close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దిల్లీ గల్లీల్లో... మహిళా పంచాయతీ!

బుధవారం.
మధ్యాహ్నం పన్నెండు గంటలు.
దిల్లీ మహానగరంలోని మురికివాడ.
అప్పటికే ఓ యాభైమంది మహిళలు అక్కడికి చేరుకున్నారు. కొందరు నడివయసులో ఉన్నారు. కొందరికి ముప్పై లోపే ఉండవచ్చు. ఒకరిద్దరు హైస్కూలు దాకా చదువుకున్నారు. అక్షరజ్ఞానం లేనివాళ్లే అధికం.
దక్షిణ్‌పురి ప్రాంతం నుంచి వచ్చిందో గృహిణి. ఆమెది ప్రేమ వివాహం. మొదట్లో మొగుడు బాగానే చూసుకున్నాడు. మోజుతీరిపోగానే ముసుగు తొలగిపోయింది. అసలురూపం బయటపడింది. వికృతత్వపు విశ్వరూపమది. అతడో అనుమానపు పిశాచం. పసివాళ్లతో మాట్లాడినా సంబంధం అంటగట్టేస్తాడు. గొడ్డును బాదినట్టు బాదేస్తాడు. ఆ యువతి ఒంటినిండా గాయాలే. ఎంత దాచుకున్నా చిరుగుల చీర మాటున ఆ గుర్తులు కనిపిస్తూనే ఉంటాయి. ‘నాకేం పెద్దపెద్ద కోరికల్లేవు. మొగుడు నెత్తిన పెట్టుకుంటాడన్న ఆశా లేదు. కష్టాల్ని భరిస్తూనే పదిహేనేళ్లు కాపురం చేశాను. ఈ వయసులో విడాకులు తీసుకుని ఎక్కడికెళ్తాను? చచ్చేవరకూ ఆ ఇంట్లోనే పడుంటాను. నన్ను మనిషిగా చూస్తే చాలు’ అని నిర్లిప్తంగా చెబుతుందా నడివయసు మహిళ.

 
సంపన్నుల కాలనీలో అంట్లు తోముకుని బతికే యువతి కథ ఇంకోలా ఉంది. అతడితో సహజీవనం అసాధ్యమని, మూడుముళ్లూ పడిన మూడోరోజే తేలిపోయింది. ఆ దుర్మార్గుడికి లేని దురలవాటంటూ లేదు. ఓరోజు ఏకంగా ఎవర్నో ఇంటికే తీసుకొచ్చేశాడు. ఇక, ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. బట్టలు సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. బిడ్డకొచ్చిన కష్టం తెలిసి అమ్మానాన్నా బాధపడ్డారు. గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వారంరోజులు గడిచిపోయాయి. ఎనిమిదో రోజు ‘పదమ్మా! మీ ఆయన దగ్గర వదిలిపెట్టి వస్తాను...’ అంటూ తండ్రి నర్మగర్భంగా మనసులోని మాట చెప్పాడు. పుట్టిపెరిగిన గడపకే తానిప్పుడో అతిథి. ఆ విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ‘నీకు పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది. నువ్వు ఇక్కడే ఉంటే, దానికి సంబంధాలెలా వస్తాయి...’ మాట పూర్తికాకముందే వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది కన్నతల్లి. తండ్రి పరోక్షంగా హెచ్చరించాడు. తల్లి కన్నీళ్లతో మొరపెట్టుకుంది. ఇద్దరూ చెప్పాలనుకున్న విషయం ఒకటే. మారు మాట్లాడకుండా బయల్దేరింది. అప్పటి నుంచీ ఆమె జీవితంలో హింస భాగమైపోయింది. ఓ రోజు ఆ వ్యసనపరుడు ఒంటిమీద కిరోసిన్‌ పోసి తగులబెట్టబోయాడు. ప్రాణభయంతో హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసింది. పోలీసులైతే వచ్చారు కానీ, కేసు నమోదు చేయలేదు. మగదిక్కులేని బతుకెంత దుర్భరమో వివరించారు. సతీసావిత్రి కథలు చెప్పి తిరిగివెళ్లారు. ‘నన్ను కొట్టనీ తిట్టనీ. బతకనిస్తే చాలనుకున్నా. కానీ చంపేదాకా వదిలిపెట్టేలా లేడు’ అని గోడు వెళ్లబోసుకుంటుందా శోకమూర్తి.
