close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘రేసుగుర్రం’ రాత మార్చింది

‘రేసుగుర్రం’ రాత మార్చింది

ఒక్క మంచి అవకాశం చాలు సినీపరిశ్రమలో జీవితం మారిపోవడానికి. కానీ ఆ ఒక్క అవకాశం కోసం ఎన్ని అవమానాలు భరించాలో, ఎలాంటి పరిస్థితుల్ని అధిగమించాలో, ఎంత జీవితం కోల్పోవాలో బయటివాళ్లు వూహించలేరు. వరికుప్పల యాదగిరి... ‘రేసుగుర్రం’లో ‘సినిమా చూపిస్త మామా’ పాట రాయకముందు పద్నాలుగేళ్లపాటు అలాంటి అనుభవాల్నే దాటొచ్చాడు. ఇప్పుడు ఆ పాట వేసిన కొత్త బాటలో నడుస్తూ ‘పవర్‌’, ‘డిక్టేటర్‌’, ‘కరెంట్‌ తీగ’, ‘దొంగాట’, ‘కిక్‌ 2’, తాజాగా ‘ధృవ’ లాంటి సినిమాల్లో పాటలు రాస్తూ, పాడుతూ దూసుకెళ్తున్నాడు. కష్టం బరువెంతో, కన్నీళ్ల లోతెంతో, విజయం విలువెంతో తెలుసుకోవాలనుకునే వాళ్లు ఓసారి యాదగిరి ప్రస్థానాన్ని గమనిస్తే చాలు...

క్కడో నిజామాబాద్‌ జిల్లాలో సాటాపూర్‌ అనే పల్లెటూళ్లొ పశువులు కాస్తూ పెరిగిన నేను, ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, రవితేజ లాంటి వాళ్ల సినిమాలకు పాటలు రాస్తున్నానంటే చాలామందికి ఆశ్చర్యమేస్తుంది. ఒకటా రెండా, దాదాపు పదహారేళ్ల కష్టానికి ఫలితమిది. వూహ తెలిసినప్పుడే మొదలైన ప్రయాణమిది. నేను పుట్టినప్పుడు మా ప్రాంతంలో కరువొచ్చిందట. దాంతో ఇంట్లో ఉన్న పశువులూ, బంగారం అమ్మేసుకున్నారట. అందుకే ఇంటిని చెడగొట్టడానికే పుట్టానని మా నాన్న తిడుతుండేవారు. నేను పుట్టిన 21రోజులకే అమ్మ అక్కల్ని తీసుకొని కూలి పనులకు వెళ్లేది. దాంతో పాలకు కూడా ఇబ్బందై రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాని ఫలితాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మా ఇంట్లో వాళ్లకు రోజూ రామాలయంలో భజనలు పాడటం అలవాటు. నాన్న చేయిపట్టుకొని నేనూ భజనలకు వెళ్లి వచ్చీరానీ మాటలతో పాడటానికి ప్రయత్నించేవాణ్ణి.

రెండోసారి దివాలా
నేను ఐదో తరగతిలో ఉండగా మా అన్నయ్యకి పెళ్లి కుదిరింది. దానికోసం కొంతడబ్బుని ఇంట్లో పెట్టెలో పెట్టారు. ఓ రాత్రి కిరోసిన్‌ దీపాన్ని ఆ పెట్టె మీద ఉంచి పడుకున్నారు. కిరోసిన్‌ కారుతున్న విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో మంట అంటుకొని మొత్తం పెట్టె కాలిపోయింది. లోపలున్న డబ్బు బూడిదైంది. రెండోసారి మేం దివాలా తీసిన పరిస్థితి. దాంతో నన్ను బడి మాన్పించేసి ఓ పశువుల కొట్టంలో పనిలో పెట్టారు. ఏడాది తరవాత మా అన్నయ్య తీసుకెళ్లి ఓ కాంట్రాక్టర్‌ దగ్గర పనిలో కుదిర్చాడు. ఆ సమయంలో తోటి పిల్లలంతా స్కూలుకెళ్లడం చూసి నాకు ఏడుపొచ్చేది. ఇంటికెళ్లి నన్ను స్కూల్లో చేర్పించమని అడిగితే నాన్న తిట్టారు. కానీ నేను మాత్రం బడికెళ్తాననీ, చదివించకపోతే చచ్చిపోతాననీ చెప్పా. మూడ్రోజులు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. దాంతో అమ్మకు భయమేసి నాన్నతో గొడవపడి మళ్లీ నన్ను స్కూల్లో చేర్పించింది.

