close
ఆ రోజు చనిపోతాననే అనుకున్నా!

ఆ రోజు చనిపోతాననే అనుకున్నా!

చావుతో చెలగాటం అతడి వృత్తిలో భాగం. గాయాలతో సావాసం బతుకు తెరువుకి అతడెంచుకున్న మార్గం. పీటర్‌ హీన్‌... దక్షిణాది సినీపరిశ్రమల్లో ఉత్తమ ఫైట్‌ మాస్టర్లలో ఒకడు. ఒంటినిండా ఫ్రాక్చర్లతో ఎన్నోసార్లు సెట్లో అడుగుపెట్టాడు. స్టంట్‌ మేన్‌గా మృత్యువుని చాలా దగ్గరగా చూశాడు. ‘బాహుబలి’, ‘మగధీర’, ‘రోబో’, ‘ఛత్రపతి’, ‘అతడు’, ‘అపరిచితుడు’... పీటర్‌ పనిచేసిన సినిమాల్లో మచ్చుకు ఇవి కొన్ని. మనిషిని చూడగానే రంగురంగుల జుట్టూ, స్టైలిష్‌ లుక్‌తో ఒంటినిండా ఉత్సాహం... కానీ ఆ రూపం వెనక బయటికి తెలీని విషాదం చాలా ఉంది.

ఫైట్‌ మాస్టర్లు అనగానే గాల్లో తాళ్లు కట్టేసి, డూపులను పెట్టేసి, గ్రాఫిక్స్‌తో కనికట్టు చేసి నమ్మశక్యంకాని పోరాటాలను తెరపైన చూపిస్తారనుకుంటారు. కానీ ఒక పోరాటం సహజంగా రావడం కోసం స్టంట్‌ కొరియోగ్రాఫర్లు ఎంత రిస్కు చేస్తారో, ఎన్నిసార్లు గాయాలను భరిస్తూ ఫైట్లను రూపొందిస్తారో బయటివాళ్లకు తెలీదు. నిత్యం సాహసాలూ, అపాయాలతో ముడిపడ్డ ఈ రంగంలోకి రావాలనీ, వస్తాననీ నేనెప్పుడూ అనుకోలేదు. బతకడానికి వేరే ఏం చేయాలో తెలీక అనుకోకుండా ఈవైపు అడుగేశా. మా అమ్మా వాళ్లది వియత్నాం. నాన్న తమిళియన్‌. నేను పుట్టిపెరిగింది చెన్నైలోని వడపళని అనే ప్రాంతంలో. నాన్న సినిమాల్లో స్టంట్‌మేన్‌గా పనిచేస్తూ నిత్యం గాయాలపాలయ్యేవారు. అంత కష్టపడ్డా ఆదాయం అంతంతమాత్రమే. నాన్నకు సాయంగా ఉండేందుకు అమ్మ బ్యుటీషియన్‌గా పనిచేసేది. అలా ఇద్దరు సంపాదిస్తున్నా, ఓ చిన్న ఇంట్లో అక్కా, చెల్లీ, నానమ్మా, నేనూ... ఇంతమంది ఉండటంతో కష్టంగానే రోజులు గడిచేవి. చాలాసార్లు తిండికి ఇబ్బందై గంజితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఆదివారం పూట రెండు కోడిగుడ్లతో కూర చేస్తే తలా ఓ ముక్క తినేవాళ్లం.

