close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ విషయాల్లో ఇద్దరూ ఒక్కటే!

ఆ విషయాల్లో ఇద్దరూ ఒక్కటే!

బిల్‌గేట్స్‌... పాతికేళ్లుగా ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకట్రెండు స్థానాల్లో కొనసాగుతోన్న వ్యక్తి. ముకేష్‌ అంబానీ... ఈ ఏడాదితో కలిపి వరసగా తొమ్మిదోసారీ భారతీయ సంపన్నుల్లో ఆయనదే అగ్రస్థానం. కేవలం డబ్బులోనే కాదు, విజేతల ఆలోచనలూ, అలవాట్లూ, అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయని చెప్పేందుకు వీళ్లిద్దరి మధ్యా ఇతర సారూప్యతలూ చాలా ఉన్నాయి.

సంపాదన

ముకేష్‌: ‘జీవితంలో డబ్బు ముఖ్యమే, కానీ అదే సర్వస్వం కాదు’ అన్నది సంపదపైన ముకేష్‌ అభిప్రాయం. డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటే ఎవరూ ఉద్యోగం, వ్యాపారాల్లో రాణించలేరని చెప్పే ముకేష్‌, లక్ష్యం ఉన్నతంగా ఉంటే దాన్ని సాధించే క్రమంలో డబ్బు దానంతటదే వస్తుందంటారు.

బిల్‌: ‘ప్రపంచం మొత్తానికీ నా సేవలు విస్తరించాలన్న లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌ని నెలకొల్పా. డబ్బు ఆ ప్రక్రియలో భాగంగా వచ్చిందే’ అంటారు బిల్‌. ‘నాకున్న డబ్బులో ఒక శాతాన్ని కూడా నేను అనుభవించలేను. కానీ ఆ డబ్బు సాయంతో ప్రపంచాన్ని ఇంకాస్త అందంగా మార్చగలను. అందుకే నాకు డబ్బుతో అవసరం లేదు కానీ దానిపైన అపార గౌరవం ఉంది’ అన్నది బిల్‌ మాట.


స్టార్టప్‌ ప్రేమ

  ముకేష్‌: కొత్త తరాన్ని ప్రోత్సహించడానికి ముందుంటానని చెప్పే ముకేష్‌, స్టార్టప్‌లకు సాయపడేందుకు రూ.5వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి అనేక సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

బిల్‌: బిల్‌కూడా స్టార్టప్‌ ప్రేమికుడే. ఆయన ఎదిగింది ఐటీ రంగంలోనైనా, ఎక్కువగా క్లీన్‌ ఎనర్జీ, బయోటెక్‌ రంగ స్టార్టప్‌లనే ప్రోత్సహిస్తున్నారు.


పుస్తకాలు

ముకేష్‌: ఎంత బిజీగా గడుపుతున్నా రోజులో కొంత సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తారు. మేనేజ్‌మెంట్‌ పుస్తకాలను ఇష్టపడే ముకేష్‌, తాను చదువుతున్న పుస్తకం తాలూకు కాపీలు కారులోనూ, మంచం పక్కనా ఉండేలా చూసుకుంటారు.

బిల్‌: బిల్‌గేట్స్‌కి పుస్తకాలంటే ఎంత ఇష్టమంటే, ఆయన బ్లాగ్‌లో పుస్తక సమీక్షల కోసం ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేసి సమీక్షలను స్వయంగా రాస్తుంటారు. కుర్రాడిగా ఉన్నప్పుడే ఎన్‌సైక్లోపీడియాలోని అన్ని సిరీస్‌లనూ ఆయన చదివేశారు.


బృందాలకే ఓటు

ముకేష్‌: ముకేష్‌ టీంవర్క్‌కు ప్రాధాన్యమిస్తారు. అందరినీ నమ్మాలి కానీ వాళ్లపైనే ఆధారపడకూడదన్నది ఆయన సిద్ధాంతం. ‘కిరాణా కొట్టుపెడితే పనివాళ్లకు విలువివ్వాలి. కానీ వాళ్లు రాకున్నా సరకులమ్మే నైపుణ్యం మనకుండాలి’ అని వ్యాపారులకు సూచిస్తారు.

