close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్పు...కావాలా నాయనా?

లడ్డూ కావాలా నాయనా?
- అంటే ఎవరు వద్దంటారు!
అప్పు కావాలా నాయనా?
- అంటే ఎవరు కాదంటారు!
లడ్డెవరికి చేదు, అప్పెవరికి కారం?
మనిషి బుద్ధిజీవి కావచ్చూ కాకపోనూవచ్చు! కానీ, కచ్చితంగా అప్పుజీవే! అంబానీల నుంచి అప్పారావుల దాకా...ఎంతవారలైనా అప్పు దాసులే! ఎంత చెట్టుకు అంతగాలి. ఎంత సంపాదనకు అంత అప్పు. పేదోడికి వేలల్లో, ఉన్నోడికి కోట్లల్లో. అంతే తేడా!

పర్సులో డబ్బు లేదన్న సంగతి ఎలా తెలుస్తుందో కానీ...సరిగ్గా ఆ సమయానికే ఖర్చులన్నీ కట్టకట్టుకుని వచ్చిపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవర్ని అడగాలి? అయినా, ఎవరి దగ్గర మాత్రం వేలకువేల డబ్బు మూలుగుతూ ఉంటుంది? ఓమూలన మూలుగుతున్నా, ఇచ్చే మనసంటూ ఉండాలిగా! అడిగి లేదనిపించుకోవడం కంటే, అడక్కుండా మన దారి మనం వెతుక్కోవడమే ఉత్తమం. గత్యంతరం లేదు. బ్యాంకు గడప తొక్కాల్సిందే. సవాలక్ష పత్రాలు దాఖలు చేయాల్సిందే. అడిగినవన్నీ సమర్పించుకున్నా రుణం మంజూరవుతుందన్న భరోసా లేదు. ‘ఫలానా నెలలో మీరు క్రెడిట్‌కార్డు బిల్లు ఆలస్యంగా కట్టారు’ అనో, ‘ఇంతకుముందు పర్సనల్‌లోన్‌ తీసుకున్నప్పుడు ఓ పట్టాన తిరిగి చెల్లించలేదు’ అనో, ‘అసలు మీరెప్పుడూ అప్పు తీసుకోలేదు కాబట్టి...’ అనో సవాలక్ష సాకులు వెదుకుతారు. చివరాఖరికి కుదర్దని తేల్చేస్తారు. ‘అవున్లెండి! బుద్ధిగా తిరిగి చెల్లించేవాళ్లకి మీరెందుకిస్తారూ?విజయ్‌మాల్యా లాంటి బడా బాబులకైతే కోట్లకుకోట్లు కుమ్మరిస్తారుగానీ...’ అని దుమ్మెత్తిపోసి, ధబాలున ఫోను పెట్టేస్తాం. అంతకు మించి ఏమీ చేయలేని మధ్యతరగతి నిస్సహాయత! ఇక మిగిలింది, వడ్డీ వ్యాపారులు. ఆ చక్రవడ్డీల చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడటం అసాధ్యం.

అలాంటప్పుడే....ఎంతోకొంత వేగంగా, ఎంతోకొంత పారదర్శకంగా రుణాలిచ్చే ఓ వ్యవస్థంటూ ఉంటే బావుండని అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అలాంటి వ్యాపార ఆలోచనతోనే ప్రత్యామ్నాయ రుణ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా పెడితేగిడితే సాఫ్ట్‌వేర్‌ కంపెనీయే పెట్టాలని కలలుగన్న ఐఐటీలూ ఐఐఎమ్‌ల కుర్రాళ్లు కూడా...అప్పుల మార్కెట్లోని అవకాశాల్ని అందిపుచ్చుకోడానికి సేఠ్‌ కుబేర్‌లాల్‌ అవతారం ఎత్తుతున్నారు. వెబ్‌సైట్‌ ముందు ‘ఇచ్చట రుణాలు ఇవ్వబడును’ అన్న బోర్డు తగిలిస్తున్నారు. గత ఏడాది అరవైకిపైగా అంకుర సంస్థలు రంగంలో దిగాయి. ఈ ఏడాది ఇప్పటికే నలభైదాకా పేర్లు నమోదు చేసుకున్నాయి. ఆ లెక్కన చూస్తే అమెరికా, చైనాల తర్వాత మనదే అతిపెద్ద మార్కెట్టు. బ్యాంకుల్లా బిర్రబిగుసుకుపోయి వ్యవహరించకుండా...మధ్యతరగతి అవసరాలకు తగినట్టు ‘డిజైనర్‌ లోన్స్‌’ మంజూరు చేయడం వీటి ప్రత్యేకత. క్రెడిట్‌కార్డు లేని వాళ్లూ, ఉన్నా క్రెడిట్‌ హిస్టరీ సరిగాలేని వాళ్లూ...ఈ సంస్థలకు మహారాజ పోషకులు. ఇంత జనాభాలో పన్నెండు కోట్ల మంది రుణ చరిత్ర మాత్రమే రేటింగ్‌ సంస్థల దగ్గర నమోదు అవుతోందని సమాచారం. మిగిలినవారి మాటేమిటి? ఆ వర్గం మీదే ఆర్థిక అంకుర సంస్థలు ఆశలుపెట్టుకున్నాయి.

