుకున్నా... నవ్వుతూ కనబడినా అసభ్యంగా నిందించేవాడు.

ఆ రాత్రి భోజనం చేయకుండా ఏడ్చిఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది ప్రమద. సావిత్రికి నిద్ర రాలేదు. ఏడుపు కూడా రావడం లేదు. కాళ్ళచుట్టూ రెండు చేతులు బిగించి మంచంమీద కూర్చుని ప్రమద వైపు చూస్తూ ఆలోచించసాగింది. తనకు సుఖం లేకపోయినా కూతురికి తండ్రి సంరక్షణ అవసరమని ఇన్నాళ్ళూ అతన్ని భరించింది. కానీ, అతనిలోని అజ్ఞానం బిడ్డ భవిష్యత్తుకు మేలుకంటే ఎక్కువ కీడే చేస్తుందన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. సమస్యకు పరిష్కారం కోసం చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించింది. ఓ నిర్ణయానికొచ్చాక ఆరోజు ప్రమదను ఇంటి దగ్గరే ఉండమంది. రాంబాబు ఆఫీసుకెళ్ళాక ప్రమదవీ తనవీ బట్టలు సర్దుకుంది. భర్తకోసం రాత్రే రాసిపెట్టిన చిన్న ఉత్తరాన్ని తీసి మరోసారి చదువుకుంది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది...

‘‘భరించేవాణ్ణి భర్త అంటారు. కానీ, నీ అనుమానంతో, అభద్రతాభావంతో నువ్వు నాకు భారంగా మారినా... భర్తవైన కారణంగా నేనే నిన్ను ఇన్నాళ్ళూ భరించాను. పూలను చూస్తే నా బాయ్‌ఫ్రెండ్‌ గుర్తొస్తాడని వాటిని నాకు దూరం చేశావు. కానీ, వాటిని ఎందుకు దూరం చేశావో గుర్తుచేస్తూ... ప్రతి క్షణం నువ్వే అతని జ్ఞాపకాలను నాకు చేరువ చేశావు. నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం ఒకటి ఇప్పుడు చెప్తున్నాను- భర్తకు ప్రేమగా చూసుకోవడం తెలిస్తే... పదిలంగా గుండెల్లో దాచుకోవడం తెలిస్తే... భార్యకు ఎవరి ప్రేమలూ గుర్తుకురావు. నీ మూర్ఖత్వం- బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు. అందుకే నేను పాపను తీసుకుని వెళ్ళిపోతున్నాను. జీవితంలో మళ్ళీ నిన్ను కలిసే ఉద్దేశం నాకు లేదు. నీకూ ఉండదని ఆశిస్తూ... సెలవు.’’

ఉత్తరాన్ని టేబుల్‌మీద పెట్టి పేపర్‌వెయిట్‌ పెట్టింది. భారమైన మనసుతో సూట్‌కేస్‌ తీసుకుని ప్రమదతో కలిసి ఇంట్లో నుంచి బయటికొచ్చింది సావిత్రి. చిన్ననాటి స్నేహితురాలు హేమ సహాయంతో దూరప్రాంతానికి వెళ్ళి చిన్నగది అద్దెకు తీసుకుని పోషణ కోసం రకరకాలు పనులు చేస్తూ కూతుర్ని చదివించసాగింది. ప్రమద పుస్తకాలూ ఫీజుల కోసం చేతులకున్న గాజులు అమ్మేసింది. తను పదో తరగతిదాకా మెరిట్‌ స్టూడెంట్‌. ఆ చదువునిప్పుడు పిల్లలకు ట్యూషన్లు చెప్పడానికి ఉపయోగించింది. రాత్రిపూట చాలాసేపు మేలుకుని చుట్టుపక్కలవారికి బట్టలు కుట్టేది. ఇంటిపక్కన కిటికీ దగ్గరగా ఉన్న ఒక మల్లెమొక్కకు ఎరువు వేసి పాదుచేసింది. రోజూ ఉదయం, సాయంత్రం నీళ్ళు పోస్తుండటంతో ఎండిన స్థితిలో ఉన్న ఆ మొక్క చివురేసి పూలు పూయసాగింది. అనతికాలంలోనే ఇంటి చుట్టూ అనేక మొక్కలు సావిత్రి సంరక్షణలో ఎదిగి చిన్నపాటి పూలతోటగా మారాయి.

