close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
హ్యాపీ బర్త్‌డే

హ్యాపీ బర్త్‌డే
- మధుసూదన్‌

భూమి రెండుగా చీలిపోయి అందులో తను కూరుకుపోతే బాగుండు అన్నంత ఫీలింగ్‌ కలిగింది అనితకి.

‘ఛ... అమ్మ - ఫ్రెండ్స్‌ ముందు ఎంత అవమానం చేసింది’ మనసులో అనుకుంది.

పార్కింగ్‌లో ఉన్న కారు తేవడానికి అనిత తల్లి వెళ్ళగానే... ఫ్రెండ్స్‌ ఒక్కొక్కరే అనిత దగ్గర వీడ్కోలు తీసుకున్నారు.

వెళ్తున్నవాళ్ళు ముసిముసిగా నవ్వుకోవడం అనిత దృష్టిని దాటిపోలేదు.

ఒక స్నేహితురాలైతే ‘‘టుమారో ఆల్సో ఎంజాయ్‌ యువర్‌ బర్త్‌డే’’ అనేసి నవ్వుకుంటూ వెళ్ళింది.

కారు వచ్చి ముందు ఆగినా ఎక్కకుండా అలాగే నిలబడింది అనిత.

‘‘ఏంటి ఆలోచిస్తున్నావు... రా ఎక్కు’’ అంది వసుంధర.

‘అమ్మకి పెద్ద ఉద్యోగం, కారు, హోదా ఉండి కూడా ఏం లాభం, స్టేటస్‌కి తగ్గట్టుగా ప్రవర్తించనప్పుడు. అసలు లోకజ్ఞానం ఉంటేగా... సొసైటీ గురించి తెలిస్తేగా! అసలు అమ్మని తనతో తీసుకుని రావడం తను చేసిన పెద్ద తప్పు. పార్టీ ఇవ్వకపోయినా బాగుండేది... పరువన్నా దక్కి ఉండేది.

పార్టీ గురించి ఫ్రెండ్స్‌ గొప్పగా చెప్పుకోవాలని తను కోరుకుంది. కానీ, అమ్మ చేసిన పనివల్ల... ఛ... రేపు కాలేజీలో... రేపేంటి ఈపాటికే మిగతా క్లాస్‌మేట్స్‌కి ఫోన్లు వెళ్ళి ఉంటాయి...’ కారులో కూర్చున్న అనిత ఆవేదనపడుతోంది.

రేపు కాలేజీలో ఫ్రెండ్స్‌ చేసే ఎగతాళి తలచుకుంటే దుఃఖం వస్తోంది అనితకి.

వసుంధర భర్త- అనితకి పదేళ్ళ వయసున్నప్పుడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. డిగ్రీ చదివి ఉన్న వసుంధర భర్త ఉద్యోగంతోపాటు తండ్రి బాధ్యత కూడా తీసుకోవాల్సి వచ్చింది. అప్పటినుండి అనితని కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెంచుతూ వస్తోంది. ఆడపిల్ల, పైగా ఒంటరిది. ఉద్యోగ బాధ్యతవల్ల ఎక్కువ సమయం కూతురితో గడపటం కుదరదు కనుక క్రమశిక్షణ పేరుతో ఆంక్షలు విధించేది. అయితే అవేవీ మూర్ఖత్వంతోగానీ, బాధపెట్టేవిగా కానీ ఉండేవి కాదు. బాధ్యతెరిగి చేసినవే. అనితకి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. అనితకి మాత్రం ఇల్లు మిలటరీ డిసిప్లిన్‌ని తలపించేదిగా ఉండేది. అమ్మ చెప్పింది విని చేయాల్సిందే. ఎదురుచెప్పడానికి లేదు. అసలెక్కువ మాటలు కూడా మాట్లాడకూడదు. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. బయటి ప్రపంచానికీ ఇంట్లోకీ చాలా తేడా కనిపించేది అనితకి. దానివల్ల నష్టం ఏం లేకపోయినా... ఏదో అర్థంకాని ఫీలింగ్‌!