బిల్‌: ‘గొప్ప బృందాలతోనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయి. నైపుణ్యం ఉన్న వ్యక్తులు మనతో ఉంటే అదే సగం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. అందుకే స్టార్టప్‌ల యజమానులు మొదట చేయాల్సిన పని మంచి బృందాన్ని నిర్మించుకోవడమే’ అంటారు బిల్‌.


కార్లు

ముకేష్‌: విలాసవంతమైన కార్లంటే ముకేష్‌కు చాలా ఇష్టం. బెంజ్‌, బెంట్లీ, రోల్స్‌ రాయ్స్‌ సంస్థలకు చెందిన కార్లు ఎన్ని ఉన్నా, ఆయన బాగా ఇష్టపడేది ‘మేబాష్‌ 62’ కారుని.

బిల్‌: కంప్యూటర్లూ, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు కాకుండా గేట్‌ü్సకి ఆసక్తికలిగించేవి విలాసవంతమైన కార్లే. పార్షే బ్రాండ్‌ కార్లంటే ఆయనకు మరీ ఇష్టం. చాలాసార్లు వాటిని స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ కెమెరాకూ చిక్కారు.


భాగస్వామి

ముకేష్‌: వృత్తిపరమైన ఒత్తిళ్ల వల్ల సామాజిక సేవలో నేరుగా పాల్గొనలేకపోయానని చెప్పే ముకేష్‌, ఆ లోటుని తన భార్య నీతా తీరుస్తోందని చెబుతారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌కు ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగమయ్యారు.

 

బిల్‌: వ్యక్తిగత జీవితంలో తన బలం తన భార్యే అంటారు బిల్‌. నీతాలానే బిల్‌ భార్య మెలిందా కూడా నిత్యం ఆఫ్రికా దేశాల్లో పర్యటిస్తూ తమ ఫౌండేషన్‌ ద్వారా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు.


వారసులు

ముకేష్‌: అంబానీ వారసులైనా చిన్నప్పుడు ఆటోల్లో తిరిగిన అనుభవం ముకేష్‌ ముగ్గురు పిల్లలది. సాధారణ ఉద్యోగుల్లానే వాళ్లూ కెరీర్‌ మొదలుపెట్టాలని, తమ కంపెనీలో తొలి అడుగులు వేస్తున్న పిల్లలు ఇషా, ఆకాష్‌లకు ప్రత్యేక క్యాబిన్‌లేవీ లేకుండా అందరు ఉద్యోగులతో కలిసి పనిచేసే ఏర్పాట్లు చేశారు.

బిల్‌: ‘నా పిల్లలకి నేనిచ్చే ఆస్తి గొప్ప చదువే. కానీ అది పూర్తయ్యాక వాళ్లూ అందరిలానే జీవితాన్ని ప్రారంభించాలి’ అని బిల్‌ అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. ముకేష్‌లానే బిల్‌కీ ముగ్గురు పిల్లలు. తండ్రి దాతృత్వ కార్యక్రమాల వల్ల ఆస్తి పూర్తిగా తమకు చెందదని ఏనాడో అర్థం చేసుకున్న ఆ ముగ్గురూ, సొంతంగా తమ రంగాల్లో ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ రోడ్లకు మరమ్మతులు అక్కర్లేదు!

  పల్లెలూ పట్టణాలన్న తేడా లేకుండా వాహనంలో ప్రయాణించే ప్రతి ఒక్కరి నడ్డినీ అధ్వానమైన రోడ్లు విరగ్గొడుతూనే ఉన్నాయి. గుత్తేదార్లు పైపై తారు పూతలు వేస్తూ, నాలుగు కంకర్రాళ్లతో గుంతల్ని పూడుస్తూ సరిపెడుతున్నారు. చిన్న వర్షాలకే అవి మళ్లీ చిత్తడిగా మారిపోతున్నాయి. ఏళ్ల తరబడి కొనసాగుతోన్న ఈ సమస్యకు ప్రత్యేక రోడ్లతో పరిష్కారం చూపిస్తున్నారు నెమ్‌కుమార్‌. పగుళ్లొచ్చినా, గోతులు పడినా వాటంతటవే పూడుకుపోవడమే వీటి ప్రత్యేకత.

