close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
గాయత్రి

గాయత్రి
- కె.బి.కృష్ణ

మ్మాయి వచ్చే సమయమైంది. కాలేజీ నుంచి అలిసిపోయి ఆకలితో వస్తుంది. ‘ఇవాళ రవ్వ పులిహోర తినాలనుందమ్మా’ అని ఎప్పుడూ ఏమీ అడగని కూతురు అడగడంతో, మధ్యాహ్నం భోజనాలు కాగానే పులుసు చేసేసింది. కొంచెంసేపు నడుం వాల్చి మళ్ళీ లేచి రవ్వ ఉడకపెట్టి పులిహోర కలుపుతోంది. సమయం ఐదున్నర అయింది. వంటింట్లో అటూ ఇటూ తిరుగుతూ, వంగుతూ లేస్తూ, అటు తిరిగి ఇటు తిరిగి వంటచేసే స్త్రీలకు అంత బలమూ ఓపికా ఎలా వస్తాయో... ఎలాగైతేనేం పులిహోర అయిపోయింది. పులిహోర తింటే వేడి చేస్తుందని, దానిలో నంజుకోడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయలూ పచ్చిమిరపకాయలూ కొత్తిమీరా టొమాటో ముక్కలతో పెరుగూ కలిపి రైతా తయారుచేసింది. తరవాత నలుగురికీ సరిపడా తలా ఒక కప్పూ వచ్చేట్లుగా సేమ్యా, సగ్గుబియ్యం, పాలూ పంచదారలతో పాయసం చేసింది. చలవా చేస్తుంది, తియ్యగా మధురంగా నోట్లోంచి జారిపోతుంది అనుకుంటూ- చీరకొంగుతో ముఖం తుడుచుకుంటుందో లేదో కాలింగ్‌బెల్‌ మోగితే గబగబా వెళ్ళి తలుపు తీసింది. బైక్‌కి స్టాండ్‌ వేస్తూ భర్త భాస్కర్‌ కనిపించాడు.

‘‘ఏమిటీ... ఇవాళ శ్రీవారు త్వరగా వచ్చేశారు?’’ అంది భారతి చిరునవ్వుతో.

వాయిల్‌ చీరలో కుచ్చీళ్ళు పైకి దోపుకుని, జుట్టు చిందరవందరగా అయిపోయి, నుదుట చెమటతో బొట్టు ఒక పక్కకుపోయి, నీరసంగా కనిపిస్తున్న భార్యను నిశితంగా పరిశీలించాడు భాస్కర్‌.

‘‘మన ఇంట్లో పులిహోర పోపు సువాసన నోరూరిస్తూ మా ఆఫీసుకు వచ్చేసిందోయ్‌. అంతే... చేసే పని ఎక్కడిదక్కడ వదిలేసి ఆదరాబాదరగా వచ్చేశాను’’ అంటూ భారతి దగ్గరగా వచ్చేసి, ‘‘ఏమిటీ, చాలా అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నావ్‌. మధ్యాహ్నం పడుకున్నావా లేదా? పిల్లలు సాయంకాలం కాలేజీ నుండి రాగానే ఏదో ఒకటి పెట్టాలని అదే పనిగా వంటింట్లోనే డ్రిల్‌ చేస్తున్నావా?’’ అన్నాడు భాస్కర్‌.

ఆడవాళ్ళు కొంతమంది చదువుకున్నా ఇంట్లోనే ఉండిపోయి భర్తకూ పిల్లలకూ అన్నీ సవరిస్తూ ఉండిపోతారేమో... కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు ముఖ్యంగా భర్త తమను మెచ్చుకోవడంగానీ ఆదరణతో కూడిన మాటలుగానీ మాట్లాడితే వారు అంతవరకూ పడిన శ్రమ క్షణంలో మాయమైపోయి, సంతోషంతో పొంగిపోతారు. అదే జరిగింది భారతి విషయంలో.

‘‘మీరు ఆఫీసుకు వెళ్ళిరావడం, ఆఫీసులో బిజీగా పనులు చేసుకోవడం, పిల్లలిద్దరూ కాలేజీకి బస్సుల్లో వెళ్ళిరావడం - అలసిపోతారు గదా... సమయానికి మీకు ఏదో ఒకటి చేసిపెడితే నాకూ తృప్తిగా ఉంటుంది’’ అంది భారతి.

