close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పవన్‌ సావాసమే కాలేజీ!

పవన్‌ సావాసమే కాలేజీ!

సినిమా షూటింగ్‌ సమయంలో కొన్ని సీన్లని నాలుగైదు రకాలుగా చిత్రీకరిస్తారు. కథ, కథనానికి అనుగుణంగా వాటిలోంచి అవసరమైనవాటిని ఎంపికచేసే బాధ్యత ఎడిటర్‌పైన ఉంటుంది. అందుకే ‘24 ఫ్రేమ్స్‌’లో ఎడిటింగ్‌ కూడా డైరెక్షన్‌ అంతటి కీలకమైన విభాగం. అలాంటి విభాగంలో రాణిస్తున్నారు యువ ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి. అతడి సినిమా ప్రస్థానం గురించి చెప్పమంటే చాలా సీన్లని ఎడిట్‌చేసి ముఖ్యమైనవాటిని మనముందు ఉంచారిలా...

నా జీవితంలో ప్రతిదశలోనూ మంచి వ్యక్తులున్నారు. కొందరిని నేను ఎంపిక చేసుకుంటే మరికొందరు నన్ను ఎంపికచేసుకున్నారు. ఎంపిక ఎవరిదైనా నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను పుట్టింది సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌లో. నాన్నా వాళ్లు ఏలూరు నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ మాకు ఆటోమొబైల్‌ వర్క్‌షాప్‌ ఉండేది. తర్వాత కొన్ని కారణాలతో అక్కణ్నుంచి హైదరాబాద్‌ వచ్చేశాం. నాన్న ఇక్కడ ఓ కంపెనీలో పనిచేస్తూనే కొన్ని వాహనాల్ని కొని ఓ సినిమా సంస్థకు లీజుకిచ్చారు. కానీ ఆ వ్యాపారం కలిసిరాలేదు. దాంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. అప్పుడే నేను ఇంటర్మీడియెట్‌లో చేరాను. ఆ పరిస్థితుల్లో చదువు ఆపేసి కుటుంబ పోషణలో నాన్నకు సాయంగా ఉండాలనుకున్నాను. మా పొరుగునుండే ఒకాయన ప్రసాద్‌ ల్యాబ్‌లో ‘ఎడిటింగ్‌’ విభాగంలో పనిచేసేవారు. ఆయన సాయంతో అక్కడ 1997లో చేరాను. అప్పట్లో సినిమా నెగెటివ్‌ ఫామ్‌లో ఉండేది. రీళ్లు కట్‌చేస్తూ ఫైనల్‌ కాపీ తయారుచేసేవారు. కొన్నాళ్లు ఆ పని చేశాక ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర అప్రెంటిస్‌గా చేరి సమరసింహారెడ్డి, రాజకుమారుడు లాంటి సినిమాలకి పనిచేశాను. రాజకుమారుడు సమయంలో ఆయన కాలికి చిన్న గాయమైంది. అప్పటికి రెండు, మూడు పాటలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని మార్తాండ్‌ కె.వెంకటేష్‌ గారు ఎడిట్‌ చేశారు. అప్పటికి ఆయన తొలిప్రేమ, సాహసవీరుడు సాగరకన్య, ప్రేమించుకుందాం రా!... లాంటి హిట్‌ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయనకి అసెస్టింట్‌ కావాలంటే వెళ్లి చేరాను. అప్పుడే సినిమా అనలాగ్‌ నుంచి డిజిటల్‌ వైపు మారుతోంది. దానికోసం ‘అవిడ్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ ఉండేది. కంప్యూటర్‌ గురించి తెలిసిన వాళ్లే అవిడ్‌పైన ఎడిటింగ్‌ చేసేవారు. వెంకటేష్‌ అవిడ్‌లో ఎడిట్‌ చేసేవారు. భవిష్యత్తు డిజిటల్‌ విభాగానిదే అని అర్థమైంది. అందుకే డిజిటల్‌ ఎడిటింగ్‌లో ప్రావీణ్యం సంపాదించాలనుకున్నాను. దానికోసం ఓ పక్క సినిమాలకు పనిచేస్తూ, మరోవైపు కంప్యూటర్స్‌లో బేసిక్స్‌ నేర్చుకునేవాణ్ని. నా ఉత్సాహం చూసి వెంకటేష్‌ బాగా ప్రోత్సహించేవారు. అవిడ్‌లో ఎడిట్‌ చేసే సినిమాలకు నన్ను సమన్వయం చేసుకోమనేవారు. ఆ సమయంలో ప్రసాద్‌ ల్యాబ్స్‌లో శ్రీగుహ, శబ్దాలయాలో కార్తీక్‌ అనే ఇంజినీర్లు ఉండేవారు. అవిడ్‌కు సంబంధించి చాలా అంశాల్ని వారి దగ్గర నేర్చుకున్నాను. వెంకటేష్‌ దగ్గర ఉన్నపుడు ఆజాద్‌, ఖుషి, కలిసుందాం రా, రావోయి చందమామ... తదితర సినిమాలకు డిజిటల్‌ ఎడిటింగ్‌ చేశాం. కోటగిరి శిష్యరికంలో... నెగెటివ్‌ రీల్స్‌ని పాజిటివ్‌గా మార్చడం, సౌండ్‌ రికార్డింగ్‌, దర్శకుడి సాయంతో సీన్లు ఎంపిక చేయడం, డీటీఎస్‌ మిక్సింగ్‌ లాంటి అంశాల్ని తెలుసుకున్నాను. వెంకటేష్‌ దగ్గర డిజిటల్‌ ఎడిటింగ్‌ గురించి నేర్చుకున్నాను. ఆ సమయంలో టీవీ రంగంలోనూ ఎడిటర్లకి మంచి అవకాశాలు ఉండేవి. అక్కడికి వెళ్తే మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చనిపించింది. వెంకటేష్‌గారికి ఆ విషయమే చెప్పి సెలవు తీసుకున్నాను. తర్వాత ఓ సంస్థలో చేరి నాలుగేళ్లపాటు సినిమాలూ, సీరియళ్లతోపాటు కార్పొరేట్‌ ఫిల్మ్స్‌, వాణిజ్య ప్రకటనలూ, డాక్యుమెంటరీలకు ఎడిటర్‌గా పనిచేశాను.