అనిత పుట్టినరోజు వస్తుందని తెలిసి ఫ్రెండ్స్‌ ఈసారి కచ్చితంగా గ్రాండ్‌ పార్టీ కావాలని అడిగారు. తను వాళ్ళ బర్త్‌డే పార్టీలకి చాలాసార్లు వెళ్ళింది. కొందరు తమ ఇళ్ళ దగ్గరే అరేంజ్‌ చేస్తే మరికొందరు పెద్ద హోటల్స్‌లో జరిపేవారు. పెద్ద కేకు, ఎన్నో రకాల ఫుడ్‌ ఐటమ్స్‌, స్వీట్స్‌, ఐస్‌క్రీమ్‌, ఆటలూ పాటలూ డాన్సులూ... గొప్పగా గమ్మత్తుగా ఉండేవి అనితకి.

తన పుట్టినరోజున ఇవేవీ ఉండవు. కొత్త బట్టలేసుకుని గుడికి వెళ్ళడం, ఇంట్లో అమ్మ చేసిన పాయసం లేదా ఏదైనా స్వీట్‌...అమ్మా తనూ తినడం, అంతే. ఈసారి మాత్రం అలాకాదు, తనూ బర్త్‌డే పార్టీ ఇవ్వాలి... గొప్పగా, గ్రాండ్‌గా ఇవ్వాలి- అమ్మని ఎలాగైనా ఒప్పించి- అనుకుంది అనిత.

ఆరోజు సరిగ్గా ఉదయం అయిదు గంటలకి వసుంధర కూతురు గదిలోకి వస్తూ ‘‘ఏమ్మా, ఇంకా నిద్ర లేవలేదా?’’ అంది.

ప్రతిరోజూ ఉదయం అయిదు గంటలకి అనిత నిద్ర లేవాల్సిందే. లేదంటే మరో సెకనులో వసుంధర ఆ గదిలో ప్రత్యక్షమవుతుంది.

‘‘లేదమ్మా, నిద్ర లేచి చాలాసేపైంది’’ బెడ్‌ మీద లేచి కూర్చుంటూ అంది అనిత.

రెండు చేతులతో కూతుర్ని చుట్టి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దుపెట్టి ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు... మెనీ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ద డే’’ అని విష్‌ చేసింది.

తల్లి మెడ చుట్టూ చేతులువేసి గుండెలకేసి వొదుగుతూ ‘‘థ్యాంక్యూ అమ్మా, ఈరోజు నేనొకటి అడుగుతాను కాదనవుగా’’ అంది అనిత.

‘‘ఏంటమ్మా అది?!’’

‘‘చెప్పాక కాదనకూడదు.’’

‘‘ముందేమిటో చెప్పు.’’

‘‘అది... నా ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తానమ్మా.’’

‘‘ఓస్‌... ఇంతేనా! అలాగే. అందర్నీ ఇంటికి పిలువు. ఆఫీసుకి సెలవు పెట్టి నేనే స్వయంగా వండి పెడ్తాను’’ అంది వసుంధర.

‘‘ఇంట్లో వద్దమ్మా... హోటల్‌లో గ్రాండ్‌గా ఇస్తాను’’ ‘గ్రాండ్‌’ అనే మాటని వత్తి పలుకుతూ అంది అనిత.

‘‘హోటల్‌లోనా?!’’ అని మౌనంగా ఉండిపోయింది వసుంధర.

అనిత తలెత్తి తల్లి మొహంలోకి చూస్తూ ‘‘ఏమ్మా... వద్దా’’ అని నీరసంగా అడిగింది.

‘‘అదికాదురా...హోటల్లో ఎందుకు చెప్పు... హాయిగా ఇంట్లో...’’ చెపుతున్న తల్లి మాటలకి అడ్డుపడుతూ...

‘‘వద్దమ్మా, ఇంట్లో నువ్వేం వంటలు చేస్తావో నాకు తెలుసు. పార్టీ గ్రాండ్‌గా ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నా మాట కాదననని అన్నావు. అదీ ఈరోజు నా పుట్టినరోజు. ప్లీజ్‌ అమ్మా...’’ బతిమిలాడింది.

