close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘బి’పాజిటివ్‌

‘బి’పాజిటివ్‌
- పినిశెట్టి శ్రీనివాసరావు

పొద్దున్నే శ్యామల్రావు ఫోను చేశాడు. వాళ్ళబ్బాయి ‘సివిల్స్‌ మెయిన్స్‌’లో పాసయ్యాడట... ఎంతో సంతోషంగా చెప్పాడు.
‘‘గుడ్‌... కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పండి మీవాడికి. ఇంకేముంది, ఇంటర్వ్యూ కూడా బాగా చేశాడంటే మీవాడికి ఐఏఎస్‌ వచ్చేసినట్లే’’ అన్నాను.
‘‘అబ్బే... అదంత ఈజీ కాదులెండి సార్‌. మావాడైతే బాగానే ప్రిపేర్‌ అవుతున్నాడు కానీ... ఏమోలెండి సార్‌, మీ బ్లెస్సింగ్స్‌ ఉంటే వాడు సెలక్టయిపోతాడు’’ అన్నాడు.
‘‘నా బ్లెస్సింగ్స్‌ కాదు, దేవుడి బ్లెస్సింగ్స్‌ కావాలి. ఇంతదాకా వచ్చాక తప్పక సెలక్టవుతాడు. ఏమైనా మీకు అడ్వాన్సుగా
కంగ్రాచ్యులేషన్స్‌. ఫైనల్‌ రిజల్ట్‌ వచ్చాక తప్పకుండా ఫోను చేసి శుభవార్త చెప్పండి’’ అన్నాను.

‘‘మీరు నా శ్రేయోభిలాషులు. అందుకే సార్‌, ఏ విషయమైనా మీకే ముందు చెప్తాను. ఉంటాను సార్‌, మిమ్మల్ని డిస్టర్బ్‌ చేశాను’’ అన్నాడు శ్యామల్రావు.

శ్యామల్రావు నా సెక్షన్‌లో సీనియర్‌ అసిస్టెంటు. పెద్ద తెలివైనవాడేం కాదు. అతని కొడుకు సివిల్స్‌ ఫైనల్స్‌ ఇంటర్వ్యూ వరకూ వచ్చాడంటే నాకెందుకో సంతోషంగా లేదు. కారణం... మావాడే ఇప్పటికి రెండుసార్లు మెయిన్స్‌లో ఫెయిలయ్యాడు. అలాంటిది, నా దగ్గర అసిస్టెంటుగా పనిచేసే అతని కొడుకు మెయిన్స్‌ దాటి ఇంటర్వ్యూకి వెళ్ళటమా?

నిజానికి శ్యామల్రావు నాకు ఫోను చేసి చెప్పటానికి గల కారణం... నామీద గౌరవంతో కాదు- ‘నా కొడుకు చేయలేనిది తన కొడుకు చేసి చూపించాడని గొప్ప చెప్పుకోవటం కోసమే’ అని నా అభిప్రాయం. ఇంకా పైగా... మీ ‘బ్లెస్సింగ్స్‌’ ఉంటే వాడు పాసైపోతాడని చెప్పటం కూడా నన్ను ఉడికించటానికే అయుంటుంది.

ఈ రోజుల్లో అందరూ అందరే... ఎవరూ తక్కువ కాదు.

నేను మాత్రం మనస్ఫూర్తిగా అభినందించానా ఏవిటీ... ఏదో ముఖస్తుతి కోసం తప్ప.

ఈ విషయం విన్న తర్వాత మావాడి మీద నాకు బాగా కోపం వచ్చింది. గాడిద... కష్టపడి చదవొచ్చుగా? కోచింగ్‌ తీసుకున్నాడు. లైబ్రరీకి వెళ్ళి ఏవేవో పుస్తకాలు తిరగేసేవాడు. కావాల్సిన మేగజైన్స్‌ అన్నీ ఇంటికే తెప్పించుకుని చదివేవాడు. అయినా మెయిన్స్‌లో రెండుసార్లు తప్పాడు.