కృష్ణగారికి పాడాలని...
ఒక్కో తరగతి దాటుకుంటూ ఇంటర్‌ పూర్తిచేశా. డిగ్రీ చదివించే స్తోమత ఇంట్లో లేదు. నాకు తెలిసిన ఒకే ఒక పని బాగా పాడటం. స్నేహితులంతా నా గొంతు బావుంటుందనీ సినిమాల్లో ప్రయత్నించమనీ అనేవాళ్లు. ఆ ఆత్మవిశ్వాసంతో ఇంట్లో వాళ్లకు పాటల పోటీకి వెళ్తున్నానని అబద్దం చెప్పి స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌ బయల్దేరా. అప్పట్లో కృష్ణగారికీ, బాలూగారికీ ఏవో విభేదాలు వచ్చాయన్న పుకారు విని, ఆయన్ని కలిస్తే నాతో పాడిస్తారన్న అమాయకత్వంతో నేరుగా ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్లా. తీరా ఆయన బయటికొచ్చే సమయానికి ఓ వందమంది మాకంటే ముందు ఆయన దగ్గరికి పరుగెత్తారు. ఇంక అక్కడ పనికాదని అర్థమై నిరాశతో కాస్త ముందుకెళ్లా. అక్కడ ఓ ఇంట్లో ‘లేడీబాస్‌’ షూటింగ్‌ జరుగుతోంది. లోపల్నుంచి బయటికొచ్చిన ఓ పెద్దాయనకి నా గురించి చెప్పా. ఓ పాట విని బావుందనిపించి కూర్చోబెట్టారు. కానీ దర్శకుడు ఎంతకీ రాకపోవడంతో, నాకో అడ్రస్‌ ఇచ్చి మరుసటి రోజు అక్కడికి వెళ్లి రాజమౌళి అనే వ్యక్తిని కలవమని చెప్పి పంపించారు.

నాలుగురోజులు బస్టాండ్‌లో...
రాజమౌళి అనే ఆయన వృత్తిరీత్యా డాక్టర్‌ అయినా, ప్రైవేటు ఆల్బమ్స్‌ చేస్తుంటాడు. ఆయన దగ్గరికెళ్తే కొన్ని పాటలిచ్చి ట్యూన్‌ చేయమన్నాడు. నేను చేసినవేవీ ఆయనకు నచ్చలేదు. ఇక విసుగొచ్చేసి చెప్పాపెట్టకుండా మా వూరొచ్చేశా. ఓ నెలరోజుల తరవాత ‘నా పాటలు తీసుకెళ్లిపోయావు, కేసు పెడతా’ అని ఆయన ఉత్తరం రాయడంతో కంగారుపడి హైదరాబాద్‌ వచ్చి నేను బాణీలు కట్టలేనని చెప్పి ఆయన పాటలు ఇచ్చేశా. తిరిగొచ్చి స్కూళ్లూ, కాలేజీల్లో పాటల ప్రోగ్రామ్‌లు చేయడం మొదలుపెట్టా. అలా చాలా రోజులు కష్టపడి పదిహేను వందలు కూడబెట్టా. ఆ డబ్బులు తీసుకొని మళ్లీ ఇస్తానని చెప్పిన మా అన్నయ్య, తీరా హైదరాబాద్‌ వెళ్దామనుకున్న సమయానికి డబ్బులు ఖర్చయ్యాయని చేతులెత్తేశాడు. నేను ఏడ్చి గొడవ చేస్తే నూట యాభై రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని, కొన్ని అటుకులూ, పిండి వంటలూ బ్యాగులో వేసుకొని గాయకుడిని కావాలన్న ఆశతో హైదరాబాద్‌ బయల్దేరా. అక్కడ ఎవరిని కలవాలో తెలీక నాలుగు రోజుల పాటు బస్టాండ్‌లోనే ఉంటూ తెచ్చుకున్నవేవో తింటూ అక్కడే పడుకున్నా.

