close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మంగోలియన్ల గుడారంలో ఓ రాత్రి..!

మంగోలియన్ల గుడారంలో ఓ రాత్రి..!

‘లక్షల సంవత్సరాల క్రితం ఆదిమమానవుడు నివసించిన మంగోలియన్‌ నేలనీ చెంఘిజ్‌ఖాన్‌ ఏలిన ఆ ప్రాంతాన్నీ ముఖ్యంగా సంచార జీవనాన్నీ చూడాలనుకునేవాళ్లకి మంగోలియా దేశం ఎంతో నచ్చుతుంది’ అంటూ అక్కడి విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన కె. సుచరితారెడ్డి.

చెంఘిజ్‌ఖాన్‌ ఏలిన మంగోలియా దేశాన్ని చూడాలని చాలాకాలం నుంచీ అనుకుంటున్నాం. అందుకే స్నేహితులందరం కలిసి దాంతోపాటుగా తైవాన్‌, దక్షిణకొరియా కూడా చుట్టి వచ్చేందుకు బయలుదేరాం. ముందుగా తైవాన్‌ రాజధాని తైపేకి చేరుకున్నాం. వెళ్లినరోజే ప్రెసిడెన్షియల్‌ ఆఫీస్‌ స్క్వేర్‌ని చూసి, రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా మాజీ అధ్యక్షుడైన చాంగై షేక్‌ మెమోరియల్‌కు వెళ్లాం. అందులో చాంగై విగ్రహం చాలా పెద్దదిగా ఉంది. అక్కడ గంటగంటకూ కవాతు జరుగుతుంది. గార్డులు మారుతుంటారు. ఆ భవనంలోంచి బయటకు రాగానే చిన్న చిన్న జలపాతాలూ కొలనుల మధ్యలో ఉన్న చూడచక్కని ఉద్యానవనంలో కాసేపు సేదతీరాం. వనం చుట్టూ ఉన్న మూడు భవంతులూ ఆనాటి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. మర్నాడు తైచుంగ్‌ అనే పట్టణానికి బస్సులో బయలుదేరాం. దారిపొడవునా ఆ దేశ అభివృద్ధి కనిపిస్తూనే ఉంది. ఈ పట్టణంలో తైవాన్‌కు చెందిన స్థానిక తెగలవారు ఎక్కువగా నివసిస్తారు. మొదట్లో వేటే వీళ్ల జీవనాధారం. తరవాత్తరవాత పంటలు పండించుకోవడం నేర్చుకున్నారట. తైచుంగ్‌ పట్టణానికి సమీపంలోనే, పర్వతాల మధ్యలో ఉన్న సన్‌మూన్‌ సరస్సు దగ్గరకు వెళ్లాం. అందులో విహారం చేస్తూ తల పైకెత్తి చూస్తే మేఘాలు పర్వతాలతో దోబూచులాడుతున్నట్లే పరుగులు తీస్తున్నాయి. ఆ దృశ్యం... మరోలోకంలో ఉన్నామా అనిపించింది. కేబుల్‌ కారులో ప్రయాణిస్తూ కూడా సరస్సు అందాలను ఆస్వాదించవచ్చు. ఆ సాయంత్రం సరస్సుకి పక్కనే ఉన్న పురాతన వెన్‌ వూ బౌద్ధాలయానికి వెళ్లాం. రంగురంగుల చెక్కలూ బంగారంతో రూపొందించిన శిల్పాలతో ఆ ఆలయం అద్భుతంగా తోచింది.

సాంస్కృతిక గ్రామం!
మర్నాడు క్యావ్‌షుంగ్‌ దగ్గర ఉన్న ఫార్మొజా అనే గ్రామానికి రోప్‌ వే ద్వారా చేరుకున్నాం. నిజానికి దీన్ని స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్కుగా చెప్పవచ్చు. అక్కడి గ్రామస్తులు సంప్రదాయ దుస్తులతో వీనులవిందైన సంగీతంతోనూ చూడచక్కని నృత్యంతోనూ సందర్శకుల్ని అలరింపజేశారు. అక్కడ వాళ్లు నివసించే గృహాలను నేరుగా మనం సందర్శించవచ్చు. స్థానికులు స్వయంగా తయారుచేసిన వస్తువులను కొనుక్కోవచ్చు. ఇంకా రకరకాల థ్రిల్లింగ్‌ రైడ్‌లు కూడా ఉన్నాయి. అవన్నీ తిరిగి రైల్లో తైపేకి చేరుకున్నాం.

