close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇంటిదీపం

ఇంటిదీపం
- నందిరాజు పద్మలతా జయరాం

‘‘ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్‌!’’ మనసులో ఉన్న కంగారుని దాచుకుంటూ మర్యాదగా అడిగాడు ఆనంద్‌.
‘‘ప్రస్తుతానికి ఫర్వాలేదు. పరీక్షల ఫలితాలు రానీయండి. ఇదేం... జ్వరమో జలుబో కాదు కదా- కచ్చితంగా చెప్పడానికి.’’
‘‘అలా అని కాదు, తనకి ఎప్పుడూ ఇలా సీరియస్‌ అవలేదు. హాస్పిటల్లో అడ్మిట్‌ అవడం... ప్రసూతికి తప్ప జరగలేదు. అంచేత...’’
‘‘ఫర్లేదులెండి, రిలాక్స్‌! మీరు కంగారుపడి ఆవిణ్ణి కంగారుపెట్టకండి. పూర్తి రెస్ట్‌ కావాలి. మూడు నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సొస్తుంది, సరేనా’’ ఇక వెళ్ళిరండి అన్నట్లు కుర్చీలోంచి లేచాడు డాక్టర్‌ రత్నాకర్‌.
‘‘కంగారేంలేదన్నారుగా! నాకు అర్జెంట్‌ కాల్‌ ఒకటి అటెండ్‌ అవాల్సిందుంది నాన్నా. ఆఫీసుకి వెళ్ళి రానా?’’ కొడుకు రిషి మాటలకి
కోపమొచ్చింది ఆనంద్‌కి.
‘‘అదేంట్రా, అమ్మ సంగతింకా ఏం తెలీలేదు, అప్పుడే ఆఫీసా! ఓరోజు సెలవు పెట్టలేవా?’’
‘‘అలా అని కాదు... రేపు మరో అర్జెంట్‌ అవసరానికి లీవ్‌ పెట్టచ్చు కదా... అని. అమ్మ హాస్పిటల్లోనే ఉంటుంది కదా! మీరూ తోడుగా ఉన్నారు. నేనుండి చేసేదేం లేదు కదా...’’ సణిగినట్లన్నాడు రిషి.
‘‘నీ ఇష్టం’’ అనేసి ప్రిస్క్రిప్షన్‌ని బయటకు తీసి ఆసుపత్రిలోనే ఉన్న మందుల దుకాణంవైపు నడిచాడు ఆనంద్‌.
‘‘సరే, నేనెళ్ళొస్తా నాన్నా! అవసరమైతే ఫోన్‌ చేయండి’’ ల్యాప్‌టాప్‌ సంచీని భుజాన తగిలించుకుని బయల్దేరాడు రిషి.
బాధనిపించింది ఆనంద్‌కి.
ఒక్కపూట కూడా తల్లి కోసం సెలవు పెట్టడం ఇష్టంలేని కొడుకు బాధ్యతారాహిత్యానికి చాలా కోపం వచ్చింది.
‘‘ఏమైందండీ, ఏమన్నారు డాక్టరు? రిషి ఏడీ? లోపలికి రానీయలేదా?’’ మందులతో వచ్చిన భర్తను అడిగింది విజయ.
‘‘నీకేం ఫర్వాలేదన్నార్లే! నీ సుపుత్రుడే, పని ఉందట... వెళ్ళిపోయాడు ఆఫీసుకి. ఒక్కరోజు తల్లి కోసం సెలవు పెట్టలేడట. అదే, వాడి కొడుక్కి పేరెంట్స్‌-టీచర్స్‌ మీటింగ్‌ ఉంటేనో, పెళ్ళాం పుట్టినరోజయితేనో, మరోటయితేనో మాత్రం ఇంట్లో కూర్చుంటాడు’’ చికాగ్గా అన్నాడు.
‘‘వూరుకోండి. పనుంటే వాడు మాత్రం ఏం చేస్తాడు? అయినా, నాకేం ఫర్లేదని అన్నారు కదా... ఇంకేం పని వాడితో?’’ భర్తను అనునయించింది విజయ.
మామూలు రోజుల్లో అయితే కొడుకుని సమర్థించినందుకు విజయని చివాట్లు పెట్టి ఉండేవాడు ఆనంద్‌.
మందులు వేసుకుని నిద్రపోయింది విజయ. ఆమెవైపే చూస్తున్నాడు ఆనంద్‌. జుత్తు దాదాపుగా నెరిసిపోయింది. అద్దాల్లా మెరిసే చెక్కిళ్ళు అక్కడక్కడా ముడతలుపడి కళావిహీనంగా మారిపోయాయి. పక్కనున్న టీపాయ్‌ మీదున్న ఆమె కళ్ళద్దాలు దళసరిగా ఉండి భూతద్దాల్లా ఉన్నాయి. ఆమె కళ్ళవైపు చూశాడు. ఎంతందంగా ఉండేవవి! ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లో ఎన్ని కాంతులుండేవి! ఆమె అరచేతిని చేతుల్లోకి తీసుకున్నాడు. మొరటుగా ఉన్నాయి. అరచేతి నిండా గీతలే! పెళ్ళయిన కొత్తల్లో లేత అరిటాకుని ముట్టుకున్నట్లుండేవవి. సున్నితంగా సుతిమెత్తగా ఉన్న చేతులనిండా మట్టి గాజులతో కుందనపు బొమ్మలా ఉండేది విజయ. అమాయకత్వం నిండిన ఆ ముఖంలో ఇప్పుడు అనుభవాలు గీసిన గీతలు.
కళ్ళు మూసుకున్నాడు.