పావలా కోసం పని
బతకడానికే కష్టపడే రోజుల్లో మమ్మల్ని చదివించే పరిస్థితి ఇంట్లో లేదు. నా అంతట నేనే సొంతంగా చదవడం, రాయడం సాధన చేసేవాణ్ణి. అలాంటి సమయంలో ఓసారి నాకేదో ఆరోగ్య సమస్య వస్తే రోజూ ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూపించుకొని రావాల్సివచ్చింది. బస్సుకి కూడా డబ్బుల్లేక ఉదయాన్నే నీళ్లు తాగి, అంతదూరం నడిచివెళ్లి వచ్చేవాణ్ణి. ఓసారి ఇంటి ముందు ఆడుకుంటుంటే పక్కనే ఉండే టీ కొట్టు యజమాని పిలిచి ఓ రెండు బిందెల నీళ్లు తీసుకొస్తే పావలా ఇస్తానన్నాడు. అప్పుడే ఓ ఆలోచన వచ్చి వెంటనే మా వీధిలో ఎవరికి నీళ్లు కావాలన్నా పావలా ఇస్తే తీసుకొస్తానని చెప్పా. అలా సైకిల్‌ మీద నాలుగైదు బిందెల నీళ్లు తెచ్చి చేతి ఖర్చులకు సంపాదించుకునేవాణ్ణి. ఆ పైన వెల్డర్‌గా, మెకానిక్‌గా, సర్వర్‌గా చిన్నచిన్న పనులు చేస్తూ కాలం గడిపా. ఈ పనులన్నీ చేస్తూనే నాన్న దగ్గర మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టా. కొన్ని రోజుల తరవాత ఆయన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నా.

చైనావాడిలా ఉంటానని...
ఓసారి నాన్న పనిచేస్తోన్న ఓ తమిళ సినిమా కోసం చైనావాళ్లలా ఉండే స్టంట్‌మేన్‌ కోసం చూస్తున్నారని తెలిసింది. నేను చూడ్డానికి అలానే ఉంటా కాబట్టి నన్ను తీసుకెళ్లారు. అప్పటివరకూ సినిమాలకు సంబంధించిన ఆలోచనలు లేవు. ఆ రంగంలో ఉండే కష్టాలేంటో తెలుసు కాబట్టి నాన్న కూడా ఎప్పుడూ ప్రోత్సహించలేదు. కానీ వేరే పనేదీ పెద్దగా తెలీకపోవడం, ఆ అవకాశం వెతుక్కుంటూ రావడంతో నన్ను నేను నిరూపించుకొని సినిమాల్లోనే స్థిరపడాలని గట్టిగా నిర్ణయించుకున్నా. అనుకున్నట్లే నేను చేసిన స్టంట్లకు మంచి పేరొచ్చింది. దాంతో స్టంట్‌ మేన్‌ల యూనియన్‌లో సభ్యత్వం తీసుకొని వచ్చిన సినిమాల్లో మాస్టర్లు చెప్పిందే కాకుండా, నా శక్తిమేరకు ఫైట్లను ఇంకాస్త భిన్నంగా చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. ఆ చొరవే నచ్చి కొన్నాళ్లకు ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ కనల్‌ కణ్ణన్‌ నన్ను అసిస్టెంట్‌గా తీసుకున్నారు. సినిమా పోరాటాలు ఎలా రూపొందించాలో, అవి కొత్తగా సహజంగా కనిపించేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆపైన కొన్నాళ్లు విజయన్‌ మాస్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేశా. అప్పటికే డూపుగా, స్టంట్‌మేన్‌గా చేసేప్పుడు ఎన్నోసార్లు ప్రమాదాల్లో ఎముకలు విరిగాయి. దాంతో నా దూకుడు కాస్త తగ్గించడానికి మా నాన్న పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు.