ప్రాధాన్యాలు మారాయి
‘జానీ’ చిత్రీకరణ సమయంలోనే ‘పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌’ను ప్రారంభించారు. అక్కడ ఎడిటింగ్‌ పనుల్ని చూడ్డానికి ఒకరు కావాలని తెలిసింది. నాకూ సినిమాల్లోకి తిరిగి వద్దామన్న ఆలోచనా అప్పుడే పుట్టింది. దాంతో ‘...క్రియేటివ్‌ వర్క్స్‌’లో చేరాను. అక్కడ ఉంటూనే జానీకి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా, గుడుంబా శంకర్‌, బంగారం, బాలు, అన్నవరం... సినిమాలకు అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశాను. సీనియర్‌ ఎడిటర్లు గౌతంరాజు, యూసఫ్‌ఖాన్‌ గార్లతోనూ పనిచేసే అవకాశం వచ్చిందక్కడ. ‘...క్రియేటివ్‌ వర్క్స్‌’లో చేరడానికి ముందువరకూ నాకు పనే ప్రపంచం. అక్కడ చేరాక బయటి ప్రపంచం గురించి తెలుసుకునేందుకు కావాల్సిన సమయం, అవకాశం లభించాయి. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నపుడే ఏదైనా చేయగలమని కల్యాణ్‌ చెప్పేవారు. దాంతో అక్కడున్న అయిదారేళ్లూ పేరూ, డబ్బూ లాంటి ఆలోచనల్ని పక్కనబెట్టేసి వ్యక్తిత్వ నిర్మాణంమీద దృష్టిపెట్టాను. ‘బంగారం’ సమయంలో రెండు నెలలపాటు కల్యాణ్‌గారు తన ఫామ్‌హౌస్‌లో ఉంటూ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో నేనూ ఆయనతోపాటు శిక్షణ తీసుకునేవాణ్ని. సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చినపుడు మంచి పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పేవారు. ఆయన లెగో బ్లాక్స్‌ని అమర్చుతూ ఎక్కువగా కాలక్షేపం చేసేవారు. నాకూ అవి ఇచ్చేవారు. స్పోకెన్‌ ఇంగ్లిష్‌ క్లాసులకు వెళ్లమనేవారు. నా జీవితంలో కాలేజీ రోజులు లేని లోటు ఆ ఆరేళ్లలో తీరిపోయింది. ఈరోజు వ్యక్తిగత, వృత్తి జీవితాల్ని సరిగ్గా బ్యాలెన్స్‌ చేయగలుగుతున్నానంటే అందుకు ఆయనే కారణమని చెప్పాలి.