ఎనిమిది నెలల గర్భిణి భారంగా అడుగులేస్తూ అంతదూరం వచ్చింది. ఆమె భర్త శాడిస్టులా ప్రవర్తిస్తున్నాడు. కడుపునిండా తిండి పెట్టడు. తింటుంటే పళ్లెం లాగేసుకుంటాడు. జ్వరంతో ఒళ్లు కాలిపోతున్నా డాక్టరు దగ్గరికి తీసుకెళ్లడు. ‘గుండ్రాయిలా ఉన్నావ్‌, నీకేం రోగం’ అంటూ వెకిలిగా నవ్వేస్తాడు. ఓసారి పొట్టమీద పిడిగుద్దులు గుద్దబోయాడు. కాళ్లమీద పడి బతిమాలితే కాస్త కనికరించాడు. తను ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మొదట్లో అర్థమయ్యేది కాదు. మొత్తానికి, ఆ మూర్ఖుడి మనసు గ్రహించింది. తన భార్య కడుపులో ఉన్నది ఆడపిల్లే అని నిర్ధారణకు వచ్చేశాడు. జోతిష్కుడూ ఆ మాటే చెప్పాడట. పెద్ద ప్రాణానికి అన్నంపెట్టకుండా మాడ్చేస్తే, చిన్నప్రాణి ఆకలితో చచ్చిపోతుందన్న దుర్మార్గపు ఆలోచన వచ్చింది. ఆ కుట్రనే అమలు చేస్తున్నాడిప్పుడు. ‘బిడ్డ భూమ్మీద పడేవరకూ నన్ను బతకనిస్తే చాలు. ఆతర్వాత, దేవుడున్నాడు’ అని ప్రాధేయపడుతుందా నిండుచూలాలు.
పక్కింటి పెద్దాయన తన కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడని ఓ తల్లీ, అత్తింటివాళ్లు అదనపు కట్నం కోసం తన చెల్లికి నరకం చూపిస్తున్నారని ఓ అక్కా, మొగుడు విడాకులు కావాలని పోరుతున్నాడని ఓ ఇల్లాలూ ...ఇలా సాంత్వన కోసమూ, పరిష్కారం కోసమూ ప్రతి బుధవారం చాలా మంది అక్కడికి వస్తుంటారు. కొన్నిసార్లు, ఆ గది ఉద్వేగాలతో వేడెక్కిపోతుంది. కన్నీళ్లతో తడిసి ముద్దవుతుంది. వెక్కిళ్ల చప్పుళ్లు నాలుగు గోడల్లో ప్రతిధ్వనిస్తాయి. సాయంత్రం తిరిగివెళ్తున్న సమయానికి మాత్రం...నిన్నటిదాకా లేని ఆత్మవిశ్వాసం, మునుపెన్నడూ కనిపించని ఆశావాదం. మహిళా పంచాయతీ పంచి ఇచ్చిన మనోబలమది.