అందంగా ఉండనేమోనని...
అప్పట్లో నేను చూడ్డానికి బావుండననీ, నన్నెవరూ ఇష్టపడరన్న ఆత్మన్యూనతతో ఉండేవాణ్ణి. దాంతో ఎవరైనా వికలాంగురాలినే పెళ్లి చేసుకుంటానని నాన్నతో చెప్పా. కానీ ఇంట్లో దానికి ఎంతకూ ఒప్పుకోకపోవడంతో కనీసం పేదింటి అమ్మాయినైనా చూడమని చెప్పా. ఆ క్రమంలోనే ఓ సినిమాకు పనిచేసేప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతణ్ణి ఏదో పనిమీద ఇంటికి తీసుకెళ్లా. అమ్మావాళ్లు ఆ కుర్రాడి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాక వాళ్ల కుటుంబానికీ మాకూ ఎంత సారూప్యత ఉందో అర్థమైంది. వాళ్ల నాన్న భారతీయుడైనా, ఉపాధి వెతుక్కుంటూ వియత్నాం వెళ్లి అక్కడమ్మాయినే పెళ్లి చేసుకుని తమిళనాడులో స్థిరపడ్డాడు. ఆ అబ్బాయికి ఓ చెల్లి కూడా ఉండటంతో ఆ అమ్మాయిని ఓసారి చూసి నచ్చితే సంబంధం మాట్లాడతామని అమ్మ చెప్పింది. దాంతో ఓరోజు రాత్రి బండిమీద బయల్దేరి తెల్లారేసరికి దాదాపు నాలుగొందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల వూరికి వెళ్లా. తెల్లవారుజామున ఇంటిముందు ముగ్గేస్తూ కనిపించిన ఆ అమ్మాయి చూడగానే నచ్చేసింది. కానీ నేను ఆర్థికంగా ఇంకాస్త స్థిరపడ్డాకే పెళ్లిచేసుకుంటానని చెప్పా. ఆమె కూడా సరేననడంతో కొన్నాళ్ల తరవాత పార్వతీ, నేనూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యాం.

ప్రాణాలకు తెగించా
మా పెళ్లయిన రెండేళ్ల తరవాత శంకర్‌ తీసిన ‘ఒకేఒక్కడు’ సినిమాలో అర్జున్‌కు డూప్‌గా నటించా. అందులో ఒంటినిండా నిప్పంటించుకొని నగ్నంగా పరుగెత్తే సన్నివేశం ఒకటుంది. వీపుమీద జెల్‌ రాసుకొని పెట్రోల్‌ పోయమన్నాను. వాళ్లు మంట అంటించగానే నేను పరుగెత్తుకుంటూ వెళ్లి ఓ పెట్టెలో దూకాలి. అనుకున్నట్లే చేసినా ఆ షాట్‌ నాకెందుకో సరిగ్గా రాలేదనిపించింది. మళ్లీ ఓసారి చేస్తానని చెప్పా. శంకర్‌, కనల్‌ కణ్ణన్‌ లాంటి వాళ్లంతా అప్పటికే ఎక్కువ రిస్కు చేశాననీ, వద్దనీ వారించారు. కానీ అన్నం పెడుతున్న వృత్తి విషయంలో రాజీపడటం నాకిష్టం లేదు. అందుకే మళ్లీ చేస్తానని కచ్చితంగా చెప్పడంతో మరుసటి రోజు ఆర్థరాత్రి రెండింటికి ఆ సన్నివేశాన్ని తీయాలనుకున్నారు. అప్పుడే నాకెందుకో కాస్త భయం మొదలైంది. అప్పటికి మా అబ్బాయి వయసు ఆర్నెల్లు. ఓసారి వాడిని చూసొద్దామనిపించి ఇంటికి బయల్దేరా. మరుసటిరోజు షూటింగ్‌కి వెళ్తే మళ్లీ తిరిగి రాననీ, ఒంటి మీద పెట్రోలు మంటలు కాస్త అదుపు తప్పినా చనిపోవడం ఖాయమనీ అనుకున్నా. నా భయం ఇంట్లో వాళ్లకు కనిపించకుండా బాత్రూంలో కూర్చొని తనివితీరా ఏడ్చేశా. బయల్దేరేముందు నా బిడ్డని ఆఖరిసారి చూస్తున్న భావనే కలిగింది. నా భార్య కళ్లలోకి నేరుగా చూడలేక ఇంట్లోంచి వెళ్లకముందే హెల్మెట్‌ పెట్టుకున్నా. వెళ్తూ వెళ్తూ నేను తిరిగిరాకపోయినా బతికే ధైర్యాన్ని వాళ్లకు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించా. ఆ సీన్‌ మొదలుపెట్టినప్పుడు వీపుకు మంటలు అంటుకొని, వాటిని ఆర్పే క్రమంలో చర్మం వూడొచ్చింది. దానిపైన పాన్‌కేక్‌తో మేకప్‌ వేసి మళ్లీ ఆ సన్నివేశాన్ని పూర్తిచేసి అదృష్టం కొద్దీ బయటపడ్డా. కాలిన గాయాలు కనిపిస్తాయని దాదాపు రెండు వారాలు ఇంటికెళ్లలేదు. అప్పట్నుంచీ నా కుటుంబం కోసమైనా ప్రాణాలమీదకొచ్చే స్టంట్లకు కాస్త దూరంగా ఉందామని నిర్ణయించుకున్నా.

