close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
1938లోనే రూ.10వేల నోటు!

1938లోనే రూ.10వేల నోటు!

  దేశంలో ఇప్పుడు ప్రధానమైన చర్చ దేని గురించి... ఇది అడగక్కర్లేని ప్రశ్న. ఎందుకంటే ‘డబ్బు గురించే’ అని చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు కాబట్టి. మరి, అందరినీ ఇంతగా వూపేస్తున్న ఆ రూపాయికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలకూ ఆ చర్చల్లో చోటిస్తే బాగుంటుంది కదా...

ప్రపంచంలో నాణాలను ఉపయోగించింది మొదట భారతీయులూ చైనీయులే. రూప్యా అంటే సంస్కృతంలో వెండి నాణెం అని అర్థం. రూపాయి పదం అక్కణ్నుంచే వచ్చింది.
* కాగితపు నోట్లు అనేస్తాం కానీ నిజానికి డబ్బు నోట్లను కాగితంతో తయారు చెయ్యరు. పత్తి ఉత్పత్తులతో చేస్తారు. అందుకే, నోట్లు త్వరగా చిరగవు.

* కాగితపు కరెన్సీ వాడకం ప్రారంభమైంది 18వ శతాబ్దంలో. మనదేశంలో మొదట నోట్లను ముద్రించింది ప్రైవేటు బ్యాంకులే. బ్యాంక్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బాంబే, బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌ లాంటి బ్యాంకులు మొదట కాగితపు కరెన్సీని ముద్రించాయి.

* భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయాక ఆ దేశం సొంతంగా కరెన్సీని ముద్రించుకునే వరకూ ఆర్‌బీఐ ముద్రించిన నోట్లమీదే ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌’ అని ముద్రించి అక్కడ చలామణి చేసేవారు.

* 20వ శతాబ్దం ప్రారంభంలో అడెన్‌, ఒమన్‌, కువైట్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, ట్రుషియల్‌ స్టేట్స్‌, కెన్యా, ఉగాండా, మారిషస్‌ దేశాలు కూడా మన రూపాయినే కరెన్సీగా వాడేవి.

* అమెరికన్‌ డాలర్‌ అంటే ఇప్పుడు ఎంతో గొప్పగా చూస్తాం. కానీ స్వతంత్రం వచ్చేనాటికి రూపాయి, డాలర్‌ విలువ ఇంచుమించు సమానం.

* బ్రిటిష్‌ ఇండియా నోట్లలో మొదటిగా వచ్చిన ‘విక్టోరియా పోర్ట్రెయిట్‌ సిరీస్‌’ నోట్లను ముద్రించి, భద్రత కోసం రెండు ముక్కలుగా మధ్యలోకి కత్తిరించి, రెండు సెట్‌లుగా చేసేవారు. చింపినవాటిలో మొదటిసెట్‌ పార్శిల్‌ను బ్యాంకులకు పంపి, అది అందిందనే సమాచారం తెలిశాకే రెండో సెట్‌ని పంపించేవారట. తరవాత వాటిని మళ్లీ అంటించేవారు.

ఆర్‌బీఐ చరిత్రలో ఎక్కువ విలువ గల నోటు రూ.పదివేలదే. 1938, 1946ల మధ్య ఇవి చలామణిలో ఉండేవి.మళ్లీ 1954లో రూ.1000, రూ.5000, రూ.10,000 నోట్లను ప్రవేశపెట్టారు. వీటిని 1978లో నిషేధించారు.

* ఆర్‌బీఐ చట్టాల ప్రకారం రిజర్వ్‌బ్యాంక్‌ 10,000 నోటుకి మించి ముద్రించడానికి వీల్లేదు. అంతకు తక్కువలో ఏ సంఖ్యతో అయినా నోట్లను విడుదల చెయ్యొచ్చు. నాణాల విషయానికొస్తే రూ. వెయ్యి విలువ వరకూ ఏ సంఖ్యతో అయినా ముద్రించే వీలుంది.

* పది రూపాయల నాణెం తయారు చెయ్యడానికి రూ.6.10 ఖర్చు అవుతుంది.