తరవాతి రోజు అక్కడ నిర్మించిన 101 అంతస్తుల టవర్‌ చూడ్డానికి వెళ్లాం. ఎత్తైన తైపె టవర్‌ చెక్కుచెదరకుండా ఉండేందుకు వీలుగా మధ్యలో గుండ్రని గోళాన్ని అమర్చారు. అందులోని లిఫ్టు ఎక్కితే ఐదో అంతస్తు నుంచి 87వ అంతస్తుకి కేవలం 50 సెకన్లలోనే చేరుకుంటాం. ఈ టవరు పైఅంతస్తు నుంచి చూస్తే తైపె నగరమంతా కనిపిస్తుంది. దీనిచెంతనే వందలకొద్దీ దుకాణాలున్న షాపింగ్‌మాల్స్‌ను నిర్మించారు. ఈ టవర్‌కి సమీపంలో ఉన్న పార్కులో మధ్యాహ్న సమయంలో దాని నీడ యథాతథంగా పడి అక్కడేదో టవర్‌ ఉన్నట్లే అనిపించింది. ఈ 101 అంతస్తుల భవంతికి వెలుపల నిర్మించిన ఫెంగ్‌షుయ్‌ ఫౌంటెయిన్‌ చిత్రంగా అనిపించింది. తైపె టవరుమీద నుంచి చూస్తే పర్వతాల మధ్యలోని లోయలో ఉన్న ఆ నగరం చూడ్డానికి ఎంతో బాగుంది. ఎందుకంటే పర్వతాలమీద ఎలాంటి భవనాలూ నిర్మించలేదు. లోయలోని పచ్చటి చెట్ల మధ్యనే ఈ నగరాన్ని అభివృద్ధి చేశారు.

మంగోలియన్లూ బౌద్ధులే!
మరుసటి రోజు మంగోలియా రాజధాని వూలాన్‌బాటర్‌కు చేరుకున్నాం. అది మారుమూల దేశం కాబట్టి అంతగా అభివృద్ధి చెంది ఉండదేమో అనుకున్నాం. కానీ ఆ రాజధాని చూశాక, 1990లో రష్యా నుంచి విముక్తి పొంది, ఇంత కొద్దికాలంలోనే అంత అభివృద్ధి ఎలా సాధించిందా అన్న ఆశ్చర్యం కలిగింది. అక్కడ మొదటగా గాండన్‌టెగ్‌చెన్‌లెన్‌ మొనాస్ట్రీకి వెళ్లాం. రష్యా అధీనంలో ఉన్నప్పుడు బుద్ధుడిని ఆరాధించడానికి అనుమతి లభించడంతో, అక్కడ బౌద్ధానికి సంబంధించిన ఆరామాలు చాలానే వెలిశాయి. అయితే మంగోలియాలో బౌద్ధమతం పూర్వకాలం నుంచీ ఉంది. నేపాల్‌ మీదుగా అక్కడ బౌద్ధం వ్యాపించింది. మంగోలియా సామ్రాజ్యం టిబెట్‌ దేశం వరకూ విస్తరించిన తరవాత మంగోలియన్‌, టిబెట్‌ బౌద్ధ సన్యాసులు హిందూదేశంలోని నలందా విశ్వవిద్యాలయంలో బౌద్ధ గ్రంథాలను అధ్యయనం చేయడానికి వచ్చేవారట. నలందా విశ్వవిద్యాలయ బౌద్ధ సిద్ధాంత మూలం అయిన గెలగ్‌ అనే బౌద్ధ సంప్రదాయం మంగోలియా దేశమంతా వ్యాపించింది. ఆ సంప్రదాయానికి గాండన్‌ బౌద్ధాలయాన్ని మూలస్తంభంగా పరిగణిస్తారు. ఈ మొనాస్టరీలోపల బంగారంతో పోతపోసిన 26.5 మీటర్ల అవలోకేశ్వర విగ్రహం చూడగానే కళ్లను కట్టిపడేస్తుంది. దానికి రంగురంగుల రత్నాల ఆభరణాలతో తాపడం చేయడంతో ఆకర్షణీయంగా ఉంది. 1930లలో తలెత్తిన రాజకీయ సంక్షోభ సమయంలో ఈ విగ్రహాన్ని నాశనం చేశారట. ఆ తరవాత 1996లో దీన్ని పునర్నిర్మించారు. అంతేకాదు, అప్పటినుంచీ ఆ విగ్రహాన్ని తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రతీకగా భావిస్తారు మంగోలియన్లు. ఇక్కడ దాదాపు 150 మంది బౌద్ధ భిక్షువులు తమ సేవల్ని అందిస్తుంటారు. సాధారణంగా ఈ బౌద్ధారామంలోపల ఫొటోలు తీయనివ్వరు. ఒకవేళ తీసుకోదలచుకుంటే కొంత రుసుము చెల్లిస్తే అనుమతిస్తారు. ఆ సాయంత్రం చెంఘిజ్‌ఖాన్‌ స్క్వేర్‌కు వెళ్లాం. అక్కడ ఆయన కూర్చున్నట్లుగా మలిచిన విగ్రహం సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. దీని చుట్టూ పార్లమెంటు, ఒపేరా హౌస్‌, సిటీ హాల్‌... వంటి ప్రభుత్వ భవనాలను అధునాతనంగా నిర్మించారు. ఆ రాత్రికి మంగోలియన్ల సంగీత నృత్యవిభావరికి వెళ్లాం. సంప్రదాయ దుస్తులు ధరించి వాళ్లు చేసిన నృత్యం కనులవిందుగా ఉంది. రకరకాల సంగీత పరికరాలతో విభిన్న రాగాలను పలికించారు. ఒకరకమైన పిచ్‌తో పాడే థ్రోట్‌ సింగింగ్‌ అనేది మంగోలియన్ల ప్రత్యేకత. ఒకప్పుడు గొర్రెల్నీ ఆవుల్నీ మేపుకుంటూ సుదూరంలో ఉన్న తమవాళ్లకు వినిపించేలా రకరకాల ధ్వనులు చేసేవారట. అందులోంచి పుట్టిందే ఈ థ్రోట్‌ సింగింగ్‌.