మగధీరకి 19 ఫ్రాక్చర్లు
అలా సినిమాలకు స్టంట్‌మేన్‌గా, ఫైట్‌ మాస్టర్లకు అసిస్టెంట్‌గా నేను చూపించే చొరవ దర్శకుడు కృష్ణవంశీగారికి బాగా నచ్చింది. సొంతంగా పోరాటాలను రూపొందించే శక్తి నాకుందని నమ్మి ‘మురారి’ సినిమాకు ఫైట్‌ మాస్టర్‌గా తొలి అవకాశాన్నిచ్చారు. మరోపక్క అదే సమయంలో తమిళంలో గౌతమ్‌ మీనన్‌ తొలి సినిమా ‘మిన్నలే’(చెలి)కి పనిచేసే అవకాశం కూడా వచ్చింది. అలా ఒకే ఏడాదిలో రెండు భాషల్లోనూ కొత్త కెరీర్‌ మొదలైంది. ఆ తరవాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళంలోనూ వరస అవకాశాలొచ్చాయి. ‘వర్షం’, ‘ఘర్షణ’, ‘అపరిచితుడు’, ‘ఛత్రపతి’, ‘అంజి’ ‘గజిని’ లాంటి యాక్షన్‌ ప్రధాన చిత్రాల్లో కంపోజ్‌ చేసిన ఫైట్లకు మంచి గుర్తింపొచ్చింది. ఆ క్రమంలోనే రామ్‌గోపాల్‌వర్మ ‘జేమ్స్‌’ సినిమాతో తొలిసారి బాలీవుడ్‌కి నన్ను పరిచయం చేశారు. ఆ పైన ‘రావణ్‌’, ‘ఏక్‌’, ‘రేస్‌2’ ‘ఏజెంట్‌ వినోద్‌’ లాంటి సినిమాలకు పనిచేశా. ఆ ప్రయాణంలో నా శరీరానికైన గాయాలకైతే లెక్కేలేదు. మూడుసార్లు వెన్నెముకకు దెబ్బతగిలింది. ఇరవయ్యేడు ఫ్రాక్చర్లయ్యాయి. ‘మగధీర’ సినిమాకోసం బైకు రేసు సన్నివేశం తీస్తుంటే నా నడుముకి ఉన్న తాడు జారిపోయి దాదాపు నలభై అడుగుల పైనుంచి కింద పడ్డా. మొహం, కాళ్లూ, చేతులకు కలిపి పందొమ్మిది చోట్ల ఎముకలు విరిగాయి. నాకు జరిగిన ప్రమాదం కంటే నేను పనిచేయడానికి కమిట్‌మెంట్‌ ఇచ్చిన ‘రోబో’, ‘రావణ్‌’ సినిమాలు నా వల్ల ఆలస్యమవుతాయన్న ఆలోచనే ఎక్కువ బాధపెట్టింది. శంకర్‌, మణిరత్నం... ఇద్దరూ వాటి గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అంత డబ్బుకీ, ప్రముఖుల సమయానికీ నా వల్ల నష్టం జరగకూడదని, ప్రమాదం జరిగిన పదకొండో రోజునే వీల్‌ ఛెయిర్‌లో లొకేషన్‌కి వెళ్లి ‘రోబో’లో యాక్షన్‌ సన్నివేశాలను రూపొందించడం మొదలుపెట్టా.