 
సంపన్న మహిళలకు కోర్టు దాకా వెళ్లే స్తోమత ఉంటుంది. విద్యాధికులైన యువతులకు పోరాట మార్గాలు తెలిసుంటాయి. దిగువ మధ్యతరగతి జీవితాలకు ఆ రెండూ ఉండవు. చుట్టుపక్కల కూడా బుర్రనిండా అజ్ఞానాన్ని నింపుకున్న మనుషులే. తప్పెవరిదైనా, చూపుడువేళ్లు ఆమెనే చూపిస్తాయి. హింసను నిశ్శబ్దంగా భరించాలి, వివక్షను మౌనంగా ఆమోదించాలి. నోరెత్తితే తప్పు. కాదంటే పాపం. లేదంటే ఘోరం. మురికివాడ మహిళల పరిస్థితి చాలా దుర్భరం. ఆ సమయంలో ఒంటరి స్త్రీలకు ఎవరో ఒకరి ఆసరా కావాలి! ఏదో ఓ వ్యవస్థ ‘మేమున్నాం ...’ అని ధైర్యం చెప్పాలి. దిల్లీ నగరానికి సంబంధించినంత వరకూ ఆబాధ్యతను మహిళా పంచాయతీలు తీసుకున్నాయి. ఆ ప్రయత్నంలో ‘సామాజిక ఒత్తిడి’ని ఓ మార్గంగా ఎంచుకున్నాయి. స్త్రీల సమస్యల మీద ఎంత అవగాహనైనా ఉండవచ్చు, ఎంత పెద్ద చదువులైనా చదువుకుని ఉండవచ్చు, అట్టడుగు జీవితాల పట్ల బోలెడంత సానుభూతీ ఉండవచ్చు. అయినా సరే, సంపన్న యువతో ఎగువ మధ్యతరగతి విద్యాధికురాలో మురికివాడ మహిళను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు పుట్టిపెరిగిన వాతావరణం వేరు. సమస్యల్ని చూసే కోణం వేరు. ఒక మురికివాడ మహిళకు మరో మురికివాడ మహిళ నుంచే సరైన మద్దతు లభిస్తుంది, ఆమోదయోగ్యమైన పరిష్కారం అందుతుంది. ఈ మూలసూత్రంమీదే పంచాయతీలు పనిచేస్తాయి.
హింస నుంచి విముక్తి

 
దేశ రాజధానిలో అరవై దాకా మహిళా పంచాయతీలు చురుగ్గా పనిచేస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యవస్థను మహానగరంలోని అన్ని నియోజకవర్గాలకూ విస్తరించాలని దిల్లీ మహిళా కమిషన్‌ నిర్ణయించింది. దీంతో పంచాయతీలకు కొత్త చైతన్యం వస్తోంది. ప్రస్తుతం ‘యాక్షన్‌ ఇండియా’ సహా దాదాపు ముప్పై నాలుగు ప్రభుత్వేతర సంస్థలు వీటిని సమర్థంగా నిర్వహిస్తున్నాయి. మహిళా పంచాయతీలకు ఓ నిర్మాణం అంటూ ఉంటుంది. ప్రతి పంచాయతీలో ఇరవైమంది దాకా సభ్యులు ఉంటారు. వీళ్లంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నేపథ్యాల నుంచి వచ్చినవారే. పదోతరగతి కనీస విద్యార్హత. స్పందించే హృదయం తప్పనిసరి. ఈ స్వచ్ఛంద కార్యకర్తలకు చట్టపరమైన విషయాల్లో, వివాద పరిష్కారాల్లో, మహిళా హక్కుల్లో ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. కౌన్సెలింగ్‌ నిర్వహణలో మెలకువలు నేర్పుతారు. కష్టాల్లో ఉన్న మహిళకు ధైర్యం చెప్పడానికైనా, దిశానిర్దేశం చేయడానికైనా ఆ మాత్రం పరిజ్ఞానం సరిపోతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో కనిపించే గంభీర వాతావరణం ఉండదిక్కడ. గదినిండా చాపలు పరచి ఉంటాయి. మధ్యలో పంచాయతీ సభ్యులుంటారు. చుట్టూ బాధితులు కూర్చుంటారు. ఏ ఆత్మీయుల మధ్యో ఉన్న భావన కలుగుతుంది. కాబట్టే, ఆ నిరక్షరాస్య మహిళలు అంత ధైర్యంగా మాట్లాడతారు, నిర్భయంగా తమ బాధల్ని పంచుకుంటారు.
పంచాయతీల సహకారం మూడు వైపుల నుంచీ ఉంటుంది.
ఒకటి... ఉద్వేగపరమైన ఆసరా.
నిన్నమొన్నటిదాకా, గుండె లోతుల్లోని భావాల్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఇక ఆ భయం అక్కర్లేదు. బాధ, కష్టం, అవమానం, హింస, అనుమానం...మనసులోని ఉద్వేగాల్ని నిస్సంకోచంగా పంచుకోవచ్చు.
రెండు... సామాజిక మద్దతు.