శ్యామల్రావు కొడుక్కి మావాడికున్న అవకాశాలు ఎక్కడున్నాయి? అయినా మొదటిసారే మెయిన్స్‌లో పాసయ్యాడంటే నమ్మశక్యంగా లేదు.

మావాడికి ఈ విషయం చెప్పి ‘నీకంటే శ్యామల్రావు కొడుకే నయం’ అని కోప్పడ్డాను.

మావాడు నొచ్చుకున్నాడు.

రెండు నెలల తర్వాత...

సివిల్స్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. శ్యామల్రావు ఫోను చేయలేదు. నేనే ఫోన్‌ చేశాను. వాళ్ళబ్బాయి సెలెక్టు కాలేదని చెప్పాడు.

‘‘అయ్యో పాపం బ్యాడ్‌లక్‌... ఓకే... బెటర్‌లక్‌ నెక్స్ట్‌టైమ్‌’’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాను.

నాకెందుకో సంతోషంగా ఉంది. శ్యామల్రావు వాళ్ళబ్బాయి సెలక్టయి ఉంటే, అతని తండ్రిగా ఇతనికి... ఆఫీసులో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఇంతకాలం తన దగ్గర వినయవిధేయతలతో మెలిగే అతను, ఇకనుంచి అలా ఉండకపోవచ్చు. ఇక ఆఫీసులో అందరికీ తన కొడుకు తెలివితేటల గురించి కథలు కథలుగా చెప్తాడు. దాంతో ఇతనికో ‘వీఐపీ’ హోదా వస్తుంది.

థాంక్‌ గాడ్‌! వాడు సెలెక్ట్‌ కాలేదు కాబట్టి బతికిపోయాను... ఇదే నా సంతోషానికి కారణం.

* * *

మా ఆఫీసులోనే పనిచేసే అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌ ఆఫీసరు మూర్తి అమెరికా వెళ్ళొచ్చాడు. ‘గెట్‌ టు గెదర్‌’ ఏర్పాటుచేశాడు. నాకూ ఇన్విటేషన్‌ వచ్చింది.

ఫంక్షన్‌కు వెళ్ళాను. బొకే ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్‌ చెప్పాను. మనిషి ఒళ్ళు చేశాడు, రంగొచ్చాడు. ఇద్దరం చేతులు నలిపేసుకున్నాం... హ్యాండ్‌షేక్‌ అన్నమాట.

గట్టిగా కౌగిలించుకున్నాం... ధృతరాష్ట్ర కౌగిలి.

‘‘మీరు అమెరికా వెళ్ళి రావాలి మళ్ళీ మళ్ళీ... ఇలాంటి గెట్‌ టు గెదర్లు మరెన్నో చేసుకోవాలి’’ అంటూ అభినందించాను.

‘‘మీ విషెస్‌ ఉంటే అలాగే వెళ్ళొస్తాను, వెళ్ళకపోతే మీరు వూరుకోరుగా?’’ అన్నాడు మూర్తి.

అరనవ్వు నవ్వాను. భోజనం చేసి వచ్చేశాను. ఎందుకో అక్కడున్నంతసేపూ నాకు ఇబ్బందిగానే అనిపించింది. బయటకొచ్చాక మనసుకు ప్రశాంతత అనిపించింది.

నేనూ, మూర్తీ కొలీగ్స్‌మే. ఇద్దరికీ ‘ఇగో’ ఉంది. అసూయా ద్వేషాలున్నాయి. మా మాటల్లో, చేతల్లో, అభినందనల్లో నిజాయతీ లేదు. మావి కల్తీ నవ్వులే.

ఆర్నెల్ల తర్వాత ఏమయిందో ఏమో... అమెరికాలో ఉంటున్న మూర్తి కూతురూ, అల్లుడూ ఇండియాకు వచ్చేశారు. మూర్తి చెప్పకపోయినా ఈ విషయం వేరే రూట్‌లో నాకు తెలిసింది.

మూర్తిని కలిసి ‘‘మీరు నన్ను నిరాశపరిచారు. ఇకమీదట గెట్‌టుగెదర్‌ ఫంక్షన్స్‌ ఉండవన్నమాట’’ అన్నాను.