కంకర తేలిన రోడ్లూ, గుంతల మయమైన వీధులూ, కాసిని చినుకులకే కొట్టుకుపోయే రహదార్లూ, వాటి వల్ల ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వ్యక్తుల ఫొటోలూ నిత్యం పత్రికల్లో, టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వర్షాకాలంలో ప్రయాణం ఎంత నరకప్రాయంగా ఉంటుందో అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అలాంటి రోడ్ల సమస్యలు మామూలే. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియాలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేసే భారతీయుడు నెమ్‌కుమార్‌ తరచూ నాగ్‌పూర్‌కు దగ్గర్లోని సొంతూరు కాంప్టీకి వచ్చివెళ్తుంటారు. ఆ క్రమంలో ఆయనా ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించారు. నాసిరకం పనులు మానేసి నాణ్యమైన పదార్థాలు వాడితే సగం సమస్య తీరినా, అది శాశ్వత పరిష్కారం కాదనిపించింది. దాంతో దిల్లీ ఐఐటీ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన నెమ్‌కుమార్‌, ఓ వైపు ప్రొఫెసర్‌గా పాఠాలు చెబుతూనే కొత్తరకం రోడ్లను కనిపెట్టేందుకు ప్రయోగాలూ మొదలుపెట్టారు. వాటిలో సాధిస్తోన్న పురోగతిని చూసి ‘కెనడా-ఇండియా రిసెర్చ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ అనే సంస్థ ఆ ప్రయోగాలకు కావల్సిన సహాయాన్ని చేయడం మొదలుపెట్టింది. దాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకున్న నెమ్‌ రెండేళ్ల క్రితం ‘సెల్ఫ్‌ రిపేరింగ్‌ రోడ్స్‌’ పేరుతో పగుళ్లనూ గుంతల్నీ వాటంతటవే పూడ్చుకునేలా కొత్త సాంకేతికతతో రోడ్లను అభివృద్ధి చేశారు.

ప్రయోగం ఫలించింది...
మొదట కెనడాలో కొత్త పరిజ్ఞానంతో రోడ్డు వేసి పరిశీలించాక సంతృప్తి చెందిన నెమ్‌, భారత్‌లో పూర్తిస్థాయిలో తాను కనిపెట్టిన సాంకేతికతకు రూపమివ్వాలని నిర్ణయించుకున్నారు. దానికోసం కర్ణాటకలోని తొండెబావి గ్రామాన్ని ఎంచుకున్నారు. రహదారికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో, కాస్త లోతట్టుగా ఉండే ఆ గ్రామాంలో వర్షాలు పడితే మట్టి రోడ్లు కొట్టుకుపోయి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. దాంతో పంటల్ని తరలించడానికీ, పిల్లల్ని స్కూళ్లకు పంపడానికీ మూడు నాలాగు నెలల పాటు గ్రామస్థులు చాలా ఇబ్బందులు పడేవారు. అందుకే వాళ్లతో మాట్లాడి నెమ్‌ అక్కడ రెండేళ్ల కిత్రం తన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సిమెంటు, బూడిద, పీచు, నానో కోటింగ్‌ పదార్థాలను కలిపి తాను అభివృద్ధి చేసిన పరిజ్ఞానంతో తొంభై కి.మీ. మేర రోడ్లు వేశారు. ఏడాదిన్నరకు పైగా అవి మండుటెండల్నీ, వానల్నీ తట్టుకుని నిలబడ్డాయి. వాటి నాణ్యతను పరీక్షించడానికి అక్కడక్కడా కావాలనే చిన్న పగుళ్లను సృష్టించిన గ్రామస్థులు కొన్నాళ్ల తరవాత అవి కనిపించకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం తీర్చలేకపోయిన తమ సమస్యకు పరిష్కారం చూపినందుకు నెమ్‌కుమార్‌ని ఆకాశానికెత్తేశారు. కానీ వాళ్లకంటే తన ప్రయోగం విజయవంతమైనందుకు ఆ శాస్త్రవేత్తే ఎక్కువ సంతోషించారు.