‘‘బ్యాంకు నుండి నా ఫ్రెండ్‌ ఫోన్‌ చేశాడు. గాయత్రి, గోపాల్‌ చదువులకు మనం బ్యాంకు లోన్‌ తీసుకున్నాం కదా. ‘చివరి సంవత్సరాలలో వాళ్ళకు క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్స్‌ వచ్చేస్తే నీకు కష్టాలు తీరిపోతాయి’ అంటూనే, ‘చాలా శ్రమపడుతున్నావ్‌, ఇద్దరి పిల్లల కోసమూనూ, అసలింతకీ బ్యాంకు లోన్‌ వాళ్ళు తీరుస్తారో లేక నువ్వే తీర్చుకోవాలో’ అన్నాడు. ‘నాకు ఏదయినా ఒకటేరా. పిల్లల చదువు నా బాధ్యత కదా!’ అన్నాను. మరేమవుతుందో...’’ అంటున్న భర్తను జాలిగా చూస్తూ-

‘‘మన పిల్లలు అలాంటివాళ్ళు కాదండీ, కొంచెమైనా అప్పు తీరుస్తారండీ’’ అంది భారతి.

‘‘భారతీ, మనిషి ఎప్పుడూ నీలాగా పాజిటివ్‌గా ఆలోచించాలి. కలలో కూడా నెగెటివ్‌ ఆలోచనలు రానీయకూడదు. అప్పుడే జీవితం సుఖంగా, సంతోషంగా సాగిపోతుంది. మన పిల్లల గురించి మనమే చెడుగా ఎందుకాలోచించాలి... చూద్దాం’’ అన్నాడు భాస్కర్‌.

భాస్కర్‌ ఫ్రెషప్‌ అయిపోయి, ముందుగా కాలేజీ నుండి వచ్చే గాయత్రి కోసం ఎదురుచూడసాగాడు.

‘‘పోనీ, మీరు ముందు టిఫిన్‌ తినేయకూడదూ... సేమ్యా, సగ్గుబియ్యం పాయసం కూడా చేశాను. మీకు పులిహోరలో రైతా ఇష్టం కదా, అది కూడా చేశాను’’ అంది భారతి.

‘‘మనిషి జీవితంలో ముందుగా తల్లిదండ్రులకు రుణగ్రస్తుడైపోతాడు. ఆ తరవాత భార్యకు రుణపడిపోతాడు. ఈ రుణాలు తీర్చలేనివి భారతీ. నేను నీకు వంటింట్లో సాయం చేయాలనుకుంటుంటాను... కానీ చేయలేకపోతున్నాను. పిల్లలు చదువులో హడావుడిగా ఉంటారు. ఇకనుండి సెలవు రోజుల్లో అయినా నీకు వంటింట్లో సహాయం చేస్తాను’’ అన్నాడు అనురాగంతో భార్యను చూస్తూ.

‘‘నాన్నగారూ...’’ అంటూ చకచకా వచ్చేసింది గాయత్రి. లేతాకు పచ్చరంగు టాప్‌కింద ముదురాకు పచ్చని బాటమ్‌ వేసుకుని, పైన పింక్‌ కలర్‌ చున్నీ కప్పుకుని, బంగారం రంగులో ఉండే గాయత్రిని చూడగానే రోజూ చూసే కూతురే అయినా ఇవాళే కొత్తగా చూస్తున్నట్లుగా చూస్తున్న తండ్రిని చూసి- ‘‘ఏమిటి నాన్నగారూ, అలా చూస్తున్నారు?’’ అంది నవ్వుతూ గాయత్రి.

‘‘నిన్ను చూడకుండా ఉండగలనా?- అని ఆలోచిస్తున్నాను తల్లీ. చదువు అయిపోయాక ఉద్యోగానికి వెళ్ళిపోతావుగా... ఆ తరవాత...’’ తండ్రి మాటలకు అడ్డువచ్చి-

‘‘స్టాప్‌ స్టాప్‌... ఆ తరవాత వద్దు’’ అంటూ లోపలకు వెళ్ళిపోయింది.

కొంచెంసేపట్లో ఫ్రెషప్‌ అయి వచ్చేసింది గాయత్రి. డైనింగ్‌టేబుల్‌ మీద తను చేసిన ఐటమ్స్‌ సర్దింది భారతి. ముగ్గురూ డైనింగ్‌టేబుల్‌ దగ్గర కూర్చున్నారు. ‘‘బాబీ కూడా వచ్చాక తిందామా?’’ అంది తల్లి.