నా మాటల్లోని వ్యంగ్యం మూర్తికి తెలుసు. అతనికి తెలియాలనే నా తాపత్రయం.

మావాడు సివిల్స్‌ మెయిన్‌లో రెండుసార్లు ఫెయిలైనప్పుడు, మూర్తే పనిగట్టుకుని నా దగ్గరకొచ్చి పలకరించి వెళ్ళాడు. కావాలనే అలా చేశాడు.

అందుకే ‘టిట్‌ ఫర్‌ టాట్‌’... నేను మూర్తిని హర్ట్‌ చేయాలనే అలా చేశాను.

మా బంధువే... దగ్గరా దూరమా అంటే చెప్పలేను. మధ్యస్తం అనుకోవచ్చు. ఆస్తి అంతస్తుల్లో కాస్త పైనే. నాతో ఏదైనా అవసరముంటే ఫోను చేస్తాడు. నేను ఫోను చేస్తే ఎత్తడు. డబ్బుందని గర్వం, అహంకారం ఎక్కడుండాలో అక్కడుంది.

పిల్ల పెళ్ళికి ఇంటికొచ్చి పిల్చాడు. శుభలేఖతోపాటు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ కూడా ఇచ్చాడు. వెళ్ళక తప్పుతుందా... నేనూ మా ఆవిడా వెళ్ళాం.

సవేరా గార్డెన్స్‌లో పెళ్ళి. వెళ్ళగానే అందరితోపాటు మాకూ రండి రండంటూ సాదర సత్కారం లభించింది. జనమే జనం. భారీగా ఏర్పాట్లు. రాత్రి పదిన్నరకు పెళ్ళి. ముందుగానే భోజనాలు. ఓ యాభైరకాల వంటకాలు. తిన్నది తక్కువా వేస్టేజీ ఎక్కువ. వేస్టేజీ ఎంత ఎక్కువగా ఉంటే అంత గ్రాండ్‌గా భోజనాలు పెట్టినట్లు.

తొమ్మిది తర్వాత ఈదురుగాలి మొదలైంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. ముహూర్తం టైముకు భారీ వర్షం. ఆహూతులంతా చెల్లాచెదురైపోయారు. కరెంటు పోయింది. జనరేటర్‌ ఆన్‌ అయింది. ఒక గంటసేపు కుండపోతగా వర్షం కురిసింది. అకాలవర్షం. చూచాయగా కూడా అంతకుముందు వర్షం వచ్చే సూచనలు లేవు.

ప్రాంగణమంతా నీరు వరదలై పారింది. అన్ని ఏర్పాట్లూ బాగున్నాయి. సడెన్‌గా ఈ వర్షం పడటమే అనుకోని అవాంతరం. అసలు ముహూర్తం టైముకే గందరగోళం. వేదిక మీద పెళ్ళి ఏం జరిగిందో ఏమో... వర్షం హోరులో ఏమీ తెలీలేదు. వాన వెలిసిందో లేదో ఎవరిదారిన వారు ఇంటిముఖం పట్టారు.

నాకెందుకో సంతోషంగా ఉంది. ఎందుకంటే చెప్పలేను.

పెళ్ళికూతురి తండ్రి అంటీఅంటనట్లుగా ఉంటాడు తప్పిస్తే, చెడ్డవాడేం కాదు. అతను అలా ఉండటానికి గల కారణం- డబ్బు, గర్వం కావచ్చని నా నమ్మకం. అంటే... మరోరకంగా చెప్పాలంటే మాతో అతను క్లోజ్‌గా ఉండకపోవటానికి - మేము అతనికంటే తక్కువ అని, అతను అనుకుంటున్నాడని నా అనుమానం. అలాగే, అతను నాకంటే ఆస్తిపరంగా ఎత్తులో ఉన్నాడని నాకు అసూయ. ఈ కారణాల దృష్ట్యా... వర్షం కారణంగా అతనికి ఇబ్బంది కలిగింది కనుక నాకు సంతోషంగా ఉంది.