ప్రమద బీటెక్‌ చదివి ఓ పేరున్న కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదించింది. తాము అద్దెకుంటున్న గదినే కొని, రెండు పడగ్గదులతో కాస్త పెద్ద ఇల్లు కట్టించింది. ప్రమద కంపెనీలో పనిచేస్తున్న జీవన్‌ కంపెనీకి సీనియర్‌ మేనేజర్‌. ఇద్దరి మాటలూ మనసులూ కలవడంతో పెద్దల ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ప్రమద, జీవన్‌లు సావిత్రి దగ్గరే ఉంటున్నారు. కూతురు ఆకాంక్షను తల్లికి అప్పగించి ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తుండటంతో ఆకాంక్ష అమ్మమ్మకు బాగా దగ్గరయింది. తన ముద్దుముద్దు మాటలతో, పెద్దపెద్ద కబుర్లతో అమ్మమ్మను అలరించేది ఆకాంక్ష.

ఒక బాధ... వెలితి... అసంతృప్తి... మరేదో ఆనందం... ఒంటరితనం... సావిత్రిలో ఒక రకమైన గంభీరత్వాన్ని తెచ్చిపెట్టాయి. తెల్లబడుతున్న జుట్టూ- ఒంటికి చుట్టుకున్న కాటన్‌ చీరలో వృద్ధాప్య ఛాయలు అప్పుడప్పుడే బహిర్గతమవుతున్నాయి. ఆకాంక్షను స్కూలుకు పంపించాక ఆమె ఎక్కువ సమయం ఆ మొక్కల మధ్యనే గడిపేది. రంగురంగుల పూలతో, ఆరోగ్యంగా ఎదుగుతూ, దినదినాభివృద్ధి చెందుతున్న మొక్కలకు పాదులు చేస్తూ, ఎరువులు వేస్తూ, నీళ్ళు పోస్తూ వాటి పచ్చదనానికి మురిసిపోతుండేది సావిత్రి. వాటి నుంచి వచ్చిన పువ్వులను అల్లి కూతురికీ మనవరాలికీ పెట్టి చూసుకుని ఆనందించేది. తను మాత్రం ఎప్పుడూ పెట్టుకోలేదు.

అవునూ, తనెందుకు పూలు పెట్టుకోవడం లేదు... ఆలోచిస్తూ సిమెంటు బెంచీ మీద అలాగే వెనక్కివాలి కళ్ళు మూసుకుంది సావిత్రి. ముడివడిన ఆమె జుట్టు వీపుమీద పరచుకుని చెంపల మీదుగా ముఖాన్ని తాకుతోంది. చెట్టుమీద నుంచి రాలిన పువ్వు ఒకటి ఆమె గుండెలమీద నుంచి ఒడిలోకి చేరి ప్రేమగా స్పృశించింది. అనునిత్యం ఆ మొక్కల మధ్యనే తిరుగుతూ పువ్వులతో మాట్లాడుతూ, ఆకులతో చెలిమి చేస్తూ, గతం చేసిన గాయాలను కన్నీటితో కడిగేసుకుంటూ జ్ఞాపకాల సవ్వడిని నిశ్శబ్దంగా ఆస్వాదించే సావిత్రికి- ఆ తోటలో ఎంతసేపు ఉన్నా విసుగన్నదే ఉండదు, పక్కన ఎవరూ లేకపోయినా తాను ఒంటరినన్న భావనే కలగదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.