‘నెలాఖరు’ తకరారు...
మధ్యతరగతి జీవికి మొదటి వారం బ్రహ్మాండంగా గడిచిపోతుంది. చేతికి ఎముక లేనట్టు ఖర్చుపెడతాడు. రెండోవారం కాస్త ఆలోచించి పర్సు తీస్తాడు. మూడోవారం వందకాగితం విదిలించడానిక్కూడా మొండికేస్తాడు. నాలుగోవారం నిర్మొహమాటంగా చేతులెత్తేస్తాడు. విశ్వామిత్రుడిని రెచ్చగొట్టడానికి రంగంలో దిగే రంభాదేవిలా...సామాన్యరావు సహనాన్ని పరీక్షించడానికి నానా అవసరాలూ వరుసకడతాయి. దరిద్రుడికి ఆకలెక్కువ అన్నట్టు - అప్పుడే రెస్టరెంట్‌కు వెళ్లాలనిపిస్తుంది, ఆ సమయంలోనే శ్రీమతిగారు పండగ షాపింగ్‌ చేయాలని నిర్ణయించుకుంటారు. ఇంకో ముహూర్తమే లేనట్టు దగ్గరి బంధువులు పెళ్లి పెట్టుకుంటారు. రానుపోనూ ఖర్చులూ చదివింపులూ...ఓ ఐదువేలైనా కావాలి. అన్నీ జరిగిపోవాల్సిందే. దేన్నీ పక్కనపెట్టలేం. ఎవర్నీ చిన్నబుచ్చలేం.