తల్లి ఆలోచిస్తూ ఉండటం చూసి ‘‘ఎక్కువమంది కాదమ్మా, ముఖ్యమైన ఫ్రెండ్స్‌... పదిమందికి మాత్రమే’’ అంది.

పుట్టినరోజునాడు కూతురి కోరికను తిరస్కరించడం ఇష్టంలేక ‘‘ఓకే... డన్‌... అలాగే హోటల్లో ఇద్దువుగాని, లేచి స్నానం చేసిరా, గుడికి వెళదాం’’ అంది వసుంధర.

బుగ్గ మీద ముద్దుపెట్టి ‘‘థ్యాంక్యూ అమ్మా... నువ్వు చాలా మంచిదానివి’’ అంటూ హుషారుగా లేచింది అనిత.

‘‘అయితే, ఒక షరతు’’ అంది వసుంధర.

‘‘ఏంటమ్మా అది?!’’ అనుమానంగా చూస్తూ అడిగింది అనిత.

‘‘హోటల్‌కి నీతోపాటు నేనూ వస్తాను.’’

‘‘నువ్వెందుకమ్మా’’

‘‘అదేంటే, పార్టీ నాకు ఇవ్వవా?’’

అనితకి అమ్మ షరతు నచ్చలేదు. మళ్ళీ మనసులో ‘అమ్మ వచ్చినా ప్రాబ్లమ్‌ లేదు. పార్టీకి ఒప్పుకుంది అదే గ్రేట్‌’ అనుకుని ఓకే చెప్పింది.

సాయంత్రం ఒక పెద్ద హోటల్లో కలుసుకున్నారు అనితా అండ్‌ ఫ్రెండ్స్‌. వారితోపాటు వసుంధర కూడా.

ముందుగా ఆర్డర్‌ చేసిన పెద్ద కేకు తెచ్చి టేబుల్‌ మధ్యలో పెట్టి వెళ్ళారు హోటల్‌ సిబ్బంది.

ఫ్రెండ్స్‌ మౌనంగా కూర్చుని ఉన్నారు. హుషారుగా లేరు. కుర్చీలకి కట్టిపడేసినట్లుగా ఉన్నారు.

‘‘కమాన్‌ యార్‌, లెట్స్‌ సెలబ్రేట్‌...’’ అంటున్న అనిత మాటలకి ఎవరూ పెద్దగా రెస్పాండ్‌ అవటంలేదు. ముఖాలకి చిరునవ్వు పులుముకుని, ‘‘యా... యా...’’ అంటూ మందకొడిగా మాట్లాడుతున్నారు.

అందర్నీ నిశితంగా గమనించిన వసుంధర తనిక్కడ ఉండటం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న విషయం అర్థంచేసుకుని, వాళ్ళ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడమెందుకని భావించి కూతురితో ‘‘అనితా, నీ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసుకుందామని నీతో ఇక్కడికి వచ్చాను. పరిచయం అయ్యిందిగా, నాకు వేరే పనుంది, ఆ పని చూసుకుని వస్తాను. మీరు సెలబ్రేట్‌ చేసుకోండి. నేనొచ్చి నిన్ను పికప్‌ చేసుకుని వెళతాను’’ అని చెప్పి, ‘‘బాయ్‌ గర్ల్స్‌, ఎంజాయ్‌ ద పార్టీ’’ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

వసుంధర అటు వెళ్ళగానే అమ్మాయిల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. కేక్‌ కట్‌ చేసింది అనిత. తర్వాత డిన్నర్‌కి ఎవరికి ఏమేమి కావాలో కనుక్కుని అందరికీ అన్నీ ఆర్డర్‌ చేసింది. ఫ్రెండ్స్‌ కోరని కొన్ని డిషెస్‌ తనే ఆర్డర్‌ చేసింది అనిత... పార్టీ గ్రాండ్‌గా ఉండాలి కదా!

మాటలు... జోకులు... నవ్వులు... కేరింతలు... తుళ్ళింతల మధ్య డిన్నర్‌ ముగిసింది. పార్టీ బాగా జరిగిందనీ, గ్రాండ్‌గా ఉందనీ ఫ్రెండ్స్‌ అందరూ మెచ్చుకున్నారు. ఆ మాటలు అనితకి తృప్తినిచ్చాయి.