రోడ్డులోకే నీరు...
నెమ్‌కుమార్‌ సృష్టించిన రోడ్ల తయారీ కోసం నలభై శాతం సిమెంటునీ, అరవై శాతం బూడిదనీ ఉపయోగించారు. సిమెంటు వాడకం తగ్గించడం వల్ల పర్యావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల శాతాన్నీ, ఖర్చునీ తగ్గించొచ్చంటారాయన. సాధారణ రోడ్లతో పోలిస్తే అరవై శాతం తక్కువ మందంగా ఉండే ఈ రోడ్లకు వాటితో పోలిస్తే ముడిసరుకు వినియోగమూ తక్కువే. ‘ఈ రోడ్డు కోసం వాడే పీచుకి హైడ్రోఫిలిక్‌ నానో కోటింగ్‌ వేయడం వల్ల అవి నీటిని పీల్చుకునే గుణాన్ని సంతరించుకుంటాయి. దానివల్ల రోడ్డు లోపలికే చాలా వరకూ నీళ్లు ఇంకిపోతాయి. పగుళ్లూ, గుంతలూ ఏర్పడ్డప్పుడు ఆ నీరునే లోపలున్న సిమెంటు ఆర్ద్రీకరణ (హైడ్రేషన్‌) కోసం ఉపయోగించుకుంటుంది. దానివల్ల చెయిన్‌ రియాక్షన్‌ మొదలై సిలికేట్లు విడుదలై క్రమంగా ఆ పగుళ్లు మూసుకుపోతాయి. కట్టుదిట్టమైన మెటీరియల్‌ సైన్స్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ మెలకువల్ని ఉపయోగించడం వల్ల భారీ వాహనాల్నీ, అత్యధిక ఉష్ణోగ్రతల్నీ ఇవి తట్టుకోగలవు. మా రెండేళ్ల పరిశీలన ఈ విషయాన్ని రుజువు చేసింది. కనీసం పదిహేనేళ్లు ఇవి చెక్కుచెదరకుండా ఉంటాయి’ అంటారు నెమ్‌కుమార్‌. ఆయనకు తోడుగా నిలిచిన కెనడా-ఇండియా రిసెర్చ్‌ సంస్థ భారత్‌తో సహా అనేక దేశాల్లో ఈ రోడ్లను వేసే పనిలో ఉంది. కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.

మధ్యప్రదేశ్‌, హరియాణా ప్రభుత్వాలు ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ముందుకొచ్చాయి. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా రహదారిని నిర్మించేందుకు నెమ్‌కుమార్‌తో చర్చిస్తోంది. ఆ ప్రయత్నం విజయవంతమై, మన వూళ్లొకీ, మన వీధుల్లోకి కూడా ఆ రోడ్లు త్వరగా వచ్చేస్తే గతుకులు లేని ప్రయాణాన్ని అందరం హాయిగా ఆస్వాదించొచ్చు..!

శకుంతల ఎక్స్‌ప్రెస్‌

దేశంలో ఆంగ్లేయుల పాలన ముగిసి ఏడు దశాబ్దాలు పూర్తయినా, ఆనాటి గుర్తులు ఏదో మూలన కనిపిస్తూనే ఉంటాయి. ఆ కోవకే చెందుతుంది ‘శకుంతల ఎక్స్‌ప్రెస్‌’. ప్రస్తుతం మనదేశంలో అతి పొడవైన ప్రైవేటు రైలు మార్గంలో నడుస్తున్న రైలిది.