అవకాశాన్ని వెతుక్కుంటూ...
అంబర్‌పేట్‌లో తెలిసినవాళ్లెవరో ఉంటే, ఐదో రోజు బస్టాండు నుంచి అక్కడికి బయల్దేరా. ఆ వీధుల్లో తిరుగుతుంటే మా వూరినుంచి వచ్చిన ఓ కుర్రాడు తారసపడ్డాడు. నా కథంతా విని ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో రాత్రి ఉద్యోగాన్ని ఇప్పించాడు. అక్కడ పనిచేస్తూ త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి లాంటి వేదికల్లో వారాంతాల్లో జరిగే పాటల పోటీల్లో పాల్గొనేవాణ్ణి. వాటిని చూసి ఎవరైనా సినిమాల్లో అవకాశం ఇస్తారన్న ఆశ నాది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజులకు తెలిసిన వ్యక్తి సాయంతో ఓ ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఓ రోజు పేపర్‌ చూస్తుంటే దర్శకుడు సానా యాదిరెడ్డి కొత్తవాళ్లతో సినిమా ప్రారంభించినట్లు కనిపించింది. తరవాత ఓ రోజు ఎక్కడో ఆయన ఇంటి అడ్రస్‌ ఉన్న బోర్డు కనిపిస్తే వెతుక్కుంటూ వెళ్లా. ఆయన నా పాట విని మెచ్చుకుంటూ మరుసటి రోజు ఆఫీసుకి రమ్మన్నారు. అలా తొలిసారి నాలో సినిమా ఆశలు చిగురించాయి.

ఫిలింసిటీలో ఉద్యోగం
మరుసటి రోజు ఉదయం ఏడున్నరకి ఆఫీసుకి వెళ్తే సాయంత్రం నాలుగున్నరకి లోపలికి పిలిచారు. మొదట్నుంచీ నాకు సొంతంగా సాహిత్యం రాసుకొని, దానికి ట్యూన్‌ చేసుకొని పాడటం అలవాటు. అలా రాసుకున్న ఓ ఐదు పాటల్ని యాదిరెడ్డి, ఎల్బీశ్రీరాం లాంటి వాళ్లంతా కూర్చొని ఉంటే వినిపించా. వాళ్లందరికీ రెండు పాటలు బాగా నచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుంటామని చెప్పారు. అలా తొలిసారి వాళ్ల వల్లే నేను బాగా రాస్తానన్న విషయం నాకూ తెలిసింది. రెండు మూడు నెలల తరవాత ఆ పాటలు తీసుకున్నందుకు కొన్ని డబ్బులిచ్చారు. అలా ‘ప్రేమపల్లకి’ సినిమాతో గాయకుణ్ణి కాబోయి అనుకోకుండా రచయితగా మారా. ఆ సినిమాని ‘మయూరి’ సంస్థ పంపిణీ చేసింది. అందులోని పాటలు రామోజీరావుగారికి బాగా నచ్చాయట. దాంతో నన్ను ఫిలింసిటీలో వాళ్లు చేయబోయే ‘ఆడియో లైబ్రరీ’ ప్రాజెక్టు కోసం ఉద్యోగంలోకి తీసుకోమని చెప్పారు.