డిన్నర్‌ ముగిసేసరికి వసుంధర తిరిగివచ్చింది. బిల్‌ చూసింది- నాలుగంకెల్లో బాగానే అయింది. అంత అవుతుందనుకోలేదు వసుంధర. డబ్బు తీసి బేరర్‌కి ఇచ్చింది.

బిల్‌ కట్టేసి ఛేంజ్‌ తెచ్చిన బేరర్‌తో ‘‘ఈ మిగిలిపోయినవన్నీ ప్యాక్‌ చేసి తెచ్చివ్వు’’ అంది వసుంధర.

నాజూకుతనంతో కొంతా, నాగరికతతో కొంతా, అవసరానికి మించి ఆర్డర్‌ ఇవ్వడంవల్ల కొంతా... ఇలా చాలా పదార్థాలు మిగిలిపోయాయి.

వెయిటర్‌తో అలా చెప్పేసరికి ఆశ్చర్యపోయిన అనిత ‘‘ఎందుకమ్మా?’’ అంది.

‘‘ఎందుకేమిటి..? తినే భోజనాన్ని వృథాగా పారేయడమెందుకు, మనం తీసుకెళ్దాం’’ అంది వసుంధర.

ఆ మాటలకి కొందరు ఫ్రెండ్స్‌ చిన్నగా నవ్వితే, కొందరు కిసుక్కున నవ్వారు. అనితకి తల కొట్టేసినట్లయింది. తలెత్తి సూటిగా ఫ్రెండ్స్‌వంక చూడలేకపోయింది.

బేరర్‌ మిగిలిన అన్ని ఐటమ్స్‌నీ పార్సిల్‌ చేసి తెచ్చి ఇచ్చాడు.

అవమానభారపు ఆలోచనలతో ఉన్న అనిత తల్లి కారుని ఒక సూపర్‌ మార్కెట్‌ దగ్గర ఆపి, ఏదో కొనుక్కుని రావడం కూడా గమనించలేదు.

ఆలోచనల తీవ్రత తగ్గాక గమనించింది అనిత. కారు ఇంటివైపు వెళ్ళడంలేదు. అమ్మ మీద అలిగి ఉండటంతో ఎక్కడికి వెళుతున్నామని అడగలేకపోయింది.

రోడ్డుకి ఇరువైపులా ఏదో వెతుకుతూ డ్రైవ్‌ చేస్తోంది వసుంధర. అమ్మని అడగలేక, అర్థంకాక మౌనంగా కూర్చుంది అనిత.

కారుని రోడ్డు పక్కగా ఒకచోట ఆపింది వసుంధర. హోటల్‌లో పార్సిల్‌ చేయించిన ప్యాకెట్స్‌ని అందుకుని, వెనక సీటులో ఇందాక సూపర్‌మార్కెట్‌లో కొన్న పేపర్‌ప్లేట్స్‌నీ నీళ్ళ క్యాన్‌నీ తీసుకుని అనితని దిగమంది.

అనితకి జరిగేదేంటో అర్థంకాక వాటిని అందుకుని కారు దిగింది.

ఇద్దరూ రోడ్డు దాటి మధ్యలో ఉన్న ఫ్లైఓవర్‌ కిందకి చేరారు. అక్కడ కొంతమంది పిల్లలు... కొందరు పడుకొనీ కొందరు కూర్చొనీ ఉన్నారు. చేతిలో ప్యాకెట్లతో వచ్చిన వీళ్ళవంక ఆశ్చర్యంగా చూశారు.

అందర్నీ లేపి కూర్చోబెట్టి ‘‘భోంచేశారా?’’ అని అడిగింది వసుంధర.

చేశామని కొందరూ చేయలేదని కొందరూ ఆమె ఏం అడిగిందో అర్థంకాక మరికొందరూ తలల్ని అడ్డంగా, నిలువుగా ఇష్టమొచ్చినట్లుగా వూపారు. అందరూ ఎనిమిది నుండి పదకొండేళ్ళలోపు పిల్లలు.