ఎలాగోలా ఆ వారం గడిచిపోతే...మనమే కింగ్‌! ఒకటో తేదీ సాయంత్రానికంతా ‘ యువర్‌ అకౌంట్‌ ఈజ్‌ క్రెడిటెడ్‌....’ అంటూ ఎస్సెమ్మెస్‌ గంట మోగిపోతుంది. ఆ ఏడురోజుల గండాన్ని ఎలా గట్టెక్కాలన్నదే సమస్య. ఇలాంటి ఫస్టు జీవుల కోసం బెస్టు ‘పేడే లోన్స్‌’ ఇస్తున్నాయి ఎర్లీ శాలరీ.కామ్‌, క్యాష్‌-ఇ (CASHe) తదితర సంస్థలు. ‘మా దగ్గర అప్పు తీసుకోవడం ఎంత సులభమంటే, చేబదులు కోసం స్నేహితుడిని బతిమాలుకున్నంత సేపు కూడా పట్టదు’ అంటుంది ఎర్లీ శాలరీ. దాదాపుగా ఈ వేదికలన్నీ మొబైల్‌ అప్లికేషన్‌ పైనే పనిచేస్తాయి. ఆయా సంస్థల వెబ్‌సైట్లలోకి లాగిన్‌ అయిపోయి, యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని..జీతం లెక్కలూ, గుర్తింపుకార్డూ, చిరునామా ధ్రువపత్రాలూ వగైరా అప్‌లోడ్‌ చేస్తే చాలు. వీటితో పాటూ ఓ సెల్ఫీ కూడా! గత ఆర్థిక చరిత్ర ఆధారంగా అప్పు ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. అదీ బ్యాంకుల్లా పూర్తిగా సిబిల్‌ రేటింగ్‌ మీదే ఆధారపడరు. ఎవరిదార్లు వారికుంటాయి. ఆ లెక్కలు కూడా నిమిషాల్లో పూర్తయిపోతాయి. నెల జీతంలో నలభైశాతం దాకా అప్పుగా మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే, పదిహేను రోజుల వ్యవధిలో తిరిగి చెల్లించాలి. ఇలాంటి సంస్థలు...పాతిక ముప్ఫై ఏళ్ల యువతీ యువకుల్నే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. చేతినిండా సంపాదిస్తుంటారు కాబట్టి, ఎగవేతకు ఆస్కారం తక్కువే. చెల్లింపులో తేడా వస్తే, క్రెడిట్‌ హిస్టరీ పాడైపోతుందన్న భయమూ ఉంటుంది. ‘బిగ్‌ డేటా’ ఆధారంగా ఒక వ్యక్తిని బేరీజు వేయడం పెద్ద కష్టమేం కాదిప్పుడు. ఈ మదింపునకు క్యాష్‌-ఇ పెట్టుకున్నపేరు ‘సోషల్‌ లోన్‌ కోషెంట్‌’. జీవితాన్ని ఎంజాయ్‌ చేయడంలో ఏమాత్రం రాజీపడని ‘వర్క్‌ హార్డ్‌....పార్టీ హార్డర్‌’ తరానికి ఇలాంటి తక్షణ రుణాలు భలేగా పనికొస్తున్నాయి. మంతెండ్‌లోనూ వీకెండ్‌ జోష్‌ తగ్గకుండా ఆదుకుంటున్నాయి. మిగతావాళ్లు కూడా, మాసాంతంలో చిన్నచిన్న అవసరాల కోసం ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవర్నో అడగాల్సిన బాధ తప్పుతోంది. కాకపోతే, వడ్డీల్ని రోజువారీగా లెక్కిస్తారు. చెల్లింపులో తేడా వస్తే అప్పుల కుప్ప పేరుకుపోతుంది.

ఆన్‌లైన్‌ షాపింగ్‌కూ...
భారత జనాభా దాదాపు నూట ముప్పై కోట్లు. దేశంలోని క్రెడిట్‌కార్డులు...రెండున్నర కోట్ల పైచిలుకు. అందులో ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నవారే అధికం. ఆ ప్రకారంగా... క్రెడిట్‌కార్డు ఉన్నవారి సంఖ్య అటూ ఇటుగా కోటి. అంటే, నూటికి ఒకశాతం లోపే. మరో వైపు ఇ-కామర్స్‌ వూపందుకుంటోంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లాంటి సంస్థలు చిన్నచిన్న పట్టణాలవైపూ దూసుకెళ్లిపోతున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయాలంటే డెబిట్‌కార్డో, క్రెడిట్‌కార్డో తప్పనిసరి. అందులో అవసరమైనంత డబ్బూ ఉండాలి. సరిగ్గా ఇక్కడే సమస్య వస్తుంది. కొన్నిసార్లు క్రెడిట్‌కార్డు పరిమితి పూర్తయిపోయి ఉంటుంది. మధ్యతరగతి జీవి డెబిట్‌కార్డులో మినిమమ్‌ బ్యాలెన్సుకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా ఒట్టే! అంతమాత్రాన ఇ-షాపింగ్‌ కోరికను చంపేసుకోవాలా! వెధవ జీవితమంటూ వైరాగ్యంలోకి దిగిపోవాలా! ‘బాబ్బాబూ అలాంటి సాహసాలేం చేయకండి’ అంటూ...‘క్లిక్‌ నౌ, పే లేటర్‌’ బంపరాఫరు అందిస్తున్నాయి ‘సింపుల్‌’ (simpl) లాంటి సంస్థలు! ఇక్కడ, నమోదిత సభ్యులు డబ్బు చెల్లించకుండానే షాపింగ్‌ చేసుకోవచ్చు. ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ జరిగిన లావాదేవీలకు పదహారో తేదీన బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా పక్షం రోజులకూ ఫస్టుకంతా చెల్లింపు జరిపేయాలి. ప్రస్తుతానికి బుక్‌ మై షో, జస్ట్‌ రైడ్‌, హోలాషెఫ్‌, ఫ్రెష్‌ మెనూ తదితర కంపెనీలు ‘సింపుల్‌’ జాబితాలో ఉన్నాయి. అంటే, చేతిలో పైసా లేకపోయినా సిన్మా చూడొచ్చు, అద్దె బైకు మీద షికార్లుకొట్టొచ్చు, రెస్టరెంట్లలో ఇష్టమైన రుచుల్ని ఆస్వాదించవచ్చు. లేదంటే, ఆన్‌లైన్‌ దుకాణంలో...నచ్చిన మొబైల్‌నో, ఇష్టమైన పర్‌ఫ్యూమ్‌నో ఎంచుకుని ‘చెల్లింపు’ అన్న చోట రుణదాత పేరు క్లిక్‌ చేస్తే సరిపోతుంది. క్యాష్‌కేర్‌...తదితర సంస్థలు కూడా షాపింగ్‌ రుణాలిస్తున్నాయి. ‘మొబీక్విక్‌’ పండగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఎంపిక చేసిన ఆన్‌లైన్‌ దుకాణాల్లో షాపింగ్‌ కోసం స్వల్పకాలిక రుణాలిచ్చే ఆలోచనలో ఉంది. ‘ముప్పైనిమిషాల్లో రుణం’ నినాదంతో వ్యక్తిగత రుణాల మార్కెట్లో కూడా అడుగుపెడుతోంది.