* మనదగ్గరుండే నాణాలను దేశంలోని నాలుగుచోట్ల ముద్రిస్తారు. నాణెంమీద డైమండ్‌ ఆకారపు గుర్తు ఉంటే ముంబైలోనూ నక్షత్రాకారపు ముద్ర ఉంటే హైదరాబాద్‌లోనూ చుక్క ఉంటే నొయిడాలోనూ అసలే గుర్తూ లేకపోతే కోల్‌కతాలోనూ వాటిని ముద్రించినట్లు తెలుసుకోవచ్చు.

* నోట్లమీద ఎడమచేతివైపు కొన్ని గుర్తులుంటాయి. రూ.100 అయితే త్రిభుజాకారం, రూ.50 మీద చతురస్రం, 20 అయితే, నిలువు దీర్ఘ చతురస్రాకారపు గుర్తులు కనిపిస్తాయి. పది నోటుపైన ఎలాంటి చిహ్నమూ ఉండదు. కొత్తగా వచ్చిన నోట్లకు 2000 నోటుకు దీర్ఘచతురస్రాకారం, 500 నోటుమీద వృత్తాకారం కుడిచేతివైపున ఉంటాయి. అంధులు తడిమి చూడగానే నోటు విలువ తెలిసేలా వీటిని ఉబ్బెత్తుగా ముద్రిస్తారు.

భారత ప్రభుత్వపు నోట్లను ముద్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1935లో ప్రారంభమైంది. ఆర్‌బీఐ విడుదల చేసిన మొదటి కాగితపు నోటు రూ.5. దానిమీద జార్జ్‌-VIముఖచిత్రం ఉండేది.
* కరెన్సీ నోట్లు రెండు ముక్కలుగా చిరిగిపోయినా వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చు.

* 2007 సంవత్సరంలో కోల్‌కతాలో నాణాల కొరత విపరీతంగా ఉండేది. దాంతో దుకాణదారులు భిక్షగాళ్ల దగ్గర వాటి విలువకన్నా ఎక్కువ చెల్లించి నాణాలను తీసుకునేవారు. పశ్చిమ బెంగాల్‌ సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌కి నాణాలను అక్రమరవాణా చెయ్యడమే ఈ కొరతకు కారణం. వాటితో అక్కడ బ్లేడుల్ని తయారు చేసేవారు. ఒక రూపాయి నాణాన్ని కరిగిస్తే రూ.35 విలువైన ఏడు నాణ్యమైన బ్లేడులు తయారయ్యేవి.

* నోట్లన్నిటినీ ఆర్‌బీఐనే విడుదల చేస్తే, ఒక రూపాయి నోట్లను మాత్రం భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందుకే, దీనిమీద ఫైనాన్స్‌ సెక్రెటరీ సంతకం ఉంటుంది.

స్వతంత్రం వచ్చాక భారత్‌ మొట్టమొదట ముద్రించిన నోటు ఒక రుపాయి. 1950లో నాణాల ముద్రణను ప్రారంభించింది.
* 1994లో రూపాయి నోట్ల ముద్రణను ఆపేశారు. 20 ఏళ్ల తర్వాత వీటిని మళ్లీ ముద్రించారు.

* 1947లో రూపాయికి 64 పైసలే. 1957 నుంచి దాన్ని వంద పైసలుగా విభజించారు.

* ఆర్‌బీఐ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గౌరవ సూచికంగా రూ.75 నాణాన్నీ రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 150వ జయంతి సందర్భంగా రూ.150 నాణాన్నీ తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని నిర్మించి వెయ్యేళ్లు పూర్తైనందుకు గౌరవ సూచికంగా వెయ్యి రూపాయల నాణాన్నీ ముద్రించారు.

మనోళ్లు అమెరికన్లకూ నచ్చారు!