* * *

‘‘వంటయింది, క్యారేజీ సర్దేస్తున్నా. ఏరా రిషీ... నీ సంగతి చెప్పు. ఈరోజు బయటి పార్టీలేం లేవు కదా!’’
‘‘ఏవిటా అరుపులు... నెమ్మదిగా అడగలేవూ!’’ విసుగ్గా అన్నాడు ఆనంద్‌.
‘‘కాదండీ, నిన్న క్యారేజీ సిద్ధం చేశాక ‘నాకొద్దు’ అంటూ ఇంట్లో వదిలేశాడు, అందుకే! రండి మీకు టిఫిన్‌ పెట్టేస్తాను’’ ఇడ్లీలు ప్లేట్లో వేస్తూ అంది విజయ.
‘‘ఈ ఇడ్లీలు ఉడికి చావలేదు. చేతకానప్పుడు మానేయాలి. ఏ హోటల్లోనో తింటాం. అయినా, ఉద్యోగం చేసే ఆడదానికి ఇంతకన్నా ఏం చేతనవుతుంది కనుక?’’ విసురుగా ప్లేటుని అవతలకి తోసేసి క్యారేజీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆనంద్‌.
‘‘అమ్మా, నాకు టిఫిన్‌ చేసే టైమ్‌ లేదుగానీ, మరో బాక్సులో సర్దెయ్‌, ఆఫీసులో తింటాను’’ షూస్‌ వేసుకుంటూ చెప్పాడు రిషి.
గబగబా తన బాక్సులో కొడుక్కి ఇడ్లీలు సర్ది, లంచ్‌ క్యారేజీతోపాటు అందించింది విజయ.
‘‘బాబు స్నానం ఇప్పుడే అయింది అత్తయ్యా! వాడిని స్కూలులో దింపి రావాలిగా. వాడికి కూడా క్యారేజీ సర్దేయండి. ఈలోపు వాడికి కాస్త తినిపిస్తాను. ఏమీ అనుకోకండి, నాక్కూడా సర్దేయరూ... నాకూ టైమ్‌ అయిపోతోంది’’ ప్లేటులో కొడుకు కోసం ఇడ్లీలు పెట్టుకుంటూ అడిగింది కోడలు కీర్తన.
అందరికీ అన్నీ అమర్చాక, క్షణాల్లో ఇల్లు సర్దుకుని తను తినడానికి టైమ్‌ లేక, సర్దుకోవడానికి లంచ్‌బాక్సు కూడా లేక ఆదరాబాదరాగా బస్‌ కోసం పరుగెత్తబోతున్న విజయ ఇంటికి తాళం వేస్తూ వేస్తూనే కింద కూలబడిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెనెవరూ గమనించలేదు. ఆ తర్వాత అరగంటకి పొరుగింటావిడ చూసేదాకా విజయకి సహాయం చేసేవాళ్ళే లేరు.
మొబైల్‌కి ఫోన్‌ రావడంతో చూసుకున్న ఆనంద్‌- ఫోన్‌లో కొడుకూ కోడళ్ళకి విషయం చెప్పి వెంటనే ఇంటికి మళ్ళాడు. విజయను హాస్పిటల్లో చేర్చాడు. హార్ట్‌ అటాక్‌ అయిండొచ్చని చికిత్స మొదలుపెట్టారు డాక్టర్లు. అనుమానం వచ్చిన వెంటనే, బ్యాగులో నుంచి ‘సార్‌బిట్రేట్‌’ టాబ్లెట్‌ని నాలుక కింద పెట్టుకున్నందువల్ల ప్రమాదం తప్పిందని కూడా చెప్పారు.
సాయంత్రానికి అన్ని రిపోర్టులూ వచ్చాయి. గుండెజబ్బు ప్రాథమిక దశలో ఉన్నందున, మందులతో సరిచేద్దామన్నారు డాక్టర్లు. పూర్తిగా విశ్రాంతినివ్వమనీ అసలు ఒత్తిడి పనికిరాదనీ మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూడమనీ కూడా సలహా ఇచ్చారు.