* * *

వినోద్‌ మేముంటున్న అపార్ట్‌మెంటులోనే అద్దెకుంటున్నాడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికి పిల్చాడు, వెళ్ళాను. ఇల్లు చాలా విశాలంగా, ఓ బంగళాలా ఉంది. వినోద్‌- మనిషిని చూస్తే చాలా సింపుల్‌గా ఏమీ లేనివాడుగా కన్పిస్తాడు. మొహమాటస్తుడు.

ఇంత గ్రాండ్‌గా రిచ్‌గా ఇల్లు కట్టాడంటే, ఇతనికి ఇంతుందా అనిపించింది. ఇంతకాలం నాకంటే తక్కువస్థాయివాడని అనుకునేవాడిని. ఈ ఇల్లు చూశాక నా స్థాయే తక్కువనిపించింది. ఒక్కసారిగా నాలో న్యూనతాభావం చోటుచేసుకుంది. అతన్నీ అతని ఇంటినీ పోల్చి చూశాను. మ్యాచింగ్‌ కుదరటం లేదు. నేనైతే అంత రిచ్‌గా ఇల్లు కట్టలేననిపించింది. మనిషి రూపాన్నీ ఆకారాన్నీబట్టి అతని స్థాయిని అంచనా వేయటం తగదనిపించింది. భోజనాలు గ్రాండ్‌గానే ఉన్నాయి. అయినా నేను ఎంజాయ్‌ చేయలేకపోయాను.

ఇంతకాలం ఒక మధ్యతరగతివాడుగా నా మనసులో ముద్ర వేసుకున్న వినోద్‌, నాకంటే పైస్థాయివాడన్న చేదునిజాన్ని నా మనసు అంగీకరించలేకపోతోంది. ఎక్కడో... మనసు మూలల్లో అతనంటే అసూయ చోటుచేసుకుంది. ఆ ఇంటినుంచి బయటపడేదాకా నాకు మనశ్శాంతి

లేకుండాపోయింది.

* * *

అలాగే భార్గవ్‌ కొత్తగా ఓ ఖరీదైన కారు కొన్నప్పుడూ, కౌశిక్‌ కొడుకు బిట్స్‌ పిలానీలో అత్యుత్తమ ర్యాంకుతో ఉత్తీర్ణుడైనప్పుడూ, సుమంత్‌కు ఫారిన్‌ అసైన్‌మెంటు వచ్చినప్పుడూ... నాలో ఏదో అలజడి, అసహనం... కారణం అసూయ.

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో సంఘటనలు. అన్నిటి సారాంశం... అవతలివాడి అభ్యున్నతినీ ప్రగతినీ నేను హర్షించలేకపోవడం. వాళ్ళు ఆనందిస్తుంటే- నేను అసూయా ద్వేషాలతో రగిలిపోవటం, ఆత్మన్యూనతా భావంతో ముడుచుకుపోవటం, వాళ్ళు బాధపడ్డప్పుడు నేను ఆనందించటం... చాలా విచిత్రమైన మనస్తత్వం. దీంతో నాలో ఎప్పుడూ ఘర్షణ, సంఘర్షణ. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టదు. మానసిక ప్రశాంతత కరవైంది.

పరమాత్మ సృష్టిలో అత్యుత్తమ జన్మగా అభివర్ణించుకునే మనిషికే ఈ అసూయాద్వేషాల జాడ్యం ఉండటం విచారకరం. ఈ ఆస్తులూ అంతస్థులూ హోదా మనుషుల మధ్య తారతమ్యాలని పెంచి పోషించి... క్రోధాన్నీ వైరాన్నీ రగిల్చి... మమతానుబంధాలకు దూరం చేస్తున్నాయి.

సహోదరుల మధ్యా, సకుటుంబీకుల మధ్యా, సహచరుల మధ్యా, సహాధ్యాయుల మధ్యా, సహోద్యోగుల మధ్యా... అసూయాద్వేషాలు రగిల్చి, వారిని విడదీసి వేరుచేసి, వారి మనసుల్లో విషబీజాలు నాటుతుంటే, మనలో ఉన్న వివేకం ఏం చేస్తున్నట్లు? అత్యుత్తమ జన్మనెత్తిన మనుషులం మనం. మనల్ని మనం సంస్కరించుకోలేకపోతే మానవజన్మ గొప్పతనమేముంది?