‘‘వాడికి ఇవాళ ఆలస్యమవుతుందని చెప్పాడులే, మనం తినేద్దాం’’ అంది గాయత్రి.

‘‘భారతీ, నువ్వు కూడా కూర్చో’’ అని భాస్కర్‌ అంటే-

‘‘తన ముద్దుల కొడుకు లేకుండా అమ్మ తినదు నాన్నగారూ’’ అంటూ తల్లిని చిలిపిగా ప్రేమగా చూస్తూ, ‘‘అమ్మా, ఎంత బాగుందో తెలుసా? తింటుంటే కమ్మగా, హాయిగా, ఆనందంగా, అమ్మ అంత బావుందమ్మా’’ అంది గాయత్రి.

‘‘ఏరా గాయత్రీ, నువ్వు కూడా చదువు అయ్యేలోపు వంట బాగా నేర్చుకోవాలి. అమ్మలాగే వంట చేయాలి నువ్వు తెలిసిందా? పెళ్ళయ్యాక మన కుటుంబం పేరు నిలబెట్టాలి’’ అని తండ్రి అంటుంటే, అప్పటిదాకా ఎంతో చలాకీగా మాట్లాడిన గాయత్రి ముఖం చిన్నబోయింది.

‘‘నాన్నగారూ...’’ అంటూ ఆ విషయం ఇప్పుడు మాట్లాడొద్దన్నట్లుగా తన కుడి అరచేతిని చూపిస్తూ- ‘‘నాన్నగారూ, ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి, నా మనసులోని ఆలోచనలు మీ ఇద్దరిముందూ పెడతాను. దయచేసి నా మాటలను శ్రద్ధగా వినండి...

నాన్నగారూ, నేను ఇంజినీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్న నా స్నేహితుల్ని, నేను ఈ చదువు మొదలుపెట్టినప్పటి నుండీ గమనిస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకోవాలనీ, మంచిమంచి ఇంటర్నేషనల్‌ కంపెనీల్లో మాంచి జీతాలతో చివరి సంవత్సరంలోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో ఉద్యోగం సంపాదించాలనీ కష్టపడి చదువుతున్నారు. అందుకు తగ్గట్టే చాలామంది మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. అలాగే మల్టీనేషనల్‌ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా వచ్చేస్తున్నాయి. చదువు పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. అంతా బాగానే ఉంది.

మగపిల్లలయితే వారికి వచ్చే భారీ జీతంతో లగ్జరీ లైఫ్‌తో జీవితాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక ఆడపిల్లలయితే వారి తల్లిదండ్రులు ఇంజినీరింగ్‌ లేదా ఇతర కోర్సులు చదువుకునే కూతురి కోసం ఫైనల్‌ ఇయర్‌లోనే ‘ఆమెకు తగిన వరుడు ఎక్కడున్నాడా’ అని మాట్రిమోనియల్‌ సైట్లన్నీ వెతికి, ఆమెకు పెళ్ళి చేసేస్తున్నారు. తరవాత వారిద్దరూ సంపాదించుకుంటూ వారి సంసారాన్ని స్వర్గధామం చేసేసుకుంటున్నారు. ఇద్దరూ కలిసి మంచి ఏరియాలో పోష్‌ ఫ్లాటూ, దాని నిండా ఫర్నీచర్‌, కారూ వగైరాలు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలనే తాపత్రయంతో పోటీపడి బ్యాంకు లోన్స్‌ పెట్టేసి అన్నీ కొనేసుకుంటున్నారు.

అమ్మాయి పెళ్ళి చేసుకున్నాక భర్త ఆలోచనలకూ ఆశయాలకూ లోబడి సంసారంలో మునిగిపోతోంది. అలాగే అబ్బాయి కూడా తెలిసీ తెలియకుండానే అమ్మాయి మాటలు తూ.చ.తప్పకుండా వింటూ దాంపత్య జీవితంలో లీనమైపోతున్నాడు.

‘మరి ఇంకేం కావాలి... వాళ్ళు సుఖంగా ఉండటమే కదా కావాల్సింది? ఈ పాట్లు అన్నీ వాళ్ళకోసమే కదా’ అని వారి తల్లిదండ్రులు అనుకుంటున్నారు.

కానీ అమ్మా...