* * *

‘‘నువ్వేమీ పనిచేయనక్కర్లేదు. నెలరోజులు ఆఫీసుకీ ఇంటిపనికీ కూడా నువ్వు లీవ్‌ పెట్టినట్లే. మేం చూసుకుంటాం’’ ఇంటికి రాగానే వంటపనిలో దూరేసిన భార్యతో అన్నాడు ఆనంద్‌.
‘‘అదెలా కుదురుతుందండీ... ఆఫీసుకి సెలవు పెడతానుకానీ వంటా వార్పూ నేను కాకపోతే ఎవరు చేస్తారు? కీర్తన వల్ల అవుతుందా!?’’
‘‘అమ్మా, ఎలాగో సర్దుకుంటాం. నీ మందులు, ఆహారం, విశ్రాంతి... వీటి సంగతి చూసుకో, చాలు’’ చెప్పాడు రిషి.
మొట్టమొదటిరోజే ఇల్లంతా అతలాకుతలమైపోయింది. పనిమనిషి యథాప్రకారం చెప్పకుండా డుమ్మా. నాలుగేళ్ళ మనవడు బడికెళ్ళనని మారాం. సమయానికి టిఫినూ, భోజనం క్యారేజీ అందక హడావుడిగా వెళ్ళిపోయాడు రిషి. అందరి మీదా కోపం తెచ్చుకుని, కొడుకుని నాలుగు ఉతికి, బడికి బరబరా లాక్కెళ్ళింది కీర్తన. భార్య కోసం సెలవు పెట్టి, ఇల్లంతా సర్దుకుంటూ మిగిలిపోయాడు ఆనంద్‌.
‘‘కొంతపని నేను చేసుకుంటానండీ... మరీ ఇలా పేషెంట్‌లాగా పడుకోలేను.’’
భార్యను బలవంతంగా పడకమీద కూలేసిన ఆనంద్‌ ‘‘ఇదిగో, నువ్వు పేషెంట్‌వే... బుద్ధిగా పడుకో. నువ్వు లేనంత మాత్రాన మునిగిపోయేంత కొంప కాదిది’’ వార్నింగ్‌ ఇచ్చాడు.
చేసేదేంలేక ఎప్పటినుంచో చదవాలనుకుంటున్న నవలల్ని బైటికి తీసి చదవడం మొదలెట్టింది విజయ.