స్టూడెంట్స్‌ స్పెషల్‌...
కాలేజీ కుర్రాళ్లంటే ఎన్ని ఖర్చులుంటాయీ! లేటెస్ట్‌ ట్రెండ్స్‌ ఫాలో కావాలా? బ్రాండ్‌న్యూ సెల్‌ఫోన్‌ పట్టుకుని క్యాంపస్‌లో తిరగాలా? అంతలోనే, అర్జెంటుగా ఏ ల్యాప్‌టాపో కొనుక్కోవాల్సి వస్తుంది. నాన్ననడిగితే, జీతం వచ్చాకో, బోనస్‌ అందాకో కొనిస్తానంటారు. అంతదాకా ఆగాల్సిందేనా? ‘ఏం ఫర్వాలేదు. కొనేసుకోండి. మేం ఉన్నాంగా...’ అంటున్నాయి ‘స్లైస్‌పే’ లాంటి సంస్థలు. ప్రాథమికంగా ఎంత చెల్లిస్తారో చెబితే, మిగతా మొత్తాన్ని అవే అప్పు రూపంలో సర్దుబాటు చేస్తాయి. గుర్తింపుగా కాలేజీ ఐడెంటిటీ కార్డు అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. తొలిసారి నమోదు తతంగం రెండు మూడు రోజులు పట్టవచ్చు. వేయి రూపాయల నుంచి అరవై వేల వరకూ ఎంతోకొంత అప్పు మంజూరైపోతుంది. ఇక, మన డబ్బూ మనిష్టం. సినిమా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు, రైలు టికెట్లు కొనుక్కోవచ్చు, సెల్‌ఫోన్‌ రీఛార్జి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ కోర్సుల్లో జాయిన్‌ కావచ్చు. పద్దెనిమిదేళ్లు నిండిన కాలేజీ విద్యార్థులే ఈ రుణాలకు అర్హులు. పరీక్షల్లో చక్కని ప్రతిభ కనబరుస్తున్నవారికి తగిన ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతానికి సేవలు బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్‌ లాంటి చోట్లకూ విస్తరించే ఆలోచన ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ‘క్రేజీబీ’ కూడా ఇలాంటి వేదికే. కాకపోతే ఆ సంస్థ జాబితాలో ఉన్న విద్యాసంస్థల్లో చదువుతున్నవారికే అప్పులిస్తారు. బ్యాంకులకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నట్టే ఈ సంస్థలకూ ఆయా కాలేజీల్లో ప్రతినిధులు ఉంటారు. ‘క్విక్‌లో’ సైతం విద్యార్థులకు లాప్‌టాప్‌లూ సెల్‌ఫోన్లూ వాయిదాల్లో కొనుక్కోడానికి అప్పులిస్తోంది.

