close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దుబాయ్‌..ఓ పెద్ద షాపింగ్‌మాల్‌..!

మా అమ్మాయీ అల్లుడూ సోహార్‌లో ఉండటంతో వేసవికాలం అక్కడకు వెళ్లి వచ్చేటప్పుడు దుబాయ్‌ చూసి రావాలనుకున్నాం. ఒమాన్‌ రాజధాని మస్కట్‌కూ దుబాయికీ మధ్యలో సోహార్‌ ఉంది. అనుకున్నట్లే ఓ నెలరోజులపాటు సోహార్‌లో గడిపి దుబాయికి వచ్చాం.

రండి...సేవ చేయండి!
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్న ఏడు ఎమిరేట్స్‌లో దుబాయ్‌ ఒకటి. నిజానికి దుబాయికి ఉన్న చమురు వనరులు అంతంతమాత్రమే. జనాభా చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది చమురు వనరులు ప్రారంభంలో దుబాయి అభివృద్ధికి తోడ్పడినప్పటికీ తరవాతకాలంలో రాజుగారి తెలివితేటలే దుబాయిని ప్రపంచ పటంలో నిలబెట్టాయి. ఎందుకంటే చమురు ద్వారా ప్రస్తుతం దుబాయికి వచ్చే ఆదాయం ఐదు శాతాన్ని మించదు. పర్యటకం, విమానయానం, స్థిరాస్తి, ఆర్థికసేవలు... ఇవే దుబాయికి ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. దుబాయ్‌ రాజు గొప్ప వ్యాపారి. తన కార్యాచరణలో భాగంగా ‘మీ దగ్గర డబ్బులుంటే దుబాయికి రండి. వ్యాపారం నేర్పిస్తాం. డబ్బులేకపోయినా వ్యాపారం తెలిసి ఉంటే రండి. మీకు అవకాశం ఇస్తాం. మీ దగ్గర రెండూ లేకపోయినా రండి, సేవ చేయండి... డబ్బులిస్తాం’ అంటూ ప్రపంచానికి ఓ పిలుపు ఇచ్చాడు. దానికి స్పందన బాగానే లభించింది. అన్నిదేశాల నుంచీ దుబాయికి రావడం మొదలుపెట్టారు. ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ను స్థాపించి ఆరు ఖండాల్లో 150 ప్రాంతాలకు విస్తరించాడు. ప్రస్తుతం దుబాయిలో 192 దేశాల ప్రజలు నివసిస్తున్నారు. లండన్‌ విమానాశ్రయానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తగ్గించడంలో ఆయన విజయం సాధించాడు.

విమానయానం తరవాత ఎత్తైన భవనాలమీద దృష్టి పెట్టాడు రాజు. అందులోనుంచి పుట్టిందే బుర్జ్‌ ఖలీఫా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప ఇంజినీర్లను పిలిచి అతిపెద్ద మాల్‌, దానిమధ్యలో ఆక్వేరియం, పక్కనే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం ఉండేలా డిజైన్‌ చెయ్యమన్నాడు. దాంతో 12వేలమంది నైపుణ్యం కలిగిన పనివాళ్లు ఆరు సంవత్సరాలపాటు శ్రమించి నిర్మించిన ఈ భవనాన్ని 2010లో ప్రారంభించారు. నిజానికి ఈ ప్రాజెక్టు మధ్యలో ఆయన దగ్గర డబ్బు అయిపోయింది. అప్పుడు అబుదాబి రాజు ఖలీఫా ఆదుకున్నాడు. దానికి కృతజ్ఞతగా ఆయన పేరుతో బుర్జ్‌ ఖలీఫా అని నామకరణం చేశాడు. దాదాపు 2,720 అడుగుల ఎత్తులో 163(వాడుకోగలిగినవి 154, నిర్వహణకోసం 9)అంతస్తులుగా నిర్మించిన ఈ భవన విస్తీర్ణం సుమారు మూడు లక్షలా పది వేల చదరపు కిలోమీటర్లు. అయితే 124వ అంతస్తు వరకే ప్రవేశం పరిమితం. 124వ అంతస్తుకి చేరడానికి లిఫ్ట్‌లో కేవలం నిమిషం మాత్రమే పడుతుంది. బుర్జ్‌ ఖలీఫా ప్రవేశ ద్వారం దగ్గర ‘నా డిక్షనరీలో అసాధ్యం అనే మాటకు అర్థం లభించదు’ అని సగర్వంగా రాసుకున్నాడు. లోపలకు వెళ్లి 124వ ఫ్లోర్‌ నుంచి దుబాయి నగరాన్నంతా చూస్తుంటే అద్భుతంగా తోచింది. ప్రపంచంలోకెల్లా ఎత్తైన రెస్టారెంట్‌, నైట్‌క్లబ్‌, అబ్జర్వేషన్‌ డెక్‌... ఇలా అనేక విషయాల్లో రికార్డుల్ని సృష్టించిన ఆ భవనాన్ని ఎంతసేపు ఎన్నిరోజులపాటు చూసినా తనివి తీరదనిపించింది. అపార్ట్‌మెంట్లూ, హోటల్సూ, స్కైలాబీలూ, ఈతకొలనులతో నిండిన ఈ భవనం చుట్టూ 27 ఎకరాల్లో డిజైన్‌ చేసిన ఉద్యానవనం ఎంతో అందంగా ఉంది.