శ్రీకర్‌గారి శిష్యరికం
శ్రీకర్‌ ప్రసాద్‌... జాతీయస్థాయిలో పేరున్న ఎడిటర్‌. ఆయన ఎడిటర్‌గా పనిచేసిన ‘ఒక్కడు’ సినిమా సాగే విధానం చూశాక ఆయన్ని రోల్‌మోడల్‌గా పెట్టుకున్నాను. ప్రసాద్‌ గారు చెన్నైలో ఉంటారు. హైదరాబాద్‌లోనూ ఆయనకి సొంత ఎడిట్‌ సూట్‌ ఉంది. ‘జల్సా’ సమయంలో... అసోసియేట్‌ కావాల్సివస్తే నా గురించి ఆయనకి ఎవరో చెప్పారు. దాంతో ఆయన్నుంచి పిలుపొచ్చింది. ప్రసాద్‌ గారు రషస్‌ని ఎడిట్‌ చేసేతీరు అద్భుతమనిపిస్తుంది. జల్సా చిత్రీకరణ సమయంలో ఆయన చెన్నై వెళ్లినపుడు కొన్ని సీన్ల ఎడిటింగ్‌ నిర్వహణని నాకు అప్పగించేవారు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ గారికి నా పనితీరు నచ్చి... ‘ఇంకెందుకు ఆలస్యం. ఎడిటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టు’ అంటూ ప్రోత్సహించేవారు. జల్సా తర్వాత సొంతంగా కెరీర్‌ స్టార్ట్‌ చేద్దామనుకుంటున్నానని కల్యాణ్‌ గారికి చెప్పి అవకాశం ఉంటే ఇవ్వమన్నాను. ఆయన కూడా సరేనన్నారు.