ప్రేమను పంచితే... ప్రేమను పెంచుతుంది. ద్వేషం మనిషిని దహించివేస్తే... ప్రేమ మనిషిని బతికిస్తుంది.

యస్‌... నాకు ఆ ప్రేమే కావాలి. ప్రేమించే గుణం కావాలి. కానీ ఎలా? నాలో ఉన్న ఆ ‘నెగటివ్‌’ గుణం శాశ్వతంగా సమాధి కావాలి. అంటే నాకు సరైన ‘కౌన్సిలింగ్‌’ అవసరమా? దీనికోసం మానసిక వైద్యుడిని సంప్రదించాలా? నా రోగలక్షణాలేమిటో నాకు తెలుసు. వైద్యుడు ఏం చెప్తాడో కూడా తెలుసు. ‘పాజిటివ్‌గా ఆలోచించండి... అసూయాద్వేషాలు విడనాడండి’ అనేగా.!

ఆ మాత్రందానికి వైద్యుడు దేనికి? నేను మారాలన్న సంకల్పం, బలంగా ఉంటే నాలో మార్పు రావటం ఎంతసేపు? నాకు నేనే వైద్యుణ్ణి.

ఈ నా అంతర్మథనంతో, నాలో ఏదో పరివర్తన కలుగుతోందనిపిస్తోంది. మంచిగా ఉండటం కోసం నా మనసు పరితపిస్తోందనిపిస్తోంది. నేను మంచి మనిషిగా మారాలి. మారతాను... ఎప్పుడో కాదు, ఇప్పుడే... ఈ క్షణం నుంచే... స్థిరనిశ్చయానికి వచ్చేశాను నేను.

‘నేను ఒక్కడిని మారితే సరిపోతుందా? అవతలివాళ్ళల్లో మార్పు రావొద్దూ’ అంటే... వస్తుంది, మన మంచితనమే మన చుట్టూ ఉన్నవాళ్ళను మంచిగా మారుస్తుంది. ఆ నమ్మకం నాకుంది.

* * *

మా అబ్బాయిని శ్యామల్రావు కొడుక్కి పరిచయం చేసి, సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్‌కి ట్రైనింగ్‌ తీసుకోమన్నాను. ఇద్దరూ కలిసి చదువుకోవటం మొదలుపెట్టారు. ఇద్దరూ మెయిన్స్‌లో పాసయ్యారు.

నాలో మార్పుకు ఇది మొదటి విజయం.

ఫైనల్‌ ఇంటర్వ్యూలో మాత్రం శ్యామల్రావు కొడుకు సెలెక్టయ్యాడు. మావాడు కాలేదు. ఫర్వాలేదు. మరోసారి ప్రయత్నం చేస్తే మావాడు సెలెక్టు కావచ్చు. శ్యామల్రావునీ అతని కొడుకునీ మా ఇంటికి లంచ్‌కి పిల్చి, అభినందించి పంపించాను. ఇదివరకటి అభినందనలకూ ఇప్పటి అభినందనలకూ ఎంతో వ్యత్యాసముంది.

ఇది నిండుమనసుతో చేసిన అభినందన, స్థాయీ భేదం మరచి మనస్ఫూర్తిగా చేసిన అభినందన. మనసులో ఎక్కడా అసూయాద్వేషాలు కానరాని స్వచ్ఛమైన అభినందన. మనసుకెంతో హాయిగా ఉంది.

* * *

ఆఫీసులో మూర్తి సీటు దగ్గరకెళ్ళి ఎదురుగా కూర్చున్నాను. మూర్తి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంతకు ముందెప్పుడూ అతని సీటు దగ్గరకు నేను వెళ్ళటంకానీ, నా సీటు దగ్గరకు అతను రావటంకానీ జరగలేదు.

