close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ దూకుడు... సాటెవ్వడు!

దిల్లీలో భారత జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న రోజది. అప్పుడు విరాట్‌ వయసు పదేళ్లు. బౌండరీ దగ్గర వీరేంద్ర సెహ్వాగ్‌ ఫీల్డింగ్‌. ఆ గీత అవతల కోహ్లి బాల్‌బాయ్‌గా ఉన్నాడు. ఒక్కసారైనా తన వైపు చూడకపోతాడా అన్న ఆశతో సెహ్వాగ్‌కి చేయి వూపుతూనే ఉన్నాడు కోహ్లి. ఆ ఉత్సాహాన్ని గమనించిన వీరూ ఓ చిరునవ్వు నవ్వాడు. అంతే... ఆ పిల్లాడు పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. పదహారేళ్ల తరవాత ఓ రోజు సెహ్వాగ్‌ చెప్పిన మాట... ‘కోహ్లి బ్యాటింగ్‌ చేస్తుంటే టీవీ నుంచి కళ్లు పక్కకు తిప్పలేం. క్రీజ్‌లో నేనున్నా కూడా నా పిల్లలు అతడి బ్యాటింగ్‌ చూడటానికే ఇష్టపడతారు’.

* పన్నెండేళ్ల క్రితం ద్రవిడ్‌ దిల్లీలో ఓ స్టేడియానికి వచ్చినప్పుడు కోహ్లితో సహా పిల్లలంతా అతడితో ఫొటో దిగడానికి ఎగబడ్డారు. ఆ ఫొటోలో అందరూ కెమెరాని చూస్తుంటే, కోహ్లి మాత్రం ద్రవిడ్‌ కళ్లలోకే చూస్తూ కనిపించాడు. ఇటీవల కోహ్లి టెస్టు జట్టు కెప్టెన్‌గా మారాక అదే ద్రవిడ్‌ అతడి తొలి ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ‘కలలు నిజమవుతాయి, దానికి నేనే సాక్ష్యం’ అంటూ ఆ రెండు ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు కోహ్లి.

నిజమే... కలలు కచ్చితంగా నిజమవుతాయి. ఈ రెండు సంఘటనలే కాదు, కోహ్లి జీవితంలో ఎన్నో సందర్భాలు ఆ విషయాన్ని రుజువు చేస్తాయి. లేకపోతే సచిన్‌, ద్రవిడ్‌ లాంటి వాళ్లను ఒక్కసారి చూస్తే చాలనుకున్న పిల్లాడు, వాళ్లతో కలిసి క్రికెట్‌ ఎలా ఆడతాడు? రెండు జతల బట్టలతోనే రోజుల్ని నెట్టుకొచ్చిన కుర్రాడు, స్టయిల్‌ ఐకాన్‌గా ఎలా మారతాడు? అసలు జట్టులో కొనసాగడమే కష్టమనుకున్న ఆటగాడు, ప్రపంచ క్రికెట్‌ దిగ్గజాల మధ్యకు ఎలా చేరతాడు? అందుకే లక్ష్యాల్ని అందుకోవడం సాధ్యమే అని కోహ్లి ప్రయాణం నిరూపిస్తుంది. దానికి ఎంత శ్రమించాలో, ఎన్ని కష్టాలు దాటాలో, ఎన్ని అలవాట్లు మార్చుకోవాలో, ఎంత పరిపక్వత సాధించాలో అతడి గమనాన్ని గమనిస్తే అర్థమవుతుంది.