సీసాలూ, గ్లాసులతో సంగీతం
ఫిలింసిటీలో పనిచేసే సమయంలో యాదిరెడ్డిగారు మొదలుపెట్టిన ‘బ్యాచిలర్స్‌’ సినిమాలో రెండు పాటలు కంపోజ్‌ చేయడంతో పాటు వాటిని పాడే అవకాశమూ వచ్చింది. ఇంకోపక్క ఫిలింసిటీలో ఆడియో లైబ్రరీ ప్రాజెక్టు ఆలస్యమవుతుండటంతో వూరికే డబ్బులు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. దాంతో వాళ్లకు ఆ విషయమే చెప్పి రాజీనామా చేశాను. నేను చెప్పిన కారణం నచ్చి, బయట బతకడానికి ఇబ్బందైతే ఎప్పుడైనా ఉద్యోగంలో చేరొచ్చని భరోసా ఇచ్చారు. అలా బయటికొచ్చాక యాదిరెడ్డిగారే ‘సంపంగి’లో అన్ని పాటలూ రాసే అవకాశమిచ్చారు. అందులో పాడిన ‘అందమైన కుందనాల బొమ్మరా’ అనే పాట మంచి పేరు తెచ్చింది. కానీ తరవాత రాసిన ‘ప్రేమలో పావని కల్యాణ్‌’ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే ‘ఇష్టం’ సినిమాకు ఓ పాట రాసి ట్యూన్‌ చేయమని దర్శకుడు విక్రమ్‌ పిలిచారు. ఆ సినిమా నిర్మాత రామోజీరావుగారికి పాట నచ్చడంతో సినిమా కోసం ప్రత్యేకంగా ఏదైనా కంపోజ్‌ చేయమన్నారు. ఆయన ప్రోత్సాహంతో బల్లలూ, ప్లేట్లూ, గ్లాసులూ, సీసాల్లాంటి వాటి సాయంతో ప్రయోగాత్మకంగా ఓ పాట చేస్తే దాన్ని ఆడియోలో పెట్టించారు.

కుంగుబాటులో మూడేళ్లు...
సినిమాల్లో నేను రాసిన, ట్యూన్‌ చేసిన పాటలకు మంచి పేరే వస్తున్నా అవకాశాలు పెద్దగా రాలేదు. యాదిరెడ్డిగారి దగ్గర సంగీత దర్శకుడిగా ఓ సినిమా మొదలుపెడితే, అది మధ్యలోనే ఆగింది. తరవాత ‘అభిమాని’ అనే సినిమా పూర్తయినా విడుదల కాలేదు. అదే సమయంలో మా అమ్మ చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఓ రెండు మూడేళ్లు ఎవరైనా అడిగితే పాట రాసిస్తూ, ఆ డబ్బులని ఖర్చుపెట్టుకుంటూ గడిపేశా. చివరికి ఓ రోజు ఈవీవీ సత్యనారాయణగారు ఫోన్‌ చేసి నన్ను పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. ఆయన సినిమా ‘తొట్టిగ్యాంగ్‌’లో రెండు పాటలు రాయించారు. జీవితం అలా ఒడుదొడుకులతో సాగుతున్న సమయంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. పదికి పైగా సంబంధాలు చూసినా ఏవీ కుదర్లేదు. చివరికి ఓ సంబంధం నాకు నచ్చినా, అప్పుడే పెళ్లి వద్దనీ, పైచదువులు చదవాలనుందనీ ఆ అమ్మాయి చెప్పింది. నేను ఎన్ని రోజులైనా ఎదురుచూస్తానని చెప్పా. అలా నా భార్య రమాదేవి నా జీవితంలో అడుగుపెట్టింది. తరవాత నాతో పాటు ఆమెకీ కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు చిన్న సినిమాలకు సంగీతం చేసినా పరిస్థితి కుదుటపడలేదు. అప్పటికే ఓ పాప పుట్టింది. ఆపైన ఓ తమిళ సినిమాకు సంగీతం చేసే సమయంలో చిన్నపాప డెలివరీ కోసం మా ఆవిడ హాస్పిటల్‌లో చేరింది. నా చేతిలో యాభై రూపాయలున్నాయి. తెలిసిన వాళ్లకీ, తెలియని వాళ్లకీ కలిపి దాదాపు నాలుగు వందలమందికి ఫోన్లు చేస్తే అరవై వేల రూపాయల అప్పు పుట్టింది. అలా నా భార్య డిశ్చార్జ్‌ అయ్యాక వాళ్లని వూరికి పంపించేశా. ఇక చిన్న సినిమాలు చేస్తే లాభం లేదనీ పెద్ద అవకాశాల కోసం ప్రయత్నిద్దామనీ దర్శకులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టా. కొంతమంది ఫోనెత్తలేదు. కొందరు తిట్టి పెట్టేశారు. చివరికి సురేందర్‌ రెడ్డి ఆఫీసుకి పిలిపించారు. నా పనితీరు తెలుసుకోవడానికి ఓ రెండు మూడు సినిమాలకు తనతో కలిసుండమన్నారు.