పురుషాధిక్యానికి వ్యతిరేకంగా పోరాడే మహిళ ఎప్పుడూ ఒంటరే. సమాజమంతా ఒకవైపూ ఆమె మాత్రం మరోవైపూ. ఇరుగూపొరుగూ వెలేసినట్టు చూస్తారు. బంధువులు తలతిప్పుకుంటారు. పుట్టింటివారి పరిమితులు పుట్టింటివారికుంటాయి. పంచాయతీల పుణ్యమాని, ఆ ఏకాకితనం పారిపోతుంది. అనేక గొంతుకలు మద్దతు పలుకుతాయి. ఎన్నో చేతులు కన్నీళ్లు తుడుస్తాయి. ఆ సాంత్వనతో కొత్త బలమేదో వచ్చినట్టు అనిపిస్తుంది. సవాలక్ష సవాళ్లను తట్టుకోగలిగిన సత్తువ వస్తుంది.
మూడు... న్యాయ సహాయం.

చట్టమంటే సంపన్నుల చుట్టమనో, పోలీసుల బెత్తమనో భయపడిపోతున్న ఆ మహిళకు...నువ్వూ మనిషివే, నీ కంటూ కొన్ని హక్కులున్నాయి. నీకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి అనేక వ్యవస్థలున్నాయి- అని అర్థమయ్యేలా చెప్పగలిగితే, ఆమె మౌనాన్ని వీడుతుంది, నిర్లిప్తతను వదిలిపెడుతుంది, అభద్రతను అధిగమిస్తుంది, పోరాటానికి సిద్ధం అవుతుంది. పంచాయతీల్లోని సుశిక్షిత కౌన్సెలర్లు ఆ ధైర్యాన్నిస్తారు.


నమోదు నుంచి ....
ఆ ప్రాంత పరిధిలో నివసిస్తున్న ఏ మహిళ నుంచి ఫిర్యాదు అందినా, పంచాయతీ వెంటనే నమోదు చేసుకుంటుంది. విచారణ తేదీని నిర్ణయిస్తుంది. ‘ఫలానా రోజున, ఫలానా సమయానికి పంచాయతీ ముందు హాజరు కావాలి’ అని ఇరు పక్షాలకూ వర్తమానం పంపుతుంది. ఎవరికివారు మద్దతుగా బంధుమిత్రుల్ని తీసుకొస్తారు. చర్చోపచర్చలూ వాదోపవాదాలూ జరుగుతాయి. ఎవరి కోణంలోంచి వాళ్లు సమస్యను వివరిస్తారు. ఇరుపక్షాల వాదనల్నీ విన్నాక, పంచాయతీ ఓ తీర్మానానికి వస్తుంది. నూటికి తొంభై తొమ్మిది వివాదాల్లో తప్పు పురుషుడిదే. పంచాయతీ నిందితుల్ని అందరిముందూ నిలబెడుతుంది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని నిలదీస్తుంది. పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో హెచ్చరిస్తుంది. పరిస్థితులు చేయిదాటితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని కళ్లెర్రజేస్తుంది. ‘నేను పురుషుడిని. నా మాటకు ఎదురులేదు. నన్నెవరూ ఏమీ చేయలేరు’ అన్న అహంభావమే మగాడిని మృగాన్ని చేస్తుంది. ప్రశ్నించడానికి ఓ వ్యవస్థంటూ ఉందని తెలియగానే అతడిలోని రాక్షసుడు తోక ముడుచుకుంటాడు. అయినా దారికి రానివారి విషయంలో కఠిన చట్టాల్ని ప్రయోగిస్తారు. విషయం అరెస్టుల దాకా వెళ్లగానే.... ‘జాగ్రత్తగా ఏలుకుంటాం, తప్పయిపోయింది’ అంటూ కాళ్లబేరానికి వచ్చేవారూ ఉంటారు.