సినిమా విడుదలకి ఏడాది
‘జల్సా’ తర్వాత వచ్చే సినిమా కలిసి చేద్దామన్నారు త్రివిక్రమ్‌ గారు. అప్పుడే ఆయన ‘ఖలేజా’ మొదలైంది. కానీ పిలుపు రాలేదు. మరోవైపు ‘కొమరం పులి’ మొదలైంది. పవన్‌ కూడా ఏమీ అనలేదు. దాంతో కాస్త నిరూత్సాహపడినా... సాంకేతిక నిపుణుల ఎంపిక వెనుక చాలా అంశాలుంటాయని అర్థంచేసుకొని తొందరగానే ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలోనే ‘ఆకాశరామన్న’కి ఎడిటర్‌గా అవకాశం వచ్చింది. నాగబాబు గారి బావమరిది మన్యం రమేష్‌ ఆ సినిమా నిర్మాత. కానీ నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా సినిమా విడుదల కాలేదు. దాంతో ఒకరకమైన నిర్వేదానికి గురయ్యాను. అప్పుడే ‘ఖలేజా’కి అసోసియేట్‌గా చేయమంటూ ప్రసాద్‌ గారి నుంచి పిలుపొచ్చింది. రెండో ఆలోచనే లేకుండా చేస్తానన్నాను. ఖలేజా తర్వాత ఆయనతో ‘ఇష్క్‌’కు కూడా పనిచేశాను. మధ్యలో ఎడిటర్‌గా అవకాశాల కోసం నా ప్రయత్నాలు ఆపలేదు. చిత్రీకరణ పూర్తయిన ఏడాదికి ‘ఆకాశరామన్న’ విడుదలైంది. తర్వాత గాయం-2, అప్పలరాజు సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాను. 2011లో వచ్చిన ‘పిల్ల జమీందార్‌’తో నాకు బ్రేక్‌ వచ్చింది. ‘జులాయి’ సమయంలో త్రివిక్రమ్‌ పిలిచి ఆ సినిమాకి కలిసి పనిచేస్తున్నామన్నారు. నేనైతే అసోసియేట్‌గానే అనుకున్నాను. తర్వాత చెప్పారు ఎడిటర్ని నేనేనని. దాంతో మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఎడిటర్‌గా నేను చేసిన మొదటి భారీ బడ్జెట్‌ సినిమా జులాయి. అందుకే ముందు కొద్దిగా ఒత్తిడికి గురయ్యాను. కానీ త్రివిక్రమ్‌ చాలా సరదా వాతావరణంలో పనిచేయించుకుంటారు. ‘జులాయి’ నా కెరీర్‌కే మలుపని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత సినిమాల కోసం ఎదురు చూడలేదు. తర్వాత ‘అత్తారింటికి దారేది’కి పనిచేశాను. దాంతో పవన్‌ సినిమాకి ఎడిటర్‌ కార్డు వేయించుకునే అవకాశం దక్కింది. తర్వాత ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’కీ పనిచేశాను. ఇష్క్‌ సమయంలో పీసీ శ్రీరామ్‌గారి షాట్స్‌ ఎడిట్‌ చేసే అవకాశం వచ్చింది. అలాంటివారితో పనిచేసే అవకాశం జీవితంలో అరుదుగా వస్తుంది. ప్రతి షాట్‌నీ ఒక ఆలోచనతో తీస్తారు. దేన్నీ వదలలేం. అలాగని అన్నీ పెట్టలేం. అలాంటి వారి సీన్లను ఎంపిక చేసుకోవడం సవాలే. ఇష్క్‌ తర్వాత ‘మనం’కి ఎడిటర్‌గా అవకాశం ఇచ్చారు విక్రమ్‌ గారు. నా జీవితంలో ఎక్కువ టెన్షన్‌ పడింది ఆ సినిమాకే. ఎందుకంటే సినిమాపైన భారీ అంచనాలున్నాయి. అంచనాల్ని అందుకోలేకపోతే, ‘అక్కడ ఆ సీన్‌ ఉండకుండా వేరేది ఉంటే బావుణ్ను, ఇక్కడిలా ఎడిట్‌ చేయాల్సింది’ లాంటి మాటలు వినిపిస్తాయి. నా ప్రతీ సినిమా విడుదలకీ ఓ దర్గాకి వెళ్లి ప్రార్థన చేస్తుంటాను. ‘మనం’ విడుదలైన రోజు ఉదయాన్నే దర్గాకి వెళ్లి ఎప్పటికప్పుడు సినిమాకి వస్తున్న స్పందన తెలుసుకునేవాణ్ని. హిట్‌ టాక్‌ వచ్చాకే వూపిరి పీల్చుకున్నాను. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి అవకాశం వచ్చింది.