పెద్ద చదువులకు వెళ్లడమంటే ఖరీదైన వ్యవహారమే. అందులోనూ విదేశాల్లో చదువంటే డాలర్ల మూట ఉండాల్సిందే. ఆ ప్రయత్నంలో ‘జ్ఞాన్‌ధన్‌’ మార్గదర్శనం చేస్తుంది. ముందు, అప్పుల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా స్కాలర్‌షిప్‌లకు అవకాశం ఉందేమో పరిశీలిస్తుంది. అయినా, ఎంతోకొంత మొత్తం అవసరమైతే వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఐఐటీ - కాన్పూర్‌, దిల్లీ పూర్వ విద్యార్థులు అంకిత్‌, జైనేష్‌, జయంత్‌ల ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చింది ‘జ్ఞాన్‌ధన్‌’. ‘ఇలాంటి సౌకర్యాల కారణంగా విద్యార్థులు అప్పులపాలయ్యే ప్రమాదం ఉందిగా?’ అన్న అనుమానాన్ని నిర్వాహకులు కొట్టిపడేస్తున్నారు. ‘కాదు కాదు. అప్పు అంటే బరువు. దీనివల్ల చిన్నవయసులోనే ఆర్థిక బాధ్యత తెలుస్తుంది. ఏదో ఒకరోజు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొంటారు. చక్కని చెల్లింపు చరిత్ర ఉంటే...చదువు పూర్తయిపోయి, ఉద్యోగాల్లో చేరాక గృహరుణాల్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి’ అని సమర్థించుకుంటున్నారు.

ఒకరికొకరు...
దేశంలోని ఒకానొక ప్రాంతంలో...ఒకరి ఖాతాలో లక్షరూపాయల మొత్తం నిరుపయోగంగా పడుంటుంది. మరొక ప్రాంతంలోని ఇంకొకరికి...పిల్లల పెళ్లిళ్లకో, చదువులకో తక్షణం లక్ష రూపాయలు అవసరమై ఉంటాయి. ఆ ఇద్దర్నీ ఓ వేదిక మీదికి తీసుకొస్తే...ఒకరి అవసరం తీరుతుంది, మరొకరికి వడ్డీ రూపంలో ఎంతోకొంత ఆదాయం వస్తుంది. అంతిమంగా ఇద్దరూ లాభపడతారు. మధ్యవర్తుల అవసరం లేదు, బ్యాంకుల జోక్యమూ ఉండదు. దీన్నే వాణిజ్య పరిభాషలో ‘పీర్‌ టు పీర్‌ లెండింగ్‌’గా వ్యవహరిస్తారు. రుణదాతలూ రుణగ్రహీతలూ ఆయా వెబ్‌సైట్లలో ముందుగా పేర్లు నమోదు చేసుకుంటారు. మచ్చలేని ఆర్థిక చరిత్ర ఉన్నవారికే అవకాశం. రుణం అవసరమైనవారు ఎంత మొత్తం అప్పుగా కావాలో, ఏమేరకు వడ్డీ చెల్లించగలరో, ఎంత గడువు అవసరమో వివరంగా ప్రకటిస్తారు. ఆ షరతులు నచ్చిన రుణదాతలే ముందుకొస్తారు. కొన్ని సంస్థల్లో ‘రివర్స్‌ వేలంపాట’ లాంటిదీ జరుగుతుంది. అంటే, ఎవరు తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి ముందుకొస్తే వారికే అప్పిచ్చే అవకాశం దక్కుతుంది. మిగతా ప్రక్రియ అంతా, బ్యాంకింగ్‌ సంస్థల తరహాలోనే ఉంటుంది. ఫెయిర్‌సెంట్‌, లెండ్‌బాక్స్‌, ఐ2ఐ ఫండింగ్‌, ఐలెండ్‌...తదితర సంస్థలు ఈ సేవల్ని అందిస్తున్నాయి. అయితే చాలా సంస్థలు మధ్యవర్తిత్వ బాధ్యతకే పరిమితం అవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు రుణదాతా, స్వీకర్తా తేల్చుకోవాల్సిందే. చెల్లింపు చరిత్రను బట్టి దరఖాస్తుదారుకు ‘రేటింగ్‌’ ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. మంచి చరిత్ర ఉన్నవారికి తక్కువ వడ్డీకే అప్పు దొరికే అవకాశం లేకపోలేదు. గతం సందేహాస్పదంగా ఉంటే మాత్రం...భారీ వడ్డీలకు సిద్ధపడక తప్పదు.