ఒత్తిడే ఆయుధం
పంచాయతీ తీర్పులకు చట్టబద్ధత లేకపోయినా, నైతిక బద్ధత ఉంటుంది. తీర్మానానికి కట్టుబడని వ్యక్తుల్ని బస్తీ మహిళలు సామాజిక బహిష్కరణకు గురిచేసినంత పని చేస్తారు. పంచాయతీ సమావేశంలో వాదనలు వినిపించడానికి ఇరు వర్గాల బంధుమిత్రులూ హాజరవుతారు కాబట్టీ, అందరి ఆమోదం తర్వాతే తీర్పు వెలువడుతుంది కాబట్టీ...అమలు బాధ్యత బంధుమిత్రుల మీదా ఉంటుంది. తీర్పు కాగితాల పైన ఇరువర్గాల సంతకాలూ తీసుకుంటారు. అంతటితో తమ పని అయిపోయిందని పంచాయతీ భావించదు. తీర్పు అమలును తరచూ సమీక్షిస్తుంది. అవసరం అనుకుంటే బాధితురాలినీ, దోషుల్నీ మరొక్కసారి విచారణకు పిలిపిస్తుంది. మహిళా పంచాయతీల ప్రత్యేకతే అది. చాలా సందర్భాల్లో, చట్టం చేయలేని పనిని ‘సామాజిక ఒత్తిడి’ చేయగలదు. అప్పటిదాకా కాలరు ఎగరేసుకుని తిరుగుతున్నవాడిని కాస్తా, బస్తీలోని జనమంతా ‘నువ్వు దోషివి. తప్పు చేస్తున్నావు...’ అని వేలెత్తిచూపడం మొదలుపెడితే అతడు తట్టుకోలేడు. అక్రమ సంబంధాలూ, మద్యం వ్యసనాలూ, వేధింపులూ...తదితర సమస్యలు సులభంగానే దారికి వచ్చేస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వివాదం విడాకుల దాకా వెళ్తుంది. అట్టడుగు మహిళల విషయంలో విడిపోవడం అన్నది చాలా తీవ్రమైన నిర్ణయం. ఏ సంపన్న మహిళలాగానో, ఎగువ మధ్యతరగతి ఉద్యోగినిలాగానో ఆమెకు పరిపూర్ణ ఆర్థిక స్వాతంత్య్రం ఉండదు. ఒంటరిగా బతికేంత నేర్పూ ఉండదు. చుట్టూ ఉన్న మిడిమిడి జ్ఞానపు సమాజం ఆమె పరిస్థితిని అర్థం చేసుకోలేదు. ఇలాంటి సందర్భాల్లో నయానోభయానో మొగుడిని దారికి తీసుకురావడమే సరైన పరిష్కారమని చెబుతారు పంచాయతీ నిర్వాహకులు. ఓఖ్లా ఇండస్ట్రియల్‌ ఏరియాలోని నవోదయ మహిళా పంచాయతీ వీపీ సింగ్‌ క్యాంప్‌లోని జాగృతి మహిళా పంచాయతీ..తదితర సంస్థలు గణనీయమైన ఫలితాల్ని సాధిస్తున్నాయి, ఎన్నో జీవితాల్ని మారుస్తున్నాయి.


మార్పు సంకేతాలు
పంచాయతీల పుణ్యమాని...మురికివాడల మహిళలకూ చట్టాల పట్ల అవగాహన పెరుగుతోంది. ఒకర్ని చూసి ఒకరు, గృహహింసను నిలదీయడం నేర్చుకుంటున్నారు. భర్తను ప్రశ్నించడం అలవాటు చేసుకుంటున్నారు. పరిస్థితులు మారిపోతున్నాయనీ, మునుపట్లా ఆమె మౌనంగా ఉండబోదనీ పురుషులకూ అర్థం అవుతోంది. బాధిత మహిళలే ఫిర్యాదు చేయాల్సిన పన్లేదు. ఇరుగుపొరుగు నుంచి సమాచారం అందినా, నేరుగా పంచాయతీ సభ్యులే బాధితుల దగ్గరికి వెళ్తున్న సందర్భాలూ ఉన్నాయి. నిజానికి పంచాయతీ విధానానికి స్ఫూర్తి ప్రాచీన గ్రామీణ భారతమే. ఎవరింట్లో పెళ్లి జరిగినా వూరు వూరంతా సంబరపడేది. ఏ ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకున్నా