కొన్ని సినిమాల కోసం ఎంత రిస్కు చేసినా తప్పులేదనిపిస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకటి ‘బాహుబలి’. నా మీద నమ్మకంతో రాజమౌళి అంత భారీ సినిమాకు నాకు అవకాశమిచ్చారు. శక్తివంచన లేకుండా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించా. చాలామందిలానే నా జీవితానికి ఆ సినిమా పెద్ద మైలురాయి. ప్రస్తుతం మురుగదాస్‌-మహేష్‌ల కలయికలో వస్తున్న సినిమాకి పనిచేస్తున్నా. తరవాత నా సొంత దర్శకత్వంలో వియత్నమీస్‌ భాషలో ఓ సినిమా తీయబోతున్నా. పావలా కోసం పనిచేసిన దశ నుంచి వచ్చి నేడు దేశంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే ఫైట్‌మాస్టర్లలో ఒకడిగా ఎదిగా. నాకు చెప్పిన పని మాత్రమే చేసుకొని పోయుంటే ఓ సాధారణ స్టంట్‌మేన్‌లానే మిగిలిపోయేవాణ్ణి. కానీ ఎంచుకున్న వృత్తిమీద ప్రేమ పెంచుకొని, చేసే పనిలో ప్రతిసారీ నా ముద్ర కనిపించాలని రిస్కు తీసుకున్నా కాబట్టే ఈ స్థాయికి వచ్చానన్నది నా నమ్మకం. అలా తమ రంగాల్లో పరిధులు పెట్టుకోకుండా పనిచేసినవాళ్లంతా హద్దులు లేకుండా ఎదుగుతారు. జీవితంలో ఎప్పటికీ ఫైటర్లుగానే ఉంటారు. నా జీవితమే అందుకు ఉదాహరణ.


పాతికశాతం సేవకే!

నేను నా బాల్యంలో చాలా ఆనందాల్ని కోల్పోయాను. అందుకే మా పాపా, బాబుతో వీలైనంత సమయం గడుపుతూ వాళ్లలో నన్ను చూసుకునే ప్రయత్నం చేస్తా.

* నా సంపాదనలో పాతిక శాతం వృద్ధాశ్రమాలకే వెళ్తుంది. మా నానమ్మ మంచమ్మీద ఉన్నప్పుడు మూడేళ్లపాటు తనకు సేవ చేశా. ఆశ్రమాల్లో అలాంటివాళ్లే ఉంటారు కాబట్టి వాళ్లకు సాయం చేస్తూ సంతృప్తి పొందుతున్నా.

* నా పోరాటాల్లానే నా ఆహార్యం కూడా కొత్తగా ఉండటమే నాకిష్టం. అందుకే ఎప్పుడూ రంగురంగుల దుస్తుల్లో, రకరకాల హెయిర్‌ స్టయిల్స్‌తో, కళ్లద్దాలతో కాస్త భిన్నంగా కనిపిస్తా.

* ఒకసారి షూటింగ్‌లో గాయమై తలలో రక్తం గడ్డ కట్టింది. కొన్ని రోజుల పాటు ఒక చేయీ, కాలూ పనిచేయలేదు. పక్షవాతం వచ్చింది, కోలుకోవడం కష్టమని డాక్టర్లు చెప్పారు. అదృష్టం కొద్దీ మామూలు మనిషినయ్యా. అందుకే ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని పిల్లలు చెబుతుంటారు.

* సరైన భోజనం లేకుండా చాలా ఏళ్లు బతికా. ఇప్పుడు కోటీ డెబ్భై లక్షలు పెట్టి ఆడి కారు కొనుక్కున్నా. సంపదతో పాటు పేదరికాన్నీ సమానంగా అనుభవించా కాబట్టి డబ్బు వచ్చినా, పోయినా ఒకలానే ఉంటా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.