‘పీర్‌ టు పీర్‌ లెండింగ్‌’ను ఓ మదుపు మార్గంగా ఎంచుకుంటున్నవారూ ఉన్నారు. కాకపోతే, మిగతా వ్యాపారాల్లో లాగానే ఇక్కడా నష్టభయం ఉంటుంది. అప్పు వసూలు విషయంలో ప్రత్యామ్నాయ రుణ వేదికలు బాధ్యత తీసుకోవచ్చూ, తీసుకోకపోవచ్చూ. ‘వడ్డీ సంగతి వదిలేయండి, అసలుకు మాత్రం మాదీ భరోసా’...అంటున్న సంస్థలూ ఉన్నాయి. భారతీయ రిజర్వు బ్యాంకు చొరవతో... ‘పీర్‌ టు పీర్‌’ రుణ విభాగంలో చాలా సంస్కరణలే వస్తున్నాయి.

చిన్నవ్యాపారాల కోసమూ...
ఐఐటీ - ముంబయి పూర్వ విద్యార్థి అనిల్‌కుమార్‌ తనకు బాగా పరిచయం ఉన్న ఓ వీధి వ్యాపారికి కొంత మొత్తం అప్పిచ్చాడు. ఆ డబ్బుతో అతడు వ్యాపారాన్ని రెట్టింపు చేసుకున్నాడు. క్రమంగా జీవితమే మారిపోయింది. ఆ చిన్న మొత్తానికి అంత శక్తి ఉందన్న విషయం అనిల్‌కు అప్పుడే అర్థమైంది. సాధారణంగా...ఆదాయపు పన్ను పరిధిలోకి రాని చిన్నాచితకా వ్యాపారులకు ఏ బ్యాంకులూ ధైర్యం చేసి అప్పులివ్వవు, సూక్ష్మరుణ సంస్థలు ముందుకొచ్చినా బాదుడు భారీగానే ఉంటుంది. దీంతో, సామాన్యుడు భరించగలిగే వడ్డీ రేట్లతో రుణాలివ్వడానికి ఓ సంస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అనిల్‌ ఆలోచనలోంచి ‘లోన్‌మీట్‌’ పుట్టింది. ఏడాది కాలంలోనే వందకుపైగా రుణాలు మంజూరు అయ్యాయి. కోటిన్నరకు పైగా వ్యాపారం జరిగింది. ‘ఓట్‌ ఫర్‌ క్యాష్‌’ లాంటి సంస్థలు మంజూరైన రుణం మీద కాకుండా వాడుకున్న మొత్తం మీదే వడ్డీ లెక్కిస్తున్నాయి. దీనివల్ల చాలా బరువు తగ్గుతుంది.

వికాస్‌సెక్రీ పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎలాంటి ఆదాయమూ లేని తనలాంటి విద్యార్థికి క్రెడిట్‌కార్డు ఇవ్వరేమో అన్న అనుమానంతోనే దరఖాస్తు చేశాడు. చిత్రంగా కార్డు వచ్చింది. చదువు పూర్తయిపోయి భారతదేశానికి తిరిగి వచ్చాక, ఎంతోకొంత సంపాదన అందుకుంటున్నా కూడా...ఓపట్టాన క్రెడిట్‌కార్డు మంజూరు కాలేదు. ఆ చేదు అనుభవంలోంచే ‘క్యాష్‌కేర్‌’ ప్రాణంపోసుకుంది. గౌరంగ్‌ సంఘ్వీ బెల్జియం నుంచి ఇండియాకొచ్చాక క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేశాడు. కానీ బ్యాంకులు ఆ కాగితాల్ని చెత్తబుట్టపాలు చేశాయి. ఎందుకంటే, ఆయన గతంలో ఒక్కసారి కూడా అప్పు చేయలేదు. అప్పుల్లేవంటే రేటింగ్‌ కూడా లేనట్టే. అలాంటి ‘చరిత్ర హీనులకు’ ఏ సంస్థా అప్పివ్వదు. అర్థంలేని పరిమితులు పెట్టుకోకుండా వ్యాపారాలకు రుణసాయం అందించాలన్న ఉద్దేశంతో ‘ఇన్‌స్టా క్యాష్‌’ను ప్రారంభించాడు సంఘ్వీ. ‘క్యాపిటల్‌ ఫ్లోట్‌’, ‘లెండింగ్‌కార్ట్‌’ కూడా వ్యాపార రుణాల విభాగంలో చురుగ్గా ఉన్నాయి.