వీధివీధంతా విలవిల్లాడిపోయేది. ఆ భావోద్వేగపరమైన మద్దతునే మహిళా పంచాయతీలు అందిస్తున్నాయి. ఓ మహిళకు వచ్చిన సమస్యనో, ఎదురైన సంక్షోభాన్నో తమందరి ఇబ్బందిగా ఆ బస్తీ వాసులు భావించడం ఈ వ్యవస్థలోని ప్రత్యేకత. పంచాయతీలు వచ్చాక దిల్లీ దిగువ మధ్యతరగతి ప్రాంతాల్లో గణనీయమైన తేడా కనిపిస్తోంది. గృహహింస కేసులు కొంతమేర తగ్గాయి. ‘మహిళా పంచాయతీ అయినంత మాత్రాన...న్యాయం ఉన్నా లేకపోయినా మేం మహిళలవైపే మాట్లాడతామన్న అపోహ ఉంది. పొరపాటు మహిళల వైపు ఉంటే, వాళ్లనూ దండిస్తాం. అయినా, ఎవర్నో తప్పుపట్టడం మా ఉద్దేశం కాదు. అంతిమంగా కాపురం నిలబడాలి. కుటుంబం సంతోషంగా ఉండాలి’ అంటారు పంచాయతీ ప్రతినిధి గీతాజీ.
హెల్ప్‌లైన్‌ కూడా...
దిల్లీ ప్రభుత్వం ఇటీవలే, మహిళా హెల్ప్‌లైన్‌ను పంచాయతీలతో అనుసంధానం చేసింది. గతంలో ఈ నంబరుకు గృహహింసకు సంబంధించో, వరకట్న వేధింపులకు సంబంధించో ఏ ఫిర్యాదు వచ్చినా, దాన్ని నేరుగా పోలీసు శాఖకు బదిలీ చేసేవారు. అంతకు మించి ఎలాంటి ఆసరా అందేది కాదు. ఇక నుంచి ఆ వ్యవహారం ఇంత మొక్కుబడిగా ఉండబోదు. ఫిర్యాదు అందగానే, ఆ ప్రాంతంలోని పంచాయతీ సభ్యులు రంగంలోకి దిగేస్తారు. అవసరమైతే, గృహనిర్బధం నుంచి విడిపిస్తారు. తక్షణ వైద్య సహాయం అందిస్తారు. వూరడింపు వాక్యాలతో మనోధైర్యాన్ని ఇస్తారు. దిల్లీ మహిళా కమిషన్‌ నేతృత్వంలోని మొబైల్‌ హెల్ప్‌లైన్‌కు రెండు వాహనాలున్నాయి. వాటిని కూడా పంచాయతీలకు అనుసంధానించారు. ఫోన్‌కాల్‌ అందిన కొద్ది గంటల్లోనే నేరుగా ఆ వాహనం బాధితురాలి ఇంటిముందు ఆగిపోతుంది. పంచాయతీ ఆధ్వర్యంలో మహిళల హక్కుల గురించి అవగాహనా శిబిరాలూ జరుగుతున్నాయి. తమను తాము రక్షించుకోవడం ఎలాగో ఆ ఆవరణల్లో న్యాయవాదులు పాఠాలు చెబుతున్నారు. చివర్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమమూ ఉంటుంది. సందేహాలుంటే తీర్చుకోవచ్చు. పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు... ఫిర్యాదు ఎలా చేయాలన్నదీ అక్కడ నేర్పిస్తారు. ఫిర్యాదులోని పదజాలాన్ని బట్టి కేసు తీవ్రత మారిపోతుంది. చాలా సందర్భాల్లో బాధిత మహిళల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని..పోలీసులు ప్రలోభాలకు లోనైపోయి కేసుల్ని బలహీనపరుస్తుంటారు. ఆ పప్పులిక ఉడకవు. మిగతా రాష్ట్రాల్లోని మహిళా కమిషన్లు దిల్లీ నమూనాను అధ్యయనం చేస్తున్నాయి. తమకు ఎలా అన్వయించుకోవచ్చో ఆలోచిస్తున్నాయి. దిల్లీలో అయినా, హైదరాబాద్‌లో అయినా మహిళ మహిళే, ఆమె సమస్యలు ఆమెవే. పంచాయతీ పంచాయతీయే. తీర్పు తీర్పే, మార్పు మార్పే.