* * *

మూడోరోజు నుంచీ ఆఫీసుకి వెళుతున్నాడు ఆనంద్‌. రిటైర్‌మెంట్‌కి ముందు వెళ్ళక తప్పనిసరి అవడంతో ఇంట్లో విజయకు కావాల్సినవన్నీ అమర్చాను అనుకుంటూనే వెళ్తున్నా, ఏరోజుకారోజు దినచర్య గందరగోళమైపోతోంది. ఏ పనీ పూర్తిగా అయిందన్న తృప్తి కలగడం లేదు. అందరిమీదా కోపం తన్నుకొస్తోంది. బాధ్యతగా తీసుకుని పనులు చేయగలిగేవాళ్ళు లేకపోవడంతో గృహకృత్యాలన్నీ అస్తవ్యస్తమైపోతున్నాయి.
నిద్రలేచేసరికి నీళ్ళపంపు ఆగిపోతోంది. గేటు దగ్గర బుట్టలో వేసే పాల ప్యాకెట్లు మాయమైపోతున్నాయి. కోడలు నింపాదిగా వంట మొదలెట్టబోతూ ఫ్రిజ్‌ తెరిస్తే, అందులో కూరలుండవు. పనిమనిషి రోజుకో పని ఎగ్గొట్టేస్తోంది. ఎలాగో వంట అయిందనిపించి క్యారేజీ పెట్టబోతే- డబ్బాలుంటే మూతలుండవు, మూతలుంటే డబ్బాలుండవు. ఇంతకుముందులాగా ఎవరి బట్టలు వాళ్ళ అలమరలలో సర్దేవాళ్ళులేక అందరివీ కలిసిపోయి అదో హంగామా! ఒకటేమిటి, మగవాళ్ళ సాక్సులూ బుజ్జిగాడి బ్యాగులో పుస్తకాలూ పడుకున్న మంచాల మీద దుప్పట్లూ అన్నీ కలగాపులగమైపోతున్నాయి.
ఆశ్చర్యంగా కూడా ఉంది ఆనంద్‌కి. ఒక్క మనిషి... ఒకే ఒక్క మనిషి అందుబాటులో లేకపోతే ఇంత లోటా! విజయ చేతిలో ఏ మహత్యం ఉంది? ఇన్ని పనులు చేసుకుంటూ, ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎవరిమీదా కంప్లైంట్‌ లేకుండా ఎలా సమర్థించుకుంటోంది? ఏనాడూ తాను ఆమె సమర్థతను గుర్తించలేదు.
ఒక్కసారిగా కళ్ళు చెమర్చాయి ఆనంద్‌కి. తెలియకుండానే తానామెను చాలాసార్లు కించపరిచాడు. తన తల్లి బతికి ఉన్నప్పుడు, ఆవిడకి ఎన్ని సపర్యలు చేసింది విజయ! పిల్లల పెంపకంలో ఒక్కసారి కూడా తాను పాలుపంచుకోకపోయినా వాళ్ళ చదువులూ జబ్బులూ ఫీజులూ అన్నీ ఒక్కతే చూసుకునేది. అంతెందుకు, తాను ‘ఆకలి’ అని అడిగే అవసరం ఈనాటి వరకూ రానీయలేదు. ఇంట్లో ఎవరికేది అవసరమో అది అప్పటికప్పుడే ప్రత్యక్షం అయిపోయేది. ఇప్పుడనిపిస్తోంది... విజయకి మంత్రాలేమైనా వచ్చేమో, అందరి మనసుల్లోకీ దూరిపోయి గ్రహించేస్తోందేమో అని. ఆ విధి నిర్వహణలో తన ఆరోగ్యాన్ని కూడా ఏనాడూ పట్టించుకోలేదు. ఎంతమంది బంధువులూ మిత్రులూ వచ్చినా చిరునవ్వు చెరగనీయలేదు. ఆదరించకుండా విదిలించలేదు. అటు ఆఫీసు పనీ ఇటు ఇంటిపనీ ఎక్కడా క్లాష్‌ కాకుండా, క్రాష్‌ కాకుండా రోబోలాగా తిరిగే విజయను తల్చుకుంటే గుండె బరువుగా అనిపించింది.
ఏనాడూ ఆమెను మెచ్చుకున్న పాపానపోలేదు తను. చాలాసార్లు నొచ్చుకునేలా మాట్లాడాడు. మనసుకు గుచ్చుకునేలా ప్రవర్తించాడు. గిర్రున తిరిగే కన్నీళ్ళను దిగమింగి, పిల్లల ముందు అతి మామూలుగా, అంతే ప్రేమగా ఉండే విజయ మనసు లోతుల్లోకి తనెన్నడూ తొంగిచూడలేదు. చూడాలన్న స్పృహే రాలేదిప్పటి వరకూ. ‘ఇది నాది’ అని ఏదీ ఉంచుకోలేదు విజయ. సంపాదనంతా తన చేతుల్లో పెట్టిన తర్వాత, దాని అజ తెలుసుకునే ప్రయత్నం కూడా చేసి ఎరుగదు. చెబితే ఆమెకు అధికారం ఇచ్చినట్లు అవుతుందని తన ఫీలింగ్‌.
తెల్లారిలేస్తే ఇంటిముందు ముగ్గులా, దంతధావనం కాగానే కాఫీకప్పులా మారిపోతుంది విజయ. ఆకలివేళ అన్నంగానూ, అమ్మగానూ మారిపోతుంది. ఇంటిల్లిపాదికీ తలలో నాలుకలా ఉన్న తన ఇంటిదీపం విజయకి ఏమైనా అయితే! తన అదిలింపులూ విదిలింపులూ ఆ చిన్ని గుండెని ఎన్నిసార్లు హర్ట్‌ చేశాయో! ఎన్ని ఆశల్ని ఆ పిడికెడంత గుండెలో దాచుకుందో! ఆడదాన్ని అణచి ఉంచాలన్న తరతరాల పురుషాహంకారం తననూ కమ్ముకుందేమో! ఏమో, అవుననే అనిపిస్తోంది.
వెచ్చని కన్నీళ్ళు దొర్లాయి ఆనంద్‌ కళ్ళల్లోంచి. కళ్ళజోడు తీసి తుడుచుకున్నాడు.

* * *

‘‘ఏమిటండీ ఇది? అకస్మాత్తుగా ఈ ‘అరకులోయ’ ట్రిప్‌ ఏమిటి? ఈ వయసులో హనీమూన్‌ ఏమిటని అందరూ నవ్వుకోరూ’’ రైలు కిటికీలోంచి కనిపిస్తున్న ఆకుపచ్చని ప్రపంచాన్ని చూస్తూ అంది విజయ.
‘‘ఏమీ అనుకోరు. ఇది నా ఇంటిదీపానికి నేనిచ్చే గిఫ్ట్‌. థాంక్స్‌ గివింగ్‌ విజ్జీ’’ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఆనంద్‌.
తాదాత్మ్యంగా కళ్ళు మూసుకుంది విజయ. ఈ హార్ట్‌ ప్రాబ్లమ్‌, పెళ్ళయిన కొత్తల్లోనే వస్తే ఇంకెంత బాగుండేదో... ఆమె మనసు మూలిగింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.