మర్నాడు తెరెచ్‌ జాతీయ పార్కుకి బయలుదేరాం. దారిలో సెయిన్‌లెస్‌స్టీలుతో చేసిన అశ్వంమీద చెంఘిజ్‌ఖాన్‌ కూర్చున్న విగ్రహం తెల్లగా మెరుస్తూ కనిపించింది. ఇది చాలా ఎత్తులో ఉండటంవల్ల చుట్టుపక్కల లోయనంతా పరికిస్తున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న మరో గుట్టమీద అతని తల్లి విగ్రహాన్ని కూడా నిర్మించారు. అక్కడికి కొంతదూరంలో తాబేలు ఆకారంలో ఉన్న ఓ రాయిని చూశాం. 13వ శతాబ్దంనాటి మంగోలియన్లు నివసించిన నమూనా ఇళ్లను ఐదు ప్రదేశాల్లో నిర్మించారు. కొండలూ గుట్టలమధ్య నిర్మించిన ఆనాటి ఇళ్ల నమూనాలను దగ్గరగా పరిశీలించి చూశాం. అక్కడే ఆరోజుల్లో వాళ్లు ఆవుల్నీ గొర్రెల్నీ పెంచే విధానాన్నీ ఆ పాలను భద్రపరిచే విధానాన్నీ చీజ్‌ తయారీ విధానాన్నీ కూడా చూపించారు. సమన్‌ అనేది వాళ్ల మతాచారమట. అందులో భాగంగా పూర్వికుల ఆత్మల్ని పూజారి పిలిచి మాట్లాడతాడని ఓ నమ్మకం. గైడ్‌ ఆ విషయం చెబుతుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది.