తొలి అడుగులు
దిల్లీలో స్థిరపడ్డ మధ్యతరగతి పంజాబీ కుటుంబంలో పుట్టాడు కోహ్లి. తండ్రి ప్రేమ్‌ క్రిమినల్‌ లాయర్‌. ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు కావడంతో అతడంటే అందరికీ గారాబం. బ్యాటుతో అనుబంధం కోహ్లికి మూడేళ్ల వయసులోనే మొదలైంది. అన్న కోసం కొన్న బ్యాటుని తీసుకొని, తండ్రి చేతికి బంతి ఇచ్చి వేయమని మారాం చేసేవాడట. ఆ అల్లరి తట్టుకోలేక తండ్రి ఇంకో చిన్న బ్యాట్‌ కొనిచ్చాడు. అప్పట్నుంచీ ఇంటికి ఎవరొచ్చినా తనతో క్రికెట్‌ ఆడమని గొడవ చేసేవాడు. వయసు పెరిగే కొద్దీ ఆట ఇంటిని దాటి వీధిలోకి విస్తరించింది. గల్లీ క్రికెట్‌లో కోహ్లి బ్యాట్‌ పడితే ఆ రోజు ఎవరింటి ముందు పూలకుండీలు పగుల్తాయోనని వీధంతా భయపడేది. ఆ దూకుడు తట్టుకోలేక కొందరూ, నిజంగానే పిల్లాడిలో విషయం ఉందని గమనించి ఇంకొందరూ తండ్రిని పిలిచి మాట్లాడారు. వాళ్లుండే ప్రాంతంలో కొత్తగా పెట్టిన క్రికెట్‌ అకాడమీలో కోహ్లిని చేర్పించడానికి ఒప్పించారు. అలా తొమ్మిదేళ్ల వయసులో వెస్ట్‌ ఢిల్లీ అకాడమీ తొలి బ్యాచ్‌ సభ్యుడిగా, మాజీ రంజీ ఆటగాడు రాజ్‌కుమార్‌శర్మకు శిష్యుడిగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో కోహ్లి తొలి అడుగులు పడ్డాయి.

ఔట్‌ అవ్వకూడదంతే!
అకాడమీలో శిక్షణ తీసుకునే రోజుల్లో కోహ్లిలో ఆటకంటే వ్యవహార శైలే కోచ్‌ని ఎక్కువ ఆకర్షించింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అయినా సరే ఔట్‌ అయితే తట్టుకోలేని మనస్తత్వం అతడిది. ఓ పక్క ఆటలో కోహ్లి ముందుకెళ్తుంటే, ఆర్థికంగా అతడి కుటుంబం వెనక్కు వెళ్లింది. తండ్రి అనారోగ్య సమస్యల వల్ల లాయర్‌గా ప్రాక్టీస్‌ అంతంత మాత్రంగా సాగడంతో, ఆ కెరీర్‌కు స్వస్తి పలికి ఏదో చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అదీ ఆశించిన స్థాయిలో సాగలేదు. కానీ ఆ సమస్యల ప్రభావం కోహ్లిపైన పడకుండా తండ్రి జాగ్రత్త పడ్డాడు. బిడ్డని అంతర్జాతీయ క్రికెటర్‌గా చూడాలని, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రోజూ స్కూటర్‌పైన స్కూల్‌కీ, ఇంటికీ, అకాడమీకీ కలిపి దాదాపు వంద కి.మీ. తిప్పేవాడు. క్రమంగా తండ్రి కలే కోహ్లికి జీవిత లక్ష్యంగా మారింది. సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌ లాంటి తన ఆరాధ్య క్రికెటర్ల ఆటతీరును జాగ్రత్తగా గమనించేవాడు. జాతీయ జట్టు జెర్సీ వేసుకుని భారత విజయానికి అవసరమైన పరుగుల్ని తానే చేసినట్టు వూహించుకునేవాడు. అలా పద్నాలుగేళ్ల వయసులోనే తాను భారత జట్టుకి ఆడటం ఖాయమన్న నమ్మకంతో ఉండేవాడు కోహ్లి.

అండర్‌-15, 17, 19...
తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కోహ్లికి స్కూల్‌ క్రికెటü ఛాంపియన్‌గా ముద్రపడింది. అకాడమీ విజయాల్లోనూ ఆ పిల్లాడిదే కీలకపాత్ర. ఆ ఆటతీరు వల్లే పద్నాలుగేళ్లకు దిల్లీ అండర్‌-15 జట్టులో చోటు దక్కింది. ఆ ఏడాది జరిగిన పాలీ ఉమ్రిగార్‌ ట్రోఫీలో 172 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దాంతో మరుసటి ఏడాది అదే ట్రోఫీకి దిల్లీ జట్టుకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ ఉత్సాహంతో ఐదు మ్యాచుల్లో రెండు శతకాలూ, రెండు అర్ధ శతకాలతో అత్యధికంగా 390 పరుగులు చేసి అండర్‌-17 జట్టుకు ప్రమోషన్‌ కొట్టేశాడు. అందులో భాగంగా ఆడిన విజయ్‌-మర్చంట్‌ ట్రోఫీలో అజేయంగా 251పరుగులు చేయడంతో పాటు, మరుసటి ఏడాది మళ్లీ ఆ టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలిచి టైటిల్‌ గెలిపించాడు. ఆ దెబ్బకు దిల్లీ-ఎ జట్టులో స్థానం ఖాయమైంది. కొన్నాళ్లకు ఏకంగా భారత్‌ అండర్‌-19 జట్టులో చేరమని