సినిమాల్ని వదిలేద్దామని...
‘రేసుగుర్రం’కి థమన్‌ పేరు ప్రకటించినప్పుడు ఇంక నాకు అవకాశాలు రావని నిశ్చయించుకున్నా. దాంతో పరిశ్రమను వదిలేసి వూరెళ్లి వ్యవసాయం చేసుకుందామనుకున్నా. ఆ విషయమే యాదిరెడ్డిగారికి చెప్పడానికి వెళ్లినప్పుడు సురేందర్‌ రెడ్డి నుంచి ఫోనొచ్చింది. కొన్ని పాటలకు సాహిత్యం రాసి, ట్యూన్లు చేసి తీసుకురమన్నారు. నేను రాసిన నాలుగు పాటలూ నచ్చడంతో వాటిని బ్యాంకాక్‌లో సిట్టింగ్స్‌కి తీసుకెళ్తానని చెప్పారు. తిరిగొచ్చాక ఆ పాటల సంగతి మరచిపోయి, సినిమాలో ప్రకాష్‌రాజ్‌ని అల్లుఅర్జున్‌ ముప్పతిప్పలు పెట్టే సందర్భం చెప్పి పాట రాయమన్నారు. ఆ పాటతో చావో రేవో తేల్చుకోవాలనుకున్నా. ఒకట్రెండు రోజుల్లో రాసి వినిపిస్తే సురేందర్‌ రెడ్డి సూపర్‌ అన్నారు. అదే ‘సినిమా చూపిస్త మామా’ అంటూ తెలుగు వాళ్లని వూపేసిన పాట. యూట్యూబ్‌లో కోటీ తొంభై లక్షలమందికిపైగా వీక్షించిన ఒకేఒక్క తెలుగు పాట అదే. ఆ సినిమాకే రాసిన ‘స్వీటీ’, ‘రేసుగుర్రం’ టైటిల్‌ సాంగ్‌ కూడా యూట్యూబ్‌లో కోటిన్నరమందికి పైగా చూశారు. దాంతో నా కెరీర్‌ మళ్లీ కొత్తగా మొదలైంది.

‘రేసుగుర్రం’ తరవాత రవితేజ సినిమా ‘పవర్‌’, ‘డిక్టేటర్‌’, ‘కరెంటు తీగ’, ‘శౌర్య’, ‘చుట్టాలబ్బాయి’, ‘కృష్ణాష్టమి’, ‘కిక్‌2’ లాంటి సినిమాల్లో పాటలకు మంచి గుర్తింపొచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటించిన ‘ధృవ’లో రెండు పాటలు రాశా. పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘కాటమరాయుడు’తో పాటు రవితేజ సినిమాకూ పనిచేస్తున్నా. ఒకప్పుడు ఆఫీసులకు వెళ్తే కసిరి బయటకు పంపేవారు. నా పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందని కొందరు సూచించారు. ఆ ఛీత్కారాలకు బాధపడకుండా, మూఢ నమ్మకాలకు విలువివ్వకుండా ముందుకొచ్చా. ఆలస్యమైనా ప్రస్తుతం నా కెరీర్‌ అనుకున్నట్లే సాగుతోంది. అందుకే ఇన్నాళ్ల కష్టాల్ని మరచిపోయి ఇప్పుడొచ్చిన పేరుని కాపాడుకుంటూ భవిష్యత్తుని అందంగా మార్చుకోవడమే ప్రస్తుతం నా ముందున్న ఏకైక లక్ష్యం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.