కోలీవుడ్‌లోనూ పనిచేశా
ఈ సంవత్సరం నా కెరీర్‌లో అత్యంత కీలకమైనదని చెప్పాలి. ఎందుకంటే, నేను మొదటిసారి ఓ తమిళ సినిమాకి పనిచేశాను. అది ‘24’. ద్విభాషా చిత్రమే అయినా ప్రధానంగా తమిళంలోనే తీశారా సినిమా. ఏ.ఆర్‌.రెహమాన్‌ పేరు పక్కన ఇంత త్వరగా నా పేరు చూసుకుంటానని వూహించలేదు. అదంతా విక్రమ్‌గారి చలవే. ‘24’ ఒక సైన్స్‌ ఫిక్షన్‌. స్క్రీన్‌ప్లే చాలా క్లిష్టంగా ఉంటుంది. ఆ సినిమాని గొప్ప అవకాశంగా భావించి ఎంతో జాగ్రత్తగా పనిచేశాను. సాధారణంగా ఎడిటర్‌ సినిమా నిడివి తగ్గించడానికే ప్రయత్నిస్తాడు. కానీ ‘24’ నిడివి 164 నిమిషాలు. సినిమాలో సూర్య, సమంతాల మధ్య కెమెస్ట్రీ ప్రతి సీన్లోనూ బాగా కుదిరింది. అలాగే టైమ్‌లో ముందుకీ, వెనక్కీ వెళ్లిరావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చాలా వరకూ సీన్లని అలాగే ఉంచమన్నాను. విక్రమ్‌ డైరెక్టర్‌గాకంటే స్నేహితుడిలా ఉంటారు. కానీ పని రాక్షసుడు. కొన్ని సినిమాలకి పనిచేయడమంటే కలల్ని నిజం చేసుకోవడమే. నా కెరీర్లో అలాంటి సినిమాల్ని స్వల్ప వ్యవధిలోనే చేయడం చాలా సంతోషాన్నిస్తోంది.

ఎడిటింగ్‌ అనేది డైరెక్టర్‌, కెమెరామేన్ల సాయంతో కథను బాగా చెప్పే కళ. సినిమానిబట్టి ఎడిటర్‌ ఆలోచనా ధోరణి మారిపోవాలి. ‘జులాయి’ కథ ఎత్తుకుపైఎత్తులు వేస్తూ నడుస్తుంది. ‘మనం’ మూడు తరాల కథ. కాలంతోపాటు ప్రేక్షకుణ్ని ప్రయాణించేలా చేయడం అక్కడ ప్రధానం. ‘అత్తారింటికి దారేది’లో కుటుంబ సభ్యుల భావోద్వేగాల్ని చూపించాం. కథల్నిబట్టి కూర్పు మారిపోతుంది. ఇటీవల నానీ ‘మజ్ను’ చేశాను. ప్రస్తుతం ‘నేను లోకల్‌’, ‘విన్నర్‌’తోపాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నాను. నేను చాలా భిన్నమైన కథలున్న సినిమాలకు పనిచేశాను. భవిష్యత్తులో సాహసాలుండే కథకి చేయాలని ఉంది.

తమ్ముడూ సినిమాల్లోనే
తమ్ముడు ప్రదీప్‌ కూడా సినిమా రంగంలోనే ఉన్నాడు. ‘వర్క్‌ఫ్లో’ పేరుతో సినిమాలకు సంబంధించిన ‘విఎఫ్‌ఎక్స్‌’ సర్వీసులు అందించే సంస్థను నెలకొల్పాడు. మనం, గోపాలా గోపాలా, జనతా గ్యారేజ్‌... ఇలా చాలా సినిమాల టైటిల్స్‌కు గ్రాఫిక్స్‌ అందించాడు. నాన్న భాస్కరరావు, అమ్మ శకుంతల. నా శ్రీమతి ప్రశాంతి, మేనమామ కూతురు. మాకిద్దరు పిల్లలు. జాగృతి, విన్మయి. అమ్మానాన్నా, మేమూ, తమ్ముడూ అందరం కలిసే ఉంటాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.