ఈ మధ్య కాలంలో ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది అమెరికా ఎన్నికలే. అందులో ఎవరూ వూహించని విధంగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా విజయం సాధించడం ఓ సంచలనమైతే, తొలిసారి రికార్డు స్థాయిలో ఐదుగురు భారత సంతతి వ్యక్తులు అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికవడం మరో విశేషం. ప్రవాసులుగా మొదలైన వాళ్ల ప్రస్థానం చట్టసభల దాకా రావడం, భారతీయులంతా గర్వించదగ్గ విషయమే.
‘నేను చూసిన అటార్నీ జనరల్స్‌లో చాలా కఠినమైన, శక్తిమంతమైన మహిళ ఆమే’... ఇటీవల అమెరికాలో సెనెటర్‌గా ఎన్నికైన కమలా హ్యారిస్‌ గురించి ఆ దేశ అధ్యక్షుడు ఒబామా అన్న మాటలివి. రెండు సార్లు కాలిఫోర్నియా రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా అక్కడి చట్టాలు సవ్యంగా అమలయ్యేలా చూసే కీలక బాధ్యతలు నిర్వర్తించిన కమల న్యాయవాదిగా స్థానికంగా మంచి పేరు సంపాదించారు. కమల తల్లి శ్యామల స్వస్థలం చెన్నై. క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ అయిన ఆమె చదువుకునే రోజుల్లో అమెరికాకు వచ్చి అక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన కమల 1990లో తొలిసారి డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. తరవాత శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికల్లో విజయం సాధించారు. అటార్నీ జనరల్‌గా వ్యక్తిగత ఆయుధాలూ, మరణ శిక్ష, అబార్షన్‌, ఆర్థిక నేరాలూ లాంటి అంశాలకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులకు పునాదులు వేశారు. ఆ చర్యలే ఆమెకు స్థానికంగా మంచి పేరు తీసుకొచ్చి ఈ ఏడాది తొలి భారత సంతతి మహిళా సెనెటర్‌గా గెలిపించాయి.

పోరాటానికే ఓటు
అమెరికా చట్టసభలకు ‘వాషింగ్టన్‌ సెవన్త్‌ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌’ ప్రతినిధిగా ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన ప్రమీలా జయపాల్‌ పుట్టింది చెన్నైలో. పదహారేళ్ల వయసులో అమెరికా వచ్చి ఎంబీఏ పూర్తిచేసిన ఆమె అక్కడే పైనాన్షియల్‌ ఎనలిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పైన జరిగిన ఉగ్రదాడి అనంతరం ప్రవాసులపైన దాడులు ఎక్కువవడంతో వాళ్ల హక్కుల కోసం పోరాడేందుకు ‘హేట్‌ ఫ్రీ జోన్‌’ అనే సంస్థను నెలకొల్పారు. దానికిగానూ వైట్‌హౌస్‌ నుంచి ‘ఛాంపియన్‌ ఆఫ్‌ చేంజ్‌’ పురస్కారాన్నీ అందుకున్నారు. అలా పద్నాలుగేళ్లుగా ఆమె సాగిస్తున్న ఉద్యమాలే ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యేలా చేశాయి.

ప్రచారంలో రాజా
రాజా కృష్ణమూర్తి... అతడికి ‘రాజా ఆఫ్‌ కాంగ్రెస్‌’ అన్న పేరూ ఉంది. ఎన్నికల ప్రచారంపైన ఆయనకున్న పట్టే దానికి కారణం. 2000 సంవత్సరంలో అమెరికా చట్టసభలకు ఒబామా పోటీ చేసినప్పుడు అతడి ప్రచారం కోసం పనిచేసిన రాజా, 2004లోనూ ఒబామాకి సహాయకుడిగా ప్రసంగాలు రాసిచ్చారు. ఆ క్రమంలోనే ఓ పక్క ‘శివనందన్‌ ల్యాబొరేటరీస్‌’, ‘ఎపీసోలార్‌’ అనే వ్యాపార సంస్థల్ని నడిపిస్తూనే ఎన్నికలపైనా దృష్టిపెట్టారు. నాలుగేళ్ల క్రితం ‘ఇలినాయిస్‌ ఎయిత్‌ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌’ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన రాజా, ఈసారీ అక్కడి నుంచే పోటీ చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. వూహ తెలీని వయసులో దిల్లీ నుంచి అమెరికాకు వెళ్లిన రాజా, హార్వర్డ్‌ లా స్కూల్‌ నుంచి న్యాయ విద్యను అభ్యసించారు.