గుడారాల్లో విశ్రమించాం!
ఆ రాత్రికి మేం కూడా గెర్‌ క్యాంపుల్లోనే విశ్రమించాం. పూర్వం మంగోలియన్లు నివసించిన గుడారాలే ఈ గెర్‌లు. గుడారం మధ్యలో నిప్పుల కుంపటి పెట్టి పొగను గొట్టాల ద్వారా పైకి పంపిస్తారు. రాత్రి పది గంటలకు నిప్పు రాజేస్తారు. మళ్లీ తెల్లవారుజాము నాలుగు గంటలకు అందులో మరిన్ని బొగ్గులు వేస్తారు. పూర్వం వంటలు కూడా ఈ కుంపట్ల మీదే వండేవారట. స్నానాల గదిని మాత్రం ఆధునిక పద్ధతిలో వేరుగా నిర్మించడం వల్ల అక్కడ మాకు ఎలాంటి అసౌకర్యమూ కలగలేదు. పొద్దున్నే పచ్చదనంతో నిండిన ఆ రాతి పర్వతాల మధ్య ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలను చూస్తుంటే ఆశ్రమంలో ఉన్న భావన కలిగింది. తిరిగి వూలాన్‌బాటర్‌కి వస్తుంటే దారిలో పశువుల కాపరుల గుడారాలు కనిపించాయి. అక్కడివాళ్లది ఇప్పటికీ ఎక్కువగా సంచార జీవితమే. ఎక్కడ నీళ్లుంటే అక్కడికి జంతువులతో వెళుతుంటారు. స్థిరనివాసం ఉండదు. రాజధానికి చేరుకున్నాక అలనాటి రాజుల వేసవి విడిదిని చూశాం. అక్కడ తోలూ కాశ్మీరీ వూలుతో చేసిన వస్తువులు చౌకగా దొరుకుతాయి. నచ్చినవన్నీ కొనుక్కుని అక్కడ నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కి బయలుదేరాం.

ఆ నగరంలో అన్నీ దుకాణాలే!
సియోల్‌ నగరాన్ని చూస్తుంటే వాణిజ్యపరంగా ఇది ఎంతో అభివృద్ధి చెందిన దేశమని అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న హాన్‌ నదిలో విహారం మరువలేని అనుభూతిని అందించింది. దక్షిణ కొరియా నాగరికత అంతా ఈ నది చుట్టూనే విస్తరించి ఉంది. చైనాతో వ్యాపారానికి ఈ నదీ మార్గమే కీలకం. ఇక్కడ బ్లూహౌస్‌ అనే ప్రెసిడెంట్‌ ప్యాలెస్‌ను దూరం నుంచి చూడవచ్చు. ఆ భవంతి వెనుక ఓ కొండ ఉంది. అక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోనే ఉత్తర కొరియా సరిహద్దు ఉంది. సియోల్‌లో రకరకాల వస్తువులు దొరుకుతాయి. షాపింగ్‌ ఆసక్తి ఉన్నవాళ్లకి ఈ నగరం బాగా నచ్చుతుంది. లాన్స్‌డౌన్‌ బజారులో ఎంతసేపు గడిపామో మాకే తెలియలేదు. అక్కడ కూడా మన రాజరిక వ్యవస్థలో మాదిరిగానే రాజుగారికోటలూ రాణీవాస భవనాలూ వేర్వేరుగా ఉన్నాయి. వాటిని సందర్శించి, ఆ రాత్రికి నాన్టా అనే హాస్యనాటికను చూసి బయటకు వస్తుంటే అక్కడ రకరకాల కొరియన్‌ వంటకాలు బండ్లమీద అమ్ముతూ కనిపించాయి. వాళ్ల ప్రసిద్ధ వంటకం కిమ్‌చి. కొరియన్‌ జానపద గ్రామాన్నిచూసి మర్నాడు బులెట్‌ రైల్లో బుసాన్‌కు చేరుకున్నాం. ఈ నగరం సముద్రతీరంలో ఉండటంవల్ల అక్కడ ఓ నౌకాశ్రయం ఉంది. బుసాన్‌ బౌద్ధ దేవాలయం ఓ అందమైన ఉద్యానవనంలోని తామరకొలను మధ్యలో ఉంది. బుసాన్‌ కూడా పెద్ద షాపింగ్‌ సెంటరే. మూడుదేశాల్లోనూ రాజధాని నగరాలతోబాటు రెండో ముఖ్య పట్టణాల్నీ సందర్శించడంవల్ల ఆ దేశ ప్రజల అభివృద్ధీ, జీవనవిధానాన్నీ దగ్గరగా గమనించగలిగాం. మాకు ఎక్కడా పెద్దగా ట్రాఫిక్‌ పోలీసులే కనిపించలేదు. అయినా ట్రాఫిక్‌ ఎంతో పద్ధతిగానే ఉంది.చివరగా బ్యాంకాక్‌ మీదుగా వచ్చి అక్కడి బంగారుబుద్ధుణ్ణీ జేడ్‌ బుద్ధుణ్ణీ చూసి హైదరాబాద్‌కు చేరుకున్నాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.