శకుంతల ఎక్స్‌ప్రెస్‌... మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో యావత్మాల్‌-ముర్తజాపూర్‌-అచల్‌పూర్‌ పట్టణాలను కలిపే నారోగేజ్‌ మార్గంలో తిరిగే ప్యాసింజరు రైలు. 190 కి.మీ. పొడవుండే ఈ మార్గం ‘శకుంతల రైల్వేస్‌’ ఆధీనంలో ఉంది. బ్రిటిష్‌ కాలంలో మొదలైన ‘సెంట్రల్‌ ప్రావిన్స్‌ రైల్వే కంపెనీ(సీపీఆర్‌సీ)’కే ‘శకుంతల రైల్వేస్‌’ అని పేరు. దేశంలో ప్యాసింజరు సర్వీసులు నడుస్తోన్న అతి పొడవైన ప్రైవేటు రైల్వే మార్గం కూడా ఇదే! అప్పట్లో విదర్భ ప్రాంత యువరాణి అయిన ‘శకుంతల’ మీదగా సంస్థకు ఆ పేరు వచ్చింది. ఈ సంస్థని 1910లో బ్రిటన్‌కు చెందిన ‘కిల్లిక్‌ నిక్సన్‌’ అనే కంపెనీ ప్రారంభించింది. రైల్వే సేవల కోసం వీరు సీపీఆర్‌సీని ఏర్పాటుచేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పత్తి ఎక్కువగా పండేది. రైతుల దగ్గర కొన్న పత్తిని ఈ మార్గంలో తరలించేవారు. ముంబయి-నాగ్‌పూర్‌-హౌరా రైలు మార్గంలో ముర్తజాపూర్‌ జంక్షన్‌ ఉంటుంది. పత్తిని మొదట ముర్తజాపూర్‌కి ఆపైన ముంబయికి అక్కణ్నుంచి సముద్రమార్గంలో ఇంగ్లాండ్‌కు ఎగుమతి చేసేవారు.

అద్దె రూ.2కోట్లు
స్వతంత్రానికి ముందు మహారాష్ట్రలోని దోండ్‌-బారామతి, పుల్‌గావ్‌-ఆర్వీ, పోచారా-జామ్నర్‌ దార్వా-పుసద్‌ మధ్య శకుంతల రైల్వేస్‌కు మార్గాలు ఉండేవి. అప్పట్లో వీటిలో కొన్ని మార్గాల్లో ‘గ్రేట్‌ ఇండియన్‌ పెనిన్సులర్‌ రైల్వేస్‌(జీఐపీఆర్‌)’ ప్యాసింజరు రైళ్లను నడిపేది. బదులుగా శకుంతల రైల్వేస్‌కు కొంత మొత్తం చెల్లించేది. స్వతంత్రం వచ్చిన తర్వాత జీఐపీఆర్‌ కాస్తా సెంట్రల్‌ రైల్వేస్‌గా మారింది. 1951లో రైల్వేలు జాతీయం అయినపుడు సెంట్రల్‌ రైల్వేస్‌ ‘ఇండియన్‌ రైల్వేస్‌’లో భాగమైంది. కానీ శకుంతల రైల్వేస్‌ మాత్రం ఇండియన్‌ రైల్వేస్‌లో భాగం కాలేదు. చిన్న సంస్థ కావడంవల్ల దీని గురించి అప్పట్లో ఆలోచించి ఉండకపోవచ్చనేది కొందరి మాట. అయితే సెంట్రల్‌ రైల్వేస్‌కు శకుంతల రైల్వేస్‌తో ఉన్న ప్యాసింజరు రైళ్లు నడిపే ఒప్పందం మాత్రం కొనసాగుతూ వచ్చింది. ప్రతి పదేళ్లకూ ఆ ఒప్పందాన్ని సమీక్షిస్తారు. లాభాల్లో 55 శాతం శకుంతల రైల్వేస్‌కు ఇవ్వాలనేది ప్రస్తుత ఒప్పందం. ఈ మార్గంలో రెండు ప్యాసింజరు రైళ్లు, ఒక గూడ్స్‌ రైలును ఇండియన్‌ రైల్వేస్‌ నడుపుతోంది. బదులుగా ఏడాదికి రెండు కోట్ల రూపాయలు శకుంతల రైల్వేస్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైలు మార్గం మరమ్మతుల సమయంలో రూ.10వేలకుపైన అయ్యే ఖర్చుల్ని శకుంతల రైల్వేస్‌ భరించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థ అందుకు ముందుకు రావడంలేదు. దాంతో ప్రభుత్వమే రిపేర్లూ చేస్తూ, మొత్తం నిర్వహణను చూస్తోంది.