పిలుపందింది. అతడి అంతర్జాతీయ క్రికెట్‌ కల నెరవేరడానికి పడ్డ తొలి అడుగులవి. అక్కడ స్థిరంగా రాణిస్తే టీమిండియాకు ఎంపికవడం పెద్ద కష్టం కాదని కోహ్లికి తెలుసు. అందుకే దూకుడు తగ్గించి వికెట్‌ని కాపాడుకోవడానికి విలువివ్వాలని నిర్ణయించుకున్నాడు. తక్కువ పరుగులకు అవుటైతే, భావోద్వేగాలను అణచుకుంటూ మిగతా బ్యాట్స్‌మన్‌కు చప్పట్లు కొట్టడం ఎంత కష్టమో, ఫీల్డింగ్‌కు వచ్చి యాభై ఓవర్ల పాటు మైదానంలో గడపడం ఎంత బాధాకరమో అతడికి అనుభవమే. ఆ విషయాలన్నీ ఒంటబట్టించుకొని అండర్‌-19 కెరీర్‌కు మానసికంగా సిద్ధమయ్యాడు.

తండ్రి చనిపోయినా సరే...
అండర్‌-19 జట్టులో సభ్యుడిగా తొలిసారి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన కోహ్లి టెస్టులూ, వన్డేల్లోనూ రాణించాడు. తరవాత పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ సత్తా చాటడంతో పదిహేడేళ్ల వయసులో దిల్లీ తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు. అదే కోహ్లి జీవితంలో కీలక మలుపు. అప్పటివరకూ అందరికీ అతడు కోపం, దూకుడూ, మొండితనం కలగలిసిన కుర్రాడిగానే తెలుసు. కానీ తానాడిన రెండో రంజీ మ్యాచ్‌లో కోహ్లిలోని మరో కోణం బయటపడింది. కర్ణాటకతో టెస్టు మ్యాచ్‌ ఆడే సమయంలో బ్రెయిన్‌స్ట్రోక్‌తో కోహ్లి తండ్రి చనిపోయాడన్న కబురందింది. అయినా అతడి భావోద్వేగాలు అదుపు తప్పలేదు. అప్పటికే ఆ కుర్రాడి నరనరాల్లోకీ క్రికెట్‌ ఎక్కేసింది. దానికంటే ఏదీ ఎక్కువ కాదనే నిర్ణయానికి వచ్చేశాడు. కాదు కాదు... తండ్రే అతడికా విషయాన్ని నూరిపోశాడు. అందుకే దుఃఖాన్ని దిగమింగుకొని బ్యాటింగ్‌ కొనసాగించాలనీ, శతకం చేసి తండ్రికి అంకితమివ్వాలనీ నిర్ణయించుకున్నాడు. కానీ తొంబై పరుగుల దగ్గర అంపైర్‌ తప్పిదం వల్ల అవుటైన కోహ్లి, శతకం చేయకపోయినా ఆ స్ఫూర్తికి తండ్రి సంతోషించే ఉంటాడన్న నమ్మకంతో నేరుగా అంత్యక్రియలకు బయల్దేరాడు. ఆ రాత్రి నుంచీ తామంతా ఓ కొత్త కోహ్లిని చూశామని చెబుతుంది తల్లి సరోజ్‌. నిజమే, అప్పట్నుంచే అతడిలో దురుసు స్వభావం, మొండితనం తగ్గాయి. భారత్‌కు ఆడాలన్న ఆశ పదింతలైంది. వీలైనంత త్వరగా టీమిండియా జెర్సీ ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోపక్క పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబం అప్పులపాలైంది. తొలిసారి అద్దె ఇంటికి మారాల్సివచ్చింది. సరైన బట్టలు కూడా లేక వీలైతే స్కూల్‌ యూనిఫాం, లేకపోతే అకాడమీ ఇచ్చే స్పోర్ట్స్‌ దుస్తుల్లోనే కోహ్లి చాలా రోజులు గడిపేశాడు.

ప్రపంచకప్‌ గెలిపించాడు!
ఓసారి అండర్‌-19 జట్టు న్యూజిలాండ్‌కు బయల్దేరే ముందు కుర్రాళ్లకు సూచనలు చేయడానికి స్వయంగా సచిన్‌ తెందూల్కర్‌ ముంబయి మైదానానికి వచ్చాడు. చిన్నప్పట్నుంచీ ఆరాధిస్తూ పెరిగిన క్రికెటర్‌ కళ్లముందు కనిపించేసరికి కోహ్లికి నోటమాట రాలేదట. దాదాపు ఇరవై నిమిషాలు సచిన్‌ జట్టుతో మాట్లాడినా, అతడేం చెప్పిందీ అస్సలు గుర్తులేదంటాడు. ఆ మాటలు వినకుండా కళ్లప్పగించి అలా సచిన్‌నే చూస్తూ ఉండిపోయాడు మరి. న్యూజిలాండ్‌ పర్యటన ముగిసేసరికి కోహ్లికి నాయకత్వ పగ్గాలు అందాయి. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌కు జట్టు అతడి సారథ్యంలోనే మలేషియా బయల్దేరింది. ఆ సిరీస్‌ కోహ్లి రూపంలో ఓ కొత్త ఛాంపియన్‌ను భారత్‌కు అందించింది. భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్‌ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్‌ను అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలబెట్టాడు. రాత్రికి రాత్రి భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ నుంచి పిలుపొచ్చింది. ఆపైన శ్రీలంకతో సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లికి జట్టులో చేరమంటూ కబురందింది. అలా వూహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లి కంటున్న కల పందొమ్మిదేళ్ల వయసులో నెరవేరింది. ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో అతడి అర్ధ శతకం సాయంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లి ఆశ అంత సులువుగా తీరలేదు.

పడిలేచిన వేళ...
వన్డే క్రికెట్‌లో తన ప్రస్థానాన్ని బాగానే ప్రారంభించినా, తరవాతి సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ అందుబాటులోకి రావడంతో కోహ్లి స్థానం బెంచికే పరిమితమైంది. ఆ తరవాతి సిరీస్‌లో ఏకంగా అతడి చోటే గల్లంతయ్యింది. ఆపైన ఎవరైనా గాయాలపాలైన సందర్భంలో అడపాదడపా వచ్చిన అవకాశాల్ని రెండు చేతులా అందుకుంటూ, తనను తొలగించలేని పరిస్థితిని సెలెక్టర్లకు కల్పించాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. ఆపైన 2011లో వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులోనూ తనదైన ముద్ర వేశాడు. మూడేళ్ల వరకూ బండి బాగానే నడిచింది. చిన్న వయసులోనే పేరూ డబ్బూ హోదా వచ్చేశాయి. వాటితో పాటు కాసింత దూకుడూ, నోటి దురుసు కూడా. క్రమంగా మైదానంలో ఆవేశం పెరిగింది. చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం, నోరు జారడం మామూలైంది. దాంతో ప్రత్యర్థులతో పాటు విదేశీ అభిమానులకూ కోహ్లి అలుసైపోయాడు. వైఫల్యాలు మొదలయ్యాయి. ఫలితంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జట్టుకు దూరమయ్యాడు. ఆపైన 2012 ఐపీఎల్‌లోనూ చెత్త ప్రదర్శనతో విమర్శలతో పాటు అభిమానుల వెక్కిరింతలకు గురయ్యాడు. ఆటతో పాటు మాటతీరూ తీసుకొచ్చిన ఫలితమది. ఐపీఎల్‌ ముగిశాక కోహ్లిలో అంతర్మథనం మొదలైంది. అద్దం ముందు నిల్చొని తనను తాను ప్రశ్నించుకున్నాడు. తనలో మార్పు రాకపోతే కెరీర్‌ మొదట్లోనే ముగుస్తుందన్న భయం కళ్లలో కనిపించింది. అదే జరిగితే తండ్రి కలా, తన కష్టం వ్యర్థమేనని అర్థమైంది. విదేశీ ప్రత్యర్థులకూ తనకూ ఉన్న తేడా ఏంటో గమనించాడు. అంతర్జాతీయ క్రికెటర్‌కు కావల్సిన సామర్థ్యం తనకు లేదన్న అంచనాకి వచ్చాడు. మార్పు తన రూపం నుంచే మొదలవ్వాలని నిశ్చయించుకున్నాడు.