‘‘ఏం లేదు... మీ దగ్గర కాసేపు కూర్చుని వెళ్దాం అనిపించి వచ్చాను, అంతే’’ అన్నాను.

మూర్తి వెంటనే రెండు కాఫీ తెప్పించాడు. కాఫీ సిప్‌ చేస్తూ ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం.

‘‘అప్పుడప్పుడూ వచ్చి డిస్టర్బ్‌ చేస్తుంటాను, మీరేమీ అనుకోరుగా?’’ అన్నాను.

‘‘భలేవారే... మీరు వస్తే కాస్త నాకూ రిలాక్స్‌ అయినట్లుగా ఉంటుంది, డిస్టర్బెన్స్‌ కాదు’’ అన్నాడు.

అతని మాటల్లోకానీ, నా మాటల్లోకానీ ఎక్కడా వ్యంగ్య ధోరణి లేదు, ద్వందార్థాలు లేవు. ఇద్దరం ఓపెన్‌మైండ్‌తో మాట్లాడుకున్నాం. మామధ్య స్నేహం పెరిగింది.

వాళ్ళింటికి లంచ్‌కి పిలిచాడు మూర్తి. సతీసమేతంగా వెళ్ళాను. అందరం ఎంతో ‘ఫ్రీ’గా మాట్లాడుకున్నాం. మా మనసుల మీద ఇంతకాలం ఉన్న ముసుగులు తొలగిపోయాయి. ఆ తర్వాత వాళ్ళూ మా ఇంటికి లంచ్‌కి వచ్చారు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. ఆఫీసులో ఇదివరకు మా కారణంగా రెండు గ్రూపులుగా విడిపోయిన స్టాఫ్‌ కూడా కలిసిపోయి, ఒకే కుటుంబంలా ఉంటున్నారు. ఇది కూడా నాలో మార్పు తెచ్చిన విజయమే.

ఆరోజు ఆదివారం కావటంతో, కారులో మా సొంతూరు వెళ్ళి తిరిగివస్తూ... దారిలో ఆమధ్య వాళ్ళమ్మాయి పెళ్ళికి పిల్చిన మా బంధువు ఇంటికి వెళ్ళాం. వాళ్ళు ఎంతో మర్యాదగా మాట్లాడారు. భోజనం చేస్తేకానీ వెళ్ళటానికి వీల్లేదని పట్టుబట్టారు. వచ్చేస్తుంటే, నా భార్యకి బొట్టుపెట్టి, చీరా జాకెట్టు పెట్టి ‘అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అంటూ కారుదాకా వచ్చి మాకు వీడ్కోలు పలికారు.

‘వీళ్ళు ఇంత మంచివాళ్ళా!’ అనిపించింది. ఇంతకాలం దూరం నుంచి చూసి ఏదో అపోహలో ఉన్నాను. దగ్గరైతేనే ఆప్యాయతలూ అనుబంధాలూ అర్థమవుతాయని తెలిసొచ్చింది.

ఇప్పుడు నాకు రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపడుతోంది - నిద్రమాత్రలు వేసుకోకుండానే. ఎటువంటి నెగటివ్‌ ఆలోచనలూ ఫీలింగ్సూ లేకపోవటంతో, ఎప్పుడూ

ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. ఏ చీకూ చింతా లేకుండా విహంగంలా వినువీధుల్లో విహరిస్తున్నట్లుంది. చేపపిల్లలా నీటిలో ఈదుతున్నట్లుంది. మయూరంలా పురివిప్పి నాట్యం చేస్తున్నట్లుంది. లేగదూడలా ఛెంగుఛెంగున గెంతులేస్తున్నట్లుంది.

* * *

సెలవురోజు కావటంతో రైతుబజారుకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నాను.

రోడ్డుమీద ఏదో యాక్సిడెంటు అయినట్లుంది. ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కారు పక్కగా ఆపి, యాక్సిడెంట్‌ స్పాట్‌కు వెళ్ళాను.