నాకు ఒక తీరని ఆవేదన ఉంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి జీవితాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రొఫెషనల్‌ కోర్సు చదివించాలంటే, ఐఐటీ ఓరియెంటెడ్‌ మెడికల్‌ ఎంసెట్‌ ఓరియెంటెడ్‌ స్కూళ్ళలో కాలేజీలలో ఎంతో ఖర్చుకు ఓర్చి చేర్పించి, ఎంసెట్‌ పరీక్ష రాసే సమయానికి, తమ తాహతు అనుమతించకపోయినా ఎవరి కాళ్ళొ పట్టుకుని లేదా బ్యాంకు లోన్స్‌ తీసుకుని చదివిస్తున్నారు. మరి చదువు పూర్తి అయ్యాక పిల్లలు వాళ్ళదారి వాళ్ళు చూసుకుంటే అమ్మానాన్నల సంగతేమిటి?

‘నాన్న ఆర్థికంగా ఎంత చితికిపోయాడు... ఎప్పటికి తేరుకుంటాడు? అమ్మ ఇన్ని రోజులూ తెల్లవారుజామున లేచి కాలేజీకి పంపడానికి ఎంత శ్రమించింది... తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తమకోసం ఎంత కష్టపడింది...’ అని చదువుకునేటప్పుడుగానీ, చదువు పూర్తి అయ్యాకగానీ, పెళ్ళి చేసుకునేటప్పుడుగానీ, పెళ్ళి తరవాత సిరిసంపదలు సమకూర్చుకునేటప్పుడుగానీ... వెనక్కు తిరిగి ఒక్క క్షణం ఆలోచిస్తున్నారా... లేదమ్మా.

పైగా ‘మా ఫ్రెండ్స్‌ తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఐఐటీలో చదివించారు, నేనేమో ఎంసెట్‌ ర్యాంకుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని కొడుకూ... నేను ఆర్డినరీ మెడికల్‌ కాలేజీలోనే చదువుతున్నాను, మా ఫ్రెండ్స్‌ పేరెంట్స్‌ బోల్డు డబ్బు ఖర్చుపెట్టి సూపర్‌ స్పెషాలిటీ కాలేజ్‌ కమ్‌ హాస్పిటల్స్‌లో చదివిస్తున్నారని కూతురూ... తల్లిదండ్రులను ఒకటే దెప్పుతుంటారు. ఇది ఇంకా అన్యాయం.

అమ్మా నాన్నా... నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. నేను- నా ఆశయాలూ ఆలోచనలూ నెరవేరేవరకూ లైఫ్‌ సెటిల్‌మెంట్‌ జోలికి వెళ్ళదలచుకోలేదు.

అమ్మా, మా చదువుల కోసం మాయమైన నీ బంగారు నగలూ, మనింట్లో వెండి సామాన్లూ అన్నీ నా సంపాదనతో మళ్ళీ కొనాలి. నువ్వు మంచి చీరలు కట్టుకోవాలి. నాన్నగారూ మీరు ఆ డొక్కు బైకు వాడటం మానేయాలి. నేను మంచి బైకు కొనిపెడతాను. మీరు మంచి డ్రెస్‌ వేసుకోవాలి. జేబులో మంచి ఖరీదైన సెల్‌ఫోన్‌ ఉండాలి. ఓనర్స్‌తో గొడవలు వచ్చినప్పుడల్లా అద్దె ఇల్లు మారుకుంటూ ఇన్నాళ్ళూ మనంపడిన బాధలు ఇక వద్దు. నేను మనకు సరిపడా మూడు బెడ్‌రూమ్‌ల డూప్లెక్స్‌ ఫ్లాట్‌ కొంటాను. నాన్నగారూ, మీరు నా చదువూ తమ్ముడి చదువు గురించి పడిన శ్రమా, అనుభవించిన మానసిక ఆవేదనా ఇక చాలు. మన కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలి. తమ్ముడి చదువు కూడా అయిపోవస్తోంది కదా... వాడికి కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ తప్పక వస్తుంది. వాడి ఆలోచనలు కూడా ఇవే - నాకు చెప్పాడు. మేమిద్దరం కలిసి మిమ్మల్నిద్దరినీ సుఖపెట్టాలి. ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి నన్ను’’ అంటూ ఆవేశంగా మాట్లాడుతున్న కూతుర్ని ‘దీనికి జీవితం మీద ఇంత అవగాహన ఎలా వచ్చిందా?’ అని ఆశ్చర్యంతో చూస్తున్న భారతి-

‘‘అదేమిటే, అప్పటికి నువ్వు ముసలిదానివైపోతావు కదే! అప్పుడు నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారు?’’ అంది చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ.