అందరికీ పేపర్‌ ప్లేట్స్‌ ఇచ్చి, హోటల్‌లో మిగిలిపోయిన పదార్థాల్ని సమానంగా వడ్డించి తినమంది వసుంధర.

ఆశ్చర్యంగా, ఆనందంగా, ఆత్రుతగా తినసాగారు పిల్లలు. తింటూ ఉండగా వాళ్ళ వివరాలు అడిగింది వసుంధర.

వాళ్ళల్లో ఒక కుర్రవాడు అక్కడే దగ్గర్లో ఉన్న ఇరానీ హోటల్లో కప్పులు ఎత్తేవాడు... కొంతమంది ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర పూసలదండలూ బెలూన్‌లూ అమ్ముకునేవారి పిల్లలు... ఇంకో ఇద్దరు వలస వచ్చిన కూలీల పిల్లలు... వీళ్ళెవరికీ ఇల్లు లేదు. వాళ్ళ బతుకులు రోడ్డుమీదే. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.

అందరూ తిన్న తర్వాత ప్లేట్లని అదే కవర్‌లో వేసి దగ్గర్లో ఉన్న డస్ట్‌బిన్‌లో వేయమని చెప్పింది. పిల్లలు వేసి వచ్చారు.

ఎప్పుడూ తిననివి కొన్నీ, ఎప్పుడోకాని తినలేనివి కొన్నీ వంటకాలు తిన్నందుకు అందరిలో ఆనందం. అందరికీ నీళ్ళిచ్చి బయలుదేరుతుండగా ‘‘ఎందుకు, మాకివన్నీ పెట్టారు?’’ అని అడిగారు పిల్లలు.

అనితని చూపిస్తూ ‘‘ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు’’ అని చెప్పింది.

కారులో కూర్చుని స్టార్ట్‌ చేయబోతుండగా, కారు దగ్గరికి పరిగెత్తుకువచ్చారు పిల్లలు. ఏం కావాలన్నట్లు చూసింది వసుంధర.

‘‘నువ్వు చెప్పు... నువ్వు చెప్పు...’’ అంటూ ఒకరినొకరు ముందుకు తోసుకుంటున్నారు పిల్లలు.

‘‘డబ్బులు కావాలా?’’ అడిగింది వసుంధర.

వద్దని తలూపారు.

‘‘మరేంటో చెప్పండి’’ అంది వసుంధర.

వలస వచ్చిన కూలీ కొడుకూ, కప్పులెత్తే కుర్రాడూ ముందుకు వచ్చి ‘‘ఈ అక్కకి మేమందరం హ్యాపీ బర్త్‌డే చెబుదామని వచ్చాం’’ అన్నారు బెరుగ్గా.

ఎందుకో తెలీదుగానీ, ఆ మాటకి అనిత కంటి కొసల్లో నీరు వచ్చి నిలిచింది.

డోర్‌ తీసుకుని కిందకి దిగిన అనిత చేయి చాచింది.

అభిమానంగా, ఆప్యాయంగా... అనిత చేయి మాసిపోతుందేమో అన్నంత అపురూపంగా చేతిని అందుకుని, నోరు తిరిగినవాళ్ళు ‘హ్యాపీ బర్త్‌డే’ అనీ, రానివారు చేతిని అందుకునీ విష్‌ చేశారు.

అనితతో షేక్‌హ్యాండ్‌ చేసినందుకు ఆకాశంలో ఎగిరినంత ఆనందంగా ఉంది వాళ్ళకి.

కంటి కొసల్లో నిలిచిన నీటిచుక్క బుగ్గలమీద జారుతుండగా అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది అనిత.

బర్త్‌డేని ఎంత గొప్పగా గ్రాండ్‌గా జరిపామన్నది కాదు, ఎంత సంతోషంగా గడిపామన్నది ముఖ్యమని తెలియజెప్పిన తల్లికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది అనిత.

తల్లివైపు తిరిగి ‘‘నిజంగా నాకిది ఎంతో ఎంతో హ్యాపీ బర్త్‌డే అమ్మా’’ అంది నిండు మనస్సుతో.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.