మొదట కొవ్వుని కరిగించి, బరువుని తరిగించే పనిలో పడ్డాడు కోహ్లి. ఆహార నియమాలను కఠినంగా మార్చుకున్నాడు. వ్యాయామంతో పాటు సాధనకు సమయం పెంచాడు. కోపం, అసహనం తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. నెమ్మదిగా ఫలితాలు ఆరంభమయ్యాయి. జట్టులో ఫిట్టెస్ట్‌ ఆటగాడిగా మారాడు. మాటలోని వేగాన్ని ఆటలోకి తీసుకొచ్చి పరుగులు చేయసాగాడు. ప్రత్యర్థుల కవ్వింపులకు బ్యాటుతోనే సమాధానం ఇస్తూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రికెటర్‌గా కోహ్లి మళ్లీ పుట్టాడు. ఆ తరవాత అతడిని అడ్డుకోవడం, తట్టుకోవడం ఎవరి తరం కాలేదు. భారీ లక్ష్యాల్ని అవలీలగా ఛేదించడం అలవాటైపోయింది. శతకాలు అలవోకగా బ్యాటునుంచి జాలువారుతున్నాయి. ఓ పది నిమిషాలు కుదురుకుంటే చాలు, దిగ్గజ బౌలర్లకూ చుక్కలు చూపించడం పరిపాటైంది. ఆ క్రమంలోనే ఎన్నో రికార్డులు దాసోహమయ్యాయి. వన్డే క్రికెట్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కింది. మూడు ఫార్మాట్లలో తిరుగులేని బ్యాట్స్‌మన్‌గా పేరొచ్చింది. ప్రకటనల రంగంలో రారాజుగా ఎదిగాడు. సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టాడు. వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌గా మారాడు. టెస్టు జట్టు పగ్గాలు దక్కించుకున్నాడు. క్రీడా రంగంలో భారత్‌ తరఫున అత్యంత ప్రముఖ సెలెబ్రిటీగా నిలిచాడు. మైదానంలో తనకసలు పోటీనే లేదన్నట్లు దూసుకెళ్తున్నాడు.

కోహ్లిలో మార్పు రెండుసార్లు మొదలైంది. ఒకటి... తండ్రి చనిపోయినప్పుడు, రెండు... జట్టులో చోటు కోల్పోయినప్పుడు. ఆ రెండు సందర్భాల్లోనూ తనకు తానే గురువులా మారాడు. ఆత్మశోధన జరిపాడు. మనసు మాటే విన్నాడు. తనకేం కావాలో, దానికోసం ఏం చేయాలో ఆలోచించాడు. దాన్ని ఆచరణలో పెట్టి పైపైకి ఎదిగాడు. అతడి కెరీర్‌ ఇలానే కొనసాగితే రిటైరయ్యే నాటికి ఏ రికార్డులూ మిగలవనీ, ఏ ఆటగాడూ దరిదాపుల్లో నిలవడనీ చెప్పే వాదనకు తిరుగులేదు!

2012లో శ్రీలంకతో మ్యాచ్‌. భారత విజయానికి 320పై చిలుకు పరుగులు కావాలి. రెండు వికెట్లు పడ్డాయి. బరిలోకి విరాట్‌ వచ్చాడు. నాలుగో బంతికే ఫీల్డర్‌ అతడి క్యాచ్‌ వదిలేశాడు. దాన్ని అందిపుచ్చుకొని 133పరుగులు చేసి జట్టుని ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ రోజు శ్రీలంక సారథి జట్టు సభ్యులతో అన్నమాట, అప్పట్నుంచీ ప్రతి మ్యాచ్‌లో వినిపిస్తున్న మాట, కనీసం మరో పదేళ్ల పాటు ప్రత్యర్థుల నోట వినిపించే మాట... ‘మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లి ఉన్నాడు..!’


ఎన్నెన్నో రికార్డులు