‘‘అమ్మా, నా వయసు ఇప్పుడు ఇరవైరెండు, తమ్ముడి చదువు రెండేళ్ళలో పూర్తయిపోతుంది. వాడి చదువు అయ్యేలోపు నేను బ్యాంకు లోన్స్‌ క్లియర్‌ చేయడానికి ట్రై చేస్తాను. వాడు ఉద్యోగంలో చేరాక ఓ ప్రణాళిక ప్రకారం మా ఆలోచనలకు రూపమిస్తాం. ఆ తరవాత ఇద్దరం మా భావాలతో ఏకీభవించేవారిని ఎంచుకుని పెళ్ళిచేసుకుంటాం. ఈ దేశంలోని కోట్లాదిమంది యువతీ యువకులలో మాకోసం ఒక అబ్బాయీ, అమ్మాయీ ఉండకపోతారా? దాని గురించి ఇప్పుడు ఆలోచనవద్దమ్మా’’ అంది గాయత్రి.

అంతవరకూ తన ముద్దుల కూతురు గాయత్రి మాట్లాడే మాటల్ని వింటూ విస్ఫారిత నేత్రాలతో మెచ్చుకోలుగా ఆమెవైపు చూస్తున్న తండ్రి కళ్ళు చెమ్మగిల్లాయి. ‘మానవ సంబంధాలు కనుమరుగై ధనబంధాలుగా రూపాంతరం చెందుతున్న నేటి మాయాప్రపంచంలో నాకు ఇంత చక్కని కూతుర్నీ కొడుకునీ ప్రసాదించావా సర్వేశ్వరా?! నీముందు సాష్టాంగపడి కన్నీటితో అభిషేకించినా నీ రుణం తీరదు తండ్రీ’ అనుకుంటూ హాల్లో ఉన్న నిలువెత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి అలివేలుమంగల వర్ణచిత్రాన్ని భక్తిభావంతో చూస్తున్నాడు. భాస్కర్‌ సజలనయనాలకు స్వామి అభయహస్తం కొద్దిగా కదిలినట్లుగా అనిపించి గుండె ఝల్లుమంది.

‘‘అమ్మా గాయత్రీ, అంతా బాగానే ఉంది. మరి ఒకవేళ మీ భావాలూ ఆలోచనలతో ఏకీభవించేవారు దొరకకపోతే ఏం చేస్తారమ్మా?’’ అని అడిగాడు చిరునవ్వుతో కూతుర్ని చూస్తూ.‘‘దొరికినప్పుడే చేసుకుంటాం నాన్నగారూ. మనిషికి పెళ్ళి అనేది జరగకపోతే బతకలేమా? పిచ్చి నాన్నగారూ, ఆ విషయంలో దిగులు వద్దు. ఉద్యోగం చేసే అమ్మాయికీ డబ్బు సంపాదించే అబ్బాయికీ పెళ్ళికాకపోవడం- వైవాహిక సమాజపు డిక్షనరీలో లేనేలేదు’’ అంది.

‘‘ఆ డిక్షనరీ ఎవరు రాసేరే తల్లీ’’ అన్నాడుభాస్కర్‌ నవ్వుతూ.

‘‘నాలాంటి పిచ్చోళ్ళు కొంతమంది ఈమధ్యనే రాశారులెండి’’ అంది గాయత్రి తండ్రివైపు కొంటెగా చూస్తూ.

‘‘నా బంగారు తల్లీ... నువ్వు నా అమ్మవే- నా కడుపున పుట్టావు కదే’’ అంటూ ఆప్యాయతానురాగాలు నిండిన తడి కళ్ళతో గాయత్రి దగ్గరగా వెళ్ళి ఆమెను, భాస్కర్‌ దగ్గరగా పొదువుకుంటూంటే, తల్లి కూడా చకచకా దగ్గరకు వెళ్ళింది. ముగ్గురూ ఒకటైపోయారు.ఇంతలో ‘‘నేనూ ఉన్నాను’’ అంటూ అప్పుడే హాల్లోకి వచ్చిన కొడుకు బాబీ వారితో కలిశాడు. ఆ ముచ్చటైన దృశ్యం చూసి గోడమీద పటంలోని దైవం సంబరపడిపోతున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.