* * *

‘పురుషుడికి వ్యతిరేక పదం చెప్పమంటే స్త్రీ అంటాం. భర్తకు వ్యతిరేక పదం ఏమిటంటే భార్య అంటాం. ఆలూమగల అనుబంధాన్ని మనం చూస్తున్న పద్ధతిలోనే తేడా ఉంది. ఆలూమగలూ వ్యతిరేకపదాలో, వ్యతిరేకశక్తులో కాదు. ఒకే శక్తిలోని రెండు కోణాలు. జీవితభాగస్వామిని చిన్నచూపు చూస్తే, తనని తాను తక్కువ చేసి చూసుకున్నట్టే. ఆమెను హింసిస్తే తనని తాను గాయపరచుకున్నట్టే...అంతకుమించిన నరకమేం ఉంటుంది’ - పంచాయతీ సమావేశం ముగింపు సందర్భంగా ఎవరో, జీవితానుభవాన్ని రంగరించి చెబుతున్నారు. ఆ మంచిమాట ఎంతమంది పురుషులకు అర్థమై ఉంటుందో తెలియదు. అర్థం చేసుకున్న వారికి మాత్రం... అదే చివరి పంచాయతీ!

‘హింస’ధ్వని! గానికి సగంమంది భారతీయ మహిళలు ఏదో ఓ సందర్భంలో, ఏదో ఓ రూపంలో గృహహింసను భరిస్తారని ఓ అంచనా. జీవిత భాగస్వామి విషయంలో తాము హింసాత్మకంగా వ్యవహరించినట్టు దాదాపు అరవైశాతం పురుషులు అంగీకరించారు. గతఏడాది... గృహహింస కేసుల్లో పశ్చిమ బంగా (20,163), రాజస్థాన్‌ (14,383), అసోం (11, 225), ఉత్తర్‌ ప్రదేశ్‌ (8,660), మహారాష్ట్ర (7640)...మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఎనిమిదిన్నరవేల పైచిలుకు వరకట్న మరణాలు నమోదు అయ్యాయి. భర్తల పైశాచికత్వానికి సంబంధించి 1,22,877 కేసులు పోలీసు రికార్డులకెక్కాయి. ఠాణాల దాకా రానివీ, నమోదు కానివీ ఇంతకు వందరెట్లు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంపన్న కుటుంబాల నుంచి బస్తీ బతుకుల దాకా...గృహహింస విషయంలో ఎలాంటి తేడా లేదు. బడుగు మొగుడు పాతికవేల కోసం హింసిస్తే, బలిసిన మొగుడు పాతిక లక్షల కోసం బరితెగిస్తాడు. అంతే తేడా! తొలి అడుగు.. ‘యాక్షన్‌ ఇండియా’ సంస్థ దశాబ్దాల క్రితమే, దిల్లీలో మహిళా పంచాయతీ వ్యవస్థకు ప్రాణంపోసింది. ఆ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు ఆరు పంచాయతీలు విజయవంతంగా నడుస్తున్నాయి. గత ఆరేళ్లలో యాక్షన్‌ ఇండియా పన్నెండు వేలకుపైగా గృహహింస కేసుల్ని పరిష్కరించింది. కొద్దిమంది స్వచ్ఛంద కార్యకర్తలతో మొదలైన ఉద్యమం మహానగరమంతా విస్తరించింది. యాక్షన్‌ ఇండియా పట్టణ మహిళలు తమ హక్కుల కోసం పోరాడేలా ప్రోత్సహిస్తోంది. నీటితోనే మహిళ జీవితం ముడిపడి ఉంటుంది. నీటికి కటకట ఉందంటే, ఆమె బతుకూ సమస్యల్లో చిక్కుకున్నట్టే. అందుకే, యాక్షన్‌ ఇండియా ‘నీరు...మహిళ హక్కు’ అన్న నినాదంతోనూ పోరాడుతోంది. మురికివాడల్లోని బాలికలకు భవిష్యత్తు పట్ల అవగాహన కల్పిస్తూ రేపటి నాయకులుగా తీర్చిదిద్దుతోంది కూడా. గౌరీ చౌదరి ఈ సంస్థ వ్యవస్థాపక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌. దళితుల కోసమూ... మాజంలో అత్యంత వివక్షకు గురైన వర్గం దళితులే. దళిత పురుషులతో పోలిస్తే దళిత మహిళల పరిస్థితి మరీ దుర్భరం. దళిత్‌ సాలిడారిటీ పీపుల్స్‌ (డీఎస్‌పీ) సంస్థ దళిత కుటుంబాల్లో...వివాదాల పరిష్కారంలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు పంచాయతీ నమూనాను ఎంచుకుంది. వివక్షకూ హింసకూ వ్యతిరేకంగా దళిత మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావడంలో ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతోందని సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.

‘మా అమ్మల కాలంలో, అమ్మమ్మల కాలంలో కూడా పంచాయతీలు ఉండేవి. కాకపోతే అవి పురుషాధిక్య పంచాయతీలు. తీర్పు ఎప్పుడూ మగవాడివైపే ఉండేది. సర్దుకుపొమ్మనో, ఓర్చుకొమ్మనో, రాజీపడమనో నీతులుచెప్పి... బలవంతంగా కాపురానికి పంపేవారు. పిల్లల్ని అడ్డు పెట్టుకునో, సమాజాన్ని బూచిగా చూపించో భయపెట్టేవారు. మహిళా పంచాయతీల పనితీరు పూర్తిగా విరుద్ధం. విచారణ మహిళల కోణంలోంచే సాగుతుంది. విచారించేదీ మహిళలే. ఆ వాతావరణం కొండంత ధైర్యాన్నిస్తోంది. అందుకు నా జీవితమే ఉదాహరణ. తమను ఎదిరించి కులంకాని వాడిని పెళ్లి చేసుకున్నందుకు అమ్మానాన్నలు గడపలో కాలు పెట్టనివ్వలేదు. నా కాపురం కూలుతున్నప్పుడు కూడా పట్టనట్టు వ్యవహరించారు. ఆ సంక్షోభ సమయంలో మహిళా సంఘమే నా వెనుక నిలబడింది, నా తరఫున పోరాడింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోడానికి బ్యాంకుల ద్వారా రుణమూ ఇప్పించింది. నాకిప్పుడు బతుకు భయం లేదు’
- ఓ బాధితురాలు
‘నా భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు. నన్నూ పిల్లల్నీ బాగానే చూసుకునేవాడు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు పోయాయి. ఆయన చనిపోయాకే, అత్తామామలూ ఆడపడుచుల స్వభావాలు తెలిశాయి. కంపెనీవాళ్లిచ్చిన నష్టపరిహారంలో పైసా కూడా నా దాకా రానివ్వలేదు. మెల్లమెల్లగా ఇంటి పనులన్నీ నా మీదికే తోసేశారు. బండెడు చాకిరీ నెత్తినపడింది. ఎంత చేసినా సూటిపోటి మాటలు తప్పేవి కాదు. నా పిల్లల్ని బళ్లొ చేర్పించడానిక్కూడా ఒప్పుకోలేదు. ‘ఫీజులెవరు కడతారే, చచ్చిన నీ మొగుడా?’ అని దబాయించారు. నన్నూ రకరకాలుగా వేధించారు. లైంగిక హింసకూ గురిచేశారు. నన్ను నేను కాపాడుకోడానికి, పిల్లల్ని అక్కడే వదిలేసి బయటికి వచ్చేశాను. పోలీసు స్టేషన్‌లో కేసుపెడితే, లంచాలిచ్చి మూసేయించారు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో మహిళా పంచాయతీని ఆశ్రయించాను. నెలనెలా నాకు జీవనభృతి అందేలా ఏర్పాటు చేశారు పంచాయతీ సభ్యులు. నా పిల్లల్ని చదివించేలా అత్తమామల నుంచి మాట తీసుకున్నారు. ఇప్పుడు చాలా నిశ్చింతగా ఉంది’
- ఓ బాధితురాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.