ఓ ఆటోవాలా- మోటార్‌ బైక్‌ మీద వెళ్తున్న అతడ్ని డాష్‌ ఇచ్చినట్లున్నాడు- రక్తపుమడుగులో అతను కింద పడిపోయున్నాడు. బాగా దగ్గరగా వెళ్ళి చూశాను. వెంటనే అతన్ని గుర్తుపట్టాను. అతను... వినోద్‌. మా అపార్ట్‌మెంటులోనే అద్దెకుంటూ సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయినతనే. నేను గృహప్రవేశానికి కూడా వెళ్ళాను.

ఎవరో మహానుభావుడు... తన కారులో అతన్ని ఎక్కించుకుని తీసుకువెళ్తున్నాడు. ట్రాఫిక్‌ క్లియర్‌ కావటంతో, నేనూ నా కారు తీసి అతన్ని ఫాలో అయ్యాను.

అతని కారు ఓ ఆస్పత్రి ముందు ఆగింది.

హాస్పిటల్‌ స్టాఫ్‌ వచ్చి, స్ట్రెచర్‌ మీద గాయపడిన అతన్ని పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్ళారు.

నేనూ కారు దిగి హాస్పిటల్‌ లోపలికి వెళ్ళాను. రిసెప్షన్‌ దగ్గర వెయిట్‌ చేస్తున్నాను.

కాసేపట్లోనే అతని భార్యా, బావమరిదీ వచ్చారు. నన్ను గుర్తుపట్టారు. కంగారుపడుతూ లోపలికి వెళ్ళారు.

నేను ఆత్రుతతో రిసెప్షన్‌ దగ్గరే వేచి చూస్తున్నాను.

‘అయ్యో పాపం! మంచి మనిషికి ఇలా అయిందేమిటి? భగవంతుడా... అతన్ని కాపాడు తండ్రీ...’ అని మనసులోనే వేడుకున్నాను. అతనికేమీ ప్రమాదం జరగకుండా ఉండాలని కోరుకుంటూ బాబా గుళ్ళొ ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు భరిస్తానని మొక్కున్నాను.

అరగంట తర్వాత వినోద్‌ బావమరిది నా దగ్గరకు వచ్చి ‘‘బావకు అర్జంటుగా ఆపరేషన్‌ చేయాలట. బ్లడ్‌ అవసరం అట. మా బ్లడ్‌గ్రూప్‌ బావ బ్లడ్‌గ్రూప్‌తో మ్యాచ్‌ అవలేదట. ఎవరైనా బ్లడ్‌ ఇస్తారేమో కనుక్కోమన్నారు’’ అన్నాడు.

‘‘నేను బ్లడ్‌ ఇవ్వడానికి సిద్ధమే... నా బ్లడ్‌గ్రూప్‌ టెస్ట్‌ చేయమనండి’’ అన్నాను.

‘‘అయితే రండి’’ అంటూ తనతోపాటు లోపలికి తీసుకువెళ్ళాడు.

థాంక్‌ గాడ్‌! నాదీ వినోద్‌దీ బ్లడ్‌గ్రూప్‌ ఒక్కటే!

అంతే... నేను బ్లడ్‌ ఇవ్వటం, వినోద్‌ ఆపరేషన్‌ విజయవంతంగా జరగటం... నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

వినోద్‌ ప్రమాదం నుంచి బయటపడ్డందుకు దేవుడికి మనసులోనే నమస్కరించాను.

వినోద్‌ భార్యా, బావమరిదీ ఆ తర్వాత వచ్చిన అతని బంధుమిత్రులూ నాకు కృతజ్ఞతలు చెప్తుంటే, నేనూ - నాకు మంచి బుద్ధినిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

అందరిపట్లా మంచిగా ఉండాలనీ, పాజిటివ్‌ దృక్పథంతో ఉండాలనీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తరుణంలో, నా బ్లడ్‌గ్రూప్‌ ‘బి-పాజిటివ్‌’ అవటం కేవలం యాదృచ్ఛికమే అయినా, నాలోని అణువణువూ ‘పాజిటివ్‌ వైబ్రేషన్స్‌’నే ప్రసరిస్తున్నాయనేదానికి ఇదే నిదర్శనం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.