కొన్నిసార్లు ఏ కుటుంబ సభ్యులో హఠాత్తుగా ఆసుపత్రి పాలు అవుతారు. చేతిలో డబ్బు ఉండదు. ఆరోగ్య బీమా కూడా ఉండదు. ఉన్నా అప్పటికే గడువు పూర్తయి ఉండవచ్చు, లేదంటే వాయిదా చెల్లింపులో జాప్యం కారణంగా బీమా సౌకర్యాన్ని ఆపేసి ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వైద్య రుణాలిచ్చే అంకుర సంస్థలూ పుట్టుకొస్తున్నాయి. ఆన్‌లైన్‌లో బైకులూ కార్లూ అమ్మకానికి ఉన్నప్పుడు, ఆన్‌లైన్‌లోనూ వాహనరుణాలిచ్చే సంస్థలు లేకపోతే ఎలా? పేటీఎమ్‌ ఆ లోటును పూడ్చాలనుకుంటోంది.

చాలా ప్రత్యామ్నాయ రుణ సంస్థలు మధ్యవర్తిత్వానికే పరిమితం అవుతాయి. దరఖాస్తుదారుల రుణ చరిత్రను బేరీజు వేసి...నాన్‌ బ్యాకింగ్‌ ఆర్థిక సంస్థలకు సిఫార్సు చేస్తున్నాయి. ఆ పని చేసిపెట్టినందుకు ఎంతోకొంత పారితోషికాన్ని అందుకుంటాయి. ఈ వ్యాపార నమూనా లాభదాయకంగానే ఉంటోంది. దీంతో, అంకుర సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. చైనా దిగ్గజం అలీబాబా కూడా ఇటువైపు అడుగులేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి, నివాసయోగ్యమైన ప్రాంతానికి సంబంధించి సుమతీశతక కర్త మాట నిజం అవుతోంది...ఇప్పటికే వీధికో వైద్యుడు బోర్డు పెట్టేశాడు.
మిగిలింది, అప్పిచ్చువాడేగా!


‘అప్పు’డే కుదుర్తుంది...

ఆన్‌లైన్‌లో రుణాల్ని మంజూరు చేయించుకోవడమూ ఓ కళే. ఆ ప్రయత్నంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని చిట్కాల్ని ప్రయోగించాలి. ప్రత్యామ్నాయ రుణ వ్యాపారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది కాబట్టి, ఒకట్రెండు రాష్ట్రాల పరిధిలోనే ఆ సంస్థలు పనిచేస్తూ ఉండవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్లను చూడటం ఉత్తమం. చుక్కగుర్తు చాటున దాక్కున్న నిబంధనల్నీ బయటికి లాగి చదవాలి.


సిబిల్‌ రేటింగ్‌

ఏ ఆర్థిక సంస్థ అయినా అప్పు మంజూరు విషయంలో ముందుగా.. సిబిల్‌ రేటింగ్‌ను పరిశీలిస్తుంది. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రతి రుణగ్రస్తుడి ఆర్థిక చరిత్రనూ ఓచోట నమోదు చేస్తుంది. ఆ వివరాల ప్రకారం రుణ యోగ్యతను లెక్కగడుతుంది. మూడువందల నుంచి తొమ్మిది వందల మధ్య స్కోరు ఉంటుంది. ఏడువందల యాభై దాటితే మంచి రుణ చరిత్రే. అప్పుయోగం ఉన్నట్టే!