మాల్‌లో ఆక్వేరియం!
తరవాతిరోజు తీరికగా దుబాయిమాల్‌ సందర్శనకు బయలుదేరాం. ప్రపంచంలోని అతిపెద్దమాల్స్‌లో ఇది ఒకటి. విస్తీర్ణపరంగా చూస్తే ఇదే పెద్దది. ఐదు లక్షలా రెండు వేల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ మాల్‌లో 1200కు పైగా దుకాణాలు ఉన్నాయి. 14 వేల కార్లకు పార్కింగ్‌ సదుపాయం ఉంది. దుబాయిమాల్‌ మధ్యలో నాలుగు అంతస్తుల్లోకి విస్తరించి ఉన్న ఆక్వేరియంను చూస్తుంటే అద్భుతంగా తోచింది. సముద్రజీవుల్ని చూడ్డానికి ఇంతకన్నా మంచి వేదిక మరొకటి లేదేమో. షార్క్‌, రే చేపల రకాలే మూడువందలకు పైగా ఉన్నాయి. ఇందులోనే 270 డిగ్రీల్లో ఆక్రిలిక్‌తో నిర్మించిన టన్నెల్‌(సొరంగ మార్గం) ద్వారా నడుస్తూ కొన్ని వందల రకాల రంగుల చేపలూ, రకరకాల కప్పలూ, ఆక్టోపస్‌లను దగ్గరగా చూస్తుంటే ఓ వింత అనుభూతి కలుగుతుంది. ఎవరైనా ఆక్వేరియంలమీద పరిశోధన చెయ్యదలచుకుంటే అక్కడికి వెళ్తే చాలు. పరిశోధనలకు కావాల్సిన జంతువులన్నీ కనిపిస్తాయి. ఆక్వేరియం పైభాగంలో ఓ జంతుప్రదర్శనశాల లాంటిది ఏర్పాటుచేశారు. ఇంటరాక్షన్‌ ద్వారా పిల్లలకూ పెద్దలకూ కూడా సముద్రజీవుల గురించి అవగాహన కలిగిస్తారు. రెయిన్‌ఫారెస్ట్‌, రాకీషోర్‌, లివింగ్‌ ఓషన్‌ అంటూ మూడు విభాగాలు ఉన్నాయి. ఒక్కోదాంట్లో కొన్ని రకాల జంతువుల గురించి తెలుసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు, గోల్డ్‌ సూక్‌లూ ఫౌంటెయిన్లూ కిడ్స్‌జోన్‌లూ... ఇలా చాలానే ఉన్నాయి. డబ్బులూ తీరికా ఉండాలేగానీ ఆ మాల్‌లోనే రోజులకి రోజులు గడిపేయవచ్చు అనిపించింది. బుర్జ్‌ ఖలీఫా చూడ్డానికి టిక్కెట్టు మూడు వేల రూపాయలయితే, మాల్‌లోని ఆక్వేరియం చూడ్డానికే రెండు వేల రూపాయలు. ఇవి రెండూ దుబాయికి కాసుల వర్షమే కురిపిస్తాయి.

మంచుపర్వతం!
మర్నాడు దుబాయిలోనే ఉన్న మరో పెద్ద మాల్‌... ‘మాల్‌ ఆఫ్‌ ద ఎమిరేట్స్‌’కు వెళ్లాం. దుబాయ్‌మాల్‌కు ఆక్వేరియం ఓ ప్రత్యేక ఆకర్షణ అయితే ఎమిరేట్స్‌మాల్‌కు స్కైదుబాయ్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. స్కైదుబాయ్‌ అనేది మాల్‌ మధ్యలో గాజు గోడల మధ్యన కృత్రిమంగా నిర్మించిన ఓ మంచుపర్వతం. దీనిపైనుంచి జారడానికి ప్రత్యేక దుస్తులు ఇస్తారు. రోప్‌ వే కూడా ఉంది. ఎడారి ప్రదేశంలో -4 డిగ్రీల ఉష్ణోగ్రతలో కృత్రిమంగా మంచు పర్వతాన్ని నిర్మించి హిమాలయాల్లో విహరించిన అనుభూతిని కలిగిస్తారు. దీని టిక్కెట్టు ధర ఐదు వేల రూపాయలు. కానీ మేం లోపలకు వెళ్లే సాహసం చెయ్యలేదు. బయట నుంచే చూశాం. దుబాయి నగరంలో ఏ ప్రాంతం నుంచయినా మెట్రో రైలెక్కి ఈ ఎమిరేట్స్‌ మాల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఫుడ్‌ కోర్టు దీనికున్న మరో ప్రత్యేకత. వివిధ దేశాలకు చెందిన దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. నాన్‌వెజిటేరియన్లకయితే పండగే పండగ.

మరోరోజు డ్రాగన్‌మార్ట్‌ అనే చైనామాల్‌కు వెళ్లాం. అక్కడ కేవలం చైనా వస్తువులే అమ్ముతారు. దానికి విపరీతమైన డిమాండు రావడంతో డ్రాగన్‌ మార్ట్‌-2 కూడా ప్రారంభించారు. అక్కడ కారు పార్కింగుకోసం 30 నిమిషాలు ఎదురుచూశాం. ప్రతి మాల్‌లోనూ మనీ ఎక్స్ఛేంజ్‌లు ఉంటాయి. ప్రపంచంలోని ఏ కరెన్సీ ఇచ్చినా కమీషన్‌ తీసుకుని నిమిషాల్లో దుబాయి కరెన్సీ ధీరమ్‌లను ఇస్తారు.

ఒకరోజు పామ్‌జుమేరాకు వెళ్లాం. ఇది ఖర్జూరపుచెట్టు ఆకారంలో కృత్రిమంగా నిర్మించిన ద్వీపం. సముద్రంలో బండరాళ్లు వేసి దానిమీద మట్టిపోసి వాటిమీద విల్లాలు కట్టారు. ఈ ద్వీపానికి మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డు చెట్టు కాండం రూపంలోనూ దానికి రెండువైపులా ఏర్పరచిన కాలనీలు మట్టల ఆకారంలోనూ కనిపిస్తాయి. మట్టకూ మట్టకూ మధ్యలో నీరు ఉంటుంది. భూమ్మీద నిలబడి చూస్తే ఆ చమత్కారం అర్థంకాదు. హెలీకాప్టర్‌గానీ మోనో రైలుగానీ ఎక్కి చూడాల్సిందే. మేం మోనోరైలు ఎక్కి పామ్‌జుమేరా చూశాం. దీనికి టిక్కెట్టు 250 రూపాయలు.

ఎడారిలో సీతాకోకచిలుక వనం!
ఇది చూశాక సీతాకోకచిలుకల ఉద్యానవనానికి వెళ్లాం. ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ. అధిక వేడిలో అవి జీవించలేవు. కాబట్టి సూర్యకాంతి ప్రసరించేలా ఎత్తైన భవనాలను నిర్మించి, లోపల పూలచెట్లను పెంచి, అందులో రకరకాల సీతాకోకచిలుకలను పెంచుతున్నారు. ప్రపంచంలోని సీతాకోకచిలుకల రకాలన్నీ అక్కడే ఉన్నాయా అనిపిస్తుంది. ఇది చూశాక పక్కనే ఉన్న మిరాకిల్‌ ఉద్యానవనానికి వెళ్లాం. ఇది మొత్తం పూలమయం. ఒకచోట చిన్న చిన్న ఇళ్లూ మరోచోట ఆర్చ్‌లూ నిర్మించి వాటిమీద పూలతీగలు అల్లించారు. ఇంకోచోట ఎత్తైనకొండ, వేరేచోట లోతైన కోనేరూ నిర్మించి దాని చుట్టూ పూలతీగలు పాకించారు. పనికిరాని సైకిళ్లూ కార్లకీ కూడా పూలు పూయించారు. వాటిని చూశాక ‘మంత్రానికి పనికిరాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని చెట్టులేదు’ అన్న సామెతలా పూదోటకు పనికిరానివస్తువు లేదు అనిపించింది. అప్పుడప్పుడూ రాజుగారే స్వయంగా వచ్చి ఈ తోటను పర్యవేక్షిస్తుంటారట. సామాన్యులతో కూడా కలిసి మాట్లాడి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారట.

మరోరోజు ఉదయాన్నే దుబాయి మ్యూజియానికి వెళ్లాం. 1894లో వెయ్యిలోపు జనాభాతో చేపలు పట్టుకుని జీవించే దశ నుంచి దుబాయి ఎలా అభివృద్ధి చెందిందనే అంశాన్ని వివరించేలా ఆ మ్యూజియాన్ని ఏర్పరిచారు. ఆరోజుల్లో వాడిన అన్ని వస్తువులనూ అందులో ప్రదర్శిస్తున్నారు. హోటల్‌ అపార్ట్‌మెంట్స్‌ అనేవి దుబాయి ప్రత్యేకత. కిచెన్‌, వాషింగ్‌మెషీన్‌, ఇస్త్రీపెట్టెసహా అన్నీ ఉంటాయి. బయట తినలేనివాళ్లు వంటచేసుకోవచ్చు.

దుబాయి రాజు సర్వమత సౌభ్రాతృత్వం కలిగిన వ్యక్తి. శివాలయం, కృష్ణాలయం, సాయిబాబాగుడి, గురుద్వారా, బ్రహ్మకుమారీసంస్థ కూడా ఉన్నాయక్కడ. దుబాయి జనాభాలో స్థానికులు 15 శాతం అయితే మిగిలిన 85 శాతం విదేశీయులే. వాళ్లలోనూ ఎక్కువమంది భారతీయులే. అందుకే మాకు పరాయిదేశంలో ఉన్నామనే అనిపించలేదు. దుబాయి అభివృద్ధి ఇక్కడితోనే ఆగిపోతుందనుకుంటే పొరబాటే... రాజు ఎప్పటికప్పుడు భవిష్యత్తు ప్రణాళికలతో ప్రపంచప్రజలను దుబాయి వైపునకు ఆకర్షిస్తూనే ఉంటాడు. అందులో భాగమే గ్లోబల్‌ విలేజ్‌. ప్రపంచపటం ఆకారంలో ఈ కృత్రిమ ద్వీపాన్ని 2020నాటికి పూర్తి చేయాలనీ, అందులో అన్ని దేశాలవాళ్లూ నివసించేలా చేసి ఆ పేరు సార్థకం చెయ్యాలనేది ఆయన ముందున్న లక్ష్యం. ఇవి మాత్రమే కాదు, 2020 సంవత్సరంలో ప్రపంచమేళా నిర్వహించనున్నాడు. అందులో అన్నిదేశాలకు చెందిన దుకాణాలూ ఉంటాయి. ఇలా ప్రపంచానికి ఎప్పటికప్పుడు కొత్త వింతలను పరిచయం చేస్తూ ముందుకెళ్తొన్న దుబాయ్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందనిపించింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.