ఒబామా ఎంపిక
రచయితగా, న్యాయవాదిగా, ప్రొఫెసర్‌గా మంచి పేరున్న రోహిత్‌ ఖన్నా, కాలిఫోర్నియా వాసులకు ‘రో ఖన్నా’గానే తెలుసు. రోహిత్‌ తాతయ్య అమర్‌నాథ్‌ విద్యాలంకర్‌ భారత్‌లో మూడు దఫాలు ఎంపీగా పనిచేశారు. రోహిత్‌ పుట్టకముందే తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. యేల్‌ లా స్కూల్‌ నుంచి న్యాయవిద్యలో పట్టా అందుకున్న రోహిత్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌ పాఠాలు బోధిస్తున్నారు. రోహిత్‌ సామర్థ్యంపైన నమ్మకంతో ఏడేళ్ల క్రితం స్వయంగా ఒబామానే అతడిని అమెరికా వాణిజ్య శాఖకు అసిస్టెంట్‌ డిప్యూటీ సెక్రెటరీగా నియమించారు. ఆపైన వైట్‌ హౌస్‌ బిజినెస్‌ కౌన్సిల్‌లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 2014లో ‘యూఎస్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌’కి పోటీ చేసి తృటిలో ఓటమిపాలైనా, ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు రోహిత్‌.

ముచ్చటగా మూడోసారి
వరసగా మూడోసారి అమెరికన్‌ కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి అమెరిష్‌ బాబూలాల్‌ బెరా అలియాస్‌ అమి బెరా. వృత్తిరీత్యా వైద్యుడైన అమి, శాక్రమెంటో కౌంటీకి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. 2010లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన 2013 నుంచి వరసగా ‘కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్‌ 7’ ప్రతినిధిగా ఎన్నికవుతూ వస్తున్నారు. అమి స్వస్థలం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌.

కమలా హ్యారిస్‌, రాజా కృష్ణమూర్తి, అమి బెరా తరఫున స్వయంగా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రచారం చేస్తే, ప్రమీలా జయపాల్‌ తరఫున మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ ప్రచారం చేశారు. కమలా హ్యారిస్‌కు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలయ్యే అవకాశాలూ, శక్తి సామర్థ్యాలూ ఉన్నాయంటూ అక్కడి మీడియా పేర్కొంటోంది. ఒకవేళ అన్నీ కలిసొస్తే ‘‘అత్యంత శక్తిమంతమైన దేశానికి భారతీయ మహిళే అధ్యక్షురాలు’’ అన్న వార్తనూ భవిష్యత్తులో చూస్తామేమో..!

ప్రభుత్వ బడికి సహకార ఔషధం!

  విత్తునుబట్టే చెట్టు. చదువులూ అంతే! పాఠశాల దశలో గాడిలో పడితేనే పిల్లల చదువులు మెరుగవుతాయి. వారి చదువులు బావుంటేనే కుటుంబం, సమాజాల అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే, సర్కారు బడుల్లో ప్రమాణాలు పెంచేందుకు కృషిచేస్తోంది ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ‘డాక్టర్‌ రెడ్డీస్‌’.
విద్య, వైద్యం... ఈ రెండు విభాగాల్లో ఎంత అభివృద్ధి సాధిస్తే, ప్రజల జీవన ప్రమాణాలు అంత మెరుగుపడ్డట్టు. ఔషధ తయారీ సంస్థగా ‘డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌’ వైద్య రంగంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తోంది. తమ సామాజిక బాధ్యతలో భాగంగా 2012 నుంచి విద్యారంగ అభివృద్ధికీ కృషిచేస్తోందీ సంస్థ. అలా మొదలుపెట్టిందే ‘పాఠశాల అభివృద్ధి పథకం(స్కూల్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌-సిప్‌)’. దీనిద్వారా సంస్థకు సంబంధించిన ఔషధ తయారీ పరిశ్రమలున్నచోట ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి చేయూతనిస్తోంది. తెలంగాణాలో మేడ్చల్‌, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మొత్తం 59 జిల్లా పరిషత్‌ హైస్కూళ్లని ‘సిప్‌’లో భాగంగా అభివృద్ధి బాట పట్టిస్తోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 25వేలు.