పర్సనాలిటీ స్కోర్‌

ఆన్‌లైన్‌ రుణాల మంజూరులో ‘పర్సనాలిటీ స్కోర్‌’ పాత్ర కీలకం. ఆ బేరీజు కోసం పూర్తిగా సోషల్‌ మీడియా మీదే ఆధారపడతారు. దరఖాస్తుదారు ఆన్‌లైన్‌లో ఏ కీలక పదాలతో సెర్చ్‌ చేస్తాడన్న దాన్ని బట్టి...అవసరాల్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. పర్సనల్‌ లోన్‌, ఇంటరెస్ట్‌ రేట్‌, ఇన్సాల్వెన్సీ పిటిషన్‌...మొదలైన మాటల ఆధారంగా కొంతమేర ఆర్థిక వ్యక్తిత్వం అర్థమైపోతుంది. ట్విటర్‌ వ్యాఖ్యలు ఉద్వేగాల మీద ఏ మాత్రం పట్టు ఉన్నదీ చెప్పేస్తాయి. మద్యం తాగి వాహనాల్ని నడిపిన చరిత్ర ఉందేమో కూడా కనుక్కుంటారు. ఆన్‌లైన్‌లో స్తోమతకు మించిన కొనుగోళ్లు చేసినట్టు ఆధారాలున్నా వెనుకంజ వేస్తారు. ఫేస్‌బుక్‌ కామెంట్స్‌కు వచ్చే లైక్స్‌ను బట్టి కూడా సమాజంలో గుర్తింపునూ గౌరవాన్నీ అంచనా వేస్తారు.


మిగతా చెల్లింపులూ

ఫోను బిల్లు సకాలంలో చెల్లించే అలవాటు లేనివారు, అప్పుల విషయంలో మాత్రం కచ్చితంగా ఉంటారని ఎలా చెప్పగలం? కాబట్టే, ప్రత్యామ్నాయ రుణ వేదికలు...ఆ వ్యక్తి ఫోను బిల్లు సక్రమంగా చెల్లిస్తాడా లేదా అన్నదీ నిర్ధారించుకుంటాయి. విద్యుత్‌ బిల్లులూ, కేబుల్‌ బిల్లులూ పరిశీలిస్తాయి. మనకు తరచూ ఎలాంటి ఎస్సెమ్మెస్‌ అలర్ట్స్‌ వస్తాయన్న కోణంలోనూ విశ్లేషణ జరుగుతుంది. రుణ వాయిదాల గురించీ, క్రెడిట్‌కార్డు బిల్లుల గురించీ వచ్చేవే ఎక్కువైతే మాత్రం - ఇంకాస్త జాగ్రత్తగా దరఖాస్తును పరిశీలిస్తారు.


జాగ్రత్త....

1. అప్పులిస్తామన్న ప్రకటన కనిపించగానే, ఆర్థిక చరిత్రనంతా విప్పేయకండి. సంస్థ విశ్వసనీయతనూ పరిశీలించండి. అత్యాశకెళ్తే ఇ-మోసగాళ్ల బారిన పడగలరు.
2 అడిగినంత అప్పు ఇచ్చినా, భారీ వడ్డీలు వసూలు చేసే సంస్థలూ ఉన్నాయి. ప్రాసెసింగ్‌ ఫీజుల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
3 అవసరం అయితేనే ఆన్‌లైన్‌ అప్పుల జోలికి వెళ్లండి. ఇస్తున్నారు కదా అని తీసేసుకుని దర్జాగా ఖర్చు చేసేస్తే.. నిజంగానే అత్యవసరం అయినప్పుడు ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఎందుకంటే, చాలా సంస్థలు రెండు రుణాల మధ్య కనీసం ఆరు నెలల వ్యవధి ఉండేలా జాగ్రత్త పడతాయి.
4 మీ ఆర్థిక చరిత్ర ఆధారంగానే వడ్డీరేట్లను నిర్ణయించే అవకాశం ఉంది. ఎలాంటి మచ్చా లేకపోతే, వీలైనంత తక్కువ వడ్డీకే అప్పు దొరుకుతుంది. ఓపికుంటే బేరాలాడుకోవచ్చు కూడా.
5 మొండి బకాయిల సమాచారం నేరుగా రేటింగ్‌ కంపెనీలకు వెళ్లిపోతుంది. ఆ నిర్లక్ష్యం కారణంగా భవిష్యత్తులో గృహరుణాల్లాంటి భారీ అప్పులు